ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు! | Sakshi
Sakshi News home page

ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!

Published Tue, May 7 2024 12:36 PM

ATA Sayyandi Padam 2024 Dance Competitions At US

ఈ మధ్య అమెరికాలో అయినా, ఇండియాలో అయినా ఎన్నికల తర్వాత అత్యధికంగా తెలుగు వారు మాట్లాడుకునేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ గురించే. దీన్ని ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నిర్వాహకులు పలు నగరాల్లో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. సిరిసిరిమువ్వ సినిమాలోని ‘ఝుమ్మంది నాదం సయ్యంది పాదం’ పాట స్ఫూర్తితో ఈ పోటీలకు ‘సయ్యంది పాదం’ అని ఆటా వారు నామకరణం చేశారు. 

ఎన్నో సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతులతో పాటు, తెలుగు గడ్డపై వివిధ వేదికలలో అవకాశాలు కల్పించడం ఆటా వారికే చెల్లింది. ఇలాంటి పోటీలతో పాటు గత 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దున్నుగా ఉంటున్న ఆటా వారు శ్లాఘనీయులు. దాదాపు 15 నగరాలలో ఇప్పటికే 4500 మంది హాజరయ్యారు అంటే.. ఇంక కన్వెన్షన్‌కి ఎంత మంది వస్తారో ఊహించుకోవచ్చు. 

ప్రతి సిటీలో భోజనం, టీ, కాఫీ, మంచి నీళ్లు, స్నాక్స్, పండ్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా వేలాదిమంది చరిత్రలో చూడని విధంగా ఈ కన్వెన్‌ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రయాసపడుతున్నారు. అన్ని కార్యక్రమాల వివరములకు www.ataconference.org ని సందర్శించండి.

ఇక, సయ్యంది పాదం విషయానికి వస్తే.. ‘కాలు కదుపుదాం, ప్రైజ్ గెలుద్దాం’ అన్న చందాన ఇప్పటికే ఈ నృత్య పోటీలు లాస్ ఏంజెల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డిసి, షార్లెట్, చికాగోలలో జరగగా, ఇంకా పలు నగరాలలో జరగాల్సి వుంది. ప్రతి ఊరిలో దాదాపు 80 నుంచి 120 మంది కళాకారులు పాల్గొనడం గమనార్హం. ఎలా చూసినా, వెయ్యి మందికి పైగా పాల్గొన్న సయ్యంది పాదంలో 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ల విభాగంలో, 14 ఆపై వారు సీనియర్ల విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభిన్న పోటీలలో ఎందరో పాల్గొని, తమ సత్తా చాటారు. యాంకర్లు ఉత్సాహంగా నడిపించగా, జడ్జీలకు డాన్సర్లు తమ నృత్య కౌశల్యంతో సవాలు విసిరారు. అన్ని విభాగాలలో మొదటి, రెండో స్థానంలో నిలిచిన వారికి ఆటా కన్వెన్షన్ ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చారు.

సయ్యంటే సై అన్నట్టుగా సాగిన ఈ కార్యక్రమానికి ఛైర్ శృతి చిట్టూరి అంకిత భావంతో పని చేస్తూ, అందరికీ దిశానిర్దేశం చేశారు. అలానే, అడ్వైజర్ రాజు కాకర్ల, కో ఛైర్ వాణి గడ్డం, మెంబర్లు గౌరీ కారుమంచి, రజనీకాంత్ దాడి, చిట్టి అడబాల అఖండ కృషి అభినందనీయం. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం, కమ్మని భోజనం ప్రతి ఊరిలో ఏర్పాటు చేశారు. అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, నీలిమ గడ్డమణుగు, కిషన్ దేవునూరి, ఉదయ ఈటూరి, శ్రావణి రాచకుళ్ల, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, గణేష్ కాసం, రాలీ నుంచి శృతి ఛామల, రాధా కంచర్ల, కీర్తి ఎర్రబెల్లి, అజిత చీకటి, పవిత్ర రత్నావత్, షాలిని కల్వకుంట్ల, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండ, లావణ్య నూకల, బిందు మాధవి చండ, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని, క్రాంతి ఏళ్ళ, సునీత నూకల ఇలా ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఎంతో కృషి చేశారు.

ఈ కార్యక్రమాలు పలు నగరాలలో విజయ దుందుభి మ్రోగించడానికి సహకరించిన స్పాన్సర్లకు, జడ్జీలకు, ఆటా టీం, వాలంటీర్లు, ఆహుతులు, ఫోటో మరియు వీడియో గ్రాఫర్లకు, డీ జె, వెన్యూ. రెస్టారెంట్లకు, డెకొరేషన్‌ వారికి ఇలా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయి. అంతేగాక చాలామంది సెలెబ్రిటీస్ ఇండియా నుంచి రానున్నారు. తామెల్లరూ ఈ కన్వెన్షన్‌కి విచ్చేసి విజ్ఞాన, వివేక, వినోదాలలో భాగం కండి. ప్రతి వారం మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తుంటాము. అని ఆటా కన్వెన్షన్‌ నిర్వాహకులు చెబుతున్నారు. 

(చదవండి: అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !)
 

Advertisement
 
Advertisement
 
Advertisement