
సుప్రసిద్ధ నటుడూ, నిర్మాతా, రచయితా, దర్శకుడూ కమల్ హాసన్ 150 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రూపొందించిన ‘విశ్వరూపం’చిత్రాన్ని వివాదాలు వదిలేట్టు కనిపించడం లేదు. జనవరి 25 తేదిన విడుదల కావాల్సిన విశ్వరూపం చిత్రాన్ని ఏదో ఒక అవాంతరం వెంటాడుతూనే ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలచెయ్యడానికి ముందే డీటీఎచ్ (డెరైక్ట్ టు హోమ్) పద్ధతిలో ప్రసారం చెయ్యాలని కమల్ తలపెట్టారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారాయన. అంతలో తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రముఖులు కమల్ ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించడమే కాకుండా ‘విశ్వరూపం’ చిత్రాన్ని పంపిణీ చేయకూడదనీ, ప్రదర్శించకూడదనీ తీర్మానించడంతో సంక్రాంతి పండగకు విడుదలకు నోచుకోలేకపోయింది.
ఆ తర్వాత అవాంతరాలను అధిగమించి జనవరి 25 తేదిన విడుదలకు సిద్ధమైన విశ్వరూపం చిత్రాన్ని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చిత్రంలో తమ మనోభావాలను గాయపరిచేలా సన్నివేశాలున్నాయంటూ బుధవారం నాడు నలభైకిపైగా ముస్లిం సంస్థలు తమిళనాడులో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించడంతో ఈ చిత్రం విడుదల కాకుండా రెండువారాలపాటు నిషేధిస్తున్నట్టు జయలలిత ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటన చేసింది. తమిళనాడు లో విశ్వరూపం విడుదలను ఆపివేశారనే వార్తల నేపథ్యంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా రెండు వారాలపాటు నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేసింది. ముస్లిం మతస్తుల మనోభావాలకు వ్యతిరేకంగా విశ్వరూపం చిత్రం ఉందని వచ్చిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని.. నిషేధం విధిస్తున్నట్టు పాండిచ్చేరి అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనను సవాలు చేస్తూ కమల్ హాసన్ తమిళనాడు హైకోర్టులో అప్పీల్ చేశారు. విశ్వరూపం విడుదలపై స్టే విధించిన కోర్టు.. తీర్పును ఈనెల 28కి వాయిదా వేసింది. జనవరి 26న విశ్వరూపం చిత్రాన్ని న్యాయమూర్తులకు ప్రదర్శించి.. ఆపోహలను తొలగించేందుకు కమల్ ప్రయత్నాలు చేపట్టారు. విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించడాన్ని చిత్రరంగానికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
విశ్వరూపం చిత్రంపై నెలకొన్న వివాదంపై బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ స్పందించారు. మతాల మధ్య వైరుధ్యాలను పెంచే శక్తి ఏ చిత్రానికి కూడా ఉండదు.. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయలేవు అని బాలీవుడ్ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరి మనోభావాలను దెబ్బతీయడానికి ఏ చిత్ర దర్శకుడు, నిర్మాత ఇతర సాంకేతిక నిపుణుడు కూడా ప్రయత్నించరు అని.. అంతేకాక చిత్రాన్ని చూసే సమయంలో ఏ మతానికి చెందిన వ్యక్తి తీశారనే ధ్యాస ఉండదు అని అన్నారు.

విశ్వరూపం చిత్రంలో తాను ఏ మతాన్ని కించపరచలేదని.. సెన్సార్ బోర్డు కూడా తమ చిత్రానికి అభ్యంతరం చెప్పలేదని కమల్ నిషేధంపై స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే విశ్వరూపం చిత్రాన్ని వాడుకోవాలని కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని.. వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటానని కమల్ అన్నారు. ఇలాంటి సాంస్కృతిక తీవ్రవాదాన్ని ఎదుర్కొవాలని కమల్ పిలుపునిచ్చారు. 'దేశాన్ని ప్రేమించే.. తటస్ఠంగా ఉండే ముస్లింలు.. విశ్వరూపం చిత్రాన్ని చూస్తే గర్వపడుతారు' అని అన్నారు.
సినిమా అనేది ప్రజలకు వినోదం, చైతన్యాన్ని అందించే ఓ సాధనంగానే పరిగణిస్తారని మెజార్టీ ప్రజల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. అయితే వివాదంగా మలిచి సినిమాలను ఆడించడం.. వివాదాల్లోకి నెట్టి నాసిరకం ప్రచారం కోసం ప్రయత్నించడం ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి చవకబారు ప్రయత్నాల వల్ల సమాజానికి మేలు కలిగించే చిత్రాలు ప్రజలకు దూరమవుతున్నాయి. రాజకీయ, మత, సాంస్కృతిక అంశాలను అడ్డుపెట్టుకుని సృజనాత్మక స్వేచ్చపై దాడులకు కారణమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని.. సాంస్కృతిక తీవ్రవాదాన్ని అడ్డుకోవాలని కమల్ తీవ్రంగా స్పందించడం సమంజసమైందేనని పలువర్గాలు అంటున్నాయి.