కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగోరోజు శుక్రవారం కీలకఘట్టమైన రథోత్సవం వైభవంగా జరిగింది.
కొల్లాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగోరోజు శుక్రవారం కీలకఘట్టమైన రథోత్సవం వైభవంగా జరిగింది. దీనికి ముందుగా ఆలయంలో స్వామివారికి ఆలయ చైర్మన్ సురభివంశస్తులు వెంకట జగన్నాదిత్యలక్ష్మారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలకరించిన రథోత్సవంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేశారు. ఊరేగింపునకు ముందు ఆలయచైర్మన్ లక్ష్మారావు మంగళవాయిద్యాలతో పట్టువస్త్రాలు,పూర్ణకుంభంతో వచ్చి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే జూపల్లి, కాంగ్రెస్‌పార్టీఇంచార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌కమిటి చైర్మన్ కమలేశ్వర్‌రావులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు యువకులు, భక్తులు అధికసంఖ్యలో ఆసక్తి కనబరిచారు. మహిళలు పూనకంతో ఊగిపోయారు. రత్నగిరి కొండ సమీపంలో ఉన్న శమీవృక్షం చుట్టూ రథాన్ని ఊరేగించి పూజలు నిర్వహించాక రథాన్ని తిరిగి ఆలయప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలు లక్ష్మీ నరసింహుని,గోవిందనామస్మరణలు, చప్పట్లతో హోరెత్తించారు. అంతకు ముందు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో భక్తులు పెద్ద ఎత్తున సింగోటం చేరుకుని ఆలయ సమీపంలో ఉన్న గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం కొండపై వెలసిన అమ్మవారికి పూజలు చేశారు. జాతరలో ఉన్న తినుబండారాలు,గాజులు,ఆటవస్తువులు, చెరుకుగడల దుకాణాలతో పాటు ఇతర వ్యాపార దుకాణాలన్నీ ప్రజలతో కిటకిటలాడాయి.జిల్లా నలుమూలలనుంచి, హైదారాబాద్‌తో పాటు కర్నూల్ జిల్లాకు చెందిన భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. శ్రీవారి సముద్రం చెరువుకు అవతలి వైపు ఉన్న స్వామివారి పాదాల వద్దకు నీటిలో వెళ్లేందుకు మరబోటు ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున వెళ్లారు. పూజలలో టీడీపీ ఇంచార్జ్ శ్రీనివాస్‌రెడ్డి, సీఆర్ జగదీశ్వర్‌రావు, సింగోటం సర్పంచ్ వెంకటస్వామి, మాజీసర్పంచ్ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు హన్మంత్‌నాయక్, నరసింహ్మరావు,టీడీపీ నాయకులు శేఖర్‌శెట్టి, వెంకటేశ్వర్లు స్థానికులు ఉన్నారు.వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొల్లాపూర్, కొత్తకోట సీఐలు స్వామి,వెంకటేశ్వర్లుల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.