Education
-
శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. BS రావు కన్నుమూత
హైదరాబాద్: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా.బి.ఎస్. రావు కన్నుమూశారు. BS రావు వయస్సు 75 ఏళ్లు. ఈ ఉదయం ఇంట్లో అస్వస్థతకు గురయినట్టు శ్రీచైతన్య వర్గాలు తెలిపాయి. దీంతో బి.ఎస్. రావును హుటాహుటిన జూబ్లీహిల్స్ అపొలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించినా.. బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడలోని తాడిగడపకు తరలిస్తారు. ఆయన కూతురు సీమ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. ఆమె తిరిగిరాగానే BS రావు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తారు. అలుపెరుగుని విద్యా ప్రస్థానం డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన BS రావు.. లండన్ లో MRSH చదివారు. అక్కడే ఇంగ్లండ్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలం ఇరాన్ లో వైద్య సేవలు అందించారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. భార్య భర్తలిద్దరు విదేశాల్లో మెడిసిన్ ప్రాక్టీస్ అనంతరం 1986లో దేశానికి తిరిగి వచ్చారు. (భార్య ఝాన్సీ లక్ష్మీబాయితో బీఎస్ రావు) పోరంకి నుంచి అన్ని రాష్ట్రాల్లోకి 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, వాటిని అగ్రపథంలో నడిపించారు. విజయవాడలోని పోరంకిలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన విద్యా సంస్థల ప్రస్థానం ప్రారంభమైంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛండీఘర్, రాంచీ, బొకారో, ఇండోర్ లలో బ్రాంచ్ లు నెలకొల్పారు. కర్ణాటకలో బెంగళూరు, గంగావతి, రాయచూరులలో ఎన్నో బ్రాంచులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 CBSE స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 8లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానానికి చేరడానికి విశేషకృషి చేశారు BS రావు. వారసత్వానికి బాధ్యతలు BS రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు సీమ, మరొకరు సుష్మ. ఇద్దరు కూతుళ్లకు విద్యాసంస్థల బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు BS రావు. శ్రీచైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్ గా సీమ ఉన్నారు. ఇక సుష్మ సంస్థకు CEOగా, అకడమిక్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో 45 వేల మంది పని చేస్తున్నారు. సమాజానికి తన వంతుగా విద్యారంగంలో BS రావు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ నుంచి లైఫ్ టైం అచీవ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్ షిప్ అవార్డు అందుకున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధిత రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఫ్లోరోసిస్ కారణంగా కన్ను మూసిన కుటుంబాల నుంచి వంద మంది చిన్నారులకు ఉచిత విద్యను అందించే కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాల నుంచి కూడా చిన్నారులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్య అందించారు BS రావు. -
Honors Degree : డిగ్రీకి డిగ్నిటీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఎదురువుతున్న పోటీని తట్టుకొని అత్యున్నతంగా ఎదిగే విధంగా నూతన డిగ్రీ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఆనర్స్ డిగ్రీ కోర్సు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దటానికి అండగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఆయా విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తున్నాయి. తద్వారా డిగ్రీ అభ్యాసంలోనే ఆయా రంగాలకు చెందిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందేందుకు అక్కడ అవకాశముంటుంది. అదే కోవలో ఏపీలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను తీసుకొస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించి అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి పరిధుల్లో ఉన్న కళాశాలలు విస్తృతంగా ప్రచారం చేశాయి. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకూ గడువును పొడిగించింది. సబ్జెక్టులు ఇలా.. నూతన డిగ్రీ విధానంలో ఒక సింగిల్ మేజర్ సబ్జెక్ట్, మరో మైనర్ సబ్జెక్ట్‌ను విద్యార్థి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లోని కోర్సుల్లో సుమారు 190కు పైగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌లు.. మరో 80 వరకూ మైనర్ సబ్జెక్ట్‌లను అందిస్తున్నారు. అందులో కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 150కు పైగా సింగిల్ మేజర్ సబ్జెక్ట్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మైనర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థికి దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశముండటంతో ఉన్నత విద్యామండలి నిర్ధారించిన మైనర్ సబ్జెక్ట్లే కాకుండా ఇంకా అధికంగా సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశముందని సీనియర్ అధ్యాపకులు చెబుతున్నారు. డ్యాన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి సబ్జెక్ట్‌లను సైతం మైనర్ సబ్జెక్ట్‌లుగా ఎంచుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ కోర్సులు ● విద్యార్థులు సమగ్ర విషయ పరిజ్ఞానం కోసం ఇంటర్ డిసిప్లినరీ కోర్సు, మల్టీ డిసిప్లినరీ కోర్సులు కూడా ఉంటాయి. ● ఇంటర్లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ బీఎస్సీ ఆనర్స్‌లో జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిషరీస్ సబ్జెక్టుల్లో ఒక దానిని మేజర్ సబ్టెక్టుగా ఎంపిక చేసుకొని పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, వంటి ఆర్ట్స్ గ్రూపుల్లోని సబ్జెక్ట్‌లను మైనర్ సబ్జెక్ట్‌లుగా ఎంపిక చేసుకోవచ్చు. ● అలాగే ఇంటర్లో ఎంపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ ఆనర్స్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంవ్యూటర్స్, స్టాటిస్టిక్స్, జియాలజీల్లో ఒక దానిని మేజర్ సబ్జెక్టుగా ఎంచుకుని మైనర్ సబ్జెక్టుగా డేటాసైన్స్, ఆర్జిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్స్ తదితర సబ్జెక్టుల్లో ఒక దానిని అభ్యసించవచ్చు. ● బీకాం ఆనర్స్లోనూ ఇదే రీతిలో సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకునే వెసులుబాటు నూతన విధానంలో డిగ్రీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి.. కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 120 వరకూ వివిధ కోర్సులను అందించే కళాశాలలు కొనసాగుతున్నాయి. అందులో 90 వరకూ కళాశాలలు సాధారణ డిగ్రీ కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనిమిది వరకూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా మిగిలినవి ప్రైవేట్, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. ఈ కళాశాలల్లో సుమారుగా 20 వేల వరకూ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులకు అవకాశముంది. నూతన విధానంతో ప్రయోజనాలు డిగ్రీ నూతన ఆనర్స్ విధానంలో చదివే విద్యార్థులకు విస్తృతమైన ప్రయోజనాలున్నాయి. ఆనర్స్ విత్ రీసెర్చ్ చేస్తే పోస్టు గ్రాడ్యుయేషన్ చేయకుండా నేరుగా పీహెచ్డీ చేసే అవకాశముంది. అలాగే నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు చేసిన విద్యార్థి పీజీ ఏడాదిలోనే పూర్తి చేయవచ్చు. డిగ్రీ చదివే విద్యార్థులు మేజర్ సబ్జెక్ట్‌కు సంబంధించి మొత్తం 21 పేపర్లు, మైనర్ సబ్జెక్ట్‌కు సంబంధించి ఆరు పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థి మొదటి ఏడాది తరువాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్, ద్వితీయ సంవత్సరం తర్వాత షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అనంతరం సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ వీ నారాయణరావు, విద్యావేత్త ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకూ గడువును పెంచారు. విద్యార్థులు ఏపీఎస్సీహెచ్ఈ.జీఓవీ.ఈన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లేదా దగ్గరలోని డిగ్రీ కళాశాలలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 15 నుంచి 19వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. అదే రోజు తరగతులు ప్రారంభం -
రోజుకో పదం.. అందుకో ఆంగ్ల పథం
రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు ప్రాధాన్యం పెరిగింది. గతంలో కేవలం ఉన్నత పాఠశాలల్లో సక్సెస్ స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిషు మీడియం ఉండగా, ఇప్పుడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లిషుపై విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసింది. ఈ ఏడాది కూడా అమలుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి పాఠశాలల్లో ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ ప్రారంభించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి రోజూ ఆంగ్ల పదాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. విద్యార్థులు ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’లో ఆంగ్ల పదాలు ఎంతవరకు నేర్చుకున్నారు? ఏ మేరకు పదాలను అవగాహన చేసుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం వలన విద్యార్థులకు రీడింగ్, రైటింగ్ స్కిల్స్ అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాలుగు దశల్లో.. ప్రతి రోజు పాఠశాల అసెంబ్లీలోనే ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ ప్రోగ్రామ్‌లో ఆరోజు చెప్పాల్సిన పదాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు. అనంతరం ఫస్ట్ పీరియడ్‌లో విద్యార్థులకు కేటాయించిన నోట్సులో పదాలను రాయిస్తున్నారు. ఆ పదాలతో సొంత వాక్యాలను తయారు చేసి వారితో చదివిస్తున్నారు. ఒకటి, రెండు తరగతులను ఒకటవ స్థాయి, 3,4,5 తరగతులను రెండు, 6,7,8 తరగతులను మూడు, 9,10 తరగతులను నాల్గవ స్థాయిగా విభజించారు. ప్రతి రోజూ కొన్ని పదాలను విద్యార్థులకు చెప్పి సాధన చేయించారు. తొలి దశలో పదాల ఉచ్ఛారణ, మౌఖిక అభ్యసనం, రెండవ దశలో స్పెల్లింగ్ గేమ్, మూడవ దశలో డిక్షనరీ సహకారంతో భాషాభాగాల గుర్తింపు, నాల్గవ దశలో సమాన అర్థాలను, వ్యతిరేక పదాలను కనుగొనడం నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పదాన్ని బోర్డుపై రాసి, విద్యార్థులతో రాయిస్తున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం 100 పేజీల పుస్తకాన్ని కేటాయించారు. ప్రతి 15రోజులకు ఒకసారి విద్యార్థులు సాధన చేసిన పదాలపై స్ఫెల్ బీ పేరుతో డిక్టేషన్ నిర్వహిస్తున్నారు. ఫలితాలను మదింపు చేసి విద్యార్థులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. 1,588 పాఠశాలల్లో.. లెర్న్ ఏ వర్డ్ ఏ డే కార్యక్రమం ఈ నెల 19 నుంచి ప్రారంభం కాగా, విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 1,275 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత, 235 ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,2 తరగతులు 32,658 మంది, 3,4,5 తరగతులు 65వేలు, 6,7 తరగతులు 44,561 మంది, 8,9,10 తరగతులు 61,795 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చాలా ప్రయోజనం ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ ప్రోగ్రామ్ విద్యార్థులకు చాలా ప్రయోజనకరం. ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఈ విధానం చక్కని మార్గం. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు డిక్షనరీలు కూడా అందజేశాం. ఆంగ్లభాషా పదాలపై పట్టు, మాట్లాడే నైపుణ్యం పెంపొందించుకునేందుకు డిక్షనరీల వినియోగం ఉపకరిస్తుంది. – జి.నాగమణి, ప్రాంతీయ సంయుక్త తనిఖీ అధికారి, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ పర్యవేక్షణలో భాగం చేశాం పాఠశాలల్లో విద్యార్థులు ప్రతి రోజూ ఒక ఆంగ్ల పదం నేర్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. ప్రతి పర్యవేక్షణ అధికారి ‘లెర్న్ ఎ వర్డ్ ఎ డే’ కార్యక్రమం అమలును తనిఖీ చేసేలా పర్యవేక్షణలో భాగం చేశాం. – ఎం.కమలకుమారి, డీఈవో, కోనసీమ జిల్లా -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
Andhra Pradesh : ట్రిపుల్ ఐటీ.. చదువుల దివిటీ
వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు చదువులో మేటిగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, నాణ్యమైన ఉత్తమ విద్యా బోధనను అందిస్తున్నాయి. సీట్లు ఎన్ని ఉన్నాయంటే.? ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీల్లో చదువుతోపాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీలలో 4000సీట్లతోపాటు ఈడబ్ల్యూసీ కోటాలో మరో 400 కలిపి మొత్తం 4400 సీట్లు ఉన్నాయి. ఎంత మంది దరఖాస్తు? ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు సోమవారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీలలో 4400సీట్లకు గానూ 38,490 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎలా కేటాయిస్తారు? వీటిని రోస్టర్ ప్రకారం భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక కేటగిరీ కింద స్పోర్ట్స్, స్కౌట్ అండ్‌గైడ్స్, సీఏపీ, ఎన్సీసీ దివ్యాంగుల కోటా కింద సీట్లు కేటాయిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్రార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉంటే 4శాతం డిప్రివేషన్ మార్కులు కలిపి మెరిట్ ఆధారంగా సీట్లను ఎంపిక చేస్తారు. ఫీజుల సంగతేంటీ? ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ కోర్సును చదివేందుకు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.40వేలు, తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.50వేల చొప్పున ఫీజు చెల్లించాలి. ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ కోటాలో చేరిన వారు ఏడాదికి రూ.1.50లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పదవ తరగతి రీవాల్యుయేషన్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి జూలై 5 లోపల మార్కుల మెమోను స్కాన్ చేసి యూనివర్సిటీ వైబ్సెట్ కు పంపించాలని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచు రెడ్డి తెలిపారు. అలాగే ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు జూన్ 30వ తేదీన యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వీరికి ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపస్‌లో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతాయని చెప్పారు. విద్యా బోధన ఇలా.. : ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌లో మొదటి రెండేళ్లు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సు, తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్ట్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. హస్టల్ నిబంధనలు ఇవి సెలవు రోజుల్లో తల్లిదండ్రులు వచ్చి పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలను ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ట్రిపుల్ ఐటీ ఆవరణాల్లోనే 30పడకల ఆసుపత్రి ఉండగా.. 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. రోజు వారీ కార్యక్రమాలు : ఉదయం అల్పాహారం, అనంతరం అసెంబుల్, 8 నుంచి 12గంటలవరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరాం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5గంటలవరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10గంటల వరకు స్టడీ అవర్స్, ఇది ట్రిపుల్ ఐటీలలో రోజువారీ జులై 13న అర్హుల జాబితా.. వచ్చేనెల జులై 13న ట్రిపుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అర్హుల జాబితాను విడుదల చేస్తారు. ఈనెల 30వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి కాల్ లెటర్లు, మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి 9వ తేదీవరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. జులై 21, 22వ తేదీలలో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో కౌన్సిలింగ్ పక్రియ నిర్వహిస్తారు. ఏ క్యాంపస్‌లో సీటు వస్తే అక్కడే చదవాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి.. : పదో తరగతి హాల్ టిక్కెట్, టెన్త్ మార్కుల జాబితా, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, అభ్యర్థి, అతని తండ్రి లేదా తల్లివి రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు రుణం అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఇడెంటిటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలి. ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు ట్రిపుల్ ఐటీ సీట్లు ప్రతిభ ఆధారంగానే కేటాయిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతోనే ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటు లభిస్తే ఆరేళ్ల సమీకృత సాంకేతిక ఉచిత విద్యనభ్యసించి ఇంజినీరింగ్ డిగ్రీతో బయటకు వెళ్లవచ్చు. ఈ ఏడాది అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు కేటాయిస్తాం. – కె.చెంచురెడ్డి(ఆర్జీయూకేటీ చాన్సులర్), ఇడుపులపాయ -
ఖమ్మం : మాకు టీచర్లు కావలెను
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదంతా బాగానే ఉన్నా ఉపాధ్యాయుల నియామకంలో మాత్రం అడుగు పడడం లేదు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడగా.. ఈ ఏడాది సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కానీ ఉపాధ్యాయులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బోధన చురుగ్గా సాగడం లేదని తెలుస్తోంది. విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి ఉపాధ్యాయులను నియమించడమా లేదంటే విద్యావాలంటర్లను ఎంపిక చేయడం జరిగితే విద్యార్థులకు మేలు జరిగేది. భారీగానే ఖాళీలు జిల్లాలోని 21 మండలాల పరిధిలో 1216 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింట్లో 5,759మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ 974పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఇందులో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు 515మంది, ఎస్ఏలు 323మంది, ఇతర ఉపాధ్యాయులు 136మంది లేక బోధన కుంటుపడుతోంది. పాఠశాలల నిర్వహణలో కీలకమైన హెచ్ఎంలతో పాటు గణితం, బయాలజీ, సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తోంది. చేదు అనుభవాలు ఉన్నా.. కీలకమైన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఏటా సర్దుపాటు ప్రక్రియ చేపడుతున్నారు. గత ఏడాది మొదట్లో సర్దుబాటు చేయకుండా విద్యా సంవత్సరం సగంలో చేపట్టడంతో బోధన అంతంత మాత్రంగానే సాగింది. ఫలితంగా ఎస్సెస్సీలో మెరుగైన ఫలితాలు నమోదు కాలేదు. అయినప్పటికీ ఈసారి కూడా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఇలా.. గ్రేడ్–2 హెచ్ఎం 81 ఎస్ఏ సోషల్ 166 ఎస్ఏ బయాలజీ 110 ఎస్ఏ మ్యాథ్స్ 59 ఎస్ఏ తెలుగు 44 ఎస్ఏ ఇంగ్లీష్ 26 ఎస్ఏ హిందీ 24 ఎస్ఏ ఫిజిక్స్ 05 ఎస్జీటీలు 323 ఇతర ఉపాధ్యాయులు 136 మొత్తం 974 కీలక సబ్జెక్టులకు టీచర్లే లేరు.. కీలక సబ్జెక్టులైన గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం, అధికార యంత్రాంగం భర్తీ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో విద్యావలంటీర్ల ద్వారా కొద్దిలో కొద్దిగా బోధన సాగించగా.. వారిని సైతం మూడేళ్ల క్రితం తొలగించారు. ఆ తర్వాత కొత్త నియామకాలు చేపట్టకపోవటం, విద్యావలంటీర్ల రెన్యువల్ లేకపోవటంతో గతేడాది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ ఏడాది అటు వీవీలను నియమించకపోగా, సర్దుబాటుపై కూడా దృష్టి సారించకపోవడం గమనార్హం. రెండు రోజుల్లో సర్దుబాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు సర్దుబాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తాం. – సోమశేఖరశర్మ, జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యాయుల కొరత తీర్చాలి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాల్సిన అవసరముంది. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామని చెబుతున్నా వంద శాతం పనులు కాలేదు. మరోపక్క ఉపాధ్యాయులు లేనందున నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. – వెంకటేష్, జిల్లా కార్యదర్శి, పీడీఎస్‌యూ -
బీఈడీలో బ్లాక్ టీచింగ్.. చీటింగ్!
కర్నూలు సిటీ: ఛాత్రోపాధ్యాయుల బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై వేటు పడకుండా కర్నూలు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కోర్సు అభ్యసించే ఛాత్రోపాధ్యాయులను థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ సమయంలో బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)కు పంపిస్తారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇంటర్న్‌షిప్‌కు స్కూళ్లను కేటాయించాలని కోరుతారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలు సైతం ఈ మేరకు డీఈఓకు విన్నవించుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని కొన్ని బీఈడీ కాలేజీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 2020–22 బ్యాచ్‌కి చెందిన ఛాత్రోపాధ్యాయులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్) చేసినట్లు చూపించాయి. పలు ఫిర్యాదులు రావడంతో ఎన్ని కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో డీఈఓకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ లేఖకు ఈ ఏడాది మార్చి 2వ తేదిన స్పందిస్తూ.. 11 కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేశారనే ఆరోపణలు వచ్చిన హెచ్‌ఎంలపై డీఈఓ చర్యలు తీసుకోకుండా 20 రోజుల్లోనే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు డీఈఓ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. అనుమతులకు అక్రమ వసూళ్లు! రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 2020–22 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 20 బీఈడీ కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో 11 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, మరో 11 కాలేజీలకు ఇవ్వలేదని ఆర్యూ అధికారులకు డీఈఓ తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్లాక్ టీచింగ్ కోసం అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు కర్నూలులో బుధవారపేటలోని ఓ హోటల్లో బేరం కుదుర్చుకుని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూళ్లు వసూలు చేయడంలో డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా కాలేజీల యాజమాన్యాలు డీఈఓపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. చర్యలు తీసుకుంటాం 2020–22 విద్యా సంవత్సరానికి 22 కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాలని రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కోరారు. ఇందులో 11 కాలేజీలకు మాత్రమే మొదట ఇచ్చాం. మార్చి నెలలో 11 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని యూనివర్సిటీ అధికారులకు తెలిపిన మాట వాస్తవమే. అయితే యూనివర్సిటీ అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటే కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన హెచ్‌ఎంలపై విచారించి చర్యలు తీసుకుంటాం. – రంగారెడ్డి, డీఈఓ -
AP Education : నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడంతో పాటు సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధించేలా, పోటీతత్వాన్ని తట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను 2023–24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఆనర్స్ డిగ్రీ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విద్యా నిపుణులు అంటున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రవేశాల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని 91 డిగ్రీ కళాశాలల్లో ఆనర్స్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనకు.. జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో మార్పులు తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ప్రధానంగా డిగ్రీ ఆనర్స్ కోర్సులో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న ఒక సబ్జెక్టును ప్రధాన సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని నాలుగేళ్లపాటు చదవవచ్చు. దీని ద్వారా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన పెరుగుతుంది. అలాగే మరో మైనర్ సబ్జెక్టు, రెండు లాంగ్వేజ్ పేపర్లు కూడా చదవాలి. సమగ్ర విషయ పరిజ్ఞానం కోసం ఇంటర్ డిసిప్లినరీ కోర్సు, మల్టీ డిసిప్లినరీ కోర్సులు కూడా ఉంటాయి. ఉదాహరణకు.. ఇంటర్లో బైపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ బీఎస్సీ ఆనర్స్‌లో జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిషరీస్ సబ్జెక్టుల్లో ఒక దానిని మేజర్ సబ్జెక్టుగా, జియాలజీ, పాలిటిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి ఆర్ట్స్ గ్రూపుల్లోని సబ్జెక్టులను కూడా మైనర్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు. ఇంటర్లో ఎంపీసీ చదివిన విద్యార్థి డిగ్రీ ఆనర్స్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, జియాలజీల్లో ఒక దానిని మేజర్ సబ్జెక్టుగా ఎంచుకుని మైనర్ సబ్జెక్టుగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, యానిమేషన్స్ తదితర సబ్జెక్టుల్లో ఒక దానిని అభ్యసించవచ్చు. ఏ సంవత్సరంలో మానేసినా సర్టిఫికెట్ గతంలో విద్యార్థి డిగ్రీ చదువు మధ్యలో ఆపి వేస్తే అతడికి ఎటువంటి సర్టిఫికెట్ కూడా వచ్చేది కాదు. అయితే నూతన విధానంలో విద్యార్థి అనివార్య కారణాల వల్ల ఏ సంవత్సరంలో అయినా చదువు మానేసినా సర్టిఫికెట్ జారీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్‌లో చేరి మొదటి ఏడాదిలో సబ్జెక్టులన్నీ పూర్తి చేసి చదువు మానివేస్తే అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, ద్వితీయ సంవత్సరంలో చదువు మానివేస్తే అండర్ గ్రాడ్యుయేట్ డిప్లమా సర్టిఫికెట్, తృతీయ సంవత్సరంలో మానివేస్తే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. నాలుగేళ్లు పూర్తిచేసిన వారికి డిగ్రీ మేజర్ సర్టిఫికెట్ ఆనర్స్ పట్టా అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో.. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు 51 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో 12,050 మంది బీఏ, 9,856 మంది బీకాం, 27,131 మంది బీఎస్సీ కోర్సులు పూర్తిచేశారు. ఏలూరు జిల్లాలో 40 డిగ్రీ కళాశాలలు ఉండగా గతేడాది 1,119 మంది బీఏ, 3,687 మంది బీకాం, 7,659 మంది బీఎస్సీ కోర్సులు చేశారు. ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు గడువును వచ్చేనెల 5వ తేదీ వరకు పెంచారు. విద్యార్థులు ఏపీఎస్సీహెచ్ఈ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లేదా తమ దగ్గరలోని డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 7 నుంచి 12వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూలై 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. సాధారణ డిగ్రీ కోర్సులకు రూ.3 వేల వరకూ, కంప్యూటర్ కోర్సులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు ఉంటుంది. అర్హులైన పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సాయం అందిస్తుంది. చదివిన గంటలను క్రెడిట్లుగా.. విద్యార్థులు మేజర్ సబ్జెక్టుకు సంబంధించి 21 పేపర్లు, మైనర్ సబ్జెక్టుకు సంబంధించి 6 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో విద్యార్థి కళాశాలలో చదివిన గంటలను క్రెడిట్లుగా పరిగణిస్తారు. విద్యార్థి మొదటి సంవత్సరం తర్వాత కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు, ద్వితీయ సంవత్సరం తర్వాత షార్ట్‌టర్మ్ ఇంటర్న్‌షిప్ అనంతరం సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. – కేఏ రామరాజు, ప్రిన్సిపాల్, సీఆర్ఆర్ అటానమస్ కళాశాల, ఏలూరు ప్రయోజనాలెన్నో.. డిగ్రీ నూతన ఆనర్స్ విధానంలో చదివే విద్యార్థులకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు ఆనర్స్ విత్ రీసెర్చ్ చేస్తే పోస్టు గ్రాడ్యుయేషన్ చేయకుండా నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు చేసిన విద్యార్థి పోస్టు గ్రాడ్యుయేషన్ చదువును ఏడాదిలోనే పూర్తి చేయవచ్చు. డిగ్రీ కోర్సును మధ్యలో ఆపివేసినా పూర్తిచేసిన విద్యకు సంబంధించి సర్టిఫికెట్ ఇస్తారు. – ప్రొఫెసర్ కేఎస్ రమేష్, డీన్, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ -
Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు
సాక్షి, అమరావతి: సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీ ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఈ కాలేజీ పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తించింది. 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీని 2001-02లో నిర్మించగా 2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో మెడికల్ ఆడ్మిషన్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ప్రస్తుతం ఈ కాలేజీలో 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఉన్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ఆస్పత్రికి రోజూ ఔట్ పేషేంట్లు వస్తారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ప్రతీ ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని నేషనల్ మెడికల్ కమిషన్ వివిధ మెడికల్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ తనిఖీల్లో భాగంగా కాలేజీల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా? విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా? కాలేజీల్లో ఉన్న టీచింగ్ ఆస్పత్రులకు పేషేంట్లు వస్తున్నారా? అన్న విషయాలను నేషనల్ మెడికల్ కమిషన్ టీం పరిశీలించింది. సుజనాకు సంబంధించిన ఈ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తున్నట్టు తేలింది. దీంతో MCI ఈ కాలేజీకి నోటీసులిచ్చినట్టు తెలిసింది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కాలేజీ గుర్తింపు రద్దు చేసినట్టు సమాచారం. చదవండి: కీలక పరిణామం.. భారీగా ‘మార్గదర్శి’ చరాస్తుల జప్తు!