దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు... | special interview with akkineni venkat | Sakshi
Sakshi News home page

దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు...

Published Sat, Sep 20 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు...

దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు...

- వెంకట్ అక్కినేని
నాన్న లేకుండా మేము జరుపుకొంటున్న ఆయన తొలి పుట్టినరోజు ఇది. ఈ క్షణంలో నా మనసు నిండా ఏవేవో భావాలు, ఆలోచనలు. తల్లితండ్రులు పోయినప్పుడు ఎవరికైనా సరే అన్నేళ్ళుగా తమతో ఉన్న లైఫ్‌లైన్ కట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నా పరిస్థితీ అదే. పైగా నాన్న కుటుంబానికి చాలా ప్రాధాన్యమిచ్చే మనిషి. అంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో మా కుటుంబ సభ్యులందరి మధ్య చాలా సాన్నిహిత్యం. అందుకే, నాన్న లేరన్న వాస్తవాన్ని ఇవాళ్టికీ జీర్ణించు కోలేకపోతున్నాం. కాలమే ఈ గాయాన్ని మాన్పుతుంది.  పుట్టిన ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు వెళ్ళిపోయేవాళ్ళమే. ఆయన అన్ని రకాలుగా సంపూర్ణ జీవితం అనుభవించిన మనిషి. దర్జాగా బతికారు, హుందాగా వెళ్లి పోయారు. అందుకే, ఆయన జీవించిన విధానాన్ని ప్రశంసించాలి.
 
అమ్మ చాలా ఏళ్లు అనారోగ్యంతో బాధపడడం కళ్లారా చూశాం. పాపం... ఇంట్లో ఆమె వెంటే ఉంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ నాన్న ఎంత వేదన అనుభవించారో మాకు తెలుసు. కానీ, క్యాన్సరొచ్చినా, పెద్దగా బాధపడకుండానే ఆయన అనాయాసంగా కన్ను మూశారు. నిజానికి, క్యాన్సర్ ఉన్నట్లు అడ్వాన్‌‌స దశలో కానీ బయటపడలేదు. గత సెప్టెంబర్‌లో నాన్న పుట్టినరోజు ఆనందంగా జరుపుకొన్నాం. ఆ తరువాత కొద్ది వారాలకే వ్యాధి సంగతి బయటపడింది.
 
క్యాన్సర్ వచ్చిన సంగతి నాన్నకు చెప్పడానికి డాక్టర్లు సంకోచిస్తుంటే, నేనే ఆయనకు ముందుగా విషయం చెప్పాను. (కన్నీళ్ళను ఆపుకొంటూ...) ఒక దుర్వార్త వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారన్న దాన్నిబట్టి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించవచ్చు. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది దాచేస్తుంటారు. విషయం బయటకు లీకై నలుగురూ లేనిపోనివి అనుకొనే బదులు, పబ్లిక్ ఫిగరైన మీరే విషయం చెప్పి, అలాంటి ఇతర క్యాన్సర్ బాధితులకు కూడా డీలా పడిపోకుండా పాజిటివ్ దృక్పథంతో ఉండమని చెప్పవచ్చు కదా అని నేను సూచించాను. అంతే. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి, తన వ్యాధి సంగతి ధైర్యంగా ప్రకటించారు. ఆశీస్సులతో బతుకుతానన్నారు. అంతెందుకు! మా బంధువుల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చి భయపడుతుంటే, తాను క్యాన్సర్ బాధలో ఉన్నా, వాళ్ళను పిలిచి, 2 గంటలు మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
కోలన్ క్యాన్సర్‌లో కూడా చాలా క్లిష్టమైన, అరుదైన చోట నాన్నకు వ్యాధి వచ్చింది. అత్యాధునిక కెమోథెరపీ మందు కూడా పని చేయలేదు. చివరి రోజులని తెలిసినా ఆయన ధైర్యం కోల్పోలేదు. మంచి చికిత్సతో ఆయన మరో 2 -3 నెలలు బతుకుతారనుకున్నాం. మనసులోనే బాధ దిగమింగుకొని ఆయన ఎదుట జోక్స్ వేసి, నవ్విస్తూ, మాలో ఎవరో ఒకరం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండేవారం. ఒకరోజు సాయంత్రం కొద్దిగా నొప్పి మొదలై, మేము ‘ప్యాలియేటివ్ కేర్’కు ఏర్పాట్లు చేశాం. నిద్ర మత్తుతోనే ఏదో ఆయన మాట్లాడారు. కానీ, ఆ అర్ధరాత్రి దాటాక ప్రశాంతంగా శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, (గొంతు జీరపోగా...) అమ్మానాన్నలకు మనమేదైనా లోపం చేశామా, మరింత హ్యాపీగా ఉంచలేకపోయామా, కొన్నిసార్లు అనవసరంగా కోపతాపాలు చూపామా అన్న ఆలోచనలు పిల్లలకు వస్తూ ఉంటాయి. ఎవరికైనా అది సహజం.  

పిల్లలకు 14 -15 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి తాను తీసుకొనే నిర్ణయాల్లో వారినీ భాగస్వామిని చేయడం నాన్న పెంపకంలోని ప్రత్యేకత. అలా మాలో ఆలోచించే తత్త్వాన్ని పెంచేవారు. పెద్దవాళ్లతో ఆయన చర్చిస్తున్నప్పుడు చిన్నతనంలో నేను ఆసక్తిగా వింటూ ఉంటే, ఆయన ప్రోత్సహించారు. ఆయనకు ఇంట్లో అందరూ సమానమే అయినా, ఇంటికి పెద్దవాణ్ణి కావడం వల్లనేమో నేనంటే పిసరంత అభిమానం ఎక్కువే అనిపిస్తుంటుంది. అమెరికాలో చదువుకొని 1977లో తిరిగొచ్చాక, అనుకోకుండా 1978లో అన్నపూర్ణా స్టూడియో నిర్వహణ చేపట్టా. నష్టాలతో స్టూడియో పక్షాన చిత్ర నిర్మాణం కొన్నాళ్ళు ఆగింది. ఆ తరువాత అనుకోకుండా నేనే చిత్ర నిర్మాణం చేపట్టా.

జీవితంలో పిల్లల్ని ఎవరినీ, దేనికీ వద్దని చెప్పని నాన్న ‘పెదబాబూ... నువ్వు ముక్కుసూటి మనిషివి. నీకు సినీ రంగం సరిపడదేమో’ అని మాత్రం అన్నారు. ‘ఒక్కసారి ట్రై చేస్తా’ అన్నప్పుడు మారుమాట్లాడకుండా సరే అన్నారు. అప్పుడు వేరే యాక్టర్ల కోసం ప్రయత్నించి, చివరకు ఇంట్లోనే నాగార్జున ఉన్నాడు కదా అని వాడు నటిస్తాడని నాన్నకు చెప్పి, ‘విక్రవ్‌ు’ (’86)తో నిర్మాతనయ్యా. అయితే, పది - పన్నెండు సినిమాలు తీసి, పాతికేళ్ళు స్టూడియో చూసుకున్నాక 2002 ప్రాంతంలో ఆ బాధ్యత నాగార్జునకు అప్పగించా. నాన్న నన్నే చూడమన్నా, వద్దన్నా.

ఇప్పుడు రసాయన, వైద్య పరికరాల దిగుమతుల పరిశ్రమలతో బిజీగా ఉన్నా. మంచి కథ దొరికితే, మళ్ళీ సినిమా తీయాలనుంది.  మా అబ్బాయి ఆదిత్యనూ హీరోని చేయాలని నాన్నకుండేది. కానీ, వాడికి ఆసక్తి లేకపోవడంతో మేము బల వంతం చేయలేదు. ఆయన అవార్డును ఏటా ఇవ్వడం, జన్మభూమి ట్రస్ట్ కింద కార్యక్రమం చేయడం లాంటి నాన్న ఆఖరి కోరికలు నెరవేరుస్తాం. అనుక్షణం నాకండగా ఉన్న నాన్నను చిరస్మరణీయం చేసు కొనేది అలాగే!
 సంభాషణ: రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement