అప్పట్లో అదో టైపు.... | cricketer murali vijay life style | Sakshi
Sakshi News home page

అప్పట్లో అదో టైపు....

Published Fri, Nov 20 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

అప్పట్లో అదో టైపు....

అప్పట్లో అదో టైపు....

సుమారు 14 ఏళ్ల క్రితం... చెన్నై టినగర్‌లో ఓ చిన్న లాడ్జి.... మంచాలు లేవు.... ఎవరు వచ్చినా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఖాళీ గదిలో నేల మీదే పడుకోవాలి. ఓ లారీ డ్రైవర్, మరో వ్యక్తి నిద్రపోతున్నారు.  ఇంతలో 17 ఏళ్ల కుర్రాడు వచ్చి వాళ్ల పక్కనే పడుకున్నాడు.  అలా ఆరు నెలల పాటు ప్రతి రోజూ ఆ లాడ్జికి వచ్చి నిద్రపోయాడు.

 ప్రస్తుతం... భారత్‌తో పాటు అనేక దేశాల్లోని అతి పెద్ద స్టార్ హోటళ్లలో బస... ఎక్కడికెళ్లినా పట్టు పరుపులు... భారత క్రికెట్‌లో టెస్టు ఓపెన ర్‌గా ప్రత్యేక స్థానం... కావలసినంత డబ్బు... అభిమానుల ఆదరణ...  ఆ రోజు ఆ లారీ డ్రైవర్ కనీసం ఊహించి ఉండడు...  తన పక్కన నిద్ర పోతున్న వ్యక్తిని తాను భవిష్యత్‌లో కలవడం కూడా కష్టమని.

 జీవితంలో ఎవరైనా ఎదగడం సహజం. కానీ మురళీ విజయ్ ప్రస్థానం చాలా విభిన్నం.  17 ఏళ్ల వయసులో ఇంట్లోంచి బయటకు వెళ్లి ఆరు నెలల పాటు పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసిన కుర్రాడు... ఏడే ఏడు సంవత్సరాలలో భారత క్రికెటర్‌గా ఎదిగాడు.

 సాక్షి క్రీడావిభాగం
 అప్పట్లో అదో టైపు... ఈ మాట మురళీ విజయ్ గురించి ఎవరో చెప్పింది కాదు. తనే చెప్పింది. చదువు అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి... తానేం చేయాలో తెలియని ఓ కుర్రాడు... దారి తెన్నూ లేకుండా రోడ్లపై తిరిగిన రోజుల నుంచి ఇప్పటి స్టార్ హోదా దాకా విజయ్ చాలా జీవితం చూశాడు. ప్రపంచం పుస్తకాల్లో ఉండదు, బయట తిరిగితే తెలుస్తుందని చిన్నతనంలోనే నమ్మిన అతను... సాధారణ వ్యక్తులకు నచ్చని విధంగా చాలా పనులే చేశాడు. వాటన్నింటి గురించి మురళీ విజయ్ మాటల్లోనే....

 అప్పుడు నాకు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పాను. ఏం చేయాలో తెలియదు. ఇంట్లోంచి ఎటైనా వెళ్లిపోయి ఆరు నెలలు బతకాలని అనుకున్నాను. ఇదే మాట ఇంట్లో వాళ్లకు చెప్పాను. ఆశ్చర్యపోయారు. ‘కంగారు పడకండి. నేను ఆత్మహత్య చేసుకోను. నా జీవితాన్ని నేను స్వతంత్రంగా గడపాలని అనుకుంటున్నా. అసలు నేనేంటో నాకు తెలియాలి’ అని చెప్పాను. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో ఈ మాట చెప్పడానికి బాధ అనిపించింది. అయినా చెప్పాను. మా నాన్న చాలా గొప్ప మనిషి. ఆ సమయంలో ఆయన వ్యాపారం బాగోలేదు.

 నష్టాలు వస్తున్నాయి. అయినా ఆ ప్రభావం నా మీదగానీ, నా చెల్లిమీద గానీ పడకుండా చూశారు. నిజానికి మా ఇంట్లో అందరూ చదువుకు ప్రాణమిస్తారు. మా చెల్లి ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ రెండు శాతం ఎందుకు రాలేదని అందరూ బాధపడ్డారు. కానీ నేను అలా కాదు. నాకు చదువు మీద పెద్దగా ఆసక్తి లేదు. ప్రపంచం పుస్తకాల్లో ఉండదని నా నమ్మకం. బయట వెళ్లి తిరగడం ద్వారా అన్నీ తెలుస్తాయని అనుకునేవాడిని. టి నగర్‌లో ఓ హోటల్‌లో రాత్రి పూట నిద్రపోయేవాడిని. పగలు రకరకాల పనులు చేసేవాడిని. ఓ మల్టీలెవల్ కంపెనీలో మార్కెటింగ్ చేశాను. అందులో ఇద్దరిని చేరిస్తే నాకు కమిషన్ వచ్చేది.

అలాగే ఓ స్నూకర్ పార్లర్‌లో పని చేశా. చాలాసార్లు రాత్రి నిద్రపోయే ముందు భయమేసేది. రేపు ఎలా గడుస్తుందనే బాధ ఉండేది. ఒక దశలో తిరిగి ఇంటికి వెళదామని అనిపించింది. కానీ నేనేంటో నాకు తెలియాలంటే కొంతకాలం ఉండాల్సిందే అని అనుకున్నాను. ఆ దశలో నా జీవితం రోజు కూలీగానే ముగుస్తుందని అనిపించేది. నిజానికి నా మీద నాకు నమ్మకం కలిగింది కూడా ఆ సమయంలోనే. ఏం చేసైనా బతికేయొచ్చు అనిపించింది. అప్పుడప్పుడు ఇంటికెళ్లి అమ్మను చూసి వచ్చేవాడిని. మా అమ్మ మాట విని మళ్లీ పరీక్షలు రాసి పాసయ్యాను. ఆ తర్వాత మైలాపూర్‌లో డిగ్రీలో చేరాను. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది.
 
 ఆ కాలేజీలో క్రికెట్ ఎక్కువ ఆడేవారు. నేను కూడా ఆడటం మొదలుపెట్టా. ఆ తర్వాత అదే జీవితంలా అనిపించింది. నేను ఎక్కువ ఇంటికి వెళ్లేవాడిని కాదు. చాలాసార్లు క్రికెట్ ఆడాక మైదానంలోనే చెట్ల కిందే రాత్రంతా నిద్రపోయేవాడిని. నా స్నేహితులు, వాళ్ల తల్లిదండ్రులంతా నేనో గొప్ప క్రికెటర్‌ని అవుతానని నమ్మేవారు. తమిళనాడు ఆడే రంజీ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూసేవాడిని. ఏదో ఒకరోజు వాళ్లతో ఆడతానని అనిపించేది. ఎవరు ఎక్కడ క్రికెట్ ఉందన్నా వెళ్లేవాడిని. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రకరకాల మైదానాల్లో రకరకాల మ్యాచ్‌ల్లో ఆడేవాడిని.

 నా ఉద్దేశంలో జట్టు కోసం ఉపయోగపడే 30 పరుగులు... ఉపయోగపడని 150 పరుగుల కంటే విలువైనవి. కానీ దీనిని ఎవరూ పట్టించుకోలేదు. సెంచరీలే లెక్క వేసేవారు. నిజానికి నేను ఆడిన అలాంటి ఇన్నింగ్స్‌లను గుర్తించి ఉంటే ఎప్పుడో భారత జట్టుకు ఆడేవాడిని. నాకు ఇది అర్థమవడానికి సమయం పట్టింది. మిగిలిన వాళ్లు ఆటను ఎలా చూస్తున్నారో మనం అలాగే ఆడాలని అర్థమైంది. ఆ తర్వాత భారత జట్టులో స్థానం దక్కింది.
 
 తొలిసారి నాలో నైపుణ్యాన్ని గుర్తించింది భరత్ అరుణ్ (ఈయన ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్ కోచ్). చెన్నై క్లబ్ క్రికెట్‌లో కెమ్‌ప్లాస్ట్ జట్టులో నన్ను చేర్పించారు. కానీ అక్కడ ఐదు మ్యాచ్‌లు కూర్చుంటే ఆరో మ్యాచ్ ఆడిస్తామని చెప్పారు. అలాగే ఓపిగ్గా కూర్చున్నాను. ఒక్కసారి స్థానం దొరికాక వెనుదిరిగి చూసుకోలేదు. నా జీవితంలో చాలా అనూహ్య సంఘటనలు జరిగాయి. 21ఏళ్ల వయసులో నేను కచ్చితంగా తమిళనాడు జట్టులో ఆడతాననే నమ్మకం ఉన్న సమయంలో జట్టును ప్రకటిస్తే అందులో నా పేరు లేదు.

నా జుట్టు పొడవుగా ఉండటం వల్ల నన్ను తీసుకోలేదని తెలిసిన వాళ్లు చెప్పారు. నేను ఆటలో తప్పులు చేస్తేనో, సహచరులతో నా ప్రవర్తన సరిగా లేకపోతేనే తప్పుపట్టాలి. కేవలం నేను పెంచుకున్న జుట్టును బట్టి నా క్యారెక్టర్‌ను ఎలా అంచనా వేస్తారని ఆశ్చర్యం వేసింది. మనుషుల్ని మనం మార్చలేమని అర్థమైంది. కాబట్టి మనమే మారాలి. ఆ రోజు సెలూన్‌కి వెళ్లి కటింగ్ చేయించుకున్నాను. జుట్టు ఎప్పుడైనా పెంచుకోవచ్చు. కానీ క్రికెట్ ఆడ లేం... అందుకే నాకు నచ్చని పని చేశాను.
 
పెళ్లి వివాదం...
 నా పెళ్లి గురించి మీడియా రకరకాల వ్యాఖ్యానాలు చేసింది. (క్రికెటర్ దినేశ్ కార్తీక్ భార్యను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కార్తీక్‌తో విడాకులకు ముందే విజయ్‌కు అతని భార్యతో సంబంధం ఉందనేది అప్పట్లో హల్‌చల్ చేసిన వార్త). నిజానికి ఇది ముగ్గురు వ్యక్తుల సమస్య. మేం ముగ్గురం ఈ సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాం. కానీ మీడియా దీనిని మరో రకంగా చూపించింది. అప్పుడేం జరిగిందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసేది సరైన పని అయినప్పుడు అదే చేస్తాను. నేనేం చేసినా నా కుటుంబం మద్దతుగా నిలబడింది.

 పెళ్లి విషయంలోనూ నేను స్వయంగా నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ నిర్ణయాన్ని కూడా మరో రకంగా మీడియా రాసింది. కాబట్టి దీని గురించి ఎప్పుడూ ఎవరితో మాట్లాడలేదు. నా తల్లిదండ్రులంటే నాకు చాలా గౌరవం. వారిని నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పెట్టకూడదు. నేనేంటో నా భార్యకు తెలుసు. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు నిర్వాన్‌కు నాలుగేళ్లు. తొమ్మిది నెలల పాప పేరు ఇవా. నిర్వాన్ అంటే సంతోషకరమైన ఆత్మ అని. ఇవా అంటే వెలుగు (నా జీవితానికి) అని అర్థం. ఇప్పుడు అందరం చాలా సంతోషంగా జీవిస్తున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement