
తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేయడంతో మళ్లీ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా కనిపిస్తున్నాయి. తెలంగాణపై కేంద్ర నాన్చివేత ధోరణితో ఆంధ్రప్రదేశ్ లోని ఇరుప్రాంతాల్లో పరిస్థితులు వేడెక్కాయి. తెలంగాణపై జనవరి 28 తేది లోపు ఓ ప్రకటన చేస్తామని ప్రకటించడంతో సీమాంధ్ర లో ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణపై ప్రకటనను అడ్డుకోవడంలో కొంతమేరకు సఫలీకృతమయ్యారు. దాంతో తెలంగాణ ప్రకటనను సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారనే ఆరోపణలతో నిరసనలు, ఆందోళనలకు, దీక్షలకు టీజేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 36 గంటల ‘సమర దీక్ష’ చేపట్టాలని నిర్ణయించారు. సమరదీక్ష కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో.. 'సభలు, సమావేశాలు, నిరసనలు చేపట్టడానికి ఆంధ్రావాసుల పట్ల ఒకలా, తెలంగాణవాదుల పట్ట మరోలా విధంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారు' అని కోదండరాం విమర్శించారు. మంచి మాటలతో పోలీసులు అనుమతిస్తే ఇందిరా పార్కు దగ్గర, అడ్డుకుంటే తెలంగాణ అంతటా ఎక్కడికక్కడ దీక్షలు చేస్తామని కోదండరాం ప్రకటించారు. పోలీసుల అనుమతి లేకున్నా సమరదీక్షను జరిపి తీరతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించడంతో జంట నగరాలలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అనుమతి ఇవ్వకపోవడంతో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో జేఏసీ నేతలు చర్చించిన అనంతరం తెలంగాణ జేఏసీ కార్యాలయం వద్ద నిరసన దీక్షను ప్రారంభించారు.
ఇందిరా పార్కు దగ్గర వీలవకుంటే నిజాం కాలేజీ మైదానంలోనైనా అనుమతివ్వాలన్న కోదండరాం విజ్ఞప్తినీ పోలీసులు తోసిపుచ్చారు. దాంతో ఎవరు అడ్డుకున్నా, అడ్డంకులు కల్పించినా నిరసనలు ఆగబోవని, అరెస్టులకు ప్రయత్నిస్తే ఎక్కడి నేతలక్కడే దీక్షలకు దిగాలని, తెలంగాణ అంతటా బంద్‌లు, రాస్తారోకోలు, నిరసనలకు దిగాలని నిర్ణయించారు. ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన 36 గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ ఆదివారం ఉదయం విద్యావేత్త చుక్కా రామయ్య.. సబితను కలిశారు. ఇదిలాఉండగా, రాజ భవన్ ముట్టడికి బయలుదేరిన ఉస్మానియా విద్యార్థులను అడ్డుకోవడంతో ఉస్మానియా యూనివర్సిటి మరోసారి వేడెక్కింది. విద్యార్థులను అడ్డుకోవడంతో పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. విద్యార్ధుల దాడిని కట్టడి చేసేందుకు పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. దాంతో ఉస్మానియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక సీమాంధ్రలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా సమర్పించాలనే డిమాండ్ తో మంత్రి శైలజనాథ్ ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద మంత్రి శైలజానాథ్ ను ఘోరావ్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి టీజీ వెంకటేశ్ కు కూడా సమైక్యవాదుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. సమైక్యవాదుల శాంత పరుస్తూ..తెలంగాణపై సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశాలు లేవని.. ప్రస్తుతం రాజీనామాలు సమర్పించాల్సిన అవసరం లేదని టీజీ అన్నారు.
తెలంగాణ సమస్యను తెరపైకి తీసుకువచ్చి ఇరుప్రాంతాల్లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారేందుకు కేంద్ర ప్రభుత్వం కారణమైంది అని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ స్వార్ధం కోసమే తెలంగాణపై కేంద్రం నాన్చివేత ధోరణి ప్రదర్శించడం ఇరుప్రాంతాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై తేల్చకుండా ఇలాగే ప్రభుత్వం నిర్ణయాన్ని కొనసాగిస్తే.. పరిస్థితులు అదుపుతప్పి.. రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం ముదిరే పరిస్థితి కనిపిస్తొంది.