
సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ,మృతులు పొనగంటి సుధీర్‌కుమార్, అంబటి ప్రసాద్ (ఫైల్)
స్నేహితుల దినోత్సవం రోజు మందు పార్టీ మూడు కుటుంబాల్లోతీరని విషాదం నింపింది. సరదాగా తాగిన మద్యం ముగ్గురు స్నేహితుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఫ్రెండ్‌షిప్‌డేను సరదాగా గడుపుదామని యత్నించిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
పశ్చిమగోదావరి, తణుకు/ఉండ్రాజవరం/నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్ (18), అంబటి ప్రసాద్ (19) మృత్యువాత పడగా మడిచర్ల శివవర్మ తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీరు కేవలం మద్యం కారణంగానే మృతి చెందారా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఉండ్రాజవరం పోలీసులు తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.ఎ.స్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్నిఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సీహెచ్ అజయ్‌కుమార్‌సింగ్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి కె.వీరబాబు, తణుకు, పెనుగొండ ఎక్సైజ్ సీఐలు యు.సుబ్బారావు, టి.సత్యనారాయణ తదితరులు పరిశీలించి ఆధారాలు సేకరించారు.
అసలేం జరిగింది...?
వీరంతా ఒకటే వయసు కలిగిన యువకులు. కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయా కుటుంబాలకు వీరే ఆధారం. ఆదివారంస్నేహితుల దినోత్సవం సందర్భంగా అయిదుగురు మిత్రులు కలిసి సరదాగా గడుపుదామనుకుని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మద్యం అంతగా అలవాటులేని వీరు సరదాగా బీర్లు తాగుదామని ప్లాన్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్, అంబటి ప్రసాద్, మడిచర్ల శివవర్మలతోపాటు పెద్దిశెట్టి నాని, గుండా కార్తీక్‌లు ఇంట్లో ఆనుమానం రాకుండా రాత్రి 8 గంటల సమయంలో ఎవరి ఇళ్లల్లో వారు భోజనం చేసి ఊరి చివర రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. మూడు బీర్లు, క్వార్టర్ మద్యం బాటిల్, కోకాకోలా, వాటర్‌బాటిల్ తీసుకుని ప్రైడ్‌రైస్, పచ్చిమిర్చి బజ్జీలు కూడా తెచ్చుకున్నారు.
అయితే తమకు మద్యం అలవాటు లేదని నాని, కార్తీక్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సరదాగా తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరోచనాలు కావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆందోళన చెందిన అంబటి ప్రసాద్ తండ్రి వీర్రాజుకు ఫోన్ చేసి తాము ముగ్గురం రైల్వే ట్రాక్ వద్ద ఉన్నాం. ఆటో తీసుకుని రమ్మని చెప్పాడు. సుమారు 11.30 గంటల సమయంలో ఆటో తీసుకుని వెళ్లిన వీర్రాజు అపస్మారక స్థితిలో పడి ఉన్న ముగ్గురిని ఆటోలో ఎక్కించుకుని ఎవరి ఇళ్ల వద్ద వారిని దించాడు. అయితే తాగిన మద్యం ఎక్కువైందని భావించిన కుటుంబ సభ్యులు స్నానం చేయించి పడుకోబెట్టారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సుధీర్‌కుమార్, ప్రసాద్‌లు మృతి చెందడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే శివవర్మ మాత్రం అపస్మారక స్థితిలో ఉండటంతో అతన్ని తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శివవర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మద్యమే ప్రాణాలు తీసిందా...?
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇద్దరు యువకులు... అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడు... వీరు తాగిన మద్యమే ఇద్దరి ప్రాణాలు తీసిందా..? లేక మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం మద్యం తాగినంత మాత్రాన ప్రాణాలు పోతాయా...? వీరు తాగిన మద్యంలో కల్తీ ఉందా...? లేక బీరు, మద్యం, కూల్‌డ్రింక్ కలిపి తాగడం వల్ల విషపూరితం అయ్యిందా అనేది తేలాల్సి ఉంది. అయితే మద్యం తాగిన ముగ్గురితోపాటు మరో ఇద్దరు మద్యం తాగకుండానే ఎందుకు వెళ్లిపోయారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు బీర్లుతోపాటు, మద్యం ఎక్కడ కొనుగోలు చేశారు...? గ్రామంలోని ఊరిచివర ఉన్న బెల్టుషాపులో కొనుగోలు చేశారా..? లేక సమీపంలోని వడ్లూరు లేదా సూర్యారావుపాలెం గ్రామాల్లో కొనుగోలు చేశారా..? అనేది తేలాల్సి ఉంది.
ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన బ్రాందీషాపునకు సంబంధించిన మద్యం సత్యవాడ గ్రామంలోని బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన మద్యం షాపు ద్వారా బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే మద్యం బాటిల్‌కు ఉండే బార్‌కోడ్ స్టిక్కర్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా బాటిల్ మూతపై ఉండే స్టిక్కర్ ద్వారా బ్యాచ్ నెంబర్ ద్వారా సంబంధిత మద్యం దుకాణం వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంది. అయితే బాటిల్‌పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ముందుగానే అధికారులు ఆనవాళ్లు లేకుండా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బీరులో మద్యం కలుపుకొని తాగడంతోపాటు పచ్చిమిర్చి బజ్జీలు తినడంతో ఉక్కిరిబిక్కిరై వాంతులు, విరేచనాలు అయి ఉంటాయని పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. మద్యంలో విషపూరిత పదార్థాలు ఏమైనా కలిస్తేనే ఇలా తక్కువ సమయంలో మృత్యువాత పడతారని వైద్యులు చెబుతున్నారు.
నిరుపేద కుటుంబాలే
ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరు యువకులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడి నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పానుగంటి సుధీర్‌కుమార్ తండ్రి సత్యనారాయణ ఏడాది క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ప్రస్తుతం పోషణ భారం సుధీర్‌కుమార్‌పై పడింది. పదో తరగతి వరకు చదివిన సుధీర్‌కుమార్ కార్పెంటర్‌గా పని చేసుకుంటూ తల్లి సుజాత, సోదరి స్వేతప్రియనుపోషిస్తున్నాడు. అంబటి ప్రసాద్ పదో తరగతి పాసై ప్రస్తుతం సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నాడు. తల్లి కుమారికి కళ్లు సరిగా కనిపించకపోవడంతోపాటు చెవులు వినిపించవు. తండ్రి వీర్రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దనే ఉంటున్నాడు. ప్రసాద్‌కు ఇద్దరు అక్కలు ఉండగా వీరిలో ఒకరికి వివాహం అయ్యింది. మరో అక్కకు పెళ్లి కుదిరింది. ఈనెల 15న పెళ్లి జరగాల్సి ఉండగా శుభలేఖలు సైతం బంధువులకు ప్రసాద్ పంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రసాద్ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాధఛాయలు అలముకున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడిచర్ల శివవర్మ తల్లిదండ్రులు సావిత్రి, వెంకటేశ్వరరావులు ఇటుక తయారీ పనులకు వెళుతుంటారు. శివవర్మ వీరికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్నాడు.
శాంపిల్స్ పరీక్షలకు పంపాం
మృత్యువాత పడిన యువకులు తాగి వదిలేసిన మద్యం, బీరు శాంపిళ్లు సేకరించి పరీక్షల కోసం పంపాం. సంబంధిత మద్యం బాటిల్, బీరు బాటిళ్ల బ్యాచ్ నెంబర్లు ఆధారంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ముందస్తు జాగ్రత్తల మేరకు మద్యం అమ్మకాలు నిలిపివేశాం. గ్రామం సమీపంలోని సూర్యారావుపాలెం గ్రామంలో ఉన్న మద్యం దుకాణం నుంచి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. దీంతో తాత్కాలికంగా షాపు మూసి వేయించాం.– శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ