Editorial
-
‘ప్రశాంత మణిపూర్’ ఎట్లా?
నెలరోజులుగా భగ్గున మండుతున్న మణిపూర్‌లో ప్రశాంతత నెలకొల్పేందుకు ఎట్టకేలకు ఒక రాజకీయ ప్రయత్నం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించి పరస్పరం కలహిస్తున్న మెయితీ, కుకీ తెగల నాయకులతో, పౌర సమాజ కార్యకర్తలతో, రాజకీయ పార్టీలతో మంగళవారం సమావేశమయ్యారు. సమస్య ఉగ్రరూపం దాల్చినప్పుడు, జనం చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు పాలకులుగా ఉన్నవారు సంయమనంతో మెలగటం, సాధారణ స్థితి ఏర్పడేందుకు ప్రయత్నించటం అవసరం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌కు ఈ ప్రాథ మిక విషయాలు కూడా తెలిసినట్టు లేదు. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 40,000 మంది వరకూ కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఊళ్లకు ఊళ్లే మంటల్లో మాడి మసయ్యాయి. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు, మందుగుండు అపహరించిన ఉదంతాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ‘ఇదంతా కుకీ ఉగ్ర వాదులకూ, భద్రతా దళాలకూ సాగుతున్న ఘర్షణ తప్ప మరేంకాద’ని బీరేన్ సింగ్ ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరోక్షంగా కుకీలను మిలిటెంట్లుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించటమే ఆయన ప్రకటన వెనకున్న సారాంశమన్న విమర్శలు వెల్లువెత్తాయి. రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సీఎం ప్రకటనను తోసిపుచ్చారు. ఇది కేవలం రెండు తెగల మధ్య ఘర్షణేనని తేల్చి చెప్పారు. మెయితీ తెగకు చెందిన నేతగా బీరేన్ సింగ్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పాలకుడిగా స్పందించాల్సి వచ్చినప్పుడూ, రాష్ట్రం ఇంకా ఘర్షణలతో అట్టుడుకు తున్నప్పుడూ ఆచి తూచి మాట్లాడాలి. తమ తెగవారిపై జరుగుతున్న దాడుల మాటేమిటని కుకీ శాసనసభ్యులు నిలదీస్తే ఆయన నుంచి సమాధానం లేదు. ఇదొక్కటే కాదు... హింసను సాకుగా చూపి 25 మిలిటెంట్ సంస్థలతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు బీరేన్ సింగ్ ఏకపక్షంగా ప్రకటించటం కూడా సమస్య తీవ్రతను పెంచింది. కుకీలతో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సీఎం రాలేని స్థితి ఏర్పడటం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు కోరటం రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన అవిశ్వాసానికి అద్దం పడుతుంది. మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడి నాలుగున్నర కోట్ల జనాభాలో 400కు పైగా తెగలున్నాయి. మాండలికాలు సైతం దాదాపు అంతే సంఖ్యలో ఉంటాయి. వీరంతా భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందినవారైనా... అప్పుడప్పుడు అపోహలు తలెత్తిన సందర్భాలున్నా మొత్తంమీద శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే ఇంచుమించు ఏభైయ్యేళ్లుగా ఇదంతా మారింది. తెగల పరిరక్షకులమంటూ సాయుధ బృందాలు తలెత్తటం మొదలైంది. ఉపాధి లేమివల్ల కావొచ్చు... జీవికకు ముప్పు కలుగుతుందన్న భయాందోళనల వల్ల కావొచ్చు చిన్న సమస్య రాజుకున్నా అది క్షణాల్లో కార్చిచ్చుగా మారి కల్లోలం రేపుతోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాన్ని ఏర్పరచాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కలిపి ‘ప్రత్యేక నాగాలిమ్’ ఏర్పరచాలని నాగాలు పదేళ్ల క్రితం తీవ్ర ఆందోళనకు దిగారు. పరిమిత వనరులను పలువురితో పంచుకోవటం తప్పనిసరి కావటంతో అవత లివారు శత్రువులుగా కనిపిస్తున్నారు. మెయితీలను సైతం ఎస్టీలుగా పరిగణించాలన్న న్యాయస్థానం ఆదేశాలు ఈ కారణంతోనే ఆదివాసీలైన కుకీల్లో కల్లోలం సృష్టించాయి. ఇదే అదునుగా ఘర్షణలు తలెత్తాయి. పొరుగునున్న మయన్మార్ నుంచి వచ్చిపడుతున్న శరణార్థులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మెయితీ నాయకులు చెప్పటం సమస్యను తగ్గించి చూపటమే అవుతుంది. అసలు కుకీలు స్థానికులు కాదనీ, వారు మయన్మార్ నుంచి వలస వచ్చినవారనీ చాన్నాళ్లనుంచి మెయితీలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ) అమలు చేసి, పౌరసత్వాన్ని నిగ్గుతేల్చి స్థానికేతరులను పంపేయాలని వారు కోరుతున్నారు. 53 శాతంగా ఉన్న మెజారిటీ తెగ నుంచి ఇలాంటి డిమాండ్ రావటం కొండప్రాంతాల్లో ఉంటున్న కుకీల్లో సహజంగానే గుబులు రేపుతోంది. 1901 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో కుకీలు 14.5 శాతం. 110 ఏళ్ల తర్వాత 2011 నాటికి వారి జనాభా పెరుగుదల రెండు శాతం మాత్రమే. అలాంటపుడు కుకీలపై స్థానికేతరుల ముద్రేయటం అసంబద్ధం కాదా? ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలనూ, తెగల మధ్య అపోహలు పెంచే వదంతులనూ నివారించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానంగానే ఇంత హింస చోటుచేసుకుంది. నిరుడు యూపీలోని మధురలో కన్నవారి కర్కశత్వానికి బలైపోయిన 21 ఏళ్ల యువతిని మెయితీ తెగ మహిళగా చిత్రించి, ఆమెపై కుకీలు అత్యాచారానికి పాల్పడి హతమార్చారని తప్పుడు ప్రచారం జరపడంతో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. కుకీ తెగ మహిళలపై దాడులు జరిగాయి. అత్యాచార ఉదంతాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక చుర్‌చాంద్‌పూర్‌లో హిందూ దేవా లయాలపై దాడులు సాగించారన్న వదంతులు లేవదీశారు. ఇదంతా అబద్ధమని వెంటనే ఆ ప్రాంత మార్వాడీ, పంజాబీ సొసైటీలు, బెంగాలీ సొసైటీ, బిహారీ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. తెగల పేరుతో, మతం పేరుతో ప్రజల్లో చీలికలు తెచ్చే యత్నాలను మణిపూర్ పౌర సమాజం ఐక్యతతో తిప్పికొట్టాలి. పాలకులు, రాజకీయ పార్టీల నేతలు జవాబుదారీతనంతో మెలగాలి. అప్పుడే ప్రశాంత మణిపూర్ సాధ్యమవుతుంది. -
ప్రజాస్వామ్యంలో నిరంకుశ నేత
నిరంకుశులు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుంది. అతి జాతీయవాదం ప్రబలినప్పుడు ఆలోచనను అది మింగేస్తుంది. ఆ చేదు నిజానికి టర్కీ (తుర్కియే) మరోసారి సాక్షీ భూతమైంది. తొలి దఫాలో ఫలితం తేలకపోయేసరికి రెండో దఫా సాగిన ఎన్నికలు, నాటకీయ ఫక్కీలో రోజుకొకరిది ఆధిక్యంగా మారిన ఎన్నికల ప్రచారం తర్వాత టర్కీ తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డొగాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. ఎన్నికలు ‘అత్యంత న్యాయవిరుద్ధంగా సాగా’యన్న ప్రత్యర్థి మాటలు ఎలావున్నా లెక్కల్లో అంతిమ విజయం ఎర్డొగాన్దే అయింది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశానికి ఎగ బాకినా, కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయినా ఆయన మాత్రం ప్రపంచ వేదికపై దేశప్రతిష్ఠను పెంచానని పౌరులకు నమ్మబలికారు. కుర్దిష్ వేర్పాటువాదుల్ని తన ప్రత్యర్థి సమర్థిస్తున్నారంటూ నమ్మించారు. అతి జాతీయవాదంతో ఆధిక్యాన్ని నిలుపుకొన్నారు. అదే ఈ ఎన్నికల విడ్డూరం. 2017లో రిఫరెండం ద్వారా టర్కీలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలనగా మార్చిందీ, ఆ పైన ప్రధాని పదవిని రద్దు చేసిందీ ఎర్డొగానే. న్యాయవ్యవస్థ, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ నియంత్రణలో పెట్టుకున్న ఘనుడాయన. నైపుణ్యం కన్నా విధేయతే గీటురాయిగా అయినవాళ్ళతో వాటిని నింపేశారు. ప్రధాన స్రవంతి మీడియా అంతా చేతుల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం పరాకాష్ఠకు చేరినవేళ 32 గంటల ప్రసార సమయం లభిస్తే, ప్రత్యర్థికి దక్కింది 32 నిమిషాలే. విజయానికై ఎంతకు దిగజారడానికైనా వెనుకాడకపోవడం ఆయన నైజం. దాంతో, దేశంలో ఎన్నడూ లేనన్నిసార్లు హత్యాయత్నం జరిగిన నేతగా పేరొందిన ప్రతిపక్షాల అభ్యర్థి కెమల్ కిలిచదరోగ్లూ చివరకు బహిరంగ సభల్లో బుల్లెట్ ప్రూఫ్ చొక్కా వేసుకొని, ప్రచారం చేయాల్సిన దుఃస్థితి. మాటల్లో సౌమ్యత, మనిషి కొంత మహాత్మా పోలికలతో ‘గాంధీ కెమల్’ అని ముద్దుగా అందరూ పిలుచుకొనే ప్రజాస్వామికవాది ఓడిపోయారు. నిజానికి 600 సభ్యుల పార్లమెంట్‌కూ, అధ్యక్ష స్థానానికీ మే 14న జరిగిన ఎన్నికలు ప్రస్తుత అధ్యక్షుడిని ఇంటికి సాగనంపి, ప్రతిపక్షాల సమష్టి అభ్యర్థి కెమల్కు పట్టం కడతాయని భావించారు. ఎన్నికల జోస్యాలూ ఆ మాటే చెప్పాయి. తీరా జరిగింది వేరు. 6.4 కోట్ల మంది ఓటర్లలో 88 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొంటే, 49.5 శాతం ఓట్లు ఎర్డొగాన్కూ, 44.8 శాతం ప్రత్యర్థికీ వచ్చాయి. ఆయన కూటమి ‘పీపుల్స్ అలయన్స్’ పార్లమెంట్లో 323 స్థానాలు, ప్రత్యర్థి ‘నేషన్ అలయన్స్’కు 213 స్థానాలు దక్కాయి. అధ్యక్ష పదవికి కావాల్సిన 50 శాతం ఓట్ల కోసం దేశ చరిత్రలో తొలిసారిగా కథ రెండో దఫా ఎన్నికల దాకా సాగింది. ఈ మదగజాల పోరులో సుమారు కోటి మంది సిరియన్ శరణార్థుల గోడు ఎవరికీ పట్టలేదు. ఇరుపక్షాలూ శరణార్థుల్ని వెనక్కి పంపేస్తామన్నాయి. సౌమ్యుడైన కెమల్ సైతం చివరకు ఓట్ల పునాదిని పెంచుకొనే వ్యూహంతో శరణార్థులపై కటువుగా మాట్లాడారు. అయినా లాభం లేకపోయింది. మే 28న రెండో దఫాలో 84 శాతం ఓట్లు పోలైతే, 48 శాతం వద్దే ప్రత్యర్థి ఆగిపోయారు. 52 శాతం ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడికే పట్టం దక్కింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్టు... ఎన్నికల్లో ఎర్డొగాన్ గెలిచారు కానీ, కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటికి గెలిచినా, భిన్న ధ్రువాలుగా చీలిపోయిన దేశంలో, ఆయన అజెండాను ఇప్పటికీ 47 శాతం పైగా వ్యతిరేకిస్తున్నారని మర్చిపోరాదు. అందుకే, వరుసగా అయిదోసారి అధ్యక్షుడై, అధికారంలో మూడో దశాబ్దంలోకి అడుగిడుతున్న ఆయన ముంగిట అనేక సవాళ్ళు న్నాయి. టర్కీలో ద్రవ్యోల్బణం 44 శాతానికి చేరింది. 2018 నుంచి ఇప్పటికి కరెన్సీ విలువ 80 శాతం క్షీణించింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 151 మిలియన్ డాలర్ల లోటులో పడ్డాయి. ఫిబ్ర వరిలో 50 వేల మంది మరణించిన భారీ భూకంప వేళ సర్కార్ పనితీరూ అంతంత మాత్రమే. ఇన్ని కష్టాల మధ్యా యూఏఈ, సౌదీ, రష్యాల నుంచి గణనీయ విదేశీ సాయంతో బండి నెట్టుకొచ్చారు. రానున్న అయిదేళ్ళలో ఈ నిరంకుశ నేత ఆర్థికవ్యవస్థను ఎలా సుస్థిరం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక, భౌగోళికంగా ఆసియా – ఐరోపాల కొసన ఉండడం, ముస్లిమ్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రపంచ దేశాల్లో టర్కీ ఒకటి. రష్యా నుంచి లాభపడుతున్న ఈ ‘నాటో’ సభ్యదేశపు విదేశాంగ విధానం స్పష్టమే. రష్యాకూ, పాశ్చాత్య ప్రపంచానికీ మధ్య సాగుతున్న ప్రస్తుత పోరాటంలో ఆ దేశం తన వైఖరిని మార్చుకోదు. పాశ్చాత్య ప్రపంచానికి కాక పుట్టేలా ప్రాంతీయంగా, విదేశీ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వతంత్రతను చూప నుంది. భారత్‌తో ఒకప్పుడు బలమైన బంధమున్నా, 370వ అధికరణం రద్దు తర్వాత కశ్మీర్‌పై ఎర్డొ గాన్ ప్రకటనలు, పాక్‌తో సాన్నిహిత్యం నేపథ్యంలో మన సంబంధాలెలా ఉంటాయో వేచి చూడాలి. మొత్తం మీద ఎన్నికలనేవి అన్నిసార్లూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న నమ్మకాన్ని అందిస్తాయని చెప్పలేం. ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే నిబంధనల్ని మార్చేసి, అసలు స్ఫూర్తికే తిలోదకాలిచ్చినప్పుడు ఎన్నికలు నామ మాత్రమే! ప్రజాస్వామ్యం పేరుకే! సైన్యం తెర వెనుక ఉండి కథ నడిపే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో ఇదే ప్రహసనం. దశాబ్ది పైచిలుకుగా టర్కీలో ఎర్డొగాన్ చేసిందీ, జరిగిందీ ఇలాంటి ప్రజాస్వామ్య పరిహాసమే. కానీ, అధికారాన్ని నిలుపుకోవడానికి అక్కరకొచ్చిన ఈ ఆట ఆర్థిక కష్టాల్లోని దేశాన్ని ముందుకు నడిపించడానికి ఇకపైనా పనికొస్తుందా? -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్‌కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్‌లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్‌లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్‌లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్‌లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్‌లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
రాజదండం – రాజ్యాంగ దండం
నిప్పు కాలుతుంది, అయినా నిప్పు లేనిదే రోజు గడవదు. కాలకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే నిప్పును వాడుకోవాలి. అధికారం కూడా అంతే; అధికారం చెడగొడుతుందనీ, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా చెడగొడుతుందనీ ఒక ఆంగ్ల మేధావి సెలవిచ్చాడు. లోకవ్యవహారం సజావుగా సాగాలంటే అందుకు అవసరమైన అధికారాన్ని ఒక వ్యక్తి చేతిలోనో, వ్యవస్థ చేతిలోనో పెట్టక తప్పదు. మళ్ళీ అది చెడుదారి పట్టకుండా అవసరమైనప్పుడు కళ్లేలు బిగించకా తప్పదు. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి చెందిన జనం సమష్టి ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గుంపు కట్టారో అప్పుడే అధికార– నియంత్రణల రెండింటి అవసరాన్నీ గుర్తించారు. ఆ క్రమంలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక కోణంలో చూస్తే మానవచరిత్ర అంతా అధికారమూ, దాని నియంత్రణల మధ్య ఎడతెగని పెనుగులాటే! ఈ పెనుగులాట రూపురేఖలు మన పురాణ ఇతిహాసాలలోనూ కనిపిస్తాయి. దశరథుడు అవడానికి రాజే కానీ పెద్దకొడుకైన రాముడికి పట్టాభిషేకం చేసే స్వతంత్రాధికారం మాత్రం ఆయనకు లేదు. పౌరజానపద పరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. ఆ పౌర జానపదులలో తరుజనులు, గిరిజనులూ కూడా ఉన్నారని రామాయణం చెబుతోంది. దశరథుడికి పౌరజానపదుల ఆమోదం సునాయాసంగా లభించింది కానీ; మహాభారత ప్రసిద్ధుడైన యయాతికి మాత్రం అంత సులువుగా లభించలేదు. తన చిన్న కొడుకైన పూరునికి రాజ్యం అప్పగించాలన్న తన ప్రతిపాదనను అతడు పౌరజానపదుల ముందు ఉంచినప్పుడు, పెద్దకొడుకైన యదువు ఉండగా చిన్నకొడుకును ఎలా రాజును చేస్తావని వారు ప్రశ్నించారు. యయాతి వారిని ఎలాగో ఒప్పించి తన నిర్ణయాన్ని అమలు చేశాడు. ప్రజామోదంతో రాజైన వ్యక్తి ఆ తర్వాత సర్వస్వతంత్రుడై విర్రవీగినప్పుడు అతణ్ణి తొలగించిన ఉదాహరణలూ ఉన్నాయి. మహాభారతంలోని పురూరవుడు, నహుషుడు ఆ కోవలోకి వస్తారు. రాజు ధర్మతత్పరతను ఉగ్గడించే కథలు; ధర్మం తప్పిన రాజూ, అతని రాజ్యమూ కూడా భస్మీపటలమైన కథలూ చరిత్రకాలంలోనూ కనిపిస్తాయి. బెజవాడ రాజధానిగా ఏలిన విష్ణుకుండిన రాజు మాధవవర్మ, తన కొడుకు ప్రయాణించే రథం కింద పడి ఒక పౌరుడు మరణించినప్పుడు కొడుకని చూడకుండా మరణశిక్ష అమలు చేస్తాడు. ‘శిలప్పదికారం’ అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో నాయిక కణ్ణగి తన భర్త కోవలన్ కు పాండ్యరాజు ఒకడు అన్యాయంగా మరణశిక్ష అమలు చేసినప్పుడు ఆగ్రహించి అతని రాజ్యాన్ని బూడిదకుప్ప కమ్మని శపిస్తుంది. శిక్షించే అధికారంతో పాటు తప్పొప్పులను నిర్ణయించే అధికారాన్ని కూడా రాజు గుప్పిట పెట్టుకున్న దశను ఈ కథ సూచిస్తుంది. రాజూ, రాజ్యాధికారమూ, ధర్మబద్ధత, దండనీతి గురించిన భావనలు ఏ ఒక్క దేశానికో పరిమితమైనవి కావు; సార్వత్రికమైనవీ, అత్యంత ప్రాచీనమైనవీ కూడా! ఆధునిక భాషాశాస్త్ర నిర్ధారణలనే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలరూపమైన ‘రెగ్’ అనే మాటే సంస్కృతంలో రాజశబ్దంగానూ, ఇతర ఇండో–యూరోపియన్ భాషల్లో దానికి దగ్గరగా ధ్వనించే ‘రెక్స్’ (లాటిన్) వంటి శబ్దాలుగానూ మారింది. ‘సరళరేఖలా తిన్నగా నడిచేది, నడిపించే’ దనే అర్థం కలిగిన ‘రెగ్’ అనే మాట నుంచే నేటి రెగ్యులేషన్, రెగ్యులర్, రైట్, రీజన్, రెజీమ్ మొదలైన మాటలు వచ్చాయని భాషావేత్తలు అంటారు. రాజశబ్దం ఎంత ప్రాచీనమో, కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న రాజదండం కూడా అంతే ప్రాచీనమూ, సార్వత్రికమూ కూడా! మన పురాణ, ఇతిహాసాలలో రాచరికానికీ, రాజుల నియామకానికీ ఇంద్రుడు బాధ్యుడిగా కనిపిస్తాడు. చేది దేశాన్ని పాలించే వసురాజు విరక్తుడై అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఇంద్రుడు అతణ్ణి తిరిగి రాజ్యపాలనకు ప్రోత్సహించి ఇతర రాజోచిత పురస్కారాలతోపాటు, ఒక రాజదండాన్నీ చేతికిచ్చాడని మహాభారతం చెబుతోంది. ఇలాగే ఇంద్రుడు రాజ్యపాలనకు ప్రోత్సహించిన మరో రాజు – మాంధాత. ధర్మరక్షణను రాజుకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటుంది కనుక రాజదండాన్ని ధర్మదండంగా కూడా అన్వయించారు. పట్టాభిషేక సమయంలో రాజుకీ, గురువుకీ మధ్య నడిచే ఒక సంభాషణ ప్రకారం, ‘నన్ను ఎవరూ శిక్షించలే’రని రాజు అంటాడు; అప్పుడు, ‘ధర్మం నిన్ను శిక్షిస్తుంది’ అంటూ గురువు మూడుసార్లు ధర్మదండంతో అతని శిరసు మీద కొడతాడు. ఈ రాజదండం ఆనవాయితీ రోమన్లకూ సంక్రమించింది. వారిలో మొదట్లో వ్యక్తికేంద్రిత పాలన కాక, పౌరకేంద్రిత పాలన– అంటే గణతంత్ర వ్యవస్థ ఉండేది. రాచరికాన్నీ, రాజు అనే మాటనూ కూడా వారు ఏవగించుకునేవారు. ఒక దశలో రోమ్ సైనిక నియంతగా ఉన్న జూలియస్ సీజర్ ఈజిప్టు రాణి క్లియోపాత్రా ప్రేమలో పడిన తర్వాత, అక్కడున్న వ్యవస్థ ప్రభావంతో సింహాసనాన్నీ, రాజదండాన్నీ స్వీకరించాడు. అదే చివరికి అతని హత్యకు దారితీసింది. అధికారమంతా రాజు దగ్గరే పోగుబడే ప్రమాదం తలెత్తినప్పుడు అతణ్ణి అదుపు చేసే సంకేత పాత్రను రాజదండం నిర్వహించి ఉండవచ్చు. ఆధునిక ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా ఆ ప్రమాదాన్ని అరికట్టేందుకు ఆయా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఏ వ్యవస్థ ఏ హద్దుల్లో ఉండాలో చెప్పే రాజ్యాంగమూ వచ్చింది. అదే నేటి అసలు సిసలు రాజదండం! -
కథానాయకుని వ్యథ!.. ది పొలిటికల్ ట్రాజెడీ ఆఫ్ ఎన్టీఆర్
ఇదీ కుట్ర జరిగిన తీరు... తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఆయన సొంతవారే ఎలా కూలదోశారు? అన్నది ఆసక్తికరమైన అంశం. ఆనాడు చకచకా జరిగిపోయిన ఘటనలలో ఎన్టీఆర్ నిస్సహాయుడిగా మిగిలిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1994 శాసనసభ ఎన్నికలలో తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి అసాధారణమైన రీతిలో మిత్రపక్షాలతో కలిసి సుమారు 250కి పైగా సీట్లు గెలుచుకున్న ఎన్టీఆర్ చెప్పులు వేయించుకోవడమా? తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చరమాంకంలో కుటుంబ సభ్యుల చేతిలో ఆత్మాభిమానం కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం. 1995 ఆగస్టులో ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు అయిన చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు తరలివెళ్లారు. అది జరుగుతున్నప్పుడే చంద్రబాబు తన సొంత గ్రూప్‌తో విశాఖ డాల్ఫిన్ హోటల్లో ఒక సమావేశం నిర్వహించారు. తదుపరి సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు కలిసిన తీరు సంచలనం అయింది. ఎన్టీఆర్ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టాలని అనుకున్నారు. వాళ్లు ఆయా జిల్లాలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను వైస్రాయికి రావాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తాను అసలు ఎందుకు వైస్రాయ్ హోటల్‌కు వెళ్లానో తెలియదనీ, జిల్లాకు చెందిన ఒక మంత్రి పిలవడంతో వెళ్లాననీ, ఆ తర్వాత కాని విషయం బోధపడలేదనీ అప్పట్లో నాకు చెప్పారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం కూడా చంద్రబాబు వర్గానికి కలిసి వచ్చింది. వైస్రాయ్ హోటల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందనీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా అయినా నియమిస్తారనీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎన్టీఆర్ మరో అల్లుడు, అప్పట్లో ఎంపీగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ రప్పించారు. ఉప ముఖ్యమంత్రి చేస్తామని నమ్మబలికారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని అన్నారు. తామేమీ తప్పు చేయలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ముగ్గురు నేతలు అశోక్ గజపతిరాజు, ఎస్వీ సుబ్బారెడ్డి, దేవేందర్ గౌడ్లను ఎన్టీఆర్ వద్దకు సంప్రతింపుల పేరుతో పంపించారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడును తుని నుంచి హెలికాప్టర్లో రప్పించారు. ఎమ్మెల్యేలతో ఆయన అభిప్రాయ సేకరణ జరిపించినట్లు గవర్నర్‌కు ఒక నివేదిక ఇప్పించారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్‌కు ఒక ప్రముఖ న్యాయవాది అసెంబ్లీని రద్దు చేద్దామన్న సలహా ఇచ్చారు. నిజానికి అది కూడా కుట్రలో భాగమేనని ఆ తర్వాత వెల్లడైంది. అసెంబ్లీని రద్దు చేస్తారని చెబితే ఎమ్మెల్యేలంతా తమ పదవులు పోతాయన్న భయంతో తమ వద్దకు వచ్చేస్తారని చంద్రబాబు ప్లాన్ చేశారు. అది బాగా వర్కవుట్ అయింది. మొత్తం పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు బయల్దేరారు. పరిటాల రవి, దేవినేని నెహ్రూ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన మైకు తీసుకుని ‘తమ్ముళ్లూ వచ్చేయండ’ని ఉపన్యాసం ఇస్తున్న సందర్భంలో హోటల్ గేటు లోపల నుంచి చెప్పులు పడ్డాయి. అది చూసినవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు చంద్రబాబు వర్గం ఎమ్మెల్యేలు ఒక సినిమా థియేటర్లో సమావేశమై ఎన్టీఆర్‌ను పార్టీ పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు, చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన గవర్నర్ కృష్ణకాంత్ అక్కడే రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబుతో సహా ఐదుగురు నేతలను మంత్రి పదవుల నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినా, ఆ కాపీని గవర్నర్‌కు పంపించినా, ఆయన దానిని విస్మరించి చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్నా స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించలేదు. చంద్రబాబుకు సహకరించిన దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి హుళక్కి అయితే, హరికృష్ణను ఆరు నెలల మంత్రిగా మార్చి పరువు తీశారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు టీడీపీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, బ్యాంక్‌లో ఉన్న నిధులను కూడా కైవసం చేసుకున్నారు. ఫలితంగా గుండెపోటుతో ఎన్టీఆర్ కాలం చేశారు. ఆ తర్వాత రోజులలో ఎన్టీఆర్‌ను పొగుడుతూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం ఆరంభించారు. ఎన్టీఆర్ పేరు చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్న చంద్రబాబు వర్గం అదే వ్యూహం అమలు చేస్తోంది. పాపం... ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంది! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అవమానాలకు ఆగిన గుండె! చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ నుండి లాక్కున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీఆర్ ఆ అవమానాల్ని తట్టుకోలేకపోయారు. 1993 జూన్‌లో ఆయనకు పెరాలసిస్ వచ్చినప్పుడు నిమ్స్ డాక్టర్లు ఆయనకు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడిందనీ ఏమాత్రం ఒత్తిడి ఉన్నా అది ఆయన మరణానికి దారి తీస్తుందనీ కుటుంబ సభ్యులందరినీ హెచ్చరించారు. అయినా వాళ్ళెవ్వరూ ఆ మాటలను పట్టించుకున్నట్లే లేరు. మాటిమాటికీ అవమానాలతో వేధించారు. అయినా ఆయన వెనక్కు తగ్గదలుచుకోలేదు. చంద్రబాబు మీద పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు చె΄్పాలనే ఉద్దేశ్యంతో మహారథి, వేల్చూరి వెంకట్రావులచే ‘జామాత దశమ గ్రహః’ అనే క్యాసెట్‌కు స్వయంగా తన పర్యవేక్షణలో రచన చేయించి డి.రామానాయుడు స్టూడియోలో తనే మాట్లాడుతూ ఆడియో రికార్డ్ చేయించారు. ‘తమ్ముళ్లూ ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను’ అని ్రపారంభించి రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన చంద్రబాబు కుట్రనూ మోసాన్నీ బయటపెట్టారు. ఈ క్యాసెట్‌ను విజయవాడలో ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహగర్జన’ సదస్సులో విడుదల చేయాలని సంకల్పించారు. నేషనల్ ఫ్రంట్ నాయకులు ఎన్టీఆర్ లేకపోతే రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమని భావించారు. సంధి ప్రయత్నంలో వీపీ సింగ్, బొమ్మై, దేవెగౌడ, పాశ్వాన్, శరద్ యాదవ్‌లు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి చంద్రబాబుతో కలిసిపొమ్మని నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశారు. ఈ కలహం వలన నేషనల్ ఫ్రంట్‌కు నష్టం వస్తుందనీ, కొంచెం పెద్ద మనస్సుతో ఈ సంధికి అంగీకరించమనీ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి సలహాలివ్వమనీ సూచించారు. ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. చంద్రబాబు మీద పోరాటాన్ని కొనసాగించటానికి ఆయన కోర్టులను కూడా ఆశ్రయించారు. అదే సమయంలో ఆయనకు ఇంకో విషయం తెలిసింది. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి బంధువులు, మరికొంతమంది లిక్కర్ లాబీ వాళ్ళు కోట్లాది రూపాయలు చంద్రబాబుకు అందించారనీ, ఆ డబ్బుతో ఆయన మీడియాతో పాటు న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేసుకుని ఎన్టీఆర్‌ను పదవి నుండి దించేశాడనీ! ఇక్కడ జరిగిందంతా గందరగోళమే. ప్రజలకు వాస్తవాలేంటో తెలియనీకుండా, తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇదే పచ్చ మీడియా ఆనాడు నిర్వహించిన పాత్ర కడు శోచనీయమైనది. ఇదంతా లక్ష్మీ పార్వతి వల్లనే జరుగుతోందని చెప్పటం ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినా అది ప్రజల్లో వ్యతిరేకత కలిగించదనేది వారి వ్యూహం. ఆ పెద్ద కుట్రలో ప్రధాన పాత్ర వారిదే! ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నది. ఒక కన్ను పని చేయటం లేదు. రానురాను మానసికంగానూ, శారీరకంగానూ బలహీనపడుతున్నారు. 1996 ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహ గర్జన’ సదస్సు గురించి చర్చించడానికి దేవినేని నెహ్రూ విజయవాడ నుండి వచ్చారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ఆ సదస్సుకు 30 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పేరుతో ఉన్న పార్టీ ఎకౌంట్ నుండి డబ్బు తీసుకురమ్మని చెక్ రాసి తన పీఏను పంపించారు ఎన్టీఆర్. వెంటనే బ్యాంక్ వాళ్ళు చంద్రబాబుకు మెసేజ్ ఇచ్చారు. చంద్రబాబు మానవత్వాన్ని మర్చిపోయి ఆ డబ్బుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం తనే గనుక సొమ్ము తనకే చెందాలని హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేయించాడు. ఇది జనవరి 17వ తారీఖు జరిగిన సంఘటన. అప్పటికప్పుడే సీజే ప్రభాకర శంకర మిశ్రా ఆదేశం మేరకు హైకోర్టు జస్టిస్ బి. మోతీలాల్ నాయక్ స్టే ఆర్డర్ ఇచ్చేశారు. అంత ఎమర్జెన్సీగా వారు స్పందించారు! సాయంత్రం 5 గంటలకు లాయర్లు వచ్చి విషయం చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన శరీరం అదుపు తప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడబోయి కిందపడబోయారు. అక్కడున్న వాళ్ళు పట్టుకుని ఆపారు. ముఖం, కాళ్లు ఎర్రగా అయిపోయాయి. పెద్దగా కేకలు వేశారు. నెహ్రూ సర్దిచెప్పినా ఆయన పట్టించుకోలేదు. డబ్బు లేకుండా పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన పడ్డారు. ఇదంతా అయ్యేసరికి రాత్రి 7 గంటలయ్యింది. 10 గంటలకు రామానాయుడు ‘జామాత దశమగ్రహః’ క్యాసెట్ ఇచ్చి వెళ్లారు. అయితే సింహగర్జన సదస్సులో ఈ క్యాసెట్ రిలీజ్ చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని గురించి చె΄్పాలనుకున్న ఆయన నోరు శాశ్వతంగా మూగబోయింది. పార్టీ డబ్బు సీజ్ చేసిన 8 గంటల లోపే ఈ అవమానాలు తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది. ప్రత్యర్థులను మట్టి కలపాలనుకునే సమయంలో విధి ఆయనను వెక్కిరించింది. కలల్నీ, కలతల్నీ తనలో కలుపుకొంటూ మృత్యువు ఆయనకు శాశ్వత విశ్రాంతి కల్పించింది. ఇప్పుడు చెప్పండి... దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడి అధికార దాహం వలనే కదా ఆయనకీ అకాల మృత్యువు ్రపాప్తించింది. తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ... అశ్రునయనాలతో సెలవు. -నందమూరి లక్ష్మీపార్వతి,వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
బహిష్కరణ సబబేనా?!
వాకౌట్లు, వాయిదాలు, అరుపులు, కేకలతో తరచు వార్తల్లోకెక్కే పార్లమెంటు కనీసం కొత్త భవనం ప్రారంభోత్సవ సందర్భంలోనైనా పండుగ కళను సంతరించుకుంటుందని ఆశిస్తే అది సాధ్యపడేలా లేదు. నూతన పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలన్న అంశం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకుంది. పనిలో పనిగా రాజ్యాంగ చట్రంలో ఎవరి పాత్రేమిటన్న చర్చ కూడా మొదలైంది. ఈ ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటమే తాజా వివాదానికి మూలం. రాజ్యాంగం నిర్దేశించిన మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థ ఒకటి కనుక రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రారంభిస్తేనే బాగుంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ప్రధాని పార్లమెంటులో మెజారిటీ పక్షానికి మాత్రమే నాయకుడని, అందువల్ల ఆయన ప్రారంభించటం సరికాదంటున్నాయి. తమ వాదనకు ప్రభుత్వం సమ్మతించటం లేదని అలిగి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించటానికి నిర్ణయించుకున్నాయి. మొత్తంగా 20 పార్టీలు బహిష్కరణ పిలుపులో భాగం కాగా, 25 పార్టీలు ఈ వేడుకకు హాజరవుతున్నాయి. ఏ నిర్ణయాన్నయినా అందరూ ఆమోదించాలని లేదు. విభేదించే హక్కు, భిన్నా భిప్రాయాన్ని ప్రకటించే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ ఆ పరిధి దాటి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య మొదలవుతుంది. సమస్త అధికార సౌధాలూ ఒకేచోట ఉండాలని నిర్ణయించి అందుకోసం బృహత్తరమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూనుకుంది. అందులో నూతన పార్లమెంటు భవనం ఒకటి. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణిస్తారు. దేశ పౌరుల ప్రయోజనాలు, భద్రతతో ముడిపడివుండే అనేక అంశాలు అక్కడ చర్చకొస్తాయి. చట్టాలు రూపొందుతాయి. ప్రతి పక్షం ఏమి ఆశిస్తున్నదో ప్రభుత్వం తెలుసుకోవటం, ప్రభుత్వ వైఖరేమిటో విపక్షాలు గ్రహించటం ఎక్కడో ఒకచోట రెండు పక్షాలూ అంగీకారానికి రావటం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుంది. లేదంటే పరస్పరం విభేదించుకోవటానికైనా ఆ పక్షాల మధ్య అంగీకారం కుదరాలి. ఇవేమీ లేకుండా ఎప్పుడూ కత్తులు నూరుకోవటమే, ఎదుటి పక్షంపై పైచేయి సాధించటమే ధ్యేయంగా మారితే అలాంటిచోట ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుందా? అందుకే బహిష్కరణ నిర్ణయం ఎలాంటి సందేశం పంపుతుందో విపక్షాలు ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్న దనో, దాని నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయనో విమర్శిస్తే, నిలదీస్తే అర్థం చేసుకోవచ్చు. అడపా దడపా విపక్షాలు ఆ పని చేస్తూనే ఉన్నాయి. నూతన సౌధాన్ని రాష్ట్రపతి ప్రారంభించటమే సరైందన్న తమ అభిప్రాయాన్ని ప్రజలముందుకు తీసుకువెళ్లటంలో కూడా తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆ వాదనను ఆమోదించటమో, తిరస్కరించటమో ప్రజలు తేల్చుకుంటారు. జనం తీర్పుకే దాన్ని విడిచిపెట్టి యధావిధిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే విపక్షాల హుందాతనం వెల్లడయ్యేది. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు నూతన సౌధం సమకూర్చుకోవటం ఎంతో ప్రాముఖ్యతగల ఘట్టమని విపక్షాలే ప్రకటించివున్నాయి. మరి అటువంటి ముఖ్య ఘట్టానికి ముఖం చాటేయటం ఏం సబబన్న విజ్ఞత వాటికి ఉండొద్దా? స్వాతంత్య్ర వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటుతోపాటు రాష్ట్రాల్లోని చట్టసభలన్నిటా పరిణత చర్చలు జరిగేవి. ఆరోగ్యకరమైన విధా నాలూ, సంప్రదాయాలూ అమలయ్యేవి. కానీ రాను రాను అవి బలప్రదర్శనలకు వేదికలవుతు న్నాయి. నేలబారు రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. మొన్న మార్చిలో రూ. 45 లక్షల కోట్ల విలువైన కేంద్ర బడ్జెట్ లోక్‌సభలో ఎలాంటి చర్చా లేకుండా గిలెటిన్‌తో ముగిసిపోయిందని గుర్తుంచుకుంటే మన పార్లమెంటు ఎలాంటి దుఃస్థితిలో పడిందో అర్థమవుతుంది. అదానీ వ్యవహారంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు అంగీకరించాలని విపక్షాలూ... దేశ వ్యవ హారాల్లో విదేశీ జోక్యం కోరినందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షమూ పట్టుబట్టడంతో బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. కనీసం కొత్త పార్లమెంటు భవనంలోనైనా అధికార, విపక్షాలు సరికొత్త ఒరవడికి నాంది పలుకుతాయనుకుని భ్రమించిన వారికి విపక్షాల బహిష్కరణ పిలుపు నిరాశ మిగిల్చింది. పార్లమెంటుపై రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు దాన్ని కేవలం రెండు చట్టసభల సముదాయంగా మాత్రమే పరిగణించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలో మున్ముందు చోటుచేసుకోవాల్సిన సామాజిక, ఆర్థిక మార్పులకు దాన్నొక సాధనంగా రాజ్యాంగ నిర్మాతలు పరిగణించారు. ఈ లక్ష్యసాధనలో పార్లమెంటు విఫలమైతే దేశంలో అశాంతి ప్రబలుతుందని కూడా హెచ్చరించారు. కానీ వర్తమాన రాజకీయ నేతలకు అదేమీ గుర్తున్నట్టు లేదు. వారు ఎదుటి పక్షాన్ని శత్రువుగానే భావిస్తున్నారు. అంతకుముందు సంగతెలావున్నా గత పదేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి ఈ మాదిరి వైఖరి తోడ్పడుతుందో, దాన్ని కడతేరుస్తుందో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇరుపక్షాలూ పరిణతితో మెలగాలి. దేశ ప్రజల విశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలిగిన విపక్షాలను ఒప్పించేందుకు, వాటిని కలుపుకొని పోయేందుకు బీజేపీ ప్రయత్నించాలి. తమ అభ్యంతరాల అంతస్సారం ప్రజల్లోకి వెళ్లింది గనుక అంతకుమించటం మితిమీరడంతో సమానమవుతుందని విపక్షాలు గుర్తించాలి. ప్రజాస్వామిక స్ఫూర్తిని విస్మరించటం సరికాదని గ్రహించాలి. -
ఇది మోదీ ఎక్స్‌ప్రెస్!
గమనించాలి... గ్రహించాలే కానీ సంఘటనలన్నీ ఏదో ఒక సంకేతమిస్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అయిదు రోజుల పాటు జరిపిన మూడు దేశాల పర్యటన చూస్తే అదే అనిపిస్తుంది. ప్రపంచ దేశాధినేతల ప్రత్యేక ప్రశంసలు, ప్రవాస భారతీయుల నుంచి జయ జయ ధ్వానాలు మోదీకే కాదు... భారత్‌కు పెరిగిన ప్రాధాన్యాన్నీ, ప్రతిష్ఠనూ సూచిస్తున్నాయి. జపాన్‌లో ‘జీ7’ దేశాల సదస్సులో అతిథిగా హాజరైనప్పుడూ, పాపువా న్యూ గినియా నేత ఏకంగా పాదాభివందనం చేసినప్పుడూ, ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల ‘మోదీ’ నాదాలు చూసినప్పుడూ వెలువడ్డ సంకేతం అదే. కర్ణాటకలో పదే పదే పర్యటించి, భారీ సభలు, ఊరేగింపులు నిర్వహించినప్పటికీ ఆ రాష్ట్రంలో అధికారం చేజార్చుకున్న బీజేపీ నేతగా స్వదేశంలో సన్నాయి నొక్కులు వినిపిస్తూ ఉండ వచ్చు. ప్రధానిగా బాహ్య ప్రపంచంలో మాత్రం మోదీ సమ్మోహన మంత్రానికి తరుగు, తిరుగు లేదని అర్థమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అగ్ర రాజ్యాల దాకా అన్నీ.. అతిపెద్ద మార్కెటైన నవభారతంతో భుజాలు రాసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నాయని తెలుస్తుంది. హిరోషిమాలో ‘జీ7’ సదస్సుకు హాజరైన ప్రధాని ఆ పైన ద్వీపదేశమైన పాపువా న్యూ గినియాను తొలిసారి సందర్శించారు. ‘భారత – పసిఫిక్ ద్వీపదేశాల సహకార వేదిక’ (ఎఫ్ఐపీఐసీ) మూడో సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఆ దేశానికి ఒక భారత ప్రధాని వెళ్ళడం ఇదే ప్రథమం. ఏడాది క్రితం పదవి చేపట్టిన లేబర్ పార్టీ నేత, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానంపై మోదీ సిడ్నీలో పర్యటించారు. అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం, వ్యాపార బృందాల రౌండ్ టేబుల్‌తో తన మూడు దేశాల పర్యటనను విజయవంతంగా ముగించి, స్వదేశానికి తిరిగొచ్చారు. స్వదేశంలోని రాజకీయ చిక్కులతో అమెరికా అధ్యక్షుడు వైదొలగేసరికి ఆస్ట్రేలియాలో జరగాల్సిన ‘క్వాడ్’ సదస్సును లఘువుగా జపాన్‌లోనే అధినేతలు జరిపేశారు. ఆస్ట్రేలియాతో పటిష్ఠ బంధానికి అవకాశం వదులుకోని మోదీ తన పర్యటనను సమయానికి తగ్గట్టు ద్వైపాక్షిక సందర్శన చేసేశారు. గత ఏడాది కాలంలో ఆరోసారి అల్బెనీస్‌తో భేటీ, ఈ ఆర్థిక, వాణిజ్య సహకార దోస్తీ ప్రాంతీయ శాంతి సుస్థిర తలకూ కీలకమన్నారు. ‘డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ’– ఈ మూడు ‘డి’లు కీలకమంటూ, శరవేగంతో మెరుగవుతున్న ఇరుదేశాల సంబంధాలకు టీ20 మ్యాచ్‌లతో పోలిక తెచ్చారు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడులు, వేర్పాటువాద శక్తుల విజృంభణను మార్చిలో అల్బనీస్‌తో ప్రస్తావించినా ఇప్పుడూ ఆ ఊసెత్తడం స్నేహదేశానికి ఒకింత ఇబ్బందికరమే. అది అటుంచితే, భారత ప్రధానికి సాదర స్వాగతం పలుకుతూ ఆ దేశంలోని అతి పెద్ద వినోద, క్రీడా ప్రాంగణంలో సాగిన భారీ సంబరం ప్రవాసుల్లో పెరిగిన జాతీయవాదానికి మచ్చు తునక. ‘మోదీ ఎయిర్వేస్’, ‘మోదీ ఎక్స్‌ప్రెస్’ లాంటి పేర్లతో ఆస్ట్రేలియా నలుమూలల నుంచి ప్రత్యేక విమా నాల్లో, రైళ్ళలో అభిమాన జనం తరలివచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలోకి లక్షల కోట్ల రూపాయలను ప్రవహింపజేస్తున్న ప్రవాస భారత ప్రపంచానికి ఒక భరోసా ఇవ్వాలని ప్రధాని భావించినట్టున్నారు. అందుకే, క్రిక్కిరిసిన స్టేడియమ్లో ముప్పావుగంట సేపు మాటల మోళీ చేశారు. తొమ్మిదేళ్ళలో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ప్రియతమ నేత పట్ల భారతీయ డయాస్పోరా స్పందన చూసి, అక్కడి పాలకులు సైతం అబ్బురపడ్డారు. 2014 నవంబర్‌లో మోదీ ఆస్ట్రేలియా పర్యటించినప్పుడు ఆయన అప్పుడప్పుడే విశ్వవేదికపై నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రధాని. నాడు బ్రిస్బేన్‌లో ‘జీ20’ సదస్సులో ఇతర దేశాలతో స్నేహానికి ఆయన శ్రమిస్తే, నేడు 2023లో అదే భారత్ ‘జీ20’కి అధ్యక్ష పీఠం దాకా ఎదిగింది. పోటీ దేశాల కన్నా వేగంగా పెరుగుతున్న దేశమైంది. అప్పట్లో ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో బెరుకుగా మాట్లాడిన అదే వ్యక్తి ఇప్పుడు విదేశీ పర్యటనలు, డజన్ల కొద్దీ శిఖరాగ్ర సదస్సుల్లో ఆరితేరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా సహచరుడు ‘మోదీ... ది బాస్’ అని మైకులో అంటే, వచ్చే అమెరికా పర్యటనలో భారత ప్రధాని వైట్‌హౌస్ విందుకు అప్పుడే టికెట్లు అమ్ముడై పోయాయంటూ, ఆటోగ్రాఫ్ కావాలని అగ్రరాజ్య అధినేత బైడెన్ చమత్కరించడం గమనార్హం. మోదీ మాటల్లోనే చెప్పాలంటే, ‘నేను కలసిన నేతలందరూ ‘జీ20’కి భారత సారథ్యం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది భారత్‌కు గర్వకారణం.’ ఇవాళ భారత్ ప్రపంచంలోని అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో ప్రథమ స్థానానికి దూసుకుపోతున్న మన గడ్డపై ఈ మానవ వనరులకు తోడు అపార ప్రతిభ, అరచేతిలో సాంకేతికత ఉన్నాయి. వాణిజ్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, మొబైల్ తయారీ, అందివచ్చిన అంకుర సంస్థల ఉద్యమం లాంటి అనేక సానుకూలతలతో పురోగమిస్తున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నది. హరిత ఉదజని టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఖరారు చేసుకోవడం మొదలు వలసలు – రాకపోకల భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపీఏ) దాకా ఆస్ట్రేలియా – భారత్‌లు తాజాగా సంతకాలు చేయడం ఆ ధోరణికి కొనసాగింపే! ఇవన్నీ విద్యార్థులు, వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను సులభతరం చేస్తాయి. ఆర్థిక, దౌత్య సంబంధాలైనా, అత్యంత కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక దోస్తీలైనా బాగుండాలంటే మనుషుల మధ్య ఆత్మీయ బంధాలు ప్రధానం. ప్రజాస్వామ్య దేశాలతో, ప్రవాస భారతీయులతో కలసి అడుగులు వేస్తున్న నమో భారత్ అనుసరిస్తున్న మార్గమూ అదే! -
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే. మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు. తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది. జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే. ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం. అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి. మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం. ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్‌గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన. -
అధీనరేఖ మళ్లీ రక్తసిక్తం!
సంపాదకీయం: విఫల రాజ్యం తనకు తానే కాదు... ఇరుగు పొరుగు దేశాలకూ ఎంత ముప్పుగా పరిణమిస్తుందో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. జమ్మూ-కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో అధీన రేఖ ఆవలి నుంచి వచ్చిన సాయుధ ముఠా గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై సోమవారం రాత్రి కాల్పులు జరిపి ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ వచ్చినవారు పాకిస్థాన్ సైనికులా, ఉగ్రవాదులా అన్న అంశంపై జరుగుతున్న చర్చ సంగతి అలా ఉంచితే పాకిస్థాన్ భూభాగం నుంచి వచ్చినవారు ఈ ఘటనకు పాల్పడ్డారన్నది మాత్రం వాస్తవం. పూంచ్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో తమ సైన్యం ప్రమేయమేమీ లేదని పాకిస్థాన్ ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేసింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్‌లో జరుగుతున్న వివిధ ఉగ్రవాద ఘటనలకు మూలాలు తమవద్దే ఉన్నాయని పదే పదే రుజువవుతున్నా వాటిని నిరోధించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోలేకపోతోంది. తాజా ఘటన ఆ పరంపరకు కొనసాగింపేనని గ్రహించి తన వైఫల్యాన్ని అంగీకరించక పోగా ‘మా సైన్యం కాల్పులకు దిగలేద’ని చెబితే సరిపోతుందని పాక్ ప్రభుత్వం ఎలా అనుకుంటున్నదో అర్ధం కాదు. 2003లో అధీన రేఖ వద్ద కాల్పుల విరమణ ప్రకటించాక మూడు నాలుగేళ్లపాటు సరిహద్దులు ప్రశాంతంగానే ఉన్నాయి. అటు తర్వాత అడపా దడపా కాల్పులు, మిలిటెంట్ల చొరబాటు యత్నాల వంటివి చోటుచేసుకోవడం మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా అధీనరేఖ వద్ద పరిస్థితి మొదటికొస్తున్న సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది కాల్పుల విరమణకు సంబంధించి అక్కడ మొత్తం 44 ఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది సోమవారం ఘటనతో కలుపుకుంటే ఇప్పటికే 57 ఘటనలు జరిగాయి. ఈ జనవరిలో మెంధార్ సెక్టార్లో పాక్ దళాలు ఇద్దరు భారత జవాన్లను కాల్చిచంపి వారిలో ఒకరి తలను ఎత్తుకుపోయాయి. మన సైన్యం చెబుతున్నదాన్ని బట్టి ఈ ఏడాది తొలి ఏడు నెలల కాలంలోనూ 100 మంది ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఈ రెండు నెలల కాలంలోనే మన సైన్యం 19 మంది ఉగ్రవాదులను కాల్చిచంపింది. ఇవన్నీ అధీనరేఖ వద్ద ఆనాటికానాటికి పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నప్పుడల్లా మన ప్రభుత్వం పాకిస్థాన్‌కు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నది. కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోంది తప్ప మెరుగుపడటం లేదు. పాకిస్థాన్‌తో వచ్చిన సమస్యేమిటంటే అది భౌగోళికంగా ఒక ప్రాంతమే అయినా, దానిపై పటిష్టమైన నియంత్రణగల రాజ్యవ్యవస్థ అక్కడ కొరవడింది. అక్కడి పౌర ప్రభుత్వం అధీనంలో ఉండటాన్ని సైన్యం నామోషీగా భావిస్తుంది. గత ఐదేళ్లుగా అలా చెప్పుచేతల్లో ఉంటున్నట్టు కనబడుతున్నా అది అంతంత మాత్రమే. ఇలాంటి అనిశ్చితిలో పాకిస్థాన్‌లో ఏమైనా జరగవచ్చు. ఉగ్రవాది బిన్ లాడెన్ రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఏళ్ల తరబడి ఆ సంగతిని గ్రహించలేని నిస్సహాయ స్థితి పాక్ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న అమెరికా సైన్యం ఆకాశమార్గంలో వచ్చి లాడెన్‌ను చంపి శవాన్ని సైతం పట్టుకెళ్లాకగానీ అక్కడి పాలకవ్యవస్థకు తెలియలేదు. రెండు నెలలక్రితం పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని అందరూ ఆశించారు. దానికితోడు షరీఫ్ కూడా అలాగే మాట్లాడారు. ఇరుదేశాల సంబంధాల్లోనూ ఏర్పడ్డ సంక్షోభాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. భారత్ లక్ష్యంగా సాగుతున్న ఉగ్రవాద దాడులకు తమ భూభాగం వేదిక కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పారు. కానీ, మాటలు చెప్పినంత వేగంగా పరిస్థితులు మారలేదని అధీన రేఖ వద్ద యథావిధిగా కొనసాగుతున్న దుందుడుకు చేష్టలు నిరూపిస్తున్నాయి. భారత్‌తో సయోధ్యకు పాక్ నాయకత్వం ప్రయత్నించి నప్పుడల్లా ఆ వాతావరణాన్ని చెడగొట్టడానికి సైన్యం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జరిగిన ఘటన కూడా దానికి కొనసాగింపే కావచ్చు. ఎందుకంటే, వచ్చే నెలలో ఇరు దేశాల ప్రధానులూ ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలవాల్సి ఉంది. దానికితోడు పాకిస్థాన్ సైనిక దళాల చీఫ్ అష్ఫాక్ కయానీ రిటైర్ కావాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశం ప్రస్తుతం షరీఫ్ పరిశీలనలో ఉంది. షరీఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, భారత ప్రధానితో చర్చలకు ముందు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు సైన్యం ప్రయత్నించి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో సమష్టిగా వ్యవహరించి, భారత్ నిరసనను పాకిస్థాన్‌కు ముక్తకంఠంతో తెలియజెప్పాల్సిన ప్రస్తుత తరుణంలో యూపీఏ ప్రభుత్వం తొట్రుపాటు పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అధీన రేఖ ఘటనలో తమ సైన్యం ప్రమేయంలేదని పాక్ చేతులు దులుపుకుంటే, మన రక్షణ మంత్రి ఆంటోనీ ‘ఉగ్రవాదులు, పాక్ సైనిక దుస్తుల్లో ఉన్న మరికొందరు’ కాల్పులు జరిపారని ప్రకటించారు. ఆయన ఆంతర్యమేమిటోగానీ, ఆ ప్రకటన సారాంశం మాత్రం పాక్ సైన్యానికి ప్రమేయంలేదని చెప్పినట్టే ఉంది. పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నదని అంతకు గంట క్రితమే జమ్మూ నుంచి సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఇలా భిన్నస్వరాలు వినబడటానికి కారణమేమిటి? పాక్ సైన్యమూ, దాని కనుసన్నల్లో నడిచే ఐఎస్ఐ ఉగ్రవాదులకు తోడ్పాటునంది స్తున్నట్టు పదే పదే రుజువవుతున్నా ఇంత ‘జాగ్రత్తగా’ ప్రకటన చేయాల్సిన అవసరం ఆంటోనికి ఏమొచ్చింది? ఇలాంటి అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరిం చకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై గట్టిగా ఒత్తిడి తెచ్చి, అక్కడి సైన్యం తీరుతెన్నులను ప్రపంచానికి వెల్లడించడం ద్వారా వారిని ఏకాకులను చేయవలసిన ప్రస్తుత తరుణంలో తడబాట్లకు తావుండకూడదు. దౌత్యపరంగా గట్టిగా వ్యవహరించాల్సిన తరుణంలో మనల్ని మనం బలహీనపరుచుకోకూడదు. -
దుర్గాశక్తి... బహువచనం!
సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు. సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు. నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం. -
పార్లమెంటులో ‘విభజన’ సెగలు
ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ప్రభుత్వాలు సమర్ధవంతమైనవైతే ఆ చట్టసభలు సజావుగా సమావేశం కాగలుగుతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సభల్లో ప్రస్తావనకొచ్చి, వారి సంక్షేమానికి అవసరమైన చట్టాల రూపకల్పన సాధ్యమవుతుంది. ప్రభుత్వాలకుండే మెజారిటీయే దీన్నంతటినీ నిర్దేశించదు... అందరినీ సమన్వయం చేసుకునే నేర్పు, చిత్తశుద్ధి ఉండే నాయకత్వం మాత్రమే సభలను సక్రమంగా నిర్వహించ గలుగుతుంది. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక ఈ విషయంలో తీవ్రంగా విఫలమైంది. పార్లమెంటు సమావేశమైన ప్రతిసారీ ఏదో సమస్య ముంచుకు రావడం, ఆ విషయంలో అందరినీ కలుపుకొనివెళ్లే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శించకపోవడం... ఉభయ సభలూ వాయిదాలతో గడిచిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తీరు గమనిస్తుంటే ఇవి కూడా గందరగోళ దృశ్యాలతోనే కొనసాగుతాయన్న అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభాధ్యక్ష స్థానాలవద్దకు దూసుకు రావడం, నినాదాలు చేయడంలాంటి ఘటనలు తొలిరోజు చోటు చేసుకున్నాయి. ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయానికి పదే పదే అంతరాయం కలిగింది. అటు తర్వాత కూడా పరిస్థితి అలాగే కొనసాగి చివరకు రేపటికి వాయిదాపడ్డాయి. సభల్లో జరిగింది సరేగానీ... వెలుపల కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న మాటలు తీవ్ర గందరగోళం కలిగిస్తున్నాయి. విభజన అంశాన్ని తమతో పార్టీ పెద్దలు అసలు చర్చించలేదని కొందరు అంటుంటే... 15 రోజులక్రితం చెప్పారని, అయితే అది జరగదన్న భరోసాతో ఉన్నామని ఒక ఎంపీ వెల్లడించారు. ఎలాగూ విభజన జరుగుతున్నది కనుక...రాయలసీమ సంగతి కూడా ఇప్పుడే తేల్చుకుంటే మంచిదని ఇంకొకాయన అన్నారు. ఇంతటితో ఆగలేదు. రాజీనామాలవల్ల ఉపయోగంలేదని, విభజన గురించి పార్లమెంటులో చర్చకొచ్చినప్పుడు గట్టిగా నిలదీయడానికి ఇది ఆటంకమవుతుందని, తాము గనుక సభలో ఉంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాలని డిమాండు చేస్తామని ఒకరోజు చెబుతారు. సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది గనుక రాజీనామా చేస్తున్నామని మరుసటి రోజు ప్రకటిస్తారు. ఇలా గత నాలుగైదురోజులుగా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఈ ఎంపీలంతా ఇప్పటికే ప్రజల్లో కావలసినంత అయోమయాన్ని సృష్టించారు. అది చాలదన్నట్టు ఇప్పుడు పార్లమెంటుకూ దాన్ని తీసుకెళ్లారు. తెలుగుదేశం ఎంపీల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ఒక ప్రకటన చేసివున్నారు. హైదరాబాద్ తరహాలో రాజధానిని ఏర్పాటుచేసుకోవడానికి సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు మంజూరుచేయాలని ఆయన సూచించారు. బాబును ఈ విషయమై నిలదీయడంగానీ, ఆయన ప్రకటనతో విభేదిస్తున్నామని చెప్పడంగానీ చేయని సీమాంధ్ర టీడీపీ ఎంపీలుకూడా పార్లమెంటును స్తంభింపజేయడంలో కాంగ్రెస్ ఎంపీలతో చేతులు కలిపారు. రోజుకో మాటగా, పూటకో వేషంగా సాగుతున్న ఈ వ్యవహారంవల్ల ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతారని, ఉద్రేకాలకు లోనవుతారని ఈ రెండు పార్టీల నాయకులూ మరిచిపోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమూ, ప్రభుత్వపరంగా దానికి సంబంధించిన లాంఛనాలు పూర్తిచేయడానికి అది చురుగ్గా కదులుతున్న తీరూ బహిరంగంగా కనబడుతూనే ఉన్నది. ఈ నిర్ణయం సంగతి తమకు ముందుగానే చెప్పివుంటే దాని పర్యవసానాలెలా ఉంటాయో పార్టీ పెద్దలకు వివరించడం...విభజనకు ముందు చేయాల్సిందేమిటో, తేల్చవలసిన సమస్యలేమిటో వారి దృష్టికి తీసుకెళ్లడం ఈ ఎంపీల, మంత్రుల బాధ్యత. ఈ విస్తృతమైన సమస్యను కేవలం పార్టీలో చర్చించడం కాక... భిన్న ప్రాంతాల, భిన్నవర్గాల ప్రజల్లో చర్చకుపెట్టి వారిని ఒప్పించాలని చెప్పాలి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇందులో ఏమైనా చేశారా? పోనీ, కాంగ్రెస్ పెద్దలు తమను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అయినా బహిరంగంగా ప్రకటించారా? ఇవేమీ చేయలేదు. ఎవరినీ సంప్రదించకుండా, ఏమీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని... అందువల్ల వచ్చే క్రెడిట్ తమకే దక్కాలన్న దురాశతో కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించడంవల్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. కనీసం నాలుగేళ్లక్రితం తెలంగాణ ఏర్పాటు ప్రకటనచేసి, వెనక్కు తీసుకున్నాకైనా... పారదర్శకంగా వ్యవహరించి అన్ని ప్రాంతాల ప్రజలనూ విశ్వాసంలోకి తీసుకుని, విభజనకు సంసిద్ధుల్ని చేసివుంటే ఇప్పుడున్న ఉద్రిక్తతలు ఏర్పడేవి కాదు. కొత్త రాష్ట్రానికి రాజధాని నగరం ఏర్పాటు, కృష్ణా జలాల సమస్య, ఉద్యోగుల బదలాయింపు, ఉపాధి వంటి ఎన్నో అంశాలపై పరిశీలన జరిపి, ప్రజల్లో తలెత్తే సవాలక్ష సందేహాలకు జవాబిచ్చి విభజన ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కాంగ్రెస్ అనాలోచిత వైఖరివల్ల ఇప్పుడు పరస్పర అపోహలు, ఉద్వేగాలు పెరుగుతున్నాయి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సి అంశాలను ఇప్పుడు తలకెత్తుకుని, వాటి పరిష్కారానికి కమిటీలను ఏర్పాటుచేస్తామని దిగ్విజయ్‌సింగ్‌లాంటి వారు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలకు అభయం ఇస్తున్నారు. కుంభకోణాలతో అన్నివిధాలా భ్రష్టుపట్టిన యూపీఏ మరోసారి అధికారంలోకి రావడం అసాధ్యమని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి హామీలకు విలువేమిటి? స్వరాష్ట్రాల్లో తిరస్కృత నేతలుగా ముద్రపడిన వీరంద రూ చేతికి ఎముక లేకుండా హామీలిచ్చేందుకు ఎగబడటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇన్నేళ్ల పాలనానుభవం నుంచి వీరు నేర్చుకున్నది ఇదా అని విస్తుపోతున్నారు. -
సాహిత్యం- కొత్త పుస్తకాలు
మావో కుహనా మార్క్సిస్టు! మేం మళ్లీ వస్తాం..... కొందరు టేబుల్‌ను తిరగేస్తారు. నాలుగు కాళ్లు తిరగబడి అడుగు కనపడుతూ... అదీ టేబులే! కాని చూడాల్సిన పద్ధతి వాడాల్సిన పద్ధతి అదేనా? కాని ఒకోసారి అదీ తప్పు కాదు అంటారు తోలేటి జగన్మోహనరావు వంటి అన్వేషకులు. ఇవాళ్టి ఈ పెట్టుబడిదారి ప్రపంచంలో, అమెరికా కేంద్రక ప్రపంచంలో, ‘స్పాన్సర్డ్’ ప్రజాస్వామ్య ఉద్యమాల/ రబ్బర్‌స్టాంప్ ప్రభుత్వ ఏర్పాటుల ప్రపంచంలో భవిష్యత్తు మార్క్సిజానిదే అని చెప్పడానికి సాహసిస్తున్నారు తోలేటి జగన్మోహనరావు. మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడానికి దాని ఉత్థానాన్ని, పతనాన్ని విశ్లేషించడానికి ఆయన వెనక్కు వెనక్కు ప్రయాణిస్తూ అధ్యయనం చేస్తూ ‘తప్పులు ఎన్ని చేసినా’ స్టాలిన్‌ను గొప్ప మార్క్సిస్టు- లెనినిస్టుగా గుర్తిస్తూ, ఒప్పులు ఎలా ఉన్నా మావో మార్క్సిజానికి తీవ్ర నష్టం కలుగచేశాడని భావిస్తూ నిర్ధారణలకు వచ్చినట్టుగా కనిపిస్తారు. ఇలాంటి మాటలు సాధారణంగా చాలామంది మావో భక్తుల గుండెలవిసి పోయేలా చేస్తాయి. ఈ పుస్తకాన్ని దూరంగా పుల్లతో నెట్టేయాలని భావిస్తారు కూడా. కాని రచయితకు ఈ సంగతి తెలుసు. అందుకే ఓపెన్ మైండ్‌తో చదవమని కోరుతున్నారు. ఈ ప్రపంచం మార్క్సిజం వెలుతురులో కళకళలాడాలని ఆయన కోరిక. అయితే అందుకు పాత దేవుళ్లను గుడ్డిగా పూజించకుండా కొత్త భూమికలను ఏర్పాటు చేసుకోవాలనేదే కామన. ఏమైనా ఇది పేజీల కొద్దీ చర్చకు తావు ఇచ్చే పుస్తకం. ఆస్తికులు, నాస్తికులు కూడా తప్పక చదవాలి. చర్చించాలి. తోలేటి వంటి సీరియస్/సీనియర్ రచయిత ఏడేళ్ల పాటు శ్రమకోర్చి రాశారంటే ఇది పైపైన చూసి నాలుగు రాళ్లు విసిరే పని ఎంత మాత్రం కాదు. మేం మళ్లీ వస్తాం- తోలేటి జగన్మోహన రావు; వెల: రూ.150; ప్రతులకు: 99082 36747 నిఖిలేశ్వర్ విమర్శ కవిత్వ శోధన నిఖిలేశ్వర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. దిగంబర కవిగా మాత్రమే గాక కథా రచయితగా (నిఖిలేశ్వర్ కథలు), తెలుగు/హిందీ అనువాదకుడిగా (మరో భారత దేశం - వివిధ), జైలు జ్ఞాపకాలు మిగుల్చుకున్న ఉద్యమకారుడిగా (గోడల వెనుక) ఆయన రచనలు పాఠకులను విస్తృతంగా చేరాయి. మండుతున్న స్వరం, ఈనాటికీ వంటి కవిత్వ సంపుటులతో ఆయన తన వ్యక్తిగత ఉనికిని కవిగా చాటుకున్నారు కూడా. అయితే కవిత్వం పట్ల తనకున్న ఆసక్తిని ఆర్తిని విశ్లేషణాదృష్టిని ఆయన వృథా పోనివ్వలేదు. అనేక సందర్భాల్లో కవులను, వారి కవిత్వాలను, కవితా ధోరణులను, కవిత్వ పరిణామాలను తన వ్యాసాలలో రికార్డు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ కలిపి ఇప్పుడు ‘కవిత్వ శోధన’ పేరుతో పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో ఉన్న వ్యాసాలలో ‘తెలుగులో ఒక్క ఆధునిక మహాకావ్యం కూడా రాలేదు’, ‘భావ దారిద్య్రమా? కవిత్వ లోపమా?’, ‘శ్రీశ్రీకి ముందు అంతా శూన్యమా?’ మంచి ఆలోచింపదగ్గవి. నిజమైన ప్రజాపోరాటాలు సాహిత్యానికి సక్రమమైన రూపు ఇస్తాయి అని విశ్వసించే నిఖిలేశ్వర్ భావధారను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. కవులు, విమర్శకులు తప్పక చదవదగ్గ పుస్తకం. కవిత్వ శోధన- నిఖిలేశ్వర్; వెల: రూ.75; ఎమెస్కో ప్రచురణ; ప్రతులకు: 0866 2436643 గొల్ల రామవ్వ.... కెటిల్... కరీంనగర్ జిల్లా కథలు.... కరీంనగర్ అంటే అందరికీ తెలిసింది అది విప్లవభూమి అనే. కాని అక్కడ ఉద్యమాలతో సమానంగా కథ కూడా వికసించింది. రజాకార్ ఉద్యమకాలంలో సాక్షాత్తు పి.వి.నరసింహారావే ప్రజల పక్షాన నిలబడి ‘గొల్ల రామవ్వ’ వంటి శక్తిమంతమైన కథను రాశారు. గూడూరి సీతారాం, తాడిగిరి పోతరాజు, అల్లం రాజయ్య, బి.ఎస్. రాములు.... కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద పెద్ద కథలు బయలుదేరి వచ్చి తెలుగు కథను సంపద్వంతం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విశాల సాహిత్య అకాడమి ‘ఆధునిక కథా సరిత్సాగరం’ పేరుతో కరీంనగర్ జిల్లా కథలను వివిధ సంకలనాలుగా వెలువరిస్తోంది. ఇప్పటికి మూడు సంకలనాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగోది వచ్చింది. మొత్తం 20 మంది కథకుల కథలు ఉన్న ఈ సంకలనంలో కొక్కుల పద్మావతి, గుండెడప్పు కనకయ్య, కూతురు రాంరెడ్డి, వేముల ప్రభాకర్ వంటి వర్తమాన కథకులతో పాటు బిఎస్ రాములు, గూడూరి సీతారాం, పివి నరసింహారావు, తాడిగిరి పోతరాజు వంటి సీనియర్ రచయితల కథలు కూడా ఉన్నాయి. మరో విశేషం ఇవాళ ‘గణపతి’గా అందరికీ తెలిసిన మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణరావు రాసిన ‘ఎత్తున్రి పిడికిళ్లు’ కథ కూడా ఇందులో ఉంది. కరీంనగర్ జీవన పరిణామాలకు అద్దం ఈ సంకలనం. కరీంనగర్ జిల్లా కథలు (నాల్గవ సంపుటి)- సంపాదకులు: బిఎస్ రాములు, వనమాల చంద్రశేఖర్; వెల: రూ.100; ప్రతులకు: 83319 66987, 97047 08980 -
ముల్లా నసీరుద్దీన్ కథలు
ముల్లా నసీరుద్దీన్ వాక్చమత్కారానికి, సద్యఃస్ఫూర్తికి పెట్టింది పేరు. వ్యంగ్యంతో కూడిన హాస్య కథలు ఆయన సొత్తు. సామాన్యుడులా కనిపించే అసామాన్యుడు. అమాయకుడులా కనిపించే అఖండ మేధావి. విదూషకుడులా కనిపించే జ్ఞాని. సూఫీ తత్వవేత్త. డాబు, దర్పం ఏ మాత్రం ఎరుగని నిష్కల్మష హృదయుడు. ప్రజల మనిషి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముల్లా నసీరుద్దీన్ టర్కీ దేశంలో పుట్టి ఏడు వందల ఏండ్లు గడిచిపోయినా ప్రపంచం ఆయన్ను మరచిపోలేదు. పోదు. ప్రజలు ఆయన్ను ఎంతగా ప్రేమించారంటే, చాలా దేశాలు ఆయన్ను తమ దేశానికి చెందిన వాడుగానే భావించి గౌరవిస్తున్నారు. మొదట్లో ఆయన పేరు మీద ఉన్న కథలు ఎన్నో చెప్పలేముగాని, ప్రతి తరంలోనూ కొత్త కొత్తవి చేర్చబడుతూ, పాతవి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ, నేటికి వాటి సంఖ్య వెయ్యి వరకు వచ్చింది. చాలా దేశాల్లో ఈ కతలు వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా మార్పు చెంది, జానపద కథల్లో భాగమై పోయాయి. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ కథలు అనువాదం చెందాయి. నలుగురు కలిసి కూర్చున్న చోట, నసీరుద్దీన్ కథలు చెప్పుకొని ఆనందించటం చాలా దేశాల సంస్కృతుల్లో ఆనవాయితీగా ఉన్నది. సందర్భానికి తగ్గట్టుగా ఏదో కథ ఉంటుంది. ప్రతి కథలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోతుగా ఆలోచిస్తే తెలిసే లోపలి అర్థం ఇంకొకటి ఉంటుంది. గంభీరమైన తాత్వికార్థం ఉండబట్టే ఈ కథలకు అంతటి ఖ్యాతి, గౌరవం లభించింది. ముల్లా నసీరుద్దీన్ కథల గురించి ఉపన్యసించే కంటే, ఆ కథల్నే ఒకటి రెండు వినిపిస్తే వాటి గొప్పతనం వినేవాళ్లకు చప్పున స్ఫురిస్తుంది. ఎవరిని నమ్మేది? ముల్లా నసీరుద్దీన్ ఇంటికి ఓ పొరిగింటాయన వచ్చి తలుపు కొట్టాడు. ముల్లా తలుపు తీశాడు. ‘ఈ ఒక్కరోజుకు నీ గాడిదను అరువిస్తావా? పక్క ఊరికి సరుకు తీసుకు వెళ్లాలి’ అని అడిగాడు ఆ వచ్చినాయన. గాడిదను ఇవ్వడం ముల్లాకు ఇష్టం లేకపోయింది. తన అయిష్టత బయట పడకుండా ముల్లా సమాధానం చెప్పాడు.‘క్షమించాలి. ఏమనుకోకు. నేను ఈ వరకే గాడిదను ఇంకొకరికి ఇచ్చాను’సరిగ్గా అదే సమయానికి దొడ్లో కట్టివేసిన గాడిద ఓండ్ర పెట్టటం వినిపించింది. ‘ముల్లా. మరి నీ గాడిద అరుపు వినిపిస్తోంది గదా’ అన్నాడు ఆ పొరిగింటాయన. ‘ఎవర్ని నమ్ముతావు నీవు?’ చిరాగ్గా అడిగాడు ముల్లా. ‘నన్నా... ఆ గాడిదనా?’ ఒకటే రుచి ద్రాక్ష పళ్లతో నిండిన రెండు బుట్టల్ని గాడిద మీద వేసి తోట నుండి తిరిగి వస్తున్న ముల్లాను చూశారు కొంతమంది పిల్లలు. వాళ్లు నసీరుద్దీన్ చుట్టూ చేరి రుచి చూడటానికి కాసిని ద్రాక్ష పళ్లు అడిగారు. ముల్లా ద్రాక్ష గుత్తినొక దాన్ని తీసి తలా ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ‘అన్ని ద్రాక్ష పళ్లు ఉన్నవి గదా నీ దగ్గర. మాకిచ్చేది ఇంతేనా?’ అని గొణిగారు వాళ్లు. ‘బుట్టడైనా, ఒక్కటైనా తేడా ఏం లేదు. అన్నింటిదీ ఒకటే రుచి’ అంటూ ముల్లా ముందుకు సాగిపోయాడు. ప్రసంగం: ఓసారి నసీరుద్దీన్‌ను మతం గురించి ప్రసంగించవలసిందిగా ఆ ఊరి వాళ్లు కోరారు. ప్రసంగించే ముందు నసీరుద్దీన్ అడిగాడు- ‘నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?’. తెలియదని చెప్పారు వాళ్లు. వెంటనే నసీరుద్దీన్ ‘నేను ఏం మాట్లాడబోతున్నానో తెలియనివాళ్ల ముందు ప్రసంగించటం నాకు ఇష్టం లేదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్లో వాళ్లు చాలా తర్జనభర్జన పడి, మర్నాడు మళ్లీ ఆయన్ను పిలిచారు. ఈసారి నిన్నటికి మల్లే అదే ప్రశ్న వేయగా అందరూ ‘తెలుసు’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముల్లా ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు ముందుగానే తెలుసు గాబట్టి మీ సమయాన్ని నేను వృథా చేయను’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.దాంతో వూరి వాళ్లందరూ నిజంగానే అయోమయంలో పడ్డారు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని, మరుసటి రోజు మళ్లీ నసీరుద్దీన్‌ను ఆహ్వానించారు. అతడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు తెలుసా?’ ఈసారి వాళ్లంతా ముందుగానే కూడబలుక్కుని వచ్చారు. అందువల్ల సగం మంది ‘తెలుసు’ అని, సగం మంది ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ అన్నాడు- ‘తెలిసిన సగం మంది తెలియని సగం మందికి చెప్పండి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లెక్క ఒకప్పుడు నసీరుద్దీన్ దగ్గర కొంత డబ్బు పోగైంది. దాంతో చాలామంది ఆయన చుట్టూ చీమల్లా చేరారు. ఒకాయన నసీరుద్దీన్‌ను అడిగాడు ‘ముల్లా. నీకెంత మంది స్నేహితులు ఉన్నారో లెక్క చెప్పగలవా?’ అని. అందుకు నసీరుద్దీన్ అన్నాడు, ‘ఇప్పటికిప్పుడు లెక్క చెప్పటం ఎలా కుదురుతుంది? చేతిలో పైసా లేనప్పుడు గదా ఆ లెక్క తెలిసేది? ’వెతకడం ఓసారి ముల్లా నసీరుద్దీన్ తన ఇంటి బయట ఏదో వెతుకుతూ ఒకతనికి కనిపించాడు. ఏమిటి అని అడిగితే తాళం చెవి కోసం అని సమాధానం చెప్పాడు. ఆ అడిగిన మనిషి కూడా ముల్లాతో పాటు వెతకటం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక అతడు అడిగాడు. ‘నీవు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నావు?’ ముల్లా సమాధానం - ‘ఇంట్లో’ ‘మరి ఇక్కడ వెతుకుతున్నావెందుకు?’ ‘ఇంట్లో కంటే ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది’ అని ముల్లా సమాధానం. ఇలా ఉంటవి ముల్లా నసీరుద్దీన్ కథలు. అటు టర్కీ నుంచి ఇటు చైనా, రష్యాల దాకా ఇవాళ ఆయన పేరు విననివాళ్లు లేరు. ముల్లా నసీరుద్దీన్‌ను కొన్ని దేశాల్లో నసీరుద్దీన్ హోడ్జా అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నసీరుద్దీన్ ఉత్సవం ప్రతి సంవత్సరం అతని నివాస స్థలమైన టర్కీలోని అక్సెహిర్ పట్టణంలో జూలై 5- 10 మధ్య జరుగుతుంది. యునెస్కో వారు 1996-97 సంవత్సరాన్ని అంతర్జాతీయ నసీరుద్దీన్ సంవత్సరంగా గుర్తించి, అతని కథలకు అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగచేశారు. - దీవి సుబ్బారావు -
హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్....
బడబడమని కురుస్తున్న వర్షం. దడదడమని మెరుపులు. అర్ధరాత్రి అవుతోంది. ఆ ఇంట్లోని తల్లి, పెద్ద కూతురు, కొడుకు, చిన్న కూతురు అందరూ కారిడార్‌లో నిలబడి వీధి వైపు చూస్తూ ఉన్నారు. కాని వాళ్లు ఎదురు చూస్తున్న ఆ ఇంటి పెద్ద రాలేదు. సాయంత్రం వెళ్లాడు- ఇప్పుడే వస్తానని. కాని రాలేదు. ఎక్కడ వెతికినా లేడు. ఎవరిని అడిగినా తెలియదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పత్తా లేడు. అతనేం పిచ్చివాడా? రిటైర్డ్ ప్రొఫెసర్. ఇల్లు ఉంది. వాకిలి ఉంది. భార్య... పిల్లలు... కాని వెళ్లిపోయాడు. ముసలి వయసులో. ఎందుకు వెళ్లిపోయి ఉంటాడు? అతనికి బాధ్యత లేదు అని కొడుకు అన్నాడు. అతడికి ఇల్లు పట్టలేదు అని భార్య అంది. అతడు ఒక మామూలు మనిషి... కాని మనం ఒక మేధావి అనుకున్నాం అని పెద్ద కూతురు అంది. అతడొక అహంకారి అని చిన్న కూతురు భావించింది. రోజులు గడిచాయి. మళ్లీ వానాకాలం వచ్చింది. తండ్రి ఆచూకీ లేదు. అతడు ఉండగా బాధ్యతగానే ఉండేవాడు అని కొడుక్కి అనిపించింది. అతడు ఉండగా ఇంటిని పట్టించుకునేవాడు అని భార్యకు అనిపించింది. అతడు మేధావి అని పెద్ద కూతురికి అనిపించింది. అతడు నిగర్వి అని చిన్న కూతురికి అనిపించింది. కాని అతడు ఏమిటి? ఏమో ఇవన్నీ కావచ్చు. అసలేమీ కాకపోవచ్చు. మరి అతడు ఎందుకు వెళ్లిపోయాడు? మనందరి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఒక మీడియోక్రసీ ఉంటుంది. అసలైనదేదో చేయకుండా ఒక నాటకంలో పాత్రధారిలాగా మారిపోతూ ఉంటాం. కాని ఏం చేయగలం? మనకుండేది ఒకే జీవితం. ఒకలాంటి జీవితం. ఇంకోలా జీవించాలంటే వీలుండదు. ఆ సంగతి తెలిసి ఇంకోలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ అతడు వెళ్లిపోయాడా? మళ్లీ రానున్నాడా? ‘ఏక్ దిన్ అచానక్’ మృణాల్‌సేన్ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటి. ఊపిరి బిగపట్టి చూసేలా కేవలం ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య అతడు ఈ సినిమా (1989లో) తీశాడంటే అద్భుతం. శ్రీరామ్ లాగూ, షబానా ఆజ్మీ... వీళ్లను చూస్తుంటే మనుషులు పాత్రలుగా మారడం... స్టన్నింగ్. ఇది బెంగాలీలో రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే నవల. హిందీలో ఒక మరపురాని సినిమా. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయ్. Ek Din Achanak అని కొట్టి చూడండి. -
ఒక పెంకుటిల్లు....
గుడిసె ఉంటే నష్టం లేదు. కలో గంజో. రేషన్ బియ్యమో. ఉపాధి హామీ పథకమో. ఉంటే సరే. లేకపోయినా సరే. అడిగేవారే లేరు. బంగ్లా! అయ్య బాబోయ్. నౌకర్లు చాకర్లు కార్లు కారిడార్లు కరెన్సీ నోట్లు డాగ్స్ గేట్స్ గూర్ఖాస్. అడిగేవారే లేరు. హూ డేర్స్! కాని ఈ పెంకుటిల్లు ఉందే! ఏం వొదినా పిల్లకు ఇంకా పెళ్లి చేయలేదేం! ఏం బావగారూ అబ్బాయికి ఇంకా ఉద్యోగం పడలేదా. ఏవయ్యా సుబ్బారావ్. అమ్మను ఆస్పత్రిలో చూపించకపోతే ఎలాగయ్యా? ఏమమ్మా మహలక్ష్మమ్మ... కోడల్ని అలా రాచి రంపాన పెట్టకపోతే నాల్రోజులు పుట్టింటికి పంపొచ్చు కదా. కెమెరాలు పెట్టినట్టే. గేట్లో. వాకిలిలో. హాలులో. పెరట్లో. అందరికీ అన్ని తెలిసిపోతాయి. అందరికీ అన్నీ కావాలి. అందరూ అన్నింటి మీదా తీర్పు చెప్తారు. సమాజం అంటే ఇంకేమిటి? ఈ పేదోళ్లు? కాదు. ఈ డబ్బున్నోళ్లు? కానే కాదు. సమాజం అంటే ఈ దేశంలో అచ్చంగా మధ్యతరగతి. నలుగురూ ఏమైనా అంటారు... అనంటే మధ్యతరగతిని చూసి మధ్యతరగతివారు ఏమైనా అంటారనే. నలుగురిలో పరువు పోవడం అంటే మధ్యతరగతి వారి పరువు మధ్య తరగతివారి మధ్యన పోవడం అనే. నలుగురూ అంటే ఒక పెంకుటిల్లు. నలుగురూ అంటే ఇప్పుడు బహుశా ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్. కథ ఏం మారలేదు. కాకుంటే అప్పట్లో అందరూ కలిసి ఒక చూరు కింద ఉండేవాళ్లు. ఇప్పుడు? కొడుకు కోడలు పట్నంలో. తల్లిదండ్రులు ఊళ్లో. తమ్ముడు ఇంకో చోట. చెల్లెలు మరెక్కడో. కాని కథ మారిందా? అన్నయ్యా... బావగారి ఉద్యోగం పోయింది ఒక పదివేలు సర్దు. ఏరా... డాక్టర్లు ఆపరేషన్ అంటున్నారు ఏం చేస్తావ్? చెల్లెలి పెళ్లి బాధ్యతే లేనట్టుగా ఎవర్నో చేసుకుంటే సరా... ఇప్పుడెలా? అవే కథలు. గతంలో రెండు మూడు వేలకు ప్రాణాలు లేచిపోయేవి. కుటుంబాలు కూలిపోయేవి. మనుషులు శలభాల్లా మాడిపోయేవారు. ఇప్పుడు- ఒక రెండు మూడు లక్షల మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయగలదు. పేకమేడలా కూల్చేయగలదు. ఒక్క కాలేజీ ఫీజు చాలు ఒక తండ్రిని బికారిని చేయడానికి. నన్ను చదివించలేనివాడివి ఎందుకు కన్నావు నాన్నా... కొడుకు ఎస్ఎంఎస్ పెడితే చాల్దూ... మోసుకెళ్లడానికి ఒక ఒన్నాట్ ఎయిట్. కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ నవల 1956లో వచ్చింది. మధ్యతరగతి జీవితాన్ని చూసి చూసి, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాల్ని కాచి వడపోసి, మధ్యతరగతి బాదరబందీలతో వేగి వేగి, మధ్యతరగతి జీవితాల్లోని కాసిన్ని వెసులుబాటుల్ని- చిర్నవుల్ని- దేవుడు కరుణిస్తే కాసింత కోలుకోవటాలనీ- చూసి చూసి ఆయన రాసిన నవల ఇది. ఇంతకీ ఈ నవలలో ఏముంది? అబ్బ. చెప్పాలంటే దుఃఖం వస్తుంది. కాసింత వయసు వచ్చినవారికి బాల్యం అంతా కళ్ల ముందు తిరుగుతుంది. కాసింత టౌన్లలో గడిపినవారికి తాము నివసించిన వీధో, తాము చూసిన పక్కిల్లో, తమకు తారసపడిన కుటుంబమో, తమ మేనమామో, అన్నింటికి మించి తమ ఇల్లు... అవును... తమ పెంకుటిల్లే గుర్తుకు వస్తుంది. పనేం లేని నాన్న. ఆయనకు అణకువగా ఉండే అమ్మ. ఇంటి బాధ్యతను నెత్తిన పెట్టుకున్న బాధ్యత గలిగిన అన్న. అన్నీ తెలిసి సహనంగా అందంగా ఆదరువుగా ఇంటికి ధైర్యలక్ష్మిగా ఉండే (పెళ్లికాని) చెల్లెలు. ఒక చిన్న తమ్ముడు. కొన్ని బాకీలు. రెండు కుర్చీలు. ఒక ముసలామె. చేదబావి. ఆ పూట గడిచి. గుట్టుగా బతుకుదామనుకొని. కాని డబ్బు కష్టాలు. జబ్బులనీ పెళ్ళిళ్లనీ ప్రమాదాలనీ... ఒక తరం అలా అలా బతికింది అనుకుంటే ఇంకో తరం చతికిల పడుతుంది. ఇంకో తరం కోలుకుంది కదా అనుకుంటే ఆ పై తరం. అలాంటి కథే ఇది. కాని కొమ్మూరి వేణుగోపాలరావు గట్టిగా నమ్మిన విషయం ఒకటి ఉంది. కష్టపడాలి. రికామీగా ఉండరాదు. బాధ్యతల నుంచి పారిపోరాదు. పరిస్థితులకు దాసోహం అనరాదు. కష్టం ఒక్కటే, జాగ్రత్త ఒక్కటే, బాధ్యత ఒక్కటే మధ్యతరగతిని కొద్దో గొప్పో కష్టాల నుంచి దూరం పెడుతుంది. పెంకుటిళ్లను కాపాడుతుంది. ఆయన గ్రహించిన మరో విషయం ఉంది. మధ్యతరగతి వాళ్లు అవినీతి చేయక్కర్లేదు. జరిగిన అవినీతిని కప్పెడితే చాలు. తప్పు చేయక్కర్లేదు. తప్పును చూసీ చూడనట్టు ఉంటే చాలు. బలహీనతలను అప్రయోకత్వాలను ఒకరు కాకపోయినా మరొకరు కాచుకున్నా చాలు. ఏదో గడిచిపోతుంది. ఏం చేస్తాం మరి చాలీచాలని బతుకు. ఈ బతుకులో ఇంతకు మించి తెగించలేము. ఇది ఎంత శక్తిమంతమైన నవల అంటే ఇది చదువుతున్నంత సేపూ ఇందులోని జీవితాన్ని మనం జీవిస్తాం. ఇందులోని పాత్రలు చిదంబరం, శారదాంబ, నారాయణ, ప్రకాశరావు, రాధ, శకుంతల, చిన్న తమ్ముడు వాసు... వీళ్లందరి జీవితాల్లో జరిగే ఘటనలు కొన్ని లిప్తలపాటైనా మన ఊహాలోకంలో మన అనుభూతిలోకి వస్తాయి. సానుభూతి కలుగుతుంది. నిస్సహాయంగా అనిపిస్తుంది. వాళ్లు కొంచెం బాగుపడే పరిస్థితి వస్తే అమ్మయ్య అనిపిస్తుంది. ఈ నవల మొదలులో ఇంటి ముంగిట్లో చాలా చెత్త ఉందని చెప్తాడు రచయిత. ఆ చెత్తను తొలగించే శ్రద్ధ ఎవరికీ లేదు. (ఆనాడు) మధ్యతరగతి బలం దాని సంఖ్యే. నలుగురూ నాలుగు చేతులేస్తే ఆ చెత్త పోతుంది. నలుగురూ నాలుగు చక్రాలుగా మారితే ఇంటి బండి నడుస్తుంది. అది ముఖ్యం. ఆ ఇల్లు అలా నిలబడి ఉండటం ముఖ్యం. ఉన్న పెంకుటిల్లునో, ఏదో ఒక నీడనో, రాజీవ్ స్వగృహనో, సెకండ్ హ్యాండ్ టూ బెడ్రూమ్ ఫ్లాట్‌నో పొందాలని వెంపర్లాడే మధ్యతరగతి కాంక్ష ఉందే- అది ఆ నవలలో ఉండే మనుషులకీ ఈనాటి మనుషులకీ మారలేదు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ‘పెంకుటిల్లు’ నవలలో పొలాన్నయినా అమ్ముకున్నారుగాని ఇంటిని మాత్రం అమ్ముకోలేదు. ఎందుకంటే మధ్యతరగతి వారు ముఖం దాచుకోవడానికి ఒక ఇల్లు అవసరం. ఆ ఇల్లే గనక లేకపోతే వారి బతుకు నరకం. టైమ్ మిషన్‌లో కూచుని పాతరోజుల్లో ప్రయాణించాలనుకునేవారు ఈ నవలను చదివి బయటపడటానికి ఒకటి రెండు రోజులు పడుతుంది. కొంత విస్తృతి ఉన్నా, కొంత పధకం ప్రకారం గమనం లేకున్నా, శరత్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా ఇది అసలు సిసలు తెలుగు నవలే! మధ్యతరగతి వాళ్లది అని చెప్పుకోవడానికి ఒకే ఒక మంచి నవల! చెక్కు చెదరని పాత కట్టుబడి!