తెలుగులో తొలిసారి కాఫ్కా
కాఫ్కా కథలు
తెలుగు: జి.లక్ష్మి
వెల: రూ. 80
ప్రతులకు: విశాలాంధ్ర
ఇరవయ్యవ శతాబ్దపు దోస్తవ్‌స్కీగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా చిన్న, పెద్ద కథలు, కథానికలు తెలుగులో ఎట్టకేలకు గ్రంథరూపంలో వెలువడ్డాయి. తెలుగు కథానికా సాహిత్యానికి ఇది శుభం చేకూర్చే పరిణామం. గతంలో కాఫ్కా కథలు తెలుగులోకి తర్జుమా అయిన సందర్భాన్ని ఇక్కడ ప్రస్తుతించుకోవాలి. ముళ్లపూడి శ్రీనివాస ప్రసాద్ సుమారు 30 ఏళ్ల నాడు కొన్ని వారాల పాటు ‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సాహితీ అనుబంధంలో కాఫ్కా కతలను, గల్పికలను (పారబుల్స్/ఫేబుల్స్) క్రమం తప్పకుండా తెలుగు చేశారు. అయితే మన దౌర్భాగ్యం మేరకు అవి పుస్తకరూపం తీసుకోలేదు. కాఫ్కా ప్రభావంతో రాసిన కథలతో కాఫ్కా మీద రాసిన కవితలతో తెలుగు సాహితీలోకానికి కాఫ్కా పేరును పరిచయం చేసిన ఖ్యాతి త్రిపురకు దక్కుతుంది. గమ్మత్తేమిటంటే కాఫ్కా కతలు, నవలలు, అన్య రచనలు, హిందీ మలయాళం కన్నడం బెంగాలీ వంటి ఇతర భారతీయ భాషలలోకి ఏనాడో అనువాదమయ్యాయి. తెలుగువారి భావదారిద్య్రం, వెనుకబాటుతనం ఎంత గాఢమైనవో తెలుసుకోవడానికి మచ్చుకు కాఫ్కా సందర్భం ఒక్కటి చాలు. రచయిత్రి జి. లక్ష్మి (గతంలో అల్బర్ట్ కామూ ‘అపరిచితుడు’ నవలను తెలుగు చేశారు) అనువాదం చేయడమే కాక అర్థవంతమైన ముందుమాటను ఈ కథల పుస్తకానికి సమకూర్చారు. కాఫ్కా పేరెన్నిక గన్న కథలు ‘ఇన్ ది పీనల్ కాలనీ’, ‘ఎ కంట్రీ డాక్టర్’, ‘ది జడ్జిమెంట్’, ‘ఎ హంగర్ ఆర్టిస్ట్’, ‘ది బరో’ ఇందులో చోటు చేసుకున్నాయి. ‘బిఫోర్ ది లా’ వంటి ముఖ్యమైన చిన్న కథలు కూడా ఈ సంకలనంలో ఉన్నాయి. కాఫ్కాకు పేరుతెచ్చిన ‘మెటమార్ఫసిస్’ కథను వేరెవరో తెలుగు చేస్తున్నారని తెలిసి అనువాదకురాలు లక్ష్మి ఆ కథను తర్జుమాకు ఎంచుకోలేదు. ఆ కథ కూడా ఇందులో చేరి ఉంటే సంకలనం మరింత సమగ్రంగా ఉండేది. మానవ లోకంలో న్యాయం అలభ్యం. దోషికి శిక్ష
విధించడం అసాధ్యం. ఏ నేరం చేయనివాడే ఇక్కడ శిక్షార్హుడు. ఈ ప్రపంచం ఒక నిర్బంధ శిబిరం అని చాటి చెప్పిన దార్శనిక కథకుడు కాఫ్కా. ‘కాఫ్కా కథలను ఒకసారి చదివితే సరిపోదు. ఆ కథలను మరలా మరలా చదువుతూ పోవాలి. అప్పుడే వాటిని అర్థం చేసుకోగలం’ అని కామూ చెప్పిన మాటను మననం చేసుకుందాం. కాఫ్కాను ఇకనైనా మళ్లీ మళ్లీ ఆసాంతం చదువుకుందాం.
- అం. సురేంద్రరాజు