
సాక్షి, సిటీబ్యూరో: హవాలా దందాగా పిలిచే అక్రమద్రవ్య మార్పిడి నగరంలో జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌తో డబ్బు తరలింపు సైతం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నగర పోలీసులు వరుసగా హవాలా ఏజెంట్లను పట్టుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ట్రావెల్స్ ముసుగులో సాగుతున్న హవాలా దందా గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.97 లక్షల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాదిఖ్ అహ్మద్ పదేళ్లుగా హుస్సేనిఆలం ప్రాంతంలో అహ్మద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థతో పాటు వెస్ట్రన్ యూనియన్ మనీ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నాడు.
ఈ వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన హవాలా వ్యాపారి ఫహీమ్‌తో పరిచయమైంది. దీంతో ఇతడూ హవాలా దందాలో దిగి దేశంలోని వివిధ ప్రాంతాలు, మెట్రో నగరాల్లో ఉన్న హవాలా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్ తీసుకుంటూ ఫహీమ్ సూచనల మేరకు నిర్ణీత ప్రదేశాలు, వ్యక్తుల నుంచి డబ్బు కలెక్ట్ చేసుకోవడం, వారికి అప్పగించడం చేసేవాడు. ఇందుకు సహకరించేందుకు హుస్సేనిఆలంకు చెందిన మహ్మద్ మునీర్‌ను నియమించుకున్నాడు. ఓ వ్యక్తి నుంచి వీరు డబ్బు తీసుకున్నప్పుడు వారికి రహస్య సంకేతం కానీ, ఓ కరెన్సీ నోటు నెంబర్ కానీ ఇస్తారు. దీన్ని డబ్బు రిసీవ్ చేసుకునే వ్యక్తి వీరికి చెప్పాల్సి ఉంటుంది. ఈ దందాలో భాగంగా అహ్మద్, మునీర్‌లు గురువారం బైక్‌పై వెళ్లి ఎస్పీ రోడ్‌లో రాజేష్ అనే వ్యక్తి నుంచి డబ్బుతో ఉన్న ఓ బ్యాగ్‌ను కలెక్ట్ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం వలపన్ని అహ్మద్, మునీర్‌లను పట్టుకుంది. వీరి నుంచి రూ.97 లక్షల నగదు, బైక్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు.