పిల్లలకూ విలువ తెలియాలి..
సాధ్యమైనంత తొందరగా పిల్లలకు డబ్బు విలువ తెలియచేయండి
⇒పిల్లల పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి, బ్యాంకింగ్‌పై అవగాహన కల్పించండి
⇒ఆటల రూపంలో ఆర్థిక విషయాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేయండి
⇒కొద్దిగా పెద్ద పిల్లలు అయితే బడ్జెట్ తయారీ, ప్యాకెట్ మనీ అలవాటు చేయండి
ఏ విషయాన్ని అయినా పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. చిన్న వయస్సులో నేర్చుకున్న విషయాలనే వారు జీవితాంతం ఆచరిస్తారు. కాబట్టి ఆర్థిక విషయాలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. అప్పుడే వారికి డబ్బు విలువ తెలియడంతో పాటు, ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోవడం, అనవసర వ్యయాలను తగ్గించుకోవడం వంటివాటిపై స్పష్టత వస్తుంది. పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
బ్యాంకు ఖాతా ప్రారంభించండి
ఇప్పుడు అన్ని బ్యాంకులు చిన్న పిల్లలకు కూడా బ్యాంక్ ఖాతాలను అందిస్తున్నాయి. సాధారణంగా ఈ ఖాతాలు పిల్లల పేరుతో పాటు తల్లిదండ్రులు నిర్వహించే విధంగా ఉమ్మడిగా ఉంటాయి. ఈ జూనియర్ ఖాతాలు ప్రారంభించడం ద్వారా వారికి నిజమైన బ్యాంకింగ్ అనుభవం లభిస్తుంది. బహుమతుల రూపంలో వచ్చే నగదును ఈ ఖాతాలో జమ చేయడం, మధ్య మధ్యలో బ్యాలెన్స్ ఎంత ఉందో చూడటం చేయిస్తూ ఉండండి.
దీంతో పిల్లలకు పొదుపు శక్తి విలువ తెలిసి వస్తుంది. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులు పిల్లల ఖాతాలకు సంబంధించి చెక్‌బుక్స్, పాస్ బుక్స్ కూడా ఇస్తున్నాయి. ఏడు నుంచి 18 ఏళ్ళ వయసు వారికైతే ఏటీఎం కార్డులను కూడా అందిస్తున్నాయి. పిల్లల పేరుమీద ఏటీఎం కార్డుల జారీకి మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతి తప్పనిసరి.
డబ్బు విలువ తెలియచేయండి
చిన్నతనంలో పిల్లలు ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించడమే కాకుండా, ఈ వయస్సులో నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందుకే ఈ వయస్సులోనే డబ్బు విలువ తెలియచేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వాలి. ఆటల రూపంలో డబ్బు విలువ తెలిసేలా చేయండి. ముఖ్యంగా తల్లిదండ్రులను గమనించడం ద్వారా పిల్లలు అనేక అంశాలు నేర్చుకుంటారు. అందుకోసం పిల్లలతో కలిసి తల్లిదండ్రులు నగదు విలువ తెలిసే కార్యక్రమాలు చేపట్టాలి. ఇవి ఆటల రూపంలో ఉంటే వారు ఉత్సాహంగా పాల్గొంటారు.
ఉదాహరణకు షాపు యజమాని, కొనుగోలుదారుడు పాత్రలో వస్తువులు కొనడం, చిల్లర ఇవ్వడం వంటివి చేయండి. దీనివల్ల చిన్నారులకు ఆర్థిక విషయాలపై ఒక స్పష్టత వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం... అవసరాలు - కోరికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇది చిన్న వయస్సులోనే చెప్పడం ద్వారా దుబారా ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగించగలరు. ఈ విషయాన్ని కూడా ఆటల రూపంలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. సాధారణంగా పిల్లలు వారి స్నేహితులకు ఉన్న వస్తువులను తమకూ కొనమని మారాం చేస్తుంటారు. కానీ ఆ వస్తువు ఉపయోగపడుతుందో లేదో అర్థమయ్యే విధంగా చెప్పండి.
బడ్జెట్ ముఖ్యమే...
పిల్లల వయస్సును బట్టి బడ్జెట్ తయారు చేయడంపై కూడా అవగాహన కల్పించండి. ప్యాకెట్ మనీ, బహుమతులు లేదా ఇతర ఆదాయం అంటే పార్ట్‌టైమ్ సంపాదన ఏమైనా ఉంటే వీటన్నింటినీ కలిపి ఎంత మొత్తం వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఏవిధంగా వినియోగించాలి అన్నదానిపై ఒక బడ్జెట్ తయారు చేయించండి. దీనివల్ల ఎంత డబ్బు వస్తోంది, వచ్చిన మొత్తాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాం... అన్న అంశాలపై స్పష్టత వస్తుంది. ముందుగా తయారు చేసుకున్న బడ్జెట్ ప్రకారం ఆరు నెలలు క్రమం తప్పకుండా అనుసరిస్తే...ఆ మరుసటి నెల నుంచి పాకెట్ మనీ పెంచుతానని చెప్పండి.
పాకెట్ మనీ..
డబ్బుల విలువ తెలియచేయడానికి ప్యాకెట్ మనీ ఒక చక్కటి మార్గం. ప్రతి నెలా చిన్న మొత్తం ప్యాకెట్ మనీ రూపంలో ఇవ్వడమే కాకుండా, దాన్ని వారి పిగ్గీ బ్యాంక్‌లో దాచుకునే అలవాటు చేయండి. ఇలా దాచుకున్న డబ్బుతో వారికి కావల్సిన వస్తువులు కొనుక్కోవడం నేర్పించండి. ఉదాహరణకు పిల్లవాడు బొమ్మ కావాలని అడిగితే దానికి అవసరమైన డబ్బును ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఇవ్వండి. కావల్సిన డబ్బు పోగయ్యాక బొమ్మను కొనుక్కోమని చెప్పండి. దీనివల్ల ఆర్థిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఏవిధంగా తొందరగా చేరుకోవచ్చు తదితర అంశాలపై అవగాహన వస్తుంది. అంతేకాదు పిల్లలకు మధ్య మధ్యలో నగదు రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వండి.