తిరుమల కొండ శనివారం భక్తులతో నిండింది. వరుస సెలవులతో రెండు రోజులుగా తిరుమలలో క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
- సర్వదర్శనానికి 16 గంటలు, కాలిబాట భక్తులకు 10 గంటలు
- వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష
తిరుమల : తిరుమల కొండ శనివారం భక్తులతో నిండింది. వరుస సెలవులతో రెండు రోజులుగా తిరుమలలో క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులతో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండి, వెలుపల రెండు కిలోమీటర్లు క్యూ కట్టారు. వీరికి 16 గంటల తర్వాత శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం లభిస్తోంది. కాలిబాటల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో పద్మావతి, సీఆర్‌వో, ఎంబీసీ-34 రిసెప్షన్ కేంద్రాల వద్ద గదుల కోసం యాత్రికులు పడిగాపులు కాచారు. ఐదారుగంటలపాటు నిరీక్షించిన తర్వాతే గదులు లభించాయి.
కల్యాణకట్టల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ప్రధాన కల్యాణకట్టతోపాటు మరో 9 మినీ కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించుకునేందుకు భక్తులు నిరీక్షించారు. వీఐపీ దర్శనాలు, ప్రోటోకాల్ మినహా మిగిలిన సిఫారసు దర్శనాలు రద్దుచేశారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పర్యవేక్షించారు. శనివారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మొత్తం 61,619 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.2.95 కోట్లు లభించాయి.