రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు విమర్శించారు.
యలమంచిలి/యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయం తీసుకుందని యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా యలమంచిలి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు కొఠారు సాంబశివరావు, నక్కా వెంకటరమణలకు మద్దతుగా శనివారం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిద్దరినీ అభినందించారు.
అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు. యలమంచిలి ఉపాధ్యాయుడు వి.నాగేశ్వరరావు రూపొందించిన సమైక్యాంధ్ర సీడీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్ కూడా శిబిరంలో పాల్గొన్నారు. ఎన్‌జీవో హోంలో సాయంత్రం జరిగిన అఖిపక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి యలమంచిలి పట్టణంలో రాజకీయపార్టీలు, ఉద్యోగసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛందసంస్థలు, ఆటో, మోటార్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్‌లు జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 13న యలమంచిలి పట్టణంలో బంద్ చేయాలని నిర్ణయించాయి. సమావేశంలో బొద్దపు ఎర్రయ్యదొర, ఆడారి శ్రీధర్, పిళ్లా రమాకుమారి, సిహెచ్.సోమేశ్వరరావు, ఓరుగంటి విద్యాసాగర్, జాగారపు కొండబాబు, ఎల్లపు సూరి అప్పారావు, వి.జె.ఆర్.వర్మ, అల్లుమళ్ల నాగు తదితరులు పాల్గొన్నారు.