Editorial
-
ఈసారైనా జనవాణి వింటారా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా సాగుతాయని ఊహించినదే. అయితే మొదటి రోజే రానున్న నెల రోజులు ఎలా ఉండనున్నాయో అర్థమైపోయింది. అల్లరిమూకలు మణిపుర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పార్లమెంట్ ఉభయ సభలను తొలి రోజే కుదిపేసింది. పాలకులు సిగ్గుపడాల్సిన ఈ మణిపుర్ ఘటనపై పూర్తి స్థాయి చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. రెండున్నర నెలల పైగా మణిపుర్ అగ్నికీలల్లో దగ్ధమవుతున్నా మూగనోము వీడని పాలకులు సుప్రీమ్ కోర్ట్కో, ఓటర్లలో వెల్లువెత్తే నిరసనకో వెరచి ఎట్టకేలకు పార్లమెంట్ తొలి రోజున పెదవి విప్పారు. సభ సమావేశంలో ఉన్నా అక్కడ కాకుండా, మీడియా ఎదుట మాత్రం విచారం వ్యక్తం చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పగలిగారు. ప్రధాని సైతం సభలో మణిపుర్‌పై చర్చలో పాల్గొని జవాబివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే, హోమ్ మంత్రి మాట్లాడతారని అధికారపక్షం ఆశ్వాసిస్తోంది. మొత్తానికి ఒక్క మణిపురే కాదు... ఢిల్లీలో ఎన్నికైన ‘ఆప్’ ప్రభుత్వాన్ని కాదని అధికా రాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు దఖలు పరిచే ఆర్డినెన్స్, డేటా రక్షణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) – ఇలా అనేక అంశాలు ఈ సమావేశాల్ని విమర్శల జడివానగా మార్చనున్నాయి. ఆగస్ట్ 17 వరకు జరిగే వర్షాకాల సమావేశాల్లో అంతా సజావుగా సాగితే 17 రోజులు పార్లమెంట్ పని చేయాలి. ఈసారి శాసన నిర్మాణ అజెండాలో భాగంగా ఇప్పటికే పార్లమెంటరీ సంఘాలు పరిశీలించిన అటవీ, జీవావరణ వైవిధ్య చట్టసవరణ సహా 8 పెండింగ్ బిల్లులకు ఆమోదం పొందాలని ప్రభుత్వ ఆలోచన. అలాగే, వ్యక్తిగత డేటా భద్రత బిల్లు సహా కొత్తగా మరో 21 బిల్లులకు ఆమోదముద్ర వేయించాలనీ భావిస్తోంది. ముందుగా ప్రకటించిన వీటికి తోడు జాబితాలో లేనివాటినీ ప్రభుత్వం సభ ముందుకు తేవచ్చు. ముందుగా చెప్పకుండానే 2019 ఆగస్ట్ 5న రాజ్యసభలో జమ్ము–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పాలకపక్షం ప్రవేశపెట్టిన అనుభవం ఉంది. కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా పార్లమెంట్ కీలక చట్టాలు చేయడం కొంత కాలంగా జరుగుతున్నదే. 2019 ఎన్నికలకు ముందు 2018 వర్షాకాల సమావేశాల్లో ఆర్థిక నేరగాళ్ళ ఆస్తుల స్వాధీనం చట్టాన్నీ, 2014 ఎన్నికలకు ముందు 2013 వర్షాకాల సమావేశాల్లో జాతీయ ఆహార భద్రత చట్టాన్నీ నాటి పాలకపక్షాలు చేశాయి. ఈసారి అలాగే యూసీసీ ప్రస్తావనకు రావచ్చు. వరదలు, అధిక ధరలు, రైళ్ళ భద్రత సహా అనేక అంశాలున్నాయి. కానీ, పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్న అధికార, ప్రతిపక్షాల మధ్య పార్లమెంట్లో ప్రజాసమస్యల ప్రస్తావన, వాటిపై సరైన చర్చ ఎంత వరకు ఉంటాయనే అనుమానం కలుగుతోంది. మహిళలపై అమానుష ఘటనలో 48 రోజుల తర్వాత కానీ మణిపుర్లో పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదంటే, సామూహిక అత్యాచార నిందితులు పాతికమందిలో ఒక్కరి అరెస్టుకే 77 రోజులు పట్టిందంటే ఏమనాలి? మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎంపీ నిష్పూచీగా, నిర్లజ్జగా తిరుగుతుంటే ఏం చేయాలి? పాలకుల ఈ నిర్లిప్తతనూ, నిష్క్రియా పరత్వాన్నీ కచ్చితంగా నిలదీయాలి. మణిపుర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలంటూ ప్రభుత్వాన్ని వంచి, ఒప్పించాలి. కానీ, అందుకోసం షరా మామూలుగా సభ కార్యకలాపాల్ని అడ్డుకొంటే లాభం లేదు. వేర్వేరు మార్గాల ద్వారా సభలోనే పాలకవర్గాన్ని నిలదీసి, జవాబివ్వక తప్పనిస్థితిలోకి నెట్టవచ్చు. కార్యాచరణకు దిగేలా చూడవచ్చు. దీనికి ప్రతి పక్షాల మధ్య ఐక్యత, ఎప్పటికప్పుడు ముందస్తు వ్యూహరచన తప్పనిసరి. పరస్పర వైరుద్ధ్యాల మధ్య కూడా అనివార్య తతో ఇటీవలే ‘ఇండియా’ పేరిట ఎన్నికల కూటమి కట్టిన 26 ప్రతిపక్షాల్లో అలాంటి సభా సమ న్వయం ఏ మేరకు ఉంటుందో చూడాలి. అర్థవంతమైన చర్చలకూ, ప్రజాసమస్యల పరిష్కారాలకూ వేదిక కావాల్సిన ప్రజాస్వామ్య దేవా లయం కొన్నేళ్ళుగా పలు దుస్సంప్రదాయాలకు మౌనసాక్షిగా మిగలాల్సి వస్తోంది. ప్రస్తుత లోక్‌సభ అయిదేళ్ళ కాలపరిమితి 2024 ప్రథమార్ధంలో ముగిసిపోనుంది. రాజ్యాంగ విహితమైన డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే ఇంతకాలంగా అధికారపక్షం చక్రం తిప్పుతోంది. ఇది మన పార్లమెంటరీ చరిత్రలోనే కనివిని ఎరుగనిది. మరి ఈ సమావేశాల్లోనైనా ఉప సభాపతి ఎన్నికకు పాలకపార్టీ ఊ కొడుతుందా అంటే చెప్పలేం. సంఖ్యాబలం ఉందని అధికార పక్షం, ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధం వేయాలని ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్న మంకుపట్టు కారణంగా చర్చలు, సంప్రతింపులు అటకెక్కాయి. పెద్దగా చర్చలేమీ లేకుండానే అనేక బిల్లులు మూజువాణీ ఓటుతో చట్టాలైపోతున్న శోచనీయమైన పరిస్థితులు చూస్తున్నాం. వాకౌట్లు, సస్పెన్షన్లతోనే సమావేశాలు తూతూ మంత్రంగా నడిచి, మమ అనిపిస్తున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటివాళ్ళమని జబ్బలు చరుచుకొనేవారు ఇకనైనా కళ్ళు తెరవాలి. అలాగే, పార్లమెంట్ సజావుగా సాగడం అధికార, ప్రతిపక్షాల సమష్టి బాధ్యత. నిమిషానికి రూ. 2.5 లక్షల వంతున వెచ్చిస్తున్న ప్రజాధనం వృథా కానివ్వరాదని ప్రజాప్రతినిధులు స్ఫురణలో ఉంచుకోవాలి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మరొక్కసారి శీతకాలంలో మాత్రమే పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలకు వీలుంటుంది. కాబట్టి, ఈసారైనా మన పార్లమెంట్ అంకగణితపు లెక్కల కన్నా అత్యవసర అంశాలపై కనీసపాటి చర్చకు వేదిక కావాలి. ప్రజాస్వామ్యానికి అదే అసలైన ధన్యత. -
జవాబివ్వాల్సిన చిరుత ప్రశ్నలు!
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన వన్యప్రాణుల్ని మళ్ళీ పెంచిపోషించే ప్రయత్నం. పదినెలల క్రితం ఆర్భాటంగా మొదలైన ప్రాజెక్ట్. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ‘ప్రాజెక్ట్ చీతా’కు జరిగినంత హంగామా అంతా ఇంతా కాదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలో విడిచి పెట్టాక 4 నెలల్లో 8 చీతాలు మరణించడం ఈ యత్నంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ మాత్రం ప్రకృతి సహజ కారణాలతోనే ఈ చీతాలన్నీ చనిపోయాయంటోంది. ఆ మాట శాస్త్రీయంగా లేదు. నిపుణులు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు సాక్ష్యం. చీతాల కదలికలు తెలుసుకొనేందుకు మెడకు బిగించిన రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ల వల్ల వాటికి గాయమై, అక్కడ క్రిములు చేరాయనీ, అదే తాజా మరణానికి దారి తీసిందన్న మాటలు ఆందోళన రేపుతున్నాయి. ప్రాజెక్ట్ చీతా భవితవ్యం, శాస్త్రీయత సందేహాస్పదమవుతున్నాయి. నిజానికి 2009లో జైరామ్ రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ చీతాల పునరావాస ఆలోచన జరిగింది. గత ఏడాది అది ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌తో ప్రాజెక్ట్ చీతాకు ఏడాది పూర్తి కానుంది. నిరుడు సరిగ్గా ఆ సమయంలోనే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరాయి. ఆ పైన ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ప్రభుత్వం రప్పించింది. దాదాపు 35 చీతాలతో అవి స్వయం సమృద్ధమయ్యే దాకా రానున్న దశాబ్దకాలంలో ఏటా 5 నుంచి 10 చీతాల్ని తేవాలన్నది యోచన. తొలి ఏళ్ళలో ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించకపోవచ్చని ఆది నుంచీ అనుకుంటున్నదే. అది కాక అసలీ ప్రాజెక్ట్ ఏర్పాటులోనే ప్రాథమిక లోపాలున్నాయని విమర్శకుల వాదన. వేగంగా పరుగులు తీసే చీతాలకు కూనో ప్రాంతం సరిపోదన్నది ఒకటైతే, వాటిని దీర్ఘకాలం క్వారంటైన్లో ఉంచడం వల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధపడే సామర్థ్యం దెబ్బతింది. మానసికంగా సర్దుకుపోవడమూ సమస్య అయింది. అలా అవి సులభంగా బలి అవుతున్నాయి. తెచ్చిన చీతాలకు తోడు కొత్తగా ఇక్కడ పుట్టిన నాలుగింటిలో 3 కూనలు చనిపోయాయి. గాయం కథలో శాస్త్రీయత లేదని ప్రభుత్వం అంటున్నా, ఈ అంశాలపై విచారించి, మిగిలిన చీతాలన్నిటికీ పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేయాలని నిపుణుల సంఘం సిఫార్సు చేయడం గమ నార్హం. స్వేచ్ఛగా తిరిగేవాటిని పట్టి, కాలర్లు తీసేసి, ఈ పరీక్షలు చేయడం శ్రమతో కూడిన పని. సమ యమూ చాలానే పడుతుంది. అప్పుడు కానీ, ప్రాజెక్ట్ చీతా భవితవ్యం తేలదు. చీతాల కోసం అసలు మనం ఎంచుకున్న కూనో ఉద్యానమే చిన్నదని నమీబియా నిపుణులు కుండబద్దలు కొట్టారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఒక్కొక్క చీతా వేటాడి తినడానికీ, తిరగడానికీ సగటున 100 చదరపు కి.మీ.ల విశాల ప్రాంతం ఉంటుంది. కానీ, మన ‘కూనో జాతీయోద్యానం’లో సగటున మూడు చీతాలకు కలిపి 100 చదరపు కి.మీ.ల జాగాయే ఉంది. అలాగే, చీతా స్వేచ్ఛగా సంచరించడానికీ, ఆహార సేకరణ, పునరుత్పత్తికీ నిర్నిరోధమైన 1600 చదరపు కి.మీ.ల పైగా విస్తీర్ణం కావాలి. కూనో జాతీయోద్యానం మొత్తం వైశాల్యం చూసినా 750 చదరపు కి.మీ.లే! ఎలా చూసినా దేశంలో చీతాల పునఃప్రవేశానికి విస్తీర్ణం సరిపోని ఈ ఉద్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది బేతాళ ప్రశ్న. నమీబియా, దక్షిణాఫ్రికాల్లో చీతాలు చుట్టూ కంచె ఉన్న రిజర్వుల్లో ఉంటే, మన దగ్గర వాటిని కంచెలేని సహజమైన, అరణ్య వాతావరణంలో పెరగనివ్వాలని యోచన. కూనో జాతీయోద్యానంలోకి వదిలిన చిరుతలు కొన్ని ఆ పరిధిని దాటి, జనావాసాల్లోకి జొరబడిన వార్తలొచ్చాయి. ఇది పోనుపోనూ మనిషికీ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు. ప్రాజెక్ట్ చీతాకు రూపకల్పన చేస్తున్నప్పుడు ఈ సంగతులేవీ లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే! అధికారులు మాత్రం కూనో రిజర్వ్‌లో కావాల్సినంత స్థలం, చీతాలకు తగినంత ఆహారం ఉన్నాయంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే గాంధీసాగర్లో రెండో రిజర్వ్‌ను అభివృద్ధి చేసి, చీతా పునరావాస కేంద్రం స్థాపిస్థామని చెబుతున్నారు. అవన్నీ నిజమైతే మంచిదే. కానీ, పెద్ద పులులు, చిరుతలతో పోలిస్తే చీతాలు మహా సున్నితం. అడవిలో అవి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి మన దగ్గర వీటికి సింహాలు, చిరుత పులుల నుంచి పోటీ లేదు గనక కొంత నయం. కాలగతిలో ఇవి మన పరిస్థితులకు అలవాటు పడి భారత్‌ను తమ కొత్త ఆవాసంగా మారుస్తాయేమో చూడాలి. అరణ్యాల్లో చీతా కూనలు బతికేరేటు 10 శాతమేనట! అంతే శాతం పెరిగిపెద్దవుతాయి. కాబట్టి మరణాలు సహజమేనని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పటిదాకా కూనోలో చనిపోయిన చీతాల్లో ఒక్కటి మినహా అన్నీ పూర్తి అరణ్యంలో కాక ఒక చ.కి.మీ. విస్తీర్ణంలో పెట్టిన ‘బోమస్’ అనే ప్రత్యేక ఎన్క్లో జర్లలో ఉన్నవే. కాబట్టి, లోతుగా పరిశీలన చేయాలి. తక్షణమే ప్రాజెక్ట్ చీతా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పంచుకోవడం మరీ అవసరం. తద్వారా సంబంధిత నిపుణులతో పరిష్కారాలు కనుగొనవచ్చు. చీతాల నిర్వహణలో స్థానిక నైపుణ్యం లేదు గనక నిర్ణీత నిపుణుల అనుభవాన్ని ఆసరా చేసుకోవాలి. అలా కాక రోగాన్ని దాచిపెట్టి, వైద్యం చేస్తే ఫలితం లేకపోగా, వికటించే ప్రమాదం ఉంది. చీతాల పునరావాసం, పునరు త్పత్తి సవ్యంగా సాగాలంటే అధికారులు భేషజాలు వదలాలి. లేదంటే, మొదటికే మోసం వస్తుంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తొలి ఖండాంతర చీతా పునరావాస ప్రాజెక్ట్ అర్ధంతరంగా అంతిమ అధ్యాయానికి చేరుకుంటుంది. అలా జరగరాదంటే చిరుత ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు కావాలి! -
అంతటి హాలీవుడ్ కు సమ్మె ఎఫెక్ట్, నష్టం ఎంతంటే.?
అవును... హాలీవుడ్ సంక్షోభంలో చిక్కుకుంది. ఆరు దశాబ్దాల పైచిలుకు తర్వాత రచయితలు, నటీ నటులు మళ్ళీ ఏకకాలంలో సెట్స్‌కు దూరం జరిగారు. సినిమాలు, టీవీ షోల నిర్మాణం ఒక్కసారిగా ఆగింది. జీతభత్యాల పెంపు సహా పలు అంశాలపై నిర్మాతల కూటమి (అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్)తో చర్చలు విఫలమై మే 2 నుంచి రచయితలు సమ్మె బాట పట్టారు. రెండు నెలల తర్వాత తాజాగా ఈ జూలై 13 నుంచి వేలాది నటులూ జత కలిశారు. సరైన జీతం, మెరుగైన పని పరిస్థితుల డిమాండ్లు తీరకపోవడంతో నటులూ పిడికిలి పైకెత్తారు. ఇక, రచన, నటనలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని నటీనటుల సంఘం (ఎస్ఏజీ), రచయితల సంఘం (డబ్ల్యూజీఏ)... రెండూ వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు అదీ ఒక ప్రధాన కారణమే. జంట సమ్మెల ప్రభావం చిత్రనిర్మాణంలోని ఇతర విభాగాల్లో, అనుబంధ పరిశ్రమల్లోని వేలమందిపైనా పడింది. కార్మికులంతా వీధిన పడ్డారు. అందుకే, ఇది వట్టి వినోదానికి మించిన విషయం. సీఈఓలకు లక్షల డాలర్లిస్తూ, రచయితలు, నటుల దగ్గరకొచ్చేసరికి నష్టాలొస్తున్నాయంటూ బీద అరుపులు అరవడం హాలీవుడ్‌లోనూ ఉన్నదే. 2000లో అన్నీ కలిపి హాలీవుడ్ వినోద పరిశ్రమకు 500 కోట్ల డాలర్ల లాభాలొస్తే, నెట్‌ఫ్లిక్స్ చేరికతో 2019కి అది 3 వేల డాలర్లకు దూసుకుపోయింది. రచయితల సంపాదన మాత్రం తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో రచయిత కమ్ నిర్మాత హోదా లోని వారి సగటు జీతం 4 శాతం మేర తగ్గింది. ద్రవ్యోల్బణంతో చూసుకుంటే, ఏకంగా 23 శాతం క్షీణించింది. తాజా స్ట్రీమింగ్ శకం ప్రకంపనలు రచనావృత్తిని తాకాయి. 2000లో టీవీ సీజన్ రైటర్లకు ఏటా 42 వారాల పని దొరికేది. స్ట్రీమింగ్‌తో సీజన్లు తగ్గి, 20 వారాలకు పడిపోయింది. 11,500 మంది సభ్యులున్న రచయితల సంఘంతో మూడేళ్ళకోసారి నిర్మాతల కూటమి కొత్త జీతభత్యాల ఒప్పందం కుదుర్చుకుంటుంది. వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ లాంటి భారీ స్టూడియోలు, నెట్‌ఫ్లిక్స్, పీకాక్ లాంటి పలు స్ట్రీమింగ్ వేదికలు ఆ నిర్మాతల్లో భాగమే. ఈసారి మే1తో కొత్త ఒప్పందం రావాలి. ఆరు వారాలు చర్చించినా ఫలితం లేకపోయింది. జీతం, పింఛన్, స్ట్రీమింగ్‌లో పదే పదే ప్రసారంతో రచయితలకు అదనంగా చేయాల్సిన అవశేష చెల్లింపులు (రాయల్టీలు) వగైరా ఎటూ తెగకపోవడంతో కలం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. స్థూలంగా నటీనటులకూ ఇలాంటి సమస్యలే. చర్చలు ఫలించక నటీనటుల సంఘం సైతం తాజాగా షూటింగ్‌లకు దూరం జరిగింది. గత నవంబర్‌లో రంగప్రవేశం చేసిన ఛాట్‌జీపీటీ సైతం సృజనాత్మక రంగాలను కుదిపేస్తోంది. సమీప భవిష్యత్తులో ఏఐతో తమ పొట్ట కొట్టకుండా రక్షణ ఉండాలని రచయితల, నటుల డిమాండ్. ప్రస్తుతం స్ట్రీమింగ్ వేదికలు పెరిగాయి. కంటెంట్ దాహం తీరట్లేదు. దీన్ని అదనుగా చేసుకొని ఏఐ లాంటి వాటి శిక్షణకు తమ స్క్రిప్టులను వినియోగించరాదనీ, తమ రచనల నుంచి కొత్తవి సృష్టించడానికి ఏఐని వాడరాదనీ సృజనకారుల డిమాండ్. నటులు సైతం అనుమతి లేకుండా, పరిహారమి వ్వకుండా ఏఐతో తమ రూపాలనూ, స్వరాలనూ సృష్టించి నటింపజేయరాదంటున్నారు. అది సమంజసమే. నిర్మాతలు మాత్రం నేపథ్యంలోని నటీనటుల స్కాన్లను తీసుకొనే హక్కు తమకు ఉండాలంటున్నారు. తద్వారా వారి రూపాలను ఏఐతో సృష్టించి శాశ్వతంగా వాడుకోనివ్వాలని కోరుతున్నారు. అప్పుడిక పారితోషికమివ్వకుండానే పని జరిగిపోతుందనేది నిర్మాతల ఎత్తు. దీని పైనే తీవ్ర అభ్యంతరం. వెరసి, యావత్ సినీ చరిత్రలోనే రెండో పర్యాయం హాలీవుడ్ స్తంభించింది. 2007లో వంద రోజుల పాటు రచయితల సమ్మెతో ఒక్క క్యాలిఫోర్నియాకే 210 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పుడీ జంట సమ్మెలెంత నష్టం తెస్తాయో? రీషూట్లు, ప్రచారాలు, ప్రీమి యర్లకు నటులు దూరమయ్యేసరికి పూర్తయిన సినిమాలకూ ఇబ్బందే. టీవీ షోల కథ సరేసరి. ఎమ్మీ అవార్డుల ప్రదానం లాంటివీ వెనక్కిపోతాయి. వాటి కన్నా ముఖ్యం సాధారణ కార్మికుల పరిస్థితి. 1960లో నటులు, రచయితలు ఒకేసారి సమ్మె చేసినప్పుడు నటీనటుల సంఘానికి సారథి నటుడు, తర్వాత అమెరికా అధ్యక్షుడైన రొనాల్డ్ రీగన్. అయితే ఈసారి సమ్మె ప్రత్యేకమైనది. సాంకేతికతదే పైచేయి అయి, పని స్వభావం, సుస్థిరతపై ప్రభావం పడేవేళ యాజమాన్యానికీ, శ్రామికులకూ మధ్య బం«ధాల పునర్వ్యవస్థీకరణ అవసరమని గుర్తు చేస్తున్న సమ్మె ఇది. ఛాట్ జీపీటీతో పని చౌక గనక రచయితలు, ఎడిటర్లు, ఫోటోగ్రాఫర్ల లాంటి వైట్‌కాలర్ ఉద్యోగాలు పోతాయని భయం. అలాగని అంతర్జాల యుగంలో నియంత్రణలతో టెక్నాలజీని అడ్డగలమా అంటే అనుమానమే. ఎవరికీ దెబ్బ తగలకుండా మధ్యేమార్గంలో పోవడం విజ్ఞత. దర్శక దిగ్గజం క్రిస్టఫర్ నోలన్ అన్నట్టు తారల సంగతెలా ఉన్నా, ఏఐతో రచయితల, చిన్న నటీనటుల పొట్టకొట్టడం భావ్యం కాదు. నిజానికి, రచన, నటన లాంటి సృజనాత్మక కృషికి మేధ కన్నా మానసిక స్పందన ముఖ్యం. మనిషైతేనేం, మెషినైతేనేం అంతా ఒకటేనని కొందరు అనుకోవచ్చు. అననూవచ్చు. భవిష్యత్తులో అలాంటి ఏఐ ఆధారిత సినిమాలు రావచ్చు. కొత్త ఒక వింతగా ఆకట్టుకోనూవచ్చు. కానీ, ఏ సృజన ఎందుకు గొప్పదవుతుందో, ఎలా జనాదరణ పొందుతుందో యంత్రాలు, డేటాలు చెప్పగలవా? నకిలీ నటులు, కంప్యూటర్ రచయితలతో తయారైన ఏఐ చిత్రాలు నిజమైన సినిమాల అనుభూతిని అందించగలవా? కొద్దికాలానికి ఈ కృత్రిమ మేధాసృష్టి విసుగెత్తవచ్చు. అయితే, అప్పటికే అంతా ఆలస్యమైపోతుంది. హాలీవుడ్లో సమ్మె చేస్తున్నవారి ఆవేదన అదే! -
ఈ విస్తరణ మంచిదేనా?
అనేక సందర్భాల్లో ఆగి ఆలోచించడం, జరిగిన కథను సింహావలోకనం చేసుకోవడం అత్యవసరం. వివిధ దేశాల అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ (నాటో) సభ్యులు గత వారం లిథువేనియాలో ఆ పనే చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి 500 రోజులు పూర్తయిన వేళ బాధితదేశానికి తామిస్తున్న ఆర్థిక, సైనిక సహకారాలను పరిశీలించడానికి సమావేశ మయ్యారు. ‘నాటో’లో స్వీడన్ చేరేందుకు టర్కీ, ఆ వెంటనే హంగరీ అంగీకరించడం తాజా సమా వేశంలోని కీలక పరిణామం. అదే సమయంలో ఉక్రెయిన్ చేరికపై మాత్రం నిర్ణీత కాలవ్యవధి ఏదీ ఈ కూటమి ప్రతిపాదించ లేదు. అమెరికా అధ్యక్షుడు సాంత్వన వచనాలు పలికినా, ఇది ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీలో నిరుత్సాహం రేపింది. వెరసి, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ ఎదురుదాడి నిదానించిందేమో కానీ, ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన పాశ్చాత్య కూటమి బలోపేతమవుతోంది. రష్యాను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం నిరంతరాయంగా సాగుతోంది. మొన్నటి దాకా స్వీడన్ చేరికను వీటో చేస్తూ టర్కీ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఎత్తివేతతో స్వీడన్‌కు ఇక అన్ని అవరోధాలూ తొలగిపోయినట్లే! అటు రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దున్న ఫిన్లాండ్, అలాగే ఇటు బాల్టిక్ సముద్రంలోని కీలకమైన గాట్లాండ్ తన చేతుల్లో ఉన్న స్వీడన్... రెండూ నాటో వైపు మొగ్గడం రష్యాకు చీకాకు పెంచే విషయమే. అసలైతే... ఫిన్లాండ్, స్వీడన్లు సాంప్రదాయికంగా సైనిక వ్యవహారాల్లో ఏ కూటమి వైపూ మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించినవే. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అవి తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. 2022 మేలోనే ఫిన్లాండ్తో పాటు స్వీడన్ కూడా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. మొన్న ఏప్రిల్‌లో ఫిన్లాండ్ ‘నాటో’లో 31వ దేశ సభ్యదేశం కాగా, త్వరలోనే స్వీడన్ 32వది కానుందన్న మాట. తాజా పరిణామాలతో ఒక విషయం అర్థమవుతోంది. బెలారుస్, ఉక్రెయిన్, జార్జియా మినహా పడమటి సరిహద్దులంతా ఇక నాటో బలగాల ఉనికితో రష్యా సర్దుకుపోక తప్పదు. అంతా అనుకు న్నట్టు జరిగి నాటో ఇలాగే విస్తరిస్తూపోతే, యూరోపియన్ ప్రపంచ భద్రతా వలయంలోనూ మరిన్ని మార్పులు తథ్యం. దశాబ్దాలుగా రక్షణ వ్యయంపై వైముఖ్యం ప్రదర్శించిన దేశాలు సైతం ఇప్పటికే తమ సైనిక సన్నద్ధతకు పదును పెట్టుకుంటున్నాయి. ‘నాటో’ను విస్తరించబోమంటూ సోవియట్ పతనకాలంలో వాగ్దానం చేసిన అమెరికా ఆ మాట తప్పి, ఉక్రెయిన్ను చేర్చుకొనేందుకు ఉత్సాహప డడమే సమస్యకు మూలమనేది రష్యా ఆరోపణ. నాటో విస్తరణతో తనకు భౌగోళిక, వ్యూహాత్మక ప్రమాదాలున్నాయనేది దాని వాదన. అందుకే కీవ్‌పై దాడికి తెగబడింది. ఈ రష్యా దురాక్రమణ వైఖరిని అటుంచితే దాని భయసందేహాలు సమంజసమే. ఆ సంగతి పాశ్చాత్యప్రపంచానికీ తెలుసు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇటు పాశ్చాత్య ప్రపంచ ‘నాటో’ ఏర్పాటు, అటు దానికి ప్రతిగా సోవి యట్ యూనియన్ కూటమి ‘వార్సా’ ఒప్పందం గత చరిత్ర. సోవియన్ యూనియన్ విచ్ఛిత్తితో ‘వార్సా’నే రద్దయ్యాక, ఇప్పుడు నాటో ప్రాసంగికత, దాన్ని విస్తరించాలనే అమెరికా ఆకాంక్ష దేనికి చిహ్నమనేది కొందరి ప్రశ్న. అయితే, రష్యాతో యుద్ధం ముగిసేవరకు ‘నాటో’లో ఉక్రెయిన్ చేరిక అసాధ్యమే. స్వీయభద్రత సాకుతో రష్యా దండెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అధికారికంగా సభ్యత్వమిచ్చి, మరింత కోపం తెప్పించడం తెలివైన పని కాదు. అది పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు. అందుకే పాశ్చాత్య లోకం కీవ్‌కు కావాల్సిన ఆర్థిక, సైనిక సహకారమిస్తూనే సాంకేతికంగా కూటమిలో చేర్చుకోకుండానే కథ నడిపించే పనిలో ఉంది. నాటో భేటీ అదే ధ్రువీకరించింది. మరోపక్క ఉక్రెయిన్‌పై దాడితో... నాటో వైపు చూస్తున్న పొరుగు దేశాలను దారికి తేవచ్చను కున్న రష్యా అధినేత పుతిన్ అంచనాలూ తప్పాయి. నాటోలో సంఘీభావాన్ని బలహీనపరచడం, రష్యా సరిహద్దుల వైపు నాటో మరింత విస్తరించకుండా ఆపడమనే లక్ష్యంలో ఆయన విఫల మయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నాటోతో రష్యా భూ సరిహద్దు 754 మైళ్ళే. ఇవాళ అది 1584 మైళ్ళయింది. రేపు ఉక్రెయిన్ కూడా ఆ కూటమిలో చేరితే, అది మరింత పెరుగుతుంది. పెనునష్టం తెచ్చిపెట్టిన యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలో 17 నుంచి 18 శాతం రష్యా కలుపుకో గలిగింది. ఈ కలుపుకొన్న కొద్ది ప్రాంతం సాంకేతికంగా లాభదాయకమే కానీ, అంతకన్నా విశ్వ వేదికపై వ్యూహపరంగా రష్యాకు జరిగిన నష్టమే అధికం. ఒక్కమాటలో పుతిన్ సెల్ఫ్ గోల్ చేసు కున్నారు. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినా, ఇప్పటికే ఫిన్లాండ్, త్వరలోనే స్వీడన్ నాటోతో జట్టు కడుతున్నాయి. ఇక పుతిన్ ఏం చేస్తారో? వాస్తవానికి, ఉక్రెయిన్ యుద్ధంతో నిరంతర నాటో విస్తరణ రాజకీయ వ్యూహ అనివార్యతగా తయారైంది. కానీ, ఇది రెండంచులా పదునైన కత్తి. ఈ చర్య రష్యా పొరుగుదేశాలకే చేటు తేవచ్చు. నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వివాదాలు ఏదో ఒక సమయంలో యుద్ధానికి దారి తీయ వచ్చు. పొరపాటున అది ప్రపంచ యుద్ధమైనా ఆశ్చర్యం లేదు. నిర్ణీత ప్రాంతంలో భద్రత, సుస్థిరత కోస మంటూ సైనిక కూటములలో చేరుతున్నామంటారు. తీరా ఆ కూటములు మరింత అస్థిరతకూ, భావి యుద్ధాలకు పునాదులు వేస్తున్నాయనిపిస్తుంది. నాటో విస్తరణతో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా, ఐరోపా మాత్రం వ్యూహాత్మక సుస్థిరతను అందుకుంటున్న దాఖలాలైతే లేవు. పైపెచ్చు, అది దీర్ఘకాలిక అస్థిరత, నిరంతర అభద్రత వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అనుమానాల రీత్యా చూస్తే, నాటో సభ్య దేశాలు పెరగడం పాశ్చాత్య ప్రపంచానికి నిజంగా శుభప్రదమేనా అన్నది ప్రశ్న. -
పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ ఏట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు. 1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది. పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.) స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్ బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్’ (1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్జ్వరిల్లజేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ. తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి. -
ఇంటిదొంగ – ఈశ్వరన్!
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తొలగింపు, అరెస్ట్ వార్తలు మన దగ్గర కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఇందుకు మూడు కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి అత్యల్పంగా కనిపించే సింగపూర్‌లో అవినీతి ఆరోపణలపై ఒక మంత్రి అరెస్ట్ కావడం మొదటి కారణం. రెండవది ఈశ్వరన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. మూడో కారణం మరీ ముఖ్యమైనది. ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్లోబల్æ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరన్ కూడా భాగస్వామి. అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియానికి చంద్రబాబు అప్పగించారు. ఈ ఒప్పందం కోసం ఈశ్వరన్, ఆయన సింగపూర్ టీమ్ పలుమార్లు విజయవాడకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సింగపూర్‌లో పర్యటించారు. చివరికి 2017లో ఒప్పందం కుదిరింది. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నాటకం రక్తికట్టింది. ఆయనతోపాటు పాల్గొన్న సింగపూర్ ‘అధికారులు’ కూడా ఆ తర్వాత తమ అవతారాలను మార్చడం వింతగొలిపే విషయం. అసెండస్ – సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ఫ్ అనే ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఇవి ప్రభుత్వ కంపెనీలేనని బాబు సర్కార్ బుకాయించింది. సింగపూర్‌లో చాలా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థల వాటా అంతో ఇంతో ఉంటుంది. సెంబ్ కార్ప్‌లో కూడా టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉన్నది. కానీ మెజారిటీ వాటా ప్రైవేట్‌దే! ఈ టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు ఒక మూడేళ్లపాటు ఈశ్వరన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సెంబ్‌కార్ప్‌లో టుమాసెక్ పెట్టుబడి వెనుక ఆయన పలుకుబడి ఉపయోగపడి ఉండవచ్చు. సెంబ్‌కార్ప్‌పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండవచ్చు. సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆరోజుల్లోనే పలువురు ముక్కున వేలేసుకున్నారు. సింగపూర్ కన్సార్టియం, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) ఏర్పాటయింది. ఈ సంస్థకు ప్రభుత్వం 1691 ఎకరాల భూమిని అప్పగించింది. కనీస ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఈ మొత్తం భూమి కనీస విలువ 6,764 కోట్లు. ఇంత విలువ చేసే భూమిని ఏడీపీకి ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఇందులో 250 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు ఉచితంగా కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసుకుని వారే అమ్మేసుకోవచ్చు. ఈ మొత్తం భూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బాబు సర్కార్ అంగీకరించింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కమిటీ (సీసీడీఎంసీ) తన వాటా కింద 221 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. భూమి విలువతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 12,485 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం పెట్టే ఖర్చు ఒక్క రూపాయి కూడా లేదు. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా వేసి విక్రయించడానికి ఇంకో 3,137 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 306 కోట్ల ఖర్చును సింగపూర్ కన్సార్టియం భరిస్తుంది. మొత్తం పెట్టుబడిలో కన్సార్టియం ఖర్చుపెట్టేది సుమారు రెండు శాతం! కానీ వ్యాపారంలో దాని వాటా 58 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం మాత్రమే. సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు ఈ ఒప్పందం సరైన ఉదాహణ. ఇది కాకుండా మరో 250 ఎకరాల భూమి కన్సార్టియంకు ఉచితంగా దక్కుతుంది. అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మి వ్యాపారం చేసే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)ది కాదు. ఇందుకోసం మరో మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అమరావతి మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో విజయవాడ అడ్రస్‌తో ఆర్వోసీలో రిజిస్టరయింది. దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బెంజిమిన్ యాప్ నియుక్తులయ్యారు. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో యాప్ సింగపూర్ ప్రభుత్వ అధికారి హోదాలో పాల్గొన్నారు. చివరికి విజయవాడలో రిజిస్టరయిన కంపెనీకి ఈవోగా అవతారం మారింది. అమరావతి కుంభకోణంలో ఇటువంటి వింతలు ఇంకెన్నో బయటపడాల్సి ఉన్నది. చంద్రబాబు – ఈశ్వరన్‌ల మధ్య పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. సింగపూర్‌లో చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది. ఈశ్వరన్ పదవీచ్యుతి, అరెస్ట్ వెనుక కూడా ఓ హోటల్ కనెక్షన్ ఉన్నది. ఆంగ్ బెంగ్ సెంగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్. అవినీతి, అక్రమ వ్యవహారాల ఆరోపణపై ఆంగ్‌ను సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) అరెస్ట్ చేసింది. అతడిని విచారిస్తున్న నేపథ్యంలోనే ఈశ్వరన్ తీగ దర్యాప్తు సంస్థకు దొరికింది. ఆంగ్ బెంగ్ సెంగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్ర హోటళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయట. ఇవన్నీ ఆంగ్ సొంతం కావు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, సంపన్నుల సొమ్ముతో భారీ హోటళ్లు నిర్మించి వాటిని తాను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయా? ఉంటే అవి సింగపూర్‌లోనే ఉన్నాయా? లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చంద్రబాఋకు ఈశ్వరన్‌తో ఉన్న బంధం, ఈశ్వరన్‌కు హోటల్ ప్రాపర్టీస్ అధిపతి ఆంగ్‌తో అనుమానాస్పద కనెక్షన్‌ను బట్టి చూస్తే చంద్రబాబు హోటళ్ల ప్రచారానికి బలం చేకూరుతున్నది. ఆంగ్ బెంగ్ సెంగ్‌పై వచ్చిన ఆరోపణలేమిటి? వాటితో ఈశ్వరన్‌కు ఉన్న సంబంధమేమిటి? అసలు ఈశ్వరన్‌ను పట్టడానికే ఆంగ్‌ను ఎరగా వేశారా? ఈశ్వరన్‌పై జరగనున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది? ఆ దర్యాప్తుకు అమరావతి తీగ తగులుతుందా లేదా? తగిలితే చంద్రబాబు భవిష్యత్తేమిటి? వగైరా ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు. సింగపూర్ దర్యాప్తులో అమరావతి కోణం తగిలినా తగలకపోయినా, ఈ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఆర్జించాలనుకున్న చంద్రబాబు కల మాత్రం కరిగిపోయినట్టే భావించాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు దగ్గర పనికొచ్చే అస్త్రాలేమీ లేవు. అమరావతినీ, రాజధానినీ ఒక మిడిల్‌క్లాస్ సెంటిమెంట్‌గా మార్చి రంగంలో నిలబడేందుకు బాబు దళం ఆపసోపాలు పడుతున్నది. సింగపూర్ దర్యాప్తులో అమరావతి తీగ తగిలితే, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైతే సెంటిమెంట్ పప్పులుడకవు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎదురుదెబ్బలు వరసగా తగులుతున్నాయి. అధికార వైసీపీ కులమతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో గణనీయంగా బలపడింది. ఇటీవల జరిగిన రెండు మూడు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైసీపీ ఓటింగ్ బలం 51 నుంచి 55 శాతం వరకు ఉంటుందని ఆ సర్వేలు ప్రకటించాయి. నిజానికి సర్వేలు కూడా అవసరం లేదు. పేదలు – పెత్తందార్ల ప్రయోజనాల నడుమ విభజన రేఖ ఏర్పడింది. ప్రతిపక్షం పేదల వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే తీసుకుంటున్నది. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారిన వలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో పాఠాలు చెప్పొద్దని అభాసుపాలైంది. ప్రాణాంతకమైన మద్యం ధరలు తగ్గించాలని కోరుతున్నది. పేదలకు ఇళ్లు కట్టించడంపై కోర్టులకెక్కుతున్నది. దశాబ్దాల తర్వాత వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయతలపెడితే హర్షించలేకపోతున్నది. ఆరోగ్య విప్లవంపై అవాకులు పేలుతున్నది. ఈ తరహా ఆత్మహత్యాసదృశ వైఖరితో ప్రతిపక్షం తనను తాను హననం చేసుకుంటున్నది. ముప్పాతిక శాతం ప్రజల హృదయాల నుంచి వెలివేతకు గురవుతున్నది. మరోపక్క తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ గురుతుల్యునిగా, రక్షకునిగా నిలబడుతున్న రామోజీ పాపభాండం బద్దలైంది. ‘మార్గదర్శి’ పేరుతో చేసిన చట్టవిరుద్ధ నిర్వాకం మెడకు చుట్టుకుంటున్నది. ముదివయసు విచక్షణను కోల్పోయింది. అడ్డగోలు రాతలతో యెల్లో మీడియా విశ్వసనీయతను జారవిడుచుకున్నది. రెండు వారాలకే వారాహి యాత్ర రోత పుట్టించింది. నటుడి మనోధృతిపై జనంలో శంక మొదలైంది. ఒక ప్రయోగం నిష్ఫలమైంది. ఇప్పుడు బాబు కూటమికి ఎటుచూస్తే అటు చీకటి. పటు నిరాశ. అన్నీ దుశ్శకునములే! కొసరుగా ఇప్పుడీ సింగపూర్ పీడకల!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మోదీ ఫ్రాన్స్ పర్యటన.. మరింత పదునెక్కిన చెలిమి!
అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించటంలో సారూప్యత కలిగివుండే భారత్–ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి ఇరవై అయిదు వసంతాలు పూర్తయిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో శుక్రవారం ఆయన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నావికా దళ అవసరాల కోసం ఉద్దేశించిన 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, మూడు స్కార్పీన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతున్నాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే రెండో పెద్ద సరఫరాదారు కాబోతోంది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్ విమానాలు, ఆరు స్కార్పీన్ రకం జలాంతర్గాములు కొనుగోలు చేశాం. ఇరు దేశాలమధ్యా సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ను చేజిక్కించుకొనేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్కిర్క్ పట్టణంలో వమ్ము చేసింది మన దేశానికి చెందిన పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో పారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తుచేసుకుంటూ శుక్రవారం బాస్టిల్ డే సందర్భంగా అదే రెజిమెంట్‌కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సైతం ఫ్రాన్స్‌తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నారు. 1950 తర్వాతనుంచీ రెండు దేశాల మధ్యా అణు, అంతరిక్ష రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిన గత 25 సంవత్సరాలుగా భారత్–ఫ్రాన్స్ చెలిమి ఎన్నో సంక్లిష్ట సందర్భాలను తట్టుకుని నిలబడింది. 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి హయాంలో మన దేశం పోఖ్రాన్లో అణ్వస్త్ర పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికాతో సహా అగ్ర రాజ్యాలు తీవ్ర విమర్శలకు దిగాయి. కానీ ఆ సమయంలో ఫ్రాన్స్ అన్నివిధాలా అండగా నిలబడింది. యూరోప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌ను అభిశంసిస్తూ, దానిపై ఆంక్షలకు పిలుపునిస్తూ బ్రిటన్ తీర్మానం ప్రతిపాదించబోయినప్పుడు వీటో చేస్తానని హెచ్చరించి ఆ ప్రయత్నాన్ని నిలువరించింది ఫ్రాన్సే. చదవండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్ టవర్ నుంచే చెల్లింపులు రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలగుతూనే ఏదోమేరకు స్వతంత్రతను పాటించటం భారత్, ఫ్రాన్స్‌లు మొదటినుంచీ అనుసరిస్తున్న విధానం. అమెరికా బద్ధశత్రువులైన ఇరాన్, రష్యాలతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిదీ ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించటంలోనూ భారత్, ఫ్రాన్స్లమధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వాలంబన సాధించటం అవసరమని గుర్తించటంలోనూ ఇద్దరూ ఇద్దరే. బహుశా అందువల్లే కావొచ్చు... పరస్పరం సహకరించుకోవటం ద్వారా భిన్న రంగాల్లో ఎదగటానికి రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. వ్యూహాత్మక చెలిమిలో ముందడుగు వేస్తున్నాయి. అమెరికా మనతో సఖ్యంగా ఉంటున్నా ఆ చెలిమికి ఎప్పుడూ పరిమితులుంటున్నాయి. ఆ దేశంతో మనం కుదుర్చుకునే రక్షణ ఒప్పందాలకు ఎన్నో అవరోధాలుంటాయి. అక్కడి కాంగ్రెస్ వాటిని ఆమోదించాలి. రక్షణ పరికరాలకు సంబంధించి అమల్లోవుండే ఎగుమతుల నియంత్రణ వ్యవస్థలను దాటాలి. ఈ క్రమంలో ఎక్కడైనా ఆగిపోవచ్చు. లేదా జాప్యం చోటుచేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రక్షణ కొనుగోళ్లకు అంగీకరించినా, సాంకేతికత బదిలీ సాధ్యపడదు. ఉదాహరణకు మన తేలిక రకం యుద్ధ విమానం తేజస్‌కు జీఈ ఎఫ్ 414 ఇంజిన్ అమర్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాని సాంకేతికత బదిలీకి మాత్రం అంగీకరించలేదు. ఫ్రాన్స్‌తో ఈ పేచీ లేదు. దానితో కుదుర్చుకునే ఒప్పందాలకు అవాంతరాలుండవు. సాంకేతికత బదిలీకి అభ్యంతరాలుండవు. జీఈ ఎఫ్ 414 ఇంజిన్ మాదిరే పనిచేసే ఫ్రాన్స్ సఫ్రాన్ ఇంజిన్‌ను ఇక్కడే ఉత్పత్తి చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సాంకేతికత బదిలీ చేయటం వల్ల కేవలం రక్షణ ఉత్పత్తులు విక్రయించే దేశమే కాక, కొనుగోలు చేస్తున్న దేశం కూడా లబ్ధిపొందటానికి అవకాశముంటుంది. రెండు దేశాలూ పర్యావరణ రంగంలో కూడా పరస్పరం సహకరించుకోవటానికి ఇప్పటికే నిర్ణయించాయి. నిరుడు అక్టోబర్‌లో గ్రీన్ హైడ్రోజన్‌పై ఒప్పందం కుదుర్చుకుని, పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచానికి విశ్వసనీయమైన, స్థిరమైన హరిత ఇంధనాన్ని అందించే దిశగా ఇరు దేశాలూ అడుగులు వేస్తున్నాయి. ఇంకా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, 6జీ తదితర అంశాల్లో సమష్టిగా పనిచేస్తున్నాయి. క్వాడ్, జీ 20 తదితర వేదికల్లో ఒకే గళం వినిపిస్తున్నాయి. అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం దురాక్రమణ ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, ఈయూ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించటంలేదు. అలాగే చైనా విషయంలోనూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియెల్ మాక్రాన్ భిన్న వైఖరితో ఉన్నారు. విభేదించుకునే అంశాల్లో అవతలి పక్షం అవగాహన తెలుసుకోవటం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయటంలోనే దౌత్య నైపుణ్యం వెల్లడవుతుంది. చిరకాల మిత్ర దేశమైన ఫ్రాన్స్ మోదీ పర్యటన తర్వాత మనకు మరింత సన్నిహితమవుతుందని ఆశించాలి. -
అంతరిక్షంలోకి... ఆశలయానం
అంతరిక్ష శోధనలో పెను ముందంజకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది. ప్రపంచాళికి ప్రత్యేక ఆకర్షణున్న జాబిల్లికి సంబంధించి ఇతఃపూర్వం బయటపడని రహస్యాలను అందరితో పంచుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. శుక్రవారం శ్రీహరికోట నుంచి చంద్రుని వైపు రివ్వున నింగిలోకి ఎగసే ఉపగ్రహ వాహక నౌకతో ముచ్చటగా మూడోసారి మన చందమామ యాత్ర సాగనుంది. గత యాత్రలకు భిన్నంగా, చంద్రుని అధ్యయనంతో పాటు, ఇతరగ్రహాలపై జీవాన్ని కనుగొనడంలోనూ సాయపడుతుందని ఆశిస్తున్న ప్రయోగమిది. మునుపు ఏ దేశమూ చేయనిరీతిలో క్లిష్టమైన చంద్రమండల దక్షిణ ధ్రువం వద్ద చందమామతో చెట్టాపట్టాలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న శాస్త్రవిజ్ఞాన సాహసమిది. కోట్లాది భారతీయులే కాక, ప్రపంచమంతా ఆసక్తిగా పరికిస్తున్నది అందుకే! దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ తాజా యాత్రకు ముందు రెండుసార్లు భారత్ చంద్రమండల గవేషణ సాగించింది. 2008 అక్టోబర్ నాటి చంద్రయాన్–1లో భాగంగా ప్రయోగించిన 35 కిలోల ‘మూన్ ఇంప్యాక్ట్ ప్రోబ్’ (ఎంఐపీ) చంద్రుని కక్ష్యలో ప్రవేశించి, పరిశోధనలు సాగించి చంద్రుని ఉపరితలంపై నీటి జాడను కనుగొంది. ఇక, చంద్రుని ఉపరితలంపై దిగి, అన్వేషణ జరిపేందుకు ఉద్దేశించిన 2019 సెప్టెంబర్ నాటి చంద్రయాన్–2 పాక్షికంగానే విజయవంతమైంది. ఎనిమిది పరికరాలతో కూడిన ల్యూనార్ ఆర్బిటర్‌ను విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి పంపగలిగాం కానీ, జాబిల్లిపై దిగే రోవర్ (‘ప్రజ్ఞాన్’)ను మోసుకుపోతున్న ల్యాండర్ (‘విక్రమ్’) మాత్రం తుదిక్షణాల్లో కుప్పకూలి, ప్రయోగం పూర్తి సఫలం కాలేదు. మామూలు భాషలో చెప్పాలంటే, మార్గనిర్దేశక సాఫ్ట్‌వేర్‌లో లోపంతో ఆ క్రాష్ ల్యాండింగ్ జరిగిందట. ఇప్పుడు మళ్ళీ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిగేలా రెండోసారి చేస్తున్న ప్రయత్నమే... ఈ చంద్రయాన్–3.అంతా సవ్యంగా సాగితే, ప్రయోగించిన దాదాపు నెల తర్వాత చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. దానిలోని ల్యాండర్, రోవర్లు ఆగస్ట్ 23న చంద్రునిపై కాలూనతాయి. ‘చంద్రయాన్–2’లో తగిలిన దెబ్బల రీత్యా... ఎదురయ్యే ఇబ్బందులు, ఎదుర్కొనే మార్గాలతో ‘వైఫల్యం – సురక్షిత పరిష్కార’ విధానంలో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. ఈసారీ చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరలో 70 డిగ్రీల వద్దే ఉపగ్రహాన్ని దింపనున్నారు. అయితే, గతం నేర్పిన పాఠంతో కచ్చితంగా నిర్ణీత స్థలంలో అని కాక, 4 కి.మీ. “ 2.4 కి.మీ.ల వైశాల్యంలో ఎక్కడైనా సురక్షితంగా దిగేలా సూచనలిచ్చారు. అవసరమైతే సుదూరం ప్రయాణించి, ప్రత్యామ్నాయ స్థలంలో దిగేలా ల్యాండర్లో మరింత ఇంధనం చేర్చారు. ల్యాండర్ స్వయంగా తీసే చిత్రాలకు తోడు మునుపటి చంద్రయాన్–2 ఆర్బిటర్ తీసిన చిత్రాలను సైతం దానికి అందుబాటులో ఉంచారు. తద్వారా సరైన ప్రాంతానికి చేరినదీ, లేనిదీ నిర్ధరించుకొనేలా ఏర్పాటు చేశారు. అధిక వేగంలోనూ దిగేలా ల్యాండర్ కాళ్ళను ఈసారి దృఢంగా తీర్చిదిద్దారు. అదనపు సౌర ఫలకాల్ని ల్యాండర్‌కు అమర్చారు. అసలు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమనేదే సంక్లిష్ట ప్రక్రియ. వైఫల్యాలూ సహజమే. సఫలమైన ఘనత అమెరికా, రష్యా, చైనాలదే. వాటి సరసన నిలవడమే గొప్పయితే, ఇప్పటి దాకా ఎవరూ వెళ్ళని, కనీసం వెలుగైనా తాకని ధ్రువప్రాంతంలో తొలిసారి దిగి, అక్కడి పరిస్థితుల్ని శోధించాలన్న భారత ప్రయత్నం నిస్సందేహంగా అపూర్వమే. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపి, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలవాలని పలుదేశాలు గతంలో ప్రయత్నించాయి. 2019లో మనమే కాక ఇజ్రాయెల్ చేసిన ప్రయోగమూ విఫలమైంది. 2022లో వ్యోమనౌకతో ల్యాండర్ – రోవర్‌ను పంపాలని ప్రయత్నించిన జపాన్, అలాగే రోవర్‌ను పంపజూసిన యూఏఈ సైతం చతికిలబడ్డాయి. సఫలమైన దేశాలన్నీ ఉష్ణోగ్రత, ఉపరితలం రీత్యా సురక్షితమూ, సులభమైన చంద్రమండల భూమధ్యరేఖ వద్ద ఉపగ్రహాన్ని దింపాయి. లోయలు, అగ్నిబిలాలు లేకుండా సౌరశక్తికి పుష్కలమైన సూర్యరశ్మి ఉండే ఆ ప్రాంతంలో పరికరాలు దీర్ఘకాలం పనిచేస్తాయి. కానీ, చంద్రయాన్–3 చేరదలిచిన ధ్రువప్రాంతం మైనస్ 230 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే క్లిష్టమైన అసూర్యంపశ్య. సెంటీమీటర్ల మొదలు వేల కిలోమీటర్ల పరిమాణంలో బిలాలు ఉంటాయి. తాజా ప్రయోగం సఫలమైతే, తొట్టతొలిగా అలాంటి దక్షిణ ధ్రువం వద్ద దిగిన మిషన్‌గా చంద్రయాన్–3 మన దేశానికి ఘనకీర్తి కట్టబెడుతుంది. చంద్రమండల రహస్యాల శోధన, ఛేదనలో మన జెండా రెపరెపలాడుతుంది. వలస పాలన నుంచి బయటపడ్డ అనేక దేశాలతో పోలిస్తే మనం అనూహ్యపురోగతి సాధించినట్టవుతుంది. జాబిల్లిపై ధ్రువాల వద్ద గడ్డకట్టిన చలిలో చిక్కిన శిలలు, మట్టి కాలగతికి దూరంగా స్తంభించిన ఆదికాలపు సౌరవ్యవస్థ తాలూకు ఆచూకీని పట్టివ్వగలవు. అలా విశ్వరహఃపేటిక తెరుచుకుంటుంది. భూమి నుంచి చంద్రునితో పాటు, చంద్రుడి నుంచి దివినీ, భువినీ చూసేందుకు కొత్త లోచూపు కలుగుతుంది. సోదర గ్రహాన్ని జయించామని మనిషి సంబరపడిన ప్రతిసారీ సృష్టి విసిరే సరికొత్త సవాళ్ళకు సిద్ధమవడానికి ఉత్సాహం పొంగుతుంది. చంద్రునిపై శాశ్వత స్థావరాలు నెలకొల్పడం భౌగోళిక రాజకీయ పోరులో లక్ష్యమైన వేళ ఇది భారత్‌కు అతి పెద్ద సానుకూల అంశం. అనేక ప్రయోగాలతో విశ్వవేదికపై శాస్త్రీయంగా, రాజకీయంగా జాబిల్లికి ఆకర్షణ, ప్రాధాన్యం అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం ముందు వరుసలో నిలుస్తుంది. ఇన్ని ఉద్విగ్నభరిత కోణాలున్న ఈ అంతరిక్ష యానంలో చివరకు ‘అందెను నేడే అందని జాబిల్లి’ అని భారత్ విజయగీతికలు ఆలపించాలని ఆకాంక్ష. అస్తు! అందుకై అహరహం శ్రమిస్తున్న మన శాస్త్రవేత్తల సమూహానికి విజయోస్తు! -
‘సెమీ’ ఆశలకు సడన్ బ్రేకులు!
ఆశించిన పురోగతికి అర్ధంతరంగా బ్రేకులు పడినప్పుడు నిరాశ సహజమే! అందులోనూ అది సాక్షాత్తూ ప్రధాని గొప్పగా చెప్పిన ఆత్మనిర్భర ఆశయాలకు భంగకరమని అనిపించినప్పుడు నిరుత్సాహం మరీ ఎక్కువే! భారత దేశ సెమీ కండక్టర్ల (చిప్‌ల) తయారీ ఆకాంక్షలకు ఇప్పుడు అలాంటి అవరోధాలే వచ్చాయి. సెమీ కండక్టర్ల తయారీకి కలసి కృషి చేసేందుకు ఒక్కటైన తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ ‘ఫాక్స్‌కాన్’, భారత సంస్థ ‘వేదాంత’ ఇప్పుడు దేని దారి అది చూసుకోవడం అలాంటి పరిణామమే. దీనివల్ల భారత చిప్ లక్ష్యాలకు ఇబ్బంది ఏమీ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ అది సంపూర్ణ సత్యమేమీ కాదు. చిప్‌ల తయారీ నిమిత్తం వేదాంత– ఫాక్స్‌కాన్‌లు గత ఏడాది ఉమ్మడి భాగస్వామ్యానికి దిగి, గుజరాత్ ప్రభుత్వంతో 19.5 బిలియన్ డాలర్ల విలువైన సెమీ కండర్ల కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. తీరా పట్టుమని పది నెలలకే ఆ గ్రూపు నుంచి వైదొలగుతున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించడం ఒక విధంగా ఆకస్మిక బ్రేకనే చెప్పాలి. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మన దేశం ఆవిర్భవించేందుకు తగిన వాతావరణ పరికల్పనే లక్ష్యంగా పెట్టుకున్న భారత సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)కు ఇది శుభవార్త కానే కాదు. ‘సెమీ కండక్టర్ల ఆలోచనను నిజం చేయడానికి’ వేదాంత సంస్థతో కలసి ఏడాది పైగా కృషి చేసిన ఫాక్స్‌కాన్ పరస్పర అంగీకారంతో, ఈ ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సోమవారం ప్రకటించింది. అంటే ఇక ఆ బృహత్ ప్రయత్నంలో ఫాక్స్‌కాన్ పేరు ఉండదు. ప్రాజెక్ట్ పూర్తిగా వేదాంత సంస్థకే సొంతమన్నమాట. తొలి ప్రకటన వచ్చిన 24 గంటలలోపే ఇటు ఫాక్స్‌కాన్ సైతం విడిగా తగిన సాంకేతిక భాగస్వామిని చేర్చుకొని, తనదైన వ్యూహంతో ముందుకు నడుస్తుందన్న సంకేతాలొచ్చేశాయి. కలసి అడుగులేసిన సంస్థలు ఏడాదికే ఇలా వేరు కుం పట్లయిన పరిణామానికి కారణాలేమిటన్నది అవి చెప్పలేదు. గుజరాత్లో చిప్‌ల తయారీకి కావాల్సిన లైసెన్స్‌తో కూడిన సాంకేతిక పరిజ్ఞానంకోసం వేదాంత, ఫాక్స్‌కాన్‌లు ఎస్టీమైక్రోను ఆసరాగా బరిలోకి దింపాయి. కానీ, ప్రభుత్వం మాత్రం సదరు యూరోపియన్ చిప్ తయారీ సంస్థ కూడా నిష్పూచీగా మిగలక, ఒప్పందంలో భాగస్వామిగా ఉండాల్సిందే అనడంతో చిక్కొచ్చినట్టుంది. ప్రపంచంలో 37 శాతం చిప్‌లు తైవాన్వే! భారత ఎలక్ట్రానిక్ చిప్ అవసరాలన్నీ ప్రధానంగా దిగుమతి ద్వారానే తీరుతున్నాయి. కొన్నేళ్ళుగా ఏటా దాదాపు 1000 కోట్ల డాలర్ల విలువైన చిప్‌లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సుమారు 70 శాతం చైనా నుంచి వస్తున్నవే. చిప్‌ల తయారీలోని ఈ అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఐఎస్ఎం ప్రారంభమైంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, అనేక ఐరోపా దేశాలు చిప్‌ల తయారీ సత్తా పెంచుకుంటున్నాయి. తాజాగా భారత్ ఆ పరుగులో చేరింది. దేశంలో చిప్‌ల తయారీ కేంద్రాల్ని నెలకొల్పాలని వచ్చేవారికి పెట్టుబడి రూపంలో ప్రోత్సాహకాలిచ్చేందుకు సిద్ధపడింది. అమెరికా చిప్ తయారీ సంస్థ మైక్రాన్ ఇటీవలే భారత్‌లో చిప్ కేంద్రానికి ఆమోదం పొందింది. కేంద్ర, గుజరాత్ సర్కార్లు దానికి గణనీయంగా పెట్టుబడి సాయం చేస్తున్నాయి. ఆత్మ నిర్భరతకై ఇలాంటి యత్నాలు జరుగుతున్న వేళ భారీ ఒప్పందమైన వేదాంత – ఫాక్స్‌కాన్ చిక్కుల్లో పడడమే విచారకరం. కారణాలేమైనా గత ఏడాది ఫిబ్రవరి 14న ఫాక్స్‌కాన్– వేదాంతల మధ్య మొలకెత్తిన ప్రేమ మూణ్ణాళ్ళ ముచ్చటైంది. గుజరాత్లో చిప్‌ల తయారీ కేంద్రాల ఏర్పాటుకై గత సెప్టెంబర్‌లో చేసుకున్న రూ. 1.54 లక్ష కోట్ల మేర ఒప్పందాలు ఇరుకునపడ్డాయి. ఏ సంస్థకు ఆ సంస్థ విడివిడిగా ముందుకు పోయినా భారత సెమీ కండక్టర్ల మిషన్‌లో జాప్యం తప్పదనిపిస్తోంది. చిప్‌ల తయారీకి తగ్గ పునాది లేకున్నా చిప్ డిజైన్‌లో మాత్రం మన దేశం ముందంజలో ఉంది. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. సొంత తయారీతో పదునుపెట్టుకోవాలి. పైగా, కరోనాతో సరఫరా వ్యవస్థలకు అంతరాయం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో వచ్చిపడ్డ అనివార్యతల రీత్యా రక్షణ, ఎలక్ట్రానిక్స్ తదితర కీలక రంగాల్లో భారత్ ఎంత త్వరగా సొంతకాళ్ళపై నిలబడగలిగితే వ్యూహాత్మకంగా అంత మంచిది. ఆ మాటకొస్తే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా పైచేయి సాధించగలిగిందీ ఈ చిప్‌ల వల్లేనంటారు విశ్లేషకులు. అమెరికా, చైనాల మధ్య ఇప్పుడు నడుస్తున్న భౌగోళిక రాజకీయాల తోపులాటలోకూ ఇవే కారణం. ఇవాళ దేశాలన్నీ తమ గడ్డపైనే అన్ని రకాల చిప్‌ల రూపకల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తోందీ, ప్రోత్సాహకాలిస్తున్నదీ అందుకే. కాబట్టి, మనకు అవసరమైన చిప్‌ల డిజైనింగ్ నుంచి తయారీ దాకా అన్నీ మన చేతుల్లోనే ఉండడం పోటీలో ముందు ఉండడానికో, ఆర్థిక ప్రయోజనాల రీత్యానో కాకున్నా... వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకం. అందుకే, వేదాంత – ఫాక్స్‌కాన్‌ల బంధం విచ్ఛిన్నమైందన్న నిరాశను పక్కనపెట్టి, సెమీ కండక్టర్ల రంగాన్ని దృఢంగా నిర్మించేందుకు మరింతగా కృషి చేయాలి. చైనా లాంటివి పడనివ్వకుండా చేసినా పట్టుదలతో సాగాలి. వేదాంత – ఫాక్స్‌కాన్‌లకు ఇరుకున పెట్టిన ఆర్థిక, సాంకేతిక అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలి. భవిష్యత్తులో ఇలాంటి మరో ప్రయత్నానికి ఆ చిక్కులు రాకుండా నివారించాలి. సెమీ కండక్టర్ల రంగంలో సాంకేతిక విజ్ఞాన బదలీని ప్రోత్సహించాలి. పరిశోధన, అభివృద్ధిలో దేశ, విదేశీ సంస్థల మధ్య సహకారాన్నీ పెంచిపోషించడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే, ఐఎస్ఎం కింద రూ. 76 వేల కోట్ల కేటాయింపుతో నాలుగు పథకాలు ప్రవేశపెట్టామంటున్న ప్రభుత్వం సంస్థలకు తగిన వాతావరణం కల్పిస్తేనే ఫలితం. మేకిన్ ఇండియాకు బ్రేకులు పడకూడదంటే అది అత్యంత కీలకం. -
ఉత్తరాదిలో వరద-బురద.. మన పాపమే... ఈ ప్రకృతి శాపం!
కనీసం నలభై, యాభై ఏళ్ళుగా ఎన్నడూ చూడనంతటి వర్షం. ఎడతెరిపి లేకుండా నాలుగు రోజులుగా వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్మూ – కశ్మీర్‌లలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. ఉత్తర భారతావనిలో అనేక చోట్ల ఎత్తైన ఆలయ శిఖరాలను సైతం ముంచేస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు. పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన ఆవాసాలు. ఆకస్మిక వరదలతో సిమ్లాలో కుప్పకూలిన భవనాలు. చమోలీలో కొట్టుకుపోయిన బ్రిడ్జీలు. విరిగిపడ్డ కొండచరియలు, కోతపడ్డ రహదారులు. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నదితో దేశ రాజధాని ఢిల్లీకి సైతం వరద ముప్పు. హిమాచల్‌లో 70 మందికి పైగా దుర్మరణం. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే రూ.4 వేల కోట్లకు పైగా నష్టం. వరదలో చిక్కుకున్న వందలాది గ్రామాలు, వేలాది జనం. ప్రకృతి కోపిస్తే, మనిషి పిపీలకమేనని ఇవన్నీ మరోసారి ఋజువు చేస్తున్నాయి. వాతావరణ మార్పుతో పాటు అభివృద్ధి పేరిట మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసమూ ఈ బీభత్సానికి కారణమని వెక్కిరిస్తున్నాయి. పట్టణాభివృద్ధి ప్రణాళికలో మన డొల్లతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. హిమాలయ సానువుల్లోని పర్యాటక ప్రాంతాల్లో విద్యుత్కేంద్రాలే మునిగిపోయి, మట్టి పేరుకుపోవడంతో కరెంట్ లేదు. సాయం చేసే మనిషి లేడు. అనుకోకుండా వచ్చి ఇరుక్కుపోయిన వేల మంది పర్యటకులు ఎలాగోలా బయటపడదామంటే బస్సులు లేవు. విమాన సర్వీసులు లేవు. దోవ, ధైర్యం చెప్పే నాథుడు లేడు. కాసింత రోడ్డు దాటడానికి సైతం వేలకు వేలు దోపిడీ చేస్తున్న కొందరు దళారుల నడుమ ప్రభుత్వ యంత్రాంగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.కుల్లూ, మనాలీ లాంటి ప్రాంతాల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది ధాటికి ఆపి ఉంచిన వాహనాలు సైతం లక్కపిడతల్లా కొట్టుకుపోయాయి. ఇరుకైన జనావాసాల మధ్య నుంచి భారీ వృక్షాలు, కొయ్య దుంగలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పదేళ్ళ క్రితం 2013 జూన్ మధ్యలో ఉత్తరాఖండ్‌ను వణికించిన ‘హిమాలయన్ సునామీ’ లాంటి ప్రళయ భీకర దృశ్యాలనే తాజా సన్నివేశాలూ తలపిస్తున్నాయి. దృశ్యాలే కాదు... ఈ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణాలూ దాదాపు అప్పటి లాంటివేనని శాస్త్రవేత్తలు అనడం గమనార్హం. అప్పుడైనా, ఇప్పుడైనా ఒక పక్కన ఋతుపవనాలు, మరోపక్కన మధ్యధరా సముద్రంలో తలెత్తి, ఉత్తర భారతావనికి ఆకస్మిక వర్షాలు తెచ్చే తుపాను – రెండూ ఏకకాలంలో కలగలసి ఈ ముప్పు తెచ్చాయి. జూన్ చివరి వరకు వర్షపాతం 10 శాతం కొరవ పడితే, వారం రోజుల్లో ఈ వాతావరణ ఉత్పాతంతో 2 శాతం అధిక వర్షపాతం స్థాయికి చేరుకున్నామన్న లెక్క నివ్వెరపరుస్తోంది. అంతకన్నా కలవరమేమిటంటే, భూతాపం రోజురోజుకూ పెరుగుతున్నవేళ ఇలా ఉమ్మడిగా ముప్పు మీదపడడం పోనుపోనూ ఎక్కువవుతుందట! అలాగే, పర్యావరణ రీత్యా అతి సున్నిత హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ప్రాజెక్టుల పేరిట సాగిస్తున్న విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చుకోకుంటే వినాశనం తప్పదనడానికి తాజా ఘటన మరో హెచ్చరిక. తాజా ఘటనలు ఋతుపవనాలపై వాతావరణ మార్పుల ప్రభావానికీ అద్దం పడుతున్నాయి. వర్షం పడదు. పడితే కాసేపే భారీ వర్షం, ఆ వెంటే వరద. ఆకస్మిక వాన, వరదల్ని ముందుగా అంచనా వేయడం కష్టమే. వాతావరణ మార్పులను నిశితంగా గమనిస్తూ, ఆకస్మిక వరదలొచ్చే ప్రదేశాలను గుర్తించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదభరిత వాతావరణ ఘటనల్ని పసిగట్టా లంటే రాడార్ల వినియోగమే శరణ్యమని వాతావరణ శాస్త్రవేత్తల మాట. దానివల్ల 3 గంటల ముందే ముప్పును పసిగట్టవచ్చు. అయితే, ఇకపై హిమాలయాలు, పడమటి కనుమల లాంటి పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు, భూపతనాలు పెరుగుతాయన్న హెచ్చరికను చెవికెక్కించుకోవాలి. నిరుడు జనవరి మొదటి నుంచి సెప్టెంబర్ 30 మధ్య మొత్తం 273 రోజుల్లో ఏకంగా 242 రోజుల్లో ఏదో ఒక ప్రకృతి విలయం తప్పలేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కథనం. అంటే, తరచూ ఎదురయ్యే ముప్పు రీత్యా దీర్ఘకాలిక ప్రణాళికలే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. ఇక, దేశ రాజధాని ఢిల్లీ సైతం మొన్నటి దాకా ఎర్రటి ఎండతో, ఆపైన ముంచెత్తిన వానతో చిగురుటాకులా వణికిపోయింది. వీవీఐపీలు తిరిగే ఇండియా గేట్, జనక్‌పురి సహా మూడు ప్రధానమైన చోట్ల గత వారంలో రహదారులు కుంగిపోయాయి. కొన్నిచోట్ల 8 అడుగుల లోతు గుంటలుపడ్డాయి. ఇవన్నీ మన పట్టణ ప్లానింగ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అద్దం పడుతున్నాయి. ఇప్పటికే ముంబయ్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా అనేక నగరాల్లో పదే పదే ఇలాంటి పరిస్థితులే చూస్తున్నాం. చెట్ల నరికివేత, చెరువులు – నదీతీరాల్ని ఆక్రమించేలా విచ్చలవిడి నిర్మాణాలకు అనుమతి వీటికి కారణం. కాసింత వానకే మురుగునీటి పారుదల వ్యవస్థ కుప్పకూలుతోంది. ఇవన్నీ మన పాపాల ఫలితమే. ఇకనైనా, పాలకులు ఉష్ట్రపక్షి స్వభావాన్ని విడనాడాలి. విచ్చలవిడి అభివృద్ధితో వినాశనమే అని గ్రహించాలి. అంతకంతకూ పట్టణాలకు వలసలు పెరుగుతున్నందున పెరిగే అవసరాలకు తగ్గట్టు సరైన రీతిలో పట్టణాభివృద్ధి ప్రణాళిక చేయాలి. చెరువులు, కాలువలను మొత్తం పట్టణ స్వరూపంలో భాగమని గుర్తించాలి. వాటిని సవ్యంగా కాపాడి, నిర్వహిస్తేనే అర్బన్ ఫ్లడ్స్‌ను నివారించవచ్చు. అలాగే, ఇప్పటికే భారీ అప్పుల్లో పీకల లోతు కూరుకుపోయిన హిమాచల్ లాంటి రాష్ట్రాలు ఈ జలవిలయ నష్టాల నుంచి బయటపడాలంటే కష్టమైనా కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోక తప్పదు. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. -
సరికొత్త ‘డేటా పరిరక్షణ’
వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పి ఆరేళ్లవుతుండగా మళ్లీ సరికొత్తగా ముస్తాబై డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోంది. పట్టు వదలని విక్రమార్కుడి నుంచి పదే పదే తప్పించుకునే బేతాళుడి మాదిరి ఎప్పటికప్పుడు వెనక్కిపోతున్న బిల్లు ఈసారైనా ఈనెల 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో ఆమోదం పొందుతుందా లేదా అన్నది చూడాలి. అంతకన్నా ముఖ్యం– ముసాయిదా బిల్లుపై నిపుణుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో తెలియాల్సివుంది. డేటా పరిరక్షణ ఎంతో సవాలుతో కూడుకున్న వ్యవహారం. దాన్ని రూపొందించేవారికి డిజిటల్ రంగంపైనా, అందులో వస్తున్న, రావడానికి ఆస్కారం ఉన్న మార్పులపై లోతైన అవగాహన ఉండాలి. అప్పుడే నిజమైన పరిరక్షణ సాధ్యమవుతుంది. మన దేశంలో డిజిటల్ యుగం ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. పేరుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–2000 చట్టం వచ్చినా అది పౌరుల గోప్యతకు సంబంధించి కొరగాని చట్టంగా మిగిలిపోయింది. వేలిముద్రలతో సహా పౌరుల సమస్త వివరాలూ సేకరించే ఆధార్‌ను ఆదరాబాదరాగా తీసుకొచ్చిన ఆనాటి యూపీఏ సర్కారు ఆ డేటా పరిరక్షణకు అనువైన చట్టం అవసరమన్న సంగతి మరిచింది. దానిపై నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాక 2012లో జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఒక సమగ్ర నివేదిక కూడా ఇచ్చింది. ఈలోగా యూపీఏ ఏలుబడి ముగిసిపోయింది. తగిన చట్టాలు లేకుండా ఆధార్ కోసం వ్యక్తిగత వివరాలు సేకరించడాన్ని సవాలు చేస్తూ 2017లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పుట్టస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టాక కేంద్రంలో కదలిక మొదలైంది. వ్యక్తిగత గోప్యత హక్కు పౌరుల జీవించే హక్కులో అంతర్భాగమని, అందుకు అనుగుణంగా చట్టం ఉండితీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసులో తీర్పునిచ్చాక జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నాయకత్వాన కమిటీ ఏర్పాటయింది. అన్ని వర్గాల ప్రజలతోనూ, నిపుణులతోనూ మాట్లాడి మరుసటేడాది జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ముసాయిదా బిల్లు సమర్పించింది. మార్పులు, చేర్పులతో ఆ బిల్లు 2019లో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ఏర్పాటైంది. మరో రెండేళ్లకు జేపీసీ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా 2021లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దానిపైనా అనేక అభ్యంతరాలు వ్యక్తం కావటంతో నిరుడు ఆగస్టులో ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. తర్వాత రూపొందిన మరో ముసాయిదా బిల్లును నిరుడు నవంబర్‌లో ప్రజల పరిశీలనకు విడుదల చేశారు. అందులో వ్యక్తమైన అభిప్రాయాలేమిటో, వేటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోతున్నదో చెప్పలేదు. మొత్తానికి ఆరేళ్లుగా సాగుతున్న కసరత్తు పర్యవసానంగా కొత్త బిల్లు రాబోతోంది. ఐరాస సభ్యదేశాల్లో ఇప్పటికే 137 దేశాలు డేటా పరిరక్షణ చట్టాలు తీసుకొచ్చాయి. చెప్పాలంటే ఆ విషయంలో మనం వెనకబడేవున్నాం. దేశ పౌరుల డేటా బజారునపడుతున్న వైనం అప్పుడప్పుడు వెల్లడవుతూనే ఉంటోంది. ఎక్కడెక్కడో డేటా సంపాదించి పౌరుల బ్యాంకు ఖాతాలను దుండగులు ఖాళీ చేస్తున్న ఉదంతాలు పెరిగాయి. అయినా డేటా పరిరక్షణ బిల్లు తీసుకురావటంలో అలవిమాలిన జాప్యం జరిగింది. ఏమైతేనేం... బిల్లు రాబోతున్నది. సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్య వల్ల డేటా లీకైనపక్షంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు, చర్యలు తీసుకునేందుకు డేటా పరిరక్షణ ప్రాధికార సంస్థ(డీపీఏ) ఏర్పాటు చేయాలన్న బిల్లులోని ప్రతిపాదన మెచ్చదగిందే. ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించుకోవటం, నిఘా పెట్టడం ఇక తప్పనిసరవుతుంది. ఉద్దేశిత ప్రయోజనం నెరవేరగానే సేకరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామన్న హామీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా చట్టంలో ఉంటుందంటున్నారు. అది మంచి ప్రతిపాదనే. డేటా లీక్ అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అవసరాన్నిబట్టి కేబినెట్ ఆమోదంతో ఈ జరిమానాను రూ. 500 కోట్ల వరకూ పెంచడానికి బిల్లులో ఏర్పాటుందని చెబుతున్నారు. ప్రతిపాదన కూడా అవసరమైనదే. అయితే పౌరుల డేటా లీక్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను సమంగా చూడాలి. పౌరుల అనుమతి లేకుండా వారి డేటాను సేకరించే ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తించేలా చర్యలుండాలని, వాటికి కూడా కళ్లెం వేయాలని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ వంటి సంస్థల డిమాండ్. అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రైవేటు సంస్థలకైనా, ప్రభుత్వ సంస్థలకైనా సమానంగా వర్తించేలా చట్టాలున్నాయి. దేశ భద్రత తదితర అంశాల్లో తన ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలకు కేంద్రం మినహాయింపు ఇవ్వొచ్చని తాజా బిల్లులో ఉన్నదంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది అవసరమే కావొచ్చు కూడా. కానీ ఆ క్రమం పారదర్శకంగా ఉండాలి. మినహాయింపులిస్తే సరిపోదు. చట్టవిరుద్ధత చోటుచేసుకున్న పక్షంలో చర్యలేమిటో ప్రతిపాదించాలి. తప్పుడు ఫిర్యాదులని తేలితే రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చన్న పాత ముసాయిదా నిబంధన కూడా మార్చలేదంటున్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేయాలంటేనే సవాలక్ష అడ్డంకులుంటాయి. ఈమాదిరి జరిమానాలు తోడైతే ఇక చెప్పేదేముంది? పౌరులను బెదరగొట్టే ఈ నిబంధనను పరిహరిస్తేనే మంచిది. డీపీఏ ఒక స్వతంత్ర సంస్థగా మనగలిగితేనే దాని పని తీరు ప్రభావవంతంగా ఉంటుందని పాలకులు గుర్తిస్తే అది దేశానికెంతో మేలు చేస్తుంది. -
వానలు కురవాలి
ఇది ఆషాఢ మాసం. వర్షారంభ కాలం. ఆషాఢమంటే ఆకాశంలో కనిపించే మబ్బులు. నేలమీద కురిసే తొలకరి చినుకులు వీచే మట్టి పరిమళాలు. ‘తొలకరి వాన మొలకల తల్లి’ అనే నానుడి ఉంది. ఆషాఢంతో ముడిపడిన అనేక సంప్రదాయాలు మన జనజీవనంలో ఉన్నాయి. ఆషాఢం నుంచి కార్తీకం మొదలయ్యే వరకు వానలు కురుస్తాయి. పూర్వం మనకు వానాకాలంతోనే ఏడాది మొదలయ్యేది. అందుకే, వానను వర్షం అని అంటారు. ఏడాదులను వర్షాలతో లెక్క కట్టడం కూడా మనకు వాడుకలో ఉన్న పద్ధతే! ప్రకృతిలోని జీవకళకు వానలే ఆధారం. వర్షసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘సదా మనోజ్ఞం స్వనదుత్సవోత్సుకమ్/ వికీర్ణ విస్తీర్ణ కలాప శోభితమ్/ ససంభ్రమాలింగన చుంబనాకులం/ ప్రవృత్త నృత్యం కులమద్య బర్హిణామ్’ అని కాళిదాసు ‘ఋతుసంహారం’లో వర్షర్తు సౌందర్యాన్ని వర్ణించాడు. మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో వాన కురుస్తున్నప్పుడు నెమళ్లన్నీ పింఛాలు విప్పి జంటలు జంటలుగా ఒకదానినొకటి ముద్దాడుతూ నర్తిస్తున్నాయట! తొలకరి జల్లులు కురిసే వేళల్లో ఇలాంటి చూడచక్కని దృశ్యాలు కనిపిస్తాయి. ‘ఎలగోలు జల్లు మున్ బెళబెళ నేటవా/ల్పడి గాలి నట్టిండ్ల దడిపి చనగ/... భూభిదాపాది దుర్భరాంభోభరంపు/... కడవ వంచి/నట్లు హోరని దారౌఘ మైక్యమొంది/ మిన్ను మన్ను నొకటిగా వృష్టి బలిసె’ అంటూ హోరైన గాలితో చిటపట చినుకులుగా మొదలైన వర్షం వేగాన్ని పుంజుకుని మింటినీ మంటినీ ఏకం చేసేంత కుంభవృష్టిగా పరిణమించిన వైనాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యదలో’ కళ్లకు కట్టాడు. ఇలాంటి దృశ్యాన్నే శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్/ పరచెను ఝంఝానిలములు/ కురిసెను వర్షము కుంభగుంభిత రీతిన్’ అని వర్ణించారు. సకాలంలో సజావుగా కురిస్తే, వర్షం హర్షదాయకమే! వర్షం ఒక్కొక్కప్పుడు బీభత్సం సృష్టిస్తుంది. శేషేంద్ర తన కావ్యంలో వర్షబీభత్సాన్ని కూడా వర్ణించారు. ‘పసికందుల్ జడివానలో వడకగా పాకల్ ధరంగూలి తా/మసహాయస్థితి తల్లిదండ్రులును హాహాకారముల్ సేయగా... నిర్వేల హాలాహల శ్వసనంబుల్ ప్రసవించె దీనజనతా సంసారపూరంబులన్’ అంటూ జడివానకు పూరిపాకలు కూలి పోయినప్పుడు నిరుపేదల నిస్సహాయతను కళ్లకు కట్టారు. రుతువులలో వర్షర్తువంతటి అస్తవ్యస్తమైన రుతువు మరొకటి లేదు. వానాకాలానికి ఉండే సహజ లక్షణం అనిశ్చితి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అని సామెత. వర్షాకాలంలో మోతాదుగా వానలు కురుస్తాయనే భరోసా ఎప్పుడూ లేదు. భూమ్మీద ఎక్కడో ఒకచోట అతివృష్టి లేదా అనావృష్టి దాదాపు సర్వసాధారణం. మనుషులు అతివృష్టినీ తట్టుకోలేరు, అనావృష్టినీ భరించలేరు. సకాలంలో వానలు కురవకుంటే వానల కోసం ఎదురు చూస్తారు. ఎదురుచూపులకు ఫలితం దక్కకుంటే కప్పలకు పెళ్లిళ్లు చేయడం, వరుణ హోమాలు చేయడం వంటి తతంగాలను యథాశక్తి సాగిస్తారు. ప్రార్థనల ఫలితంగానో, ప్రకృతి రుతుధర్మ ప్రకారమో జడివానలు మొదలైతే, చిత్తడితో నిండిన వీథుల్లోకి వెళ్లలేక వానలను తిట్టుకుంటారు. మనుషులు స్తుతించినా, నిందించినా వాటితో ఏమాత్రం నిమిత్తం లేకుండా వానలు వాటి మానాన అవి వచ్చిపోతుంటాయి. అతివృష్టి వరదబీభత్సం వంటి ఉపద్రవాలను తెచ్చిపెడితే, అనావృష్టి కరవు కాటకాలతో ఆకలిమంటలు రేపుతుంది. ‘ఆకాశంబున మేఘమాలికల రూపైనం గనన్ రాదు, శు/ష్కాకారంబుల బైరులెల్ల సుదుమై యల్లాడె తీవ్రంబుగా/... మాకీ కష్టము వెట్టె దైవమని యేలా మాటికిం జింతిలన్?’ అంటూ దువ్వూరి రామిరెడ్డి తన ‘కృషీవలుడు’ కావ్యంలో కళ్లకు కట్టారు. అనావృష్టి ప్రభావం రైతు లకే ఎక్కువగా ఉంటుంది. చినుకు కరవై బీడువారిన నేలను చూస్తే రైతు గుండె చెరువవుతుంది. ఆషాఢం అంటే తొలకరి చినుకులు మాత్రమే కాదు, అరచేతులను పండించే గోరింట కూడా! ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సంప్రదాయం. పురాతన నాగరికతల కాలం నుంచి గోరింటాకు వాడుకలో ఉంది. అయినా మన కావ్య ప్రబంధాలలో కాళిదాసాది పూర్వకవులు గోరింటాకుపై ఎందుకో శీతకన్నేశారు. గోరింట ప్రస్తావన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలోనే కనిపి స్తుంది గాని, కావ్యాలలో కనిపించదు. జానపద గీతాల్లో గోరింట ప్రస్తావన కనిపిస్తుంది. ‘గోపాల కృష్ణమ్మ పెళ్లయ్యెనాడు/ గోరింట పూచింది కొమ్మ లేకుండా’ అనే జానపద గీతం ఉంది. ‘గోరింటాకు’ సినిమా పాట పల్లవిని కృష్ణశాస్త్రి బహుశా దీనినుంచే సంగ్రహించి ఉంటారు. ఆధునిక కవుల్లో కొద్దిమంది గోరింటపై దృష్టి సారించారు. సరోజినీ నాయుడు ‘గోరింటాకు’ కవిత రాశారు. ‘వధువు నెన్నుదుటికి కుంకుమం ఎరుపు/ మధురాధరాలకు తాంబూల మెరుపు/ లిల్లీల తలపించు కాళ్లకూ వేళ్లకూ/ లేత గోరింటాకు ఎరుపే ఎరుపు’ అంటూ గోరింటాకు ఎరుపును ఎంతో మురిపెంగా వర్ణించారు. ఆమె ఇంగ్లిష్‌లో రాసిన కవితను సినారె తెలుగులోకి అనువదించారు. ‘బొప్పి గట్టినగాని యే పురుషుడైన/ తెలివినొందడు లోకంబు తెలియబోడు/ రాళ్లదెబ్బల గోరింట రంగొసంగు/ మనుజు డగచాటులనె గాని మారడెపుడు’ అంటారు ఉమర్ అలీషా. అగ చాట్లలో నలిగితే తప్ప మనిషి మారడని చెప్పడానికి రాళ్లదెబ్బలతో నలిగితేనే గోరింట రంగునిస్తుందని పోల్చడం విశేషం. ఆషాఢంలోని తొలకరి జల్లులతో మొదలయ్యే వానాకాలంలో సజావుగా వానలు కురిస్తే పంటపొలాల్లో నవధాన్యాలు పండుతాయి. ఆషాఢంలో అతివలు అలంకరించుకునే గోరింటాకుతో అరచేతులు పండుతాయి. ప్రకృతి కరుణిస్తే బతుకులు పండుతాయి. మన పంట పండాలంటే వానలు కురవాలి. -
పార్టీ ఫిరాయింపులను చట్టాలు నిరోధించలేవు!
రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పుడూ ఒక పద్ధతిని అనుస రిస్తాయి. వర్గ విభేదాలు బహిరంగంగా మారిన తర్వాత, ప్రతి ఒక్క పక్షం కూడా పార్టీపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా, రెండు గ్రూపులూ తమతమ కార్యకర్తలను నియమిస్తాయి, పార్టీ స్థానాల నుండి ప్రత్యర్థులను తొలగిస్తాయి. అప్పుడు, రెండు వైపులా ప్రత్యర్థి సమూహానికి చెందిన చట్టసభ సభ్యుల సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభిస్తాయి. చివరగా, పార్టీపై నియంత్రణను చేజిక్కించుకోవడానికి చట్టపరమైన తగాదాలు ప్రారంభమవుతాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పార్టీ గుర్తు, దాని పేరు ఏ వర్గాని దన్న సంగతి నిర్ణయిస్తుంది. అనర్హత నిర్ణయించే క్రమంలో తెలుసుకున్న సమాచారం మేరకు శాసనసభ ప్రిసైడింగ్ అధికారి (స్పీకర్) ప్రతి వర్గానికి చెందిన చట్ట సభ సభ్యుల బలం ఎంతో నిర్ణయిస్తారు. ప్రతి దశలో, ప్రతి గ్రూపునకు చెందిన సంఖ్యా బలం, పార్టీ రాజ్యాంగం ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహారాష్ట్రను చుట్టుముట్టిన రాజకీయ నాటకంలో, శరద్ పవార్, అజిత్ పవార్ల నుండి మొదటి రెండు దశలు అంటే... టిట్–ఫర్–టాట్ తొలగింపులు, అనర్హతా పిటిషన్ల ధాఖలు చేయడం ఇప్పటికే పూర్తయ్యాయి. మూడవ దశ ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఎన్సీపీకి శాసనసభలో 53 మంది, శాసనమండలిలో తొమ్మిది మంది, లోక్‌సభలో ఐదుగురు, రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఎవరి వర్గంలో గణనీయమైన సంఖ్యలో నాయకులు ఉన్నారనే విషయం తెలియడంలేదు. ఇది కీలకమైనది. శివసేన కేసులో, ఎన్నికల చిహ్నాలపై, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఈసీఐ, స్పీకర్ ఇద్దరూ శాసనసభలో, పార్టీ సంస్థాగత విభాగాలలో వర్గ బలాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు నొక్కిచెప్పిన రెండో అంశం పార్టీ రాజ్యాంగం. ఎన్సీపీ రాజ్యాంగం ఒక వివరణాత్మక పత్రం. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నియామకం, వారి పాత్ర, క్రమ శిక్షణా చర్యల ప్రక్రియను నిర్దేశిస్తోంది. చివరి నుంచి రెండో నిబంధన పార్టీని రద్దు చేయడం లేదా మరొక సంస్థలో విలీనం చేసే ప్రక్రియను తెలియజేస్తోంది. ఈ అంశంపై పార్టీ జాతీయ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అది పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సమావేశానికి నెల రోజుల ముందు నోటీస్ ఇస్తారు. కోరమ్, కమిటీలోని ఎన్నుకోబడిన సభ్యులలో 75 శాతం అని కూడా ఈ పత్రం నిర్దేశిస్తోంది. పార్టీని రద్దు చేయ డానికి లేదా విలీనం చేయడానికి 90 శాతం మంది అంగీకరించాలి. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభించినప్పుడు, ఆయన ముందు ఈ పత్రం ఉంటుంది. గత సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న సేన పిటి షన్లతోపాటు రెండు ఎన్సీపీ వర్గాల ఫిరాయింపు అభ్యర్థనలు 11 వరకు ఆయన ముందు ఉన్నాయి. ఎన్సీపీ సంక్షోభం ముదిరితే, సేన మాదిరిగానే, దాదాపు ఎన్సీపీ శాసనసభ్యులందరూ ఏదో ఒక వర్గం నుండి అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు అంటే అసెంబ్లీ బలంలో మూడింట ఒక వంతు – ఫిరాయింపుల నిరో ధక చట్టంలో చిక్కుకునే పరిస్థితిని ఇది సృష్టించవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ చట్టం తరచుగా పరిష్కారం కంటే సమస్యగానే ఉంటోంది. శాసనసభ అమాయకత్వం లేదా రాజకీయ వంచన 1985లో ఈ చట్టం ఆమోదం పొందడానికి దారి తీసింది. ఒక రాజకీయ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికైన చట్టసభ సభ్యులు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినా లేదా ఓటు వేసినా రెండు మినహాయింపులతో తమ స్థానాన్ని కోల్పోతారని ఇది పేర్కొంది. మొదటి మినహాయింపు ఏమిటంటే, చట్టసభ సభ్యులలో మూడింట ఒక వంతు మంది పార్టీ నుండి విడిపోతే, దానిని ఫిరాయింపుగా పేర్కొనరు. ఈ నిబంధన ప్రభుత్వాలను పడగొట్టడానికి విస్తృతంగా ఉపయోగపడింది. చివరికి 2003లో పార్లమెంటు దానిని తొలగించింది. రెండవ మినహాయింపు – విలీన నిబంధన అని పిలవబడేది – ఒక రాజకీయ పార్టీ మరొక దానితో విలీనం అయితే, విలీనంలో భాగమైన చట్టసభ సభ్యు లను అనర్హులుగా ప్రకటించరు. పైగా పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండొంతుల మంది అంగీకరించినట్లయితే అటు వంటి విలీనం జరిగినట్లు పరిగణిస్తారు. దీన్ని యథాతథంగా తీసుకుంటే, ఒక రాజకీయ పార్టీని మరొక దానితో విలీనం చేయడానికి కావాల్సిందల్లా దాని శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మందిని ఒప్పించడమే. ఉదాహరణకు, 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత, 10 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. ఫలితంగా ఇంతకుముందు ఒక్క సభ్యుడు కూడా లేని బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే పార్టీ ఫిరాయింపులను నిరోధించే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అర్థం చేసు కోవాలని సుప్రీం కోర్ట్ శివసేన కేసు విషయంలో భావించింది. పార్టీకి చెందిన చట్ట సభలకు ఎన్నికైన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనం కావడానికి ముందు... ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు, సభ్యులు విలీనం అవ్వాలి. అప్పుడే ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అయినట్లు పరిగణిస్తారు. విలీనాన్ని నిర్థారించ వలసిన చట్ట సభ స్పీకర్ విలీనానికి ఎంత మంది పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉన్నారో ఎలా తెలుసుకుంటారు? అందుకే 1999లో లా కమిషన్ విలీన నిబంధనను తొలగించాలని సిఫార్సు చేసింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఏనాడూ పని చేయలేదు. ఉదాహరణకు, సేన ఫిరాయింపు కేసు గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది, కానీ ఎక్కడా అది ముగింపునకు రాలేదు. ప్రస్తుత ఎన్సీపీ ఫిరాయింపు పిటిషన్లకు కూడా ఒక సంవత్సరం పట్టవచ్చు. అప్పటికి ఎన్నికలు సమీపిస్తాయి. దీంతో అప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా–కనీసం రాజకీయంగా చూసినా నిష్ఫలమైనట్లే. రాజ్యాంగంలో కొన్ని చట్టపరమైన నిబంధనలను చేర్చినంత మాత్రాన రాజకీయ నైతికతను సాధించలేమని మనం గ్రహించాల్సిన సమయం ఇది. ఫిరాయింపుల సమస్యను ఎప్ప టికైనా పరిష్కరిస్తుందనే ఆశతో అంటిపెట్టుకోకుండా ‘ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని పూర్తిగా తొలగించడం మంచిది. ఫిరా యింపులు రాజకీయ సమస్యలు, వాటికి రాజకీయ పరిష్కారాలు అవసరం. ఈ విషయంలో చట్టం పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుంది. చక్షు రాయ్ వ్యాసకర్త లెజిస్లేటివ్, సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్,పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
MP Urination Incident: ఘోరం... దారుణం!
కొన్ని ఉదంతాలు మనల్ని విషాదంలో ముంచెత్తుతాయి. మనం మనుషులుగానే మనుగడ సాగిస్తు న్నామా, సమాజం ఇంత అమానుషంగా మారిందా అనే ఆందోళన కలిగిస్తాయి. మధ్యప్రదేశ్‌లో ప్రవేశ్ శుక్లా అనే దుండగుడు ఆదివాసీపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం అటువంటిదే. అసలు ఊహకు కూడా అందని రీతిలో శుక్లా ఇలా రెచ్చిపోవడానికి కారణమేమిటి? మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉదంతం విషయంలో చకచకా కదిలింది. వెనువెంటనే ఆ దుండగుడిని కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించింది. అతను నివాసం ఉంటున్న ఇంటిని కూల్చేసింది. ఆదివాసీకి రూ. 6.5 ల„ý లు పరిహారంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు...ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుణ్ణి తన నివాసానికి పిలిపించుకొని అతని కాళ్లు కడిగి తలపై జల్లు కున్నారు. దుండగుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంవల్ల తమపై ఆ మచ్చ పడుతుందన్న భయంతో ప్రభుత్వం వేగంగా కదిలివుండొచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉదంతంపై ఇంకా నిరసలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఉదంతం చోటుచేసుకున్నప్పుడు ప్రభుత్వాలు తక్షణం స్పందించటం, కారకులపై కఠినమైన చర్యలు తీసుకోవటం, బాధితులకు రక్షణ కల్పించటం సాధారణ ప్రజలకు భరోసానిస్తుంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ప్రవేశ్ శుక్లా వంటి దుండగులు ఈ సమాజంలో నాగరిక వేషంలో ఎలా మనుగడ సాగించగలుగుతున్నారు? రాజకీయ పార్టీల్లోకి ఎలా చొరబడగలుగుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించకపోతే ఇవి పదే పదే పునరావృతమవుతూనే ఉంటాయి. దళితులనూ, ఆదివాసీలనూ, అట్టడుగు కులాల వారినీ అకారణంగా అవమానించటం, వారిని అత్యంత హీనంగా చూడటం మన దేశంలో కొత్తగాదు. తాజా ఉదంతం వీడియో సాక్షిగా బయటికొచ్చింది కనుక ఇంతగా స్పందన వచ్చింది. ప్రభుత్వం కూడా చురుగ్గా కదిలింది. కానీ చట్టానికి దొరక్కుండా, సాక్ష్యాలకు చిక్కకుండా నిత్యం సాగుతున్న దుండగాల మాటేమిటి? ఈ ఉదంతంపై నిరసనల హోరు ప్రారంభమైన రోజే సర్వోన్నత న్యాయస్థానం విశ్వవిద్యాలయాల పర్యవేక్షణను చూస్తున్న యూజీసీకి కీలకమైన ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యాలయాల్లో వివక్షకు తావులేకుండా చేయటానికి ఇంతవరకూ తీసుకున్న, తీసుకోబోతున్న చర్యలేమిటో చెప్పా లని కోరింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ వివక్షకు బలై ప్రాణం తీసుకున్న రోహిత్ వేముల తల్లి, ముంబైలో వైద్య విద్యలో పీజీ చేస్తూ తోటి విద్యార్థినుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఆదివాసీ యువతి పాయల్ తాడ్వి తల్లి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. వారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ గత ఏడాది కాలంలో మూడు ఉన్నత శ్రేణి సంస్థల్లో ముగ్గురు విద్యార్థులు కులోన్మాదుల హింస భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వైనాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి ఉదంతాలప్పుడు విద్యాసంస్థల నిర్వాహకులు తమ సంస్థల్లో వివక్ష లేనేలేదని బుకాయించారు. వారికి వత్తాసు పలికిన విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. సరిగ్గా గ్రామ స్థాయి నుంచి ఉన్నత శ్రేణి విద్యాసంస్థల వరకూ నిత్యం వినబడే ఇలాంటి బుకాయింపులే మన సమాజంలో ఆధిపత్య కులాల హింసకు లైసెన్సునిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ యధేచ్ఛగా కొనసాగుతూనే ఉన్న రెండు గ్లాసుల వ్యవస్థ, మహానగరాలనుకునేచోట అపార్ట్మెంట్లలో పనివాళ్ల పట్ల చూపే వివక్ష... అట్టడుగు కులాలవారికీ, మైనారిటీలకూ ఇళ్లు అద్దెకు దొరక్క పోవటం వంటివి ఈ హింసను అడుగడుగునా చాటుతూనే ఉన్నాయి. వాటిని సరిచేయటానికి పూనుకోవాల్సిన వ్యవస్థలు చాలా సందర్భాల్లో రాజీపడుతున్నాయి. పైకి ఎంతో గౌరవప్రదంగా కనబడే వ్యక్తులే ఈ వివక్షకు బాధ్యులవుతుండటం చేదు నిజం. ఎంతో గొడవ జరిగి, పెను వివాదమైతే తప్ప చర్యలకు సిద్ధపడటం లేదు. అసలు పట్టించుకోకపోవటం వేరు...అతిగా పట్టించుకోవటం వేరు. పర్వేశ్ శుక్లాను కఠినమైన చట్టంకింద అరెస్టు చేశారు. మంచిదే. ఆదివాసీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిపై జల్లుకున్నారు. పాలకుడిగా మానసిక వేదనకు లోనయి ఈ పని చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ దుండగుడి నివాసం కూల్చేయటం ఎలాంటి చర్య? తప్పు చేసిన ఏ వ్యక్తయినా చట్టం ముందు సమానమేనని, వారిపై కఠిన చర్య తీసుకుంటామని సందేశం పంప డానికి బదులు, తాము ఏం చేస్తే అదే చట్టమనే ధోరణి ప్రదర్శించటం ఎలాంటి సంకేతాలిస్తుంది? శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలోచించాలి. అట్టడుగు కులాలవారిపై ఆధిపత్య కులాల హింసను అంతమొందించటంలో, మహిళలపై నిత్యం సాగే అమానుషత్వాన్ని అరికట్టడంలో మన సమాజం పదే పదే విఫలమవుతున్న తీరు ఆందోళన కలిగించే అంశం. 2002లో గుజరాత్ అగ్నిగుండమైనప్పుడు బిల్కిస్ బానో అనే మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యావజ్జీవ శిక్ష పడిన 11మంది నేరస్తులను నిరుడు విడుదల చేయటం, దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నా ఇంకా అతీ గతీ లేకపోవటం అందరూ గమని స్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది ఆఖరులో ఎన్నికలు వస్తున్నందువల్లే శివరాజ్ సింగ్ సర్కారు వేగంగా స్పందించిందన్న విపక్షాల విమర్శలను కొట్టిపారేయగలమా? ఏదేమైనా చట్ట ప్రకారం వ్యవహరించటంలోనే, సంయమనం పాటించటంలోనే ప్రభుత్వాల సమర్థత వెల్లడవుతుంది. అది ప్రజాస్వామిక సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది. -
వైరుద్ధ్యాలతోనే... ఒకే గూటిలో...
పరస్పర వైరుద్ధ్యాలను బయటపెట్టుకుంటూనే సహకారం కోసం సాగిన ప్రయత్నం ఇది. మంగళవారం నాటి ‘షాంఘై సహకార సంఘం’ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సును ఒక్కమాటలో అభివర్ణించాలంటే అంతే! భారత ఆతిథ్యంలో వర్చ్యువల్‌గా సాగిన ఈ 8 సభ్యదేశాల సంఘం 23వ సదస్సు విజయవంతంగానే ముగిసింది కానీ, చైనా, పాకిస్తాన్లతో మన సంబంధాల్లో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనపడింది. ఢిల్లీ ఎప్పటిలానే తీవ్రవాద వ్యతిరేక మంత్రం, బీజింగ్ షరా మామూలు ఆర్థిక సహకార తంత్రాలనే సదస్సులో ప్రవచించాయి. అమెరికా, పాశ్చాత్య ప్రపంచాలతో సంబంధం లేకుండా చైనా–రష్యా కేంద్రకంగా యురేషియా బృందానికి, ప్రపంచ జనాభాలో 40 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం గనకే ఎస్సీఓపై ప్రపంచానికి అమితాసక్తి. భారత ప్రధాని వర్చ్యువల్‌గా ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సుకు హాజరైనవారిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో పాటు కొత్తగా సభ్యత్వం పొందిన అమెరికా వ్యతిరేక ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఈ సదస్సును జరపాలనుకున్నా, మోదీ అమెరికా పర్యటనతో వాయిదా వేసి, ఆన్లైన్లో సరిపెట్టాల్సి వచ్చింది. ఈ సమావేశంతో ఏడాది కాలపు భారత అధ్యక్ష హోదా ముగిసింది. నిన్న గాక మొన్ననే అమెరికాలో పర్యటించి, స్నేహం పెంచుకున్నప్పటికీ విదేశాంగ విధానంలో తాము స్వతంత్రులమే అని భారత్ ప్రకటించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది. అమెరికా వ్యతిరేక ఇరాన్‌ను సభ్యదేశంగా ఆహ్వానించడం, ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు మిత్ర పక్షమైన బెలారుస్‌కు వచ్చే ఏటి కల్లా పూర్తి సభ్యత్వమిస్తామని ప్రతిపాదించడమే అందుకు సూచన. అదే సమయంలో చైనా చేపట్టిన వందల కోట్ల డాలర్ల ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బ్రి)కు మిగతా దేశాలన్నీ మద్దతుగా నిలిచినా, సదస్సు అనంతర ప్రకటనలో ఆ భాగానికి భారత్ దూరం జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మీదుగా సాగే ‘చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్’ (సీపీఈసీ) నిర్మాణం సైతం ‘బ్రి’లో భాగం గనక దాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. ఆ ప్రాంతంలో సీపీఈసీ పురోగతి దేశ సార్వభౌమత్వా నికీ, ప్రాదేశిక సమగ్రతకూ తీవ్ర ఉల్లంఘన అనేది మన స్పష్టమైన వైఖరి. ఆది నుంచి ఎస్సీఓ కొంత చైనా లక్షణాలను పుణికిపుచ్చుకున్నదే. అలా చూస్తే 2017 నుంచి పాకిస్తాన్‌తో పాటు ఈ సంఘంలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందిన భారత్ ఇందులో విజాతీయ సభ్యదేశం. అదే ఏడాది ఇటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన పునరుద్ధరించిన ‘క్వాడ్’ లోనూ భారత్ సభ్యత్వం పొందింది. వర్తమాన భౌగోళిక రాజకీయాల రీత్యా వివిధ అంతర్జాతీయ వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని భారత్ సంకల్పం. తాజా ఎస్సీఓ భేటీలోనూ సహకార, భాగస్వామ్యాలు వీలున్న అంశాల్లో మాటామంతీ ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించింది. ఇది ప్రశంసనీయమే. సీమాంతర తీవ్రవాదం, ప్రాంతీయ సుస్థిరత, సభ్యదేశాల మధ్య మెరుగైన సహకారం తదితర కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. చైనా, పాకిస్తాన్లతో కలసి భారత్ వేదిక పంచుకోవడమనేది అరుదైన ఘటన గనక అందరి చూపూ ఇటు పడింది. భారత, పాకిస్తాన్‌లు మాటామంతీ సాగించడానికీ, పరస్పర సహకారానికి గల మార్గాలను పరిశీలించడానికీ ఈ సదస్సు సదవకాశం. కానీ, ఇరుదేశాల మధ్య పాతుకుపోయిన అవిశ్వాసమే ఈ శిఖరాగ్ర సదస్సులో మళ్ళీ బయటపడింది. తీవ్రవాదానికి అండగా నిలిచినంత కాలం పాక్‌తో చర్చలు పునరుద్ధరించేది లేదన్నదే భారత వైఖరి. అలాగే, వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంట యథాపూర్వ స్థితి రావాలని కోరుతున్న భారత్, చైనాతో సాధారణ సంబంధాలను పునరుద్ధరించడానికి ఆ మాట మీదే పట్టుబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ సభ్యదేశాల మధ్య సహకరానికి ఢిల్లీ అయిదు అంశాల్ని గుర్తించింది. అవి... అంకుర సంస్థలు–నవకల్పన, సాంప్రదాయిక వైద్యం, యువతరం సాధికారికత, అందరికీ డిజిటల్ అవకాశాలు, ఉమ్మడి బౌద్ధ వారసత్వం. ఇవి అస్పష్టమే అయినప్పటికీ, వైరుద్ధ్యాల మధ్యా తమకు సామ్యాలున్నట్టు చెప్పడానికి ఉపకరిస్తాయి. నిజానికి, సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగే జీ–20 భేటీలో ఏకాభిప్రాయ ఉమ్మడి ప్రకటనకు చైనా, రష్యాల నుంచి చిక్కులు లేకుండా చూసుకొనేందుకు తాజా ఎస్సీఓను ముందస్తు ట్రయల్‌గా భారత్ వాడుకొని ఉండవచ్చు. కానీ, ఐరాస భద్రతామండలిలో భారత ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతున్న వేళ తీవ్రవాదంపై బలంగా స్వరం వినిపిస్తూ చైనా, పాక్‌లపై పరోక్షంగా బాణం గురిపెట్టింది. అయితే, అదే సమయంలో తీవ్రవాద, వేర్పాటువాద సంస్థల ‘ఉమ్మడి జాబితా’ రూపకల్పనను చైనా ఆధిపత్య ఎస్సీఓ లక్ష్యంగా పెట్టుకొనేలా చేయగలిగింది. భద్రతామండలి ఇప్పటికే ఈ పని చేస్తున్నందున ఈ రెండో జాబితా ఎందుకు, దాని వల్ల ఉపయోగమేమిటన్నది చెప్పలేం. ఇంగ్లీషును లాంఛనప్రాయంగా ఎస్సీఓ భాషగా చేయడంపై ఎస్సీఓ దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇక, త్రివిక్రమావతారం దాల్చి చైనా మొత్తం ఆక్రమిస్తుందనే శంకతో ఆర్థిక సహకారంపై నిర్ణీత ప్రణాళికకు భారత్ సై అనలేదు. వెరసి, మిశ్రమ ఫలితాలతోనే ఎస్సీఓ భారత అధ్యక్ష హయాం ముగిసిపోయింది. మునుపటి లాభాలు తగ్గిపోతున్నా, పరస్పర భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా సరే... మధ్య ఆసియా ప్రాంతంతో మాటామంతీకీ, అలాగే తాలిబన్ల హయాంలోని ఆఫ్ఘనిస్తాన్ నుంచి భద్రత కారణాల రీత్యా ఎస్సీఓలో క్రియాశీలంగా కాలు కదపడమే భారత్ ముందున్న మార్గం. ముగిసిన ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు అందులో ఓ భాగమని సంతృప్తిపడాలి. -
అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!
నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్ (సీఆర్ఎస్) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం. దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్ఎస్ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద బాహానగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్‌కతా ‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్’ అప్ – లూప్ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్ రైలును గుద్దుకుంది. అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎస్ అండ్ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం. ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్ఎస్ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్ లోపం తలెత్తింది. దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్ బోర్డ్‌పై దాన్ని మార్క్ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్ షిఫ్టింగ్ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్ ఫాల్ట్ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అలాగే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్ డయా గ్రమ్ను మార్చి ఉన్నా రాంగ్ సిగ్నలింగ్ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్ అండ్ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్. రైళ్ళను నియంత్రించే మెకానిజమ్‌లు, అలాగే లెవల్ క్రాసింగ్లకు సంబంధించిన సిగ్నలింగ్ సామగ్రి అయిన ‘రిలే హట్స్’ ఈ రిలే రూమ్‌లలోనే ఉంటాయి. అలాంటి రూమ్ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్ఎస్ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్‌కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం. ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్ఎస్ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి. లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్ఎస్ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్‌లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. -
మూలానికి మందు వేయాలి!
ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్ తగలబడుతూనే ఉంది. ప్యారిస్‌కు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్‌ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్‌ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి. ఆఫ్రికన్, అరేబియన్ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్ సంతతికి చెందిన టీనేజర్ నహేల్ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు. ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్‌లైవ్స్ మేటర్’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం. ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట. ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్ తక్షణం రద్దు చేయాలి. పోలీస్ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్‌లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర. అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్‌బాల్‌లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్ దేశాల లానే ఫ్రాన్స్ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్‌లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం. అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్‌లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. లేదంటే, ఇవాళ ఫ్రాన్స్‌లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! -
మరో ‘మహా’ నాటకం!
కొన్ని సన్నివేశాలు, సంఘటనలు మునుపెన్నడో చూసినట్టు, చిరపరిచితమైనట్టు అనిపిస్తుంటాయి. మహారాష్ట్రలో ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలు, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వర్గం మహారాష్ట్ర బీజేపీ సర్కార్‌లో చేరడం చూస్తే... సరిగ్గా ఏడాది క్రితం సంఘటనలే పునరావృతమవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో శివసేనను చీల్చిన ఏక్నాథ్ శిందే వ్యవహారం గుర్తొస్తుంది. ఇప్పుడు మనుషులు, పార్టీల పేర్లు మారాయి కానీ కథ మాత్రం మళ్ళీ అదే. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే సారథ్య శివసేన, ఇప్పుడు శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. అక్కడ శిందే, ఇక్కడ అజిత్. కాకపోతే ఈసారి తెలివిగా ‘చీలిక’ అనకుండా, ఎన్సీపీగా తాము ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, మంత్రివర్గంలో చేరుతున్నామంటూ సాంకే తిక చిక్కులు లేకుండా చూసుకుంటున్నారు అజిత్. అంతే తేడా. మొత్తానికి గతంలో కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో లాగా మహారాష్ట్రలోనూ ప్రత్యర్థి పార్టీల్ని చీలికలు పేలికలు చేయడంలో బీజేపీ మరోసారి సఫలమైంది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతా యత్నానికి గట్టి దెబ్బ కొట్టింది. శరద్ – ఆయన కుమార్తె సుప్రియ ఒకవైపు, అజిత్ వర్గం మరోవైపు నిలవడంతో ఎన్సీపీపై పట్టు కోసం పోరు మరిన్ని మలుపులు తీసుకోనుంది. గత 24 ఏళ్ళలో విడతలు విడతలుగా 17 ఏళ్ళు ఎన్సీపీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మధ్యలో కొన్నేళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏడాదిగా గద్దెపై లేదు. ఏళ్ళ తరబడి పవార్ కుటుంబాన్ని కలిపి ఉంచిన అధికార బంధం బలహీనమైంది. అధికారం రుచి మరిగిన అజిత్ దేనికైనా సిద్ధమయ్యారు. అన్న కొడుకులోని అధికార కాంక్షను గుర్తించిన శరద్ కొత్త వ్యూహాలతో చెక్ పెడుతూ వచ్చారు. నెల క్రితం కూడా పార్టీ పగ్గాలు వదిలేస్తున్నట్టు ప్రకటించి, తీరా కార్యకర్తల ఆకాంక్ష అంటూ మళ్ళీ మూడు రోజులకే వెనక్కి తగ్గి, కుమార్తెకు పెత్తనం కట్టబెట్టారు. అజిత్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తూ చాణక్య నీతి ప్రదర్శించారు. అజిత్‌కు అది మింగుడు పడలేదు. అదను చూసి, అనుచరులతో కలసి సొంత బాబాయ్‌ని వదిలేసి, కేంద్రంలో మోదీకి జై కొట్టారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ తమ వైపే ఉన్నారని అజిత్ అంటున్నా, అందుకు లిఖితపూర్వక సాక్ష్యమేమీ ఇప్పటికైతే లేదు. ‘మహారాష్ట్ర పురోభివృద్ధి కోసం, మోదీ సారథ్యంలో దేశ పురోగతి కోసం’ ...ఇలా శరద్‌ను వదిలిపెట్టి, పార్టీని చీల్చలేదంటూనే చీల్చిన అజిత్ తదితరులు బోలెడు మాటలు చెబుతున్నారు. కానీ, నాలుగేళ్ళలో ముగ్గురు వేర్వేరు సీఎంల హయాంలో మూడోసారి డిప్యూటీ సీఎం అయిన అజిత్ ఆకాంక్షలు బహిరంగ రహస్యం. పైగా, స్వయంగా అనేక భారీ కుంభ కోణాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అజిత్, ఆయన వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరారో ఊహించడం కష్టమేమీ కాదు. వారంతా ఇక బీజేపీ వాషింగ్ మెషిన్‌తో స్వచ్ఛమైపోయినట్టే! రాజకీయ గూగ్లీలతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించే శరద్ ఈసారి తానే క్లీన్ బౌల్డయ్యారు. ప్రఫుల్ పటేల్ తదితరులు విశ్వాసపాత్రులన్న నమ్మకం నట్టేట ముంచింది. 2019లోనే బీజేపీ వైపు వెళ్ళేందుకు అజిత్ విఫలయత్నం చేసినప్పుడే ముకుతాడు వేయాల్సిన శరద్ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏకు మేకైంది. తాజా చీలిక కాని చీలికతో ఎవరిది అసలైన పార్టీ, ఎవరిది ఎన్నికల గుర్తన్నది సైతం వివాదాస్పదమే. మనుగడ కోసం 83వ ఏట ఈ మరాఠా యోధుడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ పోరుకు దిగాలి. పదవుల్లోని ప్రత్యర్థులపై ఇరువర్గాల పోటాపోటీ వేటు పర్వం సాగుతోంది. ఎన్సీపీ వర్కింగ్ ఛీఫ్ ప్రఫుల్ పటేల్‌ను పదవి నుంచి, అజిత్ వర్గ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శరద్ ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో మహారాష్ట్రలో పెనుమార్పులు తప్పవంటున్నారు. ఆ మాటేమో కానీ అజిత్ వర్గాన్ని చేర్చుకోవడం వెనుక బీజేపీకి దాని లెక్కలు దానికున్నాయి. గత నెల సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో ఏక్నాథ్ శిందే సారథ్య శివసేన చీలిక ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పకపోవచ్చు. రేపు సాక్షాత్తూ సీఎం శిందే సహా పలువురు చీలిక వర్గపు శివసేన సభ్యులు అనర్హత పాలైనా, కొత్తగా చేరిన అజిత్ వర్గంతో మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ మనుగడకు ఢోకా ఉండదు. కానీ, బహిష్కరణల వేటుతో అజిత్ వర్గం ఎమ్మెల్యేలూ అనర్హత వేటు ఎదుర్కొనే ముప్పు లేకపోలేదు. పాలకపక్ష స్పీకర్ నాన్చకుండా, అంత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేరే కథ. వెరసి, సంకీర్ణ రాజకీయాల రచ్చలో పూర్తిగా దెబ్బతిన్నది మహారాష్ట్రలో ప్రజాతీర్పు. అయితే, పార్టీ సంస్థాగత ప్రక్షాళన చేపట్టి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్న కమలనాథుల గురి మొత్తం రాబోయే ఎన్నికలే. ఠాణేలో శిందే, మరాఠ్వాడాలో అజిత్‌లకు గట్టి పట్టుంది. బీజేపీకి పట్టు లేని ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ నేతలిద్దరూ ‘మిషన్ 2024’లో అక్కరకు వస్తారనేది లెక్క. అలాగే, శిందే రెక్కలు కత్తిరించడానికీ పక్కనే అజిత్‌ను కూర్చోబెట్టడం కమలనాథులకి పనికొస్తుంది. 2019 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసి, తీరా గెలిచాక పక్కకు వెళ్ళి అధికారాన్ని దూరం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పైనా, అలాగే కీలకమైన ప్రతిసారీ ఖంగు తినిపించిన శరద్‌పవర్ ఎన్సీపీ పైనా బీజేపీ చివరకిలా ప్రతీకారం తీర్చుకుంది. ఎన్నికల కల్లా శిరోమణి అకాలీదళ్ లాంటి ఒకప్పటి మిత్ర పక్షాల్ని ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది సంతోష సందర్భం. ఆపసోపాలు పడుతున్న ప్రతిపక్ష ఐక్యతాయత్నానికి మహా కష్టం. ఎన్సీపీలో చీలిక సఫలమైతే బీజేపీకి లాభం. సఫలం కాకున్నా అజిత్‌కే తప్ప, దానికొచ్చిన నష్టమేమీ లేదు. ఇక బిహార్‌లోనూ ఇలాంటి ‘ఆపరేషన్’ సిద్ధమవుతోందని వార్త. ఏమైనా, అధికారం కోసం దేనికైనా సిద్ధమై, ప్రజాస్వామ్యాన్ని వట్టి నంబర్ల గేమ్‌గా మార్చేస్తున్న మన పార్టీల, నేతల నిస్సిగ్గు నగ్నత్వానికి ‘మహా’ నాటకం మరో ప్రతీక. -
అవార్డులూ.. బహుమతులూను
‘అవార్డులు రావు. కష్టపడి సంపాదించుకోవాలి’ అని అబ్బూరి వరద రాజేశ్వరరావు ఒకసారి అన్నారు. సాహిత్యం, ఆ మాటకొస్తే ఏ కళైనా ప్రచారం కోరుకుంటుంది. ప్రచారం దేనికి? కీర్తి కోసం అనుకునేవారు కొందరు. కళ నిర్వర్తించాల్సిన పరమార్థం కోసం అనుకునేవారు కొందరు. ఉత్కృష్టమైన కళ మబ్బుల చాటు సూరీడు వలే ఎల్లకాలం దాగి ఉండదు. జనులకు తెలిసే తీరుతుంది. ఆదరణ పొందుతుంది. కాని బంగారు చేటకు కూడా గోడచేర్పు అవసరం అన్నట్టు కొన్నిసార్లు కళ ప్రచారం కావడానికి, ఫలానా కళాకారుడి కృషి చూడండహో అని తెలుపడానికి అవార్డులూ, బహుమతులూ ఉపయోగపడతాయి. అయితే కాలక్రమంలో ఇడ్లీ కంటే చట్నీకి విలువెక్కువైనట్టు కళ కంటే ఈ అవార్డులకు విలువ ఎక్కువై అవార్డు వచ్చినవారు ‘గొప్పవారేమో’ అనే భావన జన సామాన్యులలో ఏర్పడే పరిస్థితి వచ్చింది. ముళ్లపూడి వెంకటరమణ ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ఏదో పాత్ర చేత అనిపిస్తారు. చచ్చు పుచ్చు పుస్తకాలు ఎన్ని రాసినా ఒక సరైన అవార్డు కొడితే తల ఎగరేస్తూ తిరగొచ్చు కదా అనుకునే స్త్రీ పురుష సాహితీకారులు నేడు ఇరు రాష్ట్రాలలో తగు మోతాదులో మేట వేశారనే వాస్తవిక అపోహ ఉంది. జోకులు చలామణీలో ఉన్నాయి. ఒక ప్రఖ్యాత కవికి సరస్వతీదేవి ప్రత్యక్షమై ‘వత్సా! కవిత్వం కావలెనా? న్యూఢిల్లీ వారి ఫలానా సాహితీ అవార్డు కావలెనా?’ అని అడిగితే ఆ కవి సెకను తొట్రుపడకుండా ‘కవిత్వమే దయచేయి తల్లీ! అవార్డును ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను’ అన్నాట్ట! మనుషులంటూ ఉన్న ప్రతిచోటా తప్పులు, పొరపాట్లు ఉన్నట్టే అవార్డు అనే మాట ఉన్న చోటల్లా తప్పులూ, పొరపాట్లూ, రాజకీయాలూ, బానిసలకు వరాలూ ఉంటాయి. సాహిత్యంలో సర్వోన్నతమైనదిగా భావించే నోబెల్ పురస్కారం టాల్‌స్టాయ్‌కి రాలేదు. ఆయనకు కాకుండా ఆ తర్వాత దాదాపు 39 మంది నవలాకారులకు నోబెల్ ఇచ్చారు. వారంతా ‘మేము టాల్‌స్టాయ్‌కి వారసులం మొర్రోయ్’ అన్నారు. గాంధీకి నోబెల్ శాంతి ఇవ్వలేదుగాని ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన మార్టిన్ లూథర్ కింగ్‌కు ఇచ్చారు. చైతన్య స్రవంతికి ఆద్యుడైన జేమ్స్ జాయిస్‌కి నోబెల్ రాలేదు. కథా చక్రవర్తయిన సోమర్సెట్ మామ్‌కు ఎందుకివ్వలేదయ్యా అనంటే ‘అతడు అక్కరకు మించిన ప్రచారం పొందాడు’ అని సాకు చెప్పారు. మన దగ్గర రవీంద్రనాథ్ టాగోర్‌కి సరే, ప్రేమ్‌చంద్, శరత్‌లు నోబెల్‌కు ఏం తక్కువ అని తూకం వేసి నిరూపిస్తే సదరు అవార్డు కమిటీ ఏం చెబుతుందో ఏమో! భారతదేశం వంటి దేశంలో రచయితలు, కవులు కేవలం తన రచనలతో బతికే పరిస్థితులు లేవు. ఎంతో గొప్ప అంకితభావం, ప్రతిభ, రచనాశక్తి, జనహిత అభిలాష కలిగిన రచయితలైనా బతుకు బాదరబందీలకు అవస్థలు పడుతూ కవిత్వమో, కథో రాయాలి. అప్పొసప్పో చేసి పుస్తకాలు వేసుకోవాలి. అవి అమ్ముడు పోకపోతే అటక మీద గుడ్డ కప్పి దాచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో వీరికి తృణమో పణమో ఇచ్చి అవార్డు చేతపెట్టి గౌరవించుకుందాం అనే సదుద్దేశ సాహితీ సంస్థలు అనేకమే వచ్చాయి. ఇవి తమ తమ అభిరుచి, అభిలాషల మేర అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినా, వాటిలో ప్రతిష్ఠాత్మకస్థాయి కలిగినవి బహు స్వల్పం కావడంతో ప్రభుత్వపరంగా వచ్చే రాష్ట్ర అవార్డులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డులు ప్రతిష్ఠాత్మకమై కూచున్నాయి. ‘షేక్స్పియర్కు ఏ అవార్డు వచ్చిందని నేటికీ చదువుతున్నారు’, ‘వేమనకు ఎవరు అవార్డిచ్చా రని ప్రతి నాలుక మీద పలుకుతున్నాడు’ అని ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా యోగ్యులైన సాహితీ కారులకు యోగ్యమైన అవార్డు వచ్చి తీరాలి. లేకుంటే అయోగ్యులు ఆ అవార్డులు పొందుతూ అవార్డుకు అయోగ్యతను తెచ్చి పెడతారు. అసలు సాహితీకారులు తమ వల్ల అవార్డుకు గౌరవం రావాలని కోరుకోవాలేగాని అవార్డు వల్ల తమకు గౌరవం రావాలనుకుంటున్నారంటేనే వీరెంత నిరుపేదలో అర్థం చేసుకోవచ్చు. ఇందుకై ఏళ్ల తరబడి పి.ఆర్ చేయుట, పెద్దలను మచ్చిక చేసుకొనుట, పథకాలు రచించుట, దొంగ పద్ధతిలో షార్ట్‌లిస్ట్‌లో చేరుట, కుల సమీకరణలు, ప్రాంతీయ సెంటిమెంట్లు.. ఇన్ని పతన సోపానాల మీద నడిచి అవార్డు తెచ్చుకుని అల్మారాలో పెట్టుకుని పొద్దున్నే అద్దంలో ముఖం ఎలా చూసుకుంటారో వీరు! నలుగురూ తిరిగే చోట తమ పుస్తకం పెట్టి, దాని మీద డబ్బు పెడితే ఆ డబ్బు కోసమైనా ఎవరూ పుస్తకాన్ని తీసుకెళ్లని నాసిరకం రచయితలు, కవులు కూడా ఫలానా అవార్డు కోసం పైరవీ చేసేవారే! వీరికి ఊ కొట్టే దిక్కుమాలిన జ్యూరీలు! ‘అవార్డు వస్తే ఏమవుతుంది’ అనంటే ‘నోరు మూతబడుతుంది’ అనేది ఒక జవాబు. ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉండాల్సిన కవులు, రచయితలు ప్రభుత్వపరమైన అవార్డులు తీసుకున్నాక ప్రభుత్వానికి ములాజా అవుతారు. ఈ కారణం చేత కూడా ప్రభుత్వాలు అవార్డులను సృష్టిస్తాయి, ఇచ్చి ప్రోత్సహిస్తాయి. తమిళ రచయిత జయమోహన్ తనకొచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ఈ కారణం చేతనే తిరస్కరించాడు. అయితే సరైన రచయితలు తమకు అవార్డుల వల్ల వచ్చిన అదనపు గుర్తింపును జనం కోసం ఉపయోగించడం మంచి స్ట్రాటజీనే! ప్రస్తుతం తెలుగునాట అవార్డుల దుమారం రేగి ఉంది. అవార్డు ఇస్తాం అనంటే గౌరవప్రదమైన సాహితీకారులు పరిగెత్తి పోరిపోయే స్థితి ఉంది. నాణ్యమైన రచనల పట్ల తెలుగు పాఠకలోకం ఉదాసీనత మాని, వాటిని అక్కున జేర్చుకుంటూ, ఆ రచనలకు సముచిత స్థానం కల్పిస్తూ వెళ్లడమే దీనికి విరుగుడు. పాఠకుడి అవార్డులు, బహుమతులే ఇప్పుడు తెలుగు సాహిత్యానికి శ్రీ సరస్వతీ రక్ష. -
ప్రతిపక్షాలు బీజేపీ ఉచ్చులో పడరాదు!
యూనిఫాం సివిల్ కోడ్(యూసీ సీ)పై వివాదాన్ని మళ్లీ రాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్య ఊహించదగిన ప్రతిస్పందనలనే రాబట్టగలిగింది. అనేక మంది ప్రతిపక్ష నాయకులు యూసీసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. ముస్లిం సంస్థలు ఒక అడుగు ముందు కేసి దీన్ని మైనారిటీలకు, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకరమైన చర్యగా ఖండించాయి. రాజ్యాంగం వాగ్దానం చేసిన సమానత్వాన్ని అందరికీ అందించడం కోసం అంటూ యూసీసీని బరిలోకి దించింది బీజేపీ. అయితే లౌకికవాద రాజకీయాలు సంప్రదాయ (మైనారిటీ) మతనాయకులతో గొంతుకలుపుతూ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో విషాదకరమైన, హాస్యస్ఫోరకమైన సైద్ధాంతిక పోరాటానికి వేదిక సిద్ధమైంది. లౌకికవాదం పేరుతో ప్రతిపక్షాలు యూసీసీకి వ్యతిరేకంగా నిలబడటం ఖాయమని ఊహించే బీజేపీ ఈ చదరంగాన్ని ప్రారంభించి ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలు చట్టవిరుద్ధంగా హిందూ మతాన్నీ, సంప్రదాయాలనూ, జాతీయవాదాన్నీ ఆక్ర మించి ముందుకు వెళుతుంటే లౌకికవాద రాజకీయాలు ఆ మేర వెనకబడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ప్రతిపక్షాలు పప్పులో కాలువేసి బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్ప డటానికి కారణమవుతున్నాయి. ఈ తిరోగమనం ఆగాలంటే, లౌకిక రాజకీయాలు ఉమ్మడి పౌరస్మృతి పట్ల సూత్రప్రాయమైన, ప్రగతిశీలమైన పాత్ర పోషించాలి. యూసీసీకి ఏ ఒక్క మతానికి చెందిన ఆచారాలు, సంప్రదాయాలతో ప్రమేయం ఉండదనీ, దీని ద్వారా వివిధ మతపరమైన సమూహాల్లోనూ, సమూహాల మధ్య రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వాన్ని పాదుకొల్పడమే ప్రధాన ఉద్దేశం అనే సంగతినీ గుర్తెరగాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతలను తొలగించి అందరికీ ఒకే విధమైన న్యాయాన్ని ప్రదానం చేయడం దీని ఉద్దేశమని గ్రహించాలి. యూసీసీని వ్యతిరేకించడం పేలవమైన రాజకీయం! 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు లౌకికవాదులకు ఇది చెడు రాజకీయ వ్యూహం అని చెప్పక తప్పదు. ఉమ్మడి పౌర స్మృతి ఆలోచన చట్టం ముందు సరళమైన, శక్తిమంతమైన హేతుబద్ధ సమానత్వాన్ని ప్రతిపాదిస్తోంది. పౌరు లందరినీ ఒకే శిక్షాసమ్మృతి ద్వారా పాలించగలిగితే, సివిల్ కోడ్‌కు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయకూడదు? అలాగే వివిధ సంఘాలు వారి ప్రత్యేక ఆచారాలను సంప్రదాయాలను ఆస్వా దించవచ్చు, అయితే వ్యక్తుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఏ సంఘాన్నైనా అనుమతించవచ్చా? ఒక మతం లేదా సంస్కృతికి చెందినవారు తమ ఆచారం పేరుతో సొంత సమా జంలోని మహిళల సమానత్వ హక్కును హరించడాన్ని అనుమ తించవచ్చా? ఇవి బీజేపీ వాదనలు కావు. యూసీసీ కోసం మహిళా సంస్థల అసలు డిమాండ్ వెనుక ఉన్న కారణం ఇదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఈ న్యాయబద్ధం కాని ఆదేశిక సూత్రము (సమానత్వం)ను కలిగి ఉంది. భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్‌ను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూనే ఉన్న మనలాంటి వారు ఈ కీలక సూత్రాలలో ఒకదాని నుంచి అకస్మాత్తుగా వెనుదిరగలేరు. జాతీయ ఎన్నికలకు 10 నెలల ముందు, లా కమిషన్ అంతకు ముందు తిరస్కరించిన యూసీసీనే తిరిగి ప్రవేశ పెట్టాలని బీజేపీ భావించడం మైనారిటీలను దెబ్బతీయడానికి మరొక సైట్‌ను తెరవడమే. కాంగ్రెస్ వంటి పార్టీలు కుటుంబ చట్టాల సంస్కరణలను హిందువుల గొంతుకపైకి నెట్టేయ గలవనీ, అయితే ముస్లింలు, క్రిస్టియన్ల విషయంలో అలా చేయడానికి ధైర్యం చేయవనీ దీని ఉద్దేశ్యం. ముస్లిం, క్రైస్తవ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో ప్రతిపక్షాలు గొంతు కలుపు తాయని ఊహించే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఇంతకు ముందు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించి తప్పు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు బీజేపీ పన్నిన యూసీసీ ఉచ్చులో పడిపోతున్నాయి. ప్రతిపక్షాలు యూసీసీ ఆలోచనను వ్యతిరేకించే బదులు, ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌ను బీజేపీ ఏ విధంగా తప్పుగా వ్యాఖ్యా నిస్తుందో చెప్పాలి. ‘యూనిఫాం’ సివిల్ కోడ్ అంటే దేశంలో బహుళ కుటుంబ చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉండాలి. పైగా ఆ చట్టం అన్ని మత వర్గాల సభ్యులకు వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం కోసం ఒకే విధమైన నిబంధనలను కలిగి ఉండాలి. ఇదే ముందుకు తేవాల్సిన వెర్షన్. కానీ బీజేపీ విమర్శ కులు ప్రతిఘటిస్తున్న సంస్కరణ ఇది. ఇది రాజ్యాంగ ఆదేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. సంఘ సంస్కర్తల దార్శనికత, రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం, స్త్రీవాద ఉద్యమం డిమాండ్ వంటివి ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఏకరూప కోడ్ అనేది ఒకే రూపంలో కానీ ఒకే సూత్రంగా కానీ ఉండదు. బదులుగా, ఇది ఉమ్మడి సూత్రాలు, విభిన్న నియ మాలను కలిగి ఉంటుంది. ఇక్కడ, ఏకరూపత అంటే అన్ని మత, సామాజిక సంఘాలు ఒకే రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండడం. సమానత్వ హక్కును, వివక్షకు వ్యతిరేకంగా ఉన్న హక్కును, లింగ న్యాయం ఆలోచనను ఉల్లంఘించేలా ఏ కమ్యూ నిటీకి చెందిన కుటుంబ చట్టం అనుమతించబడదు. ఈ సూత్రా లను ఉల్లంఘించే ఏ ఆచారం లేదా కుటుంబ చట్టానికి స్థానం ఉండదు. అదే సమయంలో, ఈ ఉమ్మడి సూత్రాలు వివిధ సంఘాలకు వేర్వేరు రూపాలను తీసుకోవచ్చు, వాటి ప్రస్తుత లేదా క్రోడీకరించిన పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. హిందూ ఆచారాల మాదిరిగా కాకుండా, ముస్లిం వివాహం ‘నిఖా నామా’పై ఆధారపడిన ఒప్పందం. ‘యూనిఫాం’ సివిల్ కోడ్‌కు ముస్లింలు దీనిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, లేదా హిందువులు దానిని స్వీకరించాల్సిన అవసరం లేదు. వివిధ సంఘాలు అందరికీ ఉద్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించనంత కాలం... వివాహం, విడాకులు, దత్తత, వారసత్వా నికి సంబంధించి పూర్తిగా భిన్నమైన, పరస్మర విరుద్ధమైన ఆచా రాలు, పద్ధతులను అనుసరించడం కొనసాగించవచ్చు. చాలా కాలంగా, లౌకిక రాజకీయాలు బీజేపీ చొరబడిన నేలను ఖాళీ చేశాయి. ప్రతిపక్షాల ఈ స్వీయ–ఓటమి రాజకీ యాలకు యూసీసీ మరొక ఉదాహరణగా మారకూడదు. బీజేపీ రచించిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటానికి, మైనారిటీ వర్గాల సంప్రదాయవాద నాయకత్వంతో చేతులు కలపడానికి బదులుగా, లౌకిక రాజకీయాలు బీజేపీ బుకాయింపునకు ఎదు రొడ్డాలి. ప్రతిపాదిత యూసీసీ గణనీయమైన ముసాయిదాను సమర్పించమని అడగాలి. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
సంకుచితమైన తీర్పు
అబార్షన్ల విషయంలో మహిళల రాజ్యాంగ హక్కుని కాలరాస్తూ నిరుడు జూన్‌లో తీర్పునిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు... జాతి ఆధారంగా విద్యాసంస్థల అడ్మిషన్లలో ప్రాధాన్యం కల్పించే విధానా నికి మంగళం పాడి తనది వెనకడుగేనని మరోసారి నిరూపించుకుంది. గత అరవైయ్యేళ్లుగా అమల వుతున్న ఈ విధానం రాజ్యాంగంలోని 14వ అధికరణ కు విరుద్ధమని 6–3 మెజారిటీతో ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ధర్మాసనంలో అత్యధికులు రిపబ్లికన్ల ఏలుబడిలో వచ్చినవారే. మన దేశంలో శతాబ్దాలుగా వివక్ష ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలకు కోటా కల్పించిన విధంగానే అమెరికా విద్యాసంస్థల్లో కూడా నల్లజాతీయులు, ఇతర మైనారిటీ వర్గాలకు ప్రవేశాల్లో ప్రాధాన్య మిస్తున్నారు. ఆ వర్గాలపై శతాబ్దాలుగా అమలవుతున్న వివక్షపై డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్VŠ జూనియర్ నేతృత్వంలో సాగిన చరిత్రాత్మక పోరాటాల ఫలితంగా అక్కడి సమాజం తనను తాను సరిదిద్దుకునే క్రమంలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ క్రమం అసంపూర్ణంగానే ఉన్న దని తరచు నిరూపణ అవుతూనే ఉంది. వర్ణ వివ క్ష, దాన్ని వెన్నంటి ఉండే వ్యవస్థీకృత హింస ఇంకా సమసిపోలేదు. ఎలాంటి నేర నేపథ్యమూ లేని జార్జి ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుణ్ణి 2020లో మినియాపొలిస్ నగరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత క్రూరంగా, ఎంత నిర్దాక్షిణ్యంగా హత మార్చాడో, దాని పర్యవసానంగా ఎంత హింస చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. ఆ ఘటనకు ముందూ వెనుకా అనేకానేకమంది నల్లజాతీయులు పోలీసు హింసకు బలయ్యారు. వందల ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గిన పర్యవసానంగా వారు చదువులకు దూరమయ్యారు. కనుక మెరుగైన ఉపాధికి వారు దూరం. అసలు 1964 వరకూ పౌరహక్కులే లేవు. ఆ మరుసటి ఏడాది వారికి తొలిసారిగా ఎన్నికల్లో ఓటేసే హక్కు లభించింది. ఇదంతా నల్లజాతీయుల మొక్కవోని పోరాటాల, త్యాగాల ఫలితం. ఆ హక్కులకు కొనసాగింపుగానే 1965 జూన్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ‘నిశ్చయాత్మక చర్య’కు సంసిద్ధం కావాలని, నల్లజాతీయులకూ, ఇతర మైనారిటీ లకూ ప్రవేశాల్లో ప్రాధాన్యతనీయాలని విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. ఆరు దశాబ్దాలుగా అమల వుతున్న ఈ విధానంతో ఎంతోమంది అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. తమ మేధస్సుతో అమెరికన్ సమాజం సుసంపన్నం కావటానికి దోహదపడుతున్నారు. అయినా ఈనాటికీ విద్యా సంస్థల్లో నల్లజాతీయులు 7 శాతం మించరు. శ్వేత జాతి అమెరికన్లు 46 శాతం వరకూ ఉంటారు. ఏదో మేరకు జరుగుతున్న కాస్త మంచినీ తాజా తీర్పు ఆవిరిచేసింది. విద్యారంగంలో ‘నిశ్చయాత్మక చర్య’కు ముందు అత్యున్నత శ్రేణి విద్యా కేంద్రాలుగా పేరున్న హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్ యూనివర్సిటీల్లో 1960ల నాటికి కేవలం 15 (0.5 శాతం) మంది నల్లజాతి విద్యార్థులుండేవారు. వైద్య విద్యలో పేరెన్నికగన్న యూసీఎల్ఏలోనూ, మరికొన్నిచోట్లా 1955–1968 మధ్య 764 మంది వైద్య పట్టాలు పొందితే నల్లజాతీయులు ఒక్కరు కూడా లేరు. దీన్ని గమనించాకే లిండన్ జాన్సన్ విద్యాసంస్థలకు అర్థమయ్యేలా చెప్పారు. అనేకానేక ఏళ్లపాటు సంకెళ్లలో బందీ అయిన వ్యక్తికి విముక్తి కల్పిస్తూ ‘ఇకపై నీకు స్వేచ్ఛనిస్తున్నాం. ఇప్పుడు ఎవరితో నైనా నువ్వు పోటీపడొచ్చు. ఆ పోటీ పూర్తి న్యాయబద్ధంగా ఉంటుంది’ అనడం ఎంత అన్యాయమో గ్రహించమని కోరారు. ఆ తర్వాతే విద్యాసంస్థలు తమ అడ్మిషన్ విధానాల్లో మార్పులు చేశాయి. తమ తీర్పు దీన్నంతటినీ దెబ్బతీస్తుందన్న వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఏకీభ వించటం లేదు. వివక్ష అంతానికి ప్రవేశపెట్టిన ఈ విధానమే వివక్షతో కూడుకున్నదని ఆయన అభిప్రాయం. ఇకపై వ్యక్తులుగా ఎవరు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నారో తెలుసుకుని దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన సూచన. ఆచరణలో ఇదంతా ఏమవుతుందో తెలియనిది కాదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో జాతిపరమైన వైవిధ్యత మాయమవుతుంది. శ్వేత జాతి అమెరికన్ల ఆధిపత్యం పెరుగుతుంది. ప్రస్తుతం తీర్పు వెలువడిన కేసు అక్కడ మొదటిదేమీ కాదు. ‘నిశ్చయాత్మక చర్య’ మొదలై పదేళ్లు గడవకుండానే దానిపై వివిధ న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. వాటిల్లో స్వల్ప మెజారిటీతో గండం గట్టెక్కిన కేసులే అధికం. 2003లో ఈ విధానానికి అనుకూలంగా తీర్పు వెలువడినా, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి ‘మరో పాతికేళ్లకు జాతిని కాక ప్రతిభను పరిగ ణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంద’ని అభిప్రాయపడ్డారు. కానీ అంతకు చాలాముందే సుప్రీంకోర్టు ఆ విధానానికి స్వస్తి పలికినట్టయింది. అసలు ఈ విధానాన్ని కాలిఫోర్నియా, ఫ్లారిడాలతో సహా తొమ్మిది రాష్ట్రాలు అమలు చేయటంలేదు. అమెరికన్ సమాజంలో ఈ విధానాన్ని వ్యతిరేకించే వర్గం క్రమేపీ పెరగటం కనిపిస్తుంది. రిపబ్లికన్ పార్టీ ఈ విధానికి మొదటినుంచీ బద్ధ వ్యతిరేకం. అనుకూలంగా ఉండే డెమొక్రటిక్ పార్టీ కూడా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రస్తుత తీర్పు మెజారిటీ జనాభా దృక్పథాన్నే ప్రతిబింబిస్తోంది. ఇది విద్యాసంస్థలకు సంబంధించిందే అయినా మున్ముందు మిలిటరీ, నావీ అకాడమీ ప్రవేశాల్లోనూ, కార్పొరేట్ రంగ ఎంపికల్లోనూ అమలు చేసే పరిస్థితులు ఏర్పడొచ్చు. ఈ విధానంవల్ల లాభపడు తున్న ఆసియన్ అమెరికన్లను, శ్వేతజాతి మహిళలను కూడగట్టడంలో నల్లజాతీయులు విఫలం కావటంవల్లే ఈ తీర్పు వెలువడిందని కొందరి విశ్లేషణ. ఆ మాటెలావున్నా మొత్తంగా అమెరికన్ సమాజంలో జాతిపరమైన సంకుచితత్వం పెరుగుతోందనటానికి ఈ తీర్పు నిదర్శనం. -
ఉన్నతశ్రేణి విద్య మిథ్యేనా?!
ఒకప్పుడు ప్రపంచానికి నలందా, తక్షశిలవంటి అత్యుత్తమ శ్రేణి విద్యాకేంద్రాలను అందించి, విశ్వమంతటా విజ్ఞాన కాంతులు వెదజల్లిన భారత్ చాన్నాళ్లుగా విద్యారంగంలో వెలవెలబోతోందన్న అసంతృప్తి ఉంది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తాజా జాబితాలో మొదటి 150లో మన దేశానికి చోటుదక్కింది. అంతర్జాతీయంగా చూస్తే ఇదేమంత గొప్ప ర్యాంకు కాకపోవచ్చు. వినడానికి కాస్త ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచ శ్రేణి విద్యాసంస్థలనదగ్గ 1,500 విశ్వవిద్యాలయాల జాబితాను ఆ సంస్థ ప్రకటిస్తే మొదటి పదిలో, కనీసం మొదటి యాభైలో, పోనీ... మొదటి వందలో మన విద్యాసంస్థలేవీ లేవు. బొంబాయి ఐఐటీ ఈ జాబితాలో 149వ స్థానాన్ని పొందగలిగింది. ఆ సంస్థకు ఈ స్థాయి గౌరవం దక్కటం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే ప్రథమం. బెంగళూరు ఐఐఎస్సీ తొలి 200 ర్యాంకుల్లో స్థానం దక్కించుకోలేకపోగా, మద్రాస్ ఐఐటీ నిరుడున్న 174వ స్థానాన్ని చేజార్చుకుని 197కి పోయింది. దాన్ని బట్టి మన ఉన్నత విద్యాకేంద్రాల తీరుతెన్నులెలా ఉన్నాయో సులభంగానే గ్రహించవచ్చు. ఏటా రివాజుగా క్యూఎస్ ర్యాంకులు ప్రక టించటం, అందులో మన యూనివర్సిటీలు ఎక్కడో అట్టడుగున ఉండటం అనేకులను బాధిస్తోంది. ప్రపంచం మొత్తంలో 30,000 వరకూ విశ్వవిద్యాలయాలున్నాయి. క్యూఎస్ సంస్థ ఏటా అందులో అత్యుత్తమంగా భావించిన 5 శాతాన్ని... అంటే 1,500 యూనివర్సిటీలను ఎంపిక చేసుకుని వాటి వాటి అర్హతల ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది. జీవితంలో ఎదగాలన్న తపన, తాప త్రయం ఉన్నవారు...తమ జ్ఞాన తృష్ణ తీర్చుకోవటానికి అనువైన విద్యాకేంద్రం కోసం అన్వేషిస్తున్న వారు మెరుగైన విశ్వవిద్యాలయం కోసం వెదుకులాడతారు. ప్రపంచం ఇంతగా ఎదిగినా, బహుళ రంగాల్లో అభివృద్ధి సాధించినా అత్యుత్తమ శ్రేణి సంస్థను ఎంపిక చేసుకోవటం ఏ విద్యార్థికైనా అంత సులభం కాదు. ఎందుకంటే ప్రతి విశ్వవిద్యాలయమూ తమ దగ్గరున్న అధ్యాపక బృందం గురించి, తమ బోధనాంశాల తీరుతెన్నుల గురించి, పరిశోధనలకు అందే ప్రాధాన్యత గురించి స్వోత్కర్షలకు పోతుంది. కానీ తటస్థ సంస్థలు నిర్దిష్టమైన గీటురాళ్లు రూపొందించుకుని వాటి మంచిచెడ్డలను చెప్పగలిగితే విద్యార్జన కోసం తాపత్రయపడే యువతకు ఎంపిక సులభమవుతుంది. అంతేకాదు...ఈ తులనాత్మక విశ్లేషణ పరిశోధన కోసం తపించే విద్యార్థులకూ, విధాన నిర్ణేతలకూ కూడా సాయపడుతుంది. విధానపరమైన నిర్ణయాల కోసం చేసే అధ్యయనంలో ఏ విశ్వవిద్యా లయం తోడ్పాటు తీసుకోవచ్చునో, నిధుల విడుదలలో ఏ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలో విధాన నిర్ణేతలు నిర్ణయించుకుంటారు. ప్రైవేటు రంగ పరిశ్రమలకు కూడా ఈ ర్యాంకింగ్లే ఆధారం. క్యూఎస్ సంస్థ ఆ పని చేస్తోంది. ఈనెల మొదటివారంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే ఎన్ఐఆర్ఎఫ్ అత్యుత్తమ శ్రేణి విద్యాసంస్థల జాబితాను విడుదల చేసింది. అందులో విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రథమ స్థానం పొందగా, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానంలో, అక్కడి జమియా మిలియా ఇస్లామియా మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పదో ర్యాంకులో ఉంది. అలాగే ఐఐటీల్లో మద్రాస్ ఐఐటీ ప్రథమ స్థానంలో, బొంబాయి ఐఐటీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్‌ల విషయంలో విమర్శలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాల యాల్లో సాగే పరిశోధనలు, ఆ సంస్థల పేరుప్రఖ్యాతులు, అక్కడుండే విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, అంతర్జాతీయ వైవిధ్యత తదితరాలను క్యూఎస్ వంటి సంస్థలు గీటురాళ్లుగా తీసుకుంటున్నాయి. సహజంగానే ఈ అంశాలన్నిటా సంపన్న దేశాల్లోని విశ్వవిద్యాలయాలే ముందంజలో ఉంటాయి. వాటికి అటు ప్రభుత్వాలనుంచీ, ఇటు ప్రైవేటు సంస్థలనుంచీ నిధులు దండిగా వస్తాయి. వెనకబడిన దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులున్నా, అక్కడ మెరికల్లాంటి విద్యార్థులు రూపొందుతున్నా క్యూఎస్ సంస్థకు పట్టవు. అందువల్లే ఇలాంటి జాబితాల విశ్వసనీయతపైనా, వాటి కచ్చితత్వంపైనా విద్యారంగ నిపుణులు పెదవి విరుస్తుంటారు. ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాబోలు... విద్యాసంస్థల నిర్వహణ, పరిశోధనలకుండే అంతర్జాతీయ నెట్వర్క్, అక్కడి విద్యార్థులకు లభించే ఉద్యోగావకాశాలు అనే అంశాలను ఈసారి చేర్చింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మన దేశంలో ఉన్నత విద్యారంగాన్ని గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. పూర్తికాలం పనిచేసే అత్యుత్తమ అధ్యాపకులను ఎంపిక చేయటానికి, అవసరమైన నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దటానికి పాలకులు ముందుకు రావటం లేదు. ఖాళీ అవు తున్న స్థానాల్లో కాంట్రాక్టు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకుంటున్నారు. మన విశ్వవిద్యా లయాలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడానికి మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆధ్వర్యంలో 13 మందితో నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఆ కమిటీ ఎంపిక చేసింది. వాటికి తలో వందకోట్లు నిధులిస్తున్నామని కూడా ప్రకటించారు. అయితే క్యూఎస్ ఎంపిక చేసిన జాబితాలో ఒక్క బొంబాయి ఐఐటీ మాత్రమే ఆ మాత్రమైనా స్థానం సంపాదించుకోగలిగింది. ర్యాంకింగ్‌ల సంగతలావుంచి మన ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తే భావి తరాలు ఉన్నత స్థాయికి ఎదుగుతాయి. మన దేశానికి మళ్లీ గత వైభవం సాధ్యమవుతుంది. -
ప్రశ్నల పీక నొక్కకండి!
ప్రశ్నిస్తే... వేధిస్తారా? అవును. సోషల్ మీడియా తెర చాటున నిలబడి దొంగ పేర్లతో బాణాలు వేసే విచ్చలవిడి వీరత్వం పెరుగుతున్న కొద్దీ అదే ఖాయమవుతోంది. గత వారం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానిని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు సాక్షిగా ఇబ్బందికరమైన ప్రశ్న వేయడమే పాకిస్తానీ అమెరికన్ జర్నలిస్ట్ సబ్రినా సిద్దిఖీ చేసిన పాపమైంది. భారత్‌లో మైనారిటీల హక్కుల సంగతి అడిగిన ఆమెపై ట్రోలింగ్ తీరు అచ్చం అలాగే ఉంది. చివరకు వైట్‌హౌస్ ప్రతినిధి ఈ ట్రోలింగ్లు ‘అంగీకారయోగ్యం కాదు’ అని ఖండించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని హితవు చెప్పాల్సొచ్చిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అమెరికా దాకా అంతటా జర్నలిస్టులకు ఎదురవుతున్న ట్రోలింగ్భూతంపై పోరు అత్యవసరమని ఇది గుర్తుచేస్తోంది. మోదీని ప్రశ్నించిన సబ్రినా సిద్దిఖీ అనుభవమున్న జర్నలిస్ట్. తల్లితండ్రులు పాకిస్తానీలైనా, ఆమె పుట్టింది అమెరికాలోనే. దీర్ఘకాలంగా అమెరికా అధ్యక్షులు, వైట్‌హౌస్ వ్యవహారాలను నివేదిస్తూ, విలేఖరిగా తనదైన ముద్ర వేశారు. ‘హఫింగ్టన్ పోస్ట్’, ‘బ్లూమ్‌బెర్గ్’, ‘గార్డియన్’ లాంటి ప్రసిద్ధ సంస్థల్లో తన పాళీకి పదునుపెట్టుకున్నారామె. సాధారణంగా ఎన్నడూ అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు జవాబివ్వాల్సిన విలేఖరుల సమావేశంలో పాల్గొనని మోదీ వైట్‌హౌస్ ఒత్తిడి మేరకు బైడెన్‌తో కలసి విలేఖరుల ముందుకు రావాల్సి వచ్చింది. ఇద్దరూ చెరి రెండు ప్రశ్నలకు సమా ధానాలు చెప్పిన ఆ భేటీలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రతినిధిగా సబ్రినా మోదీని వేసింది ఒక ప్రశ్నే. ‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మతపరమైన మైనారిటీలపై ప్రభుత్వ దుర్వి చక్షణ సాగుతోందనీ, విమర్శకుల నోరు మూయిస్తున్నారనీ మానవ హక్కుల సంస్థలంటున్నాయి. మైనారిటీల హక్కులకై మీ సర్కారేం చేయనుంది’ అన్నది స్థూలంగా ప్రశ్న. ఇరుకున పెట్టే ప్రశ్న వేసినా, భారత్‌లో అలాంటిదేమీ లేదంటూ ప్రధాని బలంగానే తన వాణి వినిపించారు. అయినా సరే, ఆయనను అలాంటి ప్రశ్న వేయడం వీరభక్తులకు నచ్చలేదు. ఫలితమే – అంతర్జాలంలో సబినాపై అమానుష దాడి. ఆమె పాకిస్తానీ అనీ, ముస్లిమ్ అనీ, డిజిటల్ యుగపు నిరసనల ‘టూల్‌కిట్ గ్యాంగ్’లో భాగమనీ దుర్భాషలాడారు. ఇలాంటి ట్రోలింగ్ ప్రైవేట్ మూకల్నీ, సాంకేతిక జ్ఞానంతో కావాల్సిన సందేశాలు పంపే ఇంటర్నెట్ బాట్ల విధానాన్నీ ఇవాళ పాలక వ్యవస్థలన్నీ పెంచిపోషిస్తున్న మాట నిష్ఠురసత్యం. మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధిస్తున్నది పాలకపక్ష ప్రైవేట్ సైన్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. ధైర్యంగా ప్రశ్నించడంలో జర్నలిస్టుగా ఆమె తన బాధ్యత నిర్వహిస్తే, సోషల్ మీడియా వేదికగా విషం చిమ్మడం విస్తుపరుస్తోంది. వెనకెవరూ లేనిదే ఇంతగా వేధింపులకు దిగరనేది తర్కబద్ధమే. ‘ఈ పని మీ ప్రైవేట్ ట్రోల్ సేనలది కాదా? వారిపై చర్యలు తీసుకుంటారా?’ అని బీజేపీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. మీడియా ప్రజాస్వామికీకరణకు సోషల్‌మీడియా ఉపకరించింది ఎంత నిజమో, వేదికలు పెరిగి, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అడ్డుకట్ట లేని అంతర్జాలంలో అడ్డమైన అభిప్రాయాలనూ వదిలి, భావకాలుష్యం పెంచుతున్నదీ అంతే నిజం. దాని విపరిణామమే ఇప్పుడు ప్రపంచమంతటా చూస్తు న్నది. మెజారిటీ ఆలోచనకు భిన్నాభిప్రాయం ఉన్నవారెవరినీ సోకాల్డ్ ప్రజాస్వామ్య వేదికలు ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లలో ఎక్కడా మననివ్వక పోవడం నిత్యం చూస్తున్నదే. సాధారణ సమూహాల నుంచి పాలక పక్షాల దాకా అందరికీ ఈ ట్రోలింగ్ ఓ ఆనవాయితీ. ప్రత్యర్థి పీకనొక్కే పదునైన ఆయుధం. ఈ వర్తమాన వైపరీత్యానికి బాధితులే – అమెరికాలో సబ్రినా అయినా, హైదరాబాద్‌లో చందు తులసి అయినా! ఇందులో భావప్రకటన స్వేచ్ఛ ఒక్కటే కాదు... బెదిరింపులు, దూషణలతో భయభ్రాంతుల్ని చేసి, మానసికంగా హింసించే మానవ హక్కుల ఉల్లంఘన కోణమూ ఉంది. సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రి సబ్రినా తరహాలో తమ పాలనపై ప్రశ్నలు వేస్తున్న వారందరినీ ఇప్పటికే ‘పాత్రికేయ వేశ్యలు’ (ప్రెస్టిట్యూట్స్) అనడం చూశాం. అది ఏ స్థాయి అసహనమో అర్థం చేసుకున్నాం. పాలకులు సైతం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో పాత్రికే యుల పని ప్రశ్నించడమే! ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తేనే అది నేరమన్నంత అసహనం ఏ పాలన కైనా మంచిది కాదు. వేసిన ప్రశ్నలో, చేసిన విమర్శలో నిజం లేదనుకుంటే, ఆ సంగతి ససా క్ష్యంగా చెప్పవచ్చు. నలుగురికీ తెలిసేలా నిరూపణలు చూపవచ్చు. అంతేకానీ, అభిప్రాయం కలిగివుండ డమే నేరమన్నట్టు ప్రవర్తిస్తే అన్యాయం. కానీ, వాట్సప్ యూనివర్సిటీలు పంచుతున్న, పెంచుతున్న అజ్ఞానాంధకారం సాక్షిగా దేశంలో ఈతరహా వేధింపులు అన్ని స్థాయుల్లో పెరిగిపోవడమే విషాదం. భగవద్గీత సైతం తెలుసుకొనేందుకు ‘పరిప్రశ్న’ వేయమనే చెబుతోంది. కానీ, ప్రశ్నించడమే నేర మనే ధోరణిలోకి మన దిగజారడం కలవరపెడుతోంది. ఈ ట్రోలింగ్ ముఠా తెలిసో తెలియకో... ‘విమర్శకుల నోరు మూయిస్తున్నారట’ అన్న సబ్రినా వాదననే నిజంచేసింది. అలాగే, లింగ వివక్షతో రాజకీయాల్లో మహిళలపై ట్రోలింగ్ మరీ ఎక్కువనీ, న్యూజిలాండ్ ప్రధాని నుంచి మన దేశపు నేతల దాకా అందరూ బాధితులేననీ రెండేళ్ళ పరిశోధనతో ఈ ఫిబ్రవరిలో విడుదలైన అధ్యయనం తేల్చ డం గమనార్హం. అధికార భావజాలాన్ని వ్యతిరేకిస్తే మీపై, పిల్లలపై అత్యాచారం చేస్తామనే ఈ బరి తెగింపు వేధింపుల్ని అరికట్టే కఠినమైన సైబర్ చట్టాలు కావాలి. ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే, గొంతు విప్పడానికే భయపడాల్సిన పరిస్థితిని ఎక్కడ, ఎవరు, ఎందుకు సృష్టించినా అది సమర్థనీయం కాదు. సహించాల్సింది కానే కాదు. అది ప్రజాస్వామ్యం అసలే కాదు! -
కలసి సాగుదాం... ప్రగతి బాట!
సారూప్యం, సాన్నిహిత్యం రెండూ ఉన్న దేశాల మధ్య స్నేహగీతాలాపన సహజమే. చిరకాలం తర్వాత ఇరు ప్రభుత్వాల పెద్దలు మరోసారి పల్లవి అందుకున్నారంటే సంబంధాల పునరుద్ధరణతో పాటు బంధం మళ్ళీ బలపడుతోందని అర్థం. గత వారాంతంలో ఈజిప్టులో భారత ప్రధాని మోదీ జరిపిన పర్యటన అందుకు సాక్ష్యం. ఉభయ దేశాలూ తమ ద్వైపాక్షిక బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవడం విశేషమే. ఆ మేరకు ‘చరిత్రాత్మక’ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈజిప్టులో ప్రాథమిక వసతుల కల్పనలో, ముఖ్యంగా సూయజ్ కాలువ అథారిటీలో భారత పెట్టుబడులు సహా ఆర్థిక సహకారం పెంపుపై ఇరుపక్షాలూ చర్చించాయి. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఒప్పందాలపై చేవ్రాలు చేశాయి. వెరసి, ఆఫ్రికా, పశ్చిమాసియాలలో భాగమైన జన సంఖ్యాక అరబ్బు దేశం ఈ ప్రాంతంలో భారత్‌కు కీలక భాగస్వామి కానుంది. ప్రతిగా దాని అవసరాలు తీర్చేందుకు భారత్ ముందుకు రావడంతో ఈ పర్యటన ఫలాలు ఉభయ తారకమే! భారత ప్రధాని తాజా ఈజిప్ట్ పర్యటన అదాటునో, ఆలోచనా రహితంగానో జరిగింది కాదు. దాదాపు ఏడాది పైచిలుకుగా ఎన్నో లెక్కలతో చేపట్టిన వరుస చర్యల్లో ఇది ఒక భాగమనాలి. ద్వైపాక్షిక బంధాలున్నా అవి ఆశించినంతగా సత్తా చాటని వేళ గడచిన ఏడాది కాలంలో మన రక్షణ, విదేశాంగ మంత్రులు కైరో చుట్టివచ్చారు. ఈ ఏటి గణతంత్ర దినోత్సవ కవాతుకు ఈజిప్ట్ అధ్యక్షుడు భారత ప్రభుత్వ ముఖ్యఅతిథిగా ఢిల్లీకి విచ్చేశారు. దానికి కొనసాగింపు ఇప్పుడు మన ప్రధాని పర్యటన. గమనిస్తే– ఈజిప్టులో భారత ప్రధాని ఆఖరుసారిగా పర్యటించింది 1997లో. ఆ తర్వాత ఈ పాతికేళ్ళలో ప్రపంచం చాలా మారింది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు కీలకంగా మారిన రోజులకు వచ్చాం. ఈ సమయంలో ఢిల్లీ, కైరోల భాగస్వామ్యం ఉభయులకూ లాభదాయకం. ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్, భారీస్థాయిలో అప్పుల్లో ఉన్న ఈజిప్టుకు ఎంతో అవసరమైన భాగస్వామి. మరోపక్క వాణిజ్యానికీ, భౌగోళికంగానూ కీలకమైన సూయజ్ కాలువను శాసించే ఈజిప్టుతో బంధం భారత్‌కూ లాభదాయకం. క్రీస్తుపూర్వం నుంచే అతి ప్రాచీన నాగరకతల మధ్య ముడిపడిన బంధమిది. అప్పట్లోనే భారత ద్వీపకల్పానికి ఈజిప్టు ఓడలు వస్తే, ఈజిప్టు మమ్మీలను చుట్టడానికి వాడిన వస్త్రం, ఆ వస్త్రానికి అద్దిన నీలిమందు భారతదేశానివి అన్నది చరిత్ర. గడచిన శతాబ్దకాలంలోనూ మన మైత్రి బలమైనది. వలస పాలన అనంతరం స్వాతంత్య్రం వచ్చిన మూడు రోజులకే ఈజిప్టుతో దౌత్య సంబంధాలు పెట్టుకున్న చరిత మనది. ఇక్కడ ప్రధాని నెహ్రూ, అక్కడ అధ్యక్షుడు నాజర్లతో మన స్నేహలత మరింత అల్లుకుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అటు అమెరికా, ఇటు రష్యా కూటములు దేనిలోనూ చేరకుండా మనగలగవచ్చంటూ 1961లో అలీనోద్యమాన్ని నిర్మించి, మూడోప్రపంచ దేశాల్లో ఉత్సాహం ప్రోది చేసిన భారత, ఈజిప్టుల సామీప్యమూ గమనార్హం. ఈ చిరకాల స్నేహం ఇప్పుడు ద్వైపాక్షిక బంధం నుంచి బలమైన భాగస్వామ్యంగా కాంతులీనడం సంతోషదాయకం. ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడి మధ్య ఆంతరంగిక ముఖాముఖి సంభాషణ, మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ బహూకరణ, అంతర్జాతీయంగానూ మీద పడుతున్న మైనారిటీల ప్రతికూల ముద్రను చెరుపుకొనేలా 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్ హకీం మసీదుకు మోదీ వెళ్ళడం, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన గాజా పిరమిడ్ల సందర్శన, ఈజిప్టు – పాలస్తీనాల్లో ఉంటూ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడి కన్నుమూసిన భారతీయ సైనికుల స్మారకం వద్ద నివాళులు అర్పించడం... అలా ఈ పర్యటనలో ఆకర్షణీయ అంశాలు అనేకం. కొన్ని కైరోతో స్నేహం పంచేవి. గుజరాతీ దావూదీ బోహ్రాలు పునరుద్ధరించిన మసీదు సందర్శన లాంటి మరికొన్ని సొంతగడ్డపై మోదీకి ఓట్లు పెంచేవి. మొత్తానికి అధినేతలిరువురూ ప్రతిదీ ఉపయోగించుకున్నారు. నిజానికి, ఈ ఏటి జీ–20 సదస్సుకు మనం 9 దేశాలను అతిథులుగా ఆహ్వానించగా, అందులో ఈజిప్ట్ ఒకటి. కానీ, మేలో శ్రీనగర్‌లో జరిగిన పర్యాటక అధికారుల సమావేశానికి కైరో దూరంగా ఉంది. ఫలితంగా పొరపొచ్చాలుంటే, అవన్నీ తాజా బంధాల పునరుద్ధరణతో సమసిపోతాయి. రక్షణ, ఆర్థిక సహకారం, విద్యా – వైజ్ఞానిక ఆదాన ప్రదానాలు, సాంస్కృతిక సంబంధాలనే నాలుగు స్తంభాలపై నిర్మించాల్సిన భాగస్వామ్యమిది. ఈజిప్టులోని భారతీయుల సంఖ్య 5 వేల లోపే కావచ్చు. అయితేనేం, మన హిందీ సినిమాలంటే కళ్ళింత చేసుకొని చూసే ఈజిప్ట్ వాసులు, వారి ఈజిప్షియన్ సంగీతాన్ని స్వరాల్లో జొప్పించే భారతీయ సంగీత దర్శకుల బంధం అవిస్మరణీయం. ఈజిప్టుకు ఆరో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ తలకిందులై, వసతుల పెంపులో కైరో నిదానించింది. ఇప్పుడిది మనకు సదవకాశం. సూయజ్ కాలువ ఆర్థిక మండలిని ఆసరాగా చేసుకుంటే ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా విపణు లకు చేరాలన్న భారత ప్రయత్నాలూ నెరవేరతాయి. చమురు, సహజవాయువు, రసాయన ఎరువుల్ని కైరో నుంచి దిగుమతి చేసుకుంటున్న మనం, గత జూన్‌లో తీవ్రకొరతలో పడ్డ ఆ దేశానికి గోధుమలు పంపినట్టే ఇకపైనా అవసరంలో అండగా నిలవాలి. భౌగోళిక రాజకీయాల్లో ‘దక్షిణ ప్రపంచ’ దేశాలవాణిగా మారాలన్న మన ఆకాంక్ష నెరవేరాలంటే, ప్రస్తుతం చైనా ఆర్థిక ప్రభావంలో ఉన్న ఈజిప్టును కలుపుకొని నడవడమే తెలివైన పని. తాజా పర్యటన అందుకు ఉత్ప్రేరకం. -
స్వయంకృతాపరాధం
పాలు పోసి పెంచిన పాము కాటేయడానికి పడగ విప్పి మీదకొస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుంది. శత్రు దేశాలపై దాడి కోసం తాను పెంచిపోషిస్తూ వచ్చిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ ప్రైవేట్ మిలటరీ కంపెనీ’, దాని అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఒక్కసారిగా తన మీదకే విరుచుకుపడేసరికి పుతిన్ దిగ్భ్రమకు లోనైనట్టున్నారు. గత వారాంతంలో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం అంచులకు వెళ్ళిన పరిణామాలు అలాంటివి. దేశానికి దక్షిణాన అతి కీలక నగరాల్లో ఒకటైన రోస్తోవ్ – ఆన్– డాన్ చేజిక్కించుకొని, మాస్కో దిశగా వాగ్నర్ కిరాయి సైనికులు దూసుకు వస్తున్నప్పుడు పరిస్థితి భయానకంగా కనిపించింది. పైకి ఎన్ని బీరాలు పలికినా, చివరకు బెలారస్ దేశాధినేత కుదిర్చిన సంధితో పుతిన్ ఊపిరిపీల్చుకో గలిగారు. ఇప్పటికి వాగ్నర్ సేనలు వెనక్కి తగ్గి, ఉక్రెయిన్‌తో పోరుకు మళ్ళీ సరిహద్దుల దారి పట్టినా, పుతిన్‌కు తగిలిన షాక్, ఆయన ఇమేజ్‌కు పడిన దెబ్బ సామాన్యమైనవి కావు. ఎవరికీ వంగని, దేనికీ లొంగని ధీరుడిగా పేరున్న పుతిన్ ప్రతిష్ఠను ఈ తిరుగుబాటు చావుదెబ్బ తీసింది. ఉక్రెయిన్‌తో పోరులో బింకంగా ముందడుగు వేస్తున్న ఆయన ఈ దెబ్బ నుంచి కోలుకో వడం సులభమేమీ కాదు. 1999 నుంచి ఇప్పటి దాకా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారంలో ఉంటూ వచ్చారు పుతిన్. రష్యాపై తిరుగులేని పట్టు బిగించిన ఈ ఏలిక తన సుదీర్ఘ హయాంలో తొలిసారిగా పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. ‘పుతిన్‌కు వంటగాడ’నే పేరు దక్కిన ఒక దొంగ, హంతకుడు ఆ స్థాయి నుంచి ప్రైవేట్ సైనిక సంస్థకు అధిపతిగా ఎదగడం వెనక ఉన్నది పుతినే అన్నది జగమెరిగిన సత్యం. ఆఫ్రికా నుంచి అరబ్ ప్రపంచం వరకు, తాజా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఈ కిరాయి మూకల్ని వాడుకుంటూ వచ్చిందీ పుతినే! అందుకే, పూర్తి బాధ్యత కూడా ఆయనదే! ఉక్రెయిన్‌పై కార్యకలాపాల్లో రష్యా సైనికాధిపతుల పట్ల, ముఖ్యంగా రక్షణ మంత్రి పట్ల ప్రిగోజిన్ కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. రక్షణ శాఖలో అగ్రస్థానంలో మార్పుల్ని కోరుకుంటున్నారు. ఆఖరికి ఆయన కిరాయి మూకలు తేలిగ్గా ఒక్కో నగరం దాటుకుంటూ మాస్కో సమీపా నికి రావడం అంతర్యుద్ధ మేఘాలను అలముకొనేలా చేసింది. బెలారస్ నేత లుక షెంకో తెరవెనుక రాజీతో ఇప్పటికి గండం గడిచింది. పుతిన్ మీద ప్రేమ కన్నా, డబ్బు కోసమనే ప్రాణాలకు తెగించే వాగ్నర్ మూకలు వెనుదిరగడం ఊరికే జరగలేదు. దేశద్రోహులంటూ వీరంగం వేసిన పుతిన్ చివరకు ఎవరిపై ఏ కేసులూ పెట్టనని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రిగోజిన్‌పై చర్యలుండవని హామీ ఇవ్వాల్సొచ్చింది. రెండు లక్షల కోట్ల డాలర్ల కన్నా తక్కువకు పడిపోయిన జీడీపీతో, ఉక్రెయిన్‌తో పోరులో నష్టాలతో సతమతమవుతున్న రష్యా కొత్తగా మరో పోరు చేసే పరిస్థితిలో లేదు. వెరసి, తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్‌పై 16 నెలల క్రితం యుద్ధం మొదలుపెట్టి, వెనక్కి రాలేని పద్మవ్యూహంలో చిక్కుకున్న పుతిన్‌కు ప్రపంచం ముందు ఇవి తీరని తలవంపులే. ఇవన్నీ ఆయన స్వయంకృతాపరాధాలే. బలమైన వాగ్నర్ మూకల్ని రక్షణ శాఖ కిందకు తేవాలన్న రష్యా సైనిక నేతల నిర్ణయం బెడిసికొట్టింది. వ్యూహంలో, దాడుల్లో తమ కన్నా వెనుకబడిన ప్రభుత్వ సైనిక నేతల కింద పనిచేయడం ప్రిగోజిన్‌కు మింగుడుపడని విషయం. అందువల్లే ఈ తిరుగుబాటు తలెత్తిందట. పుతిన్‌కు తాను వ్యతిరేకం కాదనే నేటికీ ప్రిగోజిన్ మాట. ఏమైనా, ఇప్పుడు రష్యాకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇకపై ఉక్రెయిన్‌పై పోరులో రష్యన్ సైనిక నేతలు మునుపటిలా ఈ కిరాయి మూకల్ని నమ్మలేరు. రక్షణ శాఖతో కాంట్రాక్ట్ ఉన్నవారే ఇకపై పోరులో పాల్గొంటారట. కానీ, అపనమ్మకమున్న యుద్ధంలో అడుగు ముందుకు పడదు. అసలే ఉక్రెయిన్‌లో ఆశించిన పురోగతి లేక అస్తుబిస్తవుతున్న పుతిన్‌కు ఇది దెబ్బ మీద దెబ్బ. తాజా తిరుగుబాటులో చేరని వాగ్నర్ ఫైటర్లను ప్రభుత్వ సైన్యంలోకి తీసుకోవాలని రష్యా యోచిస్తున్నప్పటికీ, ఇలాంటి మూకలతో రష్యా ఎలా వేగగలదో చెప్పలేం. ప్రిగోజిన్ తిరుగుబాటు ఇప్పటికి టీ కప్పులో తుపానైపోయినా, క్షీణిస్తున్న పుతిన్ పట్టుకు అది ప్రతీక. అణ్వస్త్ర రష్యా సైనిక బలగంలోని బలహీనతలూ, చీలికలూ బట్టబయలయ్యాయి. సైనిక జనరల్స్‌ను ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తూ వస్తున్న పుతిన్‌కు యుద్ధంలో తగిన వ్యూహమూ ఉన్నట్టు లేదు. మరోపక్క, తాజా ఘటనలతో యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి ఊహించని సానుకూలత వరించింది. ఒకవేళ యుద్ధాన్ని ముగించదలుచుకుంటే ఇరుపక్షాలకూ ఓ చిన్న కిటికీ తెరుచుకుంది. కానీ, కిందపడ్డా నాదే పై చేయి అనే పుతిన్ కానీ, ‘నాటో’ బూచితో రష్యాను దారికి తెచ్చుకోవాలని చూస్తున్న పాశ్చాత్య ప్రపంచం కానీ అందుకు ముందుకొస్తాయా? ఏమైనా రష్యా పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. పుతిన్ తదుపరి అడుగులు, భవి తవ్యంపై లెక్కలు కడుతోంది. సైన్యం, పాలనా యంత్రాంగం, వ్యాపార వర్గం సహా వ్యవస్థలన్నిటినీ విడగొట్టి, ఎవరూ అధికారం ప్రోది చేసుకోకుండా బలహీనంగా ఉంచి, నియంత్రణ తన చేతిలో పెట్టుకొనే పుతిన్ ఈ విన్యాసం ఎన్నాళ్ళు చేయగలరో చూడాలి. అందుకే, స్టాలిన్ తర్వాత దీర్ఘకాలం రష్యాను ఏలుతున్న పుతిన్ ఓ అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అన్నట్టు ఒక రకంగా ‘బలహీన బలిష్ఠుడు’. వాగ్నర్ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణ. పామును పెంచుతున్నది పగవాణ్ణి కాటేయడానికని భావించినా విషపురుగుకు తన, పర తేడా ఉండదని మర్చిపోవడమే చిక్కు. ఆ సంగతి అమెరికా, పాకిస్తాన్ నుంచి ఇప్పుడు రష్యా దాకా అందరికీ అనుభవంలోకి వచ్చిన పాఠమే!