
అరెస్టు చేసిన నిందితులతో పోలీసులు
మదనపల్లె క్రైం : మదనపల్లె పట్టణంతోపాటు పలు ప్రాంతాల్లో రక్తచరిత్ర సృష్టిస్తూ హత్యలకు పాల్పడుతున్న రౌడీషీటర్ జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, ప్రదీప్ అలియాస్ అమరనాథ్‌ను అక్క క్షేమం కోసమే హత్య చేశామని నిందితులు తెలిపారు. సీటీఎం సమీపంలో గత నెలలో జరిగిన జంట హత్యల కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు సోమవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ చిదానందరెడ్డి ఆధ్వర్యంలో సీఐ మురళి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, హరిహరప్రసాద్, సునీల్‌కుమార్ మీడియా ముందు అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా నిందితుడు పెద్దపల్లె శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రౌడీషీటర్ జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, ప్రదీప్ అలియాస్ అమరనాథ్ సాధారణ హంతకులు కాదన్నారు. జగదీశ్వర్‌రెడ్డి 2010 నుంచి మూడు హత్యలు, అమరనాథ్ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితులని తెలిపారు. ఈ విషయం తెలిసీ తన తోబుట్టువును ఇచ్చి పెళ్లి చేసేందుకు మనసు అంగీకరించలేదన్నారు. అందుకే పథకం ప్రకారం స్నేహితులతో కలిసి హత్య చేయాల్సి వచ్చిందని వివరించాడు.
డీఎస్పీ మాట్లాడుతూ గత నెల 28న రాత్రి కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పెద్దపల్లెకు ఆనుకుని ఉన్న మామిడి తోటలో తంబళ్లపల్లె మండలం ఎర్రమద్దిపల్లె నుంచి వచ్చి నీరుగట్టువారిపల్లెలో చేనేత కార్మికుడిగా స్థిరపడిన జగ్గు అలియాస్ జగదీశ్వర్‌రెడ్డి, మదనపల్లె మండలం వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన ప్రదీప్ అలియాస్ ఎస్.అమరనాథ్‌ను దారుణంగా నరికి చంపారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి కుమారుడు శివారెడ్డి అలియాస్ శివశంకర్‌రెడ్డి(28), నిమ్మనపల్లె మండలానికి చెందిన సింహ అలియాస్ గాది వెంకటరమణ(27), చల్లా వెంకటేష్ అలియాస్ మహేష్(25), మునిరత్నం కుమారుడు ప్రొద్దుటూరు మునిరాజ అలియాస్ పులి(27), తిమ్మాపురానికి చెందిన ముతకన యోగా అలియాస్ యోగానందరెడ్డి (24), కురబలకోట పెద్దపల్లెకు చెందిన పూలవెంకటరమణ అలియాస్ చినప్ప(25), గుర్రంకొండ సుంకరపల్లెకు చెంది న క్రిష్ణమూర్తి కుమారుడు ఎస్.రాము(30)తో కలిసి పథకం ప్రకారం మామిడి తోటలో విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
రాత్రి చీకటి పడ్డాక 8:30 గంటల సమయంలో పథకం ప్రకారం ముందుగా జగదీశ్వర్‌రెడ్డిని కొడవళ్లు, కత్తులతో పొడిచి హత్య చేశారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న అమరనాథ్‌ను కూడా హత్య చేశారన్నారు. వెంటనే జగదీశ్వర్‌రెడ్డి వాహనంలో ఆయుధాలు తీసుకుని పరారైనట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు సీఐ మురళి నాలుగు బృందాలను ఏర్పాటుచేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వేకువజామున ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హత్యకు పాల్పడిన వారు వారిలో కొంతమంది పాత నేరస్తులు ఉన్నారని పేర్కొన్నారు. వీరంతా రౌడీలుగా చెలామణి అవుతూ పండగల సమయంలో దందాలు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు చెప్పారు. కొందరు పాత్రికేయులు, నాయకుల హస్తం ఉండడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఇదే కేసులో ఉన్న మరో ఇద్దరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్ప డితే 100కు కాల్ చేయాలన్నారు.