రాష్ట్రానికి 950 మెడిసిన్ సీట్లు తీసుకొచ్చానని, మరిన్ని తెచ్చేందుకు కృషిచేస్తున్నానంటూ పదేపదే చెబుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్..
- ఎంసీఐ అభ్యంతరాలు నేటికీ పరిష్కరించని వైనం
- యూనిట్ల పెంపు కోరుతూ లేఖ రాసిన ప్రిన్సిపాల్
- రెండు నెలలు గడిచినా చర్యలు శూన్యం
- సిద్ధార్థ వైద్య కళాశాలలో వింత పరిస్థితి
విజయవాడ : రాష్ట్రానికి 950 మెడిసిన్ సీట్లు తీసుకొచ్చానని, మరిన్ని తెచ్చేందుకు కృషిచేస్తున్నానంటూ పదేపదే చెబుతున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్.. పెంచిన సీట్లకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని విస్మరించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు వైద్య విద్యార్థులకు సదుపాయాలు లేకుంటే మళ్లీ సీట్లు కోల్పోతామని తెలిసినా, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో గత ఏడాది వంద యూజీ (ఎంబీబీఎస్) సీట్లకు అడ్మిషన్లు జరపగా వాటిని 150కి పెంచాలని కళాశాల అధికారులు విన్నవించారు. తొలుత నిరాకరించినా అనంతరం ప్రభుత్వ హామీపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండీషనల్ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ఏడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. పెంచిన సీట్లకు అనుగుణంగా సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
యూనిట్లు పెంచాలంటూ లేఖ
ప్రస్తుతం వంద మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు సరిపడా ఉన్న యూనిట్లను 150 మందికి అనుగుణంగా పెంచాలని కోరుతూ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు లేఖ రాశారు. దానికి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
నవంబర్ నుంచి ఎప్పడైనా రావొచ్చు..
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం నవంబర్ నుంచి ఏ క్షణంలోనైనా వైద్య కళాశాలలో తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి సిద్ధార్థ వైద్య కళాశాలలో సౌకర్యాలు కల్పించడంతోపాటు అదనపు యూనిట్ల మంజూరుకు కృషి చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
మరిన్ని సౌకర్యాలు కల్పించాలి..
ఆర్సీహెచ్ బ్లాక్, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్, ఆడిటోరియం, లైబ్రరీ వంటి సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుతం లైబ్రరీ నిర్మాణం జరుగుతుండగా, ఆర్సీహెచ్ బ్లాక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
పెంచిన సీట్లకు అనుగుణంగా విద్యార్థులకు హాస్టల్ భవనాల నిర్మాణాలు చేపట్టడంతోపాటు పెథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ వంటి విభాగాలను విస్తరించాల్సిన అవసరం ఉంది.
2012లో ఒకసారి సీట్లు పెంచినప్పుడు ఆయా విభాగాల్లో సదుపాయాల లేమి కారణంగానే సీట్లు రద్దు చేశారు. ప్రస్తుతం 150 సీట్లు కాపాడుకోవాలంటే ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.