Editorial
-
‘స్వేచ్ఛ’యను రెండక్షరములు...
‘స్వేచ్ఛ’ అంటే కేవలం రెండక్షరాలు కాదు, దిగంతాలను కొలిచే పక్షికి రెండు రెక్కలు;భూమండలాన్ని చుట్టే మనిషికి రెండు పాదాలు; స్వేచ్ఛ అంటే ఒక నిర్నిబంధమైన మాట; ఒక స్వతంత్రమైన చేత. హద్దులేని ఆకాశమూ, అంతులేని భూమండలమూ స్వేచ్ఛాసంచారానికి ప్రకృతి చేసిన ఏర్పాట్లు. ప్రకృతి నిఘంటువులో మొదటి మాటా, చివరి మాటా స్వేచ్ఛే! ఎగిరే పక్షిని ఏ వేటగాడి బాణమో పడగొట్టినప్పుడూ, నడిచే మనిషి కాళ్ళకు ఏ నిరంకుశపు సంకెళ్ళో పడినప్పుడూ, ఏ నిషేధాల కత్తుల బోనులోనో మాట బందీ అయినప్పుడూ అది అక్షరాలా ప్రకృతి మీద జులుము, ప్రకృతి ఏర్పాటు మీద దాడి. స్వేచ్ఛ రెక్క విరిచిన రోజు వచ్చి వెడుతూ, దాని విలువను మరోసారి గుచ్చి చెప్పింది. చెరబడ్డప్పుడు తప్ప సాధారణ పరిస్థితుల్లో పూర్తిగా గుర్తించలేని విలువ స్వేచ్ఛ. అడవుల పాలైన ధర్మరాజుకు ఆ విలువ తెలుసు. మనిషికి ఆనందమిచ్చేది ఏదని యక్షుడు అడిగినప్పుడు ప్రవాసంలో కాకుండా స్వవాసంలో ఉండడమేనంటాడు. పరాయి పాలనలో వ్యధార్త జీవితాలు గడిపిన నిన్నమొన్నటి మన స్వాతంత్య్ర సమరయోధులకు, ఇతర బుద్ధిజీవులకే కాదు; సామాన్య జనానికి సైతం స్వేచ్ఛ విలువ తెలుసు. ‘స్వేచ్ఛ మన ఊపిరి’ అంటాడు మహాత్మాగాంధీ. ఊపిరి నిలుపుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించవలసిందే. ‘ఎక్కడ మనసు నిర్భయమవుతుందో, ఎక్కడ తలెత్తుకుని ఉండగలమో, ఎక్కడ జ్ఞానం శృంఖలాబద్ధం కాదో, ఎక్కడ సంకుచితపు గోడలతో ప్రపంచం ముక్కముక్కలు కాదో, ఎక్కడ మాట సత్యపు లోతుల్లోంచి జాలువారుతుందో, ఎక్కడ శ్రమించే చేతులు పరిపూర్ణత వైపు బారలు చాచగలవో, ఎక్కడ హేతుత్వమనే స్వచ్ఛ స్రవంతి దారి తప్పకుండా ఉంటుందో...’ అలాంటి స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం విశ్వకవి టాగోర్ పరితపిస్తాడు. మానసిక స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛగా బాబా సాహెబ్ అంబేడ్కర్ అభివర్ణిస్తాడు. సంకెళ్లలో లేకపోయినా స్వేచ్ఛాయుత చింతన లేనివాడు బానిసే తప్ప స్వతంత్రజీవి కాడనీ, జీవన్మృతుడనీ అంటాడు. ‘మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నా’డన్న రూసో నిర్వచనం ఎంతైనా నిజం. స్వేచ్ఛా, మనిషీ కలిసే పుట్టారు. ఆధిపత్యాలు, అంకుశాలు, అణచివేతలు తర్వాత వచ్చాయి. దేశాల హద్దులూ, వీసాల నిర్బంధాలూ లేని కాలంలో మనిషి స్వేచ్ఛగా భూమండలమంతా కలయదిరిగాడు. అందుకే ప్రపంచంలోని ప్రతి తావూ అతని చిరునామా అయింది. సంస్కృతీ, నాగరికతలను సంతరించుకున్న తర్వాతా; భాషాభేదాలూ, ప్రాంతాల తేడాలూ, జాతీయతా వాదాలూ పొటమరించిన తర్వాతా అతని స్వేచ్ఛాగమనానికి అడ్డుగోడలు లేచాయి. అదొక విచిత్ర వైరుద్ధ్యం. వేల సంవత్సరాల క్రితం జరిగిన జన్యుపరివర్తన కారణంగా గొంతుముడి వీడి మనిషి మాట్లాడగలిగిన దశకు చేరాడంటారు. అప్పుడు తన ఆనందోద్వేగాలను ఎంత స్వేచ్ఛగా గొంతెత్తి ప్రకటించుకుని ఉంటాడో! క్రమంగా తన మాటను రకరకాల నిషేధాలూ, నిర్బంధాల కత్తివేటూ భయపెట్టినప్పుడు స్వేచ్ఛనుడిగి మూగవోయిన దుఃఖచరిత్ర అతనిది. పురాణకాలం నుంచి నవీనకాలం వరకూ ఏ ఘట్టంలోనూ స్వేచ్ఛారాహిత్యంతో రాజీపడని ధిక్కారచరిత్రా అతనికుంది. తన సహజస్వేచ్ఛపై అత్యాచారం శ్రుతిమించిన ప్రతిసారీ అగ్గిరవ్వ అయ్యాడు. చండశాసనం ఉన్నచోట దాని అతిక్రమణా ఉండితీరుతుందనడానికి రామాయణమే సాక్ష్యం. హనుమంతుడు సీతను చూసొచ్చిన తర్వాత సంబరం పట్టలేకపోయిన వానర సమూహం కిష్కింధలోని మధువనంలోకి జొరబడి అక్కడి తేనెతో విందు చేసుకుని, మత్తిల్లి వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ క్షణంలో వారిలో పురివిప్పిన స్వేచ్ఛాసహజాతం చండశాసనుడైన తమ ఏలిక సుగ్రీవుడు దండిస్తాడన్న భయాన్ని కూడా జయించింది. పీడనకూ, పెత్తనానికీ గురవుతున్నాసరే తమ సహజసిద్ధమైన స్వేచ్ఛాదాహాన్ని తీర్చుకునేందుకు మనిషి అవకాశాలు వెతుక్కుంటూనే ఉంటాడు. ఆ మేరకు పెత్తందార్లకూ, పీడితులకూ మధ్య రాజీ ఏర్పాట్లు కూడా ఉండేవి. ఈ సందర్భంలో ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత రాంభట్ల కృష్ణమూర్తి తన ‘సొంతకథ’లో ‘వాలకం’ అనే ప్రదర్శన రూపాన్ని ప్రస్తావిస్తారు. గౌరమ్మ సంబరాలప్పుడు కొంతమంది గ్రామస్తులు ఊళ్ళోని మోతుబరుల వేషంకట్టి వారి నడకను, నడవడిని అనుకరిస్తూ పాటల రూపంలో వారిపై ఆక్షేపణను చాటుకోవడమే ‘వాలకం’. ఒక్కోసారి ఆగ్రహించి మోతుబరులు దేహశుద్ధి చేయడం గురించీ ఆయన రాస్తారు. ఈ శతాబ్ది ప్రారంభంలో ఇలాంటి ప్రదర్శన అమెరికాలోనూ ఉండేదనీ, దానిని వాడెవిల్ అంటారనీ, చార్లీ చాప్లిన్ ఇందులో ప్రసిద్ధుడనీ ఆయన అంటారు. పురాతన సుమేరు సమాజంలో జనం ఎలాంటి నిర్బంధాలూ, నిబంధనలూ లేని స్వేచ్ఛను అనుభవించడానికి ఏటా వారం రోజులు కేటాయించేవారు. అలాగని స్వేచ్ఛ అంటే ఎలాంటి అదుపాజ్ఞలూ లేని ఇచ్ఛావిహారం కాదు. సమష్టి శ్రేయస్సు కోసం స్వీయ నియంత్రణలో ఉంచుకోవలసిన బాధ్యత కూడా! పాలకులు, పాలితుల వ్యవహరణలో ఎక్కడ తూకం తప్పినా దెబ్బతగిలేది స్వేచ్ఛకే! నిరంతర అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించే మూల్యం. -
సైంధవ రుతు'పవనం'!
జూన్ 16, పిఠాపురం: ‘శక్తిపీఠం సాక్షిగా చెబుతున్నా. నేను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ – ఉప్పాడ సెంటర్లో జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రకటన ఇది. జూన్ 21వ తేదీనాడు రెండు యెల్లో మీడియా ప్రధాన పత్రికలు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూను చాంతాడంత పొడవుతో ప్రచురించాయి. అందులో ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం: ‘‘సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను. సీఎం పదవి అంటే చాలా అనుభవం కావాలి. సీఎం అని మా వాళ్లు అదేపనిగా అరుస్తుంటే, నా కేడర్ స్టేట్మెంట్ను ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా అనుకోవాలి.’’ ఇరవై ఒకటిన పేపర్లలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇరవైన ‘ఆ రెండు’ పత్రికలకు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే పిఠాపురం సభ తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు! దేశంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో సర్వశక్తిమంతమైనదిగా ప్రాచుర్య మున్న పురుహూతికాదేవి శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన నాలుగు రోజులకే చెల్లుబాటు కాకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పదిహేనేళ్ల రాజకీయ జీవితంలో (‘ప్రజారాజ్యం’ స్థాపన దగ్గర నుంచి) తన మాటలను తానే చెల్లుబాటు కాకుండా చేసుకున్న ఘటనలు కోకొల్లలు. రాజ కీయాల్లో మా వాడు చెల్లని రూపాయిగా మారిపోతున్నాడని ఆయన అభిమానులు బహిరంగంగానే ఆవేదన పడుతున్నారు. పిఠాపురంలో శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటనకు సరిగ్గా 36 రోజుల ముందు ఇదే అంశంపై మంగళగిరిలో ఆయన ఇంకో రకంగా మాట్లాడారు. మే 11న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సీఎం అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఇలా బదులిచ్చారు – ‘‘ఒక మాట చెబుతున్నా. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అటువంటప్పుడు మన వాదన (సీఎం కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్ స్టార్‌ను చేయలేదు.నేను సాధించుకున్నదే! రాజకీయాల్లో కూడా టీడీపీ కావచ్చు.బీజేపీ కావచ్చు. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు? నేనే టీడీపీ అధ్యక్షుడినైనా ఆ మాట అనను. బలం, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే పని జరగదు. పొత్తుల కోసం నా ఏకైక కండిషన్ వైఎస్సార్సీపీని గద్దె దించాలి. అంతే.’’ తన అసలు లక్ష్యాన్ని పవన్ అక్కడ ప్రకటించారు. ‘ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానుల నుంచీ, జనసేన కార్యకర్తల నుంచీ విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందేమో’నని ఒక విలేకరి తన సందేహాన్ని పవన్ ముందు వ్యక్తం చేశారు. ‘‘విమర్శలు వస్తాయనే భయాలు నాకు లేవు. అభిమానులు నిరాశపడటానికి ఇదేమీ సినిమా కాదు. కార్య కర్తలైనా సరే నాతో నడిచేవాళ్లే నా వాళ్లు’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంటే పొత్తులు ఖాయమనీ, ముఖ్యమంత్రి పదవి అడిగే అర్హత తనకు లేదనీ, కార్యకర్తలు ఇందుకు అంగీక రించవలసిందేననే భావాన్ని ఆయన కుండబద్దలు కొట్టి ప్రకటించారు. మరి నెలరోజులు తిరిగే సరికే పిఠాపురం శక్తిపీఠం సాక్షిగా చేసిన ప్రకటన? సినిమా షూటింగ్ కోసం అనుకోవాలా? కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న యోధుల్లో కూడా సూపర్స్టార్లూ, పవర్ స్టార్లూ, మెగాస్టార్లూ తరహా విభజన ఉండేది. అప్పట్లో అర్ధరథి, రథి, అతిరథి, మహారథి వంటి పేర్లతో పిలిచేవారు కావచ్చు. అందులో ఓ పవర్‌స్టార్ స్థాయి వీరుని పేరు సైంధవుడు. కాకపోతే అతని పవర్ యుద్ధంలో ఒక్కరోజుకే పరిమితం. యుద్ధంలో అతని లక్ష్యం – కౌరవులను గెలిపించడం! స్వయంగా తానే పాండవులను ఓడించాలనే కోరిక అతనికి మొదట్లో ఉండేది. అందుకోసం ఘోరమైన తపస్సు కూడా చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తన చేతిలో పాండవులు ఓడిపోవాలని సైంధవుడు కోరుకున్నాడు. స్థాయికి తగని వరాన్ని ఇవ్వడం పాడి కాదనుకున్నాడు శివుడు. సైంధవుడికి హితవు చెప్పి అర్జునుడు అందుబాటులో లేని రోజున, మిగిలిన నలుగురిని యుద్ధంలో ముందుకు పోకుండా అడ్డు కోగలిగే ‘సింగిల్ యూజ్’ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ఒక్కరోజుకే పనికొస్తుందన్న మాట! ఈ ‘వన్డే వండర్’ను దుర్యోధనుని గెలుపు కోసం ఉపయోగించాలని సైంధవుడు భావిస్తాడు. సైంధవుడి కథ సాంతం మనందరికీ తెలిసిందే. ఇతడి కారణంగానే అభిమన్యుడు అసువులు బాసిన సంగతీ తెలిసిందే. ఎవరైనా హఠాత్తుగా ఊడిపడి ఏ కార్యానికైనా అడ్డుతగిలితే సైంధవుడిలా అడ్డు పడ్డాడనడం రివాజుగా మారింది. 2014లో వైసీపీ విజయానికి పవన్ కల్యాణ్ సైంధవుడిలా అడ్డుపడ్డాడనే మాట కూడా వినిపించింది. అందులో కొంత లాజిక్ కూడా ఉన్నది. రెండు శాతం కంటే తక్కువ తేడాతో అప్పుడు జగన్ పార్టీ అధికా రానికి దూరమైంది. జనసేన పార్టీ పోటీ చేయ కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింది. అప్పుడు దానికి ఓ నాలుగు శాతం ఓట్లు ఉండవచ్చని అంచనా. 2019లో బీఎస్పీ – కమ్యూనిస్టుల పొత్తుతో జనసేన కూటమికి ఆరు శాతం ఓట్లు పడ్డాయి. ఆ నాలుగు శాతం అంచ నాకు ఇదే ఆధారం. 2014లో జనసేన విడిగా పోటీ చేసిన ట్టయితే ఫలితం తరగబడి ఉండేదేమో! చంద్రబాబు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీకి ఉపయోగ పడే ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా జనసేన పార్టీ ఏర్పాటైందనే విమర్శ కూడా ఉన్నది. ఇది ఫక్తు రాజకీయ విమర్శే. కానీ, ఈ విమర్శకు బలం చేకూర్చే పరిణామాలు కూడా జరుగుతున్న నేప థ్యంలో దీనిపై లోతైన పరిశీలన అవసరమౌతున్నది. ముఖ్యంగా మూడు అంశాలు జనసేన మీద విమర్శలకు బలం చేకూర్చు తున్నాయి. 1. ఎన్నికల సమయానికల్లా తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా జనసేన ఎత్తుగడలు ఉండటం. 2. ఒక స్థిరమైన సైద్ధాంతిక ప్రాతిపదిక, రాజకీయ దృక్పథం లేకుండా ఎప్పటికప్పుడు రంగులు మార్చేయడం. 3. తాజా పరిస్థితుల్లో జనసేన ఎంచుకుంటున్న క్షేత్ర ప్రాధాన్యతలు, టార్గెట్ చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం. మొదటి ఎన్నికల్లో కలిసి పోటీచేయడం ద్వారా తెలుగు దేశం పార్టీకి దోహదపడిన జనసేన రెండో ఎన్నికల్లో అదే ప్రయోజనం కోసం విడిగా పోటీ చేసింది. అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకపక్షంగా పడకుండా చీలిపోతే తనకు ఉపయోగమని భావించింది. ఆ వ్యూహం ప్రకారమే విడిగా జనసేన ఫ్రంట్ ఏర్పాటైందని వైసీపీ ఆరోపణ. ఆ ఆరోపణను పూర్వపక్షం చేయడంలో జనసేన విఫలమైంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని టీడీపీ భావిస్తున్నది. ఈ భావననే హెచ్ఎంవి గ్రామఫోన్ రికార్డు మాదిరిగా పవన్ కల్యాణ్ పదేపదే వినిపిస్తున్నారనే అభిప్రాయం బలపడు తున్నది. రాజ కీయాల్లో జనసేన కూడా టీడీపీ కోసం సైంధవ పాత్ర పోషిస్తున్నదని జనం భావిస్తే ఆ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలితం ఉండకపోవచ్చు. జనసేనకు స్పష్టమైన సిద్ధాంతాలు గానీ, ఆశయాలు గానీ లేవని జనసేనాపతి మాటల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. జనసేన ఆవిర్భవించిన తర్వాత ఈ పదేళ్లలో ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన ప్రసంగాలు, ధారబోసిన భావజాలం, ఒలకబోసిన వాగామృతం – అంత టినీ ప్రోది చేసి చూస్తే ఎంతటివారలైనా గందరగోళానికి గురి కాక తప్పదు. అటువంటి గందరగోళానికి జనసైనికులూ, వీర మహిళలూ గురికాకూడదని పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘వ్యూహం నాకొదిలేయండి, మీరు అనుసరించండ’ని కార్యకర్తలతో ఆయన పదేపదే చెబుతున్నారు. ‘ఒక్కసారి నేను కమిటయితే మీ మాట మీరే వినకండి, బ్లైండ్‌గా ఫాలో అవ్వండి’ అనేది ఆయన సందేశం. రాజకీయ పార్టీ ఇలా కూడా ఉంటుందా? ఉండదు! ఇది చంద్రబాబు ప్రారంభించిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అని వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థులు అలా ఆరోపిస్తూనే ఉంటారు. కానీ, ఆరోపణ తప్పని రుజువు చేయవలసిన బాధ్యత మాత్రం పవన్ కల్యాణ్ భుజస్కంధాలపైనే ఉన్నది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేయడమన్నది పక్కా అయినట్లే. ఇది బాబు డిసైడ్ చేసిన స్కీమే కనుక ఇందుకు భిన్నంగా ఉండదు. ఆ దేవుడు శాసించాడు... ఈ అరుణాచలం పాటిస్తాడు, అంతే. బీజేపీని కూడా లాక్కొని రావాల్సిన బాధ్యతను పవన్‌కు బాబు అప్పగించారు కనుక ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వ్యూహాత్మక ఆలస్యం జరిగి ఉండవచ్చు. 34 అసెంబ్లీ సీట్లున్న గోదావరి జిల్లాల్లో గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చే కర్తవ్య దీక్షతో వారాహి రథం మొదట గోదావరి తీరానికే చేరింది. కాపులతోపాటు ఇతర వర్గాల్లో కూడా పేరు ప్రఖ్యాతులున్న ముద్రగడ పద్మనాభంపై కొత్తతరం కాపు యువతను ఎగదోసే ప్రయత్నం చేశారు. ముద్రగడను అవ మానించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు శత్రువు తనకూ శత్రువే అన్నట్టుగా పవన్ కల్యాణ్ ఈ పర్యటనలో వ్యవహరించారు. ముద్రగడను సామాజిక వర్గానికి దూరం చేయకుండా ఆ ఓట్లను బాబు వైపు మళ్లించడం సాధ్యంకాకపోవచ్చన్న ఆలోచన కూడా ఈ టార్గెట్‌కు కారణం కావచ్చు. తన సామా జికవర్గ బలం పెద్దగా లేకపోయినా అన్నివర్గాల మద్దతుతో కాకినాడలో నెగ్గుకొస్తున్న ద్వారంపూడిపై తీవ్ర స్థాయిలో పవన్ విరుచుకుపడ్డారు. ఇందుకు బదులుగా కాకినాడలో ద్వారంపూడిపై గానీ, పిఠాపురంలో తనపై గానీ పోటీ చేయాలని ముద్ర గడ విసిరిన సవాల్‌కు మాత్రం పవన్ జవాబు చెప్పలేక పోయారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సహజం. పవన్ కూడా ప్రభుత్వం మీద ఈ పర్య టనలో చాలా విమర్శలే చేశారు. ఆ విమర్శలకు ఆధారం మాత్రం యెల్లో మీడియా కథనాలు, తెలుగుదేశం ప్రవచనాలే అన్నట్టుగా ఈ పర్యటన సాగింది. ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం. రాష్ట్రంలో 31,177 మంది మహిళలు అదృశ్యమయ్యా రనీ, వీరిలో 40 శాతం మంది 18 యేళ్లలోపు యువతులేననీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ఆధారంగా చెబుతున్నాననీ పవన్ అన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019 నుంచి 2022 మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా మహిళల అదృశ్యానికి సంబంధించిన టాప్–టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో రాష్ట్రంలో అదృశ్యమైన వారి సంఖ్య 2,746. అందులో 2,737 మందిని సురక్షితంగా మళ్లీ ఇళ్లకు చేర్చారు. ఇంకా జాడ తెలి యనివారు కేవలం తొమ్మిది (9) మంది మాత్రమే. అదే బాబు హయాంలో అంతకు ఒక సంవత్సరం ముందు 2018లో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,520. అందులో ఇళ్లకు చేరిన వారు 2,195 మంది. 4,325 మంది జాడను ఆ ప్రభుత్వం కని పెట్టలేకపోయింది. బాబు హయాంలోని ఐదేళ్లూ, జగన్ హయాంలో నాలుగేళ్ల లెక్కలూ దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి. వాస్తవాలకు మసిపూయడంలో ఈయన యెల్లో మీడియాతో పోటీపడుతున్నట్టున్నారు. గడచిన ఎన్నికల్లో తనను భీమవరం నియోజకవర్గంలో కక్షకట్టి ఓడించారనీ, అక్కడ మొత్తం ఓట్లకంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయనీ మరో ఆరోపణ చేసి నవ్వులపాలయ్యారు. ఎన్ని కల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం అక్కడ 77.9 శాతం ఓట్లు పోలయ్యాయి. 22.6 శాతం మంది ఓటే వేయలేదు. ప్రజల తెలివితేటల మీద, వివేచనా శక్తి మీద చులకన భావం ఉన్నవారు మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేయగలుగుతారు. తొలివిడత వారాహి యాత్ర జనసేన పార్టీకి పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది. భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఉంచిన లెక్కలు తనకు కంచుకోటగా పవన్ భావించుకునే ప్రాంతాల్లో రోడ్లపై జరిగిన సభలకు ఎక్కడా మూడు నాలుగు వేలమందికి మించి రాలేదు. అందులో సగంమంది ఇరవయ్యేళ్ల లోపు పిల్లలే! ఎక్కడా యాభై మందికి మించి మహిళలు కనిపించలేదు. ఒక్క అమలాపురంలో మాత్రం సుమారు రెండొందల మంది కనిపించారు. జనసేన పార్టీకి జనసందేశం ఏమిటో అందినట్టేనా? ఈ సందేశానికి కారణమేమిటి? చంద్రబాబు ఎజెండా ప్రకారం జనసేన పనిచేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కారణం. దాన్ని పూర్వపక్షం చేయాలంటే ఒకటే మార్గం. జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం. లేదంటే పవన్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించి మెజారిటీ స్థానాల్లో పోటీచేసి ఇతర పార్టీలతో మిగిలినచోట్ల పొత్తు పెట్టుకోవడం. జగన్ ప్రభుత్వం కంటే మెరుగ్గా తానెలా పరిపాలించబోతున్నాడో సోదాహరణంగా చెప్పగలగడం. అలా చేయకుండా చంద్రబాబు విసిరే పాతిక, ముప్పయ్ సీట్లను మహాప్రసాదంగా కళ్లకు అద్దుకుంటే జనసేన పార్టీ తెలుగుదేశం అనుబంధ సంఘమనే ప్రజాభిప్రాయాన్ని అధికారికంగా ధ్రువీకరించినట్టే! ఏటా రుతుపవనాలు వచ్చి పోయినట్టే చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా ఒక సైంధవ పవనం వచ్చి పోయేదని చరిత్రలో స్థిరపడిపోతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘ద్వైపాక్షికం’లో కొత్త అధ్యాయం
భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా యాత్ర విజయవంతమైంది. భారత్–అమెరికా సంబంధాలకు ఆకాశమే హద్దని మోదీ... ఇంత పటిష్టంగా, ఇంత సన్నిహితంగా, ఇంత క్రియాశీలంగా సంబంధాలు ఏర్పడటం ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇదే తొలిసారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యా నించటంలో అతిశయోక్తులు లేవు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవటమే కాదు... అందుకనుసరించాల్సిన మార్గాన్ని కూడా ఆ లక్ష్యంతో సరిగా అనుసంధానించుకోవటం సమర్థ దౌత్య నైపుణ్యానికి చిహ్నం అంటారు. అమెరికాతో మన దేశానికి కుదిరిన భిన్న ఒప్పందాలను పరికిస్తే మన దౌత్య నైపుణ్యం ఆశించిన రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. అయితే ఇందుకు అంతర్జాతీయ స్థితిగతులు కూడా దోహదపడ్డాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో అత్యాధునిక సాంకేతిక సహకారం మొదలుకొని వాతావరణ మార్పులకు సంబంధించిన సహకారం వరకు ఎన్నో ఉన్నాయి. చంద్రుడి పైకి వెళ్లే మూన్ మిషన్‌లో మనకూ భాగస్వామ్యం ఇవ్వటానికి అంగీకరించటంతో మొదలెట్టి ఫైటర్ జెట్ ఇంజన్ల ఉత్పత్తి, సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటానికి అవస రమైన సాయం అందివ్వటం వరకూ అనేకం ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అక్కడుండే భారతీయులకు తమ హెచ్ 1బి వీసాలను అమెరికాలోనే నవీకరించుకునే వెసులుబాటు కల్పించటం వేలాదిమందికి తోడ్పడుతుంది. భారత్–అమెరికా సంబంధాలు తాజా ద్వైపాక్షిక ఒప్పందాలతో సరికొత్త దశకు చేరు కున్నాయి. దేశాల మధ్య సాన్నిహిత్యం కేవలం అమ్మకందారు–కొనుగోలుదారు సంబంధాల వల్ల ఏర్పడదు. భిన్న రంగాల్లో పరస్పరం ఎదిగేందుకు చిత్తశుద్ధితో ఆ దేశాలు ప్రయత్నించినప్పుడే ఆ సాన్నిహిత్యం సాధ్యపడుతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మెమొరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ గుజరాత్లో అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యంలో 270 కోట్ల డాలర్ల వ్యయంతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించటం, తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అమర్చే ఫైటర్ జెట్ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేయటానికి అంగీకరించటం, ఇరు దేశాల రక్షణ విభాగాలూ సైనిక సాంకేతికతలో సహకరించుకునే ఇండస్ఎక్స్ ఒప్పందం ఎన్నదగ్గ నిర్ణయాలు. ఇక క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, అత్యాధునిక సైనిక డ్రోన్లు తదితరాలపై ఒప్పందాలు సరేసరి. ఆసియా ఖండంపై అమెరికా నూతన దృక్పథానికి ఈ ఒప్పందాలు నిదర్శనం. కేవలం చైనాను దృష్టిలో పెట్టుకోవటం వల్లే చాలా అంశాల్లో అమెరికా దిగొచ్చిందన్న విశ్లేషణల్లో కొంతమేర వాస్తవం ఉండొచ్చు. ఈ ఒప్పందాలు సాకారమైతే ఆసియాలో చైనా పలుకుబడికి గండికొడతాయని చెప్పటం అతిశయోక్తి అవుతుందిగానీ, దాని ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ఏదోమేరకు నిలువరించటం సాధ్య పడొచ్చు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతిసుస్థిరతలే తన ధ్యేయమని అమెరికా చెబుతోంది. సమతౌల్య ఆసియా తన లక్ష్యమంటున్నది. అయితే ఆ దేశానికి భవిష్యత్తులో తైవాన్ విషయంలోనో, మరే ఇతర అంశంలోనో చైనాతో ఘర్షణ వాతావరణం ఏర్పడితే అది మనకు కూడా సమస్యలు సృష్టిస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనం ఆనాటి సోవియెట్ యూనియన్ వైపు మొగ్గటం అమెరికాకు కంటగింపుగా ఉండేది. అందువల్లే ఏ విషయంలోనూ సహకరించేది కాదు. భారత్‌లో 90వ దశకంలో సంస్కరణల అమలు ప్రారంభించాక ఇంత పెద్ద మార్కెట్ వున్న దేశాన్ని వదులుకోవటం అసాధ్యమని అమెరికా గుర్తించింది. మన దేశం సైతం మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంతో క్రమేపీ చెలిమిని పెంచుకుంటూ వస్తోంది. అటు చైనాతో సైతం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను బైడెన్ నియంతతో పోల్చినా ఆ దేశానికి విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను పంపటం గమనించదగ్గ పరిణామం. మోదీ అమెరికా పర్యటనకు ముందే బ్లింకెన్ బీజింగ్ సందర్శించారు. ఇటు మన దేశం కూడా సరిహద్దుల్లో తగాదాలకు దిగుతున్న చైనాతో మూడేళ్లుగా ఓపిగ్గా చర్చిస్తోంది. చైనా కూడా జరుగుతున్నదేమిటో గమనిస్తూనే ఉంటుంది. పరిణ తితో ఆలోచించటం మొదలుపెడితే ఎంత జటిల సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఈ పర్యటనలో భారత్‌లో పౌర హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలనీ, మోదీని ఇరకాటంలో పెట్టాలనీ కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. అధికార డెమొ క్రటిక్ పార్టీ సెనెటర్లు కూడా ఈ విషయంలో బైడెన్‌కు లేఖ రాశారు. ఇరు దేశాల అధినేతలూ ఉమ్మడిగా పాల్గొన్న మీడియా సమావేశంలో సైతం ఈ దిశగా ప్రశ్న సంధించారు. దానికి మోదీ ‘భారత్‌ను ప్రజాస్వామిక దేశమని మీరు అంగీకరిస్తే వివక్ష చూపుతున్నారన్న ప్రశ్నకు అర్థమే లేద’ని బదులిచ్చారు. బైడెన్ సైతం ప్రజాస్వామిక విలువలపై తాము చర్చించామంటూ జవాబిచ్చారు. ఈ విషయంలో ఇరు దేశాలూ ఇంకా పరిపూర్ణత సాధించాల్సివుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టా ల్సిన వర్తమానంలో బైడెన్ ఇలాంటి అంశాల విషయంలో బహిరంగంగా ప్రస్తావించాలనుకోవటం అత్యాశే అవుతుంది. 2015 మొదట్లో అప్పటి అధ్యక్షుడు ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు సైతం ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. అది మోదీ సమక్షంలో కాదు కాబట్టి, ‘మతవిశ్వాసాల పరంగా చీలనంతకాలమూ మీరు విజయం సాధిస్తార’ని లౌక్యంగా జవాబిచ్చారు. మొత్తానికి మోదీ మూడురోజుల అమెరికా పర్యటన అంచనాలకు మించిన రీతిలో విజయవంతమైంది. -
ప్రతిపక్షాల ఆశల పందిరి
కొన్ని సమావేశాలకు ఎక్కడ లేని ప్రత్యేకతా ఉంటుంది. సమయం, సందర్భం, చేపట్టిన అంశం, హాజరయ్యే ప్రతినిధులు – ఇలా అందుకు ఏదైనా కారణం కావచ్చు. మరి, కీలకమైన అవన్నీ కలగలిసిన సమావేశమంటే దానికుండే ప్రాధాన్యం చెప్పనక్కర లేదు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ)కి చెందని ప్రతిపక్షాలన్నీ ఈ శుక్రవారం పాట్నాలో జరుపుతున్న సమావేశం సరిగ్గా అలాంటిదే. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీని కలసికట్టుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఉమ్మడి ప్రణాళికను మథించేందుకు ప్రతిపక్ష నేతలు ఒక దగ్గరకు వస్తున్నారు. ఆలోచన మంచిదే. పాలక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఇది మంచి ప్రయత్నమే. అయితే, ఆచరణలో ప్రతిపక్ష ఐక్యత ఓ ఊహకందని పజిల్ కూడా కావడంతో పాట్నా భేటీ ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యం గనక, ఢిల్లీ గద్దెపై ఎవరి ఆశలు వారికున్న బడా నేతల మధ్య ఐక్యత ఏ మేరకు ఫలిస్తుంది, నిలుస్తుందనే సందేహాలనూ కలిగిస్తోంది. ఆ మధ్య కొద్దికాలం క్రితమే బీజేపీ వ్యతిరేకిగా అవతారమెత్తిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలనూ ఏకం చేయాలని తపిస్తున్నారు. కొన్నాళ్ళుగా వివిధ పార్టీల అగ్రనేతల్ని కలుస్తూ, కూటమి కట్టడానికి సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగమే పాట్నాలో ఈ మెగా భేటీ. దాదాపు 20 కీలక ప్రతిపక్షాలకు చెందిన నేతలను సాదరంగా స్వాగతించి, ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిత్యం కీచులాడుకొంటూ, ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షాల మధ్య ఇది ఓ అపురూప దృశ్యం. ఉమ్మడి కార్య క్రమం, పార్లమెంట్ లోపల – బయట ఉమ్మడి అజెండా, క్షేత్రస్థాయి వ్యూహం లాంటివన్నీ ఈ భేటీ అజెండాలో భాగం. అలా ఇది ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. వచ్చే ఎన్నికలు భీకరపోరు కానున్నాయనే సంకేతం ఇవ్వనుంది. కాషాయ పార్టీకి కంటి మీద కునుకు కరవయ్యేలా చేయనుంది. ప్రతిపక్షాల ఐక్యతా అజెండాలో అనేకం ఉన్నప్పటికీ, అవి అత్యవసరంగా పరిష్కరించుకోవా ల్సిన సమస్యలూ అనేకం. ముందుగా ఆ పార్టీలు తమ మధ్యనున్న విభేదాలను రూపుమాపుకోవాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సారథి క్రేజీవాల్ లాంటివారు సుప్రీమ్ కోర్ట్ తీర్పును సైతం పక్కన పెట్టేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఐక్యతా పోరాటాన్ని ఆశిస్తున్నారు. కానీ, ఆర్డినెన్స్‌పై ఆప్‌ను సమర్థించే విషయంలో కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండడం అర్థం చేసుకోదగినదే. ఢిల్లీ, పంజాబ్‌లలో ‘ఆప్’కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. త్వరలో ఎన్నికలు జరగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో సైతం చొచ్చుకుపోవాలని ‘ఆప్’ కత్తులు నూరు తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ తమ పార్టీ సామాజిక న్యాయ అజెండానే కాపీ కొట్టారంటూ కేజ్రీవాల్ ఆరోపణలూ చేశారు. మరి, పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న ఈ పార్టీలు ఎలా కలుస్తాయి? రెండు కత్తులు ఒకే ఒరలో ఎలా ఇముడుతాయి? యూపీలో సమాజ్‌వాది పార్టీకి కాంగ్రెస్, బీఎస్పీలతో; బెంగాల్లో తృణమూల్‌కు కాంగ్రెస్, వామపక్షాలతో; ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ఉప్పూ నిప్పూ పరిస్థితులే ఉన్నాయి. వాటిని అవి ఎలా సర్దుబాటు చేసుకుంటాయో చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడికక్కడ బీజేపీపై ఒకే బలమైన ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం చెప్పినంత సులభం కాదు. ఎన్నికల తర్వాత కన్నా ఎన్నికల ముందే ఐక్యతా రాగాలాపనకు పార్టీలకు ఇలాంటి సమస్యలెన్నో! అందుకే, ఐక్య ప్రతిపక్షం ఆలోచన మంచిదైనా, సరైన అజెండా, ఆచరణాత్మక ప్రణాళిక, అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యుడైన ఉమ్మడి నేత లేకపోతే కష్టం. ప్రతిపక్షాలన్నీ పరస్పర నమ్మకంతో సాగించాల్సిన సుదీర్ఘ ప్రయాణమిది. అలాంటప్పుడు అను మానాల నివృత్తి అయినా, ఆచరణ ప్రణాళికైనా ఒక రోజు మాటల మథనంతో సాధ్యమనుకుంటే అత్యాశ. ఇలాంటి భేటీలు తరచూ జరగాలి. బలమైన పాలకపక్షాన్నీ, జనాకర్షక విన్యాసాల్లో దిట్ట అయిన దాని సారథినీ ఎదుర్కొనాలంటే, ప్రతిపక్షాలన్నీ తమ మధ్య పాత పగలను పక్కన పెట్టాలి. స్వీయ ప్రయోజనాల కన్నా ఉమ్మడి శత్రువుపై విజయమే వాటి లక్ష్యం కావాలి. అందుకవసరమైతే కొంత త్యాగానికి కూడా సిద్ధం కావాలి. అంతటి దీక్ష, దృఢ సంకల్పం, చిత్త శుద్ధి ఎన్ని పార్టీలకు ఉందన్నది విమర్శకుల సందేహం. అందుకే, ఒక్కరోజు పాట్నా భేటీపై అతిగా అంచనాలు ఎవరికీ లేవు. అదే సమయంలో కలసి పోరాడాలన్న ఆశయంలో ఇది ముందడుగనడంలో అనుమానం లేదు. ఎన్నికలకు మరో 11 నెలల కన్నా తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నందున పాట్నా భేటీ సాక్షిగా ప్రతిపక్షాలు తమలో తాము పట్టువిడుపులు ప్రదర్శించాలి. ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యమో, తమ కూటమి అసలైన ప్రత్యామ్నాయమనే నమ్మకం ప్రజల్లో కల్పించడం అంతకన్నా ముఖ్యం. అలాగే, పాలక నేతకు తమ ప్రత్యామ్నాయం ఎవరో స్పష్టం చేయగలిగి ఉండాలి. ఒకప్పుడు కాంగ్రెస్, ఇందిరా గాంధీలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో సాగిన ప్రతిపక్ష ప్రయోగం మాదిరిగా... మళ్ళీ అంత నమ్మకం కలిగించగలిగితేనే ఏ కూటమి అయినా ఫలిస్తుంది. ఎన్నికల క్షేత్రంలో ఫలితాలు సాధిస్తుంది. ఏది ఏమైనా, ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన నిలదీసే దృఢమైన ప్రతిపక్షం ఉంటేనే ఏ ప్రజాస్వామ్యమైనా నాలుగు కాళ్ళపై నిలుస్తుంది, నడుస్తుంది. తొమ్మిదేళ్ళ తర్వాత దేశంలో ఇప్పుడా అవసరం ఎంతైనా ఉంది. తాజా పాట్నా భేటీ ఆశలు రేపుతోంది అందుకే! -
ఎట్టకేలకు ఒక ముందడుగు!
ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు... ఒకదానిపై మరొకదానికి ఒంటి నిండా అనేక అనుమానాలు, అపనమ్మకాలు. అలాంటి దేశాలు కూర్చొని చర్చించుకుంటే అది పెద్ద విశేషమే. అమెరికా, చైనాల మధ్య ఈ వారం అదే జరిగింది. అస్తుబిస్తుగా ఉన్న తమ సంబంధాలను చక్కదిద్దు కొనేందుకు అవసరమైన ఒక అడుగు ముందుకు వేశాయవి. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజా చైనా పర్యటన అనేక విధాల గుర్తుండిపోయేది అందుకే. 2018 తర్వాత గడచిన అయిదేళ్ళలో అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా చివరిరోజైన సోమవారం సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సైతం బ్లింకెన్ సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నించడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. అరుదైన ఈ పర్యటనలో కళ్ళు చెదిరే కీలక ప్రకటనలేవీ లేకపోవచ్చు. కానీ, అసలంటూ ఘర్షణ వాతావరణాన్ని ఉపశమింపజేసి, తమ మధ్య సంబంధాలను సమస్థితికి తీసుకురావాలని రెండు దేశాలూ అంగీకరించడమే అతి పెద్ద వార్త అయింది. పరస్పరం నిష్కర్షగా అభిప్రాయాలు పంచు కొన్న ఈ చర్చలు భవిష్యత్తు పట్ల ఆశలు రేపాయి. నిజానికి, మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి కొన్నేళ్ళుగా అమెరికా తన దూకుడు చర్యలతో డ్రాగన్‌కు కోపం తెప్పించింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్ళీ గాడిన పెట్టాలనుకున్నా, ఫిబ్రవరిలో గగనతలంలో పయనిస్తూ భారీ బెలూన్ అమెరికాలో కనిపించేసరికి వ్యవహారం ముదిరింది. చైనా బెలూన్ గూఢచర్యానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు మిన్నంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాహాటంగానే చైనాను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బ్లింకెన్ తాజా చైనా పర్యటన, సత్సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒక విధంగా– బీజింగ్‌తో సంభాషణ వాషింగ్టన్ ఏరికోరి ఎంచుకున్నది కాదు. తప్పనిసరి అనివార్యత. తాజా సంభాషణల్లో సైతం బీజింగ్ తన మూతి బిగింపు పూర్తిగా వీడినట్టు లేదు. ఆ దేశం కాస్తంత నిష్ఠురంగానే ఉన్నా వైట్‌హౌస్ వర్గం తమ పని తాము కొనసాగించక తప్పదు. స్వీయ ప్రయోజనాల రీత్యా డ్రాగన్‌తో మాటామంతీ కొనసాగింపే అమెరికాకు ఉన్న మార్గం. కొద్ది వారాలుగా ఈ ప్రయత్నాలు కాస్త ముమ్మరించాయి. చైనాకు చెందిన అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ గత నెల వియన్నాలో రెండు రోజులు ‘‘నిర్మాణాత్మక’’ సమావేశాలు జరపడాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఫలితంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి, చైనా వాణిజ్య శాఖ మంత్రితో అమెరికాలో మాట కలిపేందుకు తలుపులు తెరుచుకు న్నాయి. ఇక, మధ్యశ్రేణి అమెరికన్ అధికారులు బీజింగ్‌లో పర్యటించారు. అమెరికా గూఢచారి విభాగం సీఐఏ డైరెక్టర్ సైతం సద్దు లేకుండా చైనా సందర్శించిన సంగతి మర్చిపోలేం. దీన్నిబట్టి భౌగోళిక రాజకీయాలకు అతీతంగా డ్రాగన్‌తో దోస్తీకి అగ్రరాజ్యం చేయిచాస్తోందని అర్థమవుతోంది. బంధాలు మెరుగుపడడం దేవుడెరుగు, కనీసం మరింత క్షీణించకుండా ఆపడానికి బ్లింకెన్ పర్య టన ఉపకరిస్తుంది. తక్షణ ప్రయోజనాలు ఆశించలేం కానీ, చైనా విదేశాంగ మంత్రితో, అగ్ర దౌత్య వేత్తతో ‘నిక్కచ్చిగా’ సంభాషణలు సాగడంతో, ఆఖరి రోజున డ్రాగన్ దేశాధినేతతో బ్లింకెన్ భేటీకి మార్గం సుగమం అయింది. రానున్న రోజుల్లో ఇది రెండు అగ్రరాజ్యాల అధినేతల మధ్య భేటీకి దారి తీయగలదని ఆశించడానికి వీలు కలిగింది. సైనిక ఘర్షణ ముప్పును తగ్గించుకోవాలని రెండు దేశాలూ ఒకే ఆలోచనకైతే వచ్చాయి. ఈ దిగ్గజ దేశాల మధ్య బంధం సుస్థిరంగా ఉండడం ప్రపంచ శాంతికి సైతం అవసరం. నిజానికి, చైనా ఆశలు, ఆకాంక్షలు అపరిమితమే అయినా, షీ మాత్రం విశ్వనేతగా అమెరికా స్థానంలోకి రావాలనే ఆలోచన, వ్యూహం తమకు లేదని చెబుతున్నారు. చైనా తనదిగా ప్రకటించుకొనే స్వయంపాలిత ద్వీపం తైవాన్‌కు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. తైవాన్‌పై డ్రాగన్ వేసే అడుగులను గ్రహించడంలో అంచనాలు తప్పితే ప్రమాదం తప్పదన్న తెలివిడి అమెరికాకు ఉంది. అందుకే, సంబంధాల మెరుగుదలకు, మరీ ముఖ్యంగా సైనిక చర్చల పునరుద్ధరణకు వాషింగ్టన్ తహతహలాడింది. కానీ, తమ రక్షణ మంత్రిపైన అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న వేళ బీజింగ్ అందుకు ఇష్టపడలేదు. అమెరికా మరింత స్పష్టమైన చర్యలతో, సంకల్పంలో నిజాయతీ ఉందని నిరూపించుకొనేలా ముందుకు రావాలని చూస్తోంది. ఆ మాటకొస్తే, గతంలో తనకూ, బైడెన్‌కూ మధ్య కుదిరిన ఒప్పందాల పైనే ఇరుపక్షాలూ ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉందని బ్లింకెన్‌కు షీ గుర్తు చేశారు. రానున్న నెలల్లో పరిణామాల్ని బట్టి, షీ– బైడెన్ల శిఖరాగ్ర సమావేశానికి అవకాశాలుంటాయి. సొంతగడ్డపై రాజకీయ ఒత్తిళ్ళ రీత్యా చైనాపై కఠిన వైఖరిని బైడెన్ సర్కార్ ఏ మేరకు మార్చుకో గలుగుతుందన్నది సందేహమే. అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం దగ్గరవుతున్న వేళ బైడెన్‌కు అది మరీ కష్టం. అయితే, భౌగోళిక రాజకీయాల్లో పొరపొచ్చాలెన్ని ఉన్నా, ప్రపంచ కుగ్రామంలో ఆర్థిక అనివార్యతలే కీలకమనే స్పృహ ఈ అగ్రశక్తులు రెంటికీ పుష్కలం. అదే ఇప్పుడు ఇరు పక్షాల మధ్య అపనమ్మకాన్ని వదిలించుకొనే మాటలకు దృశ్యాదృశ్య హేతువు. పరిమిత సహకారం, ఉద్రిక్తతల్లో కొంత ఉపశమనం సరిపోతాయా? చెప్పలేం. కానీ, నిరంతర సంభాషణలకు సిద్ధంగా ఉన్నామన్న ఈ సంకేతమే గనక ఇవ్వకుంటే, విశ్వశాంతికి కీలకమైన బంధాన్ని చేతులారా చెడగొడుతున్న బాధ్యతారహిత పెద్దన్నలనే ముద్ర మిగిలిపోతుంది. ఆ ఎరుక అమెరికా, చైనాలకు దండిగా ఉంది. -
ఆశలు మోసులెత్తుతున్న వేళ..
భారత ప్రధాని మోదీ మంగళవారం 3 రోజుల అధికారిక పర్యటనకు అమెరికా పయనమవడంతో ఒక చరిత్రాత్మక ఘటనకు తెర లేచింది. ఇది భారత, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమూలంగా మార్చివేసే ఘట్టమని విశ్లేషణ. అమెరికాలో వ్యక్తమవుతున్న ఆసక్తి, జరుగుతున్న హంగామా, అధికారిక విందు, చివరకు అమెరికన్ పార్లమెంట్లో మోదీ ప్రసంగం – ఇలా పర్యటన అంశాల్ని గమనిస్తే ఆతిథ్యదేశం దీన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ పర్యటనలో రక్షణ, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం సహా పలు రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనున్నందున ఇది ప్రాముఖ్యం సంతరించుకుంది. నిజానికి, 2014 మేలో తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గడచిన తొమ్మిదేళ్ళలో మోదీ అనేకసార్లు అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. అయితే, ఇప్పుడు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధానికి ఉన్నతస్థాయి వ్యక్తీకరణగా భావించే ‘స్టేట్ విజిట్’గా ఈ పర్యటన సాగుతోంది. ఇలా వెళ్ళడం మోదీకీ ఇదే మొదటిసారి. ఒక దేశ ప్రభుత్వాధినేత ఆహ్వానం మేరకు మరో దేశ ప్రభుత్వాధి నేత సాగించే ఈ సాదర ఆహ్వానయుత పర్యటనకు సహజంగానే సాధారణ అధికారిక పర్యటనకు మించిన హంగూ, ఆర్భాటం ఉంటాయి. అమెరికా అధ్యక్ష దంపతులు స్వయంగా వైట్‌హౌస్‌లో కళ్ళు మిరుమిట్లుగొలిపే అధికారిక విందుకు ఆతిథ్యమిస్తారు. గతంలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ (1963 జూన్), ప్రధాని మన్మోహన్ (2009 నవంబర్)ల తర్వాత ఈ తరహా పర్యటనకు సాదర ఆహ్వానం అందుకున్న మూడో భారత నేత – మోదీయే. అత్యంత సన్నిహితులకూ, మిత్రపక్షాలకే అందించే ఈ ఆహ్వానం భారత, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ప్రతీక. ప్రపంచ దృశ్యం సంక్లిష్టమవుతున్న వేళ అమెరికా – భారత సంబంధాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా అనుసరిస్తున్న ఇండో – పసిఫిక్ వ్యూహం, ఆధునిక రక్షణ పరిజ్ఞానం పంచు కోవడం, జీఈ–414 టర్బోఫ్యాన్ జెట్ ఇంజన్ల ఉత్పత్తి లాంటివి ఇరు దేశాల చర్చల అజెండాలో ఉన్నాయి. వ్యూహాత్మక సాంకేతిక విజ్ఞాన భాగస్వామ్యం అటుంచితే, రెండుచోట్లా రాజకీయం వేడెక్కివున్న పరిస్థితులివి. రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టేందుకు ఇరువురు నేతలూ సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటన ద్వారా వారు ఏ మేరకు ఇమేజ్ పెంచుకొని, సమర్థ నేతగా కనిపి స్తారన్నదీ కీలకమే. స్టేట్ విజిట్లలో అసలే హడావిడి ఎక్కువనుకుంటే, ఎన్నికల సీజన్ ఈ హంగా మాను మరింత పెంచేస్తోంది. ప్రవాసీయులు అధికంగా ఉండడం మోదీ పర్యటనకు ఎక్కడ లేని ఈ ఆర్భాటానికొక కారణం కావచ్చు. జనంలో స్వచ్ఛంద స్పందన వస్తే తప్పు లేదు. ముందస్తు వ్యూహంతో, పద్ధతిగా ప్రతిచోటా జాతర సృష్టించడమే అతి అనిపిస్తోంది. రకరకాల సభలతో ‘ప్రవాసీ దౌత్యం’లో మోదీ సిద్ధహస్తుడు గనకనే అనుమానించాల్సి వస్తోందని విమర్శకుల మాట. అమెరికా పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ఆర్థికవేత్తలను మోదీ కలవనున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, శాస్త్రీయ అంశాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన నీల్ డిగ్రాస్ టైసన్, రాజకీయ శాస్త్రజ్ఞుడు జెఫ్ స్మిత్ తదితరులు సైతం ఆ జాబితాలో ఉండడం విశేషం. గతంలో నెహ్రూ, రాజీవ్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌ల అడుగుజాడల్లో అమెరికన్ పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఆ వరుసలో ఆరో భారత ప్రధానైన మోదీకి ఈ ప్రసంగ ఘనత దక్కడం ఇది రెండోసారి. 1949లో ప్రపంచ శాంతి, మానవ స్వాతంత్య్ర విస్తరణల పరిరక్షణే భారత విదేశాంగ విధాన దృష్టి అన్న నెహ్రూ నాటికీ, 2005లో కీలక సాంకేతిక విజ్ఞానాల అడ్డగోలు వ్యాప్తికి భారత్ కేంద్రస్థానం కాదన్న మన్మోహన్ నాటికీ... ఇప్పటికీ తేడా చూస్తే అగ్రరాజ్యంతో ఢిల్లీ బాంధవ్యం సుదూరం సాగింది. ఇండో–పసిఫిక్‌లో, అలాగే విశాల విశ్వవేదికపై భారత ప్రభావశీల పాత్రను అమెరికా గుర్తించింది.ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఆయుధ సరఫరా వ్యవస్థలు సంక్షోభంలో పడడంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కీలకమని భారత్ గుర్తించింది. అందుకు పాశ్చాత్య ప్రపంచం నుంచి సాంకే తికత అవసరం. ఇప్పుడు అమెరికా ముందుకొచ్చింది గనక మిగతా దేశాలూ ఆ బాటలో నడవచ్చు. మరోపక్క ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై దూకుడుగా వ్యవహరించడం లేదంటూ భారత్ పట్ల అసహనంగా ఉన్న పాశ్చాత్య ప్రపంచం చమురు తదితర అంశాల్లో మన అనివార్యతల్ని అర్థం చేసుకొన్నాయి. కొన్ని అంశాల్లో పరస్పర ఏకాభిప్రాయం లేకున్నా, పరిణతితో కూడిన ఆ అవగాహన సాక్షిగా భారత్, అమెరికాలు పరస్పర గౌరవం, ఉమ్మడి లక్ష్యాలతో నవశకంలోకి నడుస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం నాటి అలీన విధానం నుంచి భారత్ పక్కకు రాకున్నా, ప్రస్తుత ప్రపంచ అధికార క్రమంలో మార్పులను బట్టి పరస్పర విరుద్ధ వర్గాల్లోని దేశాలతో సైతం దోస్తీకి వెనుకాడదనే సంకేతాలిస్తోంది. అలాగే, ‘అబ్కీ బార్... ట్రంప్ సర్కార్’ అంటూ భారీ సభ సాక్షిగా ట్రంప్‌ను మోదీ సమర్థించారు. చివరకు ఆయన ఓడి బైడెన్ వచ్చినా బంధం బలపడిందే తప్ప మార్పు లేదు. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్యం, అతి పెద్ద ప్రజాస్వామ్యం – రెండూ సమైక్యంగా ప్రపంచం ముందున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇది సుసంపన్న, సురక్షిత భవితవ్యానికి బాటలు వేస్తుందని ఆశ. ప్రపంచ వేదికపై భారత్‌కు సమున్నత, కీలక పాత్ర ఉందని పాలకులు ప్రకటిస్తున్న వేళ ద్వైపాక్షిక బంధంలో ఇది కొత్త అధ్యాయం. -
ఈ మంటలు ఆర్పండి!
నెలన్నర దాటిపోయింది. ఇప్పటికి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర బలగాలకు తోడు కేంద్ర బలగాలు రంగంలోకి దిగి చాలాకాలమైంది. సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి వచ్చి పర్యటించారు. అయినా పరిస్థితి మారలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇవాళ్టికీ అగ్నిగుండమై మండుతోంది. శాంతిభద్రతలు క్షీణించి, మూకస్వామ్యం రాజ్యమే లుతోంది. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా ఇవ్వాలంటూ మైతై తెగ ప్రజలు చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే మొదటివారంలో జరిగిన గిరిజనుల ప్రదర్శన హింసాత్మకంగా మారినప్పుడు మొదలైన ఈ జ్వాల మణిపూర్‌లోని తెగల మధ్య చీలికలను ఎత్తిచూపింది. మరి, ఈ మంటల్ని చల్లార్చి, శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత తల మీద ఉన్న సర్కారు ఇప్పటి దాకా ఏం చేసినట్టు? సమస్యను చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక వర్గం వైపు నిలబడి, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. కుకీలు ఎక్కువుండే కొండ ప్రాంత జిల్లాల నుంచి మైతైలు వలసపోతుంటే, మరోపక్క మైతైలు అధికంగా ఉండే ఇంఫాల్ లోయ నుంచి కుకీలు తరలిపోతున్నారు. కేంద్ర మంత్రి నివాసం సహా రెండు వర్గాలకు చెందిన 4 వేల గృహాలు ఇప్పటికే అల్లర్లలో అగ్నికి ఆహుతి అయ్యాయి. శరణార్థి శిబిరాలు కిక్కిరిశాయి. అమాత్యుడి ప్రైవేట్ నివాసంపై దాడి గత మూడు వారాల్లో ఇది రెండోసారి. జాతుల మధ్య విద్వేషం ఇంతగా పెచ్చరిల్లుతుంటే, కేంద్రంలో, రాష్ట్రంలో రెండుచోట్లా అధికారంలో ఉన్న పాలకపక్షం ఏం చేస్తోందన్నది ప్రశ్న. నిజానికి, కేంద్ర హోమ్ మంత్రి ఇటీవలే సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించినప్పుడు, సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నా ఆ ఆశ నెరవేరలేదు. భౌగోళికంగా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ల మధ్య చిక్కిన ఈశాన్య రాష్ట్రాల్లో తెగల మధ్య తరచూ ఘర్షణలు కొత్త కావు. 1949లో భారత యూనియన్‌లో చేరినప్పటి నుంచి మణిపూర్‌లోనూ అవి ఉన్నవే. కానీ, మధ్యవర్తులుగా ఉండాల్సినవారే తద్విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అనుమా నంతో ఇరువర్గాల మధ్య విశ్వాసం సన్నగిల్లడం విషాదం. అపనమ్మకం నిండినచోట భద్రతా దళాలైనా తగిన చర్యలు చేపట్టడం కష్టం. మణిపూర్ రైఫిల్స్ సహా రాష్ట్ర పోలీసు బలగాలు మైతైలకే మద్దతుగా నిలుస్తున్నాయని కుకీల భావన. మైతైలేమో కుకీ ప్రాబల్య పర్వత ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా గంజాయి సాగు చేస్తున్నా అస్సామ్ రైఫిల్స్ చూసీ చూడనట్టున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది చాలదన్నట్టు భద్రతాదళాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొంది. పారా మిలటరీ దళాలు తమ పనిలో జోక్యం చేసుకుంటున్నాయని పోలీసుల ఆరోపణ. వెరసి, పాలన మృగ్యమైన మణి పూర్లో నేటికీ రహదారులు సాయుధ మూకల నియంత్రణలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తతల్ని చల్లబరచడానికి పాలకుల వైపు నుంచి ఏ మాత్రం ప్రయత్నాలు జరుగుతు న్నాయంటే అనుమానమే. ఎంతసేపటికీ దీన్ని శాంతి భద్రతల సమస్యగానే వారు చూస్తున్నారు. అది పెద్ద చిక్కు. పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పదే పదే విఫలమైనా, కేంద్రం ఉపేక్షించింది. విద్వేషాగ్నిలో ఈశాన్యం కాలిపోతున్నా, మూడు వారాల పైచిలుకు తర్వాత కానీ హోమ్ మంత్రి అక్కడకు రాకపోవడం ఏ రకంగా సమర్థనీయం? కొన్ని వారాలుగా ఇలా ఉన్నా ప్రధాని తన రాజకీయ సభల్లో కానీ, ఇతరత్రా కానీ ఎక్కడా మణిపూర్ ఊసే ఎత్తలేదు. మాటల ద్వారా మనుషుల మధ్య మత్సరం తగ్గించాల్సిన వేళ పాలకులు మౌనముద్ర దాల్చడం విడ్డూరమే! గౌహతి హైకోర్ట్ రిటైర్డ్ ఛీఫ్ జస్టిస్ సారథ్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేయడం బాగానే ఉంది. కానీ, రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో శాంతి సంఘం ఏర్పాటుకు మాత్రం ఆదిలోనే హంసపాదు పడింది. పక్షపాత సీఎం సభ్యుడిగా ఉన్న కమిటీలో తాము ఉండబోమనేది కుకీ ప్రతినిధులు తేల్చేశారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో బీరేన్ ఆలోచించుకోవాలి. 2017లో తొలి విడత సీఎంగా ఎన్నికైనప్పుడు గిరిజనవాసులతో సన్నిహితంగా మెలిగిన ఆయన 2022లో రెండో విడత అధికారం చేపట్టాక వైఖరి మార్చారు. ప్రభుత్వస్థలంలో ఆక్రమణల పేరిట ఇంఫాల్‌లో చర్చిలతో సహా అనేకం కూల్చివేతకు ఆదేశించి, కుకీలకు కోపకారణమయ్యారు. సంఖ్యాపరంగా మైతైలున్నందున మెజారిటీ వాదాన్ని స్థానిక గిరిజన తెగలపై రుద్దుతున్నారనే భావన కలగడమూ సమస్యకు కారణమైంది. మైతైలకు ఎస్టీ హోదానిచ్చే అంశం పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్ట్ చెప్పింది సరే, ఆ వివాదా స్పద నిర్ణయంతో తెగల మధ్య అశాంతి నెలకొంటుందని ఊహించకపోవడం ప్రభుత్వ తప్పిదమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పర్యవసానాలు ఊహించి సంబంధిత వర్గాల మధ్య అపోహల్ని ముందే తొలగించడం కీలకం. పాలకులు అక్కడే విఫలమయ్యారు. అనుమానాలు పెను భూతాలై, పరిస్థితిని ఇంతదాకా తెచ్చారు. ఇంటర్నెట్పై నిర్బంధాల నేపథ్యంలో క్షేత్రస్థాయి వార్తలు సరిగ్గా తెలియకపోగా, అసలు కథ వదిలేసి దీన్ని రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రించే ఘోర తప్పి దాలూ సాగుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకోవాలి. అన్ని తెగలకూ రాజ్యాంగ రక్షణ ఉందన్న భరోసా కల్పించాలి. మూలన విసిరేసినట్టుగా ఉన్న ఆ ప్రాంతాలనూ, ప్రజలనూ పరాయి వారుగా చూసే ధోరణి మారాలి. అక్కడి విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను గౌర విస్తూ, దేశంలో తామూ భాగమనే అభిప్రాయం ఆ ప్రజల్లో కల్పించాలి. మరి, ఆ దిశగా శాంతి స్థాపనకు ఇకనైనా పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అన్నది మాటలకే పరిమితం కాదన్న నమ్మకం వివిధ తెగల మధ్య కల్పిస్తారా? -
పుస్తక మర్యాద
ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఆ పుస్తకాన్ని అపురూపంగా చూడటం వేరు. చాలామంది పుస్తకాలను అమర్యాదగా చదువుతారు. అంతే సమానంగా వాటిపట్ల అజాగ్రత్తగా ఉంటారు. పుస్తకాలను వాటి మర్యాదకు తగినట్టుగా గౌరవించడం కూడా ఒక సంస్కృతి! పుస్తకం పేజీలు తీయడం కూడా కొందరు సుతారంగా తీస్తారు; పేజీలు నలగకుండా దాన్నొక పువ్వులా హ్యాండిల్ చేస్తారు. కొందరు నీటుగా బుక్ మార్క్స్ సిద్ధం చేసుకుంటారు. కొందరు చదవడం ఆపిన చోట పేజీ కొసను చిన్నగా మడుచుకుంటారు. ఇక కొందరి పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి ఒక బీభత్సం జరిగివుంటుంది. అలాగని పుస్తకం చదువుతూ రాసుకునే నోట్సు దీనికి భిన్నం. అది పుస్తకంతో ఎవరికి వారు చేసుకునే వ్యక్తిగత సంభాషణ. కొందరు కేవలం అండర్లైన్ చేసుకుంటారు. కొందరు పుస్తకం చివర నచ్చిన పేజీ తాలూకు నంబర్ వేసుకుని దానికి సంబంధించిన వ్యాఖ్యో, పొడి మాటో రాసుకుంటారు. ఇలాంటివారికి పుస్తకంలో చివర వచ్చే తెల్ల కాగితాలు చాలా ఉపయుక్తం. పఠనానుభవాన్ని పెంపు చేసుకునేది ఏదైనా పుస్తకాన్ని గౌరవించేదే. అయితే, పుస్తకాన్ని గౌరవిస్తున్నారని చూడగానే ఇట్టే తెలియజేసే అతి ముఖ్యమైన భౌతిక రూప చర్య– దాన్ని బైండు చేయడం. ఈ బైండు చేయించడంలో, స్వయంగా తామే చేసుకోవడంలో కూడా ఎవరి అభిరుచి వారిది. అలాగే పుస్తకం తరహాను బట్టి కూడా ఇది మారొచ్చు. అలాగే బైండింగుకు వాడే మెటీరియల్, అది చేసే పద్ధతులు కూడా చాలా రకాలు. ఏమైనా బైండింగు కూడా దానికదే ఒక కళ. అది కొందరికి బతుకుదెరువు అనేది కూడా ఒక వాస్తవమే. కానీ ప్రపంచంలో గొప్ప బైండింగు కళాకారుల పనితనాన్ని తెలియజేసే పుస్తకాలు కూడా కొన్ని చోట్ల ప్రదర్శనకు ఉన్నాయి. పుస్తకం లోపల వ్యక్తమయ్యే భావాలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాలంటే ఆ బైండరు కూడా మంచి కళాకారుడు అయివుండాలి. ఫ్యోదర్ దోస్తోవ్స్కీ నవల ‘ద పొసెస్డ్’లో జరిగే ఈ ఆసక్తికర సంభాషణ పుస్తకాల పట్ల ప్రపంచం ఇంకా ఎక్కడుందో తెలియజేస్తుంది. ఈ నవలకే వాటి అనువాదకులను బట్టి ‘డెమన్ ్స’, ‘డెవిల్స్’ అని మరో రెండు పేర్లున్నాయి. జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, వాస్తవాల చేదును గ్రహించి, బండి బాడుగ కూడా ఇవ్వలేని స్థితిలో చివరకు తానే వదిలేసిన భర్త దగ్గరకు మళ్లీ చేరుతుంది మేరీ. బతకడానికి ఏదైనా మార్గం గురించి ఆలోచిస్తూ, ‘పోనీ పుస్తకాల బైండింగు చేస్తాను’ అంటుంది. అప్పుడు ఆమె భర్త, నవలలో అన్నివిధాలా సంయమనం కలిగిన మనిషి, ‘ఆదర్శాల్లోని’ నిగ్గును తేల్చుకున్న ఇవాన్ షతోవ్ ఆమె భ్రమలు తొలిగేలా ఇలా చెబుతాడు: ‘‘పుస్తకాలను చదవడం, వాటిని బౌండు చేయించడం అనేవి అభివృద్ధికి సంబంధించిన రెండు పూర్తి భిన్న దశలు. మొదట, జనాలు నెమ్మదిగా చదవడానికి అలవాటు పడతారు. దీనికి సహజంగానే శతాబ్దాలు పడుతుంది; కానీ వాళ్లు తమ పుస్తకాలను కాపాడుకోరు. వాటిని నిర్లక్ష్యంగా పడేస్తారు. పుస్తకాలను బైండు చేయించడం అనేది పుస్తకాల పట్ల గౌరవానికి సంకేతం; అది ప్రజలు పుస్తకాలను చదవడానికి ఇష్టపడటమే కాదు, వాళ్లు దాన్ని ఒక ప్రధాన వృత్తిగా భావిస్తున్నారని సూచిస్తుంది. రష్యాలో ఎక్కడా అలాంటి దశకు చేరుకోలేదు. యూరప్‌లో కొంతకాలంగా తమ పుస్తకాలను బైండింగ్ చేయిస్తున్నారు.’’ 1871–72 కాలంలో రాసిన ఈ నవలలో, సాహిత్యం అత్యంత ఉచ్చస్థితిని అందుకొందనుకునే రష్యా సైతం ఒక దేశంగా చదివే సంస్కతిలో వెనుకబడి ఉందన్నట్టుగా రాశారు దోస్తోవ్స్కీ. ఇంక మిగతా దేశాల పరిస్థితి? ఒక సమాజపు అత్యున్నత స్థితిని కొలవగలిగే ప్రమాణాలు అక్కడి కళలు, వాటి పట్ల జనాల వైఖరి మాత్రమే. దీనికి కూడా ఈ నవలలో దోస్తోవ్స్కీ ద్వారా సమాధానం దొరుకుతుంది. అప్పటి కాలానికి తనను తాను అభ్యుదయ రచయితగా భావించుకొనే పీటర్ వెర్కోవెన్ స్కీ ఇలా ఆవేశపడతాడు: ‘‘బానిసల (సెర్ఫులు) దాస్య విమోచన కంటే కూడా షేక్స్పియర్, రఫేల్ అధికోన్నతులని నేను ఘోషిస్తున్నాను; జాతీయత కంటే అధికోన్నతులు, సామ్యవాదం కంటే అధికోన్నతులు, యువతరం కంటే అధికోన్నతులు, రసాయన శాస్త్రం కంటే అధికోన్నతులు, దాదాపు మానవాళి మొత్తం కంటే అధికోన్నతులు; ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సమస్త మానవాళి సాధించిన ఫలం. నిజమైన ఫలం. బహుశా ఇంకెప్పటికీ సాధ్యం కానంతటి అత్యున్నత ఫలం!’’ అలాంటి ఒక కళోన్నత స్థితి లేని సమాజంలో తాను జీవించడానికి కూడా సమ్మతించకపోవచ్చునంటాడు వెర్కోవెన్ స్కీ. ఇది ఆర్ట్ అనేదానికి అత్యున్నత స్థానం ఇచ్చే సాంస్కృతిక కులీనుల అతిశయోక్తిలా కనబడొచ్చు. కానీ కళ అనేదాన్ని మినహాయిస్తే మన జీవితాల్లో మిగిలేది ఏమిటి? మహాశూన్యం. గాఢాంధకారం. అందుకే తమ జీవితాల్లో ఏదో మేరకు కళను సజీవంగా నిలుపుకొన్నవాళ్లు అదృష్టవంతులు. అది తమకు నచ్చిన సీరియళ్లను ఒక పుస్తకంగా కుట్టుకోవడం, తమకు నచ్చిన పుస్తకాలను బైండు చేయించుకోవడం కూడా కావొచ్చు. ఏ రూపంలో ఉన్న అతివాదాన్నయినా దాని మూలాలను, అది పాతుకుపోవడానికి దారితీసే పరిస్థితులను, ఒకప్పుడు తమ వర్గంవాడే అయినా కేవలం ఇప్పుడు ఆ వాదంలోంచి బయటపడ్డాడన్న కారణంగా చంపడానికీ వెనుకాడని మూక మనస్తత్వాన్ని–– ఒక శక్తిమంతమైన సూక్ష్మదర్శినిలో చూసినట్టుగా చిత్రించిన నవల ‘పొసెస్డ్’. విషాదాంతంగా ముగిసే ఈ సామాజిక, రాజకీయ వ్యాఖ్యాన నవల కూడా బైండు చేసుకుని దాచుకోవాల్సిన పుస్తకం. అదే అనితర సాధ్యుడైన దోస్తోవ్స్కీ లాంటి రచయితకు ఇవ్వగలిగే సముచిత మర్యాద! -
ఈ యుద్ధం ఓ వరం!
యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు. వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు. అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది. సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి. పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్‌గా మారింది. పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు. చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా? పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం. పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు. వీరి టీమ్‌లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్ కల్యాణ్. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్‌లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్‌ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది. అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం. వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్ ఏరియాలు గేమ్ ఛేంజర్స్‌గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బోరిస్ పతనావస్థకు అసలు కారణాలివే!
‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింద’ని నానుడి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఇది అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి ప్రధాని పీఠం వరకూ వెళ్లిన జాన్సన్ నిరుడు జూలైలో ఆ పదవి పోగొట్టుకోవటమే కాదు... గతవారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా సభాహక్కుల సంఘంతో అబద్ధాల కోరుగా ముద్రేయించుకున్నారు. ఎంపీగా తప్పుకున్నారు గనుక సరిపోయిందిగానీ, లేకుంటే ఆయన మూణ్ణెల్లపాటు దిగువ సభ నుంచి సస్పెండయ్యేవారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు నిజాయితీతో మెలగకపోతే, విశ్వసనీయతను ప్రాణప్రదంగా భావించకపోతే ఏ గతి పడుతుందో చెప్పడానికి జాన్సన్ ప్రస్థానం ఒక ఉదాహరణ. మనకు జాన్సన్ చేసింది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు. కానీ బ్రిటన్‌లో అది చెల్లుబాటు కాదు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో జాన్సన్ తన మిత్ర బృందాలతో విందుల్లో మునిగారన్నది ప్రధాన ఆరోపణ. ఆ కాలంలో దేశమంతా లాక్ డౌన్ అమల్లో వుంది. ప్రధానిగా 2020 మార్చి 23న లాక్డౌన్ విధించింది ఆయనే. మరో నాలుగు రోజులకు కరోనా వాతపడ్డారు కూడా. లాక్డౌన్ వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థి తులతో, కరోనా తీవ్రతతో జనం అల్లాడుతుంటే ఆ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చెలరేగాయి. కనీసం అప్పుడైనా ఆయన మేల్కొనివుంటే వేరేగా ఉండేది. కానీ విందులు జరగడం అబద్ధమని ఒకసారి, జరిగినా నిబంధనలు ఉల్లంఘించలేదని మరోసారి బొంకారు. పైగా పార్టీలోని తన వ్యతిరేకులనూ, దర్యాప్తు చేస్తున్న సభా హక్కుల సంఘాన్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశారు. లండన్ మేయర్‌గా ఉన్నకాలంలో జాన్సన్ ఓసారి అమెరికా వెళ్లారు. ఆయన్ను చూసిన ఒక పౌరుడు జాన్సన్‌ను దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దూకుడుగా ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌గా పొరబడ్డారట. ఇలా పొరబడిన పౌరుడెవరోగానీ ఇద్దరిలోనూ పోలికలు న్నాయన్నది వాస్తవం. భౌతికమైన పోలికల మాట అటుంచి తమకొచ్చిన అవకాశాన్ని దుర్వినియో గపర్చటంలో ఇద్దరూ ఇద్దరే. తోచినట్టు మాట్లాడటం, ఇష్టానుసారం వ్యవహరించటం ఇద్దరిలోనూ ఉంది. అమెరికాలో ట్రంప్‌ను దించటానికి ఎన్నికల వరకూ జనం వేచిచూడాల్సి వచ్చింది. కానీ పార్టీ గేటు వ్యవహారం గుప్పుమన్నాక జాన్సన్‌ను సొంత పార్టీయే దించేసింది. నిజానికి పార్టీ గేటు వ్యవహారం ప్రధానిగా జాన్సన్ వరసబెట్టి చేసిన నిర్వాకాలకు పరాకాష్ట. ఒక చట్ట ఉల్లంఘనలో పోలీసులు తనకు జరిమానా విధించారని నిరుడు ఏప్రిల్‌లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రధాని స్థాయి నేత జరిమానా చెల్లించవలసి రావటం దేశ చరిత్రలో అదే తొలిసారి. అయినా అందుకుగల కారణమేమిటో ఆయన చెప్పలేదు. ఈలోగా తన అధికారిక నివాసాన్ని విలాసవంతంగా మార్చడానికి చట్టవిరుద్ధంగా భారీ మొత్తం ఖర్చు చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇది చాల దన్నట్టు అత్యాచార ఆరోపణల్లో జాన్సన్‌కు సన్నిహితుడిగా ఉండే ఎంపీ అరెస్టయ్యాడు. ఆయన మిత్రబృందంలోని మరో మాజీ ఎంపీకి బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణ రుజువై శిక్షపడింది. ఆ తర్వాత ‘పార్టీ గేట్’ గుప్పుమంది. పర్యవసానంగా వరస సర్వేల్లో జాన్సన్ రేటు పడిపోయింది. ఆయనపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నట్టు వెల్లడైంది. దాంతో 40 శాతం మంది పార్టీ ఎంపీలు జాన్సన్‌ను పదవి నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నారు. అయినా పార్టీలో అవిశ్వాసం నుంచి గట్టెక్కారు. కానీ మాజీ ఎంపీపై ఉన్న కేసు గురించి తెలిసినా ఆయన్ను నెత్తినబెట్టుకున్నారన్న నిజాన్ని పార్టీ సభ్యులు సహించలేకపోయారు. అది తప్పేనని జాన్సన్ అంగీకరించినా లాభం లేక పోయింది. అంతవరకూ మద్దతుదార్లుగా ఉన్న అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ఆరోగ్యమంత్రి సాజిద్ జావేద్ వంటివారు నిరుడు జూలైలో తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు మంత్రులు సైతం వారి బాట పట్టడంతో జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా సభాసంఘం అభిశంసన కన్సర్వేటివ్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది వేచిచూడాలి. వచ్చే సోమవారం ఆ నివేదికపై జరిగే చర్చ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడక తప్పదు. నివేదికకు వ్యతిరేకంగా ఓటేయొద్దని పార్టీ ఎంపీలను బోరిస్ జాన్సన్ కోరు తున్నా, తన తప్పులకు మాత్రం పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. సరిగదా ఇదంతా ప్రతీకార రాజకీ యాల పర్యవసానమని చెప్పుకొస్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పడని నేతను ఎవ రైనా క్షమించగలరా? కన్సర్వేటివ్ పార్టీలో జాన్సన్ ఎదిగిన క్రమం అసాధారణమైనది. పాత్రికే యుడిగా ఉంటూ పార్టీలోకొచ్చిన జాన్సన్ 2008 నుంచి 2016 వరకూ రెండుసార్లు లండన్ మేయర్‌గా ఉన్నారు. పరిస్థితులు కలిసొచ్చి థెరిస్సా మే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2019లో ఆ పదవి చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్నందించారు. 1987 తర్వాత అంత పెద్ద మెజారిటీతో కన్సర్వేటివ్‌లు నెగ్గటం అదే తొలిసారి. ఒంటరి తల్లుల సమస్య మొదలుకొని స్వలింగ సంపర్కం, బ్రిటన్ వలసవాదం, బ్రెగ్జిట్ వరకూ సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చిన జాన్సన్ వంటివారిని కన్స ర్వేటివ్ పార్టీ నెత్తినపెట్టుకోవటం మొదటినుంచీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పోతూ పోతూ జాన్సన్ అంటించిన బురద నుంచి ఆ పార్టీ ఏనాటికైనా బయటపడగలదా అన్నది సందేహమే. -
మనం మారాల్సిందే!
గణాంకాలు వాస్తవ పరిస్థితికి సూచికలు. అనేక సందర్భాల్లో భవిష్యత్ దృశ్యాన్ని ముందుగా కళ్ళ ముందు నిలిపి, గాఢనిద్ర నుంచి మేల్కొలిపే అలారం మోతలు. భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనీ, అధిక రక్తపోటు సహా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికమవుతోందనీ తాజా దేశవ్యాప్త సర్వే వెల్లడించిన అంశాలు అలాంటివే. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ సర్వేలోని అనేక విషయాలు ఇటు ప్రజల్నీ, అటు ప్రభుత్వాలనూ అప్రమత్తం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు లాంటి జీవనశైలి వ్యాధులపై తక్షణ కార్యాచరణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మధుమేహం, అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ)పై అతి పెద్ద సర్వే ఇది. ఇందులో 2008 నుంచి 2020 మధ్యకాలంలో దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 ఏళ్ళు, ఆ పైబడిన వయసువాళ్ళను దాదాపు 1.13 లక్షల మందిని సర్వే చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులతో భారత వైద్య పరిశోధన మండలితో కలసి మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ సర్వేలో వెల్లడైన అంశాలు ఆందోళన రేపుతున్నాయి. 2017లో భారతీయుల్లో 7.5 శాతం మందికే మధుమేహం ఉండేది. 2021 నాటికి ఆ సంఖ్య 11.4 శాతానికి, మరో మాటలో 10.1 కోట్ల మందికి పెరిగింది. అలాగే 15.3 శాతం మంది, అంటే 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముందస్తు లక్షణాలతో జీవితం సాగిస్తున్నారు. అంటే ‘టైప్–2 డయాబెటిస్’ అన్న మాట. ఇక, దేశంలో 28.6 శాతం (25.4 కోట్ల మంది) సాధారణ స్థూలకాయంతో, 39.5 శాతం (35.1 కోట్ల మంది) ఉదర ప్రాంత స్థూలకాయంతో ఉన్నట్టు తేలింది. చెడ్డ కొవ్వు (ఎల్డీఎల్ కొలెస్ట్రాల్)తో 18.5 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారు. నూటికి 35.5 మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. అసాంక్రమిక వ్యాధులు దేశంపై ఎంతటి భారం మోపుతున్నాయో కనుగొనేందుకు గాను దేశంలోని ప్రతి రాష్ట్రాన్నీ అధ్యయనంలో భాగం చేసిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇది. దేశంలో ఎక్కువగా మధుమేహం ఉన్న రాష్ట్రాలు – గోవా (26.4 శాతం), పుదుచ్చేరి (26.3 శాతం), కేరళ (25.5 శాతం). అలాగే, షుగర్ వ్యాధిపీడితులు తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్లలో సైతం వ్యాధిపీడితుల సంఖ్య సర్రున పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం హెచ్చరిక. ముందుగా అనుకున్నదాని కన్నా భారత జనాభాలో మధుమేహం అధికంగా ఉందని ఈ సర్వేతో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. ‘ఇది గడియారం ముల్లు ముందుకు కదులుతున్న టైమ్ బాంబ్’ అని ఈ అధ్యయన సారథి అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి 11 మంది వయోజనుల్లో ఒకరిని మధుమేహం పీడిస్తోందని లెక్క. షుగర్‌తో గుండె పోటు, అంధత్వం, కిడ్నీల వైఫల్యం ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక సరేసరి. ఈ నేపథ్యంలో కాయకష్టం, క్రమబద్ధమైన జీవనశైలి ఉండే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, ఆధునిక జీవనశైలి నిండిన పట్టణాల్లోనే మధుమేహం ఎక్కువగా ఉందనేది ఈ అధ్యయన ఫలితం. ఇది ఓ కీలక సూచిక. మనం మార్చుకోవాల్సింది ఏమిటో చెప్పకనే చెబుతున్న కరదీపిక. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వగైరా వంశపారంపర్యం, ఆహారపుటలవాట్లు, జీవనశైలి ద్వారా వస్తాయనేది నిపుణుల మాట. జన్యుపరంగా కుటుంబంలోనే ఉంటే ఏమో కానీ, ఇతరులు మాత్రం తినే తిండి, బతికే తీరులో జాగ్రత్తల ద్వారా ఈ అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ వచ్చినా... జీవనశైలి మార్పులతో యథాపూర్వ ఆరోగ్యాన్ని పొందవచ్చు. వైద్యులు పదేపదే చెబుతున్న సంగతే తాజా అధ్యయనం సైతం తేల్చింది. ఈ మాటను ఇకనైనా చెవికెక్కించుకోవాలి. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు అనివార్యంగా జీవన శైలి మారింది. అది మన ఆహారపుటలవాట్లలో మార్పు తెచ్చింది. చివరకు తెలియకుండా మన ఆరోగ్యాన్ని మనమే బలిపెట్టుకొనే దశకు చేరుకున్నాం. అందుకే ఇకనైనా అనారోగ్యం తెచ్చే ఆహారపుటలవాట్లు, జీవనశైలి సహా అనేకం మనం మార్చుకోవాలి. మరోపక్క అందుకు తగ్గట్టు ప్రజల్లో చైతన్యం పెంచే బాధ్యత ప్రభుత్వాల పైనా ఉంది. అది ఈ అధ్యయనం చెబుతున్న పాఠం. అలాగే, దేశంలో ఆరోగ్య రక్షణ రంగంలో చేయాల్సిన ప్రణాళిక, చేపట్టాల్సిన చర్యలకు ఈ తాజా సర్వే ఫలితాలు మార్గదర్శకమే. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మధుమేహ ధోరణి ఒక స్థిరీకరణ దశకు చేరుకుంటే, అనేక ఇతర రాష్ట్రాల్లో అది పెరుగుతోంది. ఫలితంగా ఆయా రాష్ట్రాల తక్షణ చర్యలకీ అధ్యయనం ఉపకరిస్తుంది. మరోపక్క అన్నిచోట్లా, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులు మరింత అందుబాటులో ఉండేలా చూడాలి. ఫాస్ట్‌ఫుడ్ మోజు, సోమరితనం వల్ల పిల్లల్లోనూ జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న వేళ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ముఖ్యం. ఆరోగ్యకరమైన తిండి, శారీరక శ్రమ వల్ల టైప్–2 మధుమేహాన్ని నూటికి 60 కేసుల్లో తగ్గించవచ్చట. అందుకని ప్రభుత్వాలు పౌరసరఫరా వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు పంపిణీ చేసి, ప్రజలను ఆరోగ్యదాయక ఆహారం వైపు మళ్ళించవచ్చు. ప్రజల్ని అటువైపు ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలూ చైతన్యశీల పాత్ర పోషించాలి. ఈ జీవనశైలి వ్యాధులు జాతిని నిర్వీర్యం చేసి, అభివృద్ధిని కబళించే ప్రమాదం పొంచివుంది గనక తక్షణమే తగిన విధానాల రూపకల్పన అవసరం. పరిస్థితులు చేయి దాటక ముందే నష్టనివారణ చర్యలకు నడుంకట్టడం వివేకవంతుల లక్షణం. -
ఆలోచన రేపుతున్న ఆరోపణలు
నూరుపూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ అంటారు. కానీ, మనమిప్పుడు ఏ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా సహించలేని స్థితికి వచ్చేశామా? డిజిటల్, సోషల్ మీడియా విప్లవంతో జనం సమాచారం పంచుకోవడం నుంచి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ దాకా – సమస్తం మారిపోయిన వేళ ప్రభుత్వాల నియంత్రణ ఎంత? ప్రతి ఒక్కరికీ అందుబాటుతో మీడియా ప్రజాస్వామికీకరణతో పాటు విచ్చలవిడితనమూ పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ భారీ టెక్ సంస్థల బాధ్యత ఎంత? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ సోమవారం చేసిన సంచలన ఆరోపణలు ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తాయి. అమెరికన్ యూట్యూబ్ షో ‘బ్రేకింగ్ పాయింట్స్’కు డోర్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ భారత ప్రభుత్వానికీ, పాపులర్ సోషల్ మెసేజింగ్ వేదికకూ మధ్య కొనసాగుతున్న పోరులో కొత్త సంగతులను సోమవారం రాత్రి బయటపెట్టింది. రైతుల ఉద్యమ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పలు ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి పలు అభ్యర్థనలు వచ్చాయనేది ఆయన కథనం. అంతకన్నా ఆందోళనకరమైనవి ఏమిటంటే – ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేయిస్తామనీ, దేశంలోని సంస్థ ఆఫీసులపైన, ఉద్యోగుల ఇళ్ళపైన దాడులు చేయిస్తామనీ గద్దె మీది పెద్దలు బెదిరించారట. డోర్సీ చేసిన ఈ ఆరోప ణలు తీవ్రమైనవి. సహజంగానే ప్రభుత్వం ఆ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చింది. అంతమాత్రాన కేంద్రంలో గడచిన తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ హయాం సంప్రదాయ మీడి యాకైనా, సోషల్ మీడియాకైనా సవ్యంగా ఉందనుకోలేం. పత్రికలు, టీవీ ఛానళ్ళ నుంచి వెబ్సైట్లు, సోషల్ మీడియా దాకా అన్నిటినీ నయానో, భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్న తీరు కొత్తేమీ కాదు. కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళను బీజేపీ పెద్దలు, వారి మిత్రులు, ఆశ్రితులు హస్తగతం చేసుకోవడమూ బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ పెద్ద చేసిన ఆరోపణలు అసత్యమో, సత్యమో కానీ... అసహజమని మాత్రం అనిపించట్లేదు. తొమ్మిదేళ్ళ చరిత్ర చూస్తే నమ్మశక్యంగానే ఉన్నాయి. అదే సమయంలో ట్విట్టర్ సారథ్యం వదిలేసిన ఇంతకాలానికి డోర్సీ ఇప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారన్నదీ ఆలోచించాల్సినదే! ట్విట్టర్ పులు కడిగిన ముత్యం అనుకోలేం. పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన చరిత్ర దానిది. పారదర్శకత లేకుండా ఈ తోక లేని పిట్ట తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా సవాలక్ష. స్వయంగా డోర్సీ సైతం వివాదాలకు అతీతులేమీ కాదు. 2018లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన వివాదాస్పద పోస్టర్‌ను చేత ధరించిన ఘటన ఇప్పటికీ విశ్లేషకులకు గుర్తే. అలాగే, ఆయన హయాంలో ట్విట్టర్ తన అల్గారిథమ్ ద్వారా నచ్చినవారిని పెంచుతూ, నచ్చనివారిని తుంచుతూ నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సైతం అలాంటి కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. కొన్ని వార్తా కథనాలను నిరో ధిస్తూ, కొన్ని ఖాతాలను స్తంభింపజేశాక ఇలాంటి వేదికలకు ఇక తటస్థత ఎక్కడున్నట్టు? పారదర్శ కత, జవాబుదారీతనం లేనప్పుడు ట్విట్టరే కాదు... ఏ సోషల్ మీడియా వేదికకైనా పవిత్రత, గౌరవం ఏం ఉంటాయి? పాలకులను అవి వేలెత్తి చూపితే, మూడు వేళ్ళు వాటినే వెక్కిరిస్తాయి. అలాగని ఆ లోపాలే సందుగా... పాలక పక్షాలు, ప్రభుత్వాలు సోషల్ మీడియా సహా సమస్త భావప్రసార వేదికల పైనా స్వారీ చేస్తుంటే సమర్థించలేం. సోమవారం ఒకపక్కన ‘కోవిన్’ పోర్టల్ లోని పౌరుల సమాచారం అంగట్లో లభిస్తున్నట్టు బయటపడ్డ కొద్ది గంటల్లోనే, డోర్సీ సంచలన ఆరోపణలూ రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, వార్తలనైనా, వ్యాఖ్యలనైనా... నోటితో ఖండించడమే తప్ప సర్కార్ తన సమర్థత, నిర్దోషిత్వాలను నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం లేదు. నిజానికి, 2021 ఫిబ్రవరిలో సైతం దాదాపు 250 ఖాతాలనూ, ట్వీట్లనూ తొలగించమంటూ పాలకుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ట్విట్టర్ ప్రతిఘటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ తగిలించేసరికి, 2021 మే నెలలో తన కార్యాలయాలపై ఢిల్లీ పోలీసు దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఇలా రహస్యంగా, అడ్డగోలుగా సాగుతున్న ఈ సెన్సార్షిప్ డిమాండ్లపై కర్ణాటక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వం ఆరోపణల్ని తోసిపుచ్చడానికే పరిమితమైంది. ధ్రువీకృత జర్నలిస్టులు, వార్తా సంస్థల ఖాతాలు పోస్ట్‌లను సైతం స్తంభింపజేయమంటూ మన దేశం నుంచి ట్విట్టర్‌కు వస్తున్న డిమాండ్లే ఎక్కువట. 2021 ద్వితీయార్ధంలో మొత్తం 326 లీగల్ డిమాండ్లొస్తే, అందులో 114 మన దేశానివే. మొత్తం మీద పాలకులకు ప్రజా ఉద్యమాలు, ప్రతికూల వ్యాఖ్యలంటే దడ పుడుతున్నట్టుంది. రైతు ఉద్యమమైనా, రెజ్లర్ల నిరసనైనా సర్కార్ శైలి ఒకటే– ముందు ఉదాసీనత, తర్వాత అణచివేత. ప్రజాక్షేత్రంలో వ్యవహారం బెడిసి కొడుతోందనిపిస్తే – ఆఖరికి అత్యవసర కంటి తుడుపు కార్యాచరణ. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు. ట్విట్టర్ సహా అన్నీ జవాబుదారీతనంతో, స్థానిక చట్టాలకు కట్టుబడాలి. అదెంత ముఖ్యమో, బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అని పాలకులు గ్రహించడం అంత కీలకం. ఆ రెండూ జరగనంత కాలం ఇవాళ డోర్సీ... రేపు మరొకరు... పేరు మారవచ్చేమో కానీ, ఆరోపణల తీరు, సారం మారవు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్‌ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్‌ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్‌లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్‌లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్‌ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్‌ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్‌లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
ఉపేక్షించలేని ప్రదర్శన!
చూడడానికి అది ఆరు సెకన్ల వీడియోనే కావచ్చు. కానీ, సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టిన ఆ వివాదాస్పద వీడియో ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే పరిస్థితి తెచ్చింది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్వయంగా ఆమె అంగరక్షకులే పొట్టనపెట్టుకున్న ఘట్టాన్ని సమర్థిస్తూ రూపొందించిన ప్రదర్శన శకటం ఒకటి కెనడాలోని బ్రాంప్టన్ నగరవీధుల్లో తిరిగిన వైనం భారత్, కెనడాల్లో విస్తృత చర్చ రేపింది. వేర్పాటువాద ఖలిస్తాన్ మద్దతుదారుల ఈ శకట ప్రదర్శన ఏ రకంగా చూసినా ఆక్షేపణీయమే. భారత వ్యతిరేక వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు బలం పుంజుకుంటున్న వైనానికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణ. మన దేశ రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో కెనడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. క్షమాపణ కోరాయి. కెనడా సైతం వెంటనే విచారం వ్యక్తం చేసింది కానీ, ఆ మాట సరిపోతుందా? భారత్‌తో సత్సంబంధాలు కొనసాగాలని ఆ దేశం నిజంగా కోరుకుంటే, చేయాల్సింది చాలానే ఉంది. అమృత్సర్ స్వర్ణదేవాలయంలో దాగిన సిక్కు తీవ్రవాదుల ఏరివేత కోసం 1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వివాదాస్పద సైనిక చర్య ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు దిగడం, అనంతరం కొన్నాళ్ళకు సొంత బాడీ గార్డ్లే విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆమెను పొట్టనపెట్టుకోవడం చరిత్రలో మహా విషాదం. ఆపరేషన్ బ్లూస్టార్ 39వ వార్షికోత్సవ సందర్భాన రెండు రోజుల ముందే జూన్ 4న కెనడాలో ఈ 5 కిలోమీటర్ల ప్రదర్శన శకటాల కవాతు జరిగింది. ప్రదర్శనలు జరిపే స్వేచ్ఛ కెనడా ప్రభుత్వం తన పౌరులకు ఇవ్వవచ్చు. కానీ, ఆ శకటంపై సిక్కు గార్డులు తుపాకీలు ఎక్కుపెట్టగా, చేతులు పైకెత్తి, తెల్లచీరలో ఎర్రటి రక్తపు మోడుగా మారిన మహిళ (ఇందిర) బొమ్మ పెట్టి, ‘దర్బార్ సాహిబ్‌పై దాడికిది ప్రతీకారం’ అంటూ వెనకాలే పోస్టర్ ప్రదర్శించడం సహించ రానిది. దారుణహత్యను సైతం ప్రతీకారంగా పేర్కొంటున్న ఈ ప్రదర్శనను అనుమతించే సరికి పొరుగుదేశ ప్రధాని హత్యను సమర్థిస్తున్నవారిని కెనడా వెనకేసుకొస్తోందని అనిపిస్తుంది. పంజాబ్‌లో తీవ్రవాదం తారస్థాయిలో ఉన్నరోజుల్లో కెనడా, అమెరికా తదితర దేశాలు ఈ వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పించాయి. విదేశాల్లో స్థిరపడ్డ వేర్పాటువాదులు అక్కడ నుంచి భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తున్నారు. అక్కడ నుంచి రెచ్చగొట్టే ప్రకట నలు చేస్తూ, వేర్పాటువాదానికి నిధులు సమకూరుస్తూ, ఖలిస్తాన్ ఉద్యమానికి ఊపిరులూదు తున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయింది. భారత వ్యతిరేక రిఫరెండమ్‌లు, కార్యక్రమాలు జరపడమే కాదు... హిందూ ఆలయాలపై దాడులు, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాల్లో భారతీయులపై హింసాకాండ ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. ఈ ఏడాది బ్రిట న్లో భారత హైకమిషన్ కార్యాలయంలో ఖలిస్తానీలు పాల్పడ్డ భద్రతా ఉల్లంఘన ఘట్టం లాంటివి ఆందోళన పెంచుతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో తాజా శకట ప్రదర్శన పరాకాష్ఠ. చిత్రం ఏమిటంటే – భారత్‌లో, మరీ ముఖ్యంగా అమృత్‌సర్‌లో ఆపరేషన్ బ్లూస్టార్ స్మరణోత్స వాలు ఏళ్ళు గడిచేకొద్దీ హేతుబద్ధంగా మారాయి. పంజాబీలు పాత చేదు జ్ఞాపకాలను వెనక్కినెట్టి, చాలా ముందుకు వచ్చారు. శాంతిని కోరుకుంటున్నారు. అకాల్‌తఖ్త్ సైతం ఈ ఏడాది మాదక ద్రవ్యాలు, ఇతర సామాజిక రుగ్మతలతో సతమతమవుతున్న గ్రామాల్లో సంస్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. పంజాబ్‌లో పరిస్థితులు ఇలా ఉంటే, పరాయిగడ్డ మీది సిక్కులు వేర్పాటువాద ఉగ్రవాదానికి నారుపోసి, నీరు పెట్టాలనుకోవడం శుద్ధ తప్పు. కెనడాలో దాదాపు 2 శాతం జనాభా (దాదాపు 8 లక్షలు) ఉన్న సిక్కుల్ని ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ దేశ నేతలేమో ఖలిస్తానీల్ని లాలించి, బుజ్జగిస్తున్నారు. సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం సిక్కు ఓటర్లను ఆకట్టుకొనేందుకు గతంలో అధికారిక నివేదికల నుంచి ఖలిస్తానీ తీవ్రవాద ప్రస్తావనలను సైతం తొలగించిన రకం. 2018లో భారత పర్యటనకు వచ్చినప్పుడు గతంలో భారత మంత్రిపై హత్యా యత్నం చేసిన ఖలిస్తానీ నిందితుడితోనే కలసి ఫోటోలు దిగడం వివాదాస్పదమైంది. 1985 ప్రాంతంలో టొరంటో నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని ఖలిస్తానీ తీవ్రవాదులు పేల్చివేయగా, అందులోని 329 మందీ మరణించిన ఘటనను కెనడా నేతలు మర్చి పోయారా? ఆ మృతుల్లో అత్యధికులు కెనడియన్లే అయినా, ఓటుబ్యాంక్ లెక్కలతో దాన్ని ఇప్పటికీ భారతదేశానికి సంబంధించిన విషాదంగానే పరిగణిస్తున్న వైనాన్ని ఏమనాలి? పాలు పోస్తున్న పాము రేపు తమ చేతినే కాటు వేయదన్న నమ్మకం ఏముంది? ఇప్పటికైనా కెనడా కళ్ళు తెరవాలి. ప్రజాస్వామ్యం, బహుళ జాతీయతలకు తమ దేశం ప్రతీక అని జబ్బలు చరుచుకొంటూ ప్రజా స్వామ్యం, శాంతి, సౌభ్రాత్రం, చట్టబద్ధ పాలనపై భారత్‌కు తరచూ ఉపదేశాలిచ్చే ట్రూడో ముందు తమ పెరట్లో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలి. బోలెడంత భవిష్యత్తున్న భారత, కెనడా వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాల్లో కాలిముల్లుగా తయారైన ఖలిస్తాన్ లాంటి అంశాలపై నిర్ద్వంద్వమైన అవగాహనకు రావాలి. భారత విచ్ఛిన్నాన్ని కోరుతున్న శక్తులపై కఠినంగా వ్యవహరించాలి. మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో కెనడాపై దౌత్య, రాజకీయ ఒత్తిడి పెంచాలి. విద్వేషం వెదజల్లే వారిని నయానో, భయానో వంచాలి. ఒక్క కెనడాలోనే కాక వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ నిరసనలపై దృష్టి సారించి, విస్తృత దౌత్య వ్యూహంతో వాటిని మొగ్గలోనే తుంచాలి. ఇంటా, బయటా మరో ఆపరేషన్ బ్లూస్టార్ అవసరం రాకుండా చూడాలి. -
ఎదురుచూపులు
ధర్మం నాలుగుపాదాలా నడిచే రాజ్యంలో క్రమం తప్పకుండా వానలు కురుస్తాయని ప్రతీతి. ఇప్పుడు ధర్మం ఎన్ని పాదాలతో నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధర్మం ఎంత కుంటి నడక నడుస్తున్నా, ఈ భూమ్మీద చెట్టూ చేమా, పిట్టా పిచుకా, పశువులూ మనుషులూ మనుగడ సాగించాలంటే తప్పకుండా వానలు కురవాల్సిందే! ఈసారి వేసవి తన తీవ్రతను తారస్థాయిలో చూపుతోంది. ఎండలు మండి పడుతున్నాయి. సూర్యుడింకా నడినెత్తికి రాకముందే నడివీథుల్లో నిప్పులు చెరుగుతున్నాయి. రుతు పవనాలు ఇప్పటికే కేరళ తీరానికి చేరుకున్నాయి. నేడో రేపో ఇక్కడకూ చేరుకుంటాయి. వానలు కురిపిస్తాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం జనాలు చాతకాల్లా వానల కోసం ఎదురు చూస్తున్నారు. ఉక్కపోతలతో అల్లాడిన జనాలకు నాలుగు చినుకులే ఊరట! వాన చినుకుల కోసం నెర్రెలువారిన నేల ఆవురావురుమని ఎదురుచూస్తుంది. మన ప్రాచీన సాహిత్యంలో చాతక పక్షులు ఎదురుచూపులకు ప్రతీకలు. చాతక పక్షులు వాన చినుకుల నీటిని మాత్రమే తాగుతాయని, అందుకే అవి వానల కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటాయని పురాణ సాహిత్యం చెప్పేమాట! శాస్త్రీయ వాస్తవాలు మరోలా ఉన్నా, మన కవులు చాతకపక్షులను ఎదురుచూపులకు ప్రతీకగానే ఎంచుకున్నారు. ‘హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః/ కోకః కోకనదప్రియ ప్రతిదినం చన్ద్రం చకోరస్తథా/ చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో/ గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్య సౌఖ్యప్రదం’ అన్నారు ఆదిశంకరులు. తామరతూళ్లనే ఆహారంగా తినే హంసలు తామరలతో నిండిన సరోవరాల కోసం ఎదురుచూస్తాయి. వాన చినుకులను మాత్రమే తాగే చాతకాలు వానలు కురిపించే కారుమబ్బుల కోసం ఎదురుచూస్తాయి. వెన్నెలనే ఆహారంగా తీసుకునే చాతకాలు చంద్రోదయం కోసం ఎదురుచూస్తాయి. అలాగే అసలైన భక్తుడు పరమేశ్వరుడి సాన్నిధ్యం కోసం ఎదురుచూస్తాడట! శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారం దాల్చి భూలోకంలో పుట్టాడు. అప్పుడు వైకుంఠవాసులు శ్రీమహావిష్ణువు రాక కోసం లిప్త ఒక యుగంగా నిరీక్షించినట్లు దివాకర్ల వెంకటావధాని తన ‘కలి పరాజయము’లో వర్ణించారు. నిజానికి మనుషుల బతుకులే ఎదురుచూపుల మయం. బడికి వెళ్లే వయసులో సెలవుల కోసం ఎదురుచూపులు. కాలేజీ కుర్రకారుకు ప్రేమికుల కోసం ఎదురుచూపులు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూపులు. ఉద్యోగులకు నెలకోసారి వచ్చే జీతాల కోసం ఎదురుచూపులు. జబ్బుచేసి ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యుడి దర్శనం కోసం ఎదురుచూపులు. జీవితంలో సింహభాగం ఇలా ఎదురుచూపులతోనే గడిచిపోతుంది. ‘ఒకవేళ ఏవైనా ఎదురుచూపులు నెరవేరకపోతే ఆశ్చర్యపోవద్దు. దాన్నే మనం జీవితమంటాం’ అని ఆస్ట్రియన్ సంతతికి చెందిన బ్రిటిష్ మానసిక విశ్లేషకురాలు అనా ఫ్రాయిడ్ వ్యాఖ్యానించింది. జీవితంలో చాలా ఎదురుచూపులు ఉంటాయి. సాధారణంగా వాటిలో నెరవేరనివే ఎక్కువ! ఎదురుచూపులు నెరవేరినప్పుడు సంతోషాన్నిస్తాయి. నెరవేరని ఎదురుచూపులు నిరాశలో ముంచేస్తాయి. ‘ఈ లోకంలో మనుషులు భ్రమల్లో బతుకుతూ ఎల్లప్పుడూ ఏదో ఒకదాని కోసం ఎదురుచూస్తూనే ఉంటారు– ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోరికలతో సతమతమవుతుంటారు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో ఎవరి ఎదురుచూపులు వారికి ఉండనే ఉంటాయి. అయితే, సాహిత్యంలో ప్రేయసీ ప్రియుల ఎదురుచూపులకే అమిత ప్రాధాన్యమిచ్చారు మన కవులు. భావకవిత్వం సాహితీలోకాన్ని కమ్మేసిన కాలంలో మన కవులు ఊహాసుందరుల కోసం ఎదురుచూపులు చూస్తూ, వీసెల కొద్ది విరహగీతాలు రాశారు. ‘ప్రబల కష్ట పరంపరల్ ప్రతిఘటించి/ నిల్చిపోయితి నీకయి నేటివఱకు!/ ఈ నిరీక్షణ పరిణామ మేమి యగునొ?’ అని చివరకు శ్రీశ్రీ కూడా తన గీతపద్యాలలో ఎదురుచూపుల వగపును వడబోశారు. ‘చిన్ని చిన్ని చిన్ని చెట్ల/ వన్నె వన్నె వన్నె పూల/ ఏరి ఇంద్రచాప మట్లు/ కట్టినాను నీకు మాల/ కాని, ఇచటికి ప్రియురాల!/ నీవింకను రావదేల?’ అంటూ పఠాభి తన ‘నిరీక్షణ’లోని నిట్టూర్పులతో సెగలు రేపారు. అష్టవిధ నాయికలలో విరహోత్కంఠిత తన నాయకుని కోసం అనుక్షణం ఎదురుచూస్తూ, విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ‘భర్త ఆఫీసునన్ బందిౖయె పోయినన్/ ఎదురు తెన్నులు జూచు నింతి యిపుడు/... కాంతుడు రాకున్న క్షణము లుత్కంఠమ్మె/ భారాన క్షణములు కదలునెపుడు/... వేగిపోవును తన భర్త జాగుజేయ/నామె యందమైన కనులె యలసిపోవు’ అంటూ ఆధునిక విరహోత్కంఠితల ఎదురుచూపుల విరహతాపాన్ని కొనకళ్ల ఫణీంద్రరావు చమత్కారంగా రాశారు. ఆముష్మికుల ఎదురుచూపులు భగవత్ సాన్నిధ్యం కోసం కావచ్చు, విరహిణుల ఎదురుచూపులు తమ నాయకుల కోసం కావచ్చు, భావకవుల ఎదురుచూపులు ఊహాసుందరీమణుల కోసం కావచ్చు గాని, సామాన్యులు మాత్రం ఎప్పుడొస్తాయో తెలియని మంచిరోజుల కోసం ఎదురుచూపులు చూస్తుంటారు. నడివేసవిలో వానల కోసం ఎదురుచూస్తే, కొద్దిరోజులకైనా నాలుగు చినుకులు కురుస్తాయేమో గాని, సామాన్యులు మంచిరోజుల కోసం ఎన్నాళ్లు ఎదురుచూపులు చూడాలో ఎవరూ చెప్పలేరు. అయినా, జనాలు ఎంతో ఆశతో మంచిరోజుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. మనసులో ఆశల దీపాలు వెలుగుతున్నంత సేపూ ఎదురుచూపులు బాధించవు. ఎదురుచూపులు చూసే శక్తి కోసమైనా ఆశలను అడుగంటిపోకుండా కాపాడుకోవాలి. -
ది హోలీ మ్యానిఫెస్టో!
మేరే పాస్ మ్యానిఫెస్టో హై! ఎన్నికల కోసం చంద్రబాబు సకల శస్త్రాలు, అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అదనపు సైన్యాల కోసం రాయబారాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దగ్గర రామోజీరావు అనే ఓ మీడియా మాంత్రికుడున్నారు. అదే తరహా శిష్య పరమాణువుల్లాంటి ఇంకో ఇద్దరు ముగ్గురు మాంత్రికులున్నారు. ఇంకా చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ అనే సినీనటుడున్నారు. ఆ నటుడి బిల్డప్ కోసం ఓ మిలటరీ ట్రక్కు కూడా ఉన్నది. ఇటువంటి టక్కుటమారాలు చంద్రబాబు దగ్గర చాలా ఉన్నాయి. మరి జగన్మోహన్రెడ్డి దగ్గర ఏమున్నది? ‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అంటున్నారాయన. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ మ్యానిఫెస్టోలను ప్రకటిస్తాయి కదా! ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? తాజా వాగ్దానాలతో కూడిన సరికొత్త మ్యానిఫెస్టో కాదు. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాత మ్యానిఫెస్టో గురించి ఈ చర్చ. ‘ఇదిగో మేమిచ్చిన హామీలు... ఇదీ మేము అమలుచేసిన తీరూ– తెన్నూ’ అంటూ పాత మ్యానిఫెస్టోను ప్లకార్డులా పట్టుకొని ఆ పార్టీ బృందాలు ముందుకు కదలబోతున్నాయి. ఈ పని చేయడానికి ఏ పార్టీకైనా చాలా గుండె బలం కావాలి. భారత రాజకీయాల్లో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ ఇటువంటి సాహసానికి పూనుకున్న దాఖలాలు లేవు. చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ అటువంటి ఆలోచన కూడా ఉండదు. అలవిగాని హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత తదుపరి ఎన్నికల సమయానికి పాత మ్యానిఫెస్టోను మార్కెట్లో కనబడకుండా చేయడం తెలుగుదేశం ప్రత్యేకత. మొన్నటి ఎన్నికల సమయానికైతే దాన్ని పార్టీ వెబ్సైట్ నుంచి కూడా ఆ పార్టీ మాయం చేసింది. ఆరొందల హామీలతో కూడిన బృహత్కథామంజరి సదరు ఎన్నికల ప్రణాళిక! అంత గ్రంథాన్ని కూడా గుటకాయస్వాహా అన్నారు. తాను చేసిన వాగ్దానాలను గుర్తుచేసుకోవడం అంటే చంద్రబాబుకు తగని భయం. పాత మ్యానిఫెస్టో ఫోబియా ఉందాయనకు! కొత్తగా ఎన్నికల ముందు తయారుచేసే మ్యానిఫెస్టోల్లో ఇసుమంత కూడా సృజనశీలత లేకపోవడం తెలుగుదేశం ప్రత్యేకత. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన అనంతరం తెలుగుదేశం పార్టీ తయారుచేసిన ఎన్నికల ప్రణాళికలన్నీ కాపీ, పేస్ట్ వంటకాలే. రాబోయే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో నుంచి చిన్న టీజర్ అంటూ మొన్నటి మహానాడులో ప్రదర్శించిన పాచి పదార్థం హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును రాష్ట్రమంతటా వెదజల్లింది. జగన్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలను సైతం నిస్సిగ్గుగా పేర్లు మార్చి ప్రకటించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కనుక వారి మ్యానిఫెస్టో నుంచి ఓ రెండు స్కీములు తీసుకున్నారు. ఒకవేళ బీజేపీ గెలిచి వుంటే ఈ స్కీములను కచ్చితంగా తీసుకునేవారు కాదు. అప్పుడు బీజేపీ మ్యానిఫెస్టోనే కాపీ కొట్టేవారు. సినిమా ప్రపంచాన్ని కొంతకాలంపాటు ఫార్ములా జాడ్యం వెంటాడిన విషయం మనకు తెలిసిందే. ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, అందులో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్లున్నాయి, ఎన్ని మిల్లీమీటర్ల సెంటిమెంట్, ఎన్ని సెంటీమీటర్ల కామెడీ ట్రాక్ ఉన్నాయో లెక్కలేసుకుని సినిమాలు తీసేవాళ్లు. కానీ ఆత్మ లాంటి కథ సంగతి మాత్రం పట్టించుకునేవారు కాదు. చంద్రబాబు కూడా ఈ తరహా సక్సెస్ ఫార్ములా మ్యానిఫెస్టోల రూపకల్పనకు అలవాటుపడ్డారు. కనుక ఈ మ్యానిఫెస్టోలకు ప్రజా జీవితంతో సంబంధం ఉండదు. ప్రజల అవసరాలేమిటో, వారి ఆకాంక్షలేమిటో, వాటినెలా నెరవేర్చాలో అనే ఆలోచనా, వివేచన ఈ మ్యానిఫెస్టోల్లో ఉండదు. తమకు అధికారం కావాలి, అందుకోసం ఎన్ని వాగ్దానాలైనా చేయాలి. ఎంత పెద్ద పుస్తకమైనా అచ్చేయాలి. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి దాచేయాలి. ఇదీ చంద్రబాబు ‘సైకిల్’. మానవ సంబంధాల్లోంచి ఏరుకొని మట్టి పరిమళాలద్దిన అక్షరాలతో జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను రాసుకున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ని గుర్తు చేసుకోవచ్చు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటాడు తిలక్. ప్రజల కోసం తన అక్షరాలను అంకితం చేసిన తీరిది. జగన్మోహన్రెడ్డి తయారుచేసుకున్న మ్యానిఫెస్టో కూడా అంతే! తన సుదీర్ఘ పాదయాత్ర, ఓదార్పు యాత్రల్లో ఆలకించిన జనకోటి గుండెచప్పుళ్ళ సందేశం మ్యానిఫెస్టోలోని అక్షరాల్లో నిక్షిప్తమై ఉన్నది. ఆ అక్షరాలకు అందుకే జవాబుదారీతనం ఉన్నది. ఆ బాధ్యతతోనే పాత మ్యానిఫెస్టోను జనం ముందుకు వైఎస్సార్సీపీ తీసుకొస్తున్నది. ‘ఇదిగో ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చాము. మాకు ఎన్నికల పరీక్షలో 99 శాతం మార్కులు వేయండ’ని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి. మద్యనిషేధం, ఓపీఎస్ అనే రెండు విషయాల్లో చేయ గలిగిన మేరకు చేసినప్పటికీ, చెప్పినంతగా చేయనందున రెండు అరమార్కులు తగ్గించి, 99 శాతం వేయండని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా అక్కడక్కడా ఒకటో రెండో హామీలు ఇంకా మిగిలిపోయే ఉండవచ్చు. చేను కోసిన తర్వాత పరిగె మిగలడం సహజం. తమ ఇళ్ల స్థలాల హామీ అలాగే ఉండిపోయిందని జర్నలిస్టు సోదరులు గొణుగుతూనే ఉన్నారు. ఇటువంటి పరిగె ఇంకెక్కడైనా మిగిలిందేమో లోతుగా పరిశీలించే శక్తి ప్రజలకు ఉంటుంది. కనుక ఆ పార్టీ వారు అడుగుతున్నట్టు 99 శాతం కాకపోయినా 95 శాతమో, 90 శాతమో మార్కులు వేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. 86 శాతం మార్కులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి జనం నమ్మకాన్ని నిలబెట్టున్నందువలన ఆ మాత్రం ఇంక్రిమెంటు సహజంగానే ఉండవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ వారు పాత మ్యానిఫెస్టోను దాచిపెట్టినప్పటికీ జనం గుర్తుపెట్టుకుని 13 శాతం (23 సీట్లు) మార్కులే వేశారు. ఈసారి అమల్లో ఉన్న మ్యానిఫెస్టోను కాపీ కొడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినందు వలన ఇక భవిష్యత్తులో ఎన్నికల పరీక్ష రాయకుండా డీబార్ శిక్ష పడినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అమలుచేసిన మ్యానిఫెస్టోను జనం ముందు పెట్టి తీర్పు చెప్పవలసిందిగా జనాన్ని అభ్యర్థిస్తూ దేశ రాజకీయాల్లో జగన్మోహన్రెడ్డి ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసారి వైసీపీ ఎన్నికల విజయం తర్వాత మిగిలిన పార్టీల మీద ఆయా రాష్ట్రాల ప్రజలు మ్యానిఫెస్టో అమలుపై వివరణ కోరవచ్చు. ఇక ముందు ఏ పార్టీ కూడా ఈ జవాబుదారీతనాన్ని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. దాదాపు యాభయ్యేళ్ల కింద విడుదలైన సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ‘దీవార్’ చాలామంది చూసి ఉంటారు. ఆ సినిమా మర ఫిరంగిలా పేల్చిన డైలాగ్ ‘మేరే పాస్ మా హై’! ఇప్పటికీ ఆ డైలాగ్ జనంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఇకముందు రాజకీయ పార్టీలు పాత మ్యానిఫెస్టోలను దాచిపెట్టకుండా ‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అని ధైర్యంగా జనం తీర్పు కోరే పరిస్థితులు ఏర్పడితే స్వాగతించవలసిందే. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి ఒక కొత్త ట్రెండ్‌కు జగన్మోహన్రెడ్డి ఎందుకోసం శ్రీకారం చుడుతున్నారు? చేసిన హామీలను అమలుచేసి జవాబుదారీతనానికి టార్చ్ బేరర్‌గా నిలవాలని ఆయన ఎందుకు భావిస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచీ చేస్తున్న రాజకీయ ప్రసంగాల్లో ఒక తాత్విక భూమిక మనకు కనిపిస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అత్యవసరమని తన ప్రతి ప్రసంగంలో చెప్పేవారు. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన రాజ్యాంగం ఆధారంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. దేశంలోని సకల జనులకూ సామాజిక – ఆర్థిక న్యాయం జరగాలనీ, భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉండాలనీ, సమాన హోదా అందరికీ సిద్ధించాలనీ, సౌభ్రాతృత్వంతో అందరూ సమస్కంధులుగా నిలబడగలగాలనీ పేర్కొన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. పైపెచ్చు అసమానతలు పెరిగిపోయాయి. ఇందుకు కారణం రాజకీయ వ్యవస్థ మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం లభించడం, సమాన అవకాశాలు లభించడం వల్ల ఈ వర్గాల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అందువల్ల పేదలను మరింత పేదలుగా మార్చే విధానాలు మన దేశంలో అమలవుతున్నాయి. ఈ విధానాల్లో పూర్తిస్థాయి మార్పులను విజయవంతంగా తీసుకురాగలగాలి. అదే ‘ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ అవుతుంది. ప్రస్తుతం మనం పెత్తందారీ వర్గ ప్రయోజనాల పరిధిలోనే జరిగే ఫిరాయింపులనూ, అధికారం నిలబెట్టుకోవడాన్నీ, మ్యానిపులేషన్స్నూ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్‌గా భ్రమిస్తున్నాం. అసలైన ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ వ్యవస్థాగతమైన ప్రక్షాళనలోనే ఉన్నది. అయితే అదంత సులభసాధ్యం కాదు. పెత్తందారీ వర్గాల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. అవసరమైతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి రావచ్చు. అందుకు సిద్ధపడే మనోధైర్యం కావాలి. ప్రక్షాళన జరగాలంటే పరిపాలనలో పారదర్శకత పెరగాలి. అందుకు రాచమార్గం పాలనా వికేంద్రీకరణ. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన ఇంగ్లిషు విద్య, మెరుగైన వైద్యం లభించాలి. కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరికీ అవకాశాలు సమానంగా ఉండాలి. ధనికుల పిల్లలతో పోటీపడగల నైపుణ్య శిక్షణ పేద పిల్లలకు అందజేయగలగాలి. చిన్న రైతులకు కూడా వ్యవసాయాన్ని లాభసాటి చేయగల విధానాలను అనుసరించాలి. మహిళను సాధికారశక్తిగా మలచాలి. చిన్నతరహా పరిశ్రమలకు ఊతమిచ్చి మధ్యతరగతి పేదవర్గాల నుంచి నయా సంపన్నశ్రేణిని సృష్టించాలి. రాష్ట్ర సహజ బలాలను (వ్యవసాయం, సముద్ర తీరం) గుర్తించి పూర్తిస్థాయిలో వినియోగించుకోగలగాలి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ మార్గాలన్నింటిలో అడుగులు వేయడమే కాదు, పరుగులు తీయవచ్చని జగన్ సర్కార్ నిరూపించింది. ఈ పరుగులకు కరదీపికగా దారి చూపింది మాత్రం కచ్చితంగా ‘నవరత్న’ ఖచితమైన మ్యాని ఫెస్టోనే! ఇటువంటి మ్యానిఫెస్టోను అమలు చేయడం పెత్తందార్ల ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వాళ్లు కత్తి కట్టడంలో ఆశ్చర్యం లేదు. ఈ పెత్తందారీ కుట్రలపై పేదల్ని జాగృతం చేయడంలో కూడా జగన్ సర్కార్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్ఎంసీ తీరు మారాలి
దేశంలో వైద్య విద్య పర్యవేక్షణకు నెలకొల్పిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) భ్రష్టుపట్టిందనీ, దాని ప్రక్షాళన అసాధ్యమనీ పదమూడేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు చట్టమై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త సంస్థ పనిచేయటం ప్రారంభమైంది. పాత వ్యవస్థలోని లోపాలనూ, దోషాలనూ పరిహరించి కొత్త వ్యవస్థ వస్తున్నదంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఈ మూడేళ్లలో ఎన్ఎంసీ ఆచరణ సరిగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. కొత్త చట్టం వచ్చినప్పుడూ, కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడూ సంబంధిత రంగాల్లోనివారు నిశితంగా గమనిస్తారు. అవి తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా ఉన్నాయో లేదో తరచి చూస్తారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) పేరిట జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సిందేనన్న నిబంధనను బిల్లుపై పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు గట్టిగా వ్యతిరేకించారు. అలాగే ఫీజుల నిర్ణయం విషయంలోనూ ఆందోళన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది చట్టంగా మారింది. దాని సంగతలావుంచి కొత్త వ్యవస్థ అయినా పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? దేశవ్యాప్తంగా 38 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఈమధ్యే ఎన్ఎంసీ ప్రకటించింది. మరో వందకు పైగా వైద్య కళాశాలల్లో అనేక లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి గతంలో ఎంసీఐ సైతం ఇలాంటి తనిఖీలే చేస్తుండేది. చర్యలు తీసుకునేది. అయినా దానిపై ఎందుకు ఆరోపణలొచ్చేవో, అది ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో కొత్త వ్యవస్థ సారథులు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. వచ్చే నెలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలుంటాయి గనుక ఎన్ఎంసీ ముందుగానే వైద్య కళాశాలలను తనిఖీ చేయటం మెచ్చదగింది. గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఆ కళాశాలలకు కేటాయించిన సీట్లన్నీ రద్దుకావు. అవి సకాలంలో మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఎన్ఎంసీ పరిశీలించి అనుమతులు పునరుద్ధరిస్తుంది. అలాగే ఎన్ఎంసీ సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత కళాశాల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించే వెసులుబాటుంది. వైద్య కళాశాలలపై ప్రధానంగా బోధనా సిబ్బంది కొరత విషయంలోనే ఆరోపణలొస్తున్నాయి. రెసిడెంట్ డాక్టర్ల సమస్య సరేసరి. ఇక ఇత రేతర మౌలిక సదుపాయాల లేమి సైతం ఎన్ఎంసీ కన్నెర్రకు కారణమవుతోంది. వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల తీరుతెన్నులనూ, అక్కడి మౌలిక సదుపాయాల కల్పననూ మదింపు వేయటం చాలా అవసరం. అయితే ఆ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే మాత్రం ప్రయోజనం శూన్యం. వాస్త వానికి ఎన్ఎంసీ చట్టం–2019లోని సెక్షన్ 26(ఈ) ప్రకారం సంస్థకు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) కళాశాల తీరుతెన్నులపై ఇచ్చే మదింపు, ఆ కళాశాలకిచ్చే రేటింగ్ అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నెల మొదట్లో జారీ చేసిన కళాశాలల ఏర్పాటు, మదింపు, రేటింగ్ నిబంధనల్లోని సెక్షన్ 25 దీన్ని నీరుగారుస్తోంది. నిజానికి ఎన్ఎంసీ ఏర్పడింది మొదలు కళాశాలల మదింపు నివేదికల జాడే లేదు. సరిగదా అంతక్రితం ఎంసీఐ ఉన్నప్పుడు పొందుపరిచిన మదింపు నివేదికలు, రేటింగ్‌లు సైతం మాయమయ్యాయి. ఫలానా కళాశాలలో ఏ సదుపాయాలు లోపించాయో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందో, కాలక్రమంలో అది ఏయే అంశాల్లో మెరుగుపడిందో అందరికీ తెలియకపోతే ఎట్లా? ఇక ఆ తనిఖీల వల్ల సాధారణ విద్యార్థులకు ఒరిగేదేముంటుంది? విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో ఎన్ఎంసీ మదింపు నివేదికలు అందుబాటులో ఉంటే, కళాశాల పూర్వ చరిత్ర తెలిస్తే వారు మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేతప్ప కేవలం అది ప్రకటించిన ఫలితాన్నీ, దాని రేటింగ్‌నూ చూసి ఎలా సరిపెట్టుకుంటారు? ఈ చిన్న విషయం ఎన్ఎంసీకి తెలియదా? ఇలాంటి ధోరణి అటు కళాశాలలకు సైతం నష్టం కలిగిస్తుంది. రేటింగ్ సరిగా లేని కళాశాలలో స్వల్ప లోటుపాట్లు మాత్రమే ఉండొచ్చు. అవి సరిచేసుకునే స్థాయిలోనే ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి కళాశాలకు చెందినవారు మాత్రం ఆ లోపాలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారానికి దిగొచ్చు. విద్యార్థులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవటంతో ఆ కళాశాలపై అనాసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ఎంసీ తీరుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి చాన్నాళ్ల క్రితమే ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఐసీ మొన్న మార్చిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. తీరా ఈ నెల మొదట్లో నోటిఫై చేసిన నిబంధనలు గమనిస్తే సీఐసీ ఆదేశాలు బేఖాతరైనట్టు అర్థమవుతుంది. గతంలో పనిచేసిన ఎంసీఐ అవినీతిమయం అయిందని రద్దు చేస్తే, దాని స్థానంలో వచ్చిన ఎన్ఎంసీ కూడా అదే బాటలో సాగుతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే, పారదర్శకతకు పాతరేస్తే ఏమనాలి? ఇది సరికాదు. దేశంలోని ప్రతి వైద్య కళాశాలకు సంబంధించి ఎంసీఐ కాలంనాటి మదింపు నివేదికలు, రేటింగ్‌లతోపాటు ఎన్ఎంసీ గత మూడేళ్ల అంచనాలు సైతం అందరికీ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు మెరుగైన నిర్ణయం తీసుకొనేందుకు తోడ్పడాలి. -
అందీ అందని మేఘసందేశం
వాన రాకడ... ప్రాణం పోకడ చెప్పలేమంటారు. చిత్రంగా ఏటా నిర్ణీత సమయానికి వచ్చే తొలకరి చినుకుల రాకడ కూడా ఇప్పుడు దాదాపు అలాగే తయారవుతోంది. నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి అంతకన్నా ముందుగా మే 27 నాటికే ఋతుపవనాలు వస్తాయంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కొంతకాలం క్రితం అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 4 అంటూ కొత్త అంచనా చెప్పింది. తీరా అసలుకే లెక్క తప్పి, జూన్ 7 దాటినా చినుకు జాడ లేకపోవడం గమనార్హం. ఇక, తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం ‘బిప్రజయ్’ సైతం ఈసారి ఋతుపవనాలపై దుష్ప్రభావాన్ని చూపనున్నట్టు తాజా వార్త. అసలే వారానికి పైగా ఆలస్యమైన వానలకు ఇది ఊహించని అవరోధం. తొలకరి చినుకును శాస్త్రీయంగా అంచనా వేయడంలో తప్పుతున్నామా, లేక పర్యావరణంలో మార్పులతో పూర్తిగా లెక్కలే మారిపోతున్నాయా అన్నది ఇప్పుడు జవాబు వెతకాల్సిన ప్రశ్న. ఋతుపవనాలు వాతావరణ అంశమే కావచ్చు. కానీ భారత ఆర్థికరంగానికి అది అత్యంత కీలకం. దేశానికి ‘అసలైన’ ఆర్థికమంత్రి ఋతుపవనాలే అని ఓ మాజీ రాష్ట్రపతి గతంలో వ్యాఖ్యానించారు. దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతానికి పైగా అందించే నైరుతి ప్రాధాన్యానికి ఆ వ్యాఖ్యలే మచ్చుతునక. బిప్రజయ్ దెబ్బతో ఋతుపవనాలు బలహీనమై, వాటి రాకకు మరో 48 గంటలు పట్టవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. వరుసగా రెండు రోజులు లక్షద్వీప్, కేరళ, కోస్తా కర్ణాటకలో వానలు కురిస్తేనే ఋతుపవనాలు వచ్చినట్టు లెక్క. ప్రస్తుతం కేరళలో కురుస్తున్న వానలు వాయు గుండం ప్రభావంతోనేనట. పైగా నలుమూలల ఋతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పడుతుందంటున్నారు. కారణాలేమైనా – ఈ జాప్యంతో, బలహీనమైన వానలతో ఈ జూన్‌లో పడాల్సిన వర్షపాతం తగ్గడం అనివార్యం. దీర్ఘకాలిక సగటు (ఎల్పీఏ) వర్షపాతం కనీసం 20 శాతం తగ్గుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంటోంది. ఈ జాప్యాల నడుమ పొలం పనులు కనీసం వారం రోజులు వెనక్కి వెళ్ళకా తప్పదు. వెరసి ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. అసలే ఈ ఏడాదీ వేసవిలో ఎండలు దంచేస్తున్నాయి. ఉష్ణపవనాల తాకిడి ఉండనే ఉంది. ఫలితంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువుంటుందని స్కైమెట్ జోస్యం. కొద్ది నెలల క్రితమే చెప్పిన ఈ జోస్యం నిజమై, జూన్ – సెప్టెంబర్ల మధ్య సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిస్తే చిక్కులు తప్పవు. ఆసియాలోని మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మనం ఇరుకున పడతాం. వరి, చెరకు లాంటి పంటల దిగుబడి తగ్గి, ఆహార ధరలు అమాంతం పెరుగుతాయి. గమ నిస్తే – నిరుడు మార్చిలో శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతటి ఉష్ణోగ్రత, ఉడుకెత్తించిన ఉష్ణపవనాల వల్ల గోదుమల ఉత్పత్తి తగ్గింది. కొన్ని ఎగుమతులపై నిషేధం తప్పలేదు. ఈసారీ వ్యావసాయిక ఉత్పత్తులు తగ్గితే కష్టమే. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా హెచ్చి, ఖజానాపై భారం పడుతుంది. కోట్లాది సామాన్యులకు కడుపు నిండా తిండి కష్టమవుతుంది. నిజానికి, ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు మనకు నైరుతి ఋతుపవనాల కాలం. వార్షిక వర్షపాతంలో అత్యధికం ఈ సీజన్లో కురిసేదే. అందుకే, మన దేశంలో సాంస్కృతికంగానే కాక ఆర్థిక కాలపట్టికలోనూ ఈ ఋతుపవనాలు కేరళను తాకే రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. గత పదేళ్ళలో 2018లో, 2022లో ఋతుపవనాలు ముందుగానే వచ్చాయి. గత ఏడాది మే 29కే తొలికరి కురిసింది. అలాగే, గత దశాబ్దిలో అతి ఆలస్యంగా వానలు మొదలైంది 2019లో. ఆ ఏడాది జూన్ 8న కానీ పుడమి తడవలేదు. ఈసారి జాప్యంలో ఆ రికార్డు బద్దలవుతున్నట్టుంది. ఈ ఆలస్యా నికీ, ముందస్తుగానే ముగిసిపోవడానికీ ఎల్ నినో లాంటివి కూడా కారణమని శాస్త్రజ్ఞుల ఉవాచ. ఈ వాతావరణ మార్పుల మధ్య ఋతుపవనాల జోస్యం తప్పకూడదంటే, సమర్థంగా లెక్కలు కట్టాలి. ఐఎండీ పరిశోధకులు పదేళ్ళ పైగా శ్రమించి, ఏటా ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందని అంచనా వేసేందుకు కొత్త విధానం రూపొందించారు. కచ్చిత అంచనాలందించే విధాన రూపకల్పన కోసం 2012లో ఏర్పాటైన నేషనల్ మాన్సూన్ మిషన్ సైతం ఫలితమిస్తోంది. చారిత్రక విధానాలపై కాక, అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే పద్ధతిని అది ప్రవేశపెట్టింది. దానితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 వాతావరణ నమూనాలను పరిగణనలోకి తీసుకొని, విస్తృత సమాచారాన్ని సేకరించి, పరీక్షించి, దక్షిణాసియా వాతావరణానికి సరిపడే నాలుగైదింటిని ఖరారు చేసే శ్రమతో కూడిన పని సాగుతోంది. ఇక, 2016లో ఆమోదించిన కొత్త నిర్వచనాలు, పరామితుల ఆధారంగా ఐఎండీ ఋతుపవనాల రాకను మునుపటి కన్నా మెరుగ్గా అంచనా కట్టి ప్రకటిస్తోంది. ఇంత చేసినా ప్రతి జూన్‌లో కచ్చితమైన అంచనా కట్టలేకపోతున్న వానల వ్యవహారం చూస్తుంటే, మరింత లోతైన అధ్యయన అవసరం కనిపిస్తోంది. పరిశోధనలు పెరగాల్సిన అగత్యం అర్థమవు తోంది. వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌కు అంచనాల్లో కచ్చితత్వం కీలకం. దీనితోనే రైతులకు మార్గదర్శనం, పంటల సంరక్షణ వీలవుతుంది. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రత లతో ఇతర సముద్రాల కన్నా వేగంగా హిందూ మహాసముద్రం వేడెక్కుతోంది. ఫలితంగా భూ, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోతోంది. అంటే, రానున్న ఏళ్ళలో ఋతుపవనాలు మరింత జాప్యమవుతాయని విశ్లేషణ. మారుతున్న పర్యావరణంతో వాన, వాతావరణంపై కచ్చితమైన జోస్యం చెప్పడం సవాలే. కానీ, ఏ సవాలుకైనా శాస్త్ర విజ్ఞానం, సమగ్ర పరిశోధనలే పరిష్కారం కదా! -
చరిత్ర క్షమించని మహా నేరం
కొన్ని సంఘటనలు సమకాలీన చరిత్రను మలుపు తిప్పుతాయి. అనూహ్య పరిణామాలకు ఆరంభమవుతాయి. ఉక్రెయిన్‌లో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో మంగళవారం నాటి ఘటన అలాంటిది. దక్షిణ ఉక్రెయిన్‌లో నిప్రో నదిపై ఉన్న కీలకమైన నోవా కఖోవ్కా ఆనకట్ట పాక్షికంగా పేల్చివేతకు గురై, ఆ పక్కనే ఉన్న అణువిద్యుత్కేంద్రం ముప్పులో పడ్డ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడింది. రష్యా సాగించిన జీవావరణ తీవ్రవాద చర్య ఇది అని ఉక్రెయిన్ నిందిస్తుంటే, ఇది పూర్తిగా ఉక్రెయిన్ విద్రోహచర్య అని రష్యా ఆరోపిస్తోంది. ఈ నిందారోపణల్లో నిజానిజాలు ఏమైనా, ప్రపంచంలోనే అత్యధిక జలసామర్థ్యం ఉన్న డ్యామ్‌లలో ఒకటైన ఈ ఆనకట్టపై పడ్డ దెబ్బతో నీళ్ళు ఊళ్ళను ముంచెత్తి, వేల మంది ఇల్లూవాకిలి పోగొట్టుకున్నారు. లక్షలాది గొడ్డూగోదా సహా జనం తాగేందుకు గుక్కెడు నీరైనా లేక ఇక్కట్లలో పడ్డారు. అన్నిటికన్నా మించి ఉక్రెయిన్ ఇప్పుడు అణుప్రమాదం అంచున ఉందనే ఆందోళన కలుగుతోంది. ఈ డ్యామ్ పరిసర ప్రాంతాలు రష్యా నియంత్రణలోనే ఉన్నాయి. కానీ, డ్యామ్ ధ్వంసంలో తన పాత్ర లేదనేది రష్యా మాట. అది అంత తేలిగ్గా నమ్మలేం. ఇటీవల సరిహద్దు ఆవల నుంచి రష్యా భూభాగంపై దాడులు చేస్తూ, డ్రోన్లతో దెబ్బ తీస్తూ ఉక్రెయిన్ వేడి పెంచింది. ప్రతిగా రష్యా ఇప్పుడు శత్రుదేశం దృష్టిని మరల్చి, సుస్థిరతను దెబ్బతీసే ఎత్తుగడ వేసిందని ఓ వాదన. ఉక్రెయిన్‌కూ, ఆ ప్రాంతంలో వ్యవసాయానికీ కీలకమైన 5 అతి పెద్ద ఆనకట్టల్లో ఒకదానికి భారీ గండి పడేలా చేయడం అందులో భాగమే కావచ్చు. వ్యవసాయ, తాగునీటి అవసరాలకు కీలకమైన ఆనకట్టను ధ్వంసం చేసుకోవడం వల్ల ఉక్రెయిన్‌కు వచ్చే లాభమేమీ లేదు. నిజానికి, మునుపటి దాడుల్లో ఆనకట్ట నిర్మాణం బలహీనపడి ఉండవచ్చు. ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రష్యా ఆక్రమణదారులు రిజర్వాయర్‌లో నీళ్ళు అసాధారణ స్థాయికి చేరినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఉండవచ్చు. ఆ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడీ డ్యామ్ విధ్వంసమనేది ఒక కథనం. ఉక్రెయిన్ దళాలు దాడులు పెంచిన మర్నాడే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. శత్రువును వరదలతో ముంచెత్తడమూ తమ ఆయుధమేనంటూ గతంలో మాస్కో తన ఆలోచనను బయట పెట్టిన సంగతీ మర్చిపోలేం. దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా, ఉక్రెయిన్ సేనలను విడదీస్తున్న నిప్రో నదిపై ఈ ఆనకట్ట ఉంది. ఆహార ధాన్యాలు అధికంగా పండించే దక్షిణ మధ్య ఉక్రెయిన్‌లోని మెట్ట భూములకు సాగునీరు, రష్యా ఆక్రమిత క్రిమియా సహా అనేక భారీ నగరాలకు తాగునీరు ఈ రిజర్వాయరే అందిస్తుంది. నది దాటి ఇవతలకు వచ్చేందుకు యుద్ధంలో వ్యూహాత్మకంగానూ ఇది కీలకమైనదే. అందుకే, ఈ విధ్వంసం మానసిక పోరుకు మించినది. రిజర్వాయర్‌లో నీళ్ళన్నీ ఖాళీ అయితే పక్కనే జపొరీషియా అణువిద్యుత్కేంద్రానికి తగినంత నీటి సరఫరా జరగదు. ఇప్పటికే అందులో ఆరు రియాక్టర్లను మూసివేశారు కాబట్టి, చల్లబరిచేందుకు పొరుగునే ఉన్న కొలను నీరు సరిపోవచ్చు. అయినా సరే, ఆ అణువిద్యుత్కేంద్రాన్ని యుద్ధంలో అస్త్రంగా వాడరని చెప్పలేం. మరమ్మతులకు కనీసం అయిదేళ్ళు పట్టే ఈ ఆనకట్ట విధ్వంసం వల్ల దీర్ఘకాలిక మానవ, పర్యావరణ సంక్షోభం, సైనిక పర్యవసానాలూ తప్పవు. నదీగర్భంలో మిగిలిన చెర్నోబిల్ ప్రమాదం నాటి అణు వ్యర్థాలు వరదలతో మళ్ళీ పైకొచ్చే ప్రమాదమూ పొంచి ఉంది. నిజానికి, ఈ డ్యామ్‌పై దాడికి దిగకుండా రష్యాను హెచ్చరించాలనీ, దాడి జరిగితే అది అతి పెద్ద విపత్తుగా పరిణమిస్తుందనీ గత అక్టోబర్‌లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. డ్యామ్‌లో రష్యా సేనలు పేలుడు పదార్థాలు ఉంచాయని అప్పట్లో ఆయన అనుమానించారు. ఇప్పుడు డ్యామ్ విధ్వంసంతో ఏడాది పైచిలుకుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం మరింత సంక్లిష్టం కానుందని తేలిపోయింది. అలాగని ఉక్రెయిన్ సైతం తక్కువ తినలేదు. రష్యా నుంచి జర్మనీకి వెళ్ళే కీలకమైన నార్డ్ స్ట్రీమ్ సహజవాయు పైప్లైన్లపై నీటిలో పేలుళ్ళ ద్వారా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ బృందం దాడులు చేసింది. ఆ సంగతి అంతకు మూడు నెలల ముందే అమెరికా గూఢచర్య సంస్థకు తెలుసని తాజాగా బయటపడింది. అప్పట్లో సహజవాయు పైప్లైన్లు, ఇప్పుడు భారీ ఆనకట్ట... పరస్పర విధ్వంసంలో పైచేయి కోసం తపిస్తున్న రష్యా, ఉక్రెయిన్లు ఇలా ఎంత దాకా వెళతాయో! యుద్ధం ఎవరిదైనా, అందులో ఎవరి చేయి పైనా కిందా అయినా – చివరకు నష్టపోయేది ప్రజలే. యుద్ధం సాకుతో సాధారణ పౌరుల పైన, కీలకమైన ప్రాథమిక వసతి సౌకర్యాల పైన దాడులు ఏ రకంగానూ సమర్థనీయం కావు. అంతర్జాతీయ మానవతావాద చట్ట ఉల్లంఘనలుగా ఇవన్నీ యుద్ధ నేరాల కిందకే వస్తాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి అభ్యర్థించినట్టు ఇలాంటి దాడులు ఆగాలి. అంతర్జాతీయ చట్టాన్ని అంతా గౌరవించాలి. ఇప్పటికైనా రష్యా, ఉక్రెయిన్లు రెండూ ఈ నియమాలు పాటించడం అవసరం. ఇక, ఆనకట్ట విధ్వంసంతో డ్యామ్ నుంచి కనీసం 150 మెట్రిక్ టన్నుల చమురు లీకైందని పర్యావరణ మంత్రి మాట. పర్యావరణ రీత్యా ఆ ప్రాంతం కోలు కోవడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని నిపుణుల విశ్లేషణ. గత కొన్ని దశాబ్దాల్లో ఐరోపాలో అతి పెద్ద మానవ కల్పిత పర్యావరణ విపత్తు ఇదేనంటున్నది అందుకే! విషాదం ఏమిటంటే, 1986లో చెర్నోబిల్ అణుప్రమాదం బారిన పడ్డ గడ్డపైనే మళ్ళీ ఇలాంటి మహా విపత్తు సంభవించడం! అదీ మానవత మరిచిన యుద్ధంలో మనిషి చేజేతులా చేసింది కావడం! ఇది చరిత్ర క్షమించని మహా యుద్ధనేరం. మానవాళికి మరో శాపం. -
సమయం లేదు మిత్రమా!
ప్రపంచంలోని 175 దేశాలు... దాదాపు 1000 మంది ప్రతినిధులు... అయిదు రోజుల చర్చోప చర్చలు... ఎట్టకేలకు ప్రపంచ సమస్యకు పరిష్కారం దిశగా చిన్న ముందడుగు. మే 29 నుంచి జూన్ 2 వరకు ప్యారిస్‌లో ప్లాస్టిక్‌పై ఐరాస అంతర్ ప్రభుత్వ చర్చల సంఘం2 (ఐఎన్‌సీ–2) సమావేశంలో జరిగింది ఇదే. ప్లాస్టిక్ కాలుష్యభూతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవ్యాప్త ఒప్పందానికి చిన్నగా అడుగులు పడ్డాయి. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలండి’ అన్నది ఈసారి ప్రధానాంశమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిగా ముందు జరిగిన ఈ సమావేశం ఆ మేరకు ఆనందించదగ్గది, అయితే, నవంబర్‌లో నైరోబీలో జరిగే ‘ఐఎన్‌సీ–3’ నాటికి కేవలం ఆలోచనలు ఏకరవు పెట్టే చిత్తు ప్రతి తయారీనే ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకోవడం ఆశ్చర్యకరం. పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పసి ఫిక్ మహాసముద్రంలో కదులుతున్న కృత్రిమ ద్వీపంలా తయారైన వేళ ఇది అతి జాప్యమే. నిజానికి, వచ్చే 2024 చివర లోపల ప్లాస్టిక్ భూతంపై ఈ చర్చోపచర్చలు ముగించాల్సి ఉంది. అందులో భాగంగా తలపెట్టిన అయిదు సమావేశాల్లో తాజా ప్యారిస్ సమావేశం రెండోది. ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో జరిగిన తొలి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు విశ్వవ్యాప్త కార్యాచరణ కోరితే, మరికొన్ని దేశాలు జాతీయ పరిష్కారాలు కావాలన్నాయి. ఇంకొన్ని దేశాలు రెండూ కావాల్సిందే అన్నాయి. తీరా ఆరునెలల తర్వాత తాజా సమావేశంలోనూ తొలి రెండు రోజులూ ఉద్రిక్తత నడుమ వృథా అయ్యాయి. సహజంగానే ప్లాస్టిక్‌తో తమ ఆర్థిక అంశాలు ముడిపడ్డ చమురు, సహజవాయు, పాలిమర్ ఉత్పాదక దేశాలు ఏకాభిప్రాయం కుదరనివ్వక తమకు అనుకూల వాదనను ఎంచుకుంటూ, చర్చలను జాప్యం చేశాయి. ఎట్టకేలకు మూడో రోజున చర్చల రథం కొంత ముందుకు కదిలింది. ఆర్థిక ప్రయోజనాలు అర్థం చేసుకోదగినవే కానీ, వాటి కోసం ప్రపంచమే ప్రమాదంలో ఉన్నా పట్టదంటే ముమ్మాటికీ తప్పే. మానవాళికి ప్లాస్టిక్ పెనుభూతమే. ప్రపంచంలో ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. అందులో సగానికి పైగా ఉత్పత్తులు పరిమిత కాలం ఆయువున్నవే. ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్‌లో మూడింట రెండు వంతులను వ్యర్థాలుగా పారేస్తున్నారు. పది శాతం ప్లాస్టిక్కే రీసైక్లింగ్‌కు నోచు కుంటోంది. అతి కొద్దిభాగం ప్లాస్టిక్ వ్యర్థాలనే దహనం చేస్తున్నారు. అత్యధిక భాగం భూమిలో, జల వనరుల్లో, సముద్రాల్లో చేరిపోతున్నాయి. ఇది సమస్త జీవరాశికీ ముప్పు. ఇలా పేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం వచ్చే 2060కి మూడు రెట్లవుతుంది. అందులో అయిదోవంతే రీసైకిల్ చేయడా నికి వీలుంటుంది. ఇక, 2019లో ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 3 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల పాపమే. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఈ ప్రమాదాలపై తాజాగా అప్రమత్తం చేసింది. కొత్తగా మైక్రో ప్లాస్టిక్స్ మరో పెను ఆందోళన. చేపలు, బ్లూ వేల్ లాంటి సముద్రచరాలు రోజూ కోటి ముక్కల మైక్రో ప్లాస్టిక్‌ను పొట్టలో వేసుకుంటున్నాయి. వాటిని భుజిస్తున్న మన రక్తంలో, చనుబాలలో, చివరకు గర్భస్థ మావిలో సైతం చేరి, ఆరోగ్య సమస్యగా మారాయి. కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలంటున్న దేశాలకూ, వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే సరి అంటున్న దేశాలకూ మధ్య భేదాభిప్రాయాలు మరోసారి ప్యారిస్ సాక్షిగా బయటపడ్డాయి. మన దేశంతో సహా సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలూ నియంత్రణ చర్యలపై మెజారిటీ ఓటింగ్ కాక, ఏకాభిప్రాయం కావాలని పట్టుబట్టడం చిత్రం. లెక్కల్లో మన దేశ తలసరి ప్లాస్టిక్ వినియోగం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ మన మొత్తం జనాభా, అన్ని కోట్లమంది అవసరాలకై ప్లాస్టిక్ ఉత్పత్తి, తత్ఫలి తంగా వ్యర్థాలు మాత్రం ఎక్కువే. పైపెచ్చు, ఎప్పటికప్పుడు అది అధికమవుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రిస్తూ, కాలుష్యాన్ని మొగ్గలోనే తుంచేసే అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒడంబడిక ప్రపంచానికి ఇప్పుడు అవసరమంటున్నది అందుకే. ప్యారిస్ పరిణామాలు, అధిగమించా ల్సిన అడ్డంకుల్ని చూస్తుంటే ఆ ఒడంబడిక అంత త్వరగా వచ్చేలా లేదు. ఇవాళ్టికీ సామాన్య ప్రజలు తమ జీవితంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఆ వైఖరిని మార్చడం విశ్వ ఒడంబడికను మించిన సవాలు. అలాగే వచ్చే ఏడాది చివరకి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండే చట్టబద్ధమైన విశ్వవ్యాప్త ఒడంబడిక తెద్దామని యోచన బాగున్నా, అందుకు కట్టుబడి ఉండడం కీలకం. ఒప్పందంలోనూ శషభిషలు లేకుండా ప్లాస్టిక్‌పై కఠిన కార్యాచరణ మరీ కీలకం. అలాకాక, మునుపటి పర్యావరణ ఒప్పందాల్లా ఈ కొత్త ఒడంబడికనూ కాలయాపన వ్యవహారంగా, ధనిక దేశాలకు అనుకూలంగా మారిస్తే ఫలితం శూన్యం. వర్ధమాన దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. ప్యారిస్ సమావేశం ప్రారంభ చర్చల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నట్టు, ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు ఓ టైమ్ బాంబ్. తక్షణ చర్యలకు దిగకపోతే, పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ, యావత్ ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం. దీన్ని కేవలం వ్యర్థాల నిర్వహణ అంశంగానే చూస్తే ఇబ్బందే. కేవలం రీసైక్లింగ్కో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధానికో పరిమితం కాకుండా పాలు, నీళ్ళ నుంచి తిండి దాకా అన్నీ ప్యాకెట్లూ ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని మార్పించడంపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై త్వరపడాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పైనే బాధ్యత మోపే ఆలోచన చేయాలి. ముప్పు ముంచుకొచ్చిన వేళ ఆలసిస్తే ఆనక ఏ ఒడంబడి కైనా నిరుపయోగమే. మెక్రాన్ మాటల్లోనే చెప్పాలంటే... ఆట్టే సమయం లేదు మిత్రమా! -
‘బాలాసోర్’ కళ్లు తెరిపిస్తుందా?
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైళ్లు ఢీకొన్న ఘోర ఉదంతం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తోంది. ఇప్పటికీ అనేక కుటుంబాలు తమ ఆప్తుల ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్నాయి. 187 మృత దేహాలను ఇంకా గుర్తించాల్సివుందంటున్నారు. శుక్రవారం సంజె చీకట్లు అలుముకుంటున్న వేళ హౌరా నుంచి చెన్నైకి వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టడం, ఆ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఒకటి రెండు పక్క ట్రాక్‌పై పడడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు– హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం. మృతుల సంఖ్య 275 వరకూ ఉండగా, 1100 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం వందమంది వరకూ తీవ్ర గాయాలపాలైనవారున్నారు. విద్రోహ చర్యనో, సాంకేతిక తప్పిదమో ఇంకా నిర్ధారించాల్సే ఉన్నా ఆ దుర్ఘటన వందలాది కుటుంబాల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. అనేకులు శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. సహాయ బృందాలు వచ్చేలోగా స్థానికులు చూపిన చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇది విద్రోహ చర్య కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. కారకులెవరో కూడా తెలిసిందంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొట్టిపారేయ లేమన్నది రైల్వే అధికారుల మాట. చెప్పడానికి ఇది బాగానేవున్నా... ఆ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ విషయంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు వెల్లడించాలి. ఆ లేఖలోని అంశాలు భీతి గొలుపుతాయి. ఆ నెల 8న బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు బాలాసోర్‌లో కోరమండల్‌కు ఎదురైన లాంటి సమస్యే వచ్చింది. మెయిన్ లైన్లో పోవచ్చని వచ్చిన సిగ్నల్‌కు భిన్నంగా ట్రాక్ మారటాన్ని గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు.లేకుంటే అది కూడా పెను ప్రమాదంలో చిక్కుకునేది. మన దేశంలో అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరసగా పట్టాలెక్కుతున్నాయి. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయి. కానీ మన రైల్వేల పనితీరు అంతంత మాత్రమే. రోజూ మన రైళ్లు 2 కోట్ల 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 1950లో ఉన్న మన రైల్వే ట్రాక్‌ల నిడివి 53,596 కిలోమీటర్లయితే, ఇప్పుడది 68,100 కి.మీ.కి చేరుకుంది. అప్పట్లో మన రైల్వే ట్రాక్‌ల నిడివిలో సగం కన్నా తక్కువగా...అంటే 21,800 కి.మీ. మాత్రమే ఉన్న చైనాలో 1997 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరుకోగా, ప్రస్తుతం అది 1,55,000 కి.మీ ఉందని అంచనా. అంటే మనకు రెట్టింపు అన్నమాట. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా... దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. భద్రతా అంశాలు సరేసరి. తరచుగా రైళ్లలో ప్రయాణించేవారికి ఇవన్నీ నిత్యానుభవం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రైల్వే శాఖ కూడా దీనికి మినహాయింపు కాదు. మొన్న జనవరి గణాంకాల ప్రకారం ఆ శాఖలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా పడి వున్నాయి. వీటిల్లో చాలా పోస్టులు భద్రత, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే. సెంట్రల్ రైల్వేలో భద్రతకు సంబంధించిన విభాగంలో 28,650 పోస్టులుంటే అందులో సగం ఖాళీలే. కొత్త రైళ్లు వస్తున్నాయి. వాటి వేగం కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగినట్టుగా ట్రాక్‌లు ఉంటున్నాయా? సిబ్బంది పెరుగుతున్నారా? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వేగవంతమైన రైళ్లు వచ్చాయని సంబరపడుతున్నాం గానీ...ఇప్పటికీ మన రైళ్ల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు మించడం లేదు. దీన్ని అయిదేళ్లలో 75 కిలోమీటర్లకు పెంచుతామని 2017లో రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ అది కలగా మిగిలిందని ఇటీవలే కాగ్ అక్షింతలు వేసింది. జపాన్, చైనా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లలో రైళ్ల సగటు వేగం 150 – 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మన రైళ్ల సగటు వేగం నాసిరకంగా ఉన్నా భద్రతాపరంగా మెరుగైన స్థితిలో ఉండలేకపోతున్నాం. రైళ్లు పెరిగినా, వాటి వేగం పుంజుకున్నా అందుకు అనుగుణంగా ట్రాక్‌లు పెరగకపోవటం వల్ల ఉన్న ట్రాక్‌లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ట్రాక్‌ల నిర్వహణ, విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల పర్యవేక్షణ వంటివి సక్రమంగా సాగటం లేదు. మరమ్మత్తుల కోసం రైళ్లను ఆపాల్సి రావటంతో ‘సూపర్ ఫాస్ట్’ భుజకీర్తులు తగిలించుకున్న రైళ్లు కూడా సకాలంలో గమ్యం చేరటం లేదు. రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు. బాలాసోర్ ఉదంతం మన పాలకుల కళ్లు తెరిపించాలి. ఇతర సర్కారీ కొలువుల మాటెలావున్నా భద్రతకు అగ్ర ప్రాధాన్యమిచ్చి రైల్వేల్లో కొన్నేళ్ళుగా అలా ఉంచేసిన లక్షలాది ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. ఆదాయం తప్ప మరేమీ పట్టని ధోరణి ఇకనైనా మారాలి. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతకు ప్రాధాన్యం లాంటి అంశాల్లో రాజీ పనికిరాదు. -
రైలు పుస్తకం
ఈ దేశానికి స్వాతంత్య్రం రైలు వల్లే వచ్చిందంటే ఉలిక్కిపడవలసిన అవసరం లేదు. జూన్ 7, 1893 రాత్రి– సౌత్ ఆఫ్రికా డర్బన్ నుంచి ప్రెటోరియాకు గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మొదటి తరగతి టికెట్ ఉన్నా, అది ‘వైట్స్ ఓన్లీ క్యారేజ్’ కావడాన పీటర్మార్టిస్బర్గ్ అనే చిన్న స్టేషన్ లో కిందకు ఈడ్చేశారు. వివక్షతో కూడిన ఆధిపత్యం ఎంతటి క్రూరమైనదో గాంధీకి అవగాహన వచ్చిన సందర్భం అది. భారతదేశం వచ్చాక ఇక్కడ బ్రిటిష్‌వారి పాలనలో అంతకన్నా ఘోరమైన వివక్షను, ఆధిపత్యాన్ని దేశ జనులు అనుభవిస్తున్నారని ఆయనకు తెలియచేసింది రైలే. ‘మూడవ తరగతి పెట్టెల్లో విస్తృతంగా తిరిగాక ఈ దేశమంటే ఏమిటో అర్థమైంది’ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత స్వాతంత్య్ర సంకల్పం తీసుకున్నాడు. నిజానికి గాంధీ రైలు ప్రయాణాలే జనం చెప్పుకుంటారుగాని నెహ్రూ కూడా ‘నేను ఈ దేశాన్ని రైలులో తిరగడం ద్వారానే ఆకళింపు చేసుకున్నాను’ అని ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో రాసుకున్నాడు. ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’గా వాసికెక్కిన లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ రాజ్యం, పాలన బలపడాలంటే భారతదేశంలో రైళ్ల వ్యవస్థ సమర్థంగా విస్తరించాలని భావించాడు. అయితే డల్హౌసీ ఒకటి తలిస్తే దేశ జనులు మరొకటి తలిచారు. ఏనాడు కనని, వినని ప్రాంతాలను రైలు ద్వారా సగటు భారతీయుడు తెలుసుకున్నాడు. బహు జాతులతో, సంస్కృతులతో సంపర్కంలోకి వచ్చాడు. అలా మనదంతా ఒక జాతి, ‘భారత జాతి’ అనే భావన పాదుకొనడానికి, అందరూ ఏకమై బ్రిటిష్ వారిపై పోరాడటానికి మొదటి భూమికను ఏర్పరించింది ఈ దేశంలో రైలే. ‘భారతీయులు తమ పల్లెటూళ్లను రైల్వేస్టేషన్ లోకి తీసుకొస్తారు. పల్లెల్లో వాళ్ల ఇళ్లల్లోకి రానీయకపోవచ్చు. కాని పల్లె స్వభావం మొత్తం స్టేషన్ లో ప్రదర్శనకు పెడతారు’ అని అమెరికన్ ట్రావెల్ రైటర్ పాల్ థెరూ ‘ది గ్రేట్ రైల్వే బజార్’ (1975) పుస్తకంలో రాశాడు. నిజమే. గడ్డి మోపులు, ధాన్యం బస్తాలు, కోళ్ల గంపలు, కుండలు, గిన్నెలు, కట్టెలు, పాల క్యాన్లు, సైకిళ్లు, పనిముట్లు, అరుపులు, కేకలు, అక్కరలు, మక్కువలు... వారు స్టేషన్ కు తేనిది ఏమిటి? బండి ఎక్కించనిది ఏమిటి? ‘భారతదేశంలో రైలు కంపార్ట్మెంట్ అంటే ఇల్లే. అందులో ప్రతి ఒక్క ఇంటి సభ్యుణ్ణి చూడొచ్చు. రైలులో వారు అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నలుగానే ఎక్కువగా ప్రయాణి స్తారు. ప్రయాణికులుగా తక్కువగా మారుతారు’ అని మరొక పాశ్చాత్య రచయిత రాశాడు. దొరలు ఎక్కే ఈ పొగబండి జన సామాన్యానికి అందుబాటులోకి వచ్చాక కథ, కవిత, నవల, సినిమా, నాటకాల్లో దీని ప్రస్తావన లేకుండా సృజన సాగలేదు. భారతీయ రైళ్లను, వాటి కిటికీల గుండా కనిపించే దేశాన్ని మొదట రడ్యార్డ్ కిప్లింగ్ ‘కిమ్’ (1901) నవలలో రాశాడు. అయితే రైలును ఒక చారిత్రక సాక్ష్యంగా కుష్వంత్ సింగ్ మలిచాడు. మనో మజ్రా అనే చిన్న సరిహద్దు గ్రామంలో జనం ఒక ట్రైన్ ఆ ఊరి మీదుగా వెళితే నిద్ర లేస్తారు. మరో ట్రైను కూత వినిపిస్తే మధ్యాహ్నం కునుకు సమయం అని గ్రహిస్తారు. ఇంకో ట్రైన్ శబ్దం వచ్చాక రాత్రయ్యింది పడుకోవాలి అని పక్కల మీదకు చేరుతారు. 1947లోని ఒక వేసవి రోజు వరకూ వారి దినచర్య అలాగే ఉండేది. కాని ఆ రోజున వచ్చిన ఒక రైలు వారి జీవితాలను సమూలంగా మార్చేసింది. ఆ ఊరి వాళ్లు ఆ రైలు రాకతో హిందువులుగా, ముస్లింలుగా, సిక్కులుగా విడిపోయారు. ఆ తర్వాత? ‘ట్రైన్ టు పాకిస్తాన్ ’ నవల చదవాలి. రైలు ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ‘గాలి వాన’ అనే గొప్ప కథ రాశారు పాలగుమ్మి పద్మరాజు. మనుషుల ప్రాథమిక సంవేదనల ముందు వారు నిర్మించుకున్న అహాలు, జ్ఞానాలు, ఆస్తులు, అంతస్థులు, విలువలు గాలికి లేచిన గడ్డిపోచల్లా కొట్టుకుని పోతాయి అని చెప్పిన కథ ఇది. చాసో ‘ఏలూరెళ్లాలి’ కథ రైలు పెట్టెలోనే మనుగడ రహస్యాన్ని విప్పుతుంది. రైలు చుట్టూ ఎన్నో ప్రహసనాలు, పరిహాసాలు. తిలక్ రాసిన ‘కవుల రైలు’లో కవులందరూ ఎక్కి కిక్కిరిసిపోతారు. పాపం ప్లాట్‌ఫారమ్ మీద ఒక యువతి మిగిలిపోతుంది. ‘నీ పేరేమిటమ్మా’ అంటాడు స్టేషన్ మాస్టరు. యువతి జవాబు– ‘కవిత’! ‘షోలే అంత పెద్ద హిట్ ఎందుకయ్యింది’ అని ఎవరో అడిగితే ‘రైలు వల్ల’ అని సమాధానం ఇచ్చాడు అమితాబ్. ‘షోలే’ సినిమా రైలుతో మొదలయ్యి రైలుతో ముగుస్తుంది. అందులోని ట్రైన్ రాబరీ వంటిది ఇప్పటికీ మళ్లీ సాధ్యపడలేదు. ‘సగటు ప్రేక్షకుడికి రైలు కనపడగానే కనెక్ట్ అయిపోతాడు’ అని అమితాబ్ ఉద్దేశం. ‘ఆరాధన’లో రైలు కిటికీ పక్కన పుస్తకం చదువుకుంటున్న షర్మిలా టాగోర్‌ను, రోడ్డు మీద జీప్‌లో పాడుకుంటూ వస్తున్న రాజేష్ ఖన్నాను మర్చిపోయామా మనం? ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్– కదిలిపోతున్న రైలులోని హీరోను అందుకోవడానికి హీరోయిన్ పరుగులు– సూపర్‌హిట్ ఫార్ములా! అందుకే రైలు ఈ దేశ ప్రజల జీవనంలో అవిభాజ్యం. అంతేనా? రైలు ఈ దేశంలో ఎన్నో బరువుల, బాధ్యతల, మమతల, కలతల, కలల వాహిక. గమ్యంపై ప్రయాణికుడు పెట్టుకునే నమ్మకం. ‘చేరి ఫోన్ చేస్తారు’ అని కుటుంబం పెట్టుకునే భరోసా. బెర్త్‌పై నిశ్చింతగా ముసుగు తన్నే నిద్ర. దానికి దెబ్బ తగిలితే భారతీయుడు విలవిల్లాడతాడు. ‘నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. మృత్యుశకటం లాంటి రైలు కంటే ఎప్పటికీ రాని రైలు మేలైనది అనిపిస్తే ఆ నేరం ఎవరిది? -
బాబుగారి ఢిల్లీ యాత్ర!
‘‘ఏ తీరుగ నను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా!.... క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా...’’ ఈ భక్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే! తెలియక చేసిన నా తప్పుల్ని మన్నించి నా మీద దయ చూపమని శ్రీరామచంద్రుని చరణారవిందాల ఎదుట రామదాసు ప్రార్థి స్తాడు. సరిగ్గా ఇదే భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట ప్రకటించాలని మన చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి మోదీ దర్శన భాగ్యం కోసం, రామదాసు సన్నివేశం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పుడొకసారి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో మోదీకి చంద్రబాబు ఎదురుపడ్డారు. పూజకు వీలు చిక్కలేదు కానీ, హారతి కళ్లకద్దుకునేంత ఘడియ సమయం మాత్రం దొరికింది. అప్పుడాయన ప్రధాని వెళ్లే మార్గం పక్కన తొంభై డిగ్రీల లంబకోణంలో నిలబడి ఉన్నారు. వరుసగా అందర్నీ పలకరించినట్టే సీనియర్ నాయకులైన బాబును కూడా ప్రధాని పలకరించారు. వెంటనే తన మనసు లోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. ‘మీరు ఏకాంత సమయమిస్తే చాలా విషయాలు మనవి చేసుకుంటాన’ని సిగ్గుపడకుండా అడిగేశారు. సరే చూద్దామంటూ ప్రధాని వెళ్లిపోయారు. అప్పటినుంచి ప్రధాని ఏకాంత సేవకు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని బాబు ఎదురు చూడని క్షణం లేదు. ఈమధ్య బాహాటంగానే ప్రధాని గుణగణాలను ప్రస్తుతించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మామూలుగా పొగడలేదు. శ్రీ రఘువీర గద్యానికి ఇంచుమించు సరిసాటిగా భజించారు. అదేమిటి... ఎన్నికలకు ముందు ప్రధానమంత్రిని అన్ని బూతులు తిట్టిన నోటితోనే ఎలా పొగుడుతున్నారనే అనుమానం ఎవరికైనా వస్తే వారు అమాయకుల కిందే లెక్క! చంద్రబాబులో ఉన్న చతుష్షష్టి కళల గురించి అవగాహన లేనివారికిందే లెక్క! రంగు మార్చుకొని ఊసరవెల్లి కావడం తొండకు మాత్రమే తెలుసా? ఆయనక్కూడా తెలుసు. గోడ మీద కూర్చొని ఎటు కుదిరితే అటు దూకడం పిల్లి మాత్రమే నేర్చిన విద్యా? ఆయన కూడా నేర్చారు. అందువల్ల ఆయన ఏం చేసినా ఆశ్చర్యపడకూడదు. నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం, బాబు రాజకీయంలో నీతి కోసం వెతకడం – రెండూ అవివేకమైన పనులే. ఇన్నినాళ్లు వేచిన బాబు హృదయం శనివారం నాడు ఎగసిఎగసి పడిందట. అదే ఊపులో ఢిల్లీకి ఆయన ఎగిరివెళ్లారు. ప్రధానమంత్రి మోదీతో, అమిత్ షాతో చంద్రబాబు సమావే శాలను ఏర్పాటు చేయడం కోసం ఆయన లాబీయిస్టులు రెండు మూడేళ్లుగా చేయని ప్రయత్నం లేదు. అయినా ఖరారు కాని అపాయింట్మెంట్ కొన్ని ‘అదృశ్యశక్తుల’ ఎంట్రీతో ఎట్టకేలకు ఖరారైందట! ఈ మేరకు శనివారం రాత్రి అమిత్ షాను చంద్ర బాబు కలిశారు. మోదీ టైమ్ కోసం ఇంకా ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఒడిషాలో జరిగిన ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ అపాయింట్మెంట్ విషయం ఏమవుతుందో చివరిదాకా చెప్పలేము. కానీ, ఇన్నాళ్లు బాబుకు టైమివ్వని బీజేపీ నాయకత్వం ఇప్పుడెందుకు ఇచ్చినట్టు? చక్రం తిప్పిన అదృశ్యశక్తులెవరు? ఇప్పుడు ఢిల్లీ తెలుగు సర్కిల్స్‌లో ఇదే చర్చనీయాంశం. బీజేపీ కేంద్ర నాయకత్వంతో బాబు చర్చించాలనుకున్న రాజకీయ ఎజెండాకు తోడు ఇప్పుడొక అత్యవసర కర్తవ్యం వచ్చి పడింది. తనకూ, తన పార్టీకీ, యెల్లో కూటమికీ సారథిగా, సచివునిగా భావించే రామోజీరావు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడా యన్ను చిక్కు ల్లోంచి బయట పడేయడానికి ప్రయత్నించడం బాబుకు తక్షణా వసరం. ఈ కర్తవ్య నిర్వహణ కోసమే ‘అదృశ్య శక్తులు’ కూడా సహకరించాయని సమాచారం. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం – 1982ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నది. చట్టం ప్రకారం ఏ బ్రాంచి పరిధిలోని చందాదారుల సొమ్ము ఆ బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులోనే డిపాజిట్ చేయాలి. అలా చేసినట్లయితే జనం సొమ్ముతో సొంత వ్యాపారం చేసుకోవడం కుదరదు గనుక మార్గదర్శి సంస్థ ఆ చట్ట నిబంధనల్ని పాటించడం లేదు. ఆ నిబంధనల్ని పాటించాల్సిందేనని ఏపీ చిట్స్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో గత డిసెంబర్ నుంచి కొత్త చిట్స్‌ను సంస్థ నిలిపివేసింది. దాంతో మనీ రొటేషన్ లేక చిట్ పాడుకున్న వారికి డబ్బులు చెల్లించలేకపోతున్నది. ఇప్పటికే పలువురు చందాదారులు సీఐడీకి ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. చందాదారుల హక్కుల పరిరక్షణ కోసం మార్గదర్శి చరాస్తులను అటాచ్ చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని సీఐడీ కోరింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చిట్‌ఫండ్స్ ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు, మ్యూచువల్ ఫండ్స్‌లో దాని పెట్టుబడులు కలిపి 739 కోట్లను అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయాన్ని న్యాయస్థానానికి నివేదించి తదుపరి చర్యలను చేపట్టడానికి సీఐడీ సన్నాహాలు చేసుకుంటున్నది. మరోపక్క సీఐడీ నోటీసులకు స్పందించకుండా, దానికి సమాచారం ఇవ్వకుండా మార్గదర్శి ఎమ్డీ శైలజా కిరణ్ అమె రికా పర్యటనకు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరో తేదీన విచారణకు హాజరు కావలసిందేనని సీఐడీ మరో నోటీసు ఇచ్చింది. ఇప్పటికే మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో చట్టాన్ని అతిక్రమించి తలబొప్పి కట్టించుకున్న రామోజీ, చిట్‌ఫండ్స్ రచ్చతో తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్టయింది. దాంతో చివరి ప్రయత్నంగా మంచమెక్కి ఆపసోపాలు పడుతూ తన పరిస్థితి కాలమహిమో, జగన్ మహిమో తెలియట్లేదని చెబుతూ వీడియోలను విడుదల చేయించుకున్నారు. ఆయన ఆశించినట్టుగా ఎక్కడా ఇసుమంత సానుభూతైనా వ్యక్తం కాలేదు. అయినా మోసానికి బలైన వాడిని చూస్తే అంతో ఇంతో సానుభూతి వ్యక్తమవుతుంది గానీ మోసం చేసినవాడిని చూస్తే సానుభూతి ఎందుకు వస్తుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడో రామోజీ! ఇప్పుడాయనకు గజేంద్ర మోక్షం లాంటి వరం కావాలి. ఎలా? తన దగ్గరికి శ్రీహరి రాడు. తాను వైకుంఠానికి వెళ్లలేడు. అందుకని తన దూతగా శిష్యుడు చంద్రబాబును పంపించాలని నిర్ణయించారట! బాబు మొఖం చూడటం ఇష్టంలేని నాయక ద్వయాన్ని ఒప్పించడానికి తన యాభయ్యేళ్ల నెట్‌వర్క్‌లను వాడి ఉంటారు. స్వామికార్యంతో పాటు స్వకార్యం అనుకుంటూ రెండు దస్త్రాలను వెంటబెట్టుకుని బాబు బయల్దేరారు. చట్టాన్ని ఉల్లంఘించిన విషయంలో కేంద్రం చేయగలిగే సాయం ఏమీ ఉండదన్న సంగతి రామోజీకి తెలియంది కాదు. ‘కానూన్ కే హాథ్ లంబే హోతే హై’ అన్న మాట కూడా ఆయన వినలేదని అనుకోలేము. అయినా ఏదో ఆశ! మిణుకు మిణుకుమంటున్నది. అమిత్ షా భేటీలో పనిలో పనిగా తన ముందస్తు ‘వేడుకోలు’ ప్రార్థన కూడా చంద్రబాబు చేసినట్టు భోగట్టా. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాల్లో ఇప్పటికే దొరికిపోవడం, రాజధాని భూ కుంభకోణంలో దొరికిపోయే పరిస్థితులు ఉండటంతో ఆయన తీవ్ర ఆందోళన పడుతున్నారని తెలుస్తున్నది. ఇక రెండో దస్త్రం సంగతి. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి జనసేనతోపాటు బీజేపీ కూడా తన వెంట ఉండాలని బాబు వాంఛ. ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఆయన వరసగా చేయించుకుంటున్న సర్వేల్లో జగన్మోహన్రెడ్డి ప్రజామోదం ఎప్పుడూ 53 శాతానికి తగ్గడం లేదు. టీడీపీ, జనసేనలకు కలిపి చూసినా ఇంకా పదమూడు శాతం మైనస్‌లో ఉంటున్నారు. ఈ గణాంకాల్ని బట్టి చూస్తే వీరికి బీజేపీ తోడైనా కూడా ఫలితాల్లో పెద్ద మార్పేమీ రాదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ వెంట ఉంటే ఇప్పటికే తాము ప్రారంభించిన విషప్రచారాలను ఇంకా ఉద్ధృతం చేయవచ్చు. 2014 లాగా ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవచ్చని టీడీపీ ఆరాటపడుతున్నది. ఇది మబ్బుల్లో నీళ్లను చూసి విత్తనాలు వేసుకోవడమే! అయినా అంతకు మించిన తరుణోపాయం టీడీపీ దగ్గర లేదు. బీజేపీ ఆలోచనలు భిన్నంగా సాగుతున్నాయని తెలుస్తు న్నది. ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీ చేసినా ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఓడించడం సాధ్యం కాదన్న అంచనాకు బీజేపీ వచ్చింది. మరోపక్క టీడీపీ సంస్థాగతంగా బాగా బలహీనపడింది. నాయకత్వ ప్రతిష్ఠ అట్టడుగు స్థాయికి చేరు కున్నది. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆ పార్టీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. ఈ పరిస్థితినే బీజేపీ కోరుకుంటున్నది. టీడీపీ పతనమైతేనే ప్రతిపక్షంగా తాము ఎదుగు తామని అది ఆలోచిస్తున్నది. జనసేన కూడా తమతో ఉంటే ఉమ్మడిగా 29 ఎన్నికల నాటికి వైసీపీకి బలమైన ప్రత్యామ్నా యంగా నిలవొచ్చని భావిస్తున్నది. ఒకవేళ జనసేన బాబుతోనే వెళితే ఎన్నికల తర్వాత ఇద్దరూ కోలుకునే పరిస్థితి ఉండదు. అప్పుడు ఒంటరిగానైనా సరే ఎన్నికల తర్వాత ప్రతిపక్షంగా తామే నిలబడగలుగుతామని బీజేపీ నాయకత్వం ఆలోచనగా చెబుతారు. అయితే రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు అనుకూల సెక్షన్ కొంత ఉన్నది. వీరికి కేంద్రం నుంచి ఆశీస్సులు అంద జేస్తున్న నాయకులు కొందరున్నారు. వీరందరూ టీడీపీ లాబీయిస్టులకు సహకరిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ మీద దక్షిణాది ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో గెలిస్తేనే కర్ణాటక గాయం మానుతుందని భావిస్తున్నది. కానీ ఇందుకు విరుద్ధంగా తెలంగాణ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి చేరికలు దాదాపుగా ఆగిపోయాయి. కాంగ్రెస్‌లో కొంత కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ముందు బాబు ఒక ప్రతిపాదన ఉంచారు. తెలుగుదేశంతో అలయెన్స్ కుదిరితే హైదరాబాద్ సిటీ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ పరిస్థితి మెరుగ వుతుందని కొన్ని కాకిలెక్కలు తయారు చేసినట్టు సమాచారం. అలయెన్స్ కారణంగా బీజేపీలో చేరికలు కూడా పెరిగి ఒక ఊపు వస్తుందనీ, ఎల్లో మీడియా సంపూర్ణ సహకారం కూడా బీజేపీకి లభిస్తుందనీ చంద్రబాబు, అమిత్ షాతో చెప్పినట్టు తెలిసింది. అంతేకాకుండా ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా గోడ దూకించేందుకు కూడా సహకరించగలనని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. టీడీపీ అలయెన్స్ ప్రతిపాదనను గతంలోనే రాష్ట్ర బీజేపీ నాయ కులు తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చిన వాతావరణ మార్పును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు ఎత్తులు వేస్తున్నారు. అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌లో సింహాన్ని ఎదుర్కోవడానికి కలిసివచ్చే తోడేళ్ల కోసం ఆయన అన్వేషణ సాగుతూనే ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
గండం గట్టెక్కిన అమెరికా
ఎట్టకేలకు ఒక పెను సంక్షోభం సమసిపోయింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని మింగేసే మూడో ముప్పుగా ఆర్థిక నిపుణులు అభివర్ణించిన అమెరికా గరిష్ఠ రుణపరిమితి (డెబిట్ సీలింగ్) సంక్షోభంపై పాలక డెమాక్రాటిక్ పార్టీ, విపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య చివరి నిమిషంలో కుదిరిన అవగాహన పర్యవసానంగా కథ సుఖాంతమైంది. నిజానికి కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఊహించని రీతిలో వచ్చిపడ్డాయి. కానీ అమెరికా సంక్షోభం అలా కాదు. అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబు మాదిరి కొన్ని నెలలుగా ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ముడిపడి ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా, అగ్రరాజ్యంగా ఉన్న అమె రికా తన ఆర్థిక వ్యవస్థను దశాబ్దాలుగా క్రమశిక్షణతో నడపలేకపోవటమే ఈ సమస్యకు మూలం. తొలిసారి 1917లో గరిష్ఠ రుణ పరిమితి పెంపునకు అమెరికన్ కాంగ్రెస్ అనుమతించగా, ఆ తర్వాత 1939లో, 1941లో రుణ సేకరణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సివచ్చింది. ఇక అది రివాజుగా మారింది. ఆ తర్వాత 2011 వరకూ 78సార్లు గరిష్ఠ రుణ పరిమితికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయాల్సివచ్చింది. అమెరికా ప్రస్తుత గరిష్ఠ రుణ పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లు కాగా, దాన్ని మరింత పెంచేందుకు ప్రతినిధుల సభ, సెనేట్ తాజాగా అంగీకరించాయి. రుణ పరిమితిని పెంచే బదులు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవాలంటూ మొన్న ఏప్రిల్‌లో రిపబ్లికన్ పార్టీ పట్టు బట్టడంతో జో బైడెన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. రిపబ్లికన్ల ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన బడ్జెట్‌కు 4.8 లక్షల కోట్ల మేర కోత పెట్టే తీర్మానం ఏప్రిల్ నెలాఖరున ఆమోదం పొందింది. ఆ కోత తీర్మానం ద్వారా హరిత ఇంధన రంగ పెట్టుబడులకు ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న పన్ను మినహాయింపులకూ, విద్యార్థుల రుణాల మాఫీకీ రిపబ్లికన్లు మోకాలడ్డారు. ఈ చర్య అమెరికా పౌరులపైనా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తుపాకి గురిపెట్టడంతో సమానమని అమెరికా ఖజానా మంత్రి జానెట్ యెలెన్ మండిపడ్డారు. ఆ మాటెలావున్నా ప్రతి నిధుల సభ, సెనేట్ల ఆమోదం లభించకపోతే ఆపద్ధర్మంగా బైడెన్ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తనకు లభించే విశేషాధికారాలతో ప్రత్యేక చర్య తీసుకునే వీలుంటుంది. కానీ అది సంక్షోభాన్ని తాత్కాలికంగా ఒకటి రెండు నెలలు వాయిదా వేయగలదే తప్ప నివారించలేదు. ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితిని పోగొట్టలేదు. అందుకే సమస్యకు పరిష్కారం సాధ్యమా కాదా అన్న సంశ యంలో ప్రపంచం పడిపోయింది. ఇరు పార్టీల మధ్యా ఒప్పందం కుదరకపోతే అమెరికా తన రుణాలను చెల్లించలేని స్థితిలో పడేది. టీచర్లు, పబ్లిక్ రంగ సంస్థల కార్మికులతో సహా లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు నిలిపేయాల్సివచ్చేది. పింఛన్లు, అనేకానేక సాంఘిక సంక్షేమ పథకాలు కూడా ఆపాల్సివచ్చేది. కేవలం తాను చెల్లించక తప్పని రుణాలకూ, వడ్డీ చెల్లింపులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సివచ్చేది. దాని సెక్యూరిటీలు పల్టీలు కొట్టేవి. సారాంశంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేది. ఒక అంచనా ప్రకారం స్వల్పకాల దివాలా అయినా కనీసం 5 లక్షల మంది ఉద్యోగులకు అది ముప్పుగా పరిణమించేది. మరింత కాలం కొనసాగితే అనేకానేక వ్యాపారాలూ మూతబడి 83 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యేవి. అంతేకాదు, అది కార్చిచ్చులా వ్యాపించి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేది. ఇరుపక్షాలూ పరిణతి ప్రదర్శించటం వల్ల ప్రస్తుతానికైతే అంతా సర్దుకుంది. కానీ మున్ముందు ఇదంతా పునరావృతం కాకమానదని గత చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. అసలే ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో ఉంది. కరోనా మహమ్మారి లక్షలాదిమంది ప్రాణా లను బలితీసుకోవటంతోపాటు మహా మహా ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసింది. దాన్నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు సాగుతుండగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ పొరుగునున్న చిన్న దేశం ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగారు. కొన్ని నెలల్లో సమసిపోతుందనుకున్న ఆ దురాక్రమణ యుద్ధం ఏణ్ణర్థం నుంచి ఎడతెగకుండా సాగుతోంది. ఇదే అదునుగా రష్యాకు కళ్లెం వేసేందుకు అమెరికా యూరోప్ దేశాలన్నిటినీ ఏకం చేసి ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగా అండదండలందిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. తమ సమస్త అవసరాలకూ రష్యాపై ఆధారపడక తప్పని యూరోప్ దేశాలు ఈ ఆంక్షల పర్యవసానంగా ఒడిదుడుకుల్లో పడ్డాయి. జర్మనీ ఆర్థిక మాంద్యంలో పడింది. ఈలోగా గోరుచుట్టుపై రోకటి పోటులా ఈ రుణ గరిష్ఠ పరిమితి సంక్షోభం వచ్చిపడింది. తన శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేస్తున్నవారికి రిపబ్లికన్లతో ఒప్పందం ద్వారా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి షాక్ ఇచ్చారు. రిపబ్లికన్లకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ మెకార్తీ తన పార్టీలోని అత్యుత్సాహులను కట్టడి చేయగలిగారు. అయితే అమెరికా డాలర్‌తో, అక్కడి ఫైనాన్షియల్ మార్కెట్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ముడిపడివున్న సంగతిని ఆ దేశం మరువ కూడదు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు విశ్వసనీయత లేకపోవటంవల్ల తప్ప ఇందులో తన ప్రయోజకత్వం ఏమీ లేదని అది గుర్తించాలి. తాజా ఒప్పందం పర్యవసానంగా 2025 జనవరి వరకూ గండం గట్టెక్కినట్టే. ఆ తర్వాతైనా సమస్యలు తప్పవు. ఇప్పటికైనా అమెరికా సొంతింటిని చక్కదిద్దుకునే చర్యలు మొదలెట్టాలి. హద్దూ ఆపూలేని వ్యయానికీ, పన్నులకూ కళ్లెం వేసి హేతుబద్ధ విధానాలను రూపొందించుకోవాలి. -
నేపాల్‌తో పటిష్ఠ బంధం
అనుభవాన్ని మించిన ఉపాధ్యాయుడు లేడంటారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆ పదవి చేపట్టాక విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని, బుధవారం నాలుగు రోజుల పర్యటన కోసం రావటం ఈ సంగతినే మరోసారి తెలియజెబుతోంది. ఆయనకు వామపక్ష నేపథ్యం ఉంది. రాచరికాన్ని కూలదోసి ప్రజాతంత్ర రిపబ్లిక్కు పట్టంగట్టిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది ఆయన నేతృత్వంలోని మావోయిస్టు పార్టీయే. అందువల్లే తొలి దఫా 2008లోనూ, ఆ తర్వాత 2016లోనూ అధికారంలోకొచ్చినప్పుడు ఆయన సహజంగానే చైనా వైపు మొగ్గు చూపారు. కానీ ఈసారి ఆయన ఆలోచనలో మార్పు వచ్చిన దాఖలా కనబడుతోంది. ఎందు కంటే మొన్న మార్చి నెలాఖరున చైనా నిర్వహించిన కీలకమైన బావ్ ఫోరం ఫర్ ఆసియా సమా వేశానికి రారమ్మని ఆ దేశం పిలిచినా, అక్కడి అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నా వెళ్లకుండా ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపారు. నేపాల్ ప్రధాని పీఠాన్ని ఎవరు అధిరోహించినా తొలి విదేశీ పర్యటన కోసం భారత్ రావటం సంప్రదాయంగా వస్తోంది. కొత్త అధినేత రాగానే ఆహ్వానించటం భారత్‌కు కూడా రివాజైంది. కానీ ఈసారి మన దేశం ప్రచండను పిలిచేందుకు ఆర్నెల్ల సమయం తీసుకుంది. ఆయన పర్యటన మూడుసార్లు వాయిదాలు పడి ప్రస్తుత కార్యక్రమం ఖరారైంది. వాస్తవానికి నేపాల్‌లో ప్రచండకు మునుపటంత ఆకర్షణ లేదు. 275 స్థానాలుండే నేపాల్ పార్లమెంటుకు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఏకంగా 227 స్థానాలు గెల్చుకున్న ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) ఇప్పుడు రెండంకెల స్థాయికి పడిపోయింది. ఆమాటకొస్తే నేపాల్‌లో ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోదగ్గ బలం లేదు. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెనినిస్టు) తర్వాత మూడో స్థానంలో ప్రచండ పార్టీ ఉండగా... ప్రస్తుతం ఎనిమిది పార్టీల కూటమి ప్రభుత్వానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయన వైఖరిలో మార్పు తెచ్చిందనుకోవాలి. భారత్ – నేపాల్ సంబంధాల్లో అడపా దడపా ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి నిజమే అయినా అవి నిలకడగానే ఉన్నాయి. నేపాల్‌తో మనకు 1,850 కిలోమీటర్ల నిడివి సరిహద్దు ఉంది. ఆ రీత్యా వ్యూహాత్మకంగా మన దేశానికి నేపాల్ అత్యంత ముఖ్యమైన దేశం. సముద్ర తీరం లేకపోవటం వల్ల సరుకు రవాణా, సర్వీసుల రంగాల్లో దాదాపుగా అది మన దేశంపైనే ఆధార పడుతుంది. నేపాల్ దిగుమతులన్నీ మన రేవుల ద్వారానే సాగుతాయి. ఇంధన రంగంలోనూ ఈ సహకారం కొనసాగుతోంది. ఆ దేశంలో భారత్ పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించింది. మన దేశానికి నేపాల్ 450 మెగావాట్ల విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో మన సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అలాగే నేపాల్‌లో రైల్వే ప్రాజెక్టులకు భారత్ సాయం అందిస్తోంది. గురువారం ఇరుదేశాల ప్రధానులూ ఆన్లైన్లో రెండు చెక్‌పోస్టు లనూ, బిహార్ నుంచి సరుకు రవాణా రైలును ప్రారంభించారు. ఇవిగాక రెండు దేశాల ప్రధానుల సమక్షంలో ఏడు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. నేపాల్‌ను ఎప్పటికప్పుడు మంచి చేసుకునేందుకు చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో కొన్నిసార్లు సఫలీకృతమైంది కూడా. ఒక్క ప్రచండ అనేమిటి... భారత్ అనుకూలుడిగా ముద్రపడిన ఓలి శర్మ సైతం చైనా వ్యామోహంలో పడి మన దేశంపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి. కనుకనే చైనా పెట్టుబడుల శాతం గణనీయంగా పెరిగింది. కేంద్రంలో ఎవరు అధికారంలోవున్నా నేపాల్‌పై మన దేశం పెద్దన్న పాత్ర పోషించా లనుకోవటం అప్పుడప్పుడు సమస్యలకు కారణమవుతున్న సంగతి కాదనలేనిది. ఉదాహరణకు 2016లో రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసే దశలో నేపాల్‌లోని తెరై ప్రాంతంలో ఉన్న మాధేసి, తారూ వంటి మైనారిటీ జాతులు ఉద్యమించాయి. వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవా లని, వారితో చర్చించి రాజ్యాంగంలో తగిన మార్పులు చేయాలని మన దేశం సూచించింది. కానీ దీన్ని నేపాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత తెరై ప్రాంతంలో భారీయెత్తున ఉద్యమాలు సాగాయి. దాంతో మన దేశంనుంచి వంటగ్యాస్ రవాణా నెలల తరబడి నిలిచిపోయింది. ఉద్యమాల వెనక భారత్ ప్రమేయం ఉన్నదనీ, తమను లొంగదీసుకునేందుకే ఇవన్నీ చేస్తున్నారనీ నేపాల్ ఆరోపించింది. ఈ పరిస్థితిని అప్పట్లో చైనా చక్కగా వినియోగించుకుంది. వాస్తవానికి ఇప్పుడు సరిహద్దుల విషయంలో ప్రచండపై ఒత్తిళ్లు ఎక్కువే ఉన్నాయి. ఉత్తరా ఖండ్‌లోని లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ చాన్నాళ్లుగా వాదిస్తోంది. వాటిని తమ దేశంలో భాగంగా చూపుతూ మూడేళ్ల క్రితం మ్యాప్‌లు కూడా ముద్రించింది. వాటికి సంబంధించిన బిల్లుల్ని కూడా అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అనంతర కాలంలో ఈ వివాదం సద్దుమణిగింది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరింది. దీన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామని మోదీకి ప్రచండ సూచించారు. ఇరుగుపొరుగు అన్నాక సమస్యలు సహజం. వాటిని ఒడుపుగా పరిష్కరించుకోవటంలోనే ఆ దేశాల పరిణతి కనబడుతుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలనూ ‘సూపర్ హిట్’ చేస్తామనీ, వాటిని హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్తామనీ ప్రచండకు నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. ఇదొక మంచి పరిణామం. తదుపరి కార్యాచరణ ఆ దిశగా చురుగ్గా కదిలితే శతాబ్దాలనాటి ఇరు దేశాల సంబంధాలూ మరింత ఉన్నత స్థాయికి చేరతాయనడంలో అతిశయోక్తి లేదు.