ఏయూ బడ్జెట్ రూ.428 కోట్లు | au budget of Rs .428 crore | Sakshi
Sakshi News home page

ఏయూ బడ్జెట్ రూ.428 కోట్లు

Mar 23 2016 11:56 PM | Updated on Jun 4 2019 6:36 PM

ఏయూ బడ్జెట్ రూ.428 కోట్లు - Sakshi

ఏయూ బడ్జెట్ రూ.428 కోట్లు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 428.16 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు వర్సిటీ ...

ఆమోదించిన పాలకమండలి సమావేశం
లోటు లేకుండా రూపకల్పన
కొత్త కేంద్రాలు.. నియామకాలకు పెద్దపీట
కాలం చెల్లిన కోర్సుల తొలగింపునకు కమిటీలు


ఏయూ క్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 428.16 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య ఇ.ఏ నారాయణ చెప్పారు. బుధవారం ఏయూ పాలక మండలి సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్ 298.2 కోట్లు వస్తుందని, అంతర్గత నిధుల నుంచి రూ.129.91 కోట్లు సమకూర్చుకుంటామని చెప్పారు. ఎటువటి లోటు లేకుండా బడ్జెట్‌ను తీర్చిదిద్దామన్నారు. ఈ నిధుల నుంచి తాత్కాలిక, రెగ్యులర్ సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, కొత్త నియామకాలు, అభివృద్ధి పనులు, అకడమిక్ కార్యక్రమాలకు కేటాయింపులు జరిపామన్నారు. బడ్జెట్‌పై పాలకమండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆమోదించారని చెప్పారు.

 

కొత్త కేంద్రాలు

ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా సెంటర్ ఫర్ జెరంటాలజీ, సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ డేటా అనాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కొన్ని న్యాయపరమైన అంశాలపై అపీల్‌కు వెళ్లాలని ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. ఇకపై వర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందిని వర్సిటీలోకి ఎబ్జార్బ్ చేయకూడదని నిర్ణయించామని చెప్పారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్ర దావ్రా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఏయూ అంతార్జాతీయ ర్యాంకింగ్‌కు సిద్ధమవుతోందని, ఏయూను స్ఫూర్తిగా తీసుకుని ఎస్వీయూ, ఏఎన్‌యూ, మహిళా వర్సిటీ, ఎస్కేడీ, జేఎన్‌టీయూ(కె), జెఎన్‌టీయూ(ఏ)లు అంతర్జాతీయ ర్యాంకింగ్‌లకు దరఖాస్తు చేస్తున్నాయన్నారు. పాలక మండలి సభ్యుడు పి.సోమధానరావు మాట్లాడుతూ వర్సిటీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా.. వాటిని గుర్తించి రక్షణ గోడలు నిర్మించడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. లీజ్‌కు ఇచ్చిన స్థలాలపై పునఃపరిశీలన జరుపుతామన్నారు. భవనాలు, హాస్టల్స్, నివాస గృహాలకు మరమ్మతులు, సందరీకరణ చర్యలు వేగవంతం చేస్తారని వివరించారు. నైపుణ్యాలు అభివృద్ధి చేయడంతోపాటు ఉపాధి ఆధారిత కోర్సులు నిర్వహిస్తామన్నారు.


కాలం చెల్లిన కోర్సులను తొలగించడానికి కళాశాల వారీగా కమిటీలను చేసి అధ్యయనం చేయాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణకు ఉన్నత విద్యామండలి అనుమతి కోరుతామన్నారు. ప్రస్తుతం వర్సిటీలో ఉన్న ఖాళీల్లో వారిని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆచార్య జీఎస్‌ఎన్ రాజుపై నియమించిన కమిటీ తన నివేదికను నెలాఖరు నాటికి ఉన్నత విద్యామండలికి అందిస్తుందని ఆచార్య ఎం.ప్రసాదరావు తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్లు జి.శశిభూషణ రావు, ఎం.సుందరరావు, ఎన్.బాబయ్య, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ వివరాలను వెల్లడించలేదు.

 
పారిశ్రామికవేత్తలు గైర్హాజరు

ప్రభుత్వం ఇటీవల పాలకమండలి సభ్యులుగా పారిశ్రామికవేత్తలను నియమించింది. అయితే బుధవారం జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి సభ్యులైన పారిశ్రామికవేత్తలు గ్రంధి మల్లికార్జునరావు, డాక్టర్ మురళీ దివిలు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నట్లు వారు ముందుగానే వర్సిటీకి సమాచారం పంపినట్లు తెలిసింది. అదే విధంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్లు కూడా హాజరుకాలేదు.

 

ఆదాయం
ప్రభుత్వ బ్లాక్ గ్రాంట్.. 298.20 కోట్లు
అంతర్గత వనరులు.. 129.91 కోట్లు

 

ఖర్చు
సిబ్బంది వేతనాలు..  157.00 కోట్లు
పెన్షన్లు... 128.00 కోట్లు
కొత్త నియామకాలు.. 25.00 కోట్లు
అభివృద్ధి పనులు..  23.36 కోట్లు
అకడమిక్ కార్యక్రమాలు.. 59.65 కోట్లు
తాత్కాలిక ఉద్యోగుల వేతనాలు.. 18.00 కోట్లు

 

కొత్త కేంద్రాలు
సెంటర్ ఫర్ జెరంటాలజీ
సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ
సెంటర్ ఫర్ డేటా అనాలసిస్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement