సివిల్స్లోనూ అమ్మాయిలు టాప్ లేపారు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2014 ఫలితాల్లో అమ్మాయిలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. దేశంలోని అత్యున్నత ప్రభుత్వ సర్వీసు నియామకాలకు సంబంధించిన సివిల్స్ పరీక్షల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొదటి అయిదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.
ఇరా సింఘాల్ మొదటి ర్యాంకు సాధించగా, రేణు రాజ్, నిధి గుప్తా, వందనా రావ్ వరుసగా 2, 3, 4 ర్యాంకులలో నిలిచారు. ఓవరాల్ ఐదో ర్యాంకు సాధించిన సుహర్ష భగత్.. పురుషుల్లో ప్రథమస్థానంలో నిలిచాడు. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూడొచ్చు. ఇక తెలుగు విద్యార్థులు సాకేత్ రాజా 14వ ర్యాంకు, లక్ష్మీకాంత్ రెడ్డి 21వ ర్యాంకు పొందారు.
గత ఆగస్టు 24న 2,137 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయగా, వారిలో 1,236 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. నిజానికి దేశవ్యాప్తంగా 1,364 సివిల్ సర్వెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆ సఖ్య కంటే తక్కువ మంది అభ్యర్థులు తుది దశకు ఎంపిక కావడం గమనార్హం.