
రైల్వేజోన్ కోసం ఆత్మార్పణ
- ఆవేదనతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణత్యాగం
- జోన్ కోసం పోరాడాలని సీఎంకు లేఖ
సాక్షి, విశాఖపట్నం/ పెదగంట్యాడ: విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని, వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన చెందుతూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం చంద్రబాబు పేరిట లేఖ రాసి తనువు చాలించాడు. ఈనెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెదగంట్యాడ యాతపాలేనికి చెందిన పీఎస్‌డీ ప్రసాద్ (32) 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. విశాఖకు రైల్వే జోన్ వస్తే తనలాంటి వారికిఉద్యోగావకాశాలు లభిస్తాయని తరచూ స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. ప్రసాద్‌కు ఉద్యోగం లేదన్న కారణంతో భార్య కూడా అతనికి దూరమైంది.
ఈ నేపథ్యం లోనే విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ ఇంజినీరింగ్‌లో తన క్లాస్‌మేట్, అనకాపల్లి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఇటీవల చేపట్టిన పాదయాత్రలోనూ ప్రసాద్ పాల్గొన్నాడు. జోన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేదన్న భావనతో విరక్తి తో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నెల 7న నగరంలోని మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న లేఖను రైల్వే పోలీసులు మాయం చేసారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీన్ని కొట్టిపారేస్తున్నారు.