
తెలంగాణపై ప్రకటన చేయడానికి కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే విధించిన గడువు రేపటితో ముగుస్తున్న నేపధ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ సమస్యను ఇప్పట్లో తేల్చేఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయింది. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకోవడానికి తుది గడువు అంటూ ఏదీలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ తేల్చి చెప్పేశారు. ఈ సమస్యను నాన్చాలనే ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రికి షిండే ఢాకా వెళ్లనున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈరోజు ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని ఇరు ప్రాంతాల నేతలు ఆశగా ఎదురు చూశారు. స్పష్టత వస్తుందని అందరూ ఆశించారు. తెలంగాణను ప్రకటిస్తారని తెలంగాణవాదులు, సమస్యను మధ్యస్తంగా పరిష్కరిస్తారని సమైక్యవాదులు ఎదురు చూశారు. సమైక్యాంధ్రవాదులు కూడా సమస్యను నాన్చకుండా తేల్చాలనే కోరుతున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ లేక ప్రత్యేక అభివృద్ధి మండలి ప్రకటించి సమస్యను ఒక కొలిక్కితెస్తారని వారు భావించారు. మరికొందరు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి, రెండు రాష్ట్రాలుగా విడగొడతారని ఆశించారు. సమస్యను ఏవిధంగా తేల్చినా అసలుకేమోసం అని కాంగ్రెస్ పార్టీ భావించింది. ప్రస్తుత పరిస్థితులలో ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తను తీసుకునే నిర్ణయంతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసి తెలిసి ఆ నిర్ణయం ఎలా తీసుకుంటుంది? ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీకి సమస్యను పరిష్కరించడంకంటే రాజకీయ ప్రయోజనం ముఖ్యం. అందుకే ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చడానికే ఆ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ సమస్యను ఇప్పట్లో పరిష్కరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇదే విషయాన్ని తెలియజేప్పే విధంగా ఆజాద్ రెండు రోజుల క్రితం మాట్లాడారు. తెలంగాణ సమస్య పరిష్కరించడానికి తుదిగడువు అంటూ ఏదీలేదని, నెల అంటే నెలకాదని, వారం అంటే వారం కాదని కొత్తకొత్త అర్ధాలు చెప్పారు. వ్యూహంలో భాగంగా ముందుగానే ఆయన పార్టీ అభిప్రాయం తెలియజెప్పారు. ఆదే విషయం ఈరోజు చెప్పారు.
కర్ర విరక్కుండా, పాము చావకుండా వ్యవహరించడంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు ఘనులు. గోదమీది పిల్లిలా తమ వైఖరి వెళ్లడించడంలో వారు ఆరితేరారు. చెప్పిందే పదేపదే చెప్పడానికి వారు అలవాటుపడిపోయారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుంది - మరికొంత సమయం కావాలి - తుది గడువులేదు - సంప్రదింపులు కొనసాగుతాయి - సమస్యను త్వరలో పరిష్కరిస్తాం - సీనియర్ నేతలతో మాట్లాడాలి...... అని అదేపాట పాడుతున్నారు. మళ్లీ ఇప్పుడు పార్టీ వైఖరి, ప్రభుత్వ నిర్ణయం అంటూ మరో కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. సమస్యను నాన్చడానికి, సాగదీయడానికి కాంగ్రెస్ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అని స్పష్టం చేశారు. వ్యూహాలపై వ్యూహాలు పన్నడంలో వారికి వారేసాటి.
ఈ సాయంత్రం ఢిల్లీలో ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కరించడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఇతర సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపిస్తున్నామన్నారు. వారితో సంప్రదింపులు జరుపవలసి ఉందని చెప్పారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని, మరికొంత సమయం కావాలన్నారు. మూడు ప్రాంతాల సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చర్చించవలసి అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంతా చెప్పి,తాను చెబుతున్నది పార్టీ అభిప్రాయం మాత్రమేనని, ప్రభుత్వం తరపున అభిప్రాయం కేంద్ర హొం శాఖ చెబుతుందని సెలవిచ్చారు. ఆ తరువాత కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే పేరున విడుదలైన ప్రెస్నోట్లో కూడా అంతకు మించి ఏమీలేదు. ఆజాద్ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే ఆ ప్రెస్నోట్ ఉంది. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని ఆ ప్రకటనలో తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని షిండే తెలిపారు. అంటే కాంగ్రెస్ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం రెండూ నాన్చడమేనని తేలిపోయింది.
ఆజాద్, షిండే ప్రకటనలపై తెలంగాణ రాజకీయ జెఏసి నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే సమరదీక్ష వేదికపై నుంచి తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఓయు విద్యార్థి జెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలలో కొందరు వారి వ్యాక్యలను స్వాగతిస్తే, మరికొందరు విచారకరమన్నారు. కాంగ్రెస్ నేతలలో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడంలేదు. తెలంగాణ రాకుండా సమైక్యాంధ్రవాదులు అడ్డుపడుతున్నారని రెండు రోజుల క్రితం విమర్శించిన తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ నేతలు ఈరోజు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరిని విమర్శిస్తారో చూడాలి. వారు అయోమయ స్థితిలో ఉన్నారు. కుడితిలో పడిన ఎలుకలా ఉంది వారి పరిస్థితి. అటు అధిష్టానం నేతలను ఒప్పించలేరు. ఇటు జెఎసి, టిఆర్ఎస్ నేతల విమర్శలను ఎదుర్కోలేరు. రాజీనామాలు చేయలేరు.
ఉద్యమ నేతలలో కూడా కొందరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. లక్ష్యసాధనకు వారికి రాజకీయాలు అడ్డువస్తున్నాయి. అందువల్లే వారు తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో ఏకం కాలేకపోతున్నారు. ఉద్యమంలో ఎన్ని కొత్త పంథాలు అనుసరించినా ఏకం కానంత కాలం ప్రయోజనం ఉండదు. ఏ ఉద్యమమైనా ఏకతాటిపై నడిచినప్పుడే విజయం సాధ్యం.