ఈ సర్కారు పూర్తి కాలం కొనసాగదు
చంద్రబాబు ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రుణమాఫీ అంటూ ప్రజలను మోసగిస్తున్న టీడీపీ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదని ఆయన స్పష్టం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు దిక్కుతోచని స్థితిలోఅవస్థ పడుతున్నారని, అసలు తాము తీసుకున్న రుణాల్లో ఎన్ని మాఫీ అవుతాయో, ఏవి కావో తెలియక ఇబ్బంది పడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
అధికారంలోకి రావడానికి చంద్రబాబు అడ్డగోలుగా హామీలిచ్చారని, ఇప్పుడు వాటిని నెరవేర్చలేక నోటికి వచ్చినట్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని పెద్దిరెడ్డి చెప్పారు. రాజధాని ఏర్పాటు విషయంలో బాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, రాజధాని ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.