ఒంగోలు క్రైం: జిల్లాలో ఉన్న సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు (డీఎస్పీ) ప్రజలతో మమేకమై స్నేహపూరిత వాతావరణంతో విధులు నిర్వర్తించాలి. సంఘటనలు జరిగిన వెంటనే కిందిస్థాయి సిబ్బందిని సంబంధిత ప్రాంతాల్లోకి పంపి కేసులను లోతైన అధ్యయనం చేయాలని గుంటూరు రేంజ్ పోలీస్ ఐ.జి. ఎన్.సంజయ్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌తో కలిసి జిల్లాలోని డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఐదు సబ్‌డివిజన్ డీఎస్పీలతోపాటు ఎస్‌బి, డిసిఆర్‌బి, ఎస్సీ, ఎస్టీ సెల్, ట్రాఫిక్, మహిళా పీఎస్, సీసీఎస్ డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఐ.జి.గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోసారి జిల్లాకు వచ్చిన ఆయన పోలీస్‌స్టేషన్ల వారీగా కేసులకు సంబంధించిన వివరాలను డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని డీఎస్పీ స్థానాలు భర్తీ అయ్యాయని, కందుకూరు, మార్కాపురానికి డెరైక్టు డీఎస్పీలు బాధ్యతలు తీసుకున్నారని, ప్రొబేషనరీ ఐపీఎస్ బిఆర్ వరుణ్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన కేసులను డీఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలన్నారు.
పోలీస్ అధికారులు ప్రజల్లో ఎక్కువగా తిరిగితే పోలీసులంటే జనంలో ఉండే భయం పోతుందన్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు చివరిలో వస్తారన్న నానుడికి చమరగీతం పాడాలని ఐజి పిలుపునిచ్చారు. సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చే విషయమై విలేకర్లు అడిగినప్పుడు ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమానాస్పద (సెక్షన్ 174) కేసుల విషయంలో దర్యాప్తు పురోగతి మందకొడిగా సాగుతోందని ఐజి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అలాంటి కేసులపై ప్రత్యేక దృష్టి సారించమని ఎస్పీ శ్రీకాంత్‌ను ఆదేశించారు. పాత నేరస్తులు అనుమానాస్పద మృతి కేసుల విషయంలో ఫింగర్‌ప్రింట్స్, డేటాబేస్, కనుపాపల గుర్తింపు లాంటి సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒంగోలు నగరంలో ట్రాఫిక్ జంక్షన్లను పెంచే ఆలోచనలో ఉన్నామన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వివరించారు. ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇప్పటికే తాలూకా పోలీస్‌స్టేషన్‌ను రెండుగా చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్ళి విభజన విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప త్వరగా వీలుపడదన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రొబెషనరీ ఐపిఎస్ అధికారి బిఆర్ వరుణ్, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ లక్ష్మినారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు కె. వెంకటరత్నం, మార్కాపురం ఓఎస్‌డి సమైజాన్‌రావు, ట్రాఫిక్ డీఎస్పీ జె.రాంబాబుతోపాటు పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలి
Published Wed, Feb 4 2015 4:23 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement