
ప్రజల అంచనాలను అందుకోవడంలో యూపీఏ-2 ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వస్తున్న ఆరోపణలకు తాజా ఇండియాటుడే-నీల్సన్ సర్వే బలాన్ని చేకూరుస్తోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం దేవుడెరుగు, వారి అంచనాలను అందుకోవడంలో కూడా యూపీఏ-2 దారుణంగా విఫలమైందని సర్వే తేల్చింది. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందని వెల్లడి కావడం యూపీఏ-2 ప్రభుత్వ విశ్వాసాన్ని కుంగదీసే అవకాశముంది. కాంగ్రెస్ సారధ్యంలోని పాలక సంకీర్ణానికి ప్రజాదరణ శరవేగంగా తగ్గిపోతోందని ఇండియాటుడే-నీల్సన్ సర్వే తెలిపింది. అవినీతి, ద్రవ్యోల్బణాలను ఏమాత్రం అదుపు చేయలేక చేతులెత్తేసిందని స్పష్టం చేసింది. దాంతో మధ్య, దిగువ తరగతి ప్రజలపై అన్ని రకాలుగా ప్రభావం చూపింది. 2014 సంవత్సరంలో జరుగనున్న ఎన్నికల్లో యూపీఏ-2 కుదేలేనని సర్వే తేల్చిచెప్పింది.
యూపీఏ - 2 హయాంలో మహిళలకు భద్రత కల్పించడంలో మన్మోహన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని, సర్కార్ పాలన తీరుతెన్నులపై ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి నెలకొన్నాయని ఇండియాటుడే-నీల్సన్ సర్వే తెలిపింది. ఫలితంగా 2014 ఎన్నికల్లో యూపీఏకు ఓట్ల శాతం 7.7 శాతం తగ్గుతుందని, అధికార కూటమి ఏకంగా 102 లోక్‌సభ స్థానాలను కోల్పోయి, ప్రస్తుతమున్న 259 సీట్ల నుంచి కేవలం 157కు పరిమితమవుతుందని జోస్యం చెప్పింది. అదే సమయంలో ఏన్డీయే కూటమి బలం ప్రస్తుతమున్న 159 లోక్‌సభ స్థానాల నుంచి 203కు పెరుగుతుందని అభిప్రాయపడింది. ఇక ఇతరులు, ప్రాంతీయ పార్టీలు ఈసారి ఏకంగా 183 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని కీలక శక్తిగా మారనున్నాయని సర్వే తెలిపింది.
2014 సాధారణ ఎన్నికల్లో యూపీఏకు 28 శాతం ఓట్లు మాత్రమే లభిస్తాయని సర్వే తేల్చింది. 2009తో పోలిస్తే ఇది ఏకంగా 7.7 శాతం తక్కువ. యూపీఏ కోల్పోతున్న ఈ ఓట్ల నుంచి ఎన్డీఏ మాత్రం పెద్దగా లాభపడటం లేదని తెలిపింది. 1.6 శాతం ఓట్ల పెరుగుదలతో 2014లో అదనంగా 44 సీట్లు గెలుచుకోనుంది. అలాగే 7.7 శాతం తగ్గిన ఓట్ల ఫలితంగా యూపీఏ 102 సీట్లను కోల్పోనుందని ఇండియాటుడే-నీల్సన్ సర్వే స్పష్టం చేసింది.
మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఇండియాటుడే-నీల్సన్ నిర్వహించిన ఈ సర్వేలో మోడీ వర్సెస్ రాహుల్‌లో గుజరాత్ ముఖ్యమంత్రికే స్పష్టమైన మొగ్గు కన్పించింది. నరేంద్రమోడీకి ప్రజాదరమ గత ఆర్నెళ్లలో బాగా పెరిగిందని సర్వే వివరించింది. ప్రధానిగా మోడీకి 57 శాతం మద్దతు పలికితే, రాహుల్‌కు 41 శాతం మాత్రమే ఓటేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహులే బరిలో దిగుతారని 52 శాతం, కాదని 36 శాతం అభిప్రాయపడ్డారు. మోడీయే బీజేపీ అభ్యర్థి అని 54 శాతం మంది భావిస్తుండగా, 26 శాతం మాత్రమే కాదని అంచనా వేశారు.
గత ఆరు నెలల్లో కీలకమైన అన్ని అంశాల్లోనూ ప్రజల అంచనాలను అందుకోవటంలో మన్మోహన్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్న భావన సర్వేలో స్పష్టంగా వ్యక్తమైంది. ప్రధానికిగా మన్మోహన్ పనితీరు బాగుందన్న వారు 26 శాతమే కాగా, అంతంతమాత్రమని 39 శాతం, బాలేదని 27 శాతం మంది పేర్కొన్నారు.
అవినీతి, ధరల పెరుగదల అరికట్టడంలో విఫలం, పాలనపరమైన లోపాలు, ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం లాంటి అంశాలు యూపీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా యూపీఏ ప్రభుత్వం పలు రకాలుగా ఎదురీగుతోంది. ప్రజా వ్యతిరేకతను తట్టుకొని ఏవిధంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టుందనే విషయం అందరిలో తెలెత్తుతున్న ప్రశ్న. అయితే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టడానికి ప్రజలను మన్మోహన్ సర్కార్ ఏవిధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే!