మానవ పురోగతికి మార్గదర్శకాలు
యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక-2014 తీవ్ర పేదరికం, కనీస అవసరాలకు కూడా నోచుకోని ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను స్పష్టం చేసింది. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న ఆటంకాల నుంచి బయటపడి, తిరిగి పటిష్టమైన పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రతిపాదనలు అందించింది. మొత్తంమీద ఈ నివేదిక బలమైన ఉమ్మడి కృషికి పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సహకారం, అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన దృఢ సంకల్పం ఆవశ్యకతను నివేదిక స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలుచేస్తున్న జాతీయ కార్యక్రమాలకు మద్దతును పెంచడంతో పాటు సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2015 తర్వాత రూపొందించే అభివృద్ధి అజెండాలో పొందుపరచే విధంగా అంతర్జాతీయ సాంఘిక భద్రత విషయంలో అంతర్జాతీయ సమ్మతి ఆవశ్యకతను కూడా నివేదిక స్పష్టం చేసింది.
పేదరికం-సమస్యలు:
ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది (వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారు) ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్యం, విద్య, కనీస జీవన ప్రమాణాలకు నోచుకోని ప్రజలు 150 కోట్లకు చేరుకున్నారు. దాదాపు 80 కోట్ల మంది పేదరిక రేఖ అంచున ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అనేక ప్రాంతాల్లో అసమానతలు కొంతమేర తగ్గినట్లు తెలిపింది. మరోవైపు విద్యారంగంలో ఇంకా అధిక అసమానతలు ఉన్నట్లు స్పష్టం చేసింది. పాతతరం ప్రజలు నిరక్ష్యరాస్యతతో ఇబ్బందిపడుతుండగా, ప్రాథమిక విద్య నుంచి మాధ్యమిక విద్యను అభ్యసించే క్రమంలో యువత సమస్యలు ఎదుర్కొంటోంది. విద్యారంగంలో దక్షిణాసియా, అరబ్ దేశాలతో పాటు సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు మానవాభివృద్ధి నివేదిక వెల్లడించింది. 2014 ముందు వెలువడిన మానవాభివృద్ధి నివేదికల ద్వారా అనేక దేశాల్లో ఎక్కువ మంది ప్రజల్లో మానవాభివృద్ధిలో ప్రగతి కనిపించినట్లు వెల్లడికాగా, ప్రస్తుత నివేదిక మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జీవన ప్రమాణం, వ్యక్తిగత భద్రత, పర్యావరణం, ప్రపంచ రాజకీయాల్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నట్లు అభిప్రాయపడింది.
ఆఫ్రికా దేశాలు- మానవాభివృద్ధి:
ఆఫ్రికాలో సంక్షోభాలను నివారిస్తూ సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజలకు రక్షణ కల్పించడం అనేది సుస్థిర, సమ్మిళిత వృద్ధికి ముఖ్య సాధనంగా నివేదిక పేర్కొంది. సబ్ సహారా ఆఫ్రికాలోని దేశాలు ప్రజల కనీస అవసరాలపై దృష్టిసారించాలి. 2000-13 మధ్య ఆదాయం, విద్య, ఆరోగ్యం తదితర అంశాల్లో సబ్ సహారా ఆఫ్రికా ప్రగతి సాధించింది. ఈ కాలంలో అధిక ప్రగతికి సంబంధించి సబ్ సహారా ఆఫ్రికా మానవాభివృద్ధి సూచీలో రెండో స్థానం పొందింది. రువాండా, ఇథియోపియా వేగవంతమైన వృద్ధి సాధించగా, తదుపరి స్థానాల్లో అంగోలా, బురిండి, మాలి, మొజాంబిక్, యునెటైడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, జాంబియా ఉన్నాయి.
ఈ ప్రాంత ప్రజల్లో 58.50 కోట్ల మంది (మొత్తం జనాభాలో 72 శాతం) బహుమితీయ (మల్టీ డైమన్షనల్) పేదరికం లేదా తిరిగి పేదరిక రేఖ దిగువకు చేరడానికి అవకాశం ఉన్నవారుగా పేర్కొంది. వీరికి రాజకీయాల్లో భాగస్వామ్యం కాగల సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతం ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచంలో అధిక అసమానతలున్న ప్రాంతమని నివేదిక స్పష్టం చేసింది. ఆదాయం, విద్య, పునరుత్పాదక ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో లింగ సంబంధ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంత దేశాలు చిన్నారులకు తగిన సేవలు, యువతకు ఉపాధి, వృద్ధులకు చేయూత అందించే విధంగా విధానాలు రూపొందించుకోవాలి. ఆర్థిక వ్యవస్థల్లో సంభవించే విపత్తులను నివారిస్తూ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే పేదరికం తగ్గి పురోగతి సాధ్యమవుతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలు అన్ని రకాల సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల నుంచి పారిశ్రామిక, సేవల ఆధారిత వ్యవస్థలుగా రూపాంతరం చెందాల్సిన అవసరముంది.
‘నిర్లక్ష్యం’పై పోరాటం:
అధిక పేదరికంతో కనీస అవసరాలకు నోచుకోలేని ప్రజలను తీవ్ర నిర్లక్ష్యానికి గురైన వారిగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితిని విధానాలు, సాంఘిక నియమావళిలో మార్పు ద్వారా తగ్గించనట్లయితే మానవాభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వాలు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాలను, సంస్థాపర సంస్కరణలను అమలు చేయాలి. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది ప్రజలకు సమగ్ర సాంఘిక రక్షణ లేదు. దాదాపు 12 శాతం మంది ప్రజలు దీర్ఘకాలంగా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం శ్రామికుల్లో సగం మందికిపైగా అసంఘటిత రంగంపై ఆధారపడి, ఉపాధిపరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పరిమిత సామర్థ్యం కలిగిన ప్రజల్లో జీవన ప్రమాణ స్థాయి కుంటుపడింది. అనేక సాంఘికపరమైన అడ్డంకుల వల్ల వారికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే సార్వత్రిక ప్రమాణాలు రూపొందించుకోవాలి. ఇవి వివక్ష, అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడతాయని నివేదిక పేర్కొంది.
పురోగతి దిశగా పయనించాలంటే:
సమాజంలోని ప్రజల స్వేచ్ఛకు ఆటంకం కలిగించే అన్ని అడ్డంకులను తొలగించినప్పుడే మానవాభివృద్ధి సాధ్యం. ఆయా అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో పెంపొందించాలి. దీనికి అవసరమైన చర్యలను నివేదిక సూచించింది. పటిష్ట సాంఘిక భద్రతను పెంపొందిస్తే వ్యక్తుల్లో విపత్తులు, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొని, పురోగతి సాధించే సామర్థ్యం పెరుగుతుంది. కరువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్వల్పకాల అత్యవసర పరిస్థితిలో భాగంగా సాంఘిక భద్రతా కార్యక్రమాలను అమలు చేసేందుకు పంపిణీ నెట్‌వర్క్, యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. సాంఘిక భద్రత.. ఉత్పత్తిలో ఒడిదుడుకులను తగ్గించడంతో పాటు వ్యయార్హ ఆదాయాలలోని ఒడిదుడుకులను తగ్గిస్తుంది.
ప్రజా భాగస్వామ్య పాలన:
ప్రజలు ప్రత్యక్షంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు పాలన మెరుగవుతుంది. ప్రజలతో దగ్గరి సంబంధం ఉన్నప్పుడు ప్రభుత్వం.. ప్రజా సమస్యలపై అవగాహన ఏర్పడి, విధానపరమైన జోక్యానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వ వనరులు సమర్ధంగా వినియోగమవుతాయని నివేదిక అభిప్రాయపడింది. స్వేచ్ఛ, భద్రత, తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వెల్లడించగలిగే పరిస్థితి ఉంటే అభిలషణీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభుత్వాలకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు.. వాతావరణంలో మార్పులు, ఆర్థిక సంక్షోభం, సామాజిక అశాంతి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటిని అధిగమించాలంటే విధానాల్లో మార్పులతోపాటు విత్త యంత్రాంగం, సంస్థలు తగిన ద్రవ్యత్వాన్ని కలిగి ఉండేలా సిఫార్సులు అవసరం. తద్వారా విత్త వనరుల ప్రవాహంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యవసాయం, సేవల వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాల సమీక్ష జరగాలి. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను దేశాలు మెరుగుపరచుకోవాలి. వాతావరణ మార్పులు ప్రపంచ అభివృద్ధి అజెండాకు ముఖ్యమైన సవాలుగా పరిణమించింది. దీనికి సంబంధించి సత్వర చర్యలు అవసరం.
సంపూర్ణ ఉద్యోగిత:
50, 60వ దశకంలో స్థూల ఆర్థిక విధానాల లక్ష్యాలకు సంపూర్ణ ఉద్యోగిత కేంద్ర బిందువుగా ఉండేది. 1973, 1979లలో చమురు సంక్షోభం నేపథ్యంలో అవలంబించిన స్థిరీకరణ విధానాల్లో భాగంగా ఇది ప్రాధాన్యం కోల్పోయింది. ప్రస్తుతం తిరిగి దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం సుగమం చేయాలని నివేదిక పేర్కొంది. అధిక ఉపాధి కల్పన వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పెరుగుతుంది. సాంఘిక ప్రయోజనం సాధించే సంపూర్ణ ఉద్యోగితకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యమివ్వాలి. దీర్ఘకాల నిరుద్యోగం వల్ల ప్రజల్లో ఆరోగ్య ప్రమాణాలు క్షీణించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కుంటుపడతాయని నివేదిక పేర్కొంది. ఉపాధి కల్పన ద్వారా సాంఘిక స్థిరత్వం, ఒకే లక్ష్యంతో పనిచేసే సమాజం ఏర్పడుతుంది.
మానవాభివృద్ధి నివేదిక- ప్రగతి:
2013 దత్తాంశాల ఆధారంగా రూపొందిన మానవాభివృద్ధి నివేదిక-2014.. 187 దేశాల మానవాభివృద్ధి సూచీని రూపొందించింది. నివేదిక.. దేశాలను అత్యధిక మానవాభివృద్ధి (49 దేశాలు), అధిక మానవాభివృద్ధి (53), మధ్యస్థ మానవాభివృద్ధి (42), అల్ప మానవాభివృద్ధి చెందిన దేశాలు (43)గా వర్గీకరించింది. మానవాభివృద్ధి సూచీలో నార్వే ప్రథమ స్థానం, ఆస్ట్రేలియా ద్వితీయ స్థానం, స్విట్జర్లాండ్ తృతీయ స్థానం పొందాయి. భారత్ 135వ స్థానంలో నిలవగా, చైనా 91వ స్థానంలో, నేపాల్ 145వ స్థానంలో, పాకిస్థాన్ 146వ స్థానంలో నిలిచాయి. నైజర్ చిట్టచివర 187వ స్థానం పొందింది.
భారత్ ప్రగతి:
భారత్ మానవాభివృద్ధి సూచీ విలువ 0.586. 187 దేశాల జాబితాలో 135వ స్థానం. గతం కంటే ఒక స్థానం మెరుగుపడిందిఅసమానతలను సర్దుబాటు చేసిన మానవాభివృద్ధి సూచీ విలువ 0.418. కాగా ఈ సూచీకి సంబంధించిన స్థానం, హెచ్‌డీఐకి సంబంధించిన స్థానంలో తేడా శూన్యం.లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించి భారత్ విలువ 0.563. కాగా ఈ సూచీకి సంబంధించిన భారత్ స్థానం 127.లింగ సంబంధిత అభివృద్ధి సూచీకి సంబంధించి భారత్ విలువ 0.828. కాగా ఈ సూచీకి సంబం బహుమితీయ పేదరిక సూచీకి సంబంధించి భారత్ విలువ 0.282.
భారత్ వెనుకబాటుకు కారణం:
యూఎన్‌డీపీ వివిధ సూచీలు రూపొందించడానికి పరిగణనలోకి తీసుకునే సూచికల్లో (ఐఛీజీఛిౌ్చ్టటట) భారత్ ప్రగతి సంతృప్తికరంగా లేదు. మానవాభివృద్ధి సూచీ రూపొందించడానికి ఉపయోగించే సూచికల ప్రగతిని పరిశీలిస్తే ఆయుర్దాయం 66.4 ఏళ్లు, తలసరి స్థూల జాతీయోత్పత్తి (కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా) 5,150 డాలర్లు. 25 లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారు విద్యను అభ్యసించిన సంవత్సరాల సరాసరి (మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్) 4.4 ఏళ్లుగా నమోదైంది. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చినప్పుడు ఈ సూచికల ప్రగతి సంతృప్తికరంగా లేదు. లింగ సంబంధిత అసమానతల సూచీకి సంబంధించిన సూచికల ప్రగతిని పరిశీలించినప్పుడు ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష జననాలకు 200 ఉంది.
పార్లమెంటులో మొత్తం సభ్యుల్లో మహిళల వాటా 10.9 శాతంగా ఉంది. లింగ సంబంధిత అభివృద్ధి (జీడీఐ) సూచికలను పరిశీలిస్తే మహిళలలో ఆయుర్దాయం 68.3 ఏళ్లు, పురుషుల్లో ఆయుర్దాయం 64.7 ఏళ్లు, అంచనా వేసిన తలసరి స్థూలజాతీయోత్పత్తి మహిళల్లో రూ.2,277గా, పురుషుల్లో రూ.7,833గా నమోదైంది. బహుమితీయ పేదరిక సూచీ రూపొందించడానికి వినియోగించిన సూచికల ప్రగతిని పరిశీలిస్తే బహుమితీయ పేదరికానికి దగ్గరగా ఉన్న జనాభా 18.2 శాతం, తీవ్ర పేదరికంలో ఉన్న జనాభా 27.8 శాతం, జాతీయ పేదరిక రేఖ 21.9 శాతంగా నమోదైంది.