Latest News
-
పోలీసులు - మావోయిస్టుల ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరువర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయ్యింది. ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ : సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంతానికి వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇది మరింత కుంగదీస్తోంది. కోస్తా, రాయలసీమకు వెళ్లాల్సిన బస్సులను ఉద్యమం కారణంగా నిలిపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ 710 బస్సులు నడస్తుండగా గత అయిదు రోజులుగా సర్వీసులన్నీ రద్దయ్యాయి. కాగా శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు, వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25 శాతం బస్సులను అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్దరించారు. కాగా సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు సోమవారం కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. విజయనగరం, పార్వతీపురం డిపోల్లోని బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్లు, ఉద్యోగుల మానవహారం నిర్వహించారు. రాయగడ, కోరాపుట్, జైపూర్ సహా ఒడిశాకు సర్వీసులు నడవటం లేదు. మరోవైపు పార్వతిపురం రైల్వేస్టేషన్లో ఈరోజు ఉదయం సమైక్యవాదులు రైల్‌రోకో చేపట్టారు. దుర్గ్-విశాఖ ప్యాసింజర్ రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మద్దిలపాలెం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలకు దిగారు. బంద్ కారణంగా నేడు ఏయూలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. -
విశాఖ విమానాశ్రయం చేరుకున్న షర్మిల
విశాఖ : సుదీర్ఘ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగించుకున్న మహానేత రాజశేఖరరెడ్డి తనయ షర్మిల నేడు హైదరాబాద్ రానున్నారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిల విశాఖపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి నేరుగా చంచల్‌గూడ జైలుకు చేరుకుంటారు. తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆమె ములాఖత్ అవుతారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజల కన్నీళ్లు, కష్టాలను షర్మిల నేరుగా జగన్మోహన్రెడ్డికి వివరించనున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా 3112 కిలో మీటర్ల పాదయాత్రతో రికార్డు సృష్టించిన షర్మిలకు శంషాబాద్‌లో పార్టీ శ్రేణులు, వైఎస్ కుటుంబ అభిమానులు భారీ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ నుంచి కాటేదాన్, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు ఫ్లైఓవర్ కింద నుంచి కంచన్‌బాగ్, ఒవైసీ ఆస్పత్రి, ఐఎస్ సదన్ మీదుగా చంచల్‌గూడకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. -
సమైక్యాంధ్ర కోసం మరొకరు ఆత్మహత్య
ఏలూరు : రాష్ట్ర విభజన ప్రకటనతో ఆంధ్రా, రాయలసీమలో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరొకరు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రాణాలు తీసుకున్నారు. నిడదవోలు మండలం ఉంకరమిల్లిలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా బుట్టాయగూడెంలో ఆందోళనకారులు నెహ్రూ విగ్రహానికి నిప్పు పెట్టారు. కాగా రాష్ట్ర విభజన పరిణామాలు సీమాంధ్రుల ఉసురు తీస్తున్నాయి. విభజన వద్దంటూ సీమాంధ్రుల ఆందోళనలు టీవీల్లో తిలకిస్తూ ఉద్వేగానికి గురై ఆదివారం నాటి పరిణామాల్లో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ కొనసాగుతోంది. -
వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న విభజన సెగలు
కడప : వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర విభజన సెగలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదల్లేదు. అన్ని డిపోల్లోనూ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వంటావార్పు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో 72 గంటల పాటు జిల్లా బంద్ కొనసాగుతోంది. విద్యాసంస్థలు, ఆర్టీసీ కార్మికులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఎమ్మెల్యే సీకే బాబు నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి మూడు రోజుల పాటు పెన్‌డౌన్ చేశారు. సమైక్యాంధ్ర జేఏసీ నెల్లూరు జిల్లాలో నేడు, రేపు ప్రభుత్వ కార్యాలయలకు బంద్ పాటిస్తున్నాయి. కర్నూలులో నేటి నుంచి మంత్రి టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరగనున్నాయి. కాగా నంద్యాలలో భూమా నాగిరెడ్డి నిరసన దీక్షకు దిగారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వనున్నారు. -
అధికారులపై వరద బాధితుల ఆగ్రహం..
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఇదేమీ సాయమంటూ ప్రజాప్రతినిధులు, అధికారులపై భద్రాచలం పట్టణంలో ఆదివారం వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల నుంచి పునరావాస కేంద్రంలో ఉన్నా పట్టించుకున్న అధికారి, ప్రజాప్రతినిధి లేరంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై ధర్నా చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అడుగడుగునా నిర్లక్ష్యం... రెండు రోజుల క్రితం గోదావరికి వరద ఉధృతంగా రావడంతో రాత్రికి రాత్రే కరకట్ట దిగువన ఉన్న సుభాష్‌నగర్ కాలనీలోని ఇళ్లలోని నీరు చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు అప్పటికప్పుడు సామగ్రి సర్దుకుని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ వారికి వసతులు కల్పించడంతో అధికారులు విఫలమయ్యారు. కావాల్సిన నిత్యావసరాలను అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారని, అలాగే చిన్న పిల్లలకు అవసరమైన పాలు, బ్రెడ్లను అందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజు లుగా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు బాధితులకు భోజనం, అల్పాహారం అందించారని, అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిలదీసిన బాధితులు అధికారుల నిర్లక్ష్యంపై జూనియర్ కళాశాల సెంటర్లో కూనవరం రహదారిపై బాధితులు ధర్నా చేస్తుండగా అక్కడకు భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు రావడంతో బాధితులు కోపోద్రిక్తులయ్యారు. రెండు రోజులుగా పునరావాస కేంద్రంలో కష్టాలు పడుతుంటే ఇప్పుడు వస్తారా..? అంటూ వారిని నిలదీశారు. బాధితులు వారిని చుట్టుముట్టడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. వారు సముదాయించేందుకు యత్నించినప్పటికీ బాధితులు శాంతించలేదు. మా గోడు మీరే చూడండంటూ వారిని పునరావాస కేంద్రంలోకి తీసుకెళ్లారు. కనీసం తాగునీరు కూడా లేదంటూ కళాశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ట్యాంకర్‌ను చూపించారు. అదేవిధంగా బియ్యం, పప్పు, పిల్లలకు పాలు, బ్రెడ్లను కూడా అందించలేదని అన్నారు. తిండిపెట్టని ప్యాకేజీలు ఎందుకు...? వరద బాధితులకు స్పెషల్ ప్యాకేజీలు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశామని, త్వరలోనే స్పెషల్ ప్యాకేజీ వస్తుందని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పేర్కొనగా బాధితులు మరింత కోపోద్రిక్తులయ్యారు. కూడు, గుడ్డ లేకుండా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న తమకు సరైన తిండి పెట్టకుండా స్పెషల్ ప్యాకేజీలంటూ హామీలు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ముంపునకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం నేటికీ అందలేదని ఆరోపించారు. తక్షణమే నెల్లిపాక వరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వెంటనే సెక్టోరియల్ అధికారి, పోలవరం డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేష్‌ను అక్కడికి పిలిపించి బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య బాధితులకు సత్వరమే సహాయం అందించాలంటూ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చి వెనుతిరిగారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: విషజ్వరాలు విజృంభిస్తున్నా యి. రఘునాధపాలెం మండలంలో రాంక్యాతండా పం చాయతీ బద్యాతండాలో సుమారు 15 మందికిపైగా విష జ్వరాలతో బాధపడుతూ ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వరుసగా వారం రోజుల పాటు ముసురుతో కూడిన వర్షం కురవడంతో గ్రామంలో మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందా యి. దీంతో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. జ్వరంతో పాటు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నామని బాధితులు అంటున్నారు. తాగునీరు కూడా కలుషితం అవుతోందని గ్రామస్తులు అంటున్నా రు. గ్రామంలో భూక్యా సైదులు జ్వరంతో బాధపడుతుం డగా తావిర్యా బద్రియా అనేవ్యక్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతూ మంచంలోనే ఉన్నారు. మరో 10 మందిపైగా జ్వరాలతో బాధపడుతూ ఖమ్మంలోని ప్రైవే ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బద్యాతండాతో పాటు పంగిడి పంచాయతీలోని మూలగూడెంలో సైతం అనేక మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. -
ఇంత నిర్లక్ష్యమా..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : విపత్తుల సమయంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా విఫలమవుతోంది. వరద బాధితులకు సహాయం అందించాల్సిన అధికారులు.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవనే సాకుతో చేష్టలుడిగి చూస్తున్నారు. వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 172 గ్రామాలు ముంపులోనే ఉన్నాయని ప్రకటించిన అధికారులు బాధితులకు పునరావాస చర్యలు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజులుగా వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భద్రాచలం వద్ద అత్యధికంగా 62 అడుగుల నీటిమట్టంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి కొద్దిగా శాంతించినప్పటికీ గ్రామాలను మాత్రం విడిచిపెట్టలేదు. ఆదివారం రాత్రి 7గంటలకు 57.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. సోమవారం నాటికి ఇంకొంచెం తగ్గే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు ప్రకటించారు. వరదతో భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 14 మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగింది. ఆయా గ్రామాల ప్రజలు నాలుగు రోజులుగా అంధకారంలోనే అలమటిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక సెల్ఫోన్లకు చార్జింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. దీంతో తమ ఇబ్బందులు అధికారులకు చెప్పుకునే అవకాశం కూడా చెప్పుకోలేకపోతున్నారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో ఎటూ వెళ్లలేకపోతున్నారు. అయితే ఆదివారం భద్రాచలం నుంచి మారాయిగూడెం మీదగా చర్ల వరకు, చింతూరు మండలం చట్టి వరకు కొన్ని ఆర్టీసు బస్సులను మాత్రం నడిపారు. ప్రాణాలు పోతున్నా పట్టదా... వరదలతో ఆస్పత్రులకు కూడా వెళ్లే దారిలేక ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కూనవరం మండల కే ంద్రంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో షేక్ మీరా(76) సకాలంలో వైద్యం అందక ఆదివారం మృతి చెందాడు. ఇదే మండలంలోని టేకులబోరుకు చెందిన సూరం కమల(56) కూడా అనారోగ్యంతో మృతిచెందింది. వీఆర్ పురం మండలం ధర్మతాళ్ల గూడెంనకు చెందిన సొంది ముత్తమ్మ(40) కూడా ఈ నేపథ్యంలోనే మృత్యువాత పడింది. ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఉన్నప్పటికీ వారి వద్దకు వెళ్లేందకు దారి లేక, అందుబాటులో పడవలు లేక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. నాలుగు రోజులుగా వరద నీరు అలానే ఉండటంతో గ్రామాల్లో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా జ్వరపీడితులు పెరుగుతున్నారు. సరైన పారిశుధ్య చర్యలు లేవు. కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదు. తగ్గని వరద పోటు... భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 61 అడుగులు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి కొద్దిగా తగ్గినప్పటికీ వరద నీరు గ్రామాలను విడిచిపెట్టలేదు. భద్రాచలం పట్టణంలో ఇంకా వరద నీరు పెరుగుతోంది. రామాలయం చుట్టుపక్కల ఉన్న ఇళ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రామాలయానికి వెళ్లే దారిలో ఓంశాంతి సత్రం దాటి రహదారిపై వరద నీరు చేరింది. శ్రీ సీతారాముల కల్యాణం జరిగే మిథిలా స్టేడియంలోకి కూడా వరద నీరు చేరింది. సుభాష్‌నగర్ కాలనీలో రెండు వందలకు పైగా ఇళ్లు నీటమునిగాయి. ఇక్కడి నుంచి వరద నీరు రామాలయం వైపు వస్తుండటంతో వరద పోటు పెరుగుతోంది. దీంతో పట్టణ వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సహాయక చర్యల పట్ల నిర్లక్ష్యం... ముంపు ప్రాంత బాధితులను ఆదుకోవటంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 57 అడుగుల నీటిమట్టం నమోదైనప్పుడు రెండు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపణీ చేసి హడావిడి చేసిన అధికారులు... వేలాది మంది నాలుగు రోజులుగా ముంపులోనే మగ్గిపోతున్నా వారిని ఆదుకోవడంలో ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో ఎక్కడా కిరోసిన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటంతో మండల స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చింతూరు మండల కేంద్రంలోని నిత్యావసర సరుకుల గోడౌన్ ఇంచార్జి వేరే చోటకు వెళ్లిపోవటంతో అక్కడి బాధితులకు సరుకులు అందలేదు. నాలుగు రోజులుగా గ్రామాలు నీళ్లలోనే ఉన్నప్పటికీ ప్రజల బాధలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పుతున్న లెక్కలకు బాధ్యులెవరు... ముంపు ప్రాంతాల్లో 94 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ప్రకటించారు. కానీ చాలా చోట్ల శిబిరాలు లేక బాధితులు ఇళ్లలోనే ఉంటున్నారు. వాజేడు మండలంలో ఒక్క నాగారం పాఠశాలలోనే.. అది కూడా ఒకరోజు మాత్రమే శిబిరం పెట్టారు. దూలాపురంలో శిబిరం పెట్టినా బాధితులు ఏమీ ఇవ్వలేదు. చింతూరు మండలంలో ఆదివారం బాధితులకు బియ్యం ఇవ్వలేదు. బండారు గూడెంలో ఇప్పటి వరకూ కిరోసిన్ ఇవ్వనేలేదు. ఏజే కోడేరు హైస్కూల్లో అసలు శిబిరమే లేదు. కానీ కలెక్టర్ ఇచ్చిన నివేదికలో శిబిరం ఉన్నట్లు చూపించారు. వెంకటాపురం మండలం చిరుతపల్లిలో ఒక్కరోజు మాత్రమే శిబిరం నిర్వహించారు. కూనవరం మండల కేంద్రంలో అనేక మంది బాధితులు ఇంటి డాబాలపై ఎక్కి కాలం గడుపుతున్నారు. వీరిని పునరావాస కేంద్రాలకు తరలించే విషయంలో అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదు. ఇక్కడ బియ్యం, పాలపొడి ఇస్తున్నప్పటికీ వండుకొని తినే పరిస్థితి లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఉసురు తీసిన వరద
కూనవరం/వీఆర్‌పురం, న్యూస్‌లైన్: వరదలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక జిల్లాలో ఆదివారం ముగ్గురు మృతిచెందారు. వరదల వల్ల ఆస్పత్రికి తరలించడం ఆలస్యమవడంతో ఇద్దరు మరణించగా ఒకరు వైద్యశాలలోనే కనుమూశారు. కూనవరం మండలకేంద్రంలో ఇద్దరు, వీఆర్‌పురం మండలం ధర్మతాళ్లగూడెంలో ఒకరు మరణించారు. వీరిలో ఒకరు పురుషుడు కాగా మరో ఇద్దరు మహిళలు. గోదావరి వరదలు ముంచెత్తడంతో కూనవరంలోని పున రావాకేంద్రానికి తరలివెళ్లిన షేక్మీరా (76) అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక ప్రైవే ట్ ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స నిర్వహించి కూనవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. నర్సు వైద్యం అందిస్తుండగానే మృతిచెం దాడు. కూనవరం మండలం టేకులబోరుకు చెందిన మహిళ సూరం కమల (50) అనారోగ్యానికి గురైంది. ఆమెను మండలకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా వరదలు ముంచెత్తాయి. రాత్రి సమయంలో పడవలు లేకపోవడంతో వైద్యం చేయించడం ఆలస్యమైంది. ఈలోగానే ఆమె మృతిచెందింది. వీఆర్‌పురం మండలం ధర్మతాళ్లగూడెం గ్రామానికి చెందిన సోందె ముత్తమ్మదీ ఇదే పరిస్థితి. ఆదివారం మధ్యాహ్న భోజన అనంతరం అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు రేఖపల్లి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ముత్తమ్మ మృతిచెందింది. అధికారుల నిర్లక్ష్యం వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ముగ్గురు ప్రాణాలు విడిచారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అతికష్టం మీద ఆస్పత్రికి తరలించిన షేక్ మీరాకు సకాలంలో వైద్యం అందించివుంటే బతికేవాడని, వైద్యుడు అందుబాటులో లేకపోవడం వల్లే అతను మరణించాడని అతని కుటుంబసభ్యులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. వరదల సమయంలో లాంచీలు, పడవలు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు మిన్నకుండటం వల్లే కమల, ముత్తమ్మ చనిపోయారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వరద సహాయక చర్యల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘ఆప్కాబ్’ భవితవ్యంపై బదులివ్వలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) భవితవ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తన వద్ద సమాధానం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్ముందు ఆప్కాబ్ తీరుతెన్నులెలా ఉండబోతాయో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆప్కాబ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్లో జరిగిన స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యతు ్తలో కూడా ఆప్కాబ్ ఇలాంటి వేడుకలను జరుపుకుంటుందా, లేక ఇదే ఆఖరుది అవుతుందా అని కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్బక్షి కిరణ్‌ను ప్రశ్నించారు. ఆయన చాలా పెద్ద ప్రశ్నే అడిగారన్న కిరణ్, ప్రస్తుతం తనకు జవాబు తెలిదని బదులిచ్చారు. ఆప్కాబ్‌కు ఉజ్వల భవిష్యత్తుండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి అమరనాథరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ వల్ల రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి లభిస్తోందన్న కిరణ్, అదే సమయంలో రైతులకు కూలీల ఖర్చు పెరిగిపోయి సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాగులో సగటున ఎకరాకయ్యే కూలీల ఖర్చులో 30 శాతాన్ని రైతుకు అందించేలా ఉపాధి పథకాన్ని అనుసంధానించాల్సిన అవసరముందన్నారు. ముల్కనూరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రుణ అర్హత కార్డుల కాలపరిమితి పెంచాలి: బక్షి కౌలు రైతులకు బ్యాంకు రుణాలందించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితి ఏడాదే ఉండటంతో వారికి ఏటా రుణాలందడం కష్టమవుతోందని బక్షి అన్నారు. కౌలుదారీ చట్టాన్ని సవరించో, మరో మార్గం ద్వారానో దీర్ఘ కాలపరిమితి ఉండేలా కార్డులు మంజూరు చేయాలని కోరారు. -
టాన్స్‌కో పనుల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చిన సీజీఎం
సాక్షి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారులు., కాంట్రాక్టర్లు కలిసి ఈ పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారు. నిజామాబాద్ నగరంతో పాటు, కామారెడ్డి, బోధన్ పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ పనులను ఇష్టారాజ్యంగా చేసినట్లు విచారణాధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, పలుచోట్ల వీటిని ఏర్పాటు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త విద్యుత్ లైన్లు చాలా కాలం మన్నాలంటే నైపుణ్యం (స్కిల్డ్ లేబర్) కలిగిన కార్మికులతో పనులు చేయించాలనేది నిబంధన. అయితే కాంట్రాక్టర్లు ఈ నిబంధనను గాలికొదిలేసి అన్ స్కిల్డ్ లేబర్‌తో పని కానిచ్చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలికినట్లు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లకు బిగించిన ఏబీ స్విచ్‌లు కూడా నాణ్యత లేనివి వినియోగించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడుతున్నట్లు తెలిసింది. పనుల్లో నాణ్యత లోపించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఏఈలు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదిక సమర్పించిన విచారణాధికారులు పట్టణ ప్రాంత వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే లక్ష్యంతో జిల్లాలో తొమ్మిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, లైన్ల పొడువును పెంచడం, లోఓల్టేజీ సమస్యను అరికట్టేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మార్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్ర విచారణకు అదేశించిన విష యం విధితమే. విచారణాధికారిగా డిస్కం సీజీఎం సంధ్యారాణిని నియమించారు. ఆమె వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చి విచారణ జరిపారు. పనులు జరిగిన చోట్లకు వెళ్లి పరిశీలించారు. పనుల్లో జరిగిన అక్రమాలన్నీ ఆమె దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంధ్యారాణి ఇటీవల విచారణ నివేదికను కార్తికేయమిశ్రకు సమర్పించినట్లు సమాచారం. అధికారులపై వేటు.? విచారణాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలుండే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరిద్దరు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులపై కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించామని ట్రాన్స్‌కో అధికారులు బయటకు చెబుతున్నారు. గ్యారంటీ పీరియడ్‌లో లోపాలు తలెత్తిన పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లతో సరిచేయిస్తామని అంటున్నారు. -
ప్రతివ్యక్తి విద్యావంతుడు కావాలి..
నాందేవ్‌వాడ, న్యూస్‌లైన్ : గౌడ కులానికి చెందిన ప్రతిఒక్కరు తమ పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్బాలని, ప్రతి ఒక్కరిని ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ సూచించారు. ఆదివారం నగరంలోని వినాయక్‌నగర్ వినాయక కల్యాణ మండపంలో పట్టణ గౌడ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రానూరాను గౌడ కులస్తులు కుల వృత్తులపై ఆధారపడి జీవించే పరిస్థితులు కనిపిం చడం లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో గౌడకులస్తులకు అన్నిరకాల మేలు జరుగుతుందన్నారు. సామాజిక సేవాకార్యక్రమాల్లో గౌడకులస్తులు ముందుండాలన్నారు. నగరంలో గౌడకులస్తుల కళ్యాణమండపం నిర్మాణానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో లిక్కర్ వ్యాపారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని, దీని వల్ల గీతకార్మికులు నష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహేష్‌కుమార్‌గౌడ్‌ను పట్టణ గౌడ సంఘం టీసీఎస్ సంఘం, నగరంలోని అన్ని గౌడ కులసంఘాల సభ్యులు పూలదండలు వేసి మెమెంటోలు అందించి ఘనంగా సన్మానించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు వై.జగన్‌గౌడ్, కార్యదర్శి సత్యనారయణగౌడ్, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్యగౌడ్, రమణగౌడ్, టీసీఎస్ అధ్యక్షులు బండిసాయగౌడ్, రమేష్‌గౌడ్, చెరుకు లక్ష్మణ్‌గౌడ్, భోజగౌడ్, నేరెల్ల శ్రీనివాస్‌గౌడ్, రాజగౌడ్, ఎల్లాగౌడ్, గౌడకులస్తులు, ఉద్యోగసంఘం నాయకులు పాల్గొన్నారు. -
విహారం.. ఓ విషాదం
బాల్కొండ, న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విహార యాత్ర కొందరికి విషాదంగా మా రుతోంది. గోదావరి పరవళ్లను తిలకించేందుకు వస్తున్న సందర్శకులు నదిలో గల్లంతవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాజెక్టు అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖ లాలు కనిపించడం లేదు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో వరద గేట్ల వైపు నీటిలోకి దిగుతున్న పలువురు మృత్యువాత పడుతున్నారు. ప్రాజెక్ట్ వద్ద రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు సందర్శకులు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. ప్రాజెక్టు దిగువ భాగాన గోదావరి నదిలో గురువారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం కడ్తల్‌కు చెందిన ముగ్గురు యువకులు చిక్కుకు పోగా స్థానిక జాలర్లు ఇద్దరిని కాపాడి బయటకు తీశారు. ఒక యువకుడు నదిలో గల్లంతయా డు. ఆ యువకుని ఆచూకీ ఇప్పటి వరకు లభించలే దు. శనివారం జిల్లాలోని ఎడపల్లి మండలం జాన్కం పేట్‌కు చెందిన బత్తుల నర్సయ్య అనే యువకుడు గోదావరిలో నీటి ప్రవాహానికి కొ ట్టుకు పోయాడు. మృత దేహం ఆదివారం లభ్యమైం ది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టునకు ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో వర ద గేట్లను మూసివేయగా యువకుని మృతదేహం లభించేందుకు అవకాశం ఏర్పడింది. లేనిపక్షంలో నీటి ప్రవాహానికి ఎక్కడికి కొట్టుకుపోయేదోనని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వద్ద సందర్శకుల సంరక్షణకు ఎలాంటి చర్యలు కనిపిం చవు. సందర్శకులకు మార్గనిర్దేశనం చేసేవారు ఉం డరు. కొంతమంది ఆనకట్టపైకి వెళ్లి రిజర్వాయర్‌లో నీటిని, వరద గేట్ల ద్వారా కిందికి దూకుతున్న గోదావరిని చూస్తూ పరవశించిపోతారు. మరికొందరు వరదగేట్ల వైపు దిగువ భాగానికి వెళ్లి నదిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే పలువురు మృత్యువు ను కౌగిలించుకుంటున్నారు.ఇక్కడ సందర్శకులను ని లువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే ఇది పోలీసు పనిగా ప్రాజెక్టు అధికారులు పేర్కొం టే... ప్రాజెక్టు అధికారు లే బాధ్యత వహించాలని పో లీసులు అంటున్నారు. చివరికి ఎవరూ పట్టించుకోవ డం లేదు. డ్యామ్ పైన, డ్యామ్ దిగువ భాగన గోదావరికి వెళ్లే మార్గంలో, ప్రాజెక్టు ఆనకట్టపై ఎక్కడ కూ డా ఒక్క ప్రమాద హెచ్చరిక బోర్డు లేదు. ప్రాజెక్ట్ వర ద కాలువ వద్ద సైతం ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేక పోవడంతో అనేక మంది యువకులు 2010లో గల్లంతయ్యారు. డ్యామ్ పైన పోలీస్ సబ్‌కంట్రోల్ బూత్ ఉందంటే అది నామ మాత్రమే! అధికారులు అంతకంటే పట్టించు కోరు. పర్యాటకులూ... ఇక్కడికొస్తే తస్మాత్ జాగ్ర త్త.. మరైతే రాకున్నా ఫర్వాలేదండి..అంటున్నారు స్థానికులు -
వెద్య కళాశాల ప్రారంభోత్సవంపై మల్లగుల్లాలు
సాక్షి, నిజామాబాద్: వైద్య కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అందరూ భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. సీమాంధ్రలో నిరసనల నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కిరణ్ జిల్లాకు వస్తారా? లేదా అనే సంశయం ఏర్పడింది. కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ లభించడం.. ఇప్పటికే విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు షురుకాగా.. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కళాశాల ప్రారంభ కార్యక్రమం తెరపైకి వచ్చింది. ప్రస్తు త రాజకీయ పరిస్థితుల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వాసులకు ఉన్నత వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వైద్య కళాశాలను మంజూరు చేశారు. నగరంలోని ఖిల్లా రామాలయం వద్ద ఈ కళాశాల నిర్మాణానికి భూమి పూజ కూడా నిర్వహిం చారు. ఆ తర్వాత ప్రభుత్వం కళాశాల స్థలాన్ని ఖలీల్‌వాడీ మైదానానికి మార్పు చేసింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 2010 డిసెంబర్లో ఖలీల్‌వాడీ మైదానంలో కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం పూర్తయ్యింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మేలో జిల్లాకు వచ్చింది. రెండు రోజుల పాటు కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఎంసీఐ బృందం పరిశీలనకు వచ్చిన నాటికి కళాశాలలో వసతుల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనుమతి మం జూరుకు ఎంసీఐ నిరాకరించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఎట్టకేలకు ఎంసీఐ ఈ కళాశాలకు అనుమతి మం జూరు చేస్తూ జూన్ 25న ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే అనుమతులు మంజూరు కావడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. ముందుగా 150 సీట్లు ఈ కళాశాలకు కేటాయించారు. తర్వాత రెండువందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వా రం నుంచి కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు సుమా రు 184 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు కళాశాల ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆగస్టు 1 నుంచే ఓరియంటేషన్ తరగతులు కూడా షురువయ్యాయి. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాల ప్రారంభ కార్యక్రమం తెరపైకి వచ్చింది. ముందుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవనాల నిర్మాణం పూర్తయ్యాకే..-డాక్టర్ సుమన్‌చంద్ర, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వైద్య కళాశాల ప్రాంగణంలో విద్యార్థి, విద్యార్థుల హాస్టళ్ల భవనాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. లైబ్రరీ భవన నిర్మాణం పనులు కూడా జరగాల్సి ఉం ది. భవనాల నిర్మాణం పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయి. -
వరద నష్టంపై వెంటనే సర్వే చేపట్టాలి
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు కోల్పోయిన, పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ అహ్మద్‌బాబును కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్‌ను కలిసిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అధికారులు యుద్ధప్రాతిపదికన సర్వేలు చేపట్టేలా చూడాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గతంలో కురిసిన భారీ వర్షాలతో ఆస్తులు, పంట నష్టపోయిన వారికి అన్యాయం జరిగిందని, అధికారులు తప్పుడు సర్వేలు చేపట్టి అధికార పార్టీ కార్యకర్తైలకే లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈసారి మాత్రం అలాంటివి చోటుచేసుకోకుండా చూడాలని అన్నారు. పంట నష్టపోరుున రైతన్నకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యూనుస్ అక్బాని, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బలిరాం జాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక తుకారాం, జిల్లా ఉపాధ్యక్షుడు గోక గణేశ్‌రెడ్డి ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా జైనథ్ : పెన్‌గంగ వరద ఉధృతితో, భారీ వర్షంతో నీట మునిగిన పంటలను గురించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులందరికీ పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎంపీ రాథోడ్ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఖాప్రి గ్రామంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అంతా నష్టపోయూమని, అప్పుల ఊబిలో చిక్కుకున్నామని రైతులు ఎంపీ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్, మండల అధ్యక్షుడు బాలాపూర్ విఠ్ఠల్ ఉన్నారు. -
నాడు తండ్రి.. నేడు తనయ
సాక్షి, శ్రీకాకుళం: ఎక్కడో రాష్ట్రానికి కొసన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇచ్ఛాపురం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తుది మజిలీ అయినా, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభ ప్రాంతమైనా, తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం ముగింపు అయినా ఇక్కడే జరిగాయి. ‘‘ఎందుకో తెలీదుగాని.. వైఎస్ కుటుంబం ఇచ్ఛాపురంతో బంధం పెనవేసుకుంది.. ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను ఇక్కడి నుంచి మొదలుపెట్టడమో.. ఇక్కడే ముగించడమో వారికి ఆనవాయితీగా మారింది’’ అంటున్నారు ఇక్కడి స్థానికులు. షర్మిల పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ, స్తూపావిష్కరణ కార్యక్రమాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అగ్రనేతలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం ఇచ్ఛాపురం జనసంద్రంగా మారింది. అంతటా ఉత్సవ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా దీనిపైనే జనం చర్చించుకోవడం కనిపించింది. పదేళ్ల క్రితం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్రను ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచే ఆ కుటుంబానికి ఇచ్ఛాపురంపై మమకారం పెరిగిందని వారంటున్నారు. వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెండో విడత ఓదార్పు యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని.. ఇప్పుడు షర్మిల మరో ప్రజాప్రస్థానం ఇక్కడే ముగించడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మూడు ఘటనలు తమ పట్టణానికి ఆ కుటుంబంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచాయని వారంటున్నారు. గతంలో వైఎస్‌ను, ఆ తర్వాత జగన్‌ను, ఇప్పుడు షర్మిలమ్మను చూడగలిగానని బోయిన భారతి అనే చిరు వ్యాపారి ఆనందంగా చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ అమలు చేశారు. ఇప్పుడు షర్మిలమ్మ ఇచ్చిన హామీలు కూడా అమలవుతాయన్న నమ్మకం ఉందని ఇడ్లీలు అమ్ముకునే పూర్ణాసాహు చెప్పారు. జగనన్న సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. మహానేత వైఎస్లోని తెగువ, సాహసం షర్మిలలోనూ కనిపించాయని టీకొట్టు నడుపుకొనే దామిచెట్టి పార్వతి అభిప్రాయపడ్డారు. వైఎస్ పాదయాత్రకు కొనసాగింపే.. ‘‘ప్రజా సమస్యలు పట్టించుకోని ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను ఎండగడుతూ, దేవుని దీవెనలతో, నాన్న ఆశీస్సులతో ఇడుపులపాయ నుంచి జగనన్న వదిలిన ఈ బాణం 3,112 కిలో మీటర్లు ప్రయాణించి ఈ రోజు గమ్యం చేరుకుంది. వైఎస్సార్ చేసిన ప్రజాప్రస్థానమే జగనన్న తరఫున చేస్తున్న ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్ఫూర్తి. సరిగ్గా 10 ఏళ్ల కిందట వైఎస్సార్ తన పాదయాత్రను ఒక మహాయజ్ఞంలా, మండుటెండలో రోజుకు 20 నుంచి 25 కిలోమీటర్లకుపైగా నడిచి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అందుకే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన మరు నిమిషం నుంచి ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచన చేశారు. కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచన చేసి అద్భుత పథకాలు ప్రవేశపెట్టారు. మహానేత వైఎస్సార్ ఆ వేళ చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే మా పాదయాత్ర. ఈ 230 రోజులు, ఈ 3,112 కిలోమీటర్లు, ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో ఆయా గ్రామాల్లో మాతో పాటు కదంతొక్కి, మాకు అండగా నిలబడిన ప్రతి అక్కకూ, చెల్లికి, అవ్వకూ, తాతకు, ప్రతి సోదరునికి, సిబ్బందికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’ - షర్మిల వైఎస్ జ్ఞాపకాలు.. ఉద్విగ్న క్షణాలు.. అక్టోబర్ 18న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైఎస్సార్ ‘విజయవాటిక’ వద్ద ముగిసింది. ఆదివారం ఇచ్ఛాపురం నియోజకవర్గం బలరాంపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 4.6 కిలోమీటర్లు నడిచి లొద్దపుట్టి వద్ద భోజన విరామం తీసుకున్నారు. అక్కడ్నుంచి సరిగ్గా 3.15 గంటలకు షర్మిల తుది మజిలీ కోసం బయలు దేరారు. ఆకాశం అంతా మేఘావృతమయింది. ఒక్కో చినుకు రాలుతోంది. 1.7 కిలోమీటర్లు నడిచి వైఎస్సార్ విజయవాటిక వద్దకు చేరుకున్నారు. అది వైఎస్సార్ నడిచిన ప్రాంతం. ‘ప్రజాప్రస్థానం’ పేరుతో వైఎస్సార్ 68 రోజుల్లో 1,473 కిలోమీటర్లు నడిచి జయకేతనం ఎగురవేసిన స్థలం. వైఎస్సార్‌కు జయజయధ్వానాలు పలికిన ప్రదేశం. వైఎస్ జ్ఞాపకాలన్నింటినీ పదిలంగా దాచుకున్న ఆ ప్రదేశానికి రాగానే షర్మిల ఉద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని గుండెల్లో దాచుకొని, చెరగని చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ విజయ వాటిక వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. అక్కడితో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. అక్కడ్నుంచి ‘విజయవాటిక’కు ఎదురుగా ఏర్పాటు చేసిన మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం ‘విజయ ప్రస్థానం’ స్తూపం వద్దకు వెళ్లారు. స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదిక మీదకు వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు. -
నిలిచిన ఆర్టీసీ సేవలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే నష్టాలబాటలో నడుస్తున్న ఆర్టీసీని సీమాంధ్రలో సమైక్యాంద్ర ఉద్యమ సెగ ఆర్థికంగా మరింత కుంగదీస్తోంది. ఉద్యమ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసుల నిలిపివేతతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఎంజీబీఎస్ నుంచి దాదాపు లక్షన్నర మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండగా సీమాంద్రలో ఉద్యమం కారణంగా ఈ సంఖ్య 50 వేలకు పడిపోయింది. ఎంజీబీఎస్ నుంచి రాయలసీమ జిల్లాలకు రోజూ ఆర్టీసీ 710 సర్వీసులు నడుపుతుంది. ఉద్యమం ఊపందుకోవడంతో గత ఐదు రోజులుగా రాయలసీమ జిల్లాల వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులన్నీ పూర్తిగా రద్దయ్యాయి. కాగా, శనివారం నుంచి ఒంగోలు, నెల్లూరు జిల్లాల వైపు 90 శాతం, విజయవాడ, గుంటూరు వైపు 75 శాతం ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఉభయ గోదావరి జిల్లాల వైపు 50 శాతం, విశాఖపట్నం వైపు 25శాతం సర్వీసులను అధికారులు రద్దు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా మారడంతో అనేకమంది తమ ప్రయాణాలను వాయిదాలు వేసుకుంటుండగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో రైలు, విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా వైపు సర్వీసుల పునరుద్ధరణకు నిర్ణయం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బెంగళూరు మార్గాల్లో వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు ఐదు రోజులుగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. కాగా ఆదివారం రాత్రి నుంచి రద్దీని బట్టి కర్నూలు జిల్లాకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఎంజీబీఎస్‌లోని కర్నూల్ సెక్టార్ నుంచి నిత్యం 260 బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సర్వీసులను నడిపించేందుకు సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గడియలో తప్పిన గండం
రెప్పపాటు సమయంలో ఓ పెద్ద ప్రమా దం తప్పింది. చూస్తుండగానే లారీ అదుపుతప్పి దూసుకుపోయి రెండు ఆటోలను , ఒక బైక్‌ను, ఒక టేలాను ఢీకొట్టి డ్రెరుునేజీలో ఇరుక్కుంది. ఈ సంఘటన క్షణాలపాటు భయానికి గురిచేసింది. ప్రత్యేక్ష సాక్షులు ఎండీ షరీఫ్, కిష్ట య్య కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు అప్పుడే దుకాణాలు తీసేందుకు వ్యాపారులు వస్తున్నా రు. హోటళ్లలో టిఫిన్, టీ కోసం జనం వస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎరువుల లోడ్‌తో వస్తున్న సీజీ04 ఈ 8929 నంబర్ గల లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ఆగిపోవడంతో స్టీరింగ్ లాక్ అయింది. తిరిగి స్టార్ట్ చేసి గేర్వేయడంతో అదుపు తప్పి లారీ వేగంగా ప్రధాన రహదారి పక్కకు దూసుకుపోయింది. దీంతో ఎదురుగా ఉన్న కుంద శ్రీనివాస్‌కు చెందిన ఏపీ01వై1846 నంబర్ గల ఆటో, షాబొద్దీన్కు చెందిన ఏపీ01వై6213 నంబర్ గల ఆటో, కిష్టాపూర్‌కు చెందిన మేకల చిన్నయ్యకు చెందిన ఏపీ01ఎస్2972 నంబర్ గల టీ వీఎస్ చాంప్కు ఢీకొట్టిం ది. అంతటితో ఆగకుండా కాసారపు మల్లవ్వకు చెందిన టేలాను ఢీకొట్టి డ్రె రుునేజీలో రెండు టైర్లు దిగబడటంతో హేర్‌కటింగ్ సెలూన్‌కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామం తో పక్కనే ఉన్న హోటల్ యజమాని షరీఫ్, హేర్సెలూన్కు కటింగ్ కోసం వచ్చిన వారు, హోటల్‌కు వచ్చిన వారు పరుగులు తీశారు. అయితే కనురెప్ప పాటున లారీ దూసుకురావడం, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అర నిమిషంలోనే... లారీ దూసుకువస్తున్న అర నిమిషంలోనే కాసారపు మల్లవ్వ టేలా దిగి పక్కు వెళ్లింది. అప్పుడే లారీ టేలను ఢీకొట్టి ధ్వంసం చేసింది. మల్లవ్వ దిగి ఉండకపోతే మరణించి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా తిరుపతి అనే వ్యక్తి హేర్ సెలూన్ లోనికి పరుగులు తీయడం, హోటల్లో ఉన్న వారు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఆ సమయంలో హోటల్ యజమాని షరీఫ్ పొయ్యిలో మంట వెలుగిస్తూ అక్కడే ఉన్నాడు. లారీ కేవలం ఆయనకు ఫీట్ దూరంలోనే ఆగింది. డ్రెరుునేజీ లేకుంటే కనీసం పది ప్రాణాలు గాలిలో కలిసేవని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ అక్కడి వారు తేరుకునేలోపే పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఇకపై గుడ్ మీల్స్
సాక్షి, మంచిర్యాల : బీహార్ రాష్ట్రంలోని పాఠశాలలో విషతుల్య మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు చనిపోయిన సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. దీంతో మన రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పారి శుధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం తో పాఠశాల వాతావరణంపై ప్రత్యేక దృష్టి సారించిం ది. ఇకపై జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు రోజు కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టిసారించాలని ఆదేశించింది. పక్షం రోజులకోసారి నివేదిక తెప్పించుకొని, తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మద్యాహ్న భోజన పథకం అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 3,913 స్కూళ్లల్లో 2,71,244 మంది విద్యార్థులు పధకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. అమలు కాని నాటి జీవో.. మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణకు సంబంధించి ప్రభుత్వం 10 మార్చి, 2011లో విడుదల చేసిన జీవో 21లో పలు సూచనలు చేసింది. కానీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో అమలుకు నోచుకో లేదు. బీహార్ సంఘటనపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న రాష్ట్రాల నుంచి నమూనాలు సేకరించి, ఆహార నాణ్యతను పరీక్షించాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. నెలకోసారి మండల స్థాయిలో జరిగే స్టీరింగ్, మానిటరింగ్ కమిటీలో మధ్యాహ్న భోజనంపైనా చర్చించాలని సూచించింది. అధికారులు గమనించాల్సినవి.. {పభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార ధాన్యాలు, పప్పు, ఇతర పదార్థాల నిల్వ, నాణ్యత పరిశీలించాలి. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించాలి. వంట వండే ముందు, తర్వాత వంట పాత్రలు శుభ్రంగా కడుగుతున్నారా? లేదా గమనించాలి. భోజన నిర్వాహకుల వ్యక్తిగత శుభ్రత కూడా చూడాలి. భోజనం తినే విద్యార్థుల వివరాలు, హాజరుశాతం, బియ్యం, బిల్లులు, విజిట్ చేసి రాసిన రిమార్క్స్ అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలి. -
రూపాయి, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఇకపై వచ్చే కంపెనీల ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిస్థితి, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను నడకను నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వచ్చే శుక్రవారం(9న) రంజాన్(ఈద్) సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ వారం టాటా మోటార్స్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, టాటా పవర్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం(5న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నెల 30న ముగియనున్న సమావేశాల్లో భాగంగా ఆహార భద్రత బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఇక సోమవారమే అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. జూలై నెలకు వెల్లడైన ఉద్యోగ గణాంకాలు ఆర్థిక సంక్షోభ ప్రభావం నుంచి అమెరికా బయటపడుతున్న సంకేతాలను అందించాయి. 2008 డిసెంబర్ తరువాత నిరుద్యోగిత 7.4%కు తగ్గింది. ఈ అంశం కూడా సోమవారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీకి 5,750 కీలకం అంతర్జాతీయ అంశాలతోపాటు, కంపెనీల ఫలితాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీకి 5,750 స్థాయి కీలకంగా నిలవనుందని తెలిపారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. కాగా, గడిచిన శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయి 61.10 వద్ద ముగిసింది. అయితే గత కొన్ని వారాలుగా ప్రభుత్వంతోపాటు, రిజర్వ్ బ్యాంకు సైతం కరెన్సీ బలపడేందుకు వీలుగా పలు చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఫలితమివ్వకపోవడం గమనార్హం. ఈ బాటలో రిజర్వ్ బ్యాంకు గత వారం రూపాయికి మద్దతుగా మరిన్ని చర్యలను ప్రకటించింది. హెడ్జింగ్‌ను చేపట్టేముందు ఎఫ్ఐఐలు తప్పనిసరిగా పార్టిసిపేటరీ నోట్ల జారీదారుల వద్ద నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇదే విధంగా అంతక్రితం ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టడం, బ్యాంకుల లిక్విడిటీని కట్టడి చేస్తూ బ్యాంకు రేటును భారీగా పెంచడం వంటి చర్యలను తీసుకున్న విషయం విదితమే. -
సింగరేణికి గడ్డుకాలం
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పదిహేనేళ్లలో మొదటిసారిగా కంపెనీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బొగ్గు ఉత్పత్తి తగ్గడం, గుర్తింపు సంఘంతో చర్చలు లేకపోవడం, తక్షణం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉండటం, డెరైక్టర్ల మధ్య సమన్వయ లోపం ఇలా అనేక సమస్యలతో సింగరేణి సతమతం అవుతోంది. పారిశ్రామిక సంబంధాలు అధ్వానంగా మారాయి. అధికారులపై అజమాయిషీ కొరవడింది. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గుర్తింపు సంఘానికి కంపెనీకి మధ్య సంక్షోభం తలెత్తింది. టీబీజీకేఎస్‌లో తలెత్తిన గ్రూపుల మూలంగా యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చలు జరుపడం మానేసింది. గ్రూపుల పంచాయతీ తెంచుకొని వస్తేనే చర్చలంటూ తలుపులు మూసింది. దీంతో కార్మికుల ప్రధాన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల జరగాల్సిన స్ట్రక్చరల్ సమావేశం, జేసీసీ సమావేశాలను జరుగలేదు. ఇందులో చర్చించాల్సిన కార్మికుల ప్రమోషన్లు, బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ సమస్య, కంపెనీ గతేడాది సాధించిన లాభాలు, అందులో కార్మికుల వాటా, మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ జాబ్, ఆర్కేపీ, గోదావరిఖనిలో నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, ఇంకా ఇతర ప్రధాన డిమాండ్లు అలానే ఉన్నాయి. ప్రధాన మైన సేఫ్టీ ట్రైపార్టియేట్ను కూడా నిర్వహించడం లేదు. దీంతో గనుల రక్షణ గాలిలోదీపంగా మారింది. ఈ పరిస్థితులతోనే గాలి ఆడక కార్మికులు ఇటీవల మృత్యువాత పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజకీయాలకు నిలయంగా కార్యాలయం కార్పొరేట్ కార్యాలయం రాజకీయాలకు నిలయంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్య అధికారులు ఎవరిదారి వారిదే అన్న రీతిలో వ్యవహారం నడిపిస్తున్నారు. డెరైక్టర్ స్థాయి అధికారుల మధ్య సమన్వయం లోపించింది. కీలక స్థానంలో ఉన్న డెరైక్టర్(పా) కొద్ది కాలంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. మెడికల్ అన్‌ఫిట్ కేసులు, బదిలీలు ఇతర వాటిల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కొన్ని సంఘాలు సింగరేణి చైర్మన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశాయి. ఇదిలా ఉంటే ఇటీవల జీఎం(పర్సనల్) పోస్టును నాలుగుగా చేశారు. కొందరు డెరైక్టర్లు వ్యూహాత్మకంగా తమవారికి పోస్టులు ఇప్పించుకొనేందుకు కొత్త పోస్టులు సృష్టించి ఇచ్చారని ఆరోపణలున్నాయి. కార్పొరేట్‌స్థాయి అధికారుల్లో కూడా ‘కమ్యూనిటీ పాలిటిక్స్’ నడుస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేపు చైర్మన్‌తో ప్రాతినిధ్య సంఘాలు భేటీ ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌లు మంగళవారం కంపెనీ సీఎండీని కలువనున్నారు. గుర్తింపు సంఘంతో చర్చలు జరుపడం లేనందున కార్మిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సేఫ్టీ సమావేశాలు కూడా జరుగకపోవడంతో గనుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కావున కనీసం ప్రతినిధ్య సంఘాలతోనైన తమతో కార్మిక సమస్యలపై చర్చలు జరుపాలని చైర్మన్‌ను కోరుతామని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇం దులోనే లాభాల విషయం ప్రస్తావిస్తామన్నారు. ఓసీపీల్లో అధ్వానంగా ఉత్పత్తి రాజకీయాల సంగతి ఎలా ఉన్న బొగ్గు ఉత్పత్తిలో మాత్రం ముందుండే సింగరేణి వెనుకబడి ఉంది. ఓబీ టెండర్ల ఆలస్యం వల్ల సింగరేణి వ్యాప్తంగా పలు ఓసీపీల్లో అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగడం లేదు. ప్రతి నెల 100 శాతం ఉత్పత్తి నమోదు కావాల్సిన ఓసీపీల్లో కొన్ని సగం కు మించి ఉత్పత్తి చేయడం లేదు. సింగరేణి వ్యాప్తంగా ఓసీపీ, యూజీలల్లో కలిపి ఈ సంవత్సరం ఇప్పటివరకు నిర్ధేశించిన లక్ష్యం 1,63,05,323 టన్నులు కాగా ఈ నెల 3 నాటికి ఇందులో 1,38,72,262 టన్నులు మాత్రమే సాధించడం జరిగింది. దీంతో కేవలం 85 శాతమే బొగ్గు ఉత్పత్తి నమోదైంది. వర్షాల దెబ్బకు జూలైలోనైతే మరి అధ్వాన్నంగా కేవలం 64 శాతం మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ఎప్పుడు 100 శాతం దాటి ఉత్పత్తి జరిగేది ఓసీపీల్లో ఇప్పుడు 94 శాతమే లక్ష్యం సాధించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 14 శాతం, కైరిగూడలో 73 శాతం, ఆర్జీ 2 ఓసీపీలో 73 శాతమే ఉత్పత్తి జరిగింది. -
దీర్ఘకాలానికి... ‘డైనమిక్’ ఫండ్స్
ఈ ఏడాది జూన్‌లో ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టాను. ఆర్బీఐ చర్యల తర్వాత ఈ ఫండ్ ఎన్ఏవీ బాగా తగ్గిపోయింది. తక్కువ ఎన్ఏవీ వద్ద మరో 50,000 పెట్టుబడులు పెట్టమంటారా? ఏడాది పాటు నా పెట్టుబడులను కొనసాగించాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - నందిని, హైదరాబాద్ గత రెండు వారాల్లో భారత ఫైనాన్షియల్ మార్కెట్లలో ఊహించని సంఘటనలు జరిగాయి. డెట్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నిధులు ఉపసంహరించుకున్నారు. ఆర్బీఐ హఠాత్తుగా వడ్డీరేట్లను పెంచింది. దీంతో డెట్ఫండ్స్కు నష్టాలొచ్చాయి. మామూలుగానైతే డెట్‌ఫండ్స్ సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. కానీ ఎవరూ అంచనా వేయలేని పరిస్థితుల కారణంగా తాజాగా డెట్‌ఫండ్స్ నష్టాలపాలయ్యాయి. పెంచిన వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గిస్తుంది. అయితే ఎప్పుడనేదే ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీరేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు డెట్ఫండ్స్కు లాభాలొస్తాయి. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తున్న ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 9.88 శాతంగా ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు రాబడి 7.82 శాతమే. ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయమైన రాబడులనిస్తున్నాయి. మీకు డబ్బులు అవసరం లేకపోతే 1-2 సంవత్సరాలు ఈ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లిక్విడిటీ మీకు సమస్య కాకపోతే డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు బదులుగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ)ను పరిశీలించవచ్చు. ఫండ్ మెచ్యూరిటీ కాలం ఎంత ఉందో అంతే కాలానికి మెచ్యూరయ్యే రుణ పత్రాల్లో ఎఫ్ఎంపీలు పెట్టుబడులు పెడతాయి. డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమాప్లస్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆదే స్కీమ్ డెరైక్ట్ ఆప్షన్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్‌లో 10సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాను. ఒకేసారి రెగ్యులర్ స్కీమ్నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారమంటారా? లేదా 3-4 దఫాల్లో మారమంటారా? అధిక ఎన్ఏవీ లేదా తక్కువ ఎన్ఏవీ వద్ద మారితే ఏమైనా తేడా ఉంటుందా? - ఫణీంద్ర, అనంతపురం ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ పనితీరు బాగా ఉండదు. కానీ, మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మరీ అంత అధ్వానంగా కూడా ఏమీ ఉండదు. గత పదేళ్లలో ఈ ఫండ్ వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరీ ఫండ్స్‌ల్లో ఉన్న 19 ఫండ్స్‌ల్లో ఇది ఐదవ ఉత్తమ ఫండ్. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్ నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారాలనుకుంటే, 3-4 దఫాలుగా కాకుండా ఒకేసారి మారడం మంచిది. ఒకేసారి మారుతున్నందున ఎన్ఏవీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. పెట్టుబడిపై రాబడులను ఏడాది వరకూ అయితే పూర్తిగానూ, ఏడాది దాటితే వార్షికంగానూ పేర్కొంటారు. రెండింటికీ తేడా ఏమిటి? - గోపీనాథ్, మహబూబ్ నగర్ ఈ రెండింటికి తేడాను ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రూ. 1,000 ని ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామనుకోండి. ఇప్పుడు దాని విలువ రూ. 1,300 అయిందనుకుందాం. అప్పుడు పూర్తి లాభం రూ.300గా పరిగణిస్తాం. ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడి 30 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇక మన పెట్టుబడి ప్రతీ ఏడాది ఎంత రాబడిని సాధించిందో వార్షిక రాబడి వెల్లడిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడిపై ప్రతీ ఏడాది సగటున వచ్చిన రాబడి అని అర్థం. ప్రతి ఏడాది వచ్చిన లాభాన్ని అసలు మొత్తంతో కలిపి మరలా పెట్టుబడి పెట్టడం. పై ఉదాహరణలో పెట్టుబడిపై వచ్చిన వార్షిక లాభం 5.38 శాతం. అంటే రూ. 1,000 పెట్టుబడిపై ఏడాది కాలానికి వచ్చిన లాభం రూ.53.8. దీనిని అసలు(రూ.1,000)తో కలిపి పెట్టుబడిగా (రూ.1053.80)గా పెట్టుబడి పెట్టాలి. రెండో ఏడాది దీని విలువ రూ.1,150.50 అవుతుంది. ఇదీ పూర్తి రాబడికి, వార్షిక రాబడికి ఉన్న తేడా. సాధారణంగా వాల్యూ రీసెర్చ్‌లో ఏడాదిలోపు పెట్టుబడులపై రాబడులను పూర్తి రాబడులుగానూ, ఏడాది దాటిన తర్వాత వచ్చే రాబడులను వార్షిక రాబడులుగానూ పరిగణిస్తాం. -
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో పక్షం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన పంటలైన పత్తి, సోయా, కంది తదితర పంటలతోపాటు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వర్షానికి కూరగాయల పం టలు నీటమునిగి మొక్కలు కుళ్లిపోయాయి. ప్రధానంగా టమాట, బీర, బెండ, వంకాయ, అల్చంత, గోబీ, మిరప, చిక్కుడు, దొండ, కా కర, కోత్తిమీర, ఆకుకూర పంటలపై అధిక ప్ర భావం పడింది. దీంతో మార్కెట్లో కూరగాయ ల కొరత ఏర్పడి ధరలు చుక్కలను అంటడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వేల ఎకరాల్లో కూరగాయల పంట నష్టం ఈనెల 15వ తేదీ నుంచి పది రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులు పంట ను నారుమళ్లలోనే కోల్పోయారు. టమాట నర్సరీల్లోనే తుడిచి పెట్టుకుపోయింది. తీగజాతి కూరగాయలపై కూడా తీవ్ర ప్రభావం చూపిం ది. జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, భీమిని, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ మండలాల్లో కూరగాయలు అధికంగా సాగవుతాయి. దాదాపు 2,122 ఎకరాల్లో కూరగాయల పంటలు రైతులు నష్టపోయినట్టు ఉద్యానవన శాఖ, రెవెన్యూ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి నష్టం రూ.50 లక్షలు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ ప్రాంతాల్లో టమాట నర్సరీ నారుమలుల్లోనే 1,250 ఎకరాల్లో కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. కాగజ్‌నగర్, కౌటాల, సిర్పూర్(టి) ప్రాంతాల్లో 200 ఎకరాల పైబడి కాకర, పర్వల్ పంటలు రైతుల చేతికి అందకుండా పోయాయి. భీమినిలో 150 ఎకరాల్లో పసుపు కొమ్ములు వరద పాలు కావడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు సాగవనున్నట్లు అంచనా వేశారు. టమాట 3వేల హెక్టార్లలో అత్యధికంగా సాగవుతుంది. పూగోబి, ఆకుగోబి, కాకర, బీర, సోర, పచ్చిమిరప, బెండకాయ తదితర పంటలు మిగతా హెక్టార్లలో సాగవుతాయి. కూరగాయల కొరత మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలు రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బీర, వంకాయల కొరత ఉంది. ఆదిలాబాద్ రైతుబజార్లోనే కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మిగతా మార్కెట్లలో కూరగాయల ధర లు అంతకంటే ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు కొనేందుకు జంకుతున్నారు. ఆదిలాబాద్ రైతుబజార్లో జైనథ్, అంకోలి, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సీతాగొంది, తలమడుగు, పొన్నారి తదితర గ్రామాల నుంచి వివిధ రకాల కూరగాయలను తీసుకొచ్చి రైతులు విక్రయిస్తా రు. అలాంటిది వర్షాల ప్రాభావంతో వంకాయ, బీర, బెండ, చిక్కుడు పంటలు నష్టపోవడంతో మార్కెట్‌కు కొంత మాత్రమే చేరుకుంటున్నా యి. మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఉట్నూర్, భైంసా, బోథ్, చెన్నూర్, సిర్పూ ర్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే నాగ్‌పూర్, తదితర ప్రాంతాల నుంచి టమాట ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మళ్లీ విత్తనాలు కొనే శక్తిలేదు.. నాకున్న భూమిలో టమాటా సాగు చేశాను. పెట్టుబడి కోసం ప్రైవేటు గా అప్పు చేసి రూ.10వేలు తెచ్చా ను. టమాటా నారు పోశాను. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో నారు కుళ్లిపోయింది. మళ్లీ విత్తనా లు కొనడానికి డబ్బులు లేవు. ఇక కూరగాయల సాగు ఏమి చేయాలి. అధికారులు దయచేసి ఆదుకోవాలి. - దగ్లే జనార్దన్, వడగామ్, ఇంద్రవెల్లి. రూ. లక్ష మట్టిపాలు నేను 15 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని టమాట సాగు చేస్తున్నా. ఈ పంట డబ్బులతో గత ఖరీఫ్‌లో చేసిన అప్పు లు తీర్చాలనుకున్నా. 15 ఎకరాల్లో ట మాట నాటు వేశా. నాటు పడిన రెండో రోజు నుంచి మూడు రోజులపాటు కుం డపోత వర్షం కురిసింది. ఇంకే ముంది 15 ఎకరాల్లో టమాటకు పెట్టిన పెట్టుబడి సుమారు రూ.లక్ష మట్టిపాలైనాయి. - నూర్ఖాన్, లింగాపూర్, గుడిహత్నూర్ గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు ఏడెకరాల్లో టమాట నాటిన. విత్తనాలు, నాట్లు, నర్సరీకి ఎరువులు, కూలీలు రూ.35 వేలు ఖర్చుపెట్టిన. అంతా అనుకున్నట్లుగా జరుగుతుందని ఆశపడ్డా. కానీ మూడు రోజులు వర్షం కురవడంతో కొంత పంట కొట్టుకొని పోగా.. మరికొంత నీళ్లలో కుళ్లిపోయింది. చివరకు ఏమీ మిగల లేదు. గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు. కనీస నష్టపరిహారమైనా అందుతే కూలీలకు డబ్బులైన ఇవ్వొచ్చు. - లద్దే విశ్వంబర్, గుడిహత్నూర్ నా పేరు కాగ్నే నారాయణ. మాది ఇంద్రవెల్లి మండలం. నాకు ఆరెకరాల పంట భూమి ఉంది. ఇందులో టమోట సాగు చేశాను. ఖరీఫ్ ప్రారం భంలో వరుణుడు అనుకూలించడంతో కూరగాయలు సాగు చేశాను. విత్తనాల కోసమే రూ.15 వేలు ఖర్చు చేశాను. పదిహేను రోజులు వర్షాలు ఏకధాటిగా కురియడంతో టమాట మొక్కలకు కర్ప రోగం వచ్చింది. రెండు మూడు రోజులు మొక్కలు నీటిలోనే ఉండటంతో కుళ్లిపోయాయి. మళ్లీ విత్తనాలు కొనే స్థోమత లేదు. అధికారులే ఆదుకోవాలి. -
రాష్ర్టంలోని ప్రాజెక్టులకు జలకళ
సాక్షి నెట్వర్క్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ర్టంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం నుంచి దిగువప్రాంతాలకు ఆదివారం 3,38,809 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 189.8936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 880.30 అడుగులకు చేరుకుంది. తుంగభద్ర డ్యాం 25 క్రస్ట్‌గేట్లను మూడున్నర అడుగులు, మిగతా 8క్రస్ట్‌గేట్లను అడుగు మేర ఎత్తి 1,49,646 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం్చలోని నీటిమట్టం 1631.67 అడుగులుగా ఉంది. 1,66,739 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 21,18,170 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారంరాత్రి జూరాల ప్రాజెక్టుకు 1.52 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, అర్ధరాత్రి నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 518.450 మీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
ధవళేశ్వరం వద్ద 19 అడుగులకు చేరిన నీటిమట్టం
సాక్షి నెట్వర్క్: ఎగువప్రాంతాల నుంచి వరద తగ్గినా ఉగ్ర గోదావరి శాంతించడం లేదు. ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద పలు ఏజెన్సీ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పోయింది. భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదహెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు 58.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. పరీవాహక ప్రాంత 14 మండలాల్లోని 172 గ్రామాలను నీరు చట్టుముట్టింది. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద క్రమేపీ పెరుగుతూ వచ్చిన నీటిమట్టం మధ్యాహ్నం 12గంటలకు 19 అడుగులకు చేరింది. జిల్లాలోని లంక గ్రామాలు గజగజలాడుతున్నాయి. పరీవాహక ప్రాంత 16 మండలాల్లో 59 గ్రామాల జలమయమయ్యాయి. లక్షా 41వేల మందిపై వరద ప్రభావం పడుతోంది. పునరావాస కేంద్రాలు సైతం ముంపుబారిన పడ్డాయి. తాజా వరదల ప్రభావంతో 10,171 ఎకరాల్లో వాణిజ్య, కూరగాయ పంటలు, వరి దెబ్బతినడంతో రైతులకు రూ. 13.38 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 26 గిరిజనగ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదుల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. వరదల వల్ల ఆరుగురు మృతి: వరదలతో వైద్యం అందక ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోని కూనవరం పునరావాస కేంద్రంలో షేక్ మీరా(76) మృతి చెందాడు. ఇదే మండలంలోని టేకులబోరుకు చెందిన కమలమ్మ(56), వీఆర్‌పురం మండలంలోని ధర్మతాళ్లగూడెం గ్రామానికి చెందిన సోంది ముత్తమ్మ(40) అనారోగ్యంతో మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సలాదిపాలెనికి చెందిన గుత్తాల సత్యనారాయణ వరదల్లో గల్లంతయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ముసలమ్మ(51) వరదల వల్ల రోడ్డు పక్కన ఏర్పడ్డ గోతిలో పడి మృతి చెందారు. అమలాపురం మాజీ ఎంపీపీ బాసిన సూర్యనారాయణరావు (72) బండారులంక ఎగువ కౌశికలో పడి మరణించారు. మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన ఆకుమర్తి నరసింహమూర్తి (55) పాముకాటుకు గురై చనిపోయాడు. నేతలను నిలదీసిన బాధితులు ఖమ్మం జిల్లా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో 94 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 16 వేల మంది బాధితులను తరలించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా అందడం లేదు. భద్రాచలంలో ఏర్పాటుచేసిన పునరావాసకేంద్రాన్ని పరిశీలించటానికి వచ్చిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్యెల్యే కుంజా సత్యవతిని బాధితులు నిలదీశారు. అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముక్కిపోయి, పురుగులు పట్టిన బియ్యం ఇస్తే ఎలా వండుకోవాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పిస్తానని ఎమ్మెల్సీ పొంగులేటి చెప్పగా.. సమయానికి తిండిపెట్టలేని ప్యాకేజీలు తమకెందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రాచలం-కూనవరం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపారు.