అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం | Sakshi
Sakshi News home page

అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం

Published Fri, May 17 2024 4:36 AM

The law and order situation in Manipur is even worse

ఏడాది తర్వాత కూడా మణిపుర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.

పదునైన టీమ్‌ వర్క్‌ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్‌ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్‌ వ్యవస్థ (యూనిఫైడ్‌ కమాండ్‌ స్ట్రక్చర్‌)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్‌ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.

హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.

సైన్యం లక్ష్యంగా దాడి
మణిపుర్‌లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్‌ 24న కాంగ్‌పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్‌ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.

ఏప్రిల్‌ 27న బిష్ణుపూర్‌ జిల్లాలోని నారాన్‌సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ క్యాంపు (ఐఆర్‌బీ) ఉంది. ఐఆర్‌బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్‌ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.

దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్‌పీఎఫ్‌ శిబిరాన్ని ఐఆర్‌బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్‌పీఎఫ్‌ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోమ్‌ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. 

అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.

నారాన్‌సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్‌లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.

ఒకే తాటిపైకి వస్తేనే...
వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.

మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్‌బాయీ తెంగోల్‌ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్‌ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్‌ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.

పదునైన టీమ్‌ వర్క్‌ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్‌ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్‌ వ్యవస్థ (యూనిఫైడ్‌ కమాండ్‌ స్ట్రక్చర్‌)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్‌(నాగాలాండ్‌) కేంద్రంగా పనిచేసే 3 కోర్‌కు చెందిన జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. 

మణిçపుర్‌ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్‌ మిలీషియా సంస్థకు పోలీస్‌ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్‌బాయీ తెంగోల్‌ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. 

అస్సాం రైఫిల్స్‌ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్‌ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్‌లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. 

అస్సాం రైఫిల్స్‌ ఇప్పటికే 3 కోర్‌ కార్యాచరణ కమాండ్‌ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్‌ వ్యవస్థ(యూసీఎస్‌)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్‌ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్‌ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.

అన్నీ కలగలిసే...
మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్‌లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్‌ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌– ఇసాక్‌– ముయివా (ఎన్‌ఎస్‌సీఎన్‌–ఐఎమ్‌) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్‌లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్‌ నాగా నేషనల్‌ గవర్నమెంట్‌’ నుండి ఎన్‌ఎస్‌సీఎన్‌–ఐఎమ్‌కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్‌ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.

భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్‌ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.

- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- జైదీప్‌ సైకియా

Advertisement
 
Advertisement
 
Advertisement