బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు | Lalit Modi used British royal names for travel papers: Report | Sakshi

బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు

Jun 22 2015 4:57 AM | Updated on Sep 3 2017 4:08 AM

బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు

బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు

ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బ్రిటన్ హోంశాఖనుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి...

లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్లకోసం ఆండ్రూ పేరు వాడుకున్నట్లు కథనాలు
లండన్/ వాషింగ్టన్/ భోపాల్ : ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బ్రిటన్ హోంశాఖనుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూతోపాటు ఇతర రాజ కుటుంబీకుల పేర్లను కూడా వాడుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆదివారం సండేటైమ్స్ అనే పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది.

ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 రెండో కుమారుడు, డ్యూక్ ఆఫ్ యార్క్ ఆండ్రూకు లలిత్ మోదీ చాలా ఏళ్లనుంచి తెలుసునని, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు మంజూరు కావడానికి కొద్దిరోజుల ముందు గత ఏడాది జూలైలో లండన్‌లో ఆండ్రూ, మోదీని కలిశారని ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉంటే వీరిద్దరిమధ్య జరిగిన సంభాషణలను వెల్లడించడానికి బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. అయితే లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడానికి ఆండ్రూ ఎలాంటి సిఫారసులు చేయలేదని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడంలో భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేశారన్న విషయం బయటకు రావడం భారత్‌లో తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మానవతా దృక్పథంతో మాటసాయం చేశానని సుష్మా చెబుతున్నప్పటికీ ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
 
స్పందించని జైట్లీ
లలిత్ మోదీ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరాకరించారు. శనివారం వాషింగ్టన్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?, లలిత్‌కు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే ఎప్పుడు రాజీనామా చేస్తారు.. అని మీడియా ప్రశ్నలు సంధించగా జైట్లీ సమాధానాలు చెప్పలేదు.

అయితే వసుంధర రాజే కుమారుడు, బీజేపీ నేత దుశ్యంత్ సింగ్‌కు లలిత్ మోదీకి మధ్య జరిగిన రూ.11 కోట్ల వాణిజ్య లావాదేవీలు వ్యక్తిగతంగా వారిద్దరికి సంబంధించినవని జైట్లీ పేర్కొన్నారు. చాలా ఏళ్లకిందట వీరిమధ్య బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో జరిగిన రుణ లావాదేవీలకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని జైట్లీ అన్నారు.
 
సుష్మకు మరో తలనొప్పి
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేశారన్న అంశంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. సుష్మ భర్త, ఆమె కూతురిని ప్రభుత్వ లాయర్లుగా మధ్యప్రదేశ్ సర్కారు నియమించడం ఇప్పుడు తాజా వివాదంగా మారింది. అయితే ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని బీజేపీ విపక్షాల విమర్శలను ఖండిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement