సామాజిక సేవకు కార్పొరేట్ నిధులు | Corporate funds to social service | Sakshi
Sakshi News home page

సామాజిక సేవకు కార్పొరేట్ నిధులు

Jul 27 2014 2:00 AM | Updated on Aug 15 2018 7:56 PM

సామాజిక సేవకు కార్పొరేట్ నిధులు - Sakshi

సామాజిక సేవకు కార్పొరేట్ నిధులు

కొత్త కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ రంగం కూడా సామాజిక సేవలో పాల్గొనడం తప్పని సరి కావడంతో ఈ ఏడాది సుమారు 6,000 కంపెనీలు రూ. 20,000 కోట్లు ప్రజాసేవకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ రంగం కూడా సామాజిక సేవలో పాల్గొనడం తప్పని సరి కావడంతో  ఈ ఏడాది సుమారు  6,000 కంపెనీలు  రూ. 20,000 కోట్లు ప్రజాసేవకు ఖర్చు చేయాల్సి ఉంటుందని  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు.

 కొత్త కంపెనీల చట్టంలో సీఎస్‌ఆర్ కార్యకలాపాలపై సెక్షన్-135లో స్పష్టంగా పేర్కొన్నారని, దీని ప్రకారం రూ. 1,000 కోట్ల టర్నోవర్ దాటిన కంపెనీలు, లేదా నెట్‌వర్త్ రూ.500 కోట్లు దాటిన సంస్థలు, లేదా ఏడాది లాభాలు రూ. 5 కోట్లు దాటినా, ఆయా కంపెనీలు విధిగా ఆదాయాల్లో రెండు శాతం నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల 2014-15లో కార్పొరేట్ సంస్థలు రూ. 20,000 కోట్లు వ్యయం చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కంపెనీలు స్వతంత్ర డెరైక్టర్ నేతృత్వంలో ఒక సీఎస్‌ఆర్ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

 శనివారం హైదరాబాద్‌లో అభయ ఫౌండేషన్ ‘ కార్పొరేట్ సామాజిక సేవ- ఆవిష్కరణల నుంచి అమలు దాకా’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు సదస్సును రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ధనికుల సంఖ్య పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తుంటే, అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేదలు కూడా భారత్‌లోనే ఉన్నట్లు సర్వేలు స్పష్టంచేస్తున్నాయని తెలిపారు. దేశం ఆర్థికంగా దూసుకుపోతున్నా, ఆర్థిక ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదనడానికి ఇదే సరైన ఉదాహరణ అన్నారు.


పేదల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి సరిపోవడంలేదని, ఈ విషయంలో కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వానికి చేయూతనివ్వాలని, సీఎస్‌ఆర్ అమలుతో  పేదరికాన్ని రూపుమాపడం సాధ్యపడుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతోనే(సీఎస్‌ఆర్) మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్‌జీవో) కలిసి పనిచేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలు చేసే సీఎస్‌ఆర్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందన్నారు.

ఈ సందర్భంగా సీఎస్‌ఆర్‌పై అభయ ఫౌండేషన్ రూపొందించిన సావనీర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మాజీ కార్యదర్శి (మైనింగ్, పర్యాటకం) రాజెన్ హబీబీ ఖ్వాజా కీలకోపన్యాసం చేశారు. సామాజిక సేవ అనేది వ్యక్తిగతంగా మొదలై కుటుంబం, సంఘం, జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి విస్తరించాల్సి ఉందన్నారు. సీఎస్‌ఆర్ అమలు విషయంలో కార్పొరేట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి ప్రాంతీయ స్థాయిలో అమలు చేసినప్పుడే ఈ కార్యక్రమం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలచంద్ర సుంకు, సీఐఐ తెలంగాణ, ఆంధ్ర చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి, ఫ్యాప్సీ అధ్యక్షుడు శివకుమార్ రుంగ్టా, ఖైరతాబాద్ ఎంఎల్‌ఏ చింతల రామచంద్రా రెడ్డితో పాటు 300కిపైగా కంపెనీ ప్రతినిధులు, ఎన్‌జీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement