ఖరీఫ్‌కు ఎరువులు సిద్ధం..!
- గతేడాది పరిస్థితి రాకుండా ఏర్పాట్లు
- గుర్తింపు డీలర్ల వద్ద నిల్వలు
- సాగు ప్రారంభం కాగానే అందుబాటులోకి
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఎరువుల కోసం గతంలో మాదిరి బార్లు తీరే పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఖరీఫ్ పనులు చేపట్టిన వెంటనే రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువులను సంబంధిత డీలర్ల వద్ద నిల్వ ఉంచారు. ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు 2.27లక్షల హెక్టార్లలో చేపట్టాలని లక్ష్యంగా చేసుకున్నారు.
జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 2.03లక్షల హెక్టార్లు. వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువగా చేపట్టాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు లక్ష హెక్టార్లకు మించి విస్తీర్ణంలో వరి సాగవుతుందని భావిస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40వేలు, రాగులు 25వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందుకు అవసరమైన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేశారు. జిల్లాకు మొత్తం 4,917 మెట్రిక్ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని గుర్తించారు. వాటిని జిల్లాలో గుర్తింపు పొందిన డీలర్లతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) అమ్మకాలకు సంకల్పించారు. ఇప్పటికే సగం ఎరువులను డీలర్ల వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
కేరళను తాకిన రుతుపవనాలు నేడో రేపో ప్రవేశించనున్నాయనివాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అడపా, దడపా కురుస్తున్న వర్షాలకు రైతులు దుక్కు పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు అనుకూలించిన వెంటనే నార్లుపోతకు సిద్ధమవుతున్నారు. దీనిపై జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. వీటిని అధిక ధరలకు అమ్మితే డీలర్లపై వేటు తప్పదనిహెచ్చరికలు జారీచేసినట్టు వివరించారు.