టీడీపీలో మహిళలకు చోటేది!?
- పేరుకే మహిళాగర్జన
- ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు దూరం
- స్థానిక ఎన్నికల్లోనూ ఆదరణ తక్కువే
- పెదవి విరుస్తున్న తెలుగింటి ఆడపడుచులు
సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం నగరంలో మహిళాగర్జన నిర్వహించనున్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఊదరగొట్టే బాబు... దాన్ని ఆచరణలో చూపడం లేదంటూ పలువురు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో తెలుగు ఆడపడుచులకు తగిన గుర్తింపు లేదని సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎంపీ సీటు ఒక్కటీ లేదా..
జిల్లాలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటునైనా మహిళలకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీపడుతున్న అభ్యర్థులను పరిశీలిస్తే మహిళల పేర్లు ఎక్కడా వినపడడం లేదు. విజయవాడ, బందరు, ఏలూరు (కొంతభాగం) పార్లమెంట్ నియోజకవర్గాలు కృష్ణాజిల్లా పరిధిలోకి వస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల సీట్ల కోసం పురుషులే పోటీ పడుతున్నారు. పోత్తు పెట్టుకుంటే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి లేదా అక్కినేని అమల పోటీకి దిగవచ్చని చెబుతున్నారు. అంతేతప్ప టీడీపీలో ఎంపీ టికెట్ కోసం ఆశావహులు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఎమ్మెల్యేకూ అదే పరిస్థితి..
జిల్లా పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్క సీటు కూడా మహిళలకు కేటాయించే అవకాశం కనపడడం లేదు. ఇప్పటివరకు రేస్‌లో ఉన్న అభ్యర్థుల్ని పరిశీలిస్తే టీడీపీ తరఫున బరిలోకి దిగే మహిళలే లేరు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ వారిలో వనితల పేర్లు లేకపోవడం గమనార్హం. మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ పెనమలూరు ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాంగ్రెస్ తిరువూరు ఎమ్మెల్యే పద్మజ్యోతిని టీడీపీలోకి ఆహ్వానించి ఆమెకు నందిగామ లేదా మరేదైనా సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది ఎంతమేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.
స్థానిక సంస్థల్లోనూ అదే తీరు..
స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఈ లెక్కన నగరపాలకసంస్థల్లో 29 డివిజన్లు మహిళలకు కేటాయించారు. అయితే అంతకంటే ఎక్కువ మంది మహిళలు సీట్లకోసం పోటీ పడ్డారు. అయితే నిబంధనల మేరకు మహిళలకు కేటాయించిన డివిజన్లే మహిళా అభ్యర్థులకు ఇచ్చారు తప్ప అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు కొద్దిగా పెద్ద మనస్సు చేసుకుని మరో నాలుగైదు జనరల్ డివిజన్లు మహిళలకు ఇచ్చి ఉంటే బాగుండేదన్న భావన మహిళా అభ్యర్థుల్లో వ్యక్తమైంది. కాగా అర్బన్ మహిళా అధ్యక్షురాలు ఉషారాణికే సీటు ఇవ్వకపోవడంతో పార్టీలో మహిళలకు ఎంత మేరకు గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మహిళలకు అదనంగా కేటాయించిన సీట్లు లేవని మహిళలే చెబుతున్నారు.
మహిళాగర్జనకు ఏర్పాట్లు పూర్తి
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరగబోయే మహిళా గర్జనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గర్జనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని మహిళా డిక్లరేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు డీవీ మనార్ హోటల్ నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీగా బయలుదేరి సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య సేడియానికి చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం ఐదుగంటలకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. మహిళాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజా గర్జన సభలు తిరుపతి, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాలో విజయవంతంగా జరిగాయని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, అర్బన్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, జల్లా మహిళా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి వనజ తదితరులు పాల్గొన్నారు.