Latest News
-
టీఆర్ఎస్కు విజయరామారావు రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పార్టీకి మాజీ మంత్రి విజయరామారావు రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌తో విజయరామారావు సమావేశమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు విజయరామారావు రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
వరకట్నం హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ముంబై: అదనపు కట్నం అడిగినంత తీసుకులేదని తన భార్యను చంపి బావిలో పడవేసిన కేసులో భర్తతోపాటు అతడి కుటుంబసభ్యులు మరో ముగ్గురికి బాంబే హైకోర్టు జీవితఖైదు విధించింది. కొత్తాపూర్ జిల్లా గంగానగర్ లోని హుపరీ వద్ద 2001లో లక్ష్మి అనే మహిళను అనిల్ వివాహం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె ప్రసవం సమయంలో ఖర్చులకుగాను రూ.25 వేలు, బంగారం నగలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. ఆమె పుట్టింటి నుంచి అడిగిన మేర తీసుకురాకపోవడంతో వేధించడం మొదలుపెట్టారు. కాగా, 2006 అక్టోబర్ 14న ప్రమాదవశాత్తు బావిలో పడి లక్ష్మి మృతిచెందిందని ఆమె తల్లికి అనిల్ ఫోన్ చేసి చెప్పాడు. కాగా పోస్ట్‌మార్టం నివేదికలో ఆమెను కర్రతో మోది చంపినట్లు వెల్లడైంది. లక్ష్మి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. హైకోర్టులో పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తులు పి.డి.కోడె, విజయ తహిల్మ్రణి తమ తీర్పును వెల్లడిస్తూ నిందితులపై ఆరోపణలు రుజువైనందున మృతుడి భర్త అనిల్‌తోపాటు అతడి సోదరి, తల్లిదండ్రులను దోషులుగా పేర్కొంటూ వారికి యావజ్జీవ కారాగారశిక్షను ఖరారుచేశారు. -
సిఎం, బొత్స క్షమాపణలు చెప్పాలి: శంకర రావు
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి శంకర రావు డిమాండ్ చేశారు. అందరిని సంప్రదించిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం మంచిదికాదని హితబోధ చేశారు. తెలంగాణపై కేంద్ర మంత్రి చిరంజీవి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తెలంగాణకు సీమాంధ్రనేతలు అడ్డుపడొద్దని కోరారు. -
‘తెలంగాణ ఏర్పాటు కోసమే ఆంటోని కమిటీ’
ఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు కోసమే ఆంటోని కమిటీని నియమించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఆంటోని కమిటీ వేసారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. బుధవారం మీడియాకు వివరణ ఇచ్చిన ఆయన తెలంగాణకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు. కేంద్రం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓ కమిటీని ఏర్పాటు చేసారన్నారు. కాగా, పార్టీ నేతల్లో అపోహలు నెలకొన్నందున వాటిని తొలగించేందుకు ఆంటోని కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన ప్రక్రియపై నెలకొన్న అపోహలపై ఆయన బుధవారం ఆచితూచి స్పందించారు. విభజన ప్రక్రియ ఆగిందా.. లేదా అనేది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ను అడిగితే తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ ఎంపీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహిరిస్తే టిక్కెట్టు ఇవ్వనన్న చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలపై ఏం చర్యలు తీసుకుంటారని పొన్నం ప్రశ్నించారు. -
రేపు సోనియాను కలవనున్న విజయశాంతి
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ సభ్యురాలు విజయశాంతి ఢిల్లీకి చేరుకున్నారు. ఆమె రేపు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకునే అవకాశం ఉంది. గత నెల 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయశాంతి అనేకసార్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్నాళ్లుగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్లో చేరిన కొత్తల్లో ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లోపల ఒక ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ప్రధానమైన సమావేశాలన్నింటిలోను కేసీఆర్ పక్కనే ఆమెకు స్థానం కల్పించేవారు. కానీ, ఇటీవలి కాలంలో పార్టీకి, విజయశాంతికి మధ్య దూరం బాగా పెరుగిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ భవన్లో భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నా ఆమెమాత్రం దూరంగానే ఉండిపోయారు. ఈ నేపధ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకోసమే ఆమె సోనియా గాంధీని కలుస్తున్నారని తెలుస్తోంది. -
‘సీమాంధ్రలో ఆందోళనకు కాంగ్రెస్‌దే బాధ్యత’
ఢిల్లీ: సీమాంధ్రలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలకు పాలకపక్షం కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని ఆ ప్రాంత టీడీపీ ఎంపీలు విమర్శించారు. సరైన సంప్రదింపులు జరపకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తారని వారు మండిపడ్డారు. హడావిడిగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయ లబ్ది కోసమేనని ఎంపీలు పేర్కొన్నారు. ఆంటోని కమిటీతో తెలుగు ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని సృష్టం చేశారు. రాజధాని, నదీ జలాలు, ఉద్యోగుల భద్రతకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. -
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు బాబు కృషిచేస్తానన్నారు’
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తెలిపారు. చంద్రబాబుతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీకృష్ణ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సీమాంధ్ర ప్రజల రక్షణ కోసం మాట్లాడతానని చంద్రబాబు హామి ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక వేదికలపై చర్చించి తీసుకున్న నిర్ణయమని , ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటుకు మాటను ఇచ్చామని, ఆ మాటను వెనక్కు తీసుకోలేనని చంద్రబాబు చెప్పినట్లు మురళీకృష్ణ తెలిపారు. -
విభజన ఆగిందనడం సరికాదు: పొంగులేటి
రాష్ర్ట విభజన ప్రక్రియ ఆగిపోయింద ని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు చెప్పటం సరికాదని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. ‘వారికి భిన్నాభిప్రాయాలు ఉంటే అధిష్టానంతో చెప్పుకోవాలి తప్ప తెలంగాణ ప్రజల్లో అపోహలు కలిగేలా మాట్లాడటం మంచిదికాదు’ అని బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీని చరిత్ర క్షమించదన్న మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించే ందుకు కాలనీల్లో సద్భావనా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. -
విభజనలో సమన్యాయమేదీ?: భూమన
రాష్ట్ర విభజన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాలకు సమ న్యాయం పాటించడంలో విఫలమైందని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం తిరుపతిలో 1500 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. దాదాపు 50 కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీ తిరుపతి పురవీధుల గుండా వెళ్లింది. ర్యాలీకి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సోనియా గాంధీ రెండుగా చీల్చి వేశారన్నారు. సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు ఊతమిస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. విభజన జరిగిన వెంటనే ముందుగా స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తు చేశారు. తరువాత రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చూసిన టీడీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని చెప్పారు. -
సోనియాగాంధీకి కృతజ్ఞతగా బహిరంగ సభ
నిజామాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సోనియాగాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ అవిర్భావం జరుగుతున్నట్లు మాజీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదించబడేంత వరకూ ఓపిక అవసరమని డీఎస్ సూచించారు. తెలంగాణ ఉద్యోగులు వాచ్‌డాగ్‌లా పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీ నిద్రలో కూడా తెలంగాణ గురించే ఆలోచించి ఉంటారని డీఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో, దేశానికి రెండో రాజధాని గానో చేసే ఆలోచన యుపిఏకు లేదని చెప్పారు. రాష్ట్ర విభజనపై సంప్రదించలేదని సీమాంధ్ర నేతలు, ప్రజలు అనడం సరికాదన్నారు. -
బీసీలకు అన్యాయం చేస్తోన్న కేంద్రం: ఆర్. కృష్ణయ్య
దేశంలోని 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సమర్థులైన బీసీ నేతలున్నా వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారిందని, ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 30 మంది ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క బీసీ కూడా ఆ జాబితాలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని ఖచ్చితంగా బీసీలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన జరపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగరమేశ్, ఎస్. దుర్గయ్యగౌడ్, కె. బాలరాజ్, నీలవెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, పెరిక సురేశ్, అశోక్‌గౌడ్, నర్సింహనాయక్, జి. అంజి, ఎ.పాండు, పి.సతీశ్, జి.భాస్కర్, బి.సదానందం తదితరులు పాల్గొన్నారు. -
సమ్మెకు దిగితే ఆర్థిక నష్టం:బొత్స
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే భారీ ఆర్థిక నష్టంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సమ్మెకు దిగి..ఆర్టీసీకి మరింత నష్టం తీసుకురావొద్దని ఆయన ఆర్టీసీ కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేశారు. 23 జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పెళ్లిళ్లు సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతారని ఆయన అభిప్రాయపడ్డారు. దయచేసి కార్మికులు సమ్మెను ఉపసంహ రించుకోవాలని బొత్స కోరారు. -
కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి
కాకినాడ: సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. వైఎస్ఆర్ సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఏపీఎన్జీఓ సంఘం నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర అంతటా గత 8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. -
నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను నిస్సహాయుడినని, ఎవరైనా ఏమైనా అనుకోండని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కావూరి స్పందన తీరు ఈ విధంగా ఉంది. తెలంగాణ ప్రకటన తర్వాత తాను మాట్లాడ లేదన్న అపవాదు ఉంటే ఉండనీయండి అని అన్నారు. తనకు స్పష్టత ఉందని, తనకు విశ్వసనీయత ఉందని కావూరి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన తరువాత కావూరి ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరులోని ఆయన నివాసంపై దాడి కూడా చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తరువాత కావూరి సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో చల్లబడిపోయినట్లు విమర్శ ఉంది. -
'పార్టీ నేతల్లో అపోహలు తొలగించేందుకు కమిటీ'
ఢిల్లీ:పార్టీ నేతల్లో ఏర్పడిన అపోహలను తొలగించేందుకు ఆంటోని కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన ప్రక్రియపై నెలకొన్న అపోహలపై ఆయన బుధవారం ఆచితూచి స్పందించారు. విభజన ప్రక్రియ ఆగిందా.. లేదా అనేది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ను అడిగితే తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ ఎంపీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహిరిస్తే టిక్కెట్టు ఇవ్వనన్న చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలపై ఏం చర్యలు తీసుకుంటారని పొన్నం ప్రశ్నించారు. -
ఫిక్సింగ్ నివారణకు రెండంచెల వ్యూహం: ద్రవిడ్
మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ క్రిమినల్ నేరమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కఠినమైన చట్టాలతోనే దీన్ని నివారించగలమని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు రెండంచెల వ్యూహాన్ని ద్రవిడ్ సూచించాడు. వర్థమాన క్రికెటర్లకు జూనియర్ స్థాయిలో అవగాహన కల్పించాలని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీంతో పాటు చట్టాన్ని కఠినతరం చేయాలని అన్నాడు. ఈ చర్యలు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పాడు. ఐపీఎల్ ఆరో ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే వీరు నేరం చేశారా, లేదా అనే దానిపై తానేమీ మాట్లాడబోనని ద్రవిడ్ అన్నాడు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు అందరికీ ఉందన్నాడు. క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు పోలీసుల దర్యాప్తుకు క్రికెట్ పాలకులు సహకరించాలని సూచించాడు. -
ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు
అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. మొదటి రౌండ్లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో రౌండ్లో సునాయాస విజయం నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు శ్రమించి గెలుపొందగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గాయంతో వైదొలగడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రస్తుతం బరిలో మిగిలిన ఈ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కావడం విశేషం. గ్వాంగ్జూ (చైనా): మూడు విజయాలు... రెండు పరాజయాలు... మెరుగైన ప్రదర్శన చేస్తారనుకున్న డబుల్స్‌లో నిరాశ... పతకంపై ఆశల రేకెత్తిస్తున్న సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు... వెరసి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు ఇదీ భారత ప్రదర్శన. ఎలాంటి తడబాటు లేకుండా ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత స్టార్ సైనా నెహ్వాల్... తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సంయమనంతో ఆడిన తెలుగు అమ్మాయి పి.వి.సింధు... గాయంతో ప్రత్యర్థి మధ్యలోనే చేతులెత్తేయడంతో పారుపల్లి కశ్యప్ విజయాలు నమోదు చేసి ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 21-5, 21-4తో ఓల్గా గొలొవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. స్మాష్‌లు, డ్రాప్ షాట్లు, వైవిధ్యభరిత సర్వీస్‌లు... ఇలా అన్ని విభాగాల్లో సైనా తన ఆటతీరును పరీక్షించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓల్గా నెగ్గిన తొమ్మిది పాయింట్లలో ఎక్కువగా సైనా చేసిన అనవసర తప్పిదాలతో వచ్చినవే కావడం గమనార్హం. తొలి గేమ్‌లో స్కోరు 8-5 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా 13 పాయింట్లు నెగ్గి 10 నిమిషాల్లో గేమ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం 13 నిమిషాలపాటు జరిగిన రెండో గేమ్‌లో సైనా రెండుసార్లు వరుసగా ఏడేసి పాయింట్లను సాధించింది. కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతోన్న సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు 42 స్మాష్‌లు సంధించడం విశేషం. జయరామ్ పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ ముందంజ వేయగా... అజయ్ జయరామ్ ఓడిపోయాడు. పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ తొలి గేమ్‌లో 14-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కౌకుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కశ్యప్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ను ఓడించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్ నిరాశపరిచాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ పాబ్లీ ఎబియన్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 9-21, 17-21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట 15-21, 21-13, 17-21తో మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్‌లోని డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. సింగిల్స్‌లో సైనా, సింధు, కశ్యప్ మిగిలి ఉన్నారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్; రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు; ఆరో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో కశ్యప్ తలపడతారు. తమ ప్రిక్వార్టర్ ఫైనల్స్ ప్రత్యర్థులతో ముఖాముఖి రికార్డులో సైనా 5-0తో ఆధిక్యంలో ఉండగా... సింధు 0-1తో; కశ్యప్ 0-2తో వెనుకబడి ఉన్నారు. -
పునరాలోచనలో కాంగ్రెస్: ఎంపి అనంత
ఢిల్లీ: సీమాంధ్ర ప్రజల నిరసనలతో రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడిందని ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన సాక్షితో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతిని చూసే కాంగ్రెస్ హైలెవల్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కమిటీ సంప్రదింపులు అయ్యేంతవరకు విభజన ప్రక్రియ ఆగుతుందని చెప్పారు. హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులు, సీమాంధ్ర ప్రజల భద్రతే తమ ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. కమిటీ ఎదుట తమ వాదనలు వినిపిస్తామని వెంకట్రామి రెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలపడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో బంద్‌లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టడం - దిష్టిబొమ్మల దగ్ధం..... ఉధృత రూపంలో ఆందోళన కొనసాగుతోంది. ఎపి ఎన్జీఓలు కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడంతో వారు సమ్మె హెచ్చరిక చేశారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ కార్యదర్శికి నోటీస్ కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఇళ్లను కూడా ముట్టడించారు. కొన్ని చోట్ల వారిని నిలదీశారు. దీంతో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు మూడు రోజుల నుంచి కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిసి సమైక్యవాదం వినిపించారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఈ నేపధ్యంలో సీమాంధ్రుల సమస్యలు వినేందుకు నలుగురు సభ్యులతో కాంగ్రెస్ హైలెవల్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సీమాంధ్రులతో సంప్రదింపులు జరిపేంతవరకు రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోతుందని వెంకటరామిరెడ్డి చెబుతున్నారు. -
ఉల్లంఘిస్తే..కట్టాల్సిందే!
హైదరాబాద్: మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే..అంతకు మించి జరిమానా కట్టాల్సిందే అంటున్నారు పోలీస్ బాస్‌లు. ఇంకా సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్ రాయుళ్లు భారీగా జరిమానా చెల్లించాల్సిందేనంటూ తాజాగా పోలీస్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి బుధవారం సమావేశమైన పోలీస్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్., ఓవరలోడ్, రాంగ్ పార్కింగ్‌లకు రూ.1000లు చెల్లించాలంటూ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పమస్య తీవ్రం కావడంతో పాదచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌పై రాజీ లేదు: కోదండరామ్
హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. జెఎసి విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 10 నుంచి సద్భావన యాత్ర చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌తో సహా పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ డిమాండ్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. రేపటి మంత్రి మండలి సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇటువంటి కీలక తరుణంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు మౌనంగా ఉండడం సరికాదన్నారు. వస్తున్న తెలంగాణను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే, మరికొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొడదాం - తెలంగాణను కాపాడుకుందాం అని పిలుపు ఇచ్చారు. డిజీపీ దినేష్‌రెడ్డిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన వారిని నియమించాలని ఆయన కోరారు. దినేష్‌రెడ్డి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
పార్లమెంటు రేపటికి వాయిదా
అత్యంత కష్టమ్మీద కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. గత నెలలో జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2011లో సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లును ఆహార శాఖమంత్రి కేవీ థామస్ ముందుగా ఉపసంహరించుకుని, ఆ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల హక్కుల్లో జోక్యం విషయం లేదని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదని థామస్ తెలిపారు. ఆహారాన్ని ఒక హక్కుగా ఇవ్వడానికే ఈ బిల్లు ఉద్దేశించామన్నారు. అయితే ఆహార భద్రత కంటే సరిహద్దు భద్రత మరింత ముఖ్యమని లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. జమ్ము కాశ్మీర్లో సైనికుల హత్యపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన విధానాన్ని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆహార భద్రత బిల్లు రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందంటూ అన్నాడీఎంకే సభ్యుడు ఎ.తంబిదురై దాన్ని వ్యతిరేకించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బిల్లుకు కొన్ని సవరణలు చేయాలని యూపీఏ మాజీ మిత్రపక్షం డీఎంకేకు చెందిన టీఆర్ బాలు అన్నారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. ఆహార భద్రత బిల్లుపై చర్చకు ఆరు గంటలు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. గురువారం లేదా వచ్చే సోమవారం చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఉభయ సభల్లో కాశ్మీర్ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. దీనిపై రక్షణ మంత్రి ఆంటోనీ ఇచ్చిన సమాధానం పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం రెండోసారి సమావేశమైన తర్వాత ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో అటు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు. -
అవనిగడ్డ ఉపఎన్నిక అనివార్యం
అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమయింది. నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది. చివరకు టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. 21న అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో చూసిన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. -
'విభజన పాపం మూమ్మాటికీ టీడీపీదే'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి టీడీపీనే కారణమని వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు పొలిట్‌బ్యూరోలో అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఆ లేఖ ఇచ్చినపుడు టీడీపీ నేతలు నిద్రపోయారని జోగి రమేష్ ప్రశ్నించారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారనిఆయన అభిప్రాయపడ్డారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా గురువారం ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకూ రోడ్డుపైనే వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జోగి రమేష్ ప్రకటించారు. -
బ్యాంకింగ్ రంగానికి 10వేల కోట్ల నష్టం
రాష్ట్రాన్ని విభజించేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిన ఒక్క మాట విలువ ఎంతో తెలుసా... అక్షరాలా పదివేల కోట్లు!! అది కూడా కేవలం ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే! తెలంగాణ ఏర్పాటుకు తాము సుముఖమేనంటూ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జూలై 30వ తేదీన ఢిల్లీలో ప్రకటించారు. తత్ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులు, చివకు ఆస్పత్రులు కూడా సరిగా పనిచేయడంలేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడం వల్ల ఆ రంగానికి దాదాపు పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టడానికి కూడా కుదరకపోవడంతో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగానే ఉంటున్నాయి. దాదాపుగా బ్యాంకులన్నీ కలిసి ఈ పదమూడు జిల్లాల్లో మూడువేల ఏటీఎంలు, నాలుగువేల శాఖలు కలిగి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే ఆరువేల శాఖలలో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏటీఎం సేవలకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతాపరమైన కారణాల వల్ల ఏటీఎంలలో డబ్బులు పెట్టలేకపోతున్నామని, కానీ సాధ్యమైన చోటల్లా పెడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వినియోగదారుల సౌకర్యం కోసం తెల్లవారుజామునే డబ్బులు పెడుతున్నట్లు చెప్పారు. చాలా నగరాల్లో ఉద్యోగులు తమ జీతం డబ్బులు తీసుకోడానికి ఏటీఎంలే ఆధారం కాబట్టి వాటివద్ద పొడవాటి క్యూలు ఉంటున్నాయి. అయితే, తమ బ్యాంకు శాఖలకు దగ్గరగా ఉండే ఏటీఎంలలో అయితే డబ్బులు ఉంటున్నాయని ఎస్బీఐ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల్లో స్టేట్ బ్యాంకుకు దాదాపు 1200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో 300 లావాదేవీలు జరుగుతాయని, సుమారుగా 6-7 లక్షల రూపాయల వరకు డ్రా చేసుకుంటారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ఆయన చెప్పారు. -
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు
భూప్రకంపనలు నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులను వణికించాయి. స్వల్పంగా భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు జిల్లా కొండాపురం, కలిగిరిలో బుధవారరం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల, బలిజిపాలెం గ్రామాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. నివాసాల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. మళ్లీ భూమి కంపిస్తుందేమోన్న భయంతో ఇళ్ల బయటే ఉన్నారు.