
అనుకున్నంతా అయింది! కేంద్ర దర్యాప్తు సంస్థ -సీబీఐ- ఏరోటి దగ్గిర ఆ పాటపాడి, న్యాయస్థానాన్ని జయప్రదంగా అయోమయంలోకి నెట్టగలిగింది. పర్యవసానంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు -జనవరి 24న- ‘విచారణకు అర్హం కాని’దని ప్రకటించింది. దిగువ కోర్టు మొదలుకుని సర్వోన్నత న్యాయస్థానం వరకూ సీబీఐ ఎన్ని చోట్ల ఎన్నెన్ని సార్లు మాట మార్చిందో జగన్ తరఫు న్యాయవాది సోదాహరణంగా పేర్కొన్నా లాభంలేకపోయింది. కిందటి సంవత్సరం అక్టోబర్‌లో సుప్రీం కోర్టు నిర్దేశం జారీ అయిన తర్వాత, పరిస్థితుల్లో వచ్చిన మార్పులను గమనికలోకి తీసుకుని వైఎస్ జగన్‌కు బెయిల్ ఇస్తారని ఆశించినవారికి నిరాశే ఎదురయింది. ఈ గందరగోళానికంతటికీ సీబీఐ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
గతంలో సుప్రీం కోర్టులో సీబీఐ చెప్పింది ఓ మాట- ఇప్పుడు పాడుతున్నది వేరే పాట! ఉదాహరణకు, మొదటి చార్జ్ షీట్ (సీసీ-8) మేరకు వైఎస్ జగన్‌ను అరెస్టు చేశామని గతంలో చెప్పిన సీబీఐ, ఇప్పుడు తన మాటను తానే కాదంటోంది. అసలు సీసీ-8 మేరకు జగన్‌ను అరెస్టే చెయ్యలేదనీ, ఆయన్ను రిమాండ్‌లో ఉంచమని కూడా కోరలేదనీ సీబీఐ ఇప్పుడు చెప్తోంది. ఇంతకన్నా పెద్ద అబద్ధం ఉండదు! సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ ప్రముఖంగా ప్రస్తావించింది ఈ చార్జ్ షీట్‌నే! ఈ చార్జ్ షీట్‌లోని అంశాలను పేర్కొనే, జగన్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరిన సంగతి అందరికీ తెలిసిన సంగతే. వాదన కోసం, హైకోర్టు సీబీఐ తాజా ప్రకటననే నమ్మినా, ఆ సంస్థ కోరినట్లుగా వైఎస్ జగన్‌ను కస్టడీనుంచి విడుదల చెయ్యాలి! ఎందుకంటే, మొదటి చార్జ్ షీట్ ప్రకారం నిందితుడిని రిమాండ్ చెయ్యనవసరంలేదని సాక్షాత్తూ సీబీఐ ఇప్పుడు చెబుతోంది కదా! ఈ చార్జ్ షీట్‌ను విచారణకు స్వీకరిస్తూ దిగువ కోర్టు వారెంట్లేం జారీ చెయ్యలేదు కూడా. కానీ, హైకోర్టు అలా చెయ్యకపోగా, బెయిల్ కోరుతూ జగన్ పెట్టుకున్న అర్జీని తిరస్కరించడంలోని సంభావ్యత, సామంజస్యం ఏమిటో మరి?
సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా వైఎస్ జగన్‌ను సీసీ-14 మేరకు అరెస్టు చేశామని సీబీఐ పేర్కొంది. సుప్రీం ఉత్తర్వుల అనంతరం ఈ చార్జ్ షీట్ -అంటే వాన్‌పిక్ కేసు- విషయంలో జగన్ బాండ్‌ను సమర్పించడం, దాన్ని న్యాయస్థానం ఆమోదించడం జరిగిపోయాయి. పరిస్థితుల్లో ప్రముఖమయిన మార్పులు జరిగాయనడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరంలేదు. సారాంశమేమిటంటే- మొదటి చార్జ్‌షీట్(సీసీ-8) ప్రకారం జగన్‌ను నిర్బంధించమని తాము కోరడంలేదని సీబీఐ స్పష్టం చేసింది. రెండో చార్జ్‌షీట్ (సీసీ-14) విషయంలో కోర్టు జగన్ బాండ్‌ను ఈ సరికే ఆమోదించి ఉంది. అలాంటప్పుడు జగన్‌కు బెయిల్ ఇవ్వాలి కదా! పోతే, ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలనూ దృష్టిలో ఉంచుకుని జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ వాదిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఏడు అంశాలపై దర్యాప్తు జరుగుతూ ఉందని కూడా సీబీఐ చెప్తోంది. అది నిజమయితే, సీఆర్పీసీ సెక్షన్ 167 కింద జగన్ రిమాండ్‌ను పొడిగించాల్సిందిగా సీబీఐ కోరివుండాలి. కానీ అలా జరగలేదు! ఈ అంశాన్ని కోర్టు కూడా గుర్తించిందని జగన్ న్యాయవాది తన వాదనలో పేర్కొన్నారు. ఇవన్నీ పిటిషనర్ హోదాలో ప్రముఖమయిన మార్పులను తీసుకొచ్చాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటిషనర్ అర్జీని విచారణకు స్వీకరించాలని జగన్ న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.
సీబీఐ పదేపదే మాటలు మార్చి, ఆకుకు అందని-పోకకు పొందని వాదనలు ముందుంచగా, జగన్ న్యాయవాది అభ్యర్థన సూటిగానూ, స్పష్టంగానూ ఉంది. చిత్రమేమిటంటే, సీబీఐ వాదనల వైపే కోర్టు మొగ్గింది!
మొదటి చార్జ్‌షీట్ ప్రకారం నిందితులుగా పేర్కొన్నవారిలో చాలామందికే సమన్లు అందాయి. వారిలో కొందరిని కొంతకాలం నిర్బంధంలో ఉంచి -బెయిలిచ్చి- వదిలిపెట్టారు కూడా. కానీ, ఆదినుంచీ జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నది జగన్ ఒక్కరే. ఆయన నిర్బంధంలో ఉండగానే, మరిన్ని కేసులు బనాయిస్తున్నారు. ఇది పిటిషనర్‌కు న్యాయమయిన అవకాశాన్ని నిరాకరించడమే అవుతుందని జగన్ న్యాయవాది వాదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన్ను నిర్బంధంలో ఉంచడం ద్వారా, ఆయన్ను ఎన్నుకున్న ప్రజలకూ, ఆయన పార్టీ కార్యకర్తలకూ కూడా అన్యాయం జరుగుతోందని జగన్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం అత్యంత కల్లో భరితమయిన దశలో కొట్టుమిట్టాడుతోంది. జగన్‌లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు జనం మధ్యలో ఉండవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన వాదించారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం తమతో సహకరించడం లేదని సీబీఐ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఇది కేవలం లాలూచీ కుస్తీ మాత్రమే. సీబీఐ ఒక ప్రభుత్వ సంస్థ. అందునా, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థకు సహకరించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం పైనయినా ఉండితీరుతుంది. అలా జరగడంలేదని సీబీఐ చెప్పడం ఏదో కుంటిసాకులు బెత్తాయించడమే తప్ప మరొకటి కాదు. వాస్తవానికి ప్రభుత్వంలో ఉన్నవారికీ, సీబీఐకీ ఉమ్మడి లక్ష్యం ఒక్కటే- జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చెయ్యడం! వాళ్లందరూ పరస్పరం అద్భుతంగా సహకరించుకుంటున్న సంగతి లోకానికంతటికీ తెలుసు. జగన్ తరఫు న్యాయవాది ఈ విషయాలన్నింటినీ కోర్టు ముందుంచారు కూడా. కానీ, విడ్డూరంగా ఉన్న విషయమేమిటంటే, ఎవరెవరి తప్పులకో వైఎస్ జగన్ కస్టడీలో కొనసాగవలసివచ్చేలా, హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నట్లుగా, ఇంతకన్నా అధ్వాన్నమయిన కేసు దేశంలో మరొకటుందా?