ఘనంగా ఏఈఎల్‌సీ వ్యవస్థాపక దినోత్సవం
క్రీస్తు అందరికీ దేవుడని, ఆయన మార్గంలో నడిచి ఆదర్శప్రాయుడైన ఎఈఎల్‌సీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని నాగపూర్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పిసీసింగ్ ప్రవచించారు.
గుంటూరు ఈస్ట్: క్రీస్తు అందరికీ దేవుడని, ఆయన మార్గంలో నడిచి ఆదర్శప్రాయుడైన ఎఈఎల్‌సీ వ్యవస్థాపకులు డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ అయ్యర్ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని నాగపూర్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ పిసీసింగ్ ప్రవచించారు. ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చ్ 175 వ వ్యవస్థాపక ఉత్సవాలు శనివారం గుంటగ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభించారు. తొలుత లాడ్జి సెంటర్‌లోని ఎఈఎల్‌సీ ప్రధాన కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుతో గుంటగ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో రెవరెండ్ డాక్టర్ పీసీసింగ్ సందేశమిస్తూ ఈ ఉత్సవాలు అందరిలో సేవాస్ఫూర్తిని కలిగించగలవని ఆకాక్షించారు. ఎఈఎల్‌సీ మోడరేట్ బిషప్ రెవరెండ్ డాక్టర్ కెఎఫ్ పరదేశీబాబు ప్రసంగిస్తూ ఫెడరిక్ అయ్యర్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా జీవించాలని, సమాజానికి సేవ చేయాలని పిలుపు నిచ్చారు. తొలుత అతిధులు పావురాలను ఎగరవేసి ఉత్సవాలను ప్రారంభించారు. క్వాయర్‌లు భక్తి రంజకంగా గీతాలు ఆలపించారు. బిషప్ జేసుదాస్ ప్రత్యేక ప్రార్థన చేసారు. నరసరావుపేటలోని ఎఈఎల్‌సీ అంధుల పాఠశాలల విద్యార్థులు, ప్రదర్శించిన భక్తి రంజకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాగపూర్‌కు చెందిన ఎన్‌సీసీఐ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ రోగర్ గైక్వాడ్, యూఎస్ నుంచి∙విచ్చేసిన సౌత్ ఏషియన్ ఈఎల్‌సీఎ ప్రతినిధి డాక్టర్ పి.చంద్రన్ పాల్ మార్టిన్ పాల్గొన్నారు.