
ఔరా..!
ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తూ ప్రతి రోజు దొడ్డి దారిన లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్న కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా సోదరునికి అధికారులు చెక్ పెట్టారు. ఆ మేరకు నాలుగు లారీలు, ఇటాచీని సీజ్ చేసి వల్లూరు పోలీసులకు అప్పగించారు.
ఔరా..!
ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తూ ప్రతి రోజు దొడ్డి దారిన లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్న కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా సోదరునికి అధికారులు చెక్ పెట్టారు. ఆ మేరకు నాలుగు లారీలు, ఇటాచీని సీజ్ చేసి వల్లూరు పోలీసులకు అప్పగించారు.
వల్లూరు మండలం జంగంపల్లె సమీపంలో పుత్తా నరసింహారెడ్డికి వ్యవసాయ భూములు వున్నాయి. ఈ భూములు పాపాఘ్ని ఒడ్డున ఉండటంతో ప్రకృతి సంపదను దోచుకునేందుకు వరంగా మారింది. ఆవే భూముల నుంచి పాపాఘ్ని నదిలోకి అక్రమంగా దారి ఏర్పాటు చేశారు. లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు నిత్యం ఇసుకను అక్రమంగా తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడేవారు. పాపాఘ్నికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినా అక్రమ రవాణాను ఆపలేదు. ట్రాక్టర్లలోకి ఇసుకను లోడు చేయించి డబ్బులు వసూలు చేయడాన్ని పుత్తా నరసింహారెడ్డి సోదరుడు పుత్తా లక్ష్మిరెడ్డి ఆరంభించారు. యంత్రాల ద్వారా లారీలకు ఇసుకను లోడ్ చేయించి ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేవారు. పుత్తా రాజకీయ పలుకుబడిచూసి అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.
ఆదివారం రాత్రి ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులకు టార్పాలిన్ పట్టలను కప్పుకుని వెళుతున్న లారీలు అనుమానాన్ని పెంచాయి. తనిఖీలు నిర్వహించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇసుక ఎక్కడి నుంచి రవాణా అవుతోందని ఆరా తీశారు. డబ్బులు చెల్లించి జంగంపల్లె సమీపంలో పాపాఘ్ని నదినుంచి తీసుకుని వస్తున్నట్లు లారీ సిబ్బంది తెలిపారు. దీంతో విజిలెన్స్ డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ శాఖ సీఐలు, రాయల్టీ అధికారులు సోమవారం ఉదయం అక్రమంగా వెలిసిన ఇసుక క్వారీపై దాడులు నిర్వహించారు. నాలుగు లారీలు, ఒక హిటాచీని సీజ్ చేశారు.
అనంతరం వాటిని వల్లూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను ఏమేరకు తరలించారు, ఎంతకాలం నుంచి అక్రమరవాణాకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ ఆదాయానికి ఏమేరకు గండి పడింది అన్న విషయాలపై లెక్క గట్టాల్సిందిగా మైనింగ్ అధికారులను విజిలెన్సు యంత్రాంగం ఆదేశించింది. దీంతో గడువు కావాలని మైనింగ్ అధికారులు కోరినట్లు సమాచారం. వెంటనే కేసు నమోదు చేయకపోవడంపై ప్రజలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నివేదికలను సకాలంలో సక్రమంగా అందించకుండా కాలయాపన చేసేందుకే మైనింగ్ అధికారులు గడువు కోరినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.