గుంటూరు చానల్ సమీపంలో కరకట్టపై ఏర్పడిన పగుళ్లు, నెర్రలిచ్చిన రోడ్డు కరకట్టపై ఏర్పడిన గుంతలు
వర్చువల్ తనిఖీలు సరే...సీఎం ప్రయాణించే రహదారినే పట్టించుకోవడం లేదు. సీఎం నివాసం ఉండే ఉండవల్లి కరకట్ట రహదారి అక్కడక్కడా నెర్రెలిచ్చి, కుంగిపోయింది. మరికొన్ని చోట్ల తారు కొట్టుకుపోయి, కంకర దర్శనమిస్తోంది. అయినా అధికారులు పట్టించుకోకుండా వర్చువల్ తనిఖీలు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. మాటలు చూస్తే ఆకాశంలో...చేతలు చూస్తే పాతాళంలో అన్నట్టుంది పరిస్థితి.
సాక్షి, అమరావతి బ్యూరో : వర్చువల్ తనిఖీల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు లైవ్‌లో తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు... తాను ప్రయాణించే కరకట్ట రోడ్డు నాసిరకంగా నిర్మించడంతో నెర్రెలిచ్చిన వైనాన్ని మాత్రం గమనించలేకపోతున్నారు పాపం. ప్రకాశం బ్యారేజీ సమీపంలో సీతానగరం వద్ద నుంచి వెలగపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు కరకట్టపై వేసిన రహదారి మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. రోడ్డును ఆగమేఘాల మేద నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హడావిడిగా చేపట్టడంతో రోడ్డు కోతకు గురవుతోంది. రోడ్డు చాలా చిన్నదిగా ఉండడంతో రెండు వాహనాలు ఒకేసారి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది. ఒకవైపు వాహనాలు సైడ్ ఇస్తే కానీ మరో వాహనం వెళ్లడం కుదరడం లేదు. దీనికితోడు కొన్ని చోట్ల రోడ్డు ఓ వైపు పూర్తిగా కుంగిపోయింది. మరికొన్ని చోట్ల తారు లేచి గుంతలు ఏర్పడ్డాయి.
సీఎం నిత్యం ప్రయాణించే రోడ్డే...
సెక్రటేరియట్‌లోని రియల్‌టైమ్ గవర్నెన్స్ నుంచి సీఎం చంద్రబాబు అప్పుడప్పుడు వర్చువల్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. గురువారం కూడా గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు ముందస్తుగా నిర్మించాల్సిన కల్వర్టులను నిర్మించకపోవడాన్ని గుర్తించి అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, తాను ప్రతిరోజు ప్రయాణించే రోడ్డు నెర్రలు బారి, ఒక వైపు కుంగిపోయిన విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం.
విస్తరణ ఒట్టిమాటే...
కృష్ణానది కుడి కరకట్టని ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వరకు విస్తరించాలని ఏపీ సీఆర్‌డీఏ 2015లో నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న కర కట్ట వెడల్పును నాలుగు మీటర్ల నుంచి సుమారు 20 మీటర్లకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. మూడేళ్లవుతున్నా కరకట్ట విస్తరణను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతి వరకు కృష్ణానది కరకట్ట పొడవు 36 కిలోమీటర్లు ఉంది. కరకట్టను ఆనుకునే అమరావతి రాజధాని నగరం, సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరగనుంది. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ వంటి నిర్మాణాలు ఇక్కడే చేపట్టాల్సి ఉంది. సింగపూర్ స్టార్టప్ కంపెనీలు కూడా ఇక్కడే నిర్మితమవనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలు వరద బారిన పడకుండా ఉండేందుకు కరకట్టను పటిష్టంగా నిర్మించడంతో పాటు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రతిపాదనలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని కరకట్ట విస్తరణకు కనీసం ఇంకో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
వెలగపూడి వరకే అభివృద్ధి
సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి తన నివాసానికి, అక్కడి నుంచి సచివాలయానికి ఈ కరకట్ట మీద నుంచే ప్రయాణించాల్సి ఉంది. ఈ మార్గంలో వీఐపీ రాకపోకలు భారీగా పెరగడంతో 4 మీటర్లున్న రోడ్డును నూతనంగా నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు సుమారు 5 కిలోమీటర్ల మేరకు మాత్రమే రోడ్డును అభివృద్ధి చేసి తర్వాత రోడ్డును గాలికొదిలేశారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి అటువైపున్న కరకట్టపై గుంతలు, కంకర దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్డు దెబ్బతినడంతో ప్యాచ్‌లతో సరిపెట్టారు. ఉద్దండ్రాయునిపాలెం కరకట్ట నుంచి అటువైపు ఉన్న రోడ్డు పూర్తిగా తారు లేచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment