కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత | Coca Cola Shuts Down Global Bottling Subsidiary BIG Also Owns HCCB, More Details Inside | Sakshi

కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేత

Jul 1 2024 9:13 AM | Updated on Jul 1 2024 9:49 AM

Coca Cola shuts down global bottling subsidiary BIG also owns HCCB

ప్రముఖ కూల్‌డ్రింక్‌ కంపెనీ కోక-కోలా..తన అనుబంధ సంస్థ బాట్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ (బిగ్‌)ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో హిందుస్థాన్‌ కోక-కోలా బెవరేజెస్‌ (హెచ్‌సీసీబీ), అంతర్జాతీయ బాట్లింగ్‌ కార్యకలాపాలను బిగ్‌ నిర్వహిస్తోంది. జూన్‌ 30 నుంచి బిగ్‌ కార్యకాలాపాలను నిలిపేస్తున్నట్లు కోక-కోలా తెలిపింది.

ఇప్పటివరకు బిగ్‌ చేపడుతున్న వ్యవహారాలు కోక కోలా అంతర్గత బోర్డు నియంత్రణలోకి వస్తాయని సంస్థ చెప్పింది. భారత్, నేపాల్, శ్రీలంక కార్యకలాపాలు ఈ బోర్డు నిర్వహిస్తుందని తెలిపింది. బాట్లింగ్‌లో వాటాలను తగ్గించుకుని, బ్రాండ్, ఉత్పత్తులపై కోక కోలా దృష్టిపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 1997లో ప్రారంభమైన హిందుస్థాన్‌ కోక-కోలా బెవరేజెస్‌కు ఇండియాలో 16 ప్లాంట్లు ఉన్నాయి. 3500 మంది డిస్ట్రిబ్యూటర్ల ద్వారా 25 లక్షల మంది రిటైలర్‌లకు కూల్‌డ్రింక్స్‌ను సరఫరా చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్లాంట్‌లలో వాటాలను స్వతంత్ర సంస్థలకు విక్రయించడం ద్వారా రూ.2,420 కోట్లను సంస్థ సమీకరించింది. గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్లాంట్‌ కోసం రూ.1387 కోట్లు, గుజరాత్‌లో రూ.3000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణలో  రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ ఏడాది మేలో వెల్లడించింది.

రిలయన్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు సాఫ్ట్‌డ్రింక్స్‌ రంగంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీ కోక-కోలా తన వ్యాపార విస్తరణపై దృష్టిసారించడం ఇన్వెస్టర్లకు మేలు చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోటీని తట్టుకుని తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement