Editorial
-
అరచేతిలో స్వతంత్రం
ఒక్కోసారి చేతిలో ఖాళీ ఉంటుంది. కానీ ఆ ఖాళీకి సార్థకత తెచ్చేలా చేయగలిగిందేమీ తోచదు. అప్పుడు ఆడుకోవడానికి ఆన్లైన్ అనేది మంచి గేమ్. అందరినీ వ్యసనపరులను చేసే ఆన్లైన్ గేమ్స్ గురించి కాదు; ఆన్లైన్తోనే ఆడుకోవడం! దీనికి గూగుల్, వికీపీడియా, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివన్నీ పనిముట్లు. ఒకదాన్లోంచి ఇంకోదాన్లోకి గెంతుతూ, కొత్త విషయాలకు ద్వారాలు తెరుచుకుంటూ వెళ్లడం సరదాగా ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి గ్రంథాలయాలను చుట్టేయాలి. అంత శ్రమ లేకుండా మన అరచేతిలోనే ఆ భాండాగారం ఉంది. ఎక్కడినుంచి మొదలు పెట్టాలనే సమస్య అయితే ఉంటుంది. ఇది వ్యక్తిగత ఎంపిక. ఉదాహరణకు ప్రపంచ సినిమాను ఇష్టపడే ఏ స్నేహితుడో ఈ పేరును డ్రాప్ చేసివుంటాడని అనుకుందాం: ‘హిరోషిమా మాన్ అమౌర్’. ఈ ఒక్క హింటు మీదే ఎన్నో విషయాలు పోగేయవచ్చు. హిరోషిమా అంటే అర్థమౌతోంది; తర్వాతి పదాలు? గూగుల్ ఎందుకుంది? మాన్ అంటే ఫ్రెంచ్‌లో ‘నా’. అమౌర్ అంటే ప్రేమ. రెండో ప్రపంచ యుద్ధపు బీభత్సాన్ని చిత్రించిన సినిమా ఇది. కానీ ఆ బీభత్సం కథాకాలానికి సుదూర గతం. యుద్ధం మనుషుల మనసుల్లో ఎంత లోతైన గాయాలను చేసిందో జ్ఞాపకాల తలపోత ద్వారా చెప్పిన సినిమా. దీర్ఘ కవిత లాంటి సినిమా. పేరులేని అతడు, ఆమె జరిపే ఏకాంత సంభాషణ. ఇదంతా సినిమా చూస్తే అర్థమౌతుంది. సినిమాకు బయటి సంగతులు? ప్రపంచ సినిమా గతిని మార్చిన ‘న్యూ ఫ్రెంచ్ వేవ్’కు ఈ సినిమా ఒక శక్తిమంతమైన చేర్పు. 1959లో వచ్చింది. ఈ వేవ్‌లో శిఖరంగా చెప్పే ‘బ్రెత్లెస్’ కంటే ఏడాది ముందే విడుదలైందని తెలియడం అదనపు విశేషం. ఇదొక ఫ్రెంచ్–జపనీస్ ఉమ్మడి నిర్మాణం. తగినట్టుగానే ‘ఆమె’ ఫ్రెంచ్ నటి, ‘అతడు’ జపనీస్ నటుడు. ఎమాన్యుయెల్ రివా, ఎయిజీ ఒకాడా. వీళ్ల విశేషాలేమిటి? రివా సరిగ్గా తొంభై ఏళ్లు బతికి 2017లో చనిపోయింది. ఆమె కవయిత్రి, ఫొటోగ్రాఫర్. ఇంకా చాంటెయూజ్. అంటే బార్ లేదా స్టేజ్ మీద పాడే నైట్‌క్లబ్ సింగర్. వీటన్నింటికంటే ఆకట్టుకునే విశేషం, ఆమె మరో సుప్రసిద్ధ సినిమా– ‘అమౌర్’. రెండిట్లోనూ ప్రేమ ఉంది చూశారా? అది విదేశీ భాషా చిత్రం విభాగంలో 2012లో ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ సినిమా. ఈమెను ఇక్కడ వదిలేసి ‘అతడి’ దగ్గరికి వెళ్తే– ఓహో! ఈ ఎయిజీ ఒకాడా 1964లో వచ్చిన జపనీస్ కల్ట్ సినిమా ‘వుమన్ ఇన్ ద డ్యూన్స్’లో హీరోనట! అందుకేనా ఆ రెండింట్లోనూ ఒకే రకమైన మగటిమి నవ్వు ఉంటుంది! ఇలాంటి నవ్వు బహుశా యూకియో మిషిమా ఇష్టపడతాడు. ఈయనెందుకు వచ్చాడు మధ్యలో? అదే 1960ల్లో ఆయన్ని సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరిస్తుందనుకున్నారు. కండలు తీరి మంచి దేహదారుఢ్యంతో ఉండే మిషిమా వేషధారణ, జీవనశైలి ఒక యోధుడిని తలపించేది. జపనీస్ సాహిత్యం ‘సుకుమార హృదయ’ సంబంధి అనీ, దాన్ని తాను ‘మగటిమి’ దిశగా లాక్కెళ్తున్నాననీ అనేవాడు. ఇంతకీ మనం దర్శకుడి గురించి వాకబు చేయనేలేదు. ఆయన పేరును ఫ్రెంచ్ ఉచ్చారణలో అలె రెనీ అనాలట. ఈ రెనీకి సంబంధించిన విశేషాలేమిటి? 1922లో జన్మించాడు. అంటే పోయినేడాదే శతజయంతి ఉత్సవాలు ముగిశాయి. దీనికంటే ముఖ్యమైనది, ప్రపంచ మేటి డాక్యుమెంటరీల్లో ఒకటిగా చెప్పే ‘నైట్ అండ్ ఫాగ్’కు దర్శకత్వం వహించడం! 1956లో వచ్చిన ఈ డాక్యుమెంటరీ నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో శవాల గుట్టలుగా మిగిలిన యూదుల దయనీయ గాథను కడుపులో తిప్పేంత దగ్గరగా చూపుతుంది. ఏ హేతువుకూ అందని దుర్మార్గం దాని పరాకాష్ఠకు చేరినప్పుడు మనిషనేవాడు కేవలం శవాల గుట్టల్లో కొన్ని గుర్తుపట్టని ఎముకలుగా మాత్రమే మిగిలిపోయే అత్యున్నత విషాదాన్ని చిత్రిస్తుంది. దర్శకుడిని వదిలేసి, ఆ సినిమాకు రచయితగా ఎవరు చేశారో చూద్దాం. మార్గ్యూరైట్ డురాస్. ఈమె ఫ్రెంచ్ రచయిత్రి. ‘ఫిడెలిటీ’(పాతివ్రత్య) భావాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నావిడ అని తెలియడం ఈమెకు సంబంధించి కొట్టొచ్చినట్టు కనబడే విశేషం. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ జాబితాలో ఏమైనా ఉండనీ, ‘ఇండియన్ సాంగ్’ అనే పేరున్న సినిమాకు దర్శకత్వం వహించారని తెలియడం భారతీయ మెదడును ఆకర్షిస్తుంది. ఆమె భావాలకు తగినట్టే భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి భార్య తాలూకు వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. గొప్ప సినిమా ఏం కాదని విమర్శకులు చెబుతున్నారు, కానీ దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఎటూ ఆటను హిరోషిమాతో మొదలుపెట్టాం కాబట్టి, మళ్లీ అక్కడికే వద్దాం. ఆ మహా విషాదాన్ని గుర్తుచేస్తూ ఇటీవలే ‘ఒపెన్‌హైమర్’ సినిమా వచ్చింది. అణుబాంబు పితగా అపఖ్యాతి పొందిన రాబర్ట్ ఒపెన్‌హైమర్ నేతృత్వంలో తయారు చేసిన బాంబులనే హిరోషిమా, నాగసాకి నగరాల మీద వరుసగా 1945 ఆగస్ట్ 6, 9 తేదీల్లో వదిలింది అమెరికా. మరింత ఘోర చేదు వాస్తవం ఏమిటంటే, జపాన్ను లొంగదీసుకోవడం కోసం అమెరికా ఈ బాంబులు వేయలేదు; అప్పటికే జపాన్ ఓటమి అంచున ఉంది. కేవలం తన అణుపాటవ శక్తిని ప్రపంచానికి చాటడం కోసం ఈ బాంబుల్ని జారవిడిచింది. దీనివల్ల సుమారు మూడున్నర లక్షల మంది క్షణాల్లో బూడిదయ్యారు. లక్షల మంది ఏళ్లకేళ్లు దాని పర్యవసానాలు అనుభవించారు. మూలమూలల్లోని సమాచారం ఎవరికైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే ఈ ఆధునిక కాలంలో నిజమైన స్వతంత్రం. ఆ ఉన్న సమాచారంతో ఏం చేస్తామనేది మన వివేకం! -
శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి!
‘తలాపునే పారుతోంది గోదారీ, నీ చేనూ, నీ చెలకా ఎడారీ’ అనే పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించేది. భౌగోళికంగా తెలంగాణకు పైభాగాన తలపాగ చుట్టినట్టు గోదావరి ప్రవహిస్తున్నది. అయినా సరే తమకు గోదావరి నీళ్లు అందడం లేదని ఉద్యమకారులు సెంటిమెంట్‌ను పండించారు. కృష్ణా నదితో రాయలసీమకు అటువంటి సెంటిమెంటే ఉన్నది. ‘సీమ’కు తలాపునే కృష్ణమ్మ పారుతున్నది. సెంటిమెంటును పక్కకు పెట్టినా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం. ఈ సీమకు ఇంకో ప్రత్యామ్నాయాన్ని ప్రకృతి ప్రసాదించలేదు. దూరచరిత్రలో ఒకప్పుడు పెన్నా నది కూడా జలరాశులతో తులతూగేదని చెపుతారు. నది అంటూ ఏర్పడిందంటేనే నీటి ఆదరవు ఉండేదని అర్థం కదా! పెన్నానది ఎందుకు ఇలా పేదరాలయిందోనన్న ఆవేదనను విద్వాన్ విశ్వం కూడా వ్యక్తం చేశారు. పెన్నా తీరంలోని రైతుల వ్యధాభరిత గాధలపై ఆయన ‘పెన్నేటి పాట’ పేరుతో రాసిన కావ్యం గురించి తెలిసిందే. ‘ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్ల మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో?’ అరవయ్యేళ్ల కింద ఆయన వేసిన ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రుతుపవనాల శీతకన్ను కారణమంటారు శాస్త్రవేత్తలు. నైరుతి రుతుపవనాలు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతూ పడమటి కనుమల అడ్డగింత కారణంగా తేమను కోల్పోయి పొడిగాలులుగా ప్రవేశిస్తాయని అంటున్నారు. శేషాచలం, నల్లమల శ్రేణుల ఫలితంగా ఈశాన్య రుతుపనాలు కూడా ఈ ప్రాంతంపై పూర్తి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. ఫలితంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొంతప్రాంతంలో వర్షఛాయా ప్రాంతం ఏర్పడింది. నది పుట్టిన చిక్‌బళ్లాపూర్ జిల్లా, నుంచి ప్రవహించే ఉమ్మడి అనంతపురం జిల్లా కడప జిల్లాలు కూడా ఈ వర్షఛాయ ప్రాంతంలో ఉన్న కారణంగా పెన్నా తిన్నెలపై నీటికి బదులు నిట్టూర్పులు ప్రవహించసాగాయి. పెన్నానది దైన్యాన్ని, రాయలసీమ అవసరాలను 150 ఏళ్ల క్రితమే బ్రిటీష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ గుర్తించారు. అప్పటికే బ్రిటీష్ వాళ్లు ఈ ప్రాంతంలో కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ)ను తవ్వించారు. కృష్ణ ప్రధాన ఉపనది తుంగభద్ర నుంచి పెన్నాలో కలిసే విధంగా జలరవాణా మార్గంగా ఈ కాలువను వాళ్లు తవ్వించారు. రాయలసీమ రైతులకు సాగునీటి వనరుగా కూడా ఈ కాలువను ఉపయోగించాలని కాటన్ దొర అధికారులకు సూచించారు. ఆయన సూచన అమల్లోకి రావడానికి మరికొంత కాలం పట్టింది. కాటన్ దొర ఇంకొంత కాలం భారత్‌లో ఉండి ఉంటే రాయలసీమ అవసరాల కోసం కృష్ణాజలాల తరలింపుపై ఆలోచన చేసి ఉండే వారేమో. ఆ తరువాత ఒక శతాబ్ద కాలం గడిచిన తర్వాత కూడా మన స్వతంత్ర భారత పాలకులకు అటువంటి ఆలోచన రాకపోవడం ఒక విషాదం. 1960లో శ్రీశైలం ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ నాటి ప్రధాన ఉద్దేశ్యం జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రమే! శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షమందికిపైగా రైతులు తమ ఇళ్లను, వాకిళ్లను, చేనూ చెలకనూ వదిలేసుకొని చెట్టుకొకరూ పుట్టకొకరూ వలస పోయారు. అసలు సిసలైన త్యాగధనులు వారు. కానీ మనం వాళ్లకు ఆ బిరుదుల్ని ఇవ్వలేదు. వారు ఆశించలేదు. కానీ రాజధాని భూ సమీకరణ కోసం భాగస్వామ్య వ్యాపార ఒప్పందం చేసుకున్న రైతుల ‘త్యాగాలను’ మాత్రం నిత్యపారాయణం చేసుకుంటున్నాము. నాటి నిజమైన త్యాగధనుల్లో అత్యధికులు కర్నూలు జిల్లావారు. మిగిలిన వారు పాలమూరు జిల్లా వారు. రాయలసీమకు కృష్ణా నీటిని తరలించే చిరకాల స్వప్నావిష్కరణలో తొలి కదలిక శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)తో మొదలైంది. బచావత్ ట్రిబ్యునల్ పునరుత్పత్తి కింద కేటాయించిన 11 టీఎంసీలకు, కేసీ కెనాల్ ఆధునికీకరణ వల్ల మిగిలే 8 టీఎంసీలను జత చేసి. 19 టీఎంసీలతో ఉమ్మడి కర్నూల్, వైఎస్సార్ జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఆ ప్రాజెక్టును 1981లో చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,150 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించి.. కుడి కాలువ ద్వారా నీటిని తరలించి.. గోరకల్లు రిజర్వాయర్(12.44 టీఎంసీలు), అవుకు రిజర్వాయర్(4.15 టీఎంసీలు)లలో నిల్వ చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. మద్రాసు నగరానికి మంచి నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించే అంశంపై పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో తమిళనాడు ప్రభుత్వం 1976లోనే చర్చలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర సర్కారు మధ్యవర్తిత్వం వహించింది. 1983 నాటికి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. సరిగ్గా అదే సమయానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చారు. అప్పటికే డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో రాయలసీమ సాగునీటి ఉద్యమం సాగుతున్నది. ఈ ప్రభావంతో మద్రాసుకు మంచినీటి కాలువ కాస్త తెలుగుగంగగా రూపాంతరం చెందింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 5,150 నుంచి 11,150 క్యూసెక్కులకు పెంచి.. ఆ మేరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచి.. బనకచర్లకు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ (16.95 టీఎంసీల సామర్థ్యం)కు, ఆ తరువాత తెలుగుగంగ ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. దీనిద్వారా బ్రహ్మంసాగర్ (17.74 టీఎంసీల సామర్థ్యం)కు తీసుకొని పోవాలి. అందులోంచి మళ్లీ తెలుగుగంగ ప్రధాన కాలువ నీళ్లను తీసుకొని పెన్నా నదిపై నిర్మించిన సోమశిలలో పోస్తుంది. అక్కడ నుండి మళ్లీ ప్రధాన కాలువ ద్వారా కండలేరు రిజర్వాయర్‌కు, అక్కడ నుంచి మద్రాస్‌లోని పూండి రిజర్వాయర్ వరకు తెలుగుగంగ కాలువ ప్రయాణం సాగుతుంది. ఇదీ డిజైన్. ఒకపక్క రాయలసీమ సాగునీటి ఉద్యమ ప్రభావం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రారంభ సంబరం, సాగునీటి శాఖలోని కొందరి ఇంజనీర్ల చొరవ, మేధావుల సూచనలతో కృష్ణాజలాలను సీమకు తరలించడం కోసం మరికొన్ని పథకాలు పురుడుపోసుకున్నాయి. అవే గాలేరు–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా. ఈ రెండు ప్రాజెక్టులను కూడా ఎన్టీ రామారావు ప్రకటించారు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగతో కలిపి ఈ నాలుగు ప్రాజెక్టులు కృష్ణా జలాలతో నిండితేనే రాయలసీమ సాగునీటి కష్టాలకు ఉపశమనం కలుగుతుంది. అందుకోసమే ప్రాజెక్టులను ప్రకటించారు. మూడున్నర దశాబ్దాలుగా అవి సాగుతూనే ఉన్నాయి. ఈ కాలంలో ఏ ప్రభుత్వ హాయంలో ఎంత పని జరిగిందనే అంశంపై సత్యశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు కారణం చంద్రబాబునాయుడు. ప్రతి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ఇది నాదే, అది నాదే అంటూ ఆయన సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. ‘మా వూరి మిరియాలు గుమ్మడికాయంత’ అని కోసేవాడికి చంద్రబాబుకు పెద్ద తేడా ఉండదని చాలా మందికి తెలుసు. తెలియని వాళ్లు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అందువల్ల సర్కారు రికార్డుల్లో ఉన్న య«థార్థాలను, క్షేత్రస్థాయి పరిశీలనను మదింపు చేసి, మరోసారి సత్యాన్ని పునః ప్రకాశింపజేయాల్సి వస్తున్నది. సీమ నీటి కోసం జరిగిన ఉద్యమాల దగ్గర్నుంచి లెక్కవేసి, జరిగిన ప్రాజెక్టు పనులను కూడా కలిపితే దాని పరిమాణం ఒక గున్న ఏనుగంత అనుకుందాం. అప్పుడు చంద్రబాబు చేసిన పనుల వాటాను చిన్న చీమతో పోల్చవచ్చు. పెట్టిన ఖర్చులు మాత్రం చీమ సైజుకంటే అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఇందుకు కారణం కాంట్రాక్టర్లకు పాత బిల్లుల చెల్లింపుల్లో ఆయన చూపే ఔదార్యం. పెరిగిన ధరవరలకు అనుగుణంగా బిల్లులను పెంచే పేరుతో ఒక జీవోనే (22) ఆయన తీసుకొచ్చారు. సదరు కాంట్రాక్టరు అధినేతకు ఇచ్చే కమీషన్‌ను బట్టి ఆ బిల్లు ‘సర్దుబాటు’ ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే రాయలసీమ నీటిపారుదలకు సంబంధించి చంద్రబాబులో ఏనాడూ ఎటువంటి తపనా లేదు. ఆయన ఆలోచించి డిజైన్ చేయించిన ఒక్క ప్రాజెక్టుగానీ, ఒక్క రిజర్వాయర్గానీ లేదు. ఉన్న కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని, ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయర్లు నింపుకోవాలన్న స్పృహ ఎప్పుడూ లేదు. రెయిన్ గన్స్‌తో కరువును జయించిన పద్ధతే ఇక్కడ కూడా! 27 టీఎంసీల సామర్థ్యం ఉన్న గండికోటలో అయిదు టీఎంసీలు చల్లి, పండుగ చేసుకోమని చెప్పడం చూశాం. చంద్రబాబు వ్యవసాయ రంగ వ్యతిరేకి. తెలుగునాట వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారకుడు. వ్యవసాయం దండుగ అనేది ఆయన మనసులోని మాట. అందుకే ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన సాగునీటిపై నిర్లక్ష్యం వహించారు. 1981లోనే ఎస్ఆర్బీసీ పనులు.. రామారావు హయాంలోనే తెలుగుగంగ కాలువ పనులు ప్రారంభమయ్యాయి. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ తొమ్మిదేళ్లు(ఉమ్మడి రాష్ట్రంలో) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి ఎత్తలేదు. పొలాలకు బిందెడు సాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతాల్లో పునాదిరాళ్లు వేయడం ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ నాలుగు సీమ ప్రాజెక్టుల పురోగతిపై ఒక్క చిన్న ఆడిట్ చాలు, చంద్రబాబు బండారం బట్టబయలు కావడానికి! నాలుగు ప్రాజెక్టుల్లో మొదటిది ఎస్ఆర్బీసీ... రెండోది తెలుగుగంగ. మూడోది గాలేరు–నగరి సుజల స్రవంతి. నాలుగోది హంద్రీ–నీవా. తుంగభద్ర–పెన్నాలను కలిపే కేసీ కెనాల్ బ్రిటీష్ కాలం నాటిది. మనకున్న సమాచారం మేరకు చంద్రబాబు ఇంకా దీన్ని తన ఖాతాలో వేసుకోలేదు. పోతిరెడ్డిపాడు దిగువ నుంచి వరద నీటిని తీసుకువెళ్లి వెలిగొండ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి చేపట్టారు. దీనివల్ల ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. నిజానికి ఇంత పరిశీలన కూడా అవసరం లేదు. రెండు మూడు మౌలిక విషయాలను గమనిస్తే చాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదనే తెలుగుగంగ, కుడిగట్టు కాలువ, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. వరద ఉండే 35 రోజుల్లో ఈ ప్రాజెక్టులను నింపుకోవాలి. 11,150 క్యూసెక్కుల సామర్థ్యం ఏ మూలకూ సరిపోదు. తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుపై ఆయన ఎందుకు దృష్టి పెట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినప్పుడు తెలంగాణ, కోస్తాంధ్రలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించారు? శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తక్కువ ఎత్తులోనే నీళ్లను గ్రహించే విధంగా పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రారంభిస్తుంటే ఇది మా రాష్ట్రానికి నష్టమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు కిమ్మనలేదు? తెలంగాణ ఎత్తులకు ధీటుగా రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసిన జగన్ మోహన్ రెడ్డిని రాయలసీమ ద్రోహిగా ఎలా చిత్రించారు? ఓటుకు నోటు కేసుకు భయపడి సీమకు ద్రోహం చేసిన మీకు అలా విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలంటారు. ఇక్కడ నాలుగు మెతుకులున్నాయి. చూసి చెప్పండి. ద్రోహం చేసిందెవరో! ఇంకా వివరంగా కావాలంటే ఇక్కడ బాక్సుల్లో ప్రాజెక్టుల వారీగా ఎవరి పద్దు ఏమిటో వివరంగా ఉన్నది. పరిశీలించండి. శ్రీశైలం పుణ్యక్షేత్రం సమీపంలో సున్నిపెంట దగ్గర కృష్ణా నదిపై డ్యామ్‌ను నిర్మించారు. ఇక్కడ నదీ గర్భం సముద్ర మట్టం కంటే 535 అడుగుల ఎత్తున ఉన్నది. అక్కడి నుంచి డ్యామ్‌ను కట్టుకొచ్చి గేట్లు బిగించారు. 885 అడుగుల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్‌కు ఉన్నది. ఇక్కడే చాలా మంది పొరబడుతుంటారు. అన్ని అడుగుల లోతు వరకు నీళ్లున్నాయని అనుకుంటారు. అడుగుల లెక్కల్లో చెప్పినా, మీటర్ల లెక్కల్లో చెప్పినా ఆ నీటి మట్టం సముద్ర మట్టం నుంచి లెక్కేసి చెప్పేదిగా భావించాలి. ప్రాజెక్టు స్పిల్ వేకు 830 అడుగుల స్థాయి నుంచి 890 అడుగుల వరకు అంటే అరవై అడుగుల ఎత్తున అమర్చిన 12 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీటిని విడుదల చేయడానికి 854 అడుగులు కనీసం ఎత్తుగా నిర్ణయించారు. నైసర్గిక స్వరూపం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ మిగిలిన వాటికి భిన్నంగా కనిపిస్తుంది. శ్రీశైలం దగ్గరి నుంచి ఎగువన తుంగభద్ర–కృష్ణల సంగమం వరకు కిలోమీటర్ల పొడవున రిజర్వాయర్ వ్యాపించి ఉన్నది. సంగమం నుంచి మైదాన ప్రాంతంలో చెరువులను తలపిస్తూ కొండల నడుమకు చేరి నిండుగా కనిపిస్తుంది. డ్యామ్ కనిష్ట మట్టం కంటే దిగువ నుంచి 796 అడుగుల ఎత్తు నుంచే ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించే సదుపాయం తెలంగాణాకు ఉన్నది. దానికి దిగువన కుడివైపున నందికొట్కూరు ప్రాంతంలో 840 అడుగుల ఎత్తు నుంచి నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్ఆర్బీసీ) కోసం మొదట ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి బనకచర్ల క్రాస్‌కు తరలిస్తారు. ఇదో జల జంక్షన్ వంటిది. అక్కడ్నుంచి ఎడమవైపు నుంచి తెలుగుగంగ కాలువ, కుడివైపు నుంచి ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించిన నీటిని, మధ్య నుంచి కేసీ కెనాల్ స్థిరీకరణ కోసం తరలిస్తారు. తెలంగాణ వైపున 802 అడుగుల నుంచి కల్వకుర్తి, 800 అడుగుల నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభించడంతో వాటా జలాలను దక్కించుకోవడం కోసం జగన్ ప్రభుత్వం 800 అడుగుల నుంచే తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్లాన్ చేసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతికి అంతకంటే దిగువ నుంచి నీటిని డ్రా చేస్తున్నారు. సత్య శోధన శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సారీ్బసీ) ► ఎన్టీఆర్ హయాంలో: 1981లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులను కొనసాగించారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు ప్రారంభమయ్యాయి. ► చంద్రబాబు హయాంలో(1995–2004): గతంలో చేసిన పనులకే ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనంగా బిల్లు ఇచ్చి కమీషన్లు వసూలు చేసుకున్నారు. గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల పనులు నత్తనడకన సాగాయి. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచి... శ్రీశైలం కుడి గట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టారు. అవుకు రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. ఆ రెండు రిజర్వాయర్లలోనూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోయారు. ఒక్క ఎకరాకూ అదనంగా నీళ్లందించలేదు. ► వైఎస్ జగన్ హయాంలో: అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మిగిలిన పనులు పూర్తి చేశారు. 2019 నుంచి ఏటా రెండు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ.. పూర్తి ఆయకట్టు అంటే 1.90 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గండికోట వద్ద శంకుస్థాపన చేశారు. 1999 ఎన్నికలకు ముందు మరోసారి ఓట్ల కోసం వామికొండ వద్ద శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశారుగానీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచి... బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచి.. అవుకు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కులను తరలించేలా గాలేరు–నగరి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్ సహా రిజర్వాయర్ల పనులు చేపట్టారు. సింహభాగం పూర్తి చేశారు. గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించడం కోసం గండికోట ఎత్తిపోతలను చేపట్టి.. చాలా వరకు పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ధరల సర్దుబాటు(జీవో 22), పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు(జీవో 63)లను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గండికోట రిజర్వాయర్‌లో ఐదారు టీఎంసీలను నిల్వ చేసి.. ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు ప్రకటించుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా రెండు మూడు టీఎంసీలను నిల్వ చేసి.. ఆయకట్టుకు అరకొరగా నీళ్లందించి రైతుల నోళ్లు కొట్టారు. ► వైఎస్ జగన్ హయాంలో: గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరా వాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి మేరకు అంటే 26.85 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. వామికొండ, సర్వారాయసాగర్లోనూ గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గండికోట–చిత్రావతి ఎత్తిపోతల్లో మిగిలిన పనులు పూర్తి చేశారు. రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. 2020 నుంచి ప్రతి ఏటా చిత్రావతి రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో పది టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీళ్లందిçస్తున్నారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేయలేదు. ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించడానికి మార్గం సుగమం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లో గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా.. వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు ► ఎన్టీఆర్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 11,150 క్యూసెక్కులకు పెంచే పనులతోపాటు వెలిగోడు, బ్రహ్మం సాగర్, కండలేరు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: ప్రధాన కాలువ, రిజర్వాయర్ల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ► చంద్రబాబు హయాంలో: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మేరకు ఆ కాలువ ద్వారానే 1996లో మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. 2004 నాటికి ప్రాజెక్టు పరిధిలో కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లందించగలిగారు. ► వైఎస్ హయాంలో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన నేపథ్యంలో.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ లింక్ కెనాల్ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టి, పూర్తి చేశారు. తద్వారా వెలిగోడు రిజర్వాయర్‌ను 15 రోజుల్లోనే నింపుతూ.. మిగతా రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. రిజర్వాయర్లలో మిగిలిన పనులను పూర్తి చేశారు. బ్రహ్మం సాగర్‌లో 2004లో మొదటిసారిగా నీటిని నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. 2006లో గరిష్ఠంగా 12 టీఎంసీలను పెట్టారు. డిస్ట్రిబ్యూటరీలలో సింహభాగం పూర్తి చేసి.. ప్రాజెక్టు కింద ఏటా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించారు. ► చంద్రబాబు హయాం(2014–19)లో: ప్రధాన కాలువలు, బ్రహ్మంసాగర్ నిర్వహణను గాలికొదిలేశారు. దాంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్‌కు నీటిని తరలించే లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల నుంచి ఆరేడు వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. తెలుగుగంగ ప్రధాన కాలువ సామర్థ్యం 5 వేల నుంచి 2–2,500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకుండా ఏటా బ్రహ్మంసాగర్‌లో సగటున 4.69 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఫలితంగా వైఎస్ హయాంలో ఇచ్చిన నాలుగు లక్షల ఎకరాలకు కూడా నీళ్లందించలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: లింక్ కెనాల్తోపాటు తెలుగుగంగ ప్రధాన కాలువలకు రూ.600 కోట్లు వెచ్చించి, యుద్ధప్రాతిపదికన లైనింగ్ చేయించారు. తద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించి వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపడానికి మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.వంద కోట్లతో డయాఫ్రమ్‌వాల్ వేసి.. లీకేజీలకు అడ్డకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రిజర్వాయర్లను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆ మేరకు ప్రవాహ సామర్థ్యం పెంచేలా ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ► ఎన్టీఆర్ హయాంలో: సర్వే పనులు ప్రారంభం. ► కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో: సర్వే పనులు పూర్తి. ► చంద్రబాబు హయాంలో: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999 ఎన్నికల నేపథ్యంలో 1998లో అనంతపురం జిల్లాలోనే ఆత్మకూరు వద్ద 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాల్సిన సాగునీటి ప్రాజెక్టును 5.5 టీఎంసీలకు కుదించి, తాగునీటి పథకంగా చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ► వైఎస్ హయాంలో: శ్రీశైలం ప్రాజెక్టులో సముద్రమట్టానికి 834 అడుగుల ఎత్తు నుంచి 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి.. తొలి దశలో 216 కి.మీ.ల ప్రధాన కాలువ పనులు.. ఎనిమిది దశల్లో ఎత్తిపోతల పనులు.. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్ పనులను చేపట్టి, పూర్తి చేశారు. దాంతో 2012 నాటికే కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి రిజర్వాయర్‌ను నింపారు. రెండో దశలో ప్రధాన కాలువతోపాటు తొమ్మిది దశల్లో ఎత్తిపోతలు.. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లు చేపట్టి పనులను ఓ కొలిక్కి తెచ్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 మీటర్లకు తగ్గినా.. హంద్రీ–నీవాకు నీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతలను చేపట్టి సింహభాగం పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో(2014–19): కాంట్రాక్టర్లకు జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అదనంగా బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో అరకొరగా మిగిలిన పనులను చేసి.. ఆ రిజర్వాయర్‌కు నీటిని తీసుకెళ్లడం వల్లే పెనుకొండకు సమీపంలో కియా కార్ల పరిశ్రమ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. వైఎస్ హయాంలో పూర్తయిన ముచ్చుమర్రి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసి.. దాన్ని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు కోటలు దాటేలా మాట్లాడారు. ఐదేళ్లలో సగటున ఏడాదికి 26.62 టీఎంసీలను మాత్రమే తరలించి.. రైతులకు అన్యాయం చేశారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. అంచనా వ్యయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.440 కోట్లకు పెంచి.. సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. మట్టి పనులను చేయించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారుగానీ కుప్పం నియోజకవర్గానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ► వైఎస్ జగన్ హయాంలో: అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. రెండో దశలో మిగిలిన పనులు పూర్తి చేయడంతోపాటు.. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఈ ఏడాదే పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృష్ణా జలాలను అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏటా సగటున 39.50 టీఎంసీలు.. అంటే ప్రస్తుత డిజైన్ సామర్థ్యం మేరకు నీటిని తరలించి రైతులకు న్యాయం చేశారు. వర్ధెల్లి మురళి -
మణిపుర్‌కు దక్కిందేమిటి..?
గత మూడు నెలలుగా అత్యంత ఘోరమైన, దారుణమైన పరిణామాలను చవిచూస్తున్న మణిపుర్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండిపోయారని ఆరోపిస్తూ లోక్‌సభలో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. మోదీ వాక్పటిమ గురించి ఎవరికీ సందేహాలు లేవు. ఆయన రెండు గంటల పది నిమిషాల సుదీర్ఘ ప్రసంగం మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు తొలగి, ఆయన సభకు రావటం అటు విపక్షాలతోపాటు ఇటు అధికార పక్షానికి కూడా కలిసొచ్చింది. విపక్ష స్వరం దీటుగా వినబడ టానికి రాహుల్ దోహదపడితే... ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు చెరిగేందుకు అధికారపక్షానికి అవకాశం చిక్కింది. అయితే క్షతగాత్రగా మారిన మణిపుర్‌కు ఏమాత్రం సాంత్వన చేకూర్చామన్నది ఇరుపక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సేవుంది. ఇది గతంలో అనేకమార్లు సభలో చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానాలవంటిది కాదు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి దాగుందంటూ 2018లో విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంతో కూడా దీన్ని పోల్చలేం. ఇది యావత్తు సమాజమూ సిగ్గుతో తలదించు కోవాల్సిన దురదృష్టకర ఉదంతాల పర్యవసానంగా చర్చకొచ్చిన అవిశ్వాస తీర్మానం. మణిపుర్లో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులేర్పడటం, పరస్పరం భౌతిక దాడులు చేసుకోవటం, నివాసాలు తగలబెట్టుకోవటంతో మొదలై... చివరకు మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టే హీన స్థితికి చేరు కోవటం చరిత్రలో కనీవినీ ఎరుగనిది. ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి ప్రజలు చెట్టుకొకరూ, పుట్టకొకరూ కావటం, అలా వెళ్లలేనివారిని సాయుధ మూకలు చిత్రవధ చేయటం, పోలీసులే తమ కస్టడీలో ఉన్న మహిళలను సాయుధ గుంపులకు అప్పగించాన్న ఆరోపణలు రావటం మామూలు విషయం కాదు. ఈ హింసాపర్వం మొదలై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెల కొనకపోవటం, పోలీసులూ, కేంద్ర బలగమైన అస్సాం రైఫిల్స్ పరస్పరం నిందారోపణలు చేసు కోవటం దిగ్భ్రాంతికరం. ఆఖరికి లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని జవాబిస్తున్న సమయంలో కూడా మే 3 నాటి మరో దారుణ ఉదంతం వెలుగులోకొచ్చింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమె ఇంటిని తగులబెట్టారన్నది ఆ ఉదంతం సారాంశం. ఇప్పటికీ స్వస్థలాలకు వెళ్లే సాహసం చేయలేనివారు వేలాదిమందివుంటే, వెళ్లినవారు భయాందోళనల్లో మునిగి తేలు తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను సంజాయిషీ ఇచ్చుకునేలా చేయటంలో అవి శ్వాస తీర్మానం బ్రహ్మాస్త్రం వంటిది. అందునా రాక్షసమూకల కొమ్ముకాసిందన్న ఆరోపణలెదుర్కొంటున్న మణిపూర్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టడానికి దీనికి మించిన ఆయుధం లేదు. మూడురోజులపాటు ఇరుపక్షాల నేతలూ ప్రసంగించారు. అయితే ఆ వాగ్ధాటి హోరులో మణిపుర్ విషాదం మరుగున పడిందన్న అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన అంశాన్ని మరిచి సవాళ్లూ, ప్రతిసవాళ్లూ, అర్థరహితమైన ఆరోపణలూ విసురు కుంటూ రెండు పక్షాలూ కాలక్షేపం చేశాయి. వర్తమాన దుఃస్థితికి గతంలో పాలించిన కాంగ్రెసే కారణమని అధికారపక్షం అంటే... కేంద్ర బలగాలను ఉద్దేశపూర్వకంగానే వినియోగించుకోలేదనీ, అందువల్లే ఇంతటి హింస చెలరేగిందనీ విపక్షాలు ఆరోపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపుర్ గురించి సవివరమైన ప్రకటనే చేశారు. అమిత్ షాయే మాట్లాడతారని మొదటినుంచీ అధి కారపక్షం చెబుతోంది. కాదు, ప్రధానే మాట్లాడాలన్నది విపక్షం డిమాండ్. ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో మణిపుర్ ప్రస్తావన వచ్చింది. దుండగులపై చర్య తీసుకుంటామని, శాంతి నెలకొల్పుతా మన్న హామీ కూడా ఇచ్చారు. ఈశాన్యానికి తమ హృదయంలో కీలక స్థానమున్నదని చెప్పారు. మణి పుర్ మహిళలతో భుజం భుజం కలిపి నడుస్తామన్నారు. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మణిపుర్ ప్రజానీకానికి ఈ సభావేదిక నుంచి సహానుభూతి ప్రకటిస్తూ, ఈ ఉదంతాలు పునరావృతం కానీయబోమనీ, దోషులను కఠినంగా దండిస్తామనీ వాగ్దానం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించివుంటే దాని ప్రభావం వేరుగా ఉండేది. వారి పునరా వాసానికి అవసరమైన పథకాలు ప్రకటిస్తే బాగుండేది. అధికార పక్షం వీటిని విస్మరించిందనుకున్నా ప్రతిపక్షం మాత్రం చేసిందేమిటి? ప్రధాని ప్రసంగం పూర్తిగా వినకుండానే వాకౌట్ చేసింది. అధికార పక్షానికి తిరుగులేని మెజారిటీ ఉన్న సభలో అవిశ్వాసం చివరికేమవుతుందో అందరికీ తెలుసు. అయినా ఆ సందర్భంగా జరిగే చర్చలను ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తుంది. విపక్షం ఏయే అంశాలపై అధికారపక్షాన్ని నిలదీస్తున్నదో, వాటికి అధికారపక్షం ఏం చెబుతున్నదో తెలుసుకోవ టమే ఆ ఆసక్తిలోని ఆంతర్యం. ఆ సందర్భంగా ఎవరి మంచిచెడ్డలేమిటో బేరీజు వేసుకుంటారు. ముఖ్యంగా మణిపుర్ ప్రజలూ, ఈశాన్య రాష్ట్రాల ప్రజానీకం తమకు జరగబోయే న్యాయం గురించి ఆలోచిస్తారు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు, అందులో గెలుపోటములే చర్చల్లో ప్రధానంగా వినబడ్డాయి. ఇది సరైందేనా? మణిపుర్ విషాదంపై సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుని లైంగిక హింసపై సాగే సీబీఐ దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. పునరావాసం, పరిహారం, ఆవాసాల, ప్రార్థనామందిరాల పునర్నిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు రిటైర్డ్ మహిళా న్యాయమూర్తులతో కమిటీ ఏర్పరిచింది. తనవంతుగా చేయబోయేదేమిటో కేంద్రం ప్రకటిస్తే ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు అర్థవంతమైన ముగింపు ఉండేది. -
భూతల స్వర్గం ఇక ‘కేరళమ్’!
పచ్చని ప్రకృతితో భూతల స్వర్గంగా, ‘దేవుడి సొంతగడ్డ’గా పేరుబడ్డ రాష్ట్రానికి త్వరలోనే కొత్త పేరు ఖరారు కానుందా? కేరళ అతి త్వరలోనే అధికారికంగా పేరు మార్చుకోనుందా? అవును. దేశానికి దక్షిణ కొసనున్న ఈ మలయాళ రాష్ట్రం ‘కేరళమ్’గా కొత్త నామధేయం స్వీకరించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్రం పేరును రాజ్యాంగంతో సహా అన్ని ఆఫీసు రికార్డుల్లోనూ అధికారికంగా ‘కేరళమ్’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కేరళ శాసనసభ తీర్మానం చేయడంతో అందుకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాలతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం పార్టీలకతీతంగా కొత్త పేరుకున్న సర్వజనా మోదాన్ని తెలియజేస్తోంది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంకా అనేక అంచెలున్నందున అవన్నీ దాటుకొని మలయాళీల ఆకాంక్ష నెరవేరడానికి మరికొంత కాలం పట్టవచ్చు. నిజానికి, మలయాళంలో అసలు ఆ రాష్ట్రం పేరు కేరళమే. మలయాళీలు సాధారణంలో వాడు కలో చెప్పేది అలానే. ఎటొచ్చీ అధికారిక, ఇంగ్లీష్ రికార్డులోనే ఈ కేరళ అనే మాట. చరిత్ర పరికిస్తే – మలయాళం మాట్లాడే ప్రజలు రకరకాల రాజులు, సంస్థానాల పాలనలో ఉండేవారు. మలబార్, కొచ్చి, ట్రావన్కోర్లను కలిపి, మలయాళ భాషీయులు అందరికీ సమైక్యంగా ఒకే రాష్ట్రం కావాలనే ‘ఐక్య కేరళ ఉద్యమం’ 1920ల నుంచే ఉంది. ఒకే భాష, ఒకే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయమున్న మలయాళీలంతా ఐక్యం కావాలనే బలమైన డిమాండ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సంస్థానాల విలీనంతో క్రమక్రమంగా నెరవేరింది. 1949 జూలై 1న ట్రావన్‌కోర్, కొచ్చి రాష్ట్రాలు రెండూ ఏకమై, ట్రావన్‌కోర్ – కొచ్చిన్ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు పునర్వ్యవస్థీకరణ సంఘం కేరళ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది. అలా 1956 నవంబర్ 1న ఇప్పటి కేరళ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం పేరును మలయాళంలో కేరళమ్ అని పేర్కొన్నా, అప్పట్లో రాజ్యాంగం తొలి షెడ్యూల్లో ఇంగ్లీషులో కేరళ అని రాశారు. ఇప్పుడు అదే రాజ్యాంగం 3వ అధికరణ కింద అంతటా కేరళమ్‌గా మార్చాలన్నది కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం. సాధారణంగా పేరులో ఏముంది పెన్నిధి అనుకోవచ్చు. కానీ, అనేక సందర్భాల్లో ఆ పేరు, ఆ పేరు వెనుక చరిత్ర, దానితో ముడిపడ్డ అనుబంధం నిజంగానే ఓ పెన్నిధి. అస్తిత్వానికీ, అపారమైన సెంటిమెంట్‌కూ నెలవు. అనేక ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఆ యా ప్రాంతాల ప్రజల భాష, గోస, ఊరు, పేరు బలమైన ఊతమిచ్చాయనేది మర్చిపోలేని చరిత్ర. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలుగువారు చేసిన పోరాటమే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసింది. దక్షిణాదిన తెలుగువారికి, తమిళులకు, కన్నడిగులకు, మలయాళీలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత స్థానిక సెంటిమెంట్లను గౌరవిస్తూ, కొన్ని రాష్ట్రాల పేర్లూ మారాయి. ‘మద్రాస్ రాష్ట్రం’ అనంతర కాలంలో 1967 నుంచి తమిళనాడు అయినా, ‘మైసూర్ స్టేట్’ అటుపైన 1973లో కర్ణాటకగా పేరు మార్చుకున్నా అలాగే జరిగింది. ఇప్పుడు కేరళ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఏకగ్రీవంగా తమ రాష్ట్రం పేరును స్థానిక పురాతన చరిత్రను ప్రతిఫలించేలా కేరళమ్‌గా మార్చాలంటూ చేసిన తీర్మానం కూడా ఆ కోవలోనిదే! శబ్ద వ్యుత్పత్యర్థాల ప్రకారం చూసినా చాలా కథే ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి కాయ. అలా ‘కేరళ’ అంటే నారికేళాల భూమి అని శబ్దార్థం. కేరళ సీమలో ఎటు చూసినా పచ్చటి కొబ్బరి చెట్లు విస్తృతంగా ఉండడమే ఈ శబ్దోత్పత్తికి నేటికీ సాక్ష్యం. క్రీ.పూ. 257 నాటి అశోకుని రెండో శిలాశాసనంలోనే తొలిసారి కేరళ ప్రస్తావన కనిపిస్తుంది. అందులో స్థానిక పాలకుణ్ణి ‘కేరళపుత్ర’ అనీ, చేర రాజవంశాన్ని ప్రస్తావిస్తూ ‘చేర పుత్రుడ’నీ ఉంది. గోకర్ణం నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘చేరమ్’ అనేవారట. ‘చేర’ అనే మూలపదానికి అనుసంధానించడమనీ, ‘అళం’ అంటే ప్రాంతమనీ అర్థం. అలా చేరమ్, చేరళమ్ పదాల నుంచే ‘కేరళమ్’ అనే మాట పుట్టిందట. దేశపు నైరుతి మూలన మలబార్ తీరంలో నెలకొన్న ఈ రాష్ట్రానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది పరశురామ క్షేత్రమనీ, బలి చక్రవర్తి ఇక్కడ నుంచే భూమండలాన్ని పాలించాడనీ పురాణగాథ. మల బార్ సీమ వారిది ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయం. సహజంగానే స్వరాష్ట్రం పేరు సైతం వాటిని ప్రతిఫలించేలా, స్థానిక భావ్వోదేగాలను ప్రతిబింబించేలా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని వారు కోరుకుంటారు. అది నూరుపాళ్ళూ సమంజసమే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మొదలు సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన దాకా ఇవన్నీ ఆ కోవలో వచ్చినవే! అయితే, పేరు మార్పుకూ పెద్ద తతంగం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లలో మార్పుల అంశాలు రాజ్యాంగం 3వ అధికరణం కిందకు వస్తాయి. నగరాల పేర్లు మార్చేందుకు కేంద్ర ఆమోదం అవసరం లేకున్నా, రాష్ట్రాల పేర్ల మార్పునకు కేంద్ర హోమ్‌శాఖ అంగీకారం తప్పనిసరి. రాజ్యాంగ సవరణ అవసరం. సాధారణంగా రాష్ట్ర సర్కార్ నుంచి ప్రతి పాదన రాగానే కేంద్రం పేరు మార్పు ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ పైన ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే, తపాలా శాఖలు వగైరాల నుంచి నిరభ్యంతర పత్రాలు కోరుతుంది. పార్లమెంట్ ఆమోదంతో చట్టమయ్యాక, రాష్ట్రానికి కొత్త పేరు అమలులోకి వస్తుంది. కేరళ విజయాలను ప్రపంచానికి చాటేలా ఈ నవంబర్ 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ‘కేరళీయమ్ 2023’ పేరున ఉత్సవాలు జరగను న్నాయి. ఆలోగా పేరు మారితే ఉత్సవాలకూ నిండుదనమన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఫలిస్తుందా? -
మళ్ళీ లైసెన్స్ రాజ్యమా?
ఎప్పుడో వదిలేసిన పాత విధానాలను ఇప్పుడు మళ్ళీ తెస్తే... కొత్త ఫలితాలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్తాయనే అనుకుంటున్నట్టు ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం గత వారం హఠాత్తుగా షరతులు పెట్టడాన్ని చూస్తే, మళ్ళీ 1970ల నాటి ప్రభుత్వ విధానాలు గుర్తొస్తున్నాయి. జాతీయ భద్రత కారణంగా చైనా, కొరియాల నుంచి ఈ దిగుమతులను నియంత్రించాలని ప్రభుత్వ భావన. లైసెన్సు తీసుకుంటేనే అనుమతిస్తా మని సర్కార్ చెబుతోంది. అయితే, వెల్లువెత్తిన విమర్శలు, వ్యక్తమైన ఆందోళనలతో ప్రస్తుతానికి మూడు నెలల పాటు నవంబర్ 1 దాకా ఈ షరతులను వాయిదా వేసింది. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ఈ నిబంధనలని పాలకుల మాట. కానీ, షరతులతో అది సాధ్యమవుతుందా? చైనాను లక్ష్యంగా చేసు కొని పెడుతున్న ఈ నిషేధం తీరా భారతీయులకే నష్టం కలిగిస్తుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు ఏటా 6.25 శాతం వంతున పెరుగుతున్నాయి. 2022 – 23లో 533 కోట్ల డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను దిగుమతి చేసుకున్నాం. అందులో 75 శాతం చైనావే. ఇప్పుడు పౌరుల డిజిటల్ భద్రత రీత్యా ఈ దిగుమతులపై షరతులు పెడుతున్నామంటున్నారు. ఆ సాకు చూపడానికి కారణం ఒకటే! జాతీయ భద్రత కారణమైతేనే బహుళ పక్ష వాణిజ్య ఒప్పందాల్లో దిగుమతులపై షరతులు పెట్టే వీలుంటుంది. దేశీయ ఉత్పత్తులను కాపు కాసుకోవడం కారణమంటే రచ్చ తప్పదు. అయితే, ఎంత జాతీయ భద్రతను సాకుగా చూపినప్పటికీ, ఈ దిగుమతుల షరతులకు అవతలి వైపు నుంచి ట్యారిఫ్ల ప్రతిచర్యలు, దీర్ఘకాలిక వివాదాలు ఎలాగూ తప్పవు. పరిశ్రమతో ఎలాంటి సంప్రతింపులూ జరపకుండానే హడావిడి నిర్ణయం తీసుకొని, సుస్థిర వ్యవస్థను హఠాత్తుగా మార్చడంతో వచ్చిపడే ఇబ్బందులు సరేసరి. ప్రస్తుత నిబంధనల ప్రకారం మన దేశంలోని కంపెనీలు ల్యాప్‌టాప్‌లను యథేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రానున్న కొత్త రూల్స్‌తో ప్రత్యేక లైసెన్స్ ఉంటే కానీ, దిగుమతి సాధ్యం కాదు. 2020లో కలర్ టీవీల దిగుమతి పైనా భారత్ ఇలాంటి షరతులే పెట్టడం గమనార్హం. అలాగే, మొబైల్‌ఫోన్లపైనా అధిక ట్యారిఫ్‌లు విధించింది. పలు స్మార్ట్‌ఫోన్ సంస్థలు భారత్‌లోనే విడిభాగా లను కూర్చి, తయారు చేస్తున్నాయి. కానీ, కంప్యూటర్ల సంగతలా కాదు. చైనా సంస్థ లెనోవా మినహా యాపిల్, డెల్, సామ్సంగ్, షియామీ తదితర ఉత్పత్తులన్నీ దిగుమతులే! కంప్యూటర్ల దిగుమతికి లైసెన్స్ దెబ్బతో ఈ సంస్థల గంపగుత్త ఆర్డర్లపై దెబ్బ పడుతుంది. కలర్ టీవీల్లా కాక కంప్యూటర్లు విద్య, పరిశోధన, పౌరసేవల్లో కీలకం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకై ఈ మధ్యే రిలయన్స్ సంస్థ రూ. 20 వేల లోపలే లభించే జియోబుక్‌ను తెచ్చింది. అదీ చైనా తయారీయే! రిలయన్స్ ఇప్పుడిక పాలకుల నుంచి ప్రత్యేక లైసెన్స్ తెచ్చుకోకుంటే, దిగుమతి చేసుకోలేదు. షరతుల వార్తలతో ఈ వారం కంప్యూటర్ల అమ్మకాలు 25 శాతం పెరిగాయి. చివరకు కొరత ఏర్పడి, ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ఇప్పటికే కోవిడ్ వల్ల సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులు, సెమీ కండక్టర్ సంక్షోభం సతమతం చేస్తున్నాయి. షియామీ, రియల్‌మి, వన్‌ప్లస్ లాంటి కొత్త ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతీయ ట్యాబ్ మార్కెట్ ఈ షరతులతో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, ఐటీ సేవల కేంద్రంగా పేరున్న దేశం కంప్యూటర్ల దిగుమతులపై షరతుల పాట పాడడం ఎలా చూసినా అనూహ్యమే! ప్రజలపై ప్రభావం చూపుతూ, దీర్ఘకాలిక ఆర్థిక పర్యవసానాలున్న నిర్ణయాలను తీసుకొనే ముందు పాలకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వంలోని ఆర్థిక శాస్త్రవేత్తలతో సంప్రతింపులు జరిపివుంటే పాలకులు ఈ హఠాన్నిర్ణయం తీసుకొనేవారు కాదు. దేశీయ ఉత్పత్తి పెంచడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విశ్వసనీయ హార్డ్‌వేర్‌ను అందుబాటులో ఉంచడం మంచి లక్ష్యాలే. కానీ, వాటి కోసం పాత లైసెన్స్ రాజ్యానికి తిరోగమించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఫలానా చైనా ఉత్పత్తుల వల్ల భద్రతలో ముప్పుందని భావిస్తే, ఆ దేశ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేస్తే సరి. అలాకాక మొత్తం వ్యవస్థను లైసెన్సుల అగచాట్లలోకి నెట్టాల్సిన పని లేదు. అనేక కష్టాలు భరించాకే లైసెన్స్ రాజ్యబంధనాల్ని వదిలించుకున్నామని విస్మరించలేం. సులభంగా లైసెన్సులు ఇస్తామంటున్నా, ఆశ్రితపక్షపాతం సహా సమస్యలు మామూలే! ఇవాళ మనది సేవల రంగంతో పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థ. అందులో కీలకమైన కంప్యూటర్ హార్డ్వేర్ల కొరతతో దీర్ఘకాలిక నష్టమే. దేశీయోత్పత్తిని పెంచేందుకు ఉత్పత్తితో ముడిపడ్డ ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని 2020లో ప్రారంభించిన కేంద్రం వివిధ రంగాలకు దాన్ని విస్తరించినా, ఐటీ హార్డ్‌వేర్ రంగంలో ఆశించినంత భాగస్వామ్యం రావట్లేదు. కేటాయింపులు రెట్టింపు చేసినా అదే పరిస్థితి. అలాగని, దిగుమతులపై షరతులు, లైసెన్స్ రాజ్యం పెడితే దేశీయ ఉత్పత్తి పెరుగుతుందనుకోవడం అవివేకం. ఆ సంగతి గత చరిత్ర నిరూపించింది. అపార ఇంజనీరింగ్ ప్రతిభ, తక్కువ వేతనానికే మెరుగైన సేవలు ఇస్తున్నా మనం అంతర్జాతీయ ఉత్పత్తి సేవల భాగస్వామ్యంలో ఎందుకని, ఎక్కడ వెనుకబడిపోయామో మథనం సాగాలి. ఆ విధాన లోపాన్ని సరిచేసుకోవాలి. ప్రతి వెయ్యిలో 15 మందికే కంప్యూటర్ చేరిన దేశంలో షరతులతో ఆ లోటు పెరుగుతుందా, తరుగుతుందా? ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యపై సమగ్ర దృష్టి పెట్టాలి. సంబంధింత పక్షాలతో క్షుణ్ణంగా చర్చించాలి. అనివార్యమైతే తప్ప అనవసర షరతులతో నష్టమని గుర్తించాలి. లేదంటే భారత పురోగతి మరోసారి కుంటుపడుతుంది. -
Data Protection Bill: భద్రత ఉన్నట్టేనా?
చిరకాలంగా చెబుతున్న, వింటున్న మాట ఇప్పుడు కార్యరూపంలోకి వస్తోంది. ఐరాసలోని 194 దేశాల్లో దాదాపు 137 దేశాల తర్వాత ఎట్టకేలకు భారత్ సైతం వ్యక్తిగత డిజిటల్ డేటా భద్రత (డీపీడీపీ) చట్టాన్ని తీసుకొచ్చే ఘట్టంలో చివరి మజిలీకి చేరుకుంది. అయిదేళ్ళలో అనేక ముసాయిదాలు, మార్పులు చేర్పుల తర్వాత తాజా డీపీడీపీ బిల్లు – 2023ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఇంతకాలంగా డేటా భద్రత విషయంలో సరైన చట్టం, వ్యవస్థ లేని భారత్ ఆ లోటును ఇక పూరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మినహాయింపులపై గత నవంబర్ నాటి ప్రతిపాదిత బిల్లులోనే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసినా, అవే అంశాలు కొత్త బిల్లులోనూ చోటుచేసుకోవడం విడ్డూరం. ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల డేటా నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై కఠినమైన అంశాలు పొందుపరచిన ఈ బిల్లులో అసలంటూ కొంత మంచి ఉన్నా, కేంద్రానికి తిరుగులేని సెన్సార్ అధికారాలు దఖలు చేయడం లాంటి చెడూ చోటుచేసుకోవడమే విషాదం. పౌరులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉందంటూ తొమ్మిది మంది సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2017లోనే నొక్కిచెప్పింది. అది అంతర్జాతీయ ప్రమాణంగా నిలిచి, డిజిటల్ యుగంలో గోప్యత హక్కుకు తలెత్తిన సవాళ్ళను ముందుకు తెచ్చింది. ఈ హక్కుపై జరిగిన విస్తృత చర్చ ప్రతిఫలమే తాజా డీపీడీపీ బిల్లు. 2017లోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ నిపుణుల సంఘాన్ని నియమించింది. తర్వాత 2021 డిసెంబర్లో ‘డేటా భద్రత బిల్లు’ (డీపీబీ) విడుదలైంది. అనేక అభ్యంతరాలు రావడంతో 2022 ఆగస్ట్‌లో కేంద్ర ఐటీ మంత్రి పార్లమెంట్లో ఆ బిల్లును ఉపసంహరించుకొని, నవంబర్‌లో ‘డీపీడీపీ’ ముసాయిదాను పౌరసమాజ సంప్రతింపులకు ఉంచారు. గమ్మత్తేమిటంటే, జనాభిప్రాయాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు సరికదా సమాచార హక్కు చట్టం కింద కోరినా తోసిపుచ్చింది. తీరా ఏడాది తర్వాత ఏ ప్రాతిపదికన కొత్తగా మార్పుచేర్పులు చేశామన్నది చెప్పకుండానే పాలకులు 2023 డీపీడీపీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మెజారిటీ ఉంది గనక సులభంగా ఆమోదమూ పొందారు. వ్యక్తిగత డేటాను ఇతరులు యథేచ్ఛగా వాడే వీలులేకుండా చూడడం ఈ బిల్లు ప్రధానోద్దేశం. తీరా బిల్లు చూస్తే, అసలు ఆ భద్రత విషయంలోనే రాజీ పడ్డారనిపిస్తుంది. కార్పొరేట్లు గనక సున్నితమైన డేటాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇప్పటి దాకా ఐటీ చట్టం కింద వారు బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉండేది. తీరా ఇప్పుడీ బిల్లులోని ఓ క్లాజు వల్ల ఆ ఊరట కూడా బాధితు డికి లేకుండా పోతోంది. ఇంకా విచిత్రమేమంటే, డేటా భద్రతకు భంగం కలిగిందని వీధికెక్కినవారి పైనే జరిమానా వేయచ్చు. పస లేని ఆరోపణ చేస్తే రూ. 10 వేల దాకా జుల్మానా వేయవచ్చు. ఫిర్యాదు చేయదలచిన వారికి ఇదో అడ్డంకి. నిజానికి, డేటా ఉల్లంఘనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో కోవిన్ పోర్టల్ నుంచి టీకాలేసుకున్న వారి వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. అలాగే, జూలైలో 12 వేల మంది బ్యాంక్ ఉద్యోగుల గోప్యమైన రికార్డులూ టెలిగ్రామ్‌లో తిరిగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికీ, అధికారులకూ ఈ డేటా వినియోగం, ఉల్లంఘనల్లో అయిదు అంశాల ప్రాతిపదికన ఈ బిల్లులో మినహాయింపులు దక్కాయి. మునుపటి బిల్లులోనూ మినహాయింపులున్నా తాజా బిల్లులో వాటిని విస్తరించడం గమనార్హం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు... దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టానికి ఈ కొత్త బిల్లులోని అంశాలు తూట్లు పొడిచే ప్రమాదం ఉందనేది ఒక విశ్లేషణ. పౌరుల గోప్యత హక్కును కాపాడడం మాట దేవుడెరుగు, సమాచార హక్కును ఇది నీరు గారుస్తోందని విమర్శకుల మాట. ఈ డీపీడీపీ బిల్లు దెబ్బతో ప్రభుత్వం నుంచి సమాచార సేకరణలో పారదర్శకత తగ్గిపోయి, ప్రభుత్వ – ప్రైవేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రజల డేటా మరింత పారదర్శకమవుతుందనేది వారి అభిప్రాయం. అలాగే, వ్యక్తిగత డేటాకూ, సున్నిత మైన వ్యక్తిగత డేటాకూ మధ్య తేడాను సైతం ఈ బిల్లు గుర్తించకపోవడంతో సున్నితమైన డేటాకు అదనపు భద్రత లేకుండా పోతోంది. ఇక, సమాచారాన్ని సృష్టించే జనరేటివ్ కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సంబంధించిన నియంత్రణల ఊసు ఈ బిల్లులో లేదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి చట్టం తేవడానికే సుదీర్ఘకాలం తీసుకున్న మన ప్రభుత్వాలు ఏఐ విషయంలోనూ అదే పద్ధతి అవలంబిస్తే కష్టమే. కాబట్టి, ఏఐ నియమ నిబంధనల రూపకల్పనకు తక్షణం నడుం బిగించాల్సి ఉంది. డేటా భద్రత బిల్లు కింద ఏర్పాటుచేసే ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్’ సైతం వట్టి పర్యవేక్షక సంస్థ. అదీ పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ కిందే నడుస్తుంది. ఛైర్మన్ సహా సభ్యులందరినీ కేంద్రమే నియమి స్తుంది. వెరసి, పాలకుల చేతిలో కీలుబొమ్మగా బోర్డు స్వతంత్రత, అధికారాలు అన్నీ పరిమితమే. తద్విరుద్ధంగా యూరప్ వగైరాల్లో డేటా భద్రత చట్టాలు, దాని కావలి సంస్థలు బలంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అంగీకార విధానాల్ని ఉల్లంఘించినందుకు గూగూల్పై అక్కడి కావలి సంస్థ 5 కోట్ల యూరోల జరిమానా వేయగలగడమే నిదర్శనం. డేటా భద్రతకు మించిన అసలు సమస్య... విచ్చల విడిగా సాగుతున్న డేటా సేకరణను అరికట్టడం! అంతర్జాతీయ నిపుణుల మాట సైతం అదే. మన దేశంలోని ఈ ప్రబల సమస్యపై ఇప్పటికీ చర్చే జరగకపోవడం విషాదం. అలాగే, అవగాహన, డిజి టల్ అక్షరాస్యత అంతంత మాత్రమైన దేశంలో, ఊపిరి సలపని పనిభారమున్న న్యాయవ్యవస్థ మధ్య నిజంగా గోప్యతకు హాని కలిగినా ఈ బిల్లుతో పౌరులు న్యాయం పొందగలరా? -
పాక్‌లో మళ్ళీ పాత కథే!
నేతల పేర్లు మారవచ్చు... ఆరోపణలు మారవచ్చు... పాక్‌లో మాత్రం ఒకే కథ పునరావృత మవుతూ ఉంటుంది. ప్రధాని పీఠమెక్కినవారు సైన్యం అనుగ్రహం కోల్పోయాక ఏదోక ఆరోపణలో జైలుపాలవుతారు. అదృష్టం బాగుంటే బతికిబట్టకడతారు. లేదంటే శంకరగిరి మాన్యాలు పడతారు. జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి బెనజీర్, నవాజ్ షరీఫ్‌ల దాకా ఇదే పరిస్థితి. ఇప్పుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ వంతు. తీవ్రవాదానికి ప్రోత్సాహం, సైనిక స్థావరాలపై దాడులకు పథకరచన లాంటి తీవ్ర ఆరోపణల నుంచి వచ్చిన కానుకల్ని అక్రమంగా అమ్ముకున్నారనే ‘తోషా ఖానా’ కేసు దాకా 150 దాకా కేసులున్న ఇమ్రాన్‌ను ఊహించినట్టే జైలులో పెట్టారు. ఎప్పటిలానే మిగతా వ్యవస్థంతా పరోక్ష మద్దతు నివ్వగా, పాక్ కోర్టు మరో పాపులర్ నేత రాజకీయ జీవితానికి తెరదించేందుకు తెగించింది. తోషాఖానా కేసులో పాకిస్తానీ కోర్ట్ ఆగస్ట్ 5న ఇమ్రాన్‌కు మూడేళ్ళ గరిష్ఠ శిక్ష వేసింది. రాజ్యాంగం ప్రకారం శిక్షపడ్డవారు అయిదేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు గనక, ఈ మాజీ ప్రధానిని అలా బరిలో లేకుండా చేసింది. చివరకు సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ)కి అధినేతగానూ ఇమ్రాన్ కొనసాగరాదు. వెరసి, షరీఫ్‌లు, జర్దారీలు, మౌలానా ఫజల్ ఉర్ రెహ్మాన్ లాంటి సైన్యం ఆశీస్సులున్న వారికి ఎన్నికల బరిలో మార్గం సుగమం చేసింది. ఇమ్రాన్ జైలు పాలయ్యీ కాగానే, ఈ క్షణం కోసమే ఆగినట్టున్న ప్రధాని షెహజాబ్ షరీఫ్ ఆగస్ట్ 9న పార్లమెంట్‌ను రద్దు చేయనున్నారు. నవంబర్ మధ్యలో జరగాల్సిన ఎన్నికలు ఓటర్ల జాబితా సవరణ, నియోజకవర్గ విభజన సాకులతో ఆరు నెలల దాకా వాయిదా పడతాయని అంచనా. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణల్లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్ జైలులో ఉంటారు గనక ఆ లోగా ఓటర్లలో తాము పట్టు సంపాదించాలన్నది షెహబాజ్ సారథ్యంలోని అధికార పార్టీ, మిత్రపక్షాల వ్యూహం. ఇమ్రాన్‌పై మోపింది పెద్దగా పసలేని అభియోగమైనా, విధించినది మాత్రం కఠిన శిక్షే! చరిత్ర చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధానులు షాహిద్ ఖకాన్ అబ్బాసీ, నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, జుల్ఫికర్ అలీ భుట్టో, హుస్సేన్ షహీద్ సుఖ్రావర్దీలకు కూడా రాజ్యవ్యవస్థ చేతిలో ఇదే పరిస్థితే ఎదురైంది. వారంతా ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అయితే, చివరకు వారిపైన మోపిన అభియోగాలేవీ కాల పరీక్షకు నిలబడలేదు. గతంలో జీతం విషయంలో నేరం మోపి, నవాజ్ షరీఫ్ రాజకీయ ఆకాంక్షలకు గండి కొట్టారు. ఇప్పుడు ఇమ్రాన్‌కూ సరిగ్గా అలాగే చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న కానుకల వివరాలను ఇమ్రాన్ సరిగ్గా వెల్లడించలేదనే మిష చూపారు. షరీఫ్, ఇమ్రాన్‌ల ఇద్దరి విష యంలోనూ చేసిన నేరానికీ, వేసిన శిక్ష తాలూకు తీవ్రతకూ పొంతన లేదన్నది బహిరంగ రహస్యం. వచ్చిన కానుకల రికార్డులు, ఆస్తుల ప్రకటన విషయంలో నిబంధనల్ని పాటించకుండా ఇమ్రాన్ తప్పు చేసిన మాట నిజమే. కానీ, తోషాఖానా రికార్డుల్ని నిశితంగా పరిశీలించి, అధికారిక హోదాలో కానుకలు అందుకున్న ఎవరెవరు సరిగ్గా ఆ వివరాలు అందించారనే లెక్కలను గనక ఇంతే కఠినంగా బయటకు తీస్తే మునుపున్న ఎవరూ నిర్దోషులుగా మిగలకపోవచ్చు. అలాంటప్పుడు ఇమ్రాన్‌కు మాత్రం అదే నేరానికి కోర్టు గరిష్ఠ శిక్ష విధించడమేమిటి? అసలీ మొత్తం వ్యవహారంలో విచారణ జరిగిన తీరు, ఎక్కడ లేని హడావిడితో కోర్టు తీర్పు ప్రకటించిన వైనం ప్రశ్నలకు తావిస్తోంది. విధించిన కఠినశిక్షపై ఇమ్రాన్ పై కోర్టుకు వెళ్ళే వీలు, అక్కడ ఊరట దక్కే అవకాశం లేకపోలేదు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తీవ్రనేరాలను సైతం నిత్యం ఉపేక్షించే రాజ్యవ్యవస్థ ప్రజానేతలపై మాత్రం మామూలు అంశాలపైనా అభియోగాలతో, శిక్షలు విధించడమే గమనార్హం. ఇమ్రాన్ తన ముందువారిలా ఆర్మీ ఆదేశాలకు తలాడించకపోవడం తప్పయింది. 2022 ఏప్రిల్‌లో పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయినప్పటి నుంచి సైనిక నాయకత్వాన్ని సవాలు చేశారు. ర్యాలీలు చేశారు. మొన్న మేలో ఆయనను అరెస్టు చేసినప్పుడు జరిగిన భారీ కల్లోలాల్లో సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. దీన్ని అందిపుచ్చుకున్న ఆర్మీ ఛీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నిరసన కారుల్ని అణచివేశారు. మీడియా నోరునొక్కారు. ఇమ్రాన్ సొంత పార్టీ నుంచి ఫిరాయింపులు చేయించారు. ఇప్పుడు ఇమ్రాన్ జైలు పాలయ్యేలా చూశారు. ఎన్నడూ పెద్దగా ప్రజాస్వామ్యం పరిఢ విల్లని పాక్‌లో అంతకంతకూ సైనిక జోక్యం పెరుగుతున్న తీరుకు ఇది తాజా ఉదాహరణ. నిజానికి, 2017లో నవాజ్ షరీఫ్‌ను దించి, ఇమ్రాన్‌ను గద్దెనెక్కించిందీ సైన్యమే. 2018 జనరల్ ఎన్నికల్లో ఫలి తాల్ని అనుకూలంగా మలిచి, ఆనక పార్లమెంట్లో ఇమ్రాన్‌కు మెజారిటీ వచ్చేలా చేసిందీ సైన్యమే. అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యంపై గౌరవమే చూపని ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. కొత్త ఆర్మీ ఛీఫ్ మునీర్ పట్టు బిగిస్తున్నారు. అయితే సాంకేతిక కారణాలతో పోటీకి అనర్హులుగా ప్రకటించినంతనే జనాకర్షక నేతల కథకు తెరపడుతుందనుకోలేం. నవాజ్, బెనజీర్‌ల విషయంలో ఇదే జరిగింది. రేపు ఇమ్రానైనా అంతే! సైన్యమేమో తన స్వార్థం కోసం రాజకీయ నాయకత్వాన్ని అదిలించి, బెదిరించి పబ్బం గడుపుకుంటూ ఉంటే, కోర్టులేమో పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నాయి. రెంటి మధ్య పాకిస్తాన్ రాజకీయాలు చిక్కుకుపోయాయి. ప్రతీకారాలతో నిలువునా చీలిపోయాయి. దేశంలో ఆర్థిక సంక్షోభానికి తోడు రాజకీయ అలక్ష్యంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కావాల్సింది – దేశాన్ని ఆర్థిక పురోగతి పథంలో నడిపించే దీర్ఘదృష్టి. పాలకులు, వ్యవస్థలు అది మర్చిపోయి, ప్రత్యర్థుల్ని వేటాడే పనిలో మునిగి పోవడమే విచారకరం. వ్యవస్థలు రాజకీయమయమైతే ఇలాంటి దురవస్థలే దాపురిస్తాయి. -
కేశమహిమ
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు. అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే! జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి. ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది! మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్ చక్కనౌ తీవెయోనాన్’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు. తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం! కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి. తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది. ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా! -
ఫీల్‌గుడ్ తుపాకీ పేలుతుందా?
ఆర్థిక అసమానతలు మనుషుల మధ్యనే కాదు. ఎకరాల మధ్య కూడా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పది లక్షలకు ఎకరం లభించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొన్న సర్కారు వారి పాటలో ‘కోకాపేట’ కనకం మాత్రం వందకోట్ల కిరీటాన్ని ధరించింది. హైదరాబాద్ నగరానికి పడమటి దిక్కున ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకుని ఈ కోకాపేట వేంచేసి ఉన్నది. ఇప్పుడీ కోకాపేట ఒక దేవకన్యలా మెరిసిపోతున్నది. ‘దివినే వదిలి భువికేతెంచిన తేనెల వెన్నెల సోనవో’ అని పాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఔటర్ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలను, ముఖ్యంగా తూర్పు ప్రాంతాన్ని గమనిస్తే కోకాపేట తేజస్సు తెలిసి వస్తుంది. బొంగుళూరు నుంచి పెద్దఅంబర్‌పేట మీదుగా కీసర, మేడ్చల్ వరకు ఎక్కడా ఎకరా మార్కెట్ ధర పది కోట్లు లేదు. అసలు కొనేవాళ్లు కూడా లేరట! గడిచిన సంవత్సరం జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ సంవత్సరం లావాదేవీలను పోల్చి చూసినప్పుడు వెల్లడైన విషయమిది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిసి సుమారు రెండు లక్షల ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగా పడివున్నాయని ఒక అంచనా. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఒన్ జీవో (జీవో 111) సామ్రాజ్యం కూడా కోకాపేట ప్రాంతాన్ని ఆనుకునే ఉంటుంది. ఇప్పుడా జీవోను రద్దు చేసినందువల్ల ఆ ‘విముక్త’ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్ సూత్రం ప్రకారం భూముల ధరలు తగ్గాలి. కానీ, ఈ సహజ పరిణామాన్ని సవాల్ చేస్తూ కోకాపేట ఒక సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఈ అసహజత్వం అర్థం కావాలంటే రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులపై కూడా అవగాహన ఉండాలి. గంటగంటకూ గమ్యాన్ని మార్చుకునే తుపాన్ల సృష్టికి మన బంగాళాఖాతం పెట్టింది పేరు. బెంగాల్, బంగ్లాదేశ్‌లను కలిపి చూసినా వాటి ఉమ్మడి సముద్ర తీరం కంటే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం వంద కిలోమీటర్లు ఎక్కువ. అయినా ‘బే ఆఫ్ బెంగాల్’ అన్నారు గానీ, ‘బే ఆఫ్ ఆంధ్రా’ అనలేదు ఎందుకో! ఈ ప్రస్తావన ఇక్కడ అప్రస్తుత ప్రసంగం కావచ్చు. బంగాళాఖాతం తుపాన్ల మాదిరిగానే తెలంగాణ రాజకీయ వాతావరణం కూడా గత ఏడాది కాలంగా రకరకాల మార్పులకు లోనైంది. ఇప్పుడిప్పుడే తీరం దాటి గమ్యం చేరినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రాష్ట్రంలో సర్వే బృందాలు వర్ధిల్లడానికి అవకాశమిచ్చింది. సెఫాలజీ ఒక ఉపాధి అవకాశంగా విస్తరించింది. రాజకీయ పార్టీలు ఒకటో రెండో మూడో బృందాలను నియమించుకున్నాయి. జాతీయ బృందాలతోపాటు ప్రాంతీయ, స్థానిక టీమ్‌లు కూడా పనిచేశాయి. చాలామంది ఎమ్మెల్యేలు కూడా విడివిడిగా తమ బలం మీద అంచనా కోసం సర్వేలు చేసుకున్నారు. గోడ దూకుదామనుకున్న వాళ్లు కూడా సర్వేలు చేసుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా పార్టీ మారినవారు మళ్లీ వాతావరణ మార్పులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఏడాది కాలంగా ఈ సర్వే బృందాలు ఇస్తున్న నివేదికలను స్థూలంగా పరిశీలిస్తే, సీట్ల సంఖ్యలో తేడాలు కనబడుతున్నాయే తప్ప, ట్రెండ్‌లో తేడాల్లేవు. ఈ మేరకు సర్వేలు సరిగ్గానే జరిగినట్టు అనుకోవాలి. మొదట్లో బీజేపీ బాగా పుంజుకున్నట్టు కనబడింది. బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడింది. ఇంకేముంది కొద్ది రోజుల్లో మిగిలిన పార్టీల్లోని ముఖ్యనేతలంతా బీజేపీలో చేరిపోతారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చాలామంది ప్రగాఢంగా నమ్మారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెమ్మదిగా కమలం వైపు కదులుతున్న సూచనలు కనిపించాయి. కానీ కేసీఆర్ చాణక్యాన్ని అంచనా వేయడంలో బీజేపీ నాయకత్వం విఫలమైంది. ఆ పార్టీకి అత్యంత కీలక నాయకుడైన బీఎల్ సంతోష్ జుట్టును కేసీఆర్ దొరకబుచ్చుకోవడంతో అది చేష్టలుడిగిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వెనుక బీఎల్ సంతోష్ ప్రమేయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిరూపణ చేయగలిగింది. దాని అడుగులు నెమ్మదించాయి. పులి మీద పుట్రలా కర్ణాటక ఫలితాలు. ఇంతటితో ఈ సంవత్సరపు తొలి అంకం సమాప్తం. రెండో అంకంలో కాంగ్రెస్ పార్టీ జబ్బలు చరుచుకోవడం మనకు కనిపిస్తుంది. కర్ణాటక ఫలితాలు అందజేసిన ఆక్సిజన్ అందుక్కారణం. బీజేపీతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విస్తృతి ఎక్కువ. ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన పార్టీ కూడా! కేసీఆర్‌ను వ్యతిరేకించే వారిలో చాలామంది బీజేపీతో సౌకర్యంగా ఉండలేరు. కాంగ్రెస్‌తో ఆ ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రతి పల్లెలో కాంగ్రెస్ జెండాను ఎత్తుకోవడానికి కనీసం పదిమందైనా ఇప్పటికీ మిగిలే ఉన్నారు. మైనారిటీ ఓటర్లకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ఒక చాయిస్‌గా ఉంటుంది. ఈ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున వలసలుంటాయన్న అంచనాలు వెలువడ్డాయి. కొన్ని వలసలు జరిగాయి కూడా! ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీ కనీసం 30 సీట్లు గెలుచుకుంటుందన్న అంచనాలు కూడా వచ్చాయి. మిగిలిన ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకో 30 గెలిచినా చాలని అనుకున్నారు. ‘అనుకున్నామని జరగవు అన్నీ’ అంటారు. రాజకీయాల్లో అస్సలు జరగవు. కాంగ్రెస్ పార్టీ బలమైన స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో బీఆర్ఎస్ పెద్దపెద్ద వలలు వేసి కూర్చున్నదనే సంగతి అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటి పోయింది. అంతఃకలహాలు కాంగ్రెస్ పార్టీకి వారసత్వ లక్షణమే కావచ్చు. కానీ ఇప్పుడున్నంత తీవ్రస్థాయి వైరుద్ధ్యాలు మునుపెన్నడూ లేవని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు. ఒక వర్గాన్ని మరో వర్గం ఓడించడానికి కూడా వెనకాడనంత తీవ్రస్థాయిలో వైరుద్ధ్యాలున్నాయని వారు అంగీకరిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరికి నాయకత్వం అప్పగించినా ఇంకొందరు పార్టీ మారడానికి వెనుకాడని పరిస్థితులున్నాయని చెబుతున్నారు. పార్టీ కీలక నాయకుడే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మరో కీలక నేత కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. 35 నుంచి 40 స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేరంటూ వ్యూహకర్త సునీల్ కనుగోలు నివేదిక ఇవ్వడంలోనూ, ఎంపిక చేసిన మీడియా సంస్థలకు దాని లీకులివ్వడంలోనూ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హస్తం ఉండవచ్చని సీనియర్ నాయకులు కొందరు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే ఈ అంశాన్ని ముందుకు తెచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క కాపురమంతా కలహాల సంతగా సాగుతుండగానే ఏలిన్నాటి శని మాదిరిగా తెలంగాణ కాంగ్రెస్‌ను చంద్రబాబు తగులుకున్నారు. గత ఎన్నికల్లో గెలుపు అంచుల దాకా చేరిందనుకున్న కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చివరి రెండు నెలల్లో తలకిందులు కావడానికి ఆ పార్టీకి తెలుగుదేశంతో కుదిరిన పొత్తే కారణమని పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికీ బాబుకు సన్నిహితుడేనని కాంగ్రెస్ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ టీవీ’ అనే న్యూస్ ఛానల్ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తున్నదని చెబుతున్నారు. ఈ ఛానల్ తెలంగాణలో రేవంత్‌కూ, ఏపీలో చంద్రబాబుకూ ప్రచారం చేసిపెడుతున్నది. కాంగ్రెస్‌కు బలమైన స్థావరాలుగా పేరున్న ప్రాంతాల్లో, వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ‘తానా’ (అమెరికా) సభల్లో రేవంత్ పాల్గొనడం, అక్కడ చేసిన ఉపన్యాసం కూడా కాంగ్రెస్ వర్గాలతోపాటు తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. ఉచిత విద్యుత్‌పై రేవంత్‌రెడ్డి అనాలోచితంగా చేసిన కామెంట్ కూడా కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారింది. రేవంత్ కామెంట్‌ను తనకు అనుకూలమైన రీతిలో ఎడిట్ చేసి బీఆర్ఎస్ ప్రచారంలో పెట్టింది. ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదనే మెసేజ్‌ను ఇరవై నాలుగ్గంటలలోపే ప్రతి రైతు చెంతకూ చేరవేసిన బీఆర్ఎస్ తన సంస్థాగత బలాన్ని మరోసారి చాటి చెప్పింది. నష్టనివారణ కోసం కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది కానీ, అది ఫలించలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్స్టేషన్లలో హడావిడి చేసి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ రికార్డులేవో చూపించబోయారు. కానీ రైతులెవరూ దాన్ని పట్టించుకోలేదు. తనకు సరిపోయే కరెంటు వస్తున్నప్పుడు అది ఇరవై నాలుగ్గంటలా? పన్నెండు గంటలా అనే లెక్కలెవరికి కావాలి? చిట్టచివరి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ వెలవెలబోయింది. కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేమి ఒక కారణమైతే కావచ్చు గానీ గేమ్‌లో చివరి గోల్‌ను కూడా బీఆర్ఎస్ కొట్టిందనేది ఒక వాస్తవం. గతంలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో నెలరోజులుగా ఫీల్‌గుడ్ వాతావరణం క్రమంగా ఆవరిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్, బీజేపీల స్వయంకృతాపరాధాలు, వేసుకున్న సెల్ఫ్ గోల్స్ కూడా ఇందుకు కారణం కావచ్చు. బీఆర్ఎస్తో కుదిరిన లోపాయకారీ ఒప్పందం మేరకే బీజేపీ కొంత వెనక్కు తగ్గిందనే ప్రచారం కూడా బలంగానే ఉన్నది. ఇందులో నిజానిజాలు ఎట్లా ఉన్నా, కాంగ్రెస్ – బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉండే పరిస్థితి ఏర్పడితే సహజంగానే కాంగ్రెస్ ఓడిపోవాలని బీజేపీ కోరుకుంటుంది. అది దాని రాజకీయ అవసరం. ఇంకో అతి ముఖ్యమైన విషయం నాయకత్వ సమస్య. కేసీఆర్‌కు ధీటైన నాయకుడు ప్రతిపక్షాల్లో కంచుకాగడా వేసుకొని వెతికినా ఎవరూ కనిపించరు. ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని తాజాగా జరిగిన అన్ని గ్రూపుల సర్వేల్లోనూ వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ గెలిచే సీట్లలో దాదాపు సగం సీట్లు గెలిచి కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందట! బీజేపీ మూడో స్థానంతో సర్దుకోవచ్చంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి రెండు మూడు స్థానాలు మారతాయట! రెండో స్థానంలోకి బీజేపీ చేరుతుంది. ఫీల్‌గుడ్ వాతావరణం మొదలైన తర్వాతనే కేసీఆర్ మరింత దూకుడును పెంచి వరసగా తాయిలాలను ప్రకటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. బొటాబొటీగా కాకుండా భారీ విజయాన్ని నమోదు చేస్తే ఆ ప్రభావం లోక్‌సభపై కూడా పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత డబుల్ డిజిట్‌ను తాకకపోతే బాగుండదనే ఆభిప్రాయం ఉండవచ్చు. 2018 ఎన్నికల వాగ్దానమైన రైతు రుణమాఫీ కొంతమేరకు చేసిన అనంతరం అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ దాన్ని కిందకు దించి పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించారు. చేతివృత్తుల వారికి లక్ష సాయం, మైనారిటీలకు లక్ష సాయం, వీఆర్ఏల సర్వీసు క్రమబద్ధీకరణ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా వరస వరాలను ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం! ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ పని చేసినప్పుడు అది సాధ్యం కాదని ఎద్దేవా చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే బాట పట్టారు. పనిలో పనిగా కోకాపేట సమ్మోహనాన్ని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎందుకు చేసినట్టు? ఎకరా వందకోట్ల చొప్పున మూడున్నర ఎకరాల బిట్టు కొన్నవాళ్లు ఎన్ని అంతస్థులు కడితే గిట్టుబాటు అవుతుంది? మొత్తం ఎన్ని వేల ఫ్లాట్లు కట్టాలి? చదరపు అడుగుకు ఎంత ధర పెడితే గిట్టుబాటు అవుతుంది. భారీ ధర పెట్టి కొనుగోలు చేయగలిగినవారు వేల సంఖ్యలో వారికి దొరుకుతారా? మూడున్నర ఎకరాల్లో వేల కుటుంబాలుంటే పర్యావరణ సమస్యలు ఏర్పడవా? ఇలాంటివన్నీ మనలాంటి అల్పజీవులకు కలిగే సందేహాలు. ప్రభువుల లెక్క వేరు. బుల్లెట్ దిగిందా లేదా! ‘హైదరాబాద్ షైనింగ్’ అనే ప్రచారం బాగా పనిచేస్తే బుల్లెట్ దిగినట్టే! ఈ షైనింగ్, ఫీల్గుడ్లతో ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. ఒక్కోసారి ఈ ప్రచారం వికటించవచ్చు. వాజపేయి ప్రభుత్వం కూడా ఫీల్‌గుడ్ తుపాకీ ట్రిగ్గర్ నొక్కి ఎన్నికలకు వెళ్లింది. తుపాకీ పేలలేదు, బుల్లెట్ దిగలేదు. ఈ తుపాకీ పేలుతుందేమో చూడాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్‌హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్‌లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్‌బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్‌గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్‌కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్‌తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్‌ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్‌లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్‌లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్‌లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్‌సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్‌రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఈ చట్టంతో సాధించేదేమిటి?
ఎంతోకాలంగా అటు ఔషధ పరిశ్రమలవారూ, ఇటు ప్రజారోగ్యరంగ కార్యకర్తలూ ఎదురు చూస్తున్న జనవిశ్వాస్ బిల్లు గత నెల 27న లోక్‌సభలో, ఈ నెల 2న రాజ్యసభలో ఆమోదం పొందింది. మణిపుర్‌పై అట్టుడుకుతున్న కారణంగా పార్లమెంటులో తీవ్రగందరగోళం ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో గట్టెక్కిన ముఖ్యమైన బిల్లుల్లో ఇది కూడా చేరిపోయింది. 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 42 చట్టాలకు ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఔషధ రంగ పరిశ్రమలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయితే ఆ చట్టంలోని లొసుగుల వల్ల నాసిరకం ఔషధ తయారీదారులపై కఠిన చర్యలు సాధ్యం కావటం లేదన్నది ప్రజారోగ్యరంగ కార్యకర్తల విమర్శ. తాజా సవరణ బిల్లు దాన్ని మెరుగుపరచకపోగా మరింత నీరుగార్చిందని వారి వాదన. ఈ బిల్లు మొత్తం 180 స్వల్ప నేరాలకు జైలు శిక్ష బదులు జరిమానాతో సరిపెట్టింది. చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపి జైలుకు పంపుతున్న ధోరణి సరికాదనీ, ప్రతి చిన్న అంశంలోనూ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావటం, కేసుల్లో ఇరుక్కుంటే న్యాయస్థానాల చుట్టూ తిరగటం ఉత్పాదకతకు అవరోధమవుతున్నదనీ ఔషధరంగ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వారి కోణంలో ఈ సవరణలు మంచివే కావొచ్చుగానీ, రోగుల కోణం నుంచి దీన్ని పరిశీలించారా అన్నది సందేహమే. ఫార్మారంగంలో మన దేశం అంతర్జాతీయంగా ముందంజలో ఉంది. కానీ కొన్ని ఫార్మా సంస్థలు నాసిరకం మందులు ఎగుమతి చేసి దేశం పరువుప్రతిష్ఠలను దెబ్బతీస్తున్న ఉదంతాలు తక్కువేం కాదు. మన దేశంనుంచి ఎగుమతైన దగ్గుమందు సేవించి ఆఫ్రికా ఖండ దేశం గాంబియాలో నిరుడు 70 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆమధ్య ఉజ్బెకిస్తాన్‌లో కూడా 19 మంది పిల్లలు చనిపోయారు. ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతైన కంటికి సంబంధించిన మందు వికటించి నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 55 మందికి సమస్యలు తలెత్తాయి. అందులో ఒకరు మరణించారు కూడా. పాత చట్టం కఠినంగా ఉన్నదని ఫార్మారంగం మొత్తుకుంటున్న కాలంలోనే ఇలాంటి ఉదంతాలు జరిగితే దాన్ని నీరుగార్చటం సమస్యను మరింత పెంచదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం కల్తీ మందులు, నకిలీ మందులు, తప్పుదోవ పట్టించే పేర్లతో మందుల చలామణీ, నాణ్యతా ప్రమాణం కొరవడిన మందులు అని నాలుగు రకాలుగా వర్గీకరించింది. ఆ మందులు వాడినవారికి ఎదురయ్యే సమస్య తీవ్రతను బట్టి ఆ నేరాలకు శిక్షలున్నాయి. కల్తీ, నకిలీ మందులవల్ల రోగి మరణం సంభవించిన పక్షంలో అందుకు కారకులని గుర్తించినవారికి పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ ఉన్నాయి. తప్పుడు అభిప్రాయం కలిగించే బ్రాండ్లతో మందులు చలామణి చేస్తే రెండేళ్ల వరకూ శిక్ష ఉంది. ప్రామాణిక నాణ్యత లేని మందుల (ఎన్ఎస్క్యూ) తయారీకి రెండేళ్ల వరకూ శిక్ష, రూ. 20,000 వరకూ జరిమానా విధించవచ్చు. వీటన్నిటికీ తాజా బిల్లు అయిదు లక్షల వరకూ జరిమానాలతో సరిపెట్టింది. జైలు శిక్షలు తొలగించింది. ఇతర నేరాల మాటెలావున్నా ఎన్ఎస్క్యూ కేటగిరీ కిందకొచ్చే కేసులకు జైలు శిక్ష బెడద లేకుండా చేయటాన్నే ప్రధానంగా ప్రజారోగ్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీ 27(డి) కిందే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. ఔషధంలో వినియోగించిన పదార్థాలు అనుమతించిన మోతాదులో కాకుండా వేరేవిధంగా ఉంటే ఆ ఔషధం రోగికి నిరుప యోగమవుతుంది. కానీ కొన్నిసార్లు జబ్బు ముదిరి మరణానికి దారితీసే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల వాదన. అలాంటి కేటగిరీని సైతం చిన్న తప్పిదంగా పరిగణించి జరిమానాలతో సరిపెడితే ఔషధ నాణ్యత దెబ్బతినదా... ప్రజారోగ్యం ప్రమాదంలో పడదా అని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిరుడు ఈ బిల్లు ముసాయిదాను ప్రకటించి అన్ని వర్గాల నుంచీ అభిప్రాయాలు కోరినప్పుడు ప్రజారోగ్య నిపుణులు ప్రధానంగా దీనిపైనే అభ్యంతరం తెలిపారు. అసలు ఫార్మా కంపెనీలు నిబంధన ప్రకారం రిజిస్టరయిన ఫార్మాసిస్టులను నియమించు కోవాల్సి వుండగా చాలా సంస్థలు దాన్ని ఉల్లంఘిస్తున్నాయి. అకారణంగా వేధించటాన్ని ఎవరూ సమర్థించరు. కానీ రోగుల ప్రాణాలతో ఆడుకునే విధంగా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఉండే సంస్థల విషయంలో కఠినంగా ఉండొద్దా? అసలే తరచు బయటి కొచ్చే ఉదంతాల వల్ల విదేశాల్లో మన ఫార్మా ఉత్పత్తులపై చిన్నచూపు పడుతోంది. మన చట్టాలు చాలా ఉదారంగా ఉండటంవల్లే, తగిన తనిఖీలు లేనందువల్లే ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆ అభిప్రాయాన్ని పోగొట్టే విధంగా లేకపోగా మరింత సరళంగా మార్చిందని ప్రజారోగ్య కార్యకర్తల ఆరోపణ. కేవలం కఠిన శిక్షలు, తనిఖీలు మాత్రమే సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు. కానీ కల్తీ, నకిలీ మందుల కారణంగా రోగి ప్రాణం కోల్పోయినా, తీవ్రమైన వైకల్యం సంభవించినా ఆ రోగి కుటుంబానికి భారీయెత్తున పరి హారం చెల్లించే నిబంధన ఉంటే ఔషధ తయారీ సంస్థ దారికి రాదా? దీనికి బదులు రూ. 5 లక్షల జరిమానాతో సాధించేదేమిటి? ఈమాత్రం జరిమానా చెల్లించలేని స్థితిలో ఏ సంస్థయినా ఉంటుందా? పటిష్టమైన పర్యవేక్షణ, పారదర్శకత, నేరం చేస్తే కఠిన శిక్ష, భారీ పరిహారం చెల్లింపు తప్పదన్న భయం ఉంటేనే పరిస్థితి చక్కబడుతుంది. ఇవేమీ లేకుండా చట్టం తెచ్చి ప్రయోజన మేమిటి? -
వేధిస్తున్న తప్పులు
నాలుగు నెలల్లో మూడోసారి నేరాభియోగాలను ఎదుర్కోవడం... అదీ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి అంటే అసాధారణమే! అందులోనూ ఏకంగా దేశాన్నే మోసం చేశారంటూ ఆరోపణ రావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అందులోనూ రికార్డు సృష్టించారు. పదవిలో ఉన్నా, లేకున్నా వింత ధోరణి, విచిత్రమైన మాటలతో వార్తల్లో నిలిచిన ట్రంప్‌ను పాత తప్పులు వెంటాడుతున్నాయి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా, ఫలితాన్ని తారుమారు చేసేందుకు శతవిధాల ప్రయత్నించారంటూ 4 అంశాల ప్రాతిపదికన 45 పేజీల్లో మంగళవారం ఆయనపై నమోదైన నేరాభియోగం అందుకు తాజా ఉదాహరణ. ఈ ఏడాది ఇప్పటికే మరో రెండు నేరాభియోగాలు మీదపడ్డ ట్రంప్ మెడకు రోజురోజుకూ చట్టం ఉచ్చు బిగిస్తోంది. మళ్ళీ అమెరికా అధ్యక్ష పోటీలో నిలవాలనుకుంటున్న ఆయన వీటి నుంచి బయటపడగలరా? మరో 15 నెలల్లో జరిగే ఎన్నికలపై వీటి ప్రభావమేంటి? నేరాభియోగాలు ఎదుర్కోవడం ట్రంప్‌కు ఇప్పుడు నిత్యవ్యవహారమైపోయింది. 2016 ఎన్నికల ప్రచారవేళ ఓ నీలిచిత్రాల తార నోరు మూయించేందుకు భారీగా డబ్బు చెల్లించారంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో 30 అంశాల ప్రాతిపదికన మన్హాటన్ కోర్ట్ అభిశంసించింది. రహస్య జాతీయ భద్రతా పత్రాలను అనధికారికంగా ట్రంప్ ఉంచుకున్నారంటూ జూన్‌లో ఫ్లోరిడాలోని గ్రాండ్ జ్యారీ 37 అంశాలతో నేరాభియోగం మోపింది. ఆ రెండు నేరాభియోగాల తర్వాత ఈ ఆగస్ట్ 1న ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ చేసిన అభియోగం ముచ్చటగా మూడోదన్న మాట. అయితే, మునుపటి రెండింటి కన్నా ఇది భిన్నమైనది, తీవ్రమైనది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ విజయం సాధించినా ట్రంప్, మరో ఆరుగురితో కలసి ఆ ఫలితాన్ని మార్చాలని చూశారన్నది తాజా అభియోగం. ఓటింగ్‌లో మోసమేమీ లేదని ట్రంప్‌కు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలతో కుట్ర చేశారనీ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోగొట్టేందుకు ప్రయత్నించారనీ ఆరోపణ. నిరుడు సభాసంఘం నివేదిక సైతం ఇలాంటి నిర్ణయాలకే వచ్చింది. ఎన్నికల తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై ట్రంప్ సమర్థకుల మూకదాడికీ, దానికి దారితీసిన పరిస్థితులకూ పూర్తి బాధ్యత ట్రంప్‌దేనని తేల్చేందుకు చట్టపరమైన తొలి ప్రయత్నం ఈ తాజా నేరాభియోగం. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టుగా... 2020 ఎన్నికల్లో ఓడిపోయినా సరే అధికార పీఠంపై కొనసాగేందుకు అమెరికా లాంటి ప్రజాస్వామ్య అగ్రరాజ్యపు అధ్యక్షుడు ప్రవర్తించడం, ఎన్నికల ఫలితాలకు కుట్ర సిద్ధాంతాలు ఆపాదించడం ఎలా చూసినా సమర్థించలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ, ప్రశాంతంగా అధికార బదలాయింపు అనేవి గణతంత్ర అమెరికాకు మూలస్తంభాలు. కానీ, ఎన్నికల కౌంటింగ్ నియమాలు ఏర్పాటు చేశాక, గత 130 ఏళ్ళ పైగా అంతా ప్రశాంతంగా సాగితే, 2021లో ట్రంప్ తన చర్యలతో మూలాలకే దెబ్బకొట్టారు. ఎన్నికల్లో మోసం జరిగిందన్న తన వాదనకు మద్దతునివ్వాలంటూ అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చారు. చివరకు బైడెన్ విజయాన్ని ఖరారు చేసే శాసననిర్మాతల్ని సైతం ఆ జనవరి 6 నాటి మూకదాడితో భయపెట్టే ప్రయత్నమూ చేశారు. ఇది నేరమే కాదు... ఘోరం. అయితే, ఎన్నికల్లో మోసం జరిగిందని తాను చేస్తున్న వాదన బోగస్సని తెలిసినాసరే, ట్రంప్ కావాలనే అలా అడ్డంగా వాదించారని ప్రాసిక్యూటర్లు నిరూపించగలరా అన్నది ప్రశ్న. అలా నిరూపించడం మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి. ట్రంప్ మాత్రం ఈ అభియోగాలన్నీ తనపై రాజకీయ వేధింపుల్లో భాగమని ఆరోపిస్తున్నారు. వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని 77 ఏళ్ళ ట్రంప్ ఉవ్విళ్ళూరుతున్నారు. చిత్రంగా మునుపు మీద పడ్డ రెండు నేరాభియోగాల వల్ల ఆయన ఎన్నికల రేటింగ్ తగ్గకపోగా విపరీతంగా పెరిగింది. కోర్టు వ్యవహారాల వల్ల ట్రంప్ ఆర్థిక వనరులు తరిగిపోవచ్చు. కోర్ట్ విచారణ మాటెలా ఉన్నా తాజా అభియోగాన్ని సైతం ట్రంప్ తన రాజకీయ లాభానికి వాడుకోవడం ఖాయం. కక్ష సాధిస్తున్నారనీ, అసలైన బాధితుణ్ణి తానే అనీ ఆయన తన ప్రచారంలో వేడి పెంచగలరు. అసలు నిజం, సాక్ష్యాధారాలేమైనా, గణనీయ సంఖ్యలో అమెరికన్ ఓటర్లు ట్రంప్ వాదననే సమర్థించవచ్చు. వెరసి అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేనట్టు ఓటర్లు పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ తన రాజకీయ చాణక్యంతో కోర్టులో ఉచ్చు నుంచి జారుకొనే ప్రయత్నం చేస్తారు. వకీళ్ళ ద్వారా వ్యవహారాన్ని వీలైనంత జాప్యం చేసి, రేపు మళ్ళీ శ్వేతసౌధ పీఠమెక్కితే అక్కడ నుంచి ఇక అంతా తన కనుసన్నల్లో జరపాలన్నది ఆయన పేరాశ. నిజానికి, శృంగార తార కేసు వచ్చే మార్చిలో, రహస్య పత్రాల కేసు వచ్చే మేలో కానీ తేలవు. వచ్చే జనవరిలో ఎంపిక ప్రక్రియ ప్రారంభించే రిపబ్లికన్ పార్టీ ఆ లోగా తమ అభ్యర్థి ఎవరో ఖరారు కూడా చేసేస్తుంది. ఈ పరిస్థితుల్లో సత్వరమే ఈ అభియోగాలపై విచారణ జరిపి, తప్పొప్పులు తేల్చడమే అమెరికన్ కోర్టుల కర్తవ్యం. ట్రంప్ తప్పు లేదని తేలితే చేసేది లేదు. ఒకవేళ తప్పు చేసినట్టు ఆయనపై నేరాభియోగాలు రుజువైతే తగిన శిక్ష విధించి, చట్టం ముందు ఎంతటి వారైనా ఒకటేనని చూపవచ్చు. అమెరికా ప్రజాస్వామ్య స్ఫూర్తిని లోకానికి చాటవచ్చు. దేశ రాజ్యాంగ వ్యవస్థనే అవహేళన చేసిన ఘటనలో రాజకీయాల రొచ్చులోకి పోకుండా కోర్టులు అప్రమత్తతతో వ్యవహరించడమే ప్రజాస్వామ్య విలువలకు శ్రీరామరక్ష. ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది అందుకే! -
మళ్లీ మతం మంటలు!
విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్ పట్టణాలు అట్టుడికిపోయాయి. ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు. ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్ అంటుకుంది. అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది. నూహ్ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు. ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి. -
సైన్యం చెరలో నైజర్
అగ్రరాజ్యాల చంపుడు పందెంలో దశాబ్దాలుగా చిక్కిశల్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ నీడలోనే ఇప్పటికీ బతుకీడుస్తున్నాయని నైజర్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు నిరూపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ బజూమ్‌ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్ ఒమర్ చియానీ పీఠం అధిష్ఠించాడు. అతనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుందని అంటున్నారు. అవిద్య, ఆకలి, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్నచోట నియంతలదే పైచేయి అవుతుందని చరిత్రలో తరచు రుజువవుతున్న సత్యమే. తూర్పున ఎర్ర సముద్ర తీరంలోని సూడాన్‌తో మొదలుపెట్టి, పడమట అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి చేరువలో వుండే గినియా బిసావూ మధ్య వరసగా కొలువుదీరిన ఎనిమిది దేశాలున్న ప్రాంతాన్ని సహేల్ ప్రాంతం అంటారు. వీటిల్లో మిగిలినవన్నీ సైనిక పాలకుల పరం కాగా... తాజాగా నైజర్ సైతం ఆ ఖాతాలో చేరింది. తన అండదండలు పుష్కలంగా ఉన్న బజూమ్ ఉన్నట్టుండి అదృశ్యం కావటం, రెండురోజుల తర్వాత తిరుగుబాటు ప్రకటన రావటం అమెరికాకు మింగుడు పడని అంశం. పశ్చిమాసియా, దక్షిణాసియాలతో పోల్చినా జీహాదిస్టుల బెడదను అధికంగా ఎదుర్కొంటూ నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతం సహేల్ ఆఫ్రికా. అత్యంత వెనకబడిన ప్రాంతం కావటం వల్ల అక్కడి మరణాలు మీడియాకు పట్టవుగానీ... నిరుడు ఉగ్రవాదుల హింసాకాండకు ప్రపంచ వ్యాప్తంగా బలైన 6,701 మంది అభాగ్యుల్లో 43 శాతం మంది అక్కడివారే! సహేల్ ప్రాంతం గురించి ఐక్యరాజ్యసమితి వెబ్సైట్ వెతికితే దాన్ని ‘అవకాశాల గడ్డ’గా అభివర్ణిస్తుంది. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న ప్రాంతమని చెబుతుంది. ఆ ప్రాంతానికి చినుకు గగనం కావొచ్చు. అక్కడి నేలపై పంటలు పెద్దగా పండకపోవచ్చు. కానీ దాని లోలోపల యురేనియంతో సహా అపురూపమైన ఖనిజాలున్నాయి. విస్తృతంగా జలాశయాలున్నాయి. పునరు త్పాదక ఇంధన వనరులకు అది నిలయం. జనాభాలో 64.5 శాతం మంది ఇరౖవై అయిదేళ్లలోపువారే. ఇవన్నీ సహేల్ ప్రాంతానికి శాపంగా కూడా మారాయి. అమెరికా, ఫ్రాన్స్‌లు ఈ ప్రాంతంపై పట్టుబిగించేందుకు బాహాటంగా ప్రయత్నిస్తుంటే జర్మనీ, ఇటలీ, చైనా వంటివి చడీచప్పుడూ లేకుండా ఆ పని చేస్తుంటాయి. తిరుగుబాటు జరిగే సమయానికి నైజర్‌లో 1,100 మంది అమెరికా సైనికులున్నారు. అవసరాన్నిబట్టి డ్రోన్ దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరం ఉంది. కానీ తన మద్దతుదారును అది కాపాడుకోలేకపోయింది. నిజానికి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే బజూమ్ సైనిక జనరళ్లకు లక్ష్యంగా మారారు. కానీ అప్పట్లో ఆయన్ను వ్యక్తిగత భద్రతా బలగాలు కాపాడాయి. ఇప్పుడు ఆ బలగాలే అదును చూసి కాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియెట్ యూనియన్ల మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల వనరులను చేజిక్కించుకునేందుకు సాగిన పోటీతో సగటున ప్రతి 55 రోజులకూ ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని, అందులో చాలా భాగం విజయవంతమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. తమ ప్రయోజనాలు నెరవేరే వరకూ స్థానికంగా ఏ పాలకులున్నా, వారు ఎలా పాలిస్తున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోవు. ఆ ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం సైనిక నియంత లను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య మంత్రాన్ని పఠిస్తాయి. అంతక్రితం దశాబ్దాలపాటు అగ్రరాజ్యాల చెరలో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి చేరువైనా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల పడగనీడలోనే ఆ ప్రభుత్వాలు కొనసాగటం వల్ల స్థానికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పేరుకు ఎన్నికలేగానీ పెత్తనమంతా స్థానికంగా ఉండే సాయుధ ముఠా లదే! ఆ ముఠాల ప్రాపకంతోనే ఏ పాలకులైనా ఎన్నికల్లో గద్దెనెక్కుతారు. కూడు, గూడు, విద్య, వైద్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధి చూపటంలోనూ ఆ పాల కులు ఘోరంగా విఫలం కావటం తరచు కనబడేదే! ప్రజల్లో ఆ పాలకుల పట్ల ఉండే అసంతృప్తిని సైన్యంలోని ఉన్నతాధికారవర్గం సాకుగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పర్యవ సానంగా ముందో వెనకో ఆ దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైనిక కుట్రలకు తలవంచాయి. సహేల్ ప్రాంతంలో తిరుగుబాట్లు చేసినప్పుడల్లా సైనిక నియంతలు చెప్పే మొదటి కారణం అవినీతి. ఇప్పుడు నైజర్‌లో గద్దెనెక్కిన ఒమర్ చియానీ దానికి ఉగ్రవాద బెడదను కూడా జోడించాడు. దేశంలో ఉగ్రవాదం ముప్పు పెరగటం వల్ల సైన్యం జోక్యం తప్పనిసరైందని ప్రకటించాడు. నిజానికి వేరే దేశాల ‘ప్రజాస్వామ్య’ పాలకులతో పోలిస్తే బజూమ్ ఎంతో నయం. అల్ కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల దాడులను పూర్తిగా అదుపు చేయలేకపోయినా, వాటిని చాలా మేరకు నియంత్రించారు. పాశ్చాత్య దేశాల మద్దతు పుష్కలంగా ఉండటంతో నిధులు కూడా దండిగానే వచ్చాయి. విద్య, వైద్యంతో పాటు ఉపాధి కల్పన చర్యలు ప్రారంభమయ్యాయి. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. బజూమ్‌కు సైన్యం మద్దతు దండిగా ఉన్నదని, దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అందరూ అనుకుంటుండగానే చియానీ రూపంలో సైనిక నియంత అవతరించాడు. సహేల్ ప్రాంతంలోని వేరే దేశాల్లో ఉగ్రవాద బూచిని చూపి, పాలకుల భద్రతకు పూచీపడుతూ పబ్బం గడుపుకుంటున్న కిరాయి సైనిక ముఠా నాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు నైజర్‌ను ఉద్ధరిస్తానని ముందుకొస్తున్నాడు. అమెరికా, రష్యాల మధ్య సైతం మున్ముందు ఇక్కడ ఘర్షణ రాజుకునే ప్రమాదం ఉంది. ఇన్నిటిమధ్య నైజర్ మనుగడ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే! -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్‌లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్‌తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్‌లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్‌లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్‌ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్‌లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
ట్రంకుపెట్టె పిల్లలు
‘ఒరే మోహన్ గా! మన అమ్మలకి మనం పుట్టుండంరా! నిజంగా మనల్ని కనే ఉంటే మనల్ని రోజూ కళ్లెదురుగా సూసుకోకుండా ఉండగలుగుతారా! మనల్నిలాగా ఈ నరకంలో వదిలేసి ఎళ్లిపోగలుగుతారా?’... ఆరు నుంచి పది వరకు హాస్టల్లో ఉండే ప్రతి పిల్లాడు ఇలా ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా ఉండడు. ఎదిగీ ఎదగని వయసులో హాస్టల్లో ఏదెలా ఉన్నా అక్కడ పూడ్చలేని వెలితి– తల్లితండ్రులు లేకపోవడం. అమ్మ గోరుముద్దలు, నాన్న ప్రేమపూర్వక గదమాయింపులు, శుభ్రమైన పక్కబట్టలు, రేడియో పాట, సయించే భోజనం, అన్నింటికి మించి భద్రమైన ఇంట్లో ఒళ్లెరుగకపోయే నిద్ర. ఇవేవీ హాస్టల్లో ఉండవు! పిల్లలు చదువుకోవడానికే పుట్టి ఉండవచ్చు. చదువుకోవడానికి మాత్రమే పుట్టలేదు. కాని చదువుకుంటే తప్ప పుట్టగతులు ఉండవు. తొమ్మిది నెలల తర్వాతే పిల్లలందరూ భూమ్మీద పడ్డా ఆ భూమిని బట్టి వారి అదృష్టం ఆధారపడి ఉంటుంది. అగ్రహారం అయితే ఒకలాగా, రెడ్ల ఇలాకా అయితే ఒకలాగా, కామందుల వీధైతే ఒకటి, శెట్టిగారి బజారైతే ఒకటి. ఇవి గాకుండా వేరే వీధులు, వెలివాడలు ఉంటాయి. ఆ భూమ్మీద పుట్టిన పిల్లలు తిండికి, చదువుకు గతి లేకపోతే ఇదిగో ఇలా ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకోవాలి. అమ్మను తిట్టుకోవాలి. ఆక్రోశించాలి. హాస్టల్లో ఉన్న కన్నబిడ్డను ఆదివారం వచ్చి చూసుకునే వీలు తల్లికి ఉంటుంది. అదీ ఇదీ వండుకొని, బిడ్డ కడుపుకు ఇంత తినిపించుకుని, తల దువ్వి, పేన్లు చూసి, ఒళ్లో పరుండబెట్టుకుని కబుర్లు చెప్పి, వదల్లేక వదల్లేక ఆ తల్లి పోతూ ఉంటే అప్పటికే ఔట్బెల్లు టైమైపోయిందని తల్లి కళ్ల ముందే కన్నకొడుకును నాలుగు పీకుతాడు హాస్టల్ బాధ్యుడు. అప్పుడు తల్లేమైనా భద్రకాళి అవుతుందా? నా కొడుకును ఈ బందీఖానాలో ఉంచను అని తీసుకెళ్లి పోతుందా? ‘మీరు కొట్టి సంపేత్తాకి కనలేదు సారు మేము బిడ్డల్ని. మా గచ్చంతరం బాగోక ఇక్కడొదిలేసాం’ అంటా నడుసుకుంటా ఎలిపోతుంది. ‘ప్రపంచం మొత్తాన్ని తెచ్చి క్లాస్‌రూమ్‌లో కుదించలేము. క్లాస్రూమ్నే ప్రపంచంలోకి తీసు కెళ్లాలి’ అని 1912లో జర్మనీలో మొదటి హాస్టల్‌ను మొదలెట్టాడు రిచర్డ్ షిర్మన్ అనే స్కూల్ టీచరు. విహారాలకు వెళ్లే పిల్లలు తక్కువ ఖర్చులో బస చేయడానికి వీలుండటం లేదని తన స్కూల్లోనే తొలి హాస్టల్ కట్టాడు. అతని వల్ల ప్రపంచమంతా యూత్ హాస్టల్సు, దరిమిలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. విషాదమేమంటే ఏ ఉద్దేశంతో రిచర్డ్ షిర్మన్ హాస్టల్స్ మొదలెట్టాడో దానికి పూర్తి విరుద్ధంగా ఏ విహారమూ లేని బందీఖానాలుగా అవి మారాయి. ‘అందరికన్నా ముందు పరిగెత్తి కంచం పట్టుకుని లైన్లో నిలబడ్డా. అన్నం డేక్షాలొచ్చేసున్నాయ్. పొప్పుది, సాంబారుది, మజ్జిగిది గిన్నిలొత్తే వడ్డన మొదలెట్టేత్తారు. అన్నం డేక్షా మీద మూత లేదేమో ఈగలన్నీ ఆల్నియ్. అన్నియ్యా ఈగలోల్తనాయ్ అని పిలిత్తే ఆ ఈగల్ని తోలకుండానే దాని మీద మూత పడేసాడు వర్కరు. పారిపోయే దారిలేక ఆ ఈగలందులోనే సచ్చి అన్నంలో కలిసి పోనియ్. కంచంలో ఏత్తే హస్తానికో ఈగ పడింది నా కంచంలో’.... పాత భవనాలు, పెచ్చులూడిపోయే సీలింగులు, ఊరికి దూరంగా మనిషి అలికిడి లేని బీడు పరిసరాలు, సరిపోని నీళ్లు, కడుపులో దేవే పాయిఖానాలు, అపరిశుభ్ర ఆహారం, దుప్పట్లు ఇవ్వని చలికాలం, తప్పని తీట.. తామర, చీటికి మాటికి ఘోరంగా చావగొట్టే సిబ్బంది, ముళ్లతీగల ఫెన్సింగ్.... ఇవీ కొన్ని చోట్ల సంక్షేమ హాస్టళ్లు. తెలుగు సాహిత్యంలో హాస్టల్ లైఫ్ చెదురు మదురుగా కనిపిస్తుంది. నవీన్ ‘అంపశయ్య’, కేశవ రెడ్డి ‘సిటీ బ్యూటిఫుల్’, కొమ్మూరి వేణుగోపాలరావు ‘హౌస్ సర్జన్’, వడ్డెర చండీదాస్ ‘అనుక్షణికం’ హాస్టల్ జీవితాన్ని కొద్దో గొప్పో చూపుతాయి. అయితే అవన్నీ పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల జీవితాలు. కాని రచయిత మోహన్ తలారి ‘హాస్టల్ లైఫ్’ కథలు ప్రీ మెట్రిక్ విద్యార్థుల భౌతిక మనోలోకాల్లో హాస్టల్ రేపగల కల్లోలాన్ని గట్టిగా పట్టి ఇస్తాయి. ఇరవై ఏళ్ల క్రితం తాడేపల్లిగూడెం సమీపంలోని ఆరుగొలను గురుకుల పాఠశాలలో తాను గడిపిన హాస్టల్ జీవితపు పచ్చి జ్ఞాపకాల ధార ఈ కథలు. కర్కశపు చారలు ఈ కథలు. ఇరవై ఏళ్ల తర్వాత, నేడు, ఇరు రాష్ట్రాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల, హాస్టళ్ల అధికారులు ఈ పుస్తకాన్ని ఒక కొలతగా గనక తీసు కుంటే, అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో, ఎంత మారిందో చూసుకుంటే చేయవలసిన పని తెలు స్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే లక్షలాది నిరుపేద బాలల పెదాలపై చిర్నవ్వు మొలుస్తుంది. నిజానికి ఇంటర్, కాలేజీ హాస్టళ్ల విద్యార్థులకు అంతో ఇంతో ఎరుక, ఎదురీదే సామర్థ్యం ఉంటాయి. కాని 15 లోపు పసివయసు విద్యార్థులు ఉండే, తల్లితండ్రులను వదలి ఉండే, పేదరికం కారణంగానో నిస్సహాయ పరిస్థితుల వల్లనో హాస్టళ్లల్లో ఉండి చదువుకోక తప్పని వర్గాల పిల్లలుండే హాస్టళ్లు ఎంతో ఆదరణీయంగా ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. అక్కున జేర్చుకునేలా ఉండాలి. అలా ఉన్నదా? నీ పిల్లలు ఉండే చోటు ఎలా ఉండాలనుకుంటావో... ఆ పిల్లలు ఉండే చోటు అలా ఉండాలనుకుంటున్నావా? ‘అంకుల్ టామ్స్ కేబిన్ ’ అనే ఒక్క పుస్తకం నల్ల బానిసల జీవితాల్లో సమూలంగా మార్పు తెచ్చింది. మన దేశంలో ఎన్ని పుస్తకాలు వస్తే సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే – దేవునితో తప్ప మరెవరితోనూ మొత్తుకునే వీలులేని– ట్రంకుపెట్టె పిల్లల జీవితాలు మారతాయి? -
మహిళాశక్తిపై మారీచ యుద్ధం!
పవన్ కల్యాణ్ అమ్ముల పొదిలో అన్నీ పచ్చబాణాలే ఉంటా యన్న నిజం ఎప్పటికప్పుడు నిగ్గుదేలుతూనే వస్తున్నది. ఇటీవల ఆయన వదిలిన ఒక పచ్చబాణం మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. ఒక రాజకీయ పార్టీకి సిద్ధాంత నిబద్ధత లేనప్పుడు, స్వార్థ ప్రయోజనాలే ఆ పార్టీ కార్యక్రమంగా ఉన్నప్పుడు... మాయోపాయాలతో కూడిన వ్యూహాలనూ,ఎత్తుగడలనూ ఆశ్రయిస్తుంది. అటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. తాను అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల మ్యానిఫెస్టోను మాయం చేసి, వెబ్సైట్లోంచి కూడా తొలగించిన ఏకైక పార్టీ తెలుగుదేశం. పార్టీ అధ్యక్షుడు తన సిద్ధాంతగ్రంథంగా వెలువరించిన ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని కూడా మార్కెట్లో ఎక్కడా లభ్యం కాకుండా మాయం చేసిన ఘనత ఆ పార్టీదే. ఇటువంటి ఘనత ప్రపంచంలో మరో పార్టీకి లేదు. స్వార్థ ప్రయోజనాలకూ, సిద్ధాంత నిబద్ధతకూ చుక్కెదురు. తన ఆశయ గ్రంథాన్నీ, ఎన్నికల హామీలనూ జనంలో లేకుండా దాచేయడం సిద్ధాంత నిబద్ధత లేదనడానికి నిదర్శనం. స్వార్థ ప్రయోజనాల కోసం ఎప్పటికెయ్యది ప్రయోజనమో అప్పటికా జెండా ఎత్తడాన్ని ఆ పార్టీ ఒక వ్యూహంగా అనుసరిస్తూ వస్తు న్నది. ప్రత్యర్థి పార్టీ ఒక భావజాల నిబద్ధతతో ఉన్నప్పుడు, తాను ప్రకటించిన కార్యక్రమాలను వరుసగా అమలు చేస్తున్న ప్పుడు, తన మ్యానిఫెస్టోకు పటం కట్టి, ఇంటింటికీ వెళ్లి మీరే మార్కులేయండని అడుగుతున్నప్పుడు... ఈ పారదర్శకతను ఎదుర్కోవడం, ఈ నిబద్ధతతో తలపడటం స్వార్థపక్షానికి సాధ్య మవుతుందా? కాదు కనుకనే వైసీపీపై మారీచ యుద్ధ వ్యూహాన్ని టీడీపీ ఎంచుకున్నది. వైసీపీ అమలు చేస్తున్న పేదల అనుకూల కార్యక్రమాలన్నింటిపైనా దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా అది తలకెత్తుకున్నది. ఇందులో ఎల్లో మీడియా, రాజకీయ భాగ స్వామిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్ పార్టీ తమకు తాము నిర్దేశించిన పాత్రలను పోషిస్తున్నాయి. పేదల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఒక్క పైసా వృధా కాకుండా ఇప్పటికి రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేసింది. ఈ కార్యక్రమం వల్ల ఏపీ మరో శ్రీలంక కాబోతున్నదని వీరు చేసిన ప్రచారం సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ కార్యక్రమం రాష్ట్రాన్ని మాంద్యంలోకి జారకుండా కాపాడిందనీ, జీఎస్డీపీ వృద్ధికి దోహదపడిందనీ ఆర్థికవేత్తలు పలువురు ప్రశంసించడంతో వారి గొంతులో వెలక్కాయ పడింది. నగదు బదిలీ అంశాన్ని వదిలిపెట్టి అడ్డ గోలు అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం తప్పని మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విడుదల చేసిన రాష్ట్రాల వారీ అప్పుల జాబితా రుజువు చేసింది. పేద పిల్లల ఇంగ్లీషు మీడియం చదువుపై చేసిన దుష్ప్ర చారం కూడా ఈ కోవలోదే. భాషాభిమానులను రెచ్చగొట్టడానికి చేతనైనంత ప్రయత్నం చేశారు. నిన్న మొన్నటి దాకా రాజ్యాంగ పదవులు నిర్వహించిన ఒకరిద్దరి సేవలను కూడా ఇందుకు ఉపయోగించుకున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే నగరం మైలపడిపోతుందని కోర్టుకెక్కారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి కాలనీలు ఏర్పాటు చేస్తుంటే చేసిన తప్పుడు ప్రచారం కూడా అప్పుడే మరిచిపోయేది కాదు. ఇటువంటి ఉదాహరణలు కొన్ని వందలు ఇవ్వొచ్చు. జగన్ ప్రభుత్వం మహిళా సాధికారత కార్య క్రమం కూడా ఇప్పుడు వీటి సరసన చేరింది. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్య కార్యక్రమాల్లో మహిళా సాధికా రత ఒకటి. చంద్రబాబు – పవన్ – ఎల్లో మీడియా కూటమికి సిద్ధాంత నిబద్ధత లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా మహిళా సాధికారత పట్ల వ్యతిరేకత, మహిళల పట్ల వివక్ష వారి స్వభావా ల్లోనే ఉన్నది. బహిరంగంగా వారు మాట్లాడిన మాటల ద్వారానే ఈ సంగతిని గ్రహించవచ్చు. వీరి మహిళా వ్యతిరేక వైఖరిని ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఇటువంటి మనస్తత్వమున్న వ్యక్తులు మహిళా సాధికారతను ఎలా సహిస్తారు? అలాగని ఆ భావనను బహిరంగంగా వ్యతిరేకించలేరు. అందుకని దుష్ప్రచా రాలతో చేసే పరోక్ష దాడినే ఎంచుకున్నారు. ఈ దాడిలో తొలి బాణాన్ని వేసే బాధ్యతను పవన్ కల్యాణ్‌కు అప్పగించారు చంద్రబాబు. గోదావరి జిల్లాల పర్యటనలో పవన్ కల్యాణ్ ఈ దాడులకు దిగారు. పవన్ ప్రసంగంలోని రెండు అంశాలను మహిళా సాధికారతపై పరోక్షంగా జరిగిన దాడిగా విశ్లేషకులు పరిగణి స్తారు. మొదటి అంశం – ‘ఉమన్ ట్రాఫికింగ్’. రాష్ట్రం నుంచి మూడేళ్లలో 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందనీ, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నదనీ పవన్ ఆరోపించారు. రెండో అంశం – ‘వలంటీర్ వ్యవస్థ’. ఒంటరి మహిళలు, వితంతువులు, నిస్సహాయుల వివ రాలు సేకరించి వలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు అప్పగించారనీ, అందువల్లనే ఇన్ని వేలమంది అక్రమ రవాణా సాధ్య మైందనీ ఆయన ఆరోపణ. ఈ వలంటీర్లలో 55 శాతం మంది మహిళలే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మహిళా సాధికారత కార్యక్రమాలు ఒక ఉద్యమంగా సాగుతున్న తరు ణంలో ఈ తరహా వ్యాఖ్యలు కచ్చితంగా బురద జల్లడానికీ, పక్కదోవ పట్టించడానికీ ఉద్దేశించినవేననే అభిప్రాయం కలుగు తున్నది. మహిళా సాధికారత అంటే ఏమిటో అర్థమైతే ఈ తరహా దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. మహిళా సాధికారత అనే అంశానికి చాలామంది చాలా రకాలుగా నిర్వచ నాలు చెప్పారు. వాటన్నింటినీ క్రోడీకరిస్తే తేలే విషయం ఒక్కటే. ‘సమస్త జీవన రంగాల్లో భాగస్వామిగా ఉండగలిగే స్వేచ్ఛ – అందలాలను అందుకోవడానికి, వనరులను వినియో గించుకోవడానికి, నిర్ణయాధికార స్వాతంత్య్రానికి సంబంధించి సమాన అవకాశాలు – సాంఘిక కట్టుబాట్లు, వివక్ష లేకుండా తన జీవితంపై తాను సంపూర్ణ హక్కులు కలిగి ఉండటం.’ ఇటు వంటి పరిస్థితులన్నీ ఒనగూడితేనే మహిళా సాధికారత సిద్ధించిందని భావించవలసి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సాధ్యమవు తుందా అనేది పితృస్వామిక వ్యవస్థల్లో తలెత్తే మొదటి ప్రశ్న. గడచిన కొన్ని దశాబ్దాల పరిణామాలను, కొన్ని పశ్చిమ దేశాలు సాధించిన గణనీయమైన పురోగతిని పరిశీలిస్తే ఇది అసాధ్య మైన విషయం కాదని బోధపడుతుంది. కాకపోతే, ఇందుకు ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు ఈ దిశలో పట్టుదలగా పని చేయవలసి ఉంటుంది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలేమిటి? అందుకు అడ్డుపడే అంశాలేమిటి? స్థూలంగా ఒక ఐదు అంశాలు సాధికారతకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. 1. సాధికారతకు ‘విద్య’ తొలి మెట్టు. తమ జీవిత లక్ష్యాలను ఎంచు కోవడానికి, చేరుకోవడానికి, అందుకు సంబంధించిన నిర్ణ యాలను స్వయంగా తెలివిడితో తీసుకోవడానికి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా మెలగడానికి విద్య దోహదపడుతుంది. 2. రెండో మెట్టు – ‘ఆర్థిక స్వాతంత్య్రం’. ఉత్పాదక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తిలో పెరగాలి. ఆర్థిక వనరులు వారికి కూడా అందుబాటులో ఉండాలి. నిర్ణయాధికార స్థానాల్లో వారికి సమాన అవకాశాలు ఉండాలి. 3. ‘ఆరోగ్యం–సంక్షేమం’ మూడో ముఖ్యాంశం. వైద్య–ఆరోగ్య అవకాశాలు అందు బాటులో ఉండటం. వివక్షకు, హింసకు దూరంగా ఉండటం. 4. ‘రాజకీయ ప్రాతినిధ్యం’ నాలుగోది. వివిధ స్థాయిల్లో వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. వారి జీవితాలపై ప్రభావం చూపే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాలి. 5. సాంఘిక కట్టుబాట్లు ఐదో అంశం. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జీవనశైలి మారకుండా అవరోధంగా ఉండే శృంఖలాలను తెంచుకుంటూ లింగ వివక్షను తొలగించడం. ఈ ఐదు అంశాల్లో పురోగతి సాధిస్తే సూత్రప్రాయంగా మహిళా సాధికారత సాధించినట్టే! ఈ ఐదు అంశాలకూ విరు ద్ధంగా పనిచేస్తే అవే సాధికారతకు ఆటంకాలుగా మారుతాయి. మహిళా సాధికారతలో ప్రభుత్వాల చిత్తశుద్ధి, కృషి ముఖ్యం. ఈ పదాన్ని ఉపయోగించకపోయినా భారత రాజ్యాంగంలో ఇదే తరహా కర్తవ్యబోధ ఉన్నది. రాజ్యాంగ పీఠికల్లోనూ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల్లో వివక్షలేని మహిళా భ్యున్నతికి సంబంధించిన అధికరణాలున్నాయి. పేదరికం, పెరుగుతున్న అసమానతలు, పర్యావరణ ముప్పు అనే మూడు భూతాలు మొత్తం భూగోళానికే ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన సంగతి తెలిసిందే. ప్రపంచ రాజ్యాలన్నీ 2015లో సమావేశమై మెరుగైన ప్రపంచం కోసం 17 లక్ష్యాలను ఏర్పర చుకున్నాయి. ఈ లక్ష్యాలను 2030లోగా సాధించాలన్న గడు వును కూడా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాల్లో ఐదవది మహిళా సాధికారత. తీర్మానమైతే చేసుకున్నారు కానీ, చాలా దేశాల్లో సంకల్పం కొరవడినట్టు కనిపిస్తున్నది. మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన స్పృహే ఉన్నట్టు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు – రాజకీయ నేతలు స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకోవడం! పేదరికం నుంచి ప్రజ లను బయటకు తీసుకురావడంపై, అసమానతల తొలగింపుపై వారికి అవసరమైన సామాజిక దృక్పథం లేకపోవడం! ఈ ధోరణికి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్లుగా సాగుతున్న వైఎస్ జగన్ పరిపాలన భిన్నమైనది. అంబేడ్కర్ రాజ్యాంగ ఆశయాలను జగన్ ప్రభుత్వం ఔదలదాల్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గీటురాళ్లుగా పెట్టు కున్నది. ఇందుకు మనం అనేక ఉదాహరణలు ఉటంకించవచ్చు. పేదరికం నుంచి విముక్తి, అసమానతల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున ఉద్యమస్థాయి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇదిగో ఈ ఉద్యమంపైనే చంద్రబాబు – ఎల్లో మీడియా – పవన్ కల్యాణ్ టీమ్ బురదజల్లింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారు తుందని శాపనార్థాలు పెట్టింది కూడా దీనిపైనే. మహిళా సాధికా రత విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని పనిచేస్తున్నది. మహిళా సాధికారతకు దోహదపడే అంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణమైన చర్యలను తీసుకున్నది. నాణ్యమైన విద్యావకాశాలను అందరికీ అందు బాటులో తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు పెళ్లి కానుక (కల్యాణమస్తు, షాదీ తోఫా) వర్తిస్తుందనే నియమం వెనుక బాల్య వివాహాలను నిరోధించడంతోపాటు కనీసం ఇంటర్మీడి యట్ పూర్తయ్యే వరకైనా బాలికలు డ్రాపవుట్లుగా మిగలకుండా ఉంటారనే ఆశాభావం కూడా ఉన్నది. ఈ నిబంధనను కూడా విమర్శించి తన సామాజిక స్పృహ స్థాయేమిటో ప్రతి పక్షం వెల్లడించింది. ఈ నాలుగేళ్ల చర్యల ఫలితంగాæ పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరిగింది. అమ్మ ఒడి కూడా అందుకు దోహదపడింది. ఇప్పుడు పాఠశాలల్లో బాలికల సంఖ్య సుమారు 48 శాతానికి చేరుకున్నది. డ్రాపౌట్ల సంఖ్య స్థిరంగా తగ్గుతున్నది. ఆర్థిక రంగంలో మహిళల పురోభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘చేయూత’ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో పదహారున్నర లక్షల మంది మహిళలు కొత్త వ్యాపారాలను ప్రారంభించడమో, పాత వ్యాపారాలను వృద్ధి చేసుకోవడమో జరిగింది. చంద్రబాబు నమ్మకద్రోహంతో నిస్తేజ మైన పొదుపు సంఘాలను ‘ఆసరా’ పథకం ఆదుకున్నది. పునరుజ్జీవం పొందిన పొదుపు సంఘాలకు ఈ నాలుగేళ్లలో బ్యాంకులు ఒక లక్షా పదహారు వేల కోట్ల రుణాలను అంద జేశాయి. దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పొదుపు సంఘాలు క్రియాశీల పాత్రను పోషిస్తున్నాయి. 30 లక్షలమంది మహిళలకు ఇళ్ల పట్టాలు లభించి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. ప్రభుత్వ పథకాల ప్రధాన లబ్ధిదారులుగా మహిళలే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. బాబు కేబినెట్లో ఇద్దరు మహిళలుంటే ఇప్పుడు నలుగురున్నారు. గతం కంటే ముఖ్యమైన శాఖలను వారు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్పి చైర్మన్ పదవుల్లో 55 శాతం మంది మహిళలే. 50 శాతం నామినేటెడ్ పదవులను వారికి రిజర్వ్ చేశారు. గ్రామ సచివాలయాల్లో 1,38,026 మందిని నియమిస్తే అందులో 77,935 మంది మహిళలు. వలంటీర్లలో 55 శాతం మంది మహిళలు. ఆరోగ్య శాఖలో చేసిన 48 వేల నియామకాల్లో అత్యధికులు మహిళలు. ఈ సంవత్సరం డిగ్రీ పూర్తిచేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు పొందిన లక్షా ముప్ఫయ్‌వేల మందిలో 60 శాతం అమ్మాయిలు. మహిళా సాధికారత దిశలో ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన కలిగిన ఫలితాల్లో ఇవి కొన్ని మాత్రమే! గర్భిణీలు, బాలింతల దగ్గర నుంచి మహిళల ఆరోగ్య పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వేధింపులకు విరుగుడుగా తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ సూపర్ హిట్టయ్యింది. ఈ విజయాలను పక్కదారి పట్టించడానికే వ్యూహం ప్రకారం మహిళల అక్రమ రవాణా అంశాన్ని పవన్ కల్యాణ్ తెరపైకి తెచ్చారని అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే పవన్ చెప్పినట్టు ఈ మూడేళ్లలో 30 వేలమంది మహిళల అక్రమ రవాణా జరగలేదు. కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించిన నివే దిక, రాష్ట్ర పోలీసు అధికారుల వివరణ ప్రకారం ఈ మూడేళ్లలో 26,099 మంది ‘అదృశ్య’మయ్యారు. వీటిని మిస్సింగ్ కేసులు అంటారు. ట్రాఫికింగ్ అనరు. ఈ మొత్తంలో 2019కి ముందు అదృశ్యమై అప్పటికి ఆచూకీ లభించని వారి సంఖ్య కూడా కలిసి ఉన్నది. ఈ అదృశ్యమైన వారిలో 23,394 మందిని గుర్తించి, తిరిగి ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఇక మిగిలింది 2705 మంది. ఇది 2021 డిసెంబర్ 31 నాటి లెక్క. ఆ తర్వాత ఇందులో మరెంతమంది ఇల్లు చేరారనే అంశంపై పోలీసు శాఖ ఆ యా కేసులను పరిశీలించవలసి ఉన్నది. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉన్నది. కానీ, పవన్ తీసిన రాగం, దానికి యెల్లో మీడియా, చంద్రబాబు చేసిన రాద్ధాంతం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వేలాది మంది అదృశ్యమయ్యారనే అపోహ కలుగుతుంది. ఈ అపోహ కలిగించడమే వారి లక్ష్యం. వందలు, వేలు కాదు. పదిమంది అదృశ్యమైనా, ఒక్కరు అక్రమంగా రవాణా అయినా ఆందోళన చెందవలసిన విష యమే. సిగ్గుపడవలసిన సంగతే! ఈ పరిస్థితులకు కారణాలే మిటి? పేదరికం, అవిద్య, నిస్సహాయత – ఇటువంటివన్నీ కారణాలవుతాయి. మహిళా సాధికారత ద్వారానే వీటిని జయించగలుగుతారు. ఆ దిశలో పనిచేస్తున్న జగన్ ప్రభుత్వ విజయా లను మరపించేందుకే ట్రాఫికింగ్‌ను ముందుకు తెచ్చారనే వాదనకు బలం చేకూరుతున్నది. సాధికారతకు దోహదపడే అంశాలను బలపరచకపోగా అడ్డంకిగా ఉండే సాంఘిక రుగ్మత లను మాత్రం తెలుగుదేశం కూటమి ఎగదోస్తున్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అంటూ చంద్ర బాబు చేసే ప్రచారం ఈ రుగ్మతలకు ఆజ్యం పోసేదే! పైగా ఈ ముఠాలోని ముఖ్యనేతలంతా గతంలో మాట్లాడిన మాటలూ, చేసిన చేష్టలూ మహిళను సాటి మనిషిగా కాక, ఆట వస్తువుగా పరిగణించే దృక్పథానికి ప్రతీకలు. ఇటువంటి శక్తులు మహిళా సాధికారతను సహిస్తాయా? చస్తే సహించవు. లక్షన్నరమంది మహిళలు ఒక్కసారిగా వలంటీర్లుగా సేవారంగంలోకి అడుగు పెట్టి క్రియాశీలంగా వ్యవహరిస్తుంటే తట్టుకోలేని ప్రబుద్ధుడు వారిపై నిందలు మోపడం ఈ అసహనానికి పరాకాష్ఠ! వర్ధెళ్లి మురళి, Vardhelli959@gmail.com -
అటవీ సంరక్షణ ఇలాగేనా!
‘నేను అరణ్యంలో సంచరించివచ్చిన ప్రతిసారీ ఆ వృక్షాలకు మించి ఎంతో ఎత్తుకెదిగిన భావన నన్ను చుట్టుముడుతుంది’ అంటాడు అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు హెన్రీ డేవిడ్ థోరో. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, మన కళ్లముందే చిన్నబోతున్న పర్యావరణానికి జీవం పోయడానికి అడవులు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో అతి ముఖ్యమైన అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు ఆమోదం పొందటం ఆందోళన కలిగి స్తుంది. నాలుగు దశాబ్దాల క్రితం...అంటే 1980లో ఆమోదం పొందిన అటవీ సంరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు ప్రతిపాదించింది. బిల్లు ప్రారంభంలోని లక్ష్య ప్రకటన ఎంతో ఉదాత్తమైనది. భూమండలం వేడెక్కి, పర్యావరణం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్న వర్తమా నంలో అడవుల విస్తరణ అత్యవసరమని ఆ ప్రకటన తెలిపింది. 2030 నాటికల్లా అదనంగా దాదాపు మూడువందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని పారిస్ ఒడంబడికలో మన దేశం హామీ ఇచ్చిన సంగతిని కూడా ప్రస్తావించింది. ఇవి సాధించాలంటే అటవీ విస్తరణ, అడవులపై ఆధారపడిన వర్గాల జీవికను మెరుగుపరచటం అవసరమని బిల్లు సరిగానే గుర్తించింది. కానీ అటు తర్వాత ప్రతిపాదించిన సవరణలన్నీ అందుకనుగుణంగా లేవు. మణిపుర్లో దుండగులు సాగించిన అత్యంత అమానవీయ దురంతాలపై విపక్షాలు ఆగ్రహోదగ్రమై చర్చకు పట్టుబట్టిన పర్యవసానంగా పార్లమెంటు స్తంభించిపోవటంతో ఈ సవరణ బిల్లు బుధవారం మూజువాణి ఓటుతో గట్టెక్కింది. ఈమధ్యకాలంలో అత్యంత ప్రాధాన్యతగల ఫైనాన్స్ బిల్లులే ఆ దోవన ఆమోదం పొందిన సందర్భా లుంటున్నాయి. ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది గనుక అది తప్పనిసరి కూడా కావొచ్చు. కానీ అటవీ సంరక్షణ చట్టం సవరణ బిల్లుకు అంత తొందరేమొచ్చింది? దేశంలో 1980లో అటవీ సంరక్షణ చట్టం ఎందుకు తీసుకురావాల్సివచ్చిందో గుర్తుచేసుకోవాలి. అంతకుముందు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఎడాపెడా అడవుల నరికివేతకు అనుమతి చ్చిన పర్యవసానంగా 42 లక్షల హెక్టార్ల అడవులు కోల్పోయామని గ్రహించిన తర్వాత ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ చట్టం తీసుకొచ్చేనాటికి పర్యావరణంపై ఇప్పుడున్నంత చైతన్యం లేదు. 1985 తర్వాతే అంతర్జాతీయంగా కూడా పర్యావరణ స్పృహ పెరిగింది. ఒకరకంగా అటవీ సంరక్షణ చట్టం అత్యంత కఠినమైనది. అందువల్లే ఆ చట్టం వచ్చాక ఈ నాలుగు దశాబ్దాల్లో కోల్పోయిన అటవీ భూములు 15 లక్షల హెక్టార్ల లోపే. మన భూభాగంలో కేవలం 21 శాతం మాత్రమే అడవులు న్నాయి. అందులో దట్టమైన అరణ్యాలున్న ప్రాంతం కేవలం 12.37 శాతం. ఈ దట్టమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. వీటిని ప్రాణప్రదంగా కాపాడుకోవటం, వీలైనంతమేరకు విస్తరించటం ధ్యేయం కావలసిన సందర్భంలో తీసుకొచ్చిన సవరణ బిల్లు అందుకనుగుణంగా లేదు. ప్రభుత్వ రికార్డుల్లో అడవులుగా నమోదైన భూములన్నీ అటవీ భూములకిందికే వస్తాయని 1980 చట్టం చెబుతుండగా, 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాన్ని మరింత విస్తరించింది. నిఘంటు అర్థాన్ని సంతుష్టి పరిచేలా ఉండే భూములు సైతం ఆ చట్టం పరిధిలోకొస్తాయని తెలిపింది. తాజా బిల్లు దాన్ని పూర్తిగా మారుస్తోంది. 1980 లేదా ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదైవున్న భూములకు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతోంది. నాగాలాండ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో శతాబ్దాలుగా అడవులుగానే ఉంటున్నా ఇప్పటికీ ప్రభుత్వ రికార్డులకెక్కని భూములున్నాయి. ముఖ్యంగా గడ్డి భూములు, మడ అడవుల వంటి వాటికి అడవులుగా గుర్తింపులేదు. వాటికి అటవీ సంరక్షణ చట్టం వర్తించదని చెబితే ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. దేశంలోని అటవీ భూముల్లో 15 శాతం ప్రాంతానికి ఈ సవరణ వల్ల కీడు జరుగుతుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తాజా బిల్లు దేశభద్రతను ప్రస్తావించి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలైన అధీన రేఖ, వాస్తవాధీన రేఖ వంటి చోట్ల వంద కిలోమీటర్ల పరిధిలో అటవీభూములుంటే వ్యూహాత్మక అవసరాల కోసం ఆ భూములను ముందస్తు అనుమతి లేకుండానే తీసుకోవచ్చన్న సవరణను ప్రతిపాదించింది. అధీన రేఖ, వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంతాలు పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన హిమాలయ సానువుల్లో ఉన్నాయి. అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగితే అదెంత ప్రమాదమో వేరే చెప్పనవసరం లేదు. అలాగే తీవ్రవాద కార్యకలాపాల ప్రాంతాలకూ ఈ మాదిరి మినహాయింపే ఉంది. దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకమైనవే. వాటినెవరూ కాదనరు. కానీ అందుకు పర్యావరణాన్ని పణంగా పెట్టడం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో మరిచిపోకూడదు. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పర్చటానికి అవరోధాలుంటున్న మాట వాస్తవం. ప్రాజెక్టుల అనుమతుల్లో జాప్యం చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. కానీ పర్యావరణ హాని, అందువల్ల కలిగే విలయంతో పోలిస్తే ఇదేమంత లెక్కలోనిది కాదు. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి పరిణామాలైనా, ప్రస్తుతం దేశమంతా ముంచెత్తుతున్న వరదలను చూసినా అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యత పరిరక్షణ ఎంత ప్రాణప్రదమో అర్థమవుతుంది. కనుక అవసరా లకూ, ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పుకూ మధ్య సమతూకం ఉండేలా మరింత మెరుగైన ప్రతి పాదనలుండాలి. పార్లమెంటు ఉభయ సభల్లో లోతైన చర్చలు జరిగితే ఇలాంటి సమస్యలు ప్రస్తావనకొచ్చి దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటం విచారకరం. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
మార్పులన్నీ మంచికేనా?
జీవితంలో శాశ్వతమైన ఒకే ఒక్కటి ఏమిటీ అంటే మార్పు అంటాడు ఓ గ్రీకు తత్త్వవేత్త. వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్, ఏడాది క్రితం అతని చేజిక్కిన ట్విట్టర్ విషయంలో శాశ్వతమైనది ఏమిటంటే, ‘అతి మార్పులు, తరచూ మార్పులు’. సోషల్ మీడియా మెసేజింగ్ వేదిక ట్విట్టర్ పేరును ఎక్స్ డాట్ కామ్‌గా, పిట్ట లోగోను ఎక్స్‌గా జూలై 24న మస్క్ మార్చాక విశ్లేషకుల వ్యాఖ్య ఇది. ప్రపంచ పటంలోని అనేక చిన్నదేశాల స్థూల జాతీయోత్పత్తి కన్నా ఎక్కువగా, దాదాపు 4400 కోట్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచి వేల ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్ నిబంధనల్లో మార్పు, ట్వీట్లో అక్షరాల పరిమితి పెంపు, ఆ పైన రోజులో ఒక యూజర్ చూసే ట్వీట్ల సంఖ్యపై పరిమితి విధింపు... ఇలా మస్క్ శైలి మార్పులు అనేకం. గత 16 ఏళ్ళలో జరిగిన మార్పుల కన్నా 6 నెలల్లో మస్క్ చేసిన మార్పులే ఎక్కువ. దానికి కొనసాగింపే ప్రకటించిన 24 గంటల్లోనే ఆచరణలో పెట్టిన తాజా పేరు, రూపు మార్పులు. సోషల్ నెట్వర్కింగ్ యాప్‌కు మించి ట్విట్టర్‌ను విస్తరించాలనే వ్యూహం దీని వెనకుందట! కొత్త పేరు, రూపుతో బ్యాంకింగ్, షిప్పింగ్ సహా సమస్తం చేసే విస్తృత వ్యాపారంలో ట్వీట్లు ఇక ఓ చిన్న భాగం మాత్రమేనట! ఇప్పటి దాకా అనేక పరిమితుల మధ్య కూడా ఎంతో కొంత స్వేచ్ఛాస్వరానికి వేదికైన ట్విట్టర్ ఇక మరో ఫక్తు మస్క్ వ్యాపార శాఖగా మారిపోనుంది. అమెరికా టెక్ వ్యాపారవేత్తలు నలుగురు కలసి చిన్న బృందాల మధ్య సమాచార వినిమయానికి ఎస్ఎంఎస్ సేవ అనే ఆలోచనగా మొదలై, ట్విట్టర్ ఇంతటి విశ్వరూపం దాల్చడం అనూహ్యం. పేరు లోని అక్షరాల్లో, లోగోలో అనేక మార్పుల తర్వాత 2006లో పిట్ట బొమ్మ ఆలోచనొచ్చింది. 2010లో ట్రేడ్‌మార్క్ పొంది, 2012లో ఇప్పటి లోగో ఖరారైంది. పదేళ్ళ పైగా లేత నీలం, తెలుపు రంగుల్లో ఈ పాపులర్ వేదిక ప్రపంచ కమ్యూనికేషన్లో విడదీయలేని భాగమైంది. పేర్లను మర్చిపోవచ్చు కానీ, లోగోల్ని మాత్రం మనిషి మెదడు మర్చిపోదన్నది శాస్త్రీయ సత్యం. దాన్ని కూడా మస్క్ పక్కన పెట్టారు. యాపిల్, నైక్ సంస్థల లానే లోగోతోనే ఠక్కున తెలిసిపోతున్న ట్విట్టర్ పేరు, బొమ్మ అన్నీ మార్చడం పైకి అర్థరహితమే! అయితే, అందులోని వ్యాపారతర్కం సదరు పక్కా వ్యాపారికే ఎరుక. పేరులో ఏముందనేవారికి మస్క్ భిన్నం. వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో తనకు కలిసొస్తుందని నమ్మే ‘ఎక్స్’ అక్షరం ఈ సంస్థ భవితవ్యాన్నీ మలుపు తిప్పుతుందని ఆయన భావన. ఎక్స్ అక్షరంపై ఆయన వ్యామోహం ఇవాళ్టిది కాదు. 1999లోనే ఆయన ఎక్స్ డాట్‌కామ్ పేరిట ఓ ఆన్లైన్ బ్యాంక్‌కు సహ వ్యవస్థాపకుడు. అనంతరం ఆ సంస్థే ‘పే పాల్’గా మారింది. మస్క్ తాలూకు రాకెట్ కంపెనీ పేరు ‘స్పేస్ ఎక్స్’. ఆయన సారథ్యంలోని టెస్లా సంస్థ విడుదల చేసిన తొలి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ మోడల్ పేరూ ఎక్సే! చివరకు మూడేళ్ళ క్రితం పుట్టిన తన కుమారుడి పేరు కూడా ఎక్స్ అని వచ్చేలా పెట్టారు. అయితే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మంది నెలవారీ ఖాతాదార్లున్న ట్విట్టర్ పేరు, లోగో మార్పులకు ప్రాథమిక ప్రతిస్పందన అంత ఆశాజనకంగా లేదు. ట్విట్టర్ పాపులర్ సంస్కృతిలోనే కాదు భాషలోనూ భాగమైంది. ట్వీట్ చేయడమనేది క్రియా పదమైంది. సమాచారం పంచుకొనేవారు ట్వీపుల్ పేర సర్వనామమయ్యారు. ట్విట్టర్ వచ్చాక జనం వార్తలు చదివే తీరు, స్పందించే తీరు అన్నీ మారిపోయాయి. తీరా మస్క్ వచ్చాక ట్విట్టర్ స్వరూ పమే కాదు... స్వభావమూ మారిపోయింది. ట్విట్టర్‌ను కొన్నప్పుడు తనంతట తానుగా సందేశాలు పంపే కంప్యూటర్ ప్రోగ్రామైన బోట్ సమస్యను పరిష్కరిస్తాననీ, తిరుగులేని వాక్ స్వాతంత్య్రానికి దీన్ని వేదికగా మారుస్తాననీ మస్క్ మాటిచ్చారు. అవన్నీ నీటి మూటలయ్యాయి. పైపెచ్చు, మస్క్ హయాంలోనే ట్విట్టర్లో బోట్స్ సంఖ్య, వాటిలో రకాలు, విషం కక్కే సందేశాలు... అన్నీ పెరిగాయి. అదీ చాలదన్నట్టు మనోడు వచ్చాక ట్విట్టర్లో పారదర్శకత తగ్గింది. మీడియాపై ధ్వజమెత్తే మస్క్ అందుకు తగ్గట్టే ట్విట్టర్‌కు జర్నలిస్టులు మెయిల్ చేస్తే జవాబిచ్చే సంప్రదాయానికీ తిలోదకాలిచ్చారు. ఒకప్పుడు సంపూర్ణ వాక్ స్వాతంత్య్ర వీరుడిననీ, ప్రజాస్వామ్యానికి వాక్ స్వాతంత్య్రమే పునాది అనీ, ట్విట్టరనేది మానవాళి భవితవ్యానికి సంబంధించిన అంశాలను చర్చించే రచ్చబండ అనీ బీరాలు పలికిన మస్క్ తీరా ఏడాది తిరిగేసరికల్లా బోర్డు తిప్పేశారు. ఆ యా దేశాల్లోని చట్టాలను గౌరవించేవాడినని ప్రకటించుకుంటూ, జర్నలిస్టులతో సహా పలువురి ట్విట్టర్ ఖాతాల్ని సస్పెండ్ చేసే స్థితికి వచ్చారు. ఇప్పుడాయన ధ్యేయమల్లా అర్జెంటుగా చేతిలోని పిట్టను ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ ఉత్పత్తుల్లో ఒకటైన చైనా ‘ఉయ్ఛాట్’ పద్ధతిలో సమస్త సర్వీసుల యాప్‌గా మార్చేయడం! మెసేజింగ్, ట్యాక్సీ సేవల ఆర్డరింగ్, డిజిటల్ చెల్లింపులు అన్నీ చేయడానికి వీలుండే ఉయ్ ఛాట్ ఘన విజయానికి చైనాలో మరో పోటీ లేకపోవడమూ ఒక కారణం. అది మర్చిపోయి, వాక్ స్వాతంత్య్రంతో మొదలైన ఓ వేదిక ఇలా వాక్ స్వాతంత్య్రమే లేని నిరంకుశ దేశంలోని అంశాలతో ప్రేరణ పొందే స్థితికి రావడమే విషాదం. మార్పు మంచికేనని అతిగా నమ్మినట్టున్న మస్క్ ట్విట్టర్లో ఏడాదిలో మరీ ఇన్ని మార్పులు చేయడమే విడ్డూరం. ఏమైనా, ఉత్సాహం ఉరకలేస్తూ, స్నేహంగా, స్వేచ్ఛగా తలెత్తి చూస్తున్న నీలిరంగు బుర్రుపిట్ట తుర్రుమంది. నిగూఢతకూ, అపరిమితత్వానికీ ప్రతీకైన నల్లరంగు ఎక్స్ ముందుకొచ్చింది. మిగిలిన వ్యాపారాల మాటేమో కానీ సామాజిక మాధ్యమ వేదికగా ఇది నిలుస్తుందా? సరైన మరో స్వేచ్ఛా వేదిక అవసరమనే సందు తానే సృష్టించినందున భవిష్యత్తులో ఆ రంగంలో వచ్చే పోటీలో గెలుస్తుందా? ఇప్పటికే థ్రెడ్స్ లాంటివి తల ఎగరేస్తున్నాయి. మార్పు మంచికే అయినా, అన్ని మార్పులూ మంచివేనా అంటే ఏమో చెప్పలేం! -
సమతూకపు నియంత్రణ!
అసలేమీ చేయకుండా ఉండే కన్నా, ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి ఆచరణలోకి దిగడం మంచిదే! కృత్రిమమేధ (ఏఐ)ను నియంత్రించడానికి చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అలాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అథారిటీ ఆఫ్ ఇండియా పేర ఒక సంస్థను నెలకొల్పాలంటూ భారత టెలికామ్ నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) చేసిన తాజా సిఫార్సు స్వాగతించాల్సిన అంశం. టెలికామే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, రవాణా, విద్య, వ్యవసాయం లాంటి అనేక రంగాలపై ఏఐ అమితమైన ప్రభావం చూపుతున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి, సమగ్రమైన నియంత్రణకు సమకట్టడం సరైన చర్య. ట్రాయ్ ప్రతిపాదించిన నియంత్రణ సంస్థ ఏఐ సంబంధిత రంగాలన్నిటికీ సలహా దారుగా, నియంత్రణకర్తగా వ్యవహరి స్తుంది. సాంకేతిక సంస్థలు మాత్రం తమ నియంత్రణకు మరిన్ని చట్టాల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ కోసం స్వతంత్ర చట్టబద్ధ సంస్థను పెట్టాలన్న ట్రాయ్ సిఫార్సుపై తీవ్రంగా స్పందిస్తు న్నాయి. అయితే, సాంకేతికతతో వచ్చే లాభాలను స్వీకరిస్తూనే, జరిగే హానిని కూడా గుర్తించి, సమతూకం సాధించడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా పాల కుల ముందున్న సవాలు ఇది. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) లాంటి సాంకేతికతలు ఏఐతో ముడిపడ్డాయి. వీటికి విడివిడి విధానాలతో లాభం లేదు. అన్నిటినీ సమన్వయపరిచే సమగ్రమైనది అవసరం. ట్రాయ్ తన 141 పేజీల నివేదికలో ఆ మాటే ప్రస్తావించి, తాజా సిఫార్సు చేసింది. నూతన సాంకేతిక ఆవిష్కరణలు శరవేగంతో వస్తుంటే, మన విధాన నిర్ణేతలు ఎంతో వెనుకబడి ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆన్లైన్ వేదికలకు సైతం నేటికీ సరైన నియంత్రణ వ్యవస్థ లేని దేశం మనది. 1998లో వచ్చిన గూగుల్, 2004లో ఆరంభమైన ఫేస్బుక్ లాంటివి ఇప్పటికీ వినియోగదారుల డేటాను యథేచ్ఛగా వాడుకుంటూ, లాభాలు మూట గట్టుకుంటున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు వగైరాలను దేశం దీర్ఘకాలంగా చర్చిస్తూనే ఉంది. సరైన నియంత్రణ లేక సామాజిక మాధ్యమ వేదికలు యూజర్ల డేటాను తస్కరిస్తూనే ఉన్నాయి. కొన్ని వేదికలు వేధింపులనూ, విద్వేషాలనూ రాజేస్తున్నాయి. ఏఐ ఆవిర్భావంతో డేటా దుర్విని యోగం ఎల్లలు దాటిందనే అనుమానం తలెత్తింది. వ్యక్తిగత గోప్యతే కాదు... ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం చూపే పరిస్థితి. ఏఐ నియంత్రణకు స్వతంత్ర వ్యవస్థ ఆలోచనను ఈ నేపథ్యం నుంచి చూడాలి. గత నవంబర్‌లో ఓపెన్ ఏఐ సంస్థ తన ఛాట్‌బాట్ అయిన ‘ఛాట్ జీపీటీ’ని విడుదల చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఉత్సాహం ఎంత ఉందో, ఆందోళనా అంతే ఉంది. ఛాట్ జీపీటీ లాంటి నమూనాల రూపకల్పనపై 6 నెలల మారటోరియం విధించాలని ఎలాన్ మస్క్ లాంటి నిపుణులు సైతం అనడం గమనార్హం. వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి, మానవకృషికి కొత్త మార్గాలు తెరిచి, మామూలు పనుల్ని సైతం సృజనాత్మకంగా చేయడానికి ఏఐ ఉపయుక్తమే. కానీ మనుషుల కృత్రిమ రూపాల తయారీ, తప్పుడు సమాచార వ్యాప్తి సహా ప్రమాదాలున్నాయి. ఏఐని అణ్వస్త్రపోరుతో పోలుస్తూ, మానవజాతి మనుగడకే ప్రమాదకారి అంటున్న శాస్త్రవేత్తలూ లేకపోలేదు. అందుకే, ఏఐని విశృంఖలంగా వదిలేయరాదన్నది నిపుణులు, పాలకుల ఏకాభిప్రాయం. నవీన ఆవిష్కరణల్ని ఆహ్వానిస్తూనే, వాటిని నైతికబద్ధంగా వాడేలా సమతౌల్య సాధన కీలకమనేది ప్రధాన సూత్రం. ఏఐ ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేయడానికి విశ్వవ్యాప్తంగా అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. విదేశాలు చట్టాలు చేస్తున్నాయి. కెనడా ముసాయిదా చట్టం చేసింది. అమెరికా ఏఐ బిల్లు తెచ్చింది. సురక్షితంగా, పారదర్శకంగా ఏఐ అభివృద్ధి సాగేలా చూస్తామంటూ అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ తదితర 7 ప్రధాన ఏఐ సంస్థల నుంచి ఈ నెల 21నే అమెరికా ప్రభుత్వం స్వచ్ఛంద వాగ్దానాలు తీసుకుంది. చైనా సైతం పాలనా చర్యలపై ఒక ముసాయిదా సిద్ధం చేసి, ప్రజాస్పందన కోసం ఉంచింది. బ్రెజిల్, జపాన్‌లు ఏఐ నియమావళి సిద్ధం చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ’ సంస్థాపక సభ్యదేశమైన భారత్ వంతు ఇప్పుడు ట్రాయ్ సిఫార్సుతో వచ్చిందనుకోవాలి. ఏఐ అభివృద్ధిలో భాగస్థులు పాటించాల్సిన బాధ్యతల్ని నాస్కామ్ ఇప్పటికే వెల్లడించింది. కానీ ఏఐపై మోజులో ప్రమాణాలు, నైతికత, జవాబుదారీతనం గాలికి పోవచ్చు. కాబట్టి నియంత్రణ సంస్థ పెట్టాలన్న మాట బంగారు బాట. నిజానికి, పార్లమెంట్లో ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. 2000 నాటి ఐటీ చట్టం స్థానంలో వచ్చే డిజిటల్ ఇండియా చట్టం కొంతవరకు ఏఐని నియంత్రిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఏఐకి ప్రత్యేక చట్టం యత్నాలేవీ ఇప్పటికీ లేవు. ఇది ఆలోచించాల్సిన విషయం. యూజర్లకు హాని ఏ మేరకు కలుగుతుందనే కోణం నుంచి ఏఐపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వైఖరి ఉంటుందనీ, ఇప్పటికిప్పుడు తీవ్రమైన చర్యలేమీ అవసరం లేదనీ సంబంధిత కేంద్ర మంత్రివర్యుల ఉవాచ. ముందుగానే ఏఐపై కఠిన నిబంధనలు పెట్టి, నవీన సాంకేతికకు ఉరితాళ్ళు బిగించరాదన్న మాట నిజమే! అదే సమయంలో రాబోయే కష్టనష్టాలను కూడా ముందుగా ఆలోచించడం, అవసరమైన చట్టాలతో యుద్ధానికి సిద్ధంగా ఉండడం వివేకం. ఏఐకి సంబంధించి చట్టబద్ధ మైన స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచన అందుకు తొలి అడుగు కావాలి. ఏఐపై ప్రాథమిక నిబంధనలు, హద్దు మీరితే జుల్మానాలు, దోషులపై పట్టు బిగించే అధికారాలతో సంస్థ ఏర్పాటు కావాలి. -
బియ్యమో... రామచంద్రా!
గడచిన కొద్దిరోజులుగా అమెరికాలోని దుకాణాల వద్ద భారతీయుల భారీ క్యూలు ఓ హాట్ టాపిక్. రానున్న రోజుల్లో బియ్యానికి కొరత రావచ్చనే భయంతో, నిల్వ చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున కొనుగోళ్ళకు దిగడంతో తలెత్తిన దృశ్యమది. ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ భారత సర్కార్ గత గురువారం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో రేపు ఇలాంటి దృశ్యాలు ఇంకేం తలెత్తు తాయో తెలీదు. అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు.. ప్రపంచ బియ్యం మార్కెట్‌ను ఇది ఆశ్చర్యపరిచినప్పటికీ, పెరిగిపోతున్న ధాన్యం ధరలను నియంత్రించడం రానున్న ఎన్నికల దృష్ట్యా పాలకులకు అనివార్యమైంది. దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది. Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa— Брат (@B5001001101) July 25, 2023 అత్యధిక బియ్యం ఎగుమతి మన దేశం నుంచే.. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది. అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు. ఈ నిషేధం తాత్కాలికమేనా? సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఆటంకం చాలదన్నట్టు అమెరికాలో ధాన్యం పండించే ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఈసారి అమెరికాలో గోదుమల దిగుబడి తగ్గవచ్చు. 16 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువకు నిల్వలు పడిపోవచ్చు. గోదుమలు, బియ్యం – రెంటికీ అగ్రరాజ్యంలో కటకట రావచ్చు. గత ఏడాది మేలో గోదుమల ఎగుమతిపై నిషేధం, సెప్టెంబర్‌లో విరిగిన బియ్యంపైన నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం సుంకం విధింపు... ఆ వరుసలో వచ్చినదే భారత సర్కార్ తాజా ఉత్తర్వు. ఈ ఏడాది మే నుంచి పంచదార ఎగుమతుల్నీ ఆపారు. ఇవన్నీ తిరోగామి చర్యలైనా, దేశీయ సరఫరాలో ఇబ్బందులతో అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటున్నా, నాట్లలో జరిగిన జాప్యం దెబ్బతీయవచ్చు. ఇక, ఎల్‌నినో పొంచి ఉండనేవుంది. So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n— Ian Miles Cheong (@stillgray) July 23, 2023 జబ్బలు చరుచుకున్నాం.. మరి నిషేధం విధించాల్సి రావడమేమిటి? వీటన్నిటి మధ్య ఈ ఏటి దిగుబడి పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ, గత ఆర్థిక సంవత్సరం బియ్యం, గోదుమలు – రెండూ ఎన్నడూ లేనంత అధిక దిగుబడినిచ్చాయని జబ్బలు చరుచుకున్నాం. ప్రపంచానికి మనమే ఆహారం అందిస్తున్నామన్నాం. తీరా అప్పుడు గోదుమలు, ఇప్పుడు బియ్యంపై ఇలా నిషే«ధం విధించాల్సి రావడమేమిటి? ఇది బేతాళ ప్రశ్న. అలాగే, ఏళ్ళ తరబడి కష్టంతో ప్రపంచ విపణిలో ఎగుమతిదారుగా సంపాదించుకున్న పేరుకు ఈ నిషేధపుటుత్తర్వులు చేటు చేస్తాయి. గుండుగుత్తగా ఎగుమతులపై నిషేధమనే కన్నా, నిర్ణీత కనీస ధరకు తక్కువైతే ఎగుమతుల్ని అను మతించబోమని చెప్పవచ్చు. దేశీయంగా ఆహార ధరలు నియంత్రించాలంటే పాలకులు ప్రత్యామ్నా యాలు ఆలోచించక తప్పదు. వాణిజ్య విధానాన్ని ఘడియకోసారి మార్చడం మార్గం కానే కాదు! -
బతుకు పండుగ
లోకంలో దుఃఖం మాత్రమే ఉందా? లేదు, సంతోషం కూడా ఉంది. శత్రుత్వపు చేదు మాత్రమే ఉందా? లేదు, ఆపదలో ఆదుకునే స్నేహమాధుర్యమూ ఉంది. సమరమే కాదు, శాంతీ; సంఘర్షణే కాదు, సామరస్యమూ; భయబీభత్సాలే కాదు; కరుణారౌద్రాలూ ఉన్నాయి. ఒక్కోసారి ప్రళయ తాండవంతో భయపెట్టే ప్రకృతిలోనే, సేదదీర్చే అందాలూ, ఆహ్లాదాలూ ఉన్నాయి. కానీ ఎంత సేపూ పెద్ద పెద్ద కష్టాలనే ఊహించుకుంటూ చిన్న చిన్న సంతోషాలను విస్మరిస్తాం. జీవితాన్ని ముళ్ళకంపగా భావించుకుంటూ పక్కనే ఉన్న మల్లెపొదల గుబాళింపును గమనించలేకపోతాం. జీవించడం కోసం చేసే ప్రయత్నంలో మనసారా జీవించడాన్ని మరచిపోతాం. మన పక్కనే ఉన్న మంచినీ, మానవత్వాన్నీ గుర్తించడంలో ఎలా విఫలమవుతామో ఒక చక్కని కథలో రావిశాస్త్రి చిత్రిస్తాడు. ఆ కథలో ఇద్దరు మిత్రులుంటారు. ఒకతను ఎప్పుడూ ఏదో కష్టంలో చిక్కుకుని కుంగిపోతూ ఉంటాడు; నిరాశానిస్పృహలకు ప్రతిరూపంగా మారి జీవితంపై విరక్తుడ వుతుంటాడు. రెండో వ్యక్తి ప్రతిసారీ అతనికి చేయందించి సమస్య నుంచి గట్టెక్కిస్తూ ఉంటాడు. అలా అతను తేరుకున్న ఓ రోజున తన ఖర్చుతో సినిమాకు తీసుకెడతాడు. ఆ సినిమాలోని ప్రతి నాయకుడు నాయికానాయకులను పెడుతున్న ముప్పుతిప్పలు చూసి, లోకంలో ఎక్కడా మంచి తనం, మానవత్వమే లేవంటూ అతను భారంగా నిట్టూర్చుతాడు. పక్కనే ఉన్న మిత్రుడు అతని వైపు ఒకసారి వింతగా చూసి మనసులోనే నవ్వుకుంటాడు. ఇప్పుడు కొంత మారి ఉండచ్చు కానీ, నిన్నమొన్నటివరకు పెళ్లి అనగానే కట్నాలు, కయ్యాలు, అలకలు, మాటపట్టింపులు, మనస్పర్థలే గుర్తుకొచ్చేవి. గుండె బరువెక్కించే ఇలాంటి అలవాటు పడిన చిత్రణకు భిన్నంగా అడుగడుగునా ఆహ్లాదం నింపేలా ఎవరైనా పెళ్లి కథను నడిపిస్తే అది మండువేసవిలో హఠాత్తుగా వీచిన మలయానిలంలా అలరిస్తుంది. ‘వసుంధర’ రాసిన ‘పెళ్ళిచేసి చూడు’ అనే నవల అలాంటి ఓ అరుదైన ఆశ్చర్యం. అందులో ముగ్గురు అన్నదమ్ములు, వారి భార్యలు ఆడబడచు పెళ్లిని తలకెత్తుకుంటారు. అన్ని విషయాలూ కలసి చర్చించుకుంటారు, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు, సమానంగా బరువు బాధ్యతలు పంచుకుంటారు, సంఘ టితంగా అడుగులు వేస్తారు. మగపెళ్ళివారి నుంచి సాధారణంగా ఎదురయ్యే సమస్యలే వస్తాయి. జయప్రదంగా పెళ్లి చేయడం ఒక్కటే లక్ష్యంగా వాటిని తెలివిగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితిలోనూ ఆందోళనకు లోనుకారు; ఒకరిపై ఒకరు లోక్తులు విసురుకుంటూ, ఒకరి నొకరు ఆటపట్టించుకుంటూ పరిసరాలను సంతోషభరితం చేసుకుంటారు. కల్యాణాన్నే కాదు, కల్యాణం చేయించిన తీరునూ కమనీయం చేస్తారు. ఈ ‘పెళ్ళిచేసిచూడు’ నమూనా పెళ్లికే కాదు; తమలో తమకున్న అన్ని విభేదాలనూ పక్కన పెట్టి పదిమందీ ఉమ్మడిగా నిర్వర్తించాల్సిన ఏ బాధ్యతకైనా వర్తిస్తుంది. ఉదాహరణకు, దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమన్న ఉమ్మడి లక్ష్యం దిశగా విజయవంతంగా నడిపించడంలో అధికారపక్షానికీ, ప్రతిపక్షాలకూ కూడా చక్కని ఒరవడి అవుతుంది. గొప్ప తాత్విక గాంభీర్యమూ, బహిరంతర్ఘర్షణా, జీవితం గురించిన చిక్కు ప్రశ్నలూ, ఒడుదొ డుకులూ ఉన్న రచనల్లోనూ, బరువైన పాత్రల సరసనే, వాతావరణాన్ని తేలిక చేసి ఉల్లాసపరిచే పాత్రలూ కనిపిస్తూ ఉంటాయి. అవి జీవితం తాలూకు అన్ని పార్శ్వాలనూ స్పృశించే రచయిత దృష్టివైశాల్యాన్ని పట్టి చూపుతాయి. బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది’ నవలలోని జగన్నాథం అలాంటి పాత్ర. సమస్యలకు అతీతంగా, దేనిమీదా ఎలాంటి ఫిర్యాదూ లేకుండా, సరదాగా, స్నేహంగా, హాస్యంగా ప్రవర్తించే జగన్నాథం చిన్నపాత్రే అయినా నాయకుడు దయానిధితో సమా నంగా గుర్తుండిపోతాడు. గమనించే చూపే ఉండాలి కానీ, అలాంటి వ్యక్తులు మన నిజజీవితంలోనూ మన చుట్టుపక్కల తారసపడుతూనే ఉంటారు. తను రచయితా, గొప్ప చదువరీ కాక పోయినా ప్రతి సాహిత్యసమావేశంలోనూ, రచయితల గోష్ఠుల్లోనూ విలక్షణమైన వాక్చాతుర్యంతో తన ఉనికిని ప్రముఖంగా చాటుకునే సంకు పాపారావు అనే రావిశాస్త్రి మిత్రుని గురించి వైజాగ్ లోనూ, బయటా కూడా సాహితీ ప్రముఖులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. తమ ఉజ్జ్వల వ్యక్తిత్వంతో శత్రుమిత్రుల తేడా లేకుండా అందరి మధ్యా సమానంగా తళుకులీనే పాత్రలూ ఆ యా విశిష్ట రచనల్లో కనిపిస్తాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంగా మార్గరెట్ మిచెల్ రచించిన ‘గాన్ విత్ ద విండ్’ నవలలోని మెలనీ పాత్ర అలాంటిది. చాలా అర్భకంగా, అమాయకంగా ఉండే మెలనీ, ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని తన ఉదాత్త వ్యక్తిత్వంతో ఆ నవలలోని ఇతర ప్రధాన స్త్రీ, పురుషపాత్రలను మించి ఎంతో ఎత్తుకు ఎదిగిపోతుంది. అభద్రత, అల్లకల్లోలం, ఉద్రిక్తత, స్థానభ్రంశం, లేమి నిండిన ఆ యుద్ధ వాతావరణం వజ్రం లాంటి ఆమె వ్యక్తిత్వానికి మరింత సానపట్టి కొత్త కాంతుల్ని ఆవిష్కరింపజేస్తుంది. యుద్ధం వరకే శత్రుత్వమని చెప్పి స్వపక్షంతో ఒంటరి పోరాటం చేసి, శత్రు సైనికుల సమాధుల వద్ద కూడా మెలనీ పుష్ప గుచ్ఛాలు ఉంచి వస్తుంది. ఇలాంటి పాత్రలూ, వ్యక్తులూ ప్రపంచాన్ని మరింత ఆశావహంగానూ, వాసయోగ్యం గానూ రూపిస్తారు. బతుక్కి ఓ అర్థాన్ని, పరమార్థాన్ని సంతరిస్తారు. ప్రేమనూ, స్నేహాన్నీ ఇచ్చి పుచ్చుకుని జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోడానికి స్ఫూర్తినిస్తారు. మిట్టపల్లాల చీకటిదారిలో దీపస్తంభాలవుతారు. -
నా దేశం నగ్నదేహమా?
అర నిమిషం నిడివి కూడా లేని ఆ వీడియో అణు విస్ఫోటనాన్ని తలపించింది. కోటానుకోట్ల మనసుల్ని షాక్‌కు గురిచేసిన ఆ విద్యుదావేశాన్ని కొలవడానికి వోల్టేజీ లెక్కలు సరిపోకపోవచ్చు. క్రోధం, దుఃఖం, అవమానం, అసహ్యం, భయం వగైరాలన్నీ సునామీ కెరటాల్లా గుండెల లోతుల్లోంచి దూసుకొస్తున్నాయి. మణిపురలో జరిగిన బర్బర క్రీడను కోట్ల గొంతుకలు ఖండిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ వార్తాసంస్థలన్నీ ఈ అమానుషాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఒక్క బీబీసీని అయితే బెదిరించగలిగాం కానీ ఇంతమందిని బెదిరించడం సాధ్యం కాలేదు. కనుక ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. ప్రపంచం నివ్వెరపోయింది. మూకదాడులు చెలరేగిన ప్రతిచోటా మహిళల దేహాలు శత్రువుల చేతుల్లో ఆయుధాలుగా మారుతూనే ఉన్నాయి. చిత్రవధల రచనకు క్యాన్వాస్లవుతూనే ఉన్నాయి. ఈ ధోరణి మణిపురలో మాత్రమే ప్రారంభం కాలేదు. మణిపురతో అంతమూ కాదు. మూకదాడుల్లో తమ ప్రాబల్య విస్తరణ పరమార్థమున్న రాజకీయ శక్తులున్నంతకాలం మణిపురలు మండుతూనే ఉంటాయి. మానవత్వం కాలు తూనే ఉంటుంది. మణిపుర అల్లర్లను కేవలం మైతేయ్ (ఓబీసీ), కుకీ (ఎస్టీ)ల ఘర్షణగానే చూడాలా? అంతకు మించిన వృత్తాంతమున్నదా? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మణిపుర జనాభాలో 53 శాతం మంది మైతేయ్ తెగవారు. వీరు ప్రధానంగా సారవంతమైన ఇంఫాల్ లోయభూముల్లోనే నివసిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీ జాతులవారు 40 శాతం వరకు ఉంటారు. మిగిలినవారు చిన్నచిన్న గిరిజన తెగలు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన హిందువులు, ముస్లింలు. గిరిజన తెగల్లో అత్యధికులు క్రైస్తవులు. మైతేయ్ల్లో అత్యధికులు హిందు వులు. మహాభారతంలోని బభ్రువాహనునికి వారసులమని వారి విశ్వాసం. అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తిరుగుతూ తిరుగుతూ అక్కడకు చేరుకొని రాజకుమారి చిత్రాంగద ప్రేమలో పడతాడు. వీరికో కుమారుడు. వాళ్లనక్కడే వదిలేసి అర్జునుడు తన మానాన తాను వెళ్లిపోతాడు. యుద్ధం ముగిసి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వాన్ని మణిపుర ప్రాంతం రాజకుమా రుడు బభ్రువాహనుడు బంధిస్తాడు. రక్షణగా వెళ్లిన అర్జు నుడిని కూడా ఓడించి గాయపరుస్తాడు. అదే ప్రాంతంలో ఉండే అర్జునుడి మరో భార్య ఉలూచి అనే నాగినికి విషయం తెలిసి నాగమణి ప్రభావంతో అర్జునుడిని కాపాడుతుంది. కథ సుఖాంతమై ఇద్దరు భార్యలతో అర్జునుడు హస్తినకు చేరుకుంటాడు. ఈ కథ యథాతథంగా వ్యాసభారతంలో లేదట! రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఒక నాటకంలో ఈ ఉదంతం ఉన్నదట! తెలుగు, కన్నడ భాషల్లో ‘బభ్రువాహన’ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఇందులో ఆసక్తిక రమైన విషయమేమిటంటే చిత్రాంగదది మైతేయ్ (మణి పురి) తెగ. ఉలూచిది నాగా తెగ. ఇప్పుడీ రెండు తెగలవారు అక్కడ గణనీయంగా ఉన్నారు. చిత్రాంగద గొప్ప యోధ. ఆమె తండ్రి చిత్రవాహనుడికి మగ సంతానం లేనందువలన ఆమెకు యుద్ధ విద్యల్లో తర్ఫీదునిస్తాడు. ఆమె శిక్షణలోనే రాటుదేలిన బభ్రువాహ నుడు తండ్రినే ఓడిస్తాడు. నిన్న మొన్నటి ఈరోమ్ షర్మిల వరకు మణిపురి మహిళల సాహస స్వభావం మనకు కనిపి స్తూనే ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 16 సంవత్సరాల పాటు ఈరోమ్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఒక దశలో ఇంఫాల్ లోయ ప్రాంతాన్ని (ఎక్కువగా మైతేయ్‌లు నివసించే ప్రాంతం) చట్ట పరిధి నుంచి మినహాయించి ఈరోమ్ను దీక్ష విరమించాలని ప్రభుత్వం కోరింది. కొండ ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఇంకా చీకటి చట్టం మాటున మగ్గుతుండగా తాను ఎట్లా ఉద్యమాన్ని విరమిస్తానని ఈరోమ్ ప్రశ్నించింది. ఆమె మైతేయ్ తెగ మహిళ. స్వభావ సిద్ధంగా ప్రజల మధ్య విభజన లేదు. చీకటి చట్టం మాటున మన సాయుధ జవాన్లు అన్ని తెగల మీద తమ దాష్టీకాన్ని ప్రయోగించారు. మహిళల మీద అత్యా చారాలు ఒక అలవాటుగా మార్చుకున్నారు. థాంజోమ్ మనోరమ అనే మహిళను పారా మిలటరీ జవాన్లు సామూహిక అత్యాచారం చేసి చంపేయడం అన్ని తెగల మహిళల్నీ కదిలించింది. కొందరు మహిళలు నగ్నంగా వీధుల్లోకి వచ్చి ‘ఇండియన్ ఆర్మీ... రేప్ అజ్’ అనే బ్యాన ర్తో ప్రదర్శన చేసిన ఘటన, ఇరవయ్యేళ్లు గడిచినా ఇంకా వెన్నాడుతున్న పీడకలగానే మిగిలిపోయింది. తెగల మధ్య సహజంగా ఉండే చిన్నచిన్న వైరుద్ధ్యాలు సెగలు గక్కే శత్రు వైరుద్ధ్యాలుగా పరిణమించవలసిన అవ సరం లేదు. ఆ అవసరం కొన్ని సంకుచిత శక్తులకున్నది. మంటల్లో చలికాచుకునే రాజకీయ శక్తులకున్నది. సంఘాన్ని మెజారిటీ – మైనారిటీలుగా విడగొట్టి మెజారిటీ పక్షాన పేటెంట్ హక్కు రాసుకొనే స్వార్థ వర్గాలకున్నది. మైనారిటీల మీద మూకదాడులకు మెజారిటీలను ఉసిగొలిపే వ్యూహ కర్తలకున్నది. ఈ మూకదాడులు క్షణికావేశాలు కావనీ, ప్రణాళికాబద్ధమేనని బిల్కిస్ బానో ఉదంతం మనకు చాటి చెప్పింది. గుజరాత్ అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులందరినీ అల్లరిమూక చంపేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ధైర్యంగా పట్టుదలతో హంతకుల మీద కేసు నడిపింది. వారికి శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తి కాకముందే స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆ హంతకులు రాచమర్యాదలతో విడుదలయ్యారు. వారికి స్వాతంత్య్ర సమరయోధుల కంటే మిన్నగా స్వాగత సత్కారాలు లభించాయి. ఈ ఘటన నేర్పుతున్న పాఠమేమిటి? మణిపుర ఘటనలు ‘డబుల్ ఇంజన్’ సర్కార్ నిర్వాకమని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అది తప్పు. అక్కడున్నది ‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించే ఇంజన్లయితే కనిపించని ఆ మూడో ఇంజనే పరివార్... సంఘ్ పరివార్! ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో ముఖ్యంగా గిరిజన తెగల్లో క్రైస్తవ ప్రాబల్యం పెరుగుతుండడంతో పరివార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి వ్యూహం ఫలించడం మొదలైంది. కాషాయ పార్టీ అక్కడ బలం పుంజుకున్నది. మణిపుర అల్లర్లు ఎలా మొదల య్యాయి? ఒక మైతేయ్ మహిళను కుకీ తెగవారు రేప్ చేశారని ఒక ఫేక్ వార్త దావానలంగా వ్యాపించింది. క్షణాల్లో అటువంటి వార్తలను ప్రచారంలో పెట్టగల ప్రావీణ్యం ఎవరికి ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఎవరి అధీనంలో ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే. వార్త ప్రచారమైందే తడవుగా వేల సంఖ్యలో మైతేయ్ ప్రజలు గుంపులు గుంపులుగా కుకీ గ్రామాల మీద పడ్డారు. ఒక్కరోజులోనే ఒక వర్గానికి చెందిన వందకు పైగా ప్రార్థనాలయాలు ధ్వంస మయ్యాయంటే, ప్రార్థనలు చేయించేవారిని వెతికి పట్టుకొని దాడులు చేశారంటే మనకు బోధపడుతున్న వాస్తవమేమిటి? అదే వరసలో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి దిగంబరంగా పరేడ్ చేయించారు. వారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఒక అమ్మాయి సోదరుని, తండ్రిని చంపేశారు. ఆ ముగ్గురిలో ఒకరు ఆర్మీ జవాన్ భార్య. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. దేశాన్ని కాపాడాడు. తన భార్యను మాత్రం కాపాడుకోలేక పోయానని విలపిస్తున్నాడు. దేశాన్ని మెజారిటీ, మైనారిటీలుగా విడగొట్టడంలో మన పరివారం గణనీయమైన విజయాలే సాధించింది. మెజారిటీ వర్గాన్ని రంజింపజేయగల చక్కెరపూత భావ జాలాన్ని అది సృష్టించగలిగింది. అదే నేటి ఆధిపత్య భావజాలం. దేశం మీద పెత్తనం చేస్తున్నది. ఈ ఆధిపత్య భావజాలానికి మైనారిటీల మీద, నిమ్న జాతుల మీదనే చిన్నచూపు కాదు. జనాభాలో సగభాగమైన మహిళల మీదా చిన్నచూపే! దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికల మీద జాతీయ పతాకాల్లా ఎగరేసిన క్రీడాకారుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ దేశం గమనించింది. వాళ్లను అవమానించి వేధించినవాడు దర్జాగా పార్లమెంట్లో కూర్చుంటున్నాడు. ఆధిపత్య భావజాలంతో రెచ్చిపోతున్న నికృష్ట మూకలు నగ్నదేహాలతో ఆటలాడటాన్ని కూడా దేశం చూసింది. నేటి మన ఆధిపత్య భావజాలపు ప్రధాన వ్యూహం టార్గెట్ వర్గాలపై అసత్య ప్రచారాలు చేసి ఏకాకుల్ని చేయడం, వారంతా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనే భయాన్ని సమాజంలో కలిగించడం! చేతబడి అనే సాకు చూపి ఒక కుటుంబాన్ని ఊరంతా కలిసి చంపేయడాలు మనకు తెలిసిందే కదా! అదిగో ఆ మూఢత్వానికే మన వాళ్లు జాతీయ హోదా కల్పించారు. ఇప్పుడా చేతబడి ప్రచారాన్ని కుకీల మీద చేస్తున్నారు. వారంతా పరాయి దేశం వాళ్లట. లవ్ జిహాద్, గోహత్య వగైరా వగైరా చేతబడి వ్యూహాలతో ఎల్లకాలం నెట్టుకురావడం సాధ్యం కాకపోవచ్చు. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటన గుర్తున్నది కదా! నాటి యూపీఏ ప్రభుత్వాన్ని చెత్త కుప్పలోకి విసిరేయడంలో చోదకపాత్ర పోషించిన ఉదంతం. మణిపుర మహిళల నగ్న పరేడ్ అంతకంటే చిన్న విషయమేమీ కాదు. దాని ప్రకంపనలు ఇప్పుడప్పుడే సద్దుమణగవు. నా దేశం నగ్న దేహం కాదు. అది నవచైతన్య పతాకం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
లంకకు స్నేహహస్తం
‘నేను రణిల్ విక్రమసింఘేను... రణిల్ రాజపక్సను కాదు’ అన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే భారత్ పర్యటనకొచ్చేముందు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావొస్తుండగా తన తొలి విదేశీ పర్యటనకు ఆయన మన దేశాన్నే ఎంచుకున్నారు. సందర్భం ఏమైనా కావొచ్చుగానీ, రణిల్ అలా వ్యాఖ్యానించక తప్పని పరిస్థితులైతే శ్రీలంకలో ఈనాటికీ ఉన్నాయి. రణిల్‌ను ఇప్పటికీ రాజపక్స ప్రతినిధిగానే చాలామంది పరిగణిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటి, ఎక్కడా అప్పుపుట్టని స్థితి ఏర్పడిన పర్యవసానంగా నిరుడు జనాగ్రహం కట్టలు తెంచుకుని అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఐఎంఎఫ్ 290 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాక దేశం కాస్త కుదుటపడిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, అధిక ధరలు పీడిస్తున్నాయి. సుమారు 68 శాతం మంది జనాభా అర్ధాకలితో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమసింఘే భారత పర్యటనకొచ్చారు. ఆపత్స మయాల్లో ఆదుకోవటం నిజమైన మిత్ర ధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రణిల్ ఏలుబడి మొదలయ్యాక 400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. ఆ తర్వాతే ఐఎంఎఫ్ రుణం మంజూరైంది. శ్రీలంక దాదాపు 8,300 కోట్ల డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోగా, అందులో సగం విదేశీ రుణాలే. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండటం లంకకు వరం. మన దేశం నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహ హస్తం అందించటంలోని మర్మం అదే. ఎల్టీటీఈని ఎదుర్కొనడానికి కావాల్సిన 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు, ఎఫ్ 7 జెట్ ఫైటర్లు, విమాన విధ్వంసక తుపాకులు, జేవై–11 రాడార్ ఇవ్వటంతో లంక, చైనాల మధ్య అనుబంధం పెరిగింది. ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు తలుపులు బార్లా తెరిచారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70 శాతం ప్రాజెక్టులు చైనావే. ఒక్క హంబన్ టోటా నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా 3 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. సింగపూర్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న హంబన్‌టోటా నౌకాశ్రయం పడకేసింది. దాన్ని నిర్వహించటం చేతకాక 99 ఏళ్లపాటు చైనాకు ధారాదత్తం చేయడానికి లంక అంగీకరించాల్సివచ్చింది. ఏమైతేనేం శ్రీలంక విదేశీ రుణాల్లో 10 శాతం చైనావే. కానీ నిరుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఒక లెక్క ప్రకారం 2025 వరకూ శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించాల్సిన స్థితిలో పడింది. గత ఏణ్ణర్ధంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంకనుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి గణనీయంగా నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచీ, ఐఎంఎఫ్ నుంచీ అందు తున్న సాయం లంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదనీ, దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనీ శుక్రవారం మన విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో అతిశయోక్తి లేదు. మన ఇతిహాసం రామాయణం లంకతో ముడిపడి వుంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు అక్కడున్నాయి. ఇవన్నీ ఇక్కడినుంచి వెళ్లే యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని కుంగ దీస్తున్నాయి. కనీసం జెనరేటర్లతో నడిపిద్దామన్నా ఇంధన కొరత పీడిస్తోంది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52 శాతం. పరిశ్రమల్లో వీటి వాటా 75 శాతం. ఉపాధి కల్పనలోనూ దీనిదే ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవటం,ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రణిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇరు దేశాల మధ్యా సమస్యలు లేకపోలేదు. లంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండికొడుతున్నాయని లంక ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాకుతో తరచు లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందనీ, గత రెండేళ్లుగా 619 మంది జాలర్లు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారనీ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మన దేశం అప్పగించిన కచ్చాతీవు దీవిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక లంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలనీ, స్వయంపాలనకు అవకాశమీయాలనీ, వారు గౌరవప్రదంగా జీవించటానికి తోడ్పడాలనీ మన దేశం అడుగుతోంది. రణిల్ తాజా పర్యటన ఇలాంటి సమస్యల పరిష్కారానికి దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ భవిష్యత్తులో మరింత పటిష్టమవుతాయి.