Literature
-
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
పౌరాణిక నటదిగ్గజం సోమిరెడ్డి
ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?............... మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు? ... అంటూ ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ సుయోధనుడి పాత్రధారి కుమ్మెత సోమిరెడ్డి గంభీరంగా డైలాగులు పలికినప్పుడు రంగస్థల ప్రాంగణం చప్పట్లతో ఓ ఐదు నిమిషాల పాటు మార్మోగింది. ఆ తర్వాత వన్స్‌మోర్ నినాదాలతో ప్రేక్షకులు రెచ్చిపోయారు. పౌరాణిక నాటకాలంటే ముందుగా అనంత పేరు గుర్తొచ్చేలా నవరసాలను పలికిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న వారిలో c ముందు వరుసలో ఉంటారు. అనంతపురం కల్చరల్: అచ్చు సీనియర్ ఎన్టీఆర్‌ను తలపించేలా ఉండే కుమ్మెత సోమిరెడ్డి.... రారాజు పాత్ర వేశాడంటే అభిమానులు మంత్ర ముగ్దులవ్వాల్సిందే. డైలాగులు చెప్పే తీరు, మధురంగా ఆలపించే పద్యాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిచోటా కరతాళధ్వనులు, వన్స్మోర్లతో ఆడిటోరియాలను మార్మోగించే కళాకారుల్లో సోమిరెడ్డిది అగ్రస్థానం. ఆయనలోని కళాకారుడిని గుర్తించిన అనేక సంస్థలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. కర్ణాటకకు రాఘవ కళాసంస్థ వారు ప్రతిష్టాత్మక నటులకిచ్చే ‘బళ్లారి రాఘవ పురస్కారం’తో పాటు మరెన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. పాత్రేదైనా ఒదిగిపోవడమే కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారుడు కుమ్మెత చిన్నారెడ్డి కుమారుడు సోమిరెడ్డి... చిరుప్రాయం నుంచే రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. తనకు దక్కిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తూ వస్తున్నారు. వారణాసిలో సత్యహరిశ్చంద్రునిగా, మహాభారతంలో భీముడిగా, రామాయణ ఘట్టాల్లో రాముడిగా, భాగవతంలో కృష్ణుడిగా, బాలనాగమ్మలో బాలవర్ధిగా అసమాన నటనను ప్రదర్శించే సోమిరెడ్డి ముఖ్యంగా రారాజు పాత్రలో ఒలికించే రాజసానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటారు. గత 40 ఏళ్లలో ఆయన ఎన్ని పాత్రలు పోషించినా.. సుయోధనుడి పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అనంతలోనే కాకుండా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర చోట్ల ఆయన నటించిన మయసభ సీను చూసిన ప్రేక్షకులకు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఏమిచ్చినా తీర్చుకోలేం పౌరాణిక నాటకానికి తగినట్లుగా మంచి వర్చస్సు, అభినయం, ఆంగికం అన్నీ కుదరాలంటే సద్గురువుల ఆశీస్సులుండాలి. ఆంధ్రదేశంలో విఖ్యాతి పొందిన గుమ్మడి గోపాలకృష్ణ, కోటేశ్వరరావు లాంటి వారి సరసన నటించే అవకాశం నాకు దక్కడం అదృష్టమే. దుర్యోధనుడు, భీముడి పాత్రలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అనంత రంగస్థలానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే గత నాలుగేళ్లగా నా సొంత ఖర్చుతో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నా. -
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు. ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్‌లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్‌గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఆదిభట్ల అంటే 'హరికథ'..'హరికథ' అంటే..
తెలుగు వారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది 'హరికథ'. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ - హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది,హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. 'హరికథా పితామహుడు'గా సుప్రసిద్ధుడు.'ఆటపాటల మేటి'గా అనంత వైభవశ్రీమంతుడు. ఆధునిక కాలంలో,తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి 'హరికథ'కు పట్టం కట్టిన ప్రతిభాశాలి.కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం,బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము."ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు"..... అని 'కవి సమ్రాట్ ' విశ్వనాథ సత్యనారాయణ ఒక సమావేశంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. నారాయణదాసుపై అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్,గోల్డ్ మెడల్ తీసుకున్న డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ (గుంటూరు) ఈ విషయాన్ని ఆత్మీయుల దగ్గర చెబుతుండేవారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,క ళామూర్తులు నిలువెల్లా భజించారు. రెండు చేతులు,రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది నభూతో ! న భవిష్యతి! గా పెద్దలందరూ నిర్ణయించారు. మహారాష్ట్రలో 'అభంగులు', తమిళనాడులో 'కాలక్షేపం', కర్ణాటకలో 'హరికథా కాలక్షేపం', మనకంటే కాస్త ముందుగా రూపుదిద్దుకున్నాయి. మనకు 'యక్షగానం ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు - యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. నారాయణదాసు చేతిలో 'తెలుగు హరికథ' సర్వాంగ సుందరంగా కొత్త రూపును దిద్దుకుంది, తీరు మార్చుకుంది, కొంగ్రొత్త వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో, మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు.' కథాగానం' మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది. మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం,కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళాస్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన 'హరికథా రూపం. హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు,చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో,గజ్జెకట్టి, చిరు తాళాలు మోగిస్తూ... నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే... కొన్ని వేలమంది ఒళ్ళు మరచి,ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి 'బేహాగ్' రాగ ప్రస్థానానికి 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి 'పంచముఖీ పరమేశ్వర' బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల. హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్, అరబ్బీ, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని - సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్వికత సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు రాశారు. హరికథలు, ప్రబంధాలు,శతకాలు, నాటకాలు,అనువాదాలు ఇలా అనంతముఖంగా ఆ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం.నాలుగు విధాలుగా ఆ అనువాదం సాగింది. పారశీలో నుంచి సంస్కృతంలోకి, అచ్చ తెలుగులోకి అనువాదం చేశారు. పీట్స్ జెరల్డ్ ఇంగ్లిష్ లో రాసిన దానిని కూడా అచ్చతెలుగు,సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది. 'నవరస తరంగిణి' అద్భుతమైన రచన.కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం.'దశవిధ రాగ సవతి కుసుమ మంజరి' మరో మాణిక్యం. మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది.ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక,ఎందరికో నేర్పించారు.ఆ ఋక్కులను తెలుగుగీతాలు గానూ సృష్టించాడు.ఆయన 'శంభో..' అంటూ నినాదం చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది. కేవలం,ఆయన గురించే విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు.దానికి ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు.ఎన్నో వేషాలు వేశారు. 'అచ్చతెలుగు'పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు. నూరుగంట, మొక్కుబడి,వేల్పువంద,తల్లి విన్కి (లలితా సహస్ర నామం), వెన్నుని వేయిపేర్ల వినికరి (విష్ణు సహస్ర నామ కీర్తనం) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అనేక అచ్చతెలుగు పదాలను సృష్టించారు. ఆయన ముట్టని కళ లేదు.ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు.తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే.సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు.ఆన్నీ స్వయంగా సిద్ధించినవే.రససిద్ధిని చేకూర్చినవే.చెన్నపట్టణానికి చెందిన భాగవతార్ కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని,నారాయణదాసు 'ధ్రువ చరిత్రం' అనే హరికథను రాశారు.అదే ఆదిభట్ల రచించిన మొట్టమొదటి కథ. సొంత కీర్తనలు,భాగవత పద్యాలు, పంచతంత్రకథలు కలిపి రూపకల్పన చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో 1883లో తొట్టతొలిగా ప్రదర్శన చేశారు. కాళ్ళకు గజ్జెకట్టి ఆడిన ఆ ఆటే తర్వాత ' ఆటపాటల మేటి'గా అనంతమైన కీర్తిశిఖరాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా 'అష్టావధానం' చేశారు. ఎవరో సవాల్ విసిరితే! రాత్రికి రాత్రి 'అంబరీషోపాఖ్యానం' హరికథను రూపొందించారు. అదంతా ధారణలో ఉంచుకొని, ఆ మర్నాడే అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అమితాశ్చర్యపరచారు. అది కూడా ఉర్లాం సంస్థానంలోనే జరిగింది. ఇది ఆయన రూపొందించిన రెండో హరికథ. 20 ఏళ్ళ వయస్సు రాకముందే ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు హరికథకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా కేవలం ఒక్కసారి వింటే,హృదయంలో నాటుకుపోయేది. చిన్నప్పటి నుంచీ అదే తీరు. నాలుగేళ్ల వయస్సులోనే భాగవత పద్యాలు చదివేవాడు. పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ స్కూల్ ముఖమే చూడలేదు. కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు,కీర్తనలు కేవలం విని హృదయస్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ ఏ పాసయ్యారు. పదేళ్ల ప్రాయంలోనే తాళపత్ర రచనలో ప్రావీణ్యం పొందారు. వీణావాదనా ప్రజ్ఞ కూడా సహజ ప్రతిభా సంస్కారాలతోనే అబ్బింది. బొబ్బిలి సంస్థాన విద్వాంసుడు వాసా సాంబయ్య దగ్గర కేవలం ఒక నెలరోజుల పాటు వీణలో శిష్యరికం చేశారు. తదనంతర జీవితంలో ఎందరో పెద్దలతో పరిచయ భాగ్యం ఏర్పడింది. వారి నుంచి అనేక విశేషాలు, మెళుకువలను తన సూక్ష్మగ్రాహ్య ప్రజ్ఞతో ఒంటపట్టించుకున్నారు. ఆ గానం,ఆ గాత్రం,ఆ ప్రదర్శనం,ఆ వ్యక్తిత్వం,ఆ వైభవం ఆన్నీ ముగ్ధమనోహరమైనవే.ఆయన ఆత్మకథ ' నా ఎరుక' పెను సంచలనం.తన ముప్పైఏళ్ళ వరకూ జీవితంలో సాగిన విశేషాలన్నీ అందులో ఉంటాయి.తన విలాస పురుషత్వం,రసికత్వం ఆన్నీ అక్షరబద్ధం చేశారు. ఏ అనుభవాన్నీ దాచిపెట్టని తెగువ ఆయనకే చెల్లింది. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి.యఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). సూర్యనారాయణ నుంచి నారాయణదాసుగా మహా అవతారమూర్తిగా వాసికెక్కిన ప్రతిభామూర్తి. ఈ హరికథా పితామహుడు మన తెలుగువాడు. సర్వ కళలకు రేడు. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భాషోద్యమంలో పిడుగు గిడుగు!) -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
Gidugu Rammurthy : భాష..భావాలకు వారధి
ఏయూ క్యాంపస్: భాష భావాలకు వారధి. భావాలను పలకించడం అమ్మ నుంచి అలవడుతుంది. అమ్మ నుంచి అబ్బిన భాష మనకు ఆధారంగా మారుతుంది. అమ్మ తొలి పలుకు బిడ్డలో ఆలోచనాశక్తికి ఆలంబనగా నిలుస్తూ పరిసరాలపై అవగాహన పెంచుతుంది. సమాజంపై అవగాహన పెంచడానికి, అనుబంధం పెనవేయడానికి అమ్మభాష ఉపకరిస్తుంది. ప్రపంచ భాషల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మన మాతృభాష తెలుగు. తెలుగు వారి ఆస్తి గిడుగు వాడుక భాష వ్యావహారిక భాష కావాలని పరితపించి, పోరాడి సాధించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు, అందరికీ తెలుగు భాషను చేరువ చేయాలనే లక్ష్యంతో వ్యవహారిక తెలుగును వాడుకలోకి తెచ్చిన తొలి వ్యక్తి రామ్మూర్తి పంతులు. ఆయన జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఆయన 1893 ఆగస్టు 29న పర్వతాలపేటలో జన్మించారు. గురజాడ వేంకట అప్పారావుకు సమకాలీకుడు గిడుగు. బీఏ పట్టా పుచ్చుకునే వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సవరభాషపై ఉన్న ఆసక్తితో ఆ భాషను సైతం గిడుగు రామ్మూర్తి పంతులు నేర్చుకున్నారు. తొలి విభాగం భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రవిశ్వవిద్యాలయం తొలుత కేవలం నాలుగు కోర్సులతో మాత్రమే ఆరంభమైంది. 1926లో ప్రారంభమైన ఏయూలో తెలుగు, చరిత్ర, అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం కోర్సులను ప్రారంభించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కాస్త భిన్నంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా తరువాత కాలంలో సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను సైతం దీనిలో భాగం చేశారు. నేటి పాలకులు మరింత ముందుచూపుతో ఆలోచన చేస్తూ డిజిటల్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసి, ఆడియో ఇంజినీరింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు విభాగం విరాజిల్లుతోంది. ప్రస్తుత ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ఇటీవల ఎయిడెడ్ కళాశాలల నుంచి అధ్యాపకులను తీసుకువచ్చి తెలుగు విభాగానికి పూర్వ వైభవాన్ని, జవసత్వాలను అందించారు. ఏయూకు పుస్తకాలు బహూకరించారు గిడుగు రామ్మూర్తి పంతులు తాను సేకరించిన, చదివిన అనేక పుస్తకాలను ఏయూలోని డాక్టర్ వీఎస్ కృష్ణ గ్రంథాలయానికి బహూకరించారు. నేటికీ ఈ పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. పద్మకాదంబరి, కుమారకంఠము, బాలదేవీభాగవతము, పార్వతీ పరిణయం, గిరిక పెండ్లి, భజనానంద తరంగిణి, మేజువాణీ, పెద్దాపుర సంస్థాన చరిత్రము, నాట్యోత్పలము, మాతృదేశ సంకీర్తనము, మణిమేఖల వంటి పుస్తకాలు ఏయూ గ్రంథాలయంలో భద్రపరిచారు. స్వాతంత్య్రానికి పూర్వం ముద్రించిన అనేక పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. -
Gidugu Rammurthy : తేట తెలుగు.. తేనెలొలుకు
విద్యానగర్/కరీంనగర్ కల్చరల్(కరీంనగర్): మనిషి జీవన విధానంలో ఆయువుపట్టు వంటిది మాతృభాష. అందులో జ్ఞానాన్ని పొందలేనివారిలో అభివృద్ధి తక్కువగా ఉంటుందని, వ్యక్తిత్వ వికాసం, మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఇటాలియన్ ఆప్ ద ఈస్ట్ అని ప్రశంసలందుకున్న తెలుగుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ భాషలోని నుడికారాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు వేటికవే ప్రత్యేకం. అమ్మ భాషలోనే మన భావోద్వేగాలను హాయిగా వెల్లడించగలుగుతాం. తెలుగు భాష ఉన్నతి కోసం విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి(ఆగస్టు 29న) సందర్భంగా ఏటా ఈరోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతృభాష తృణీకారం.. మాతృదేవి తిరస్కారంతో సమానం – సినీ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా..! – ప్రజాకవి కాళోజీ ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చినప్పటికీ పాలకుల నిర్వాకంతో అమ్మ భాష రోజురోజుకూ నిరాదరణకు గురవుతోంది. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మారిన కారణంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదయిపోయింది. అధికార భాషగా తెలు గును అమలు చేయాలన్నది ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు ప్రజల విజ్ఞప్తి మేరకు 2011లో కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రా చీన భాషగా ప్రకటించింది. తెలుగువారి ప్రస్తావ న మహాభారతం, బౌద్ధుల కాలంలోనూ ఉంది. తెలుగు మహాసభలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేది కపై తీసుకువచ్చి, తెలుగు భాషా సంస్కృతి, చరి త్ర, కళలను తెలుసుకొని, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టింది. 1975 నుంచి 2012 వరకు అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 మే 2న తెలంగాణ సాహితీ అకాడమీ ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అదే ఏడాది అక్టోబర్‌లో తెలుగు మహాసభలు నిర్వహించారు. అప్పటినుంచి మళ్లీ వాటి ఊసే లేకుండా పోయింది. చిరస్మరణీయుడు.. గిడుగు గిడుగు చిరస్మరణీయుడు. ఆయన వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. విశ్వవిద్యాలయాల్లో వాడుక భాష రాజ్యమేలుతోంది. పత్రికలూ పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. – నంది శ్రీనివాస్, సాహితీ గౌతమి అధ్యక్షుడు కవులు చైతన్యం తీసుకురావాలి ఆంగ్ల భాష వ్యామోహంలో పడి, తెలుగు భాషను విస్మరిస్తున్నాం, ఉద్యోగ నియామకాల్లో తెలుగు మీడియంలో చదివినవారికే ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్టు తీర్పులు తెలుగులో వెలువడేలా చూడాలి. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలి. – దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకుడు తెలుగులో సాంకేతిక విద్యనందించాలి ఆలోచనలను వ్యక్తపరిచే సాధనం అమ్మ భాష. నేడు తెలుగులో మాట్లాడటమే చిన్నతనంగా భావించడం బాధాకరం. సాంకేతిక విద్యను సైతం తెలుగు మీడియంలో అందించాలి. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి. – గాజుల రవీందర్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతృభాష నేర్పించండి తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు మాతృభాషలో కొనసాగితేనే ఆలోచన శక్తి, ప్రశ్నించేతత్వం విద్యార్థుల్లో పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆంగ్లంపై ఉన్న వ్యామోహన్ని తగ్గించి, పిల్లలకు మాతృభాష నేర్పించాలి. – కేఎస్.అనంతాచార్య, సమైక్య సాహితీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పరిపాలనలో అమలు చేయాలి తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ వర్తింపజేయాలి. వారికి పోత్సాహకాలు ఇవ్వాలి. పాలకులు పరిపాలనలో తెలుగును పక్కాగా అమలు చేయాలి. అందరం అమ్మ భాషకు పట్టం కడదాం. – మాడిశెట్టి గోపాల్, సమైక్య సాహితీ అధ్యక్షుడు, కరీంనగర్ కొత్త తరానికి అందించాలి భాషా నుడికారాలు, సాహిత్య సౌరభాలను కొత్త తరానికి అందించాలి. ప్రపంచీకరణతో మన భాషా సంస్కృతులను రక్షంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంగ్ల భాష వ్యామోహం నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. – కొత్త అనిల్‌కుమార్, తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''
పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్ బాగ్ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్ఇస్తరు.’’‘‘టికిట్ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు. లేకుంటె రెబల్ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు. ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్ గానివి. బద్మాష్వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు. -తెలిదేవర భానుమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,99591 50491 -
'ఆ చిన్నచూపే ఆమె కళ్లలోని కలలను చిదిమేశాయని తెలుసుకో'
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అంటే కశ్చితంగా కాదు అని చెప్పగలిగే ధైర్యం, సమానత్వం ఈ సమాజంలో ఉందా? ఆడవాళ్లకు దేశాన్ని పాలించే సత్తా ఉంది అని టీవీల్లో, పేపర్లో చూసి వాళ్లను మెచ్చకుంటారు..కానీ అలాంటి నైపుణ్యాలు ఉన్న ఆడపిల్ల నీ ఇంట్లోనూ ఉందని ఏనాడైనా తెలుసుకున్నావా? అబ్బాయిని పై చదువులకు పంపాలంటే ధూమ్‌ధామ్‌గా పంపే తల్లిదండ్రులు అమ్మాయిల చదువులకు మాత్రం ఆలోచిస్తున్నారు. ఆ డబ్బలన్నీ కట్నం కింద పోగేసి పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇది ఎంతకాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటికీ భయపడుతూ, భయపెడుతూ బతకాల్సిందేనా? నీ దృష్టిలో అబ్బాయే ఆదర్శనీయుడైతే, అమ్మాయి కూడా ఆధునికురాలే. మహిళ దేశాన్ని ఏలగలదు అనుకుంటావు. కానీ నీ కూతుర్ని మాత్రం ఇంకా ఆ పుక్కిడి పురాణాల్లోనే బంధిస్తున్నావు. నువ్వు కనీసం ఒక్కసారైనా ఇలా ఆలోచించలేదు.నువ్వుంటున్న ఆ గాఢాంధకారం వల్లే ఆమె ఇంకా వెలుగులను చూడలేకపోతుందని.ఒక్కసారి ఆ కళ్ళలోతుల్లోకి చూసే ప్రయత్నం చేశావా? నువ్వు చూసిన ఆ చిన్న చూపే ఆమె కళ్ళలో ఉన్న కలలను చిదిమేశాయని తెలుసుకో.తను ఒంటరై ఏడ్చిన ఆ కన్నీళ్ల బరువు తెలుసుకో.ఏ సమాజమైతే ఆమెను ఇన్నాళ్లు ఛీత్కరించిందో అదే హీన చూపు తనను ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసిందని తెలుసుకో.అయినా గతమంతా ఇదే కదా..అదే కథా!ఇప్పటికే ఆ చీత్కారాలే ఇంకా చెవుల్లో కర్ణకఠోరంగా మ్రోగుతూనే ఉన్నాయి. ఓ ప్రియ మిత్రమా.. ఇది నీకే ..ఇప్పటికీ నువ్వు పిశాచాల వేటకు బలికావలసిందేనా?నీ జీవితమంతా ఇతరులపై ఆధారపడడమేనా?కానీ వాళ్ళు నీ అసలు సిసలు నిర్వచనాన్ని ఎలా మరిచారు?బహుశా నీతో పోటీ పడలేమని వాళ్ల భయం కావచ్చు. అందుకే నీ లక్ష్యాలను అణచివేయాలని నిర్ణయించుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎలా మరచిపోయారు నిన్ను చేరుకోవడం అసాధ్యం అని.ప్రేమను పంచడంలో ఒక అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని.నిస్వార్థమైన ప్రేమను చూపే కూతురి సంతోషం ముందర ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనందాలను తీసుకొచ్చినా సరిపోల్చలేమని.నీ కలల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివైతే వేరెవరి విమర్శలు నీ స్థానాన్ని తగ్గించలేరని.. ఇంగ్లీష్ రచన -శ్రీయాన్షు, సెయింట్ ఆన్స్ స్కూల్,హైదరాబాద్ తెలుగు అనువాదం - శ్రీధర్ కందుకూరి, హైదరాబాద్ -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
Independence Day Song : తరం, తరం, నిరంతరం
దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం, కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్. (సినీ గాయకులు రవివర్మ పోతేదార్) || పల్లవి || తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జగతి కొరకు..., జాతి కొరకు..., జాగృతమవ్వాలి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 1 || ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 2 || భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! ||తరం, తరం, నిరంతరం… || (రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090) -
ఘనంగా శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా సంస్థ అధ్యక్షులు పి. విజయబాబుగారు, సభ్యులు జి .రామచంద్రారెడ్డి గారు శంకరంబాడి సుందరాచారి గారి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు విజయబాబుగారు మాట్లాడుతూ.. శంకరంబాడి సుందరాచారిగారు “ మా తెలుగు తల్లికి మల్లె పూదండ “ గీతంలో రాష్ట్రం నలుమూలలా ఉన్న విశేషాలను పొందుపరచి రాష్ట్ర వైభవాన్ని చాటారని, అంతేకాకుండా ఆధునిక ఆంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే శంకరంబాడి బుద్ధ గీత, అగ్నిపరీక్ష, గీతాంజలి వంటి రచనలతో పాటు సుందరభారతం, సుందర వాల్మీకి రామాయణము వంటి గొప్ప రచనలు అందించిన మహాకవి అనీ. తెలుగు జాతికి తేటగీతులలో అందించిన మధుర కవి అన్నారు. నటుడిగాను పత్రికారంగంలో ఉపసంపాదకుడిగా, సినీ గీత రచయితగా, అధ్యాపకుడిగా, వివిధ రంగాల్లో తన ప్రతిభాభాటలని పేర్కొన్నారు. శంకరంబాడి గారి నిరాడంబరత, ముక్కుసూటి తత్వం గురుంచి రామ చంద్రారెడ్డి గారు వివరించారు. శ్రీవారి భక్తులైన వీరు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల తిరుపతిలో జీవించారు. ప్రముఖులైన జ్ఞానపిఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, రాళ్లపల్లి రాయప్రోలు, పుట్టపర్తి వంటి ప్రముఖలైన కవుల ప్రశంసలు అందుకున్నారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో వీరి రచనలకు తగిన ప్రోత్సాహం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్త, రచయిత్రి శృంగేరి శారద గారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వంటి ప్రముఖల సమక్షాన కవితలను వినిపించి ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు. (చదవండి: అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు) -
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్‌ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్‌కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
ఆగిన కోట్లాది గానం..! మూగబోయిన విప్లవ గొంతుక..!!
వరంగల్: ఎక్కడ అన్యాయం జరిగినా.. తనకే జరుగుతున్నట్లు అన్వయించుకుని.. అందుకు తగ్గట్టుగా పాటలు అల్లి.. తన దరువుతో ఉర్రూతలూగించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన ఇక లేరనే వార్త విన్న ఉమ్మడి వరంగల్ కళాకారులు, కవులు, రచయితలు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమాలను రగిల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు.. ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది. తన గళంతో మేధావులు, భూస్వాముల బిడ్డలను సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్షితులను చేశారు. అనేక మందిని పీపుల్స్ ఆర్మీగా తయారుచేశారు. ఇప్పుడా పాట మూగబోయింది. పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ కీలక ఘట్టాలకు వేదికై న ఓరుగల్లులో.. గద్దర్ ఉద్యమ ప్రస్థానం ఇలా.. కారంచేడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ గద్దర్ చేపట్టిన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ► 1979 నుంచి 1983 వరకు చాపకింద నీరులా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ వ్యాప్తి క్రమంలో జనగామ జిల్లాలో మేథావి, విద్యార్థి, ప్రజాకవులతో ప్రజాగాయకుడిగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన నాట్యమండలి రాష్ట్ర సారధిగా గద్దర్ వ్యవహరించడంతో జిల్లా నుంచే అత్యధిక కళాకారుల చేరారు. ► 1989 : పీపుల్స్‌వార్ పార్టీకీ అప్పటి సీఎం చెన్నారెడ్డి లీగల్ పీరియడ్ ఇచ్చారు. దీంతో తొలుత జనగామలోనే గద్దర్ బహిరంగ సభ నిర్వహించి ప్రజాసమస్యల సాధనతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యంగా పెద్దఎత్తున యువత చేరేలా తన ఆటాపాటలతో చైతన్యం కలిగించారు. ► 1997 : సెప్టెంబర్‌లో వరంగల్ డిక్లరేషన్ సదస్సుకు హాజరయ్యారు. ► 1999 : కరీంనగర్ కొయ్యూరు ఎన్కౌంటర్లో అశువులు బాసిన జనగామ జి ల్లా కడవెండికి చెందిన మావోయిస్టు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్ అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్భందాలను అధిగమించి వేలాది మంది నివాళురి్పంచేలా తన ఆటపాటలతో చైతన్య పరిచారు. మైదనా ప్రాంతంలో నక్సల్ పార్టీ ప్రభావం తగ్గిన క్రమంలో దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండిలో పలు సామాజిక ఉద్యమ పోరా టాల్లో పాల్గొనడం అనివార్యంగా మారింది. ► 2007 : మలివిడద తెలంగాణ సాధన ఉద్యమంలో జనగామ డివిజన్ పరిధి బైరాన్‌పల్లి నుంచి కడవెండి మీదుగా తెలంగాణ అమరుల దీపయాత్ర ప్రారంభించారు. మణుగూరు వద్ద గోదావరి నుంచి ప్రారంభమైన కళాకారుల శాంతియాత్ర అన్ని జిల్లాల్లో 24 రోజులపాటు సాగింది. ► 2008 మే 25, 2009 : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సమావేశంలో పాల్గొన్నారు. ► 2009 : వరంగల్ ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జిల్లా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కలిసి తెలంగాణ ఉద్యమంపై ధూంధాం నిర్వహించారు. ► 2010 : ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఐదు రోజులు జిల్లాకు చెందిన ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో పాదయాత్ర చేశారు. చివరిరోజు ఆజంజాహి మైదానంలో జరిగిన సభలో గద్దర్ తన పాట, ప్రసంగంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ► 2010 అక్టోబర్ 6 : హనుమకొండ టీఎన్జీఓ భవన్లో జరిగిన వరంగల్ జిల్లా జేఏసీ స్టీరింగ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు. 2011 : బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ తనదైన శైలిలో దీపారాధన, గీతారాధనతో కార్యక్రమం చేపట్టారు. ► 2012 : ‘ఓపెన్ కాస్ట్ హఠావో సింగరేణి బచావో’ నినాదంతో చేపట్టిన బొగ్గు గనుల సంరక్షణ ఉద్యమం సందర్భంగా ములుగులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ► 2022 జూన్ : గద్దర్ వరంగల్‌లో జరిగిన తెలంగాణ అమరవీరుల సంతాపసభలో పాల్గొన్నారు. -
గద్దర్ గళం... విప్లవ గానం
కరీంనగర్/ కరీంనగర్‌కార్పొరేషన్/ తిమ్మాపూర్: ఉమ్మడి జిల్లాతో గద్దర్‌కు ఎనలేని బంధం ఉంది. హుస్నాబాద్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం మర్రి చెన్నారెడ్డి నక్సల్స్‌పై నిషేధం సడలించిన సమయంలో ఆమరవీ రుల స్తూపాన్ని ఆవిష్కరించడం ప్రధాన ఘ ట్టమని చెప్పవచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనా మా చేసి 2006లో ఉపఎన్నికకు సిద్ధమైతే కళా కారులను, కవులను పోగు చేసి జిల్లాకేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో తెలంగాణ ధూంధాం వేదికకు పురుడుపోసిన అగ్రగన్యుల్లో గద్దర్ ఒకరు. దళిత, సామాజిక, వామపక్ష, కుల,వర్గ పోరాటాల్లో గద్దర్ తన పాటలతో జనాన్ని జాగృతం చేసిన తీరును ఉమ్మడి జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. ఆర్ నారాయణమూర్తి భావోద్వేగం గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల జైత్రయాత్ర.. పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల నిర్మాణా నికి ఊపిరులూదిన జగిత్యాల జైత్రయాత్రలో అప్పటి విప్లవ రఽథసారఽఽథులతో కలిసి గద్దర్ పాల్గొన్నారు. జననాట్య మండలి తరఫున గడీల్లో దొరల పాలన, వెట్టిచాకిరీ, భూస్వాముల ఆగడాలపై పాటతో ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు.. గద్దర్‌తో సింగరేణికి విడదీయరాని అనుబంధం ఉంది. సింగరేణి సంస్థ పరిరక్షణకు గోలేటి నుంచి కొత్తగూడెం వరకు చైతన్యయాత్ర నిర్వహించారు. సంస్థవ్యాప్తంగా గనులపై మీటింగ్‌లు నిర్వహించారు. ఏఐటీయూసీతో కలిసి సంస్థ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. మానేరుతీరం.. గద్దర్ పాట ప్రవాహం సిరిసిల్ల, వేములవాడలో సాగిన సాయుధ పో రాటంలో గద్దర్ పాట ప్రవాహమైంది. 1990 దశకంలో నిజామాబాద్‌లో జరిగిన అప్పటి పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది మంది యువకులు తరలివెళ్లారు. లారీలు, బస్సుల్లో తరలివెళ్లి గద్దర్ సభలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో వందలాది మంది యువకులు పీపుల్స్‌వార్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. గద్దర్ గళంతోనే పోరుబాట స్వరాష్ట్ర సాధనలో ప్రతిఒక్కరూ పోరుబాట పట్టడానికి గద్దర్ గళమే కారణమని మేయర్ సునీల్‌రావు తెలిపారు. విప్లవోద్యమంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తుచేశారు. ఎర్ర జెండాను ఎత్తి పీడిత ప్రజలను పోరుబాట పట్టించిన వ్యక్తి అన్నారు. గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటన్నారు. 1973 నుంచి పరిచయం 1973లో వేములవాడలో రైతుకూలీ సభలో పాల్గొనేందుకు జననాట్యమండలి గాయకుడిగా వచ్చిన గద్దర్‌తో పరి చయమైందని మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్‌రావు అన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక, దళిత, తెలంగాణ మలిదశ ఉద్యమాలతో పా టు సాంస్కృతిక ఉద్యమాల్లో పాలుపంచుకున్నానని గుర్తు చేశారు. తీరని లోటు ప్రజా యుద్ధనౌక, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం అణగారిన వర్గాలకు తీరని లోటన్నారు. 1978లో వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్(ఆర్ఈసీ)లో మొట్టమొదటిసారి తాను ఇంటర్ విద్యార్థిగా గద్దర్‌ను చూశానని తెలిపారు. అప్పుడు విద్యార్థులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దు అస్తమించింది ప్రజాగాయకులు గద్దర్ మరణం నమ్మలేకపోతున్నామని, పొడుస్తున్న పొద్దు అస్తమించిందని, గర్జించే గొంతు మూగబోయిందని మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
హాస్యం... సెంటిమెంట్ కలిస్తే... అది శ్రీరమణ!
శ్రీరమణ పేరు చెప్పగానే చాలాకాలం పాటు ఆయన హాస్యం, వ్యంగ్యం గుర్తుకు వచ్చేవి. హాస్యానికీ, వ్యంగ్యా నికీ చిరునామాగా ఆయన పేరే వినబడేదంటే అతిశ యోక్తి కాదు. తర్వాత సినీ రచయితగా, బాపు–రమ ణల అంతే వాసిగా ప్రసిద్ధు లయ్యారు. ‘బంగారు మురుగు’ కథ తర్వాత నుంచి ఆయనకు గొప్ప కథకుడిగా పేరు వచ్చింది. హాస్యమూ, వ్యంగ్యమూ మాత్రమే కాదు, సెంటిమెంటు కూడా అంతే గొప్పగా పండించ గలడన్న సంగతి పాఠక లోకానికి విదితమైంది. ఇక ‘మిథునం’తో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఏ వృద్ధ దంపతులను చూసినా ‘మిథునం’ గుర్తుకు వచ్చేటంతగా ఆయన పాఠకుల హదయాలపై ముద్ర వేసేశారు. ముసిముసి నవ్వులు పూయించే వికటకవే కాదు, గుండెను తట్టి మనసు పొరల్లో తడి స్రవింపచేసే కవీ తనలో ఉన్నాడని నిరూపించుకున్నారు. హాస్య ప్రక్రియల్లో అన్నిటికన్న క్లిష్టమైనది ప్యారడీ రచన. దానికి ఎంతో అధ్యయనం, పరిశీలన కావాలి. రచయిత రచనాశైలిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో పట్టుకోగలగాలి. దాన్ని తరచుగా వాడడాన్ని గమనించి, దాన్ని ఎత్తి చూపితే నవ్వు పుట్టించే అవకాశం ఉందని గ్రహించాలి. దాన్ని ఉత్ప్రేక్షించి, ఆ అవకరాన్ని సామాన్య పాఠకుడి దృష్టికి తీసుకుని రాగల రచనాకౌశలం ఉండాలి. శ్రీరమణ ఆధునిక వచన రచయితలలో ప్రముఖులందరినీ ప్యారడీ చేశారు. వచనాన్ని ప్యారడీ చేయటం అంత సులభం కాదు. వారి మూలరచనలు చదివినవారికే ఆ ప్యార డీలలో స్వారస్యం బోధపడుతుంది. శ్రీరమణ ఆ సాహిత్యాలన్నీ చదివి ఒంటపట్టించుకున్న పండి తుడు, నిశిత పరిశీలన Výæల విమర్శకుడు, దానిలో వక్రతను పసిగట్ట గలిగిన రసజ్ఞుడు. వారిలో యింకో విశేష మేమిటంటే, ఈయన చేత చురకలు వేయించుకున్న వారు కూడా పగలబడి నవ్వేటంత సంస్కార యుతంగా రాయగలగడం! పాత్రికేయ ఉద్యోగానికే పరిమితమైతే ఆయన ఒక పరిధిని దాటలేక పోయే వారేమో! కానీ ఆయన మద్రాసు వెళ్లారు. బాపు – రమణలతో చేరారు. వారి సమస్త వ్యవహారాలూ ఈయన చూసే వారు. వారు సొంతానికైతీసిన సినిమాలలో, ఇతరులకు తీసి పెట్టిన సినిమాలలో ఈయన అనేక బాధ్యతలు నిర్వర్తించేవారు. వాళ్లు వెళ్లిన చోటకల్లా వెళుతూ వారిలో ఒకడిగా ఉన్నారు. దీని కారణంగా ఆయనకు ఎంతో విస్తృత ప్రపంచం దర్శనమైంది. ‘బంగారు మురుగు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించ బడినప్పుడు సంచలనాన్ని సృష్టించింది. దాదాపు 800 ఉత్తరాలు వచ్చాయట. ఇది మా బామ్మ కథే అని ఒకరు, కాదు కాదు... మా అమ్మమ్మ కథ అని మరొకరు... ఇలా అందరూ తమని తాము ఐడెంటిఫై చేసేసుకున్నారు. ‘మిథునం’ వెలువడే టప్పటికి అందరూ వారిలో తమ తలిదండ్రులను ఐడెంటిఫై చేసుకున్నారు. శ్రీరమణ పాత్రలు మన నిత్యజీవితంలో చూసేవే. షోడా నాయుడు, ధన లక్ష్మి... వీళ్లందరూ మన చుట్టూ ఉన్నవాళ్లే! ‘ధనలక్ష్మి’ కథలో ఆయన వ్రాసిన మాండలిక పదాలు, తెలుగు పలుకుబడులు, తెలుగువారికి దొరికే అరుదైన మృష్టాన్న భోజనం. కొన్ని వర్ణనలు క్రొంగొత్తగా అనిపించి అలరిస్తాయి. ఉదాహరణకు: ‘‘రోషం కమ్మేసిన అతని మొకం తుమ్మల్లో పొద్దుగూకి నట్లుంది.’’ ‘‘...చీమలకు చక్కెర దొర గ్గాలేంది, మనుషులం మనకు నాలుగు మెతుకులు దొరకవా...’’ ‘‘...పిండిమర మెళుకువలన్నీ ఇప్పుడు ధన మ్మకు కొట్టినపిండి...’’ ఇలాంటి చమక్కులెన్నో వారి రచనల్లో కనిపి స్తాయి. శ్రీరమణకు మొహమాటాలు తక్కువ, తెగువ ఎక్కువ. మతం పేరుతో చేసే అట్టహాసాలను వెక్కి రించడంలో దిట్ట. ఆచార వ్యవహారాల కంటె మాన వత్వానికే పెద్దపీట వేసే ‘బంగారు మురుగు’లో బామ్మ స్వాములారిని కడిగి పారేస్తూంటే మనకు లోపల్నుంచి సంతోషం తన్నుకు వస్తుంది. అలాగే ‘అరటిపువ్వు స్వాములా’రి పాత్ర ద్వారా కుహనా ప్రవచనకారులకు చాకిరేవు పెట్టేశారు. వారపత్రికా సంపాదకుడిగా ఆయన రాజకీయ నాయకుల గురించి కూడా నిర్భయంగా తూర్పార బట్టారు. నిజజీవితంలో కూడా ఆయన వ్యాఖ్యల్లో వెక్కిరింత, మాటల్లో వగరు మనల్ని తాకుతూనే ఉంటాయి. కానీ ఆయన విమర్శలో ఉన్న వాస్తవం మనల్ని ఆకట్టుకుంటుంది. నాకు బాపు–రమణలు అత్యంత ఆప్తులు. వారికి నేను వీరాభిమానిని. శ్రీరమణతో నాకు ఉన్నది పరిమిత పరిచయమే. కానీ వారి రచనలు చాలా ఇష్టంగా చదువుతాను. వారి రచనల ద్వారా, వారిలో ఉన్న హాస్యాన్ని పండించే శైలి ద్వారా సెంటిమెంట్ వ్రాయడంలో వారికున్న ప్రతిభ ద్వారా నాకు బాగా నచ్చిన, బాగా ఇష్టపడిన రచయితగా నా మనః పథంలో శాశ్వతంగా ఉండిపోతారు. అంతేకాకుండా నా ఆప్తమిత్రులు బాపు–రమణలకు అంతేవాసిగా కూడా నేను వారిని బాగా ఇష్టపడతాను. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, వ్యాసకర్త వ్యవస్థాపక ఛైర్మన్,శాంతా బయోటెక్నిక్స్ -
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
బొమ్మల చొక్కా, పూల చీర కార్టూన్లు మరి కనిపించవు..
గత వారం రవీంద్ర భారతిలో నిర్వహించిన చలం గారి సభకు వెళ్ళి వస్తుండగా మా అబ్బాయి మోహన్ నీలోఫర్ కేఫ్ మీదుగా వెడదాం, పని ఉంది అన్నాడు. ఆ నీలోఫర్ రోడ్డు, రెడ్ హిల్స్ తోవ వెంట నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ హైద్రాబాద్ నగరంలో నా బ్రతుకు ప్రారంభమయ్యింది ఇక్కడే . ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా తెలుగు సాహిత్యంలో మహామహులను చూశాను, కలిశాను, కొన్ని వందల రోజులు, గంటలు, రాత్రింబవళ్ళు వారితో కలిసి ఉన్నాను. అమాయకంగా, బ్రతుకు భాగ్యంగా ఎన్ని మంచి అనుభవాలు జ్ఞాపకాలను ఇక్కడ సంపాదించుకుని మూట గట్టుకున్నానో! ఎపుడు ఆ స్మృతుల దస్తీ విప్పినా గుప్పుమని జాజుల పరిమళమే, మిగల మగ్గిన నేరేడు పళ్ల తీపి వగరు వాసనే. ఇక్కడి హనుమాన్ టెంపుల్ పక్కనే సత్యసాయి డిజైనింగ్ స్టూడియోలో నా తొలి ఉద్యోగం మొదలయ్యింది. సత్యసాయి డిజైనింగ్ స్టూడియో యజమాని ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు. నేను చేరినప్పుడు అక్కడ ఉన్నది నలుగురం. సత్యమూర్తి గారు, వారి అబ్బాయి సాయి భాస్కర్, నేను, అఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ. అది పంతొమ్మిది వందల తొంభై ఏడు. ఆయన దగ్గర నేను ఒక నెల మాత్రమే ఉద్యోగం చేశాను. ఈ రోజుకు అది ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా గతించి పోయినప్పటికీ, నేను ప్రతి రోజూ సత్యమూర్తి గారిని తలుచుకుంటాను. ఎలా అంటే ఇదిగో ఇక్కడ నా ఎడమ పక్కన తల తిప్పి చూస్తే గోడ వైపుగా పెలికాన్ రంగు ఇంకు సీసాల మీదు గా నేను నిత్యం వాడే క్రొక్విల్ నిబ్ ఒకటి ఉంటుంది. దాని హేండిల్ చూశారూ, అది అల్లాటప్పా, అణాకాని రకమో, ఎక్కడ పడితే అక్కడ దొరికేదో కాదు, ఆర్డర్ చెయ్యగానే పొస్ట్ లో వచ్చిపడే కంపేనీ తయారి రకం ది అసలే కాదు. అదే పనిగా కొలతలు ఇచ్చి మరీ తయారు చూపించిన హేండిల్ అది. ఎబోనైట్ మిశ్రమంతో తయారు చేయించింది. సత్యమూర్తి గారు ఒక పెన్నుల కంపెనీలో ఫలానా రకంగా కావాలి అని కోరి చేపించిన హేండిళ్లు నాలుగో ఐదో ఉన్నాయి. అందులో ఒకటి ఆయన మహా చిత్రకారులు చంద్ర గారికి ఇచ్చారు , ఒకటి నాకు ఇచ్చారు. మిగతావి ఆయన వద్దే ఉన్నాయి. చంద్ర గారికి నేనంటే ఎంత వాత్సల్యం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి సారి ఏదోఒక వస్తువు నా చేతిలో పెట్టేవారు. నా జేబులో ఉంచేవారు. సత్యమూర్తి గారు కాదు నాకు మొదట ఆ హేండిల్ ఇచ్చింది. చంద్ర గారే. ఈ తయారి వెనుక కథ కూడా ఆయనే చెప్పారు. చాలా అందంగా ఉంటుంది ఆ నిబ్బు హేండిల్. దాని పై నుండి నా కన్ను తిప్పుకోలేకపోతుంటే దానిని నా చేతిలో పెట్టి ఉంచుకో అని చల్లని వెన్నెల నవ్వు నవ్వారు. అ జరిగిన కొద్ది కాలానికి పత్రికల్లో నా బొమ్మలు చూసి నన్ను తెగ ప్రేమించిన సత్య మూర్తి గారు మరో రెండు హేండిళ్ళు, కొన్ని డిప్పింగ్ నిబ్బులు చేతిలో పెట్టి ఆయనా నవ్వారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను వేస్తున్న ప్రతి బొమ్మ వెనుక నిబ్బులా నిలబడి సత్యమూర్తి గారు గుర్తు ఉండనే ఉంటారు. కథంతా ఇక్కడ మొదలు కాలేదు. అంతకు ముందే, నేను బడిలో , జూనియర్ కాలేజీలో చదువుతున్న రొజుల్లోనే మొదలయ్యింది. బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు వేయడం ఎలాగో తెలీదు. అలాంటప్పుడు విశాలాంద్ర వారి పుస్తకాల వ్యానులో పుస్తక్ మహల్ వారి ప్రచురణ, సత్యమూర్తి గారి రచన "హౌ టు డ్రా కార్టూన్స్" పుస్తకంలో ఔత్సాహికులకు స్టెప్ బై స్టెప్ పాఠాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి పేరు ఆ పుస్తకం లో చూడ్డం అంతకన్నా కన్నా ముందే నాకు తెలుసుగా. పత్రికల్లో కార్టూన్లు, కాలెండర్ల మీద గోడకెక్కిన బొమ్మలు, పుస్తకాల ముఖచిత్రాలు మాతరానికి పరిచయమే గా. బొమ్మల పరిచయం వేరు, బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పే మాష్టారుగా తెలుసుకోవడం వేరు. ఆయన రచించిన ఆ పుస్తకం ఒళ్ళో ఉంచుకుని నేను బొమ్మల సాధన చేసాను. ఆ పుస్తకం దయ వల్లనే నేను రోటరింగ్ అనే పెన్నును, బౌ పెన్ అనే సాధనాన్ని, నల్లని ఇండియన్ ఇంకు ను, తెల్లని పోస్టర్ వైట్ ని ... ఇట్లా అవసరమైన సాంకేతిక వ్యవహార జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నేల మీద పడుకుని చూస్తే మనిషి ఎట్లా కనపడతాడు? ఫ్యాను రెక్క ఎక్కి చూస్తే మనిషి ఏమని తెలుస్తాడు అనే వివరాలు నేర్చుకున్నాను. నాకు ఊహ తెలిసీ తెలియగానే మారియో మిరండా బొమ్మలు ప్రాణమై కూచున్నాయి. మనుషుల ఆ ఆకారాలు, డ్రాయింగ్ లో ఆ రిచ్ నెస్. పూలు, తీగలు, ఎగబాకిన కొమ్మలు, నిలువుగా నిలబడ్డ చెట్లు, వెనుక భవనాల సముదాయాలు, ఆ గోడకు లతల డిజైన్లు, కిటికీల మీద షోకు వంపులు. బ్రైట్ గా కనపడే ఇంకు రంగులు, గట్టి నిబ్బు పనితనం. అవంటే నాకు బాగా ఆకర్షణ. ఆ రకంగా సత్యమూర్తి గారిని తెలుగు వారి మారియో గా భావిస్తాను నేను. ఆయన రేఖ చాలా తీరుగా ఉంటుంది. కాంపొజిషన్ బాలెన్స్ గా , అక్షరాలు తీర్చి దిద్దినట్లుగా కుదురుతాయి. జస్ట్ చిక్కని నలుపుతో అలా ప్రింట్ అయిన స్టికర్ తీరుగా ఉంటుంది ఆయన చిత్ర రచన. చాలా మట్టమైన పని కనబరుస్తారు ఆయన తన బొమ్మల్లో. మనుషుల వ్యవహారం, ఆ నవ్వు, ఆ భంగిమలు, వారు తొడుక్కున్న చొక్కాలపై, కట్టుకున్న చీరల మీద, కూచున్న సోఫాల మీద పొందికైన పూలు, బొమ్మలు, నిలువు, అడ్డం చారలు, కాళ్లకు తొడుక్కున్న బూట్ల మీద వెలుతురు తళుకు. పిక్చర్ పెర్ఫేక్ట్. మనిషి గా కూడా ఆయన పెర్ఫెక్ట్ గా ఉండే వారు. తిన్నని సఫారీ సూటు, తీర్చి దువ్విన క్రాపింగ్, గట్టి కళ్ళజోడు. నేను ఆయన్ని చూసే సరికి యాభైలు దాటేసారు. యవ్వనపు రోజుల్లో ఆయన అద్భుతమైన అందగాడని, అలా ఆయన నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవని ఆయన రోజుల ఆర్టిస్ట్ లంతా చెప్పేవారు. ఆయన గురించి చంద్ర గారు చెప్పే ఒక సరదా ముచ్చట వినతగ్గది. చాలా చాలా ఏళ్ల క్రితం అప్పటికీ చంద్ర గారు ఇంకా బొమ్మల్లోకి అడుగు పెట్టని సమయంలో హైద్రాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేషన్ వారు తొలిసారిగా బాపు గారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసారుట. ఆ రోజుల్లో తెలుగు పత్రికల్లో బొమ్మల పాపులర్ ఫిగర్స్ ఇద్దరే. ఒకరు బాపు, మరొకరు "చదువుల్రావు" అనే కార్టూన్ స్ట్రిప్ వేసే సత్యమూర్తిగారు. ఆ చదువుల్రావు క్యారెక్టర్ సత్యమూర్తి గారి స్వంత బొమ్మేనని నా అనుమానం. ఆ పక్కనే జయశ్రీ అనే పెద్ద కళ్ల చిత్రసుందరి భలే ఉంటుంది . సరే! చంద్రగారు ఎక్జిబిషన్ హాల్ లో అడుగు పెట్టి బొమ్మలన్ని చూసేసి ఈ బొమ్మలేసినాయన ఎక్కడున్నాడా అని వెదుక్కుంటూ వెడితే ఒక చోట అల్లా కోలాహలంట . ఎంచక్కని చుక్కలు బొలెడు మంది ఒక పురుషుణ్ణి చుట్టు ముట్టి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అని అటో పక్కా ఇటో పక్క తనుకులాడుతున్నారుట. అంతా చేస్తే ఆయన బాపుగారు కాదు, చదువుల్రావుట. సత్యమూర్తి గారి బొమ్మకు, ఆయన హీరో పర్సనాలిటికీ అంత క్రేజ్ ఉండేదిట ఆ రోజుల్లో. బాపు ఎక్కడా అని చూస్తే ఒక చెట్టు కింద నిలబడి వంటరిగా తనమానాన ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాట్ట మహానుబావుడు. సత్యమూర్తి గారి స్టూడియో లో నేను కొంత కాలం పని చేసాను కదా. భలే ప్రొఫెషనల్ గా ఉండేది ఆయన సెటప్, బొమ్మలు గీసే పద్దతి, ఆ స్టూడియో. అచ్చం అమెరికన్ చిత్రకారుల మాదిరి డ్రాఫ్టింగ్ టేబుల్, పక్కన బొమ్మల సరంజామా, ఇంకులు, రంగులు. కాసింత దూరంలో అరలు అరలు గా తెరుచుకునే ఒక పెద్ద టేబుల్, అందులో సైజుల వారిగా, మందం వారిగా అద్భుతమైన డ్రాయింగ్ షీట్లు. చమన్ లాల్ కాగితాలు. బొమ్మలని చాలా పద్దతిగా గా వేసే వారు ఆయన , ఒక బొమ్మ మీద రకరకాల పెన్నులు వాడేవారు. చాలా వెడల్పైన ఫ్లాట్ నిబ్స్ తో రేఖలు గీసేవారు. సాలిడ్ బ్లాక్ ఫిల్లింగ్. బొమ్మల కథలు, అడ్వర్టైజ్మెంట్ కార్టూన్లు, పెద్ద పెద్ద కంపెనీల లోగొలు, మోనోగ్రామ్ లు. తీరైన పుస్తకాల కలెక్షన్, ఎన్నో విధాలైన టైపోగ్రాఫ్స్, ఫాంట్ ల పుస్తకాలు, కలర్ స్కీం గైడ్లు. అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇంకా రాలేదు. ఈ రోజు మీరు చూసే పాల ప్యాకెట్ దగ్గరి నుండి, అగ్గిపెట్టె దగ్గరి నుండి, తలకాయ నొప్పి మందు, తిన్నది సరిగా జీర్ణంకావడానికి సిరప్... అవీ ఇవని కాదు వ్యాపార ప్రపంచంలోని సమస్త వస్తోత్పత్తికి సంబంధించిన బొమ్మలు, ఎంబ్లంలు, అక్షరాలు స్వయంగా, తీరొక్క రీతిగా అన్నీ చేత్తోనే వ్రాసేవారు, చిత్రించేవారు అప్పటి చిత్రకారులు . ఇప్పుడు ఆ రోజులు, అటువంటి పనిమంతులు కరువై పోయారు. ప్రతీదీ కాపీ పేస్ట్. స్వంత బుర్ర పెట్టి ఏదీ రావడం లేదు. అన్నీ కంప్యూటరే, అన్నీ ప్రింట్ కాగితాలే, అంతా ప్లాస్టిక్ ప్రచారమే, అన్నీ కాపీ ఈజ్ రైటే. అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన రూపూ, రంగూ, రేఖ మీద, ఆ జీవితం మీద ఒక పుస్తకం తెలుగు సాహిత్యానికి , జీవితానికి మనం బాకీ ఉన్నాము. నిజానికి దానిని మనకు అందించి ఉండవలసినది సత్యమూర్తి గారు. తెలుగు పొస్టర్ డిజైన్ కు సంబంధించి చాలా విషయజ్ఞానం ఉన్న మరో వ్యక్తి శ్రీ గీతా సుబ్బారావు గారు. ఆయన ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో తెలీదు. ముందు మనం ఏదయినా పుచ్చుకొవాలనే తపన ఉంటే కదా ఇచ్చేవారికి ఇవ్వాలి అనిపించేది. గీతాసుబ్బారావు గారి అన్నగారు శ్రీ వీరాజీ గారూ ఆయన ఒక తరం తెలుగు పత్రికా జీవితాన్ని తన ఆత్మకథ గా అద్భుతంగా చెప్పుకున్నారు. అది ఏవయిందో తెలీదు. అవన్నీ పుస్తకాలు గా రావలసినది. ఏదీ రాదు. ప్రెస్ అకాడమిలు ఎందుకు ఉన్నవో నాకైతే నిజంగా తెలీదు. నేను ఆయన వద్ద ఉద్యోగం చేసింది నెల మాత్రమే . చిన్న ఊరినుండి వచ్చిన వాడిని .ఏమీ తెలీదు. స్కేలు పట్టుకోవడం, సెట్ స్క్వయర్ ఉపయోగించడం, ప్రెంచ్ కర్వ్స్ వాడి లోగో డిజైన్ లు చేయడం, అక్షరాలూ వ్రాయడం, తొంబై డిగ్రీల్లో టెక్నీకల్ పెన్ను వాడటం అన్ని ఆయన దగ్గరే తొలిసారి చూసాను, తెలుసుకున్నాను. ఆయన నా గురువు. చాలా కాలం విరామం తరువాత ఒకసారి ఆయన్ని ఒక కార్టూన్ షోలో చూశాను. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెలితే గుప్పెట నిండా గుప్పెడు నిబ్బులు పెట్టారు. ఒక మంచి డ్రాఫ్టింగ్ టేబులు వాళ్ల అబ్బాయి తో ఇప్పించారు. ఇపుడు ఏది తలుచుకున్నా గతం. ఒకానొక కాలంలో ,ఒకే కాలంలో బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, చంద్ర, గోపి, మోహన్, రాజు, బాబూ, కరుణాకర్... గార్ల వంటి అత్యంత అరుదైన చిత్రకారులు ఇక్కడ ఉండేవారు, మాతో మాట్లాడేవారు, అభిమానించేవారు, తప్పులు దిద్దేవారు ఒప్పులుగా మిగలడానికి తమదైన ప్రయత్నం చేసేవారు అని అనుకోవడం తప్పా మరేం మిగల్లేదు. ఇప్పుడు గురువులు ఎవరూ లేరు. శిష్యులుగా మిగలడానికి ఎవరికీ రానిదీ, తెలియనిదీ ఈరోజుల్లో ఏదీ లేదు. తెలుగులో బొమ్మలకు, కార్టూన్ కళకు, మనకు ఒకప్పుడు ఉండిన ఒక కళకు, నల్లని సిరాకు, పదునైన పాళికి చివరి రోజులివి. సత్యమూర్తిగారికి కూడా శ్రద్దాంజలి (ప్రముఖ కార్టూనిస్ట్, ఒక తరం గురువు సత్యమూర్తి గారు 83 ఏళ్ళ వయసులో 25-05-23 న మననుండి దూరమయ్యారు, తెలుగు కార్టూన్ లో చివరగా మిగిలిన బొమ్మల చొక్కాలు, పూల చీరలు, నిలువు చారల, అడ్డ గీతల ఫర్నీచర్ కూడా మాయమయ్యింది. అన్వర్ అర్టిస్ట్, సాక్షి