ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మార్కండేయ కల్యాణ మండపంలో మూడు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 17వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా 75 మంది కౌన్సిల్ సభ్యులు, 25 మంది కమిటీ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సి.రామచంద్రయ్య( కర్నూలు), ప్రధాన కార్యదర్శిగా కేవీవీ ప్రసాద్ (ప్రకాశం), ఉపాధ్యక్షులుగా నారిశెట్టి గురవయ్య (గుంటూరు), కె.కాటమయ్య (అనంతపురం), రావు జగ్గారావు (విశాఖ), కార్యదర్శులుగా జగన్నాథరావు (కర్నూలు), గంగాభవానీ (విశాఖ), యల్లమందరావు (కృష్ణా), కోశాధికారిగా చెల్లుబోయిన కేసవశెట్టి(తూర్పుగోదావరి)లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గానికి రైతు సంఘం ప్రతినిధులు, సీపీఐ నాయకులు అభినందనలు తెలిపారు.
తీర్మానాల ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 17వ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయాలని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొబ్బరి బోర్డు ద్వారా వచ్చే అన్ని రాయితీలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని, పట్టిసీమ పేరుతో రూ.1300 కోట్లు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయకుండా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించడంతో పాటు మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లను కలిపి ప్రత్యేక ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పోలవరం ముంపు మండలాల నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. పై తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.