
మృతి చెందిన సరస్వతి, ఇళంపరుది (ఫైల్)
అత్తివరదర్‌ను దర్శించుకునేందుకు దంపతులు తమ ఏకైక బిడ్డతో కలసి వెళ్లి ప్రమాదం రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన దుర్ఘటన కావేరిపాక్కం సమీపంలో చోటుచేసుకుంది.
తమిళనాడు, అరక్కోణం: ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల మేరకు.. వేలూరు జిల్లా రాణిపేట సమీపంలోని చెట్టితాంగల్ గ్రామానికి చెందిన ఇళంపరుది(40) ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేవారు. ఆదివారం సెలవు కావడంతో కాంచీపురంలో నాలుగు వసంతాల తరువాత దర్శనభాగ్యం కల్పిస్తున్న అత్తివరదర్‌ను దర్శించుకునేందుకు ఇళంవరుది అతని భార్య సరస్వతి(35) వారి పదేళ్ల బాలుడు ధనుష్ బైకులో కాంచీపురం వెళ్లారు. అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని బైకులో తిరుగుపయనమయ్యారు.
కాంచీపురం, వేలూరు జాతీయ రహదారి మార్గంలో కావేరిపాక్కం సమీపం సుమైతాంగి అనే ప్రాంతంలో రోడ్డును ఓ వృద్ధుడు క్రాస్ చేస్తుండగా అదుపుతప్పిన బైకు అతన్ని ఢీకొని రోడ్డు పక్క ఆగివున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని స్థానికులు వాలాజా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఇళంపరుది, అతని కుమారుడు ధనుష్ మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి, రోడ్డును క్రాస్ చేసిన కాళిముత్తు సైతం ప్రాణాలు విడిచారు. అత్తివరదర్ దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటున్న కుటుంబాన్ని మృత్యువు కబలించిన ఘటన వారి కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం పట్ల కావేరిపాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.