సాక్షి, అమరావతి:
- అనంతపురం జిల్లా వన్నంపల్లిలో గుడి ప్రవేశం కోరిన దళితులపై దాడి చేసి సాంఘిక బహిష్కరణ చేశారు.
- కర్నూలు జిల్లాలోని నక్కలదిండిలో కొందరు పెద్దలు చెప్పిన పని చేయలేదనే ఉక్రోషంతో దళితులపై దుర్భాషలాడి దౌర్జన్యం చేశారు.
- నిక్కచ్ఛిగా విధుల నిర్వహణ చేయాలనుకునే అధికారులపైనా అధికారపార్టీ నేతలు దాడులకు వెనుకాడటంలేదు.
- సమస్యలపై ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఆపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
- రాజధానిలో తమ భూములను ప్రభుత్వం లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసినా, గిట్టుబాటు ధరల కోసం విజ్ఞప్తులు చేసినా, ఉద్యోగాల కోసం, భృతి కోసం నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది.
ఇలా చెప్పుకుంటే పోతే రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వమే మానవ హక్కులపై ఉక్కుపాదం మోపేలా సవారీ చేస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కుల పరిరక్షణకు కనీసం రాష్ట్రస్థాయిలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలనే ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బాధితులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలు, దళితులు ఇలా ఎవరైనా సరే హక్కుల కోసం గళమెత్తితే తీవ్ర నిర్భందం అమలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా ఉద్యమించే ప్రతిపక్షాల గొంతు నొక్కేలా గృహనిర్భందాలు, ముందస్తు అరెస్టులతో ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు
హక్కుల ఉల్లంఘన కేసులు దేశ వాప్తంగా తగ్గుతుంటే ఏపీలో మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 2016లో 96,627 కేసులు, 2017లో 82,006, 2018(ఇప్పటి వరకు) 72,482 కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2016లో 1,335 కేసులు, 2017లో 2,635, 2018(ఇప్పటి వరకు) దాదాపు మూడు వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలో 2016లో దేశంలో రాష్ట్రం 13వ స్థానంలో ఉంటే ఈ ఏడాది అది మరింత దిగజారి తొలి ఐదు స్థానాల్లో ఉన్నా ఆశ్చర్యం లేదని మావన హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం కనీస చొరవ చూపడంలేదని విమర్శిన్నారు. హక్కులకు భంగం కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోందని మానవ హక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మౌలాలీ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ హయాంలో కమిషన్ ఏర్పాటు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006 ఆగస్టు 2న ఏపీ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కమిషన్ జోక్యంతో ప్రజల హక్కులకు రక్షణ కలుగుతోంది. అందుకే ఈ హక్కుల కమిషన్ ప్రజల నుంచి సత్వర న్యాయసేవా కేంద్రం, సామాన్యుడి న్యాయ కేంద్రంగా మన్ననలు అందుకుంది. అలాంటి కీలకమైన కమిషన్ నియామక విషయమై ముఖ్యమంత్రి చైర్మన్‌గా, అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మండలి ప్రతిపక్ష నేత, సీనియర్ మంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సభ్యులుగా ఉండే హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌ను చైర్మన్‌గాను, మరో ఇద్దరు సభ్యులతో కలిపి హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 పదో షెడ్యూల్‌లో మానవ హక్కుల కమిషన్‌ను 2015 మే నెలలో చేర్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరుగా వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే ఏపీలో ఆ దిశగా ప్రయత్నాలు పూర్తికాకపోవడంతో హైదరాబాద్‌లోని కమిషన్‌నే ఏపీ వాసులు వినియోగించుకోవాల్సి వస్తోంది. 2017 మే నెలలో సమావేశం నిర్వహించిన ప్రభుత్వం అమరావతి వేదికగా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు గెజిట్ ప్రకటించింది. అయితే ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రాష్ట్రంలో పేరుకుపోతున్న వేల ఫిర్యాదుల్లో బాధితులు న్యాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. సోమవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో రాష్ట్రంలో మానవ హక్కులపై జరుగుతున్న దాడిని ప్రభుత్వం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
హక్కులపై సర్కారు సవారీ!
Published Mon, Dec 10 2018 5:58 AM | Last Updated on Mon, Dec 10 2018 5:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment