అమరజీవి విజయభాస్కర్
-
యువకుడి బ్రెయిన్ డెత్
-
అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు
-
ఆరుమందికి కొత్తజీవితం
నెల్లూరు రూరల్ : ఓ యువకుడు మరణించినా, అతడి అవయవాలతో ఆరుగురి జీవితాలకు వెలుగును ప్రసాదించిన సంఘటన నెల్లూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని వెంకటేశ్వరపురంలో నివాసముంటున్న డక్కా విజయభాస్కర్(37) నాలుగు రోజుల క్రితం కళ్లు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారు సింహపురి ఆసుపత్రికి తీసుకెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడి డాక్టర్లు విజయభాస్కర్ బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బంధుమిత్రుల సలహా మేరకు పుట్టెడు బాధను గుండెల్లో దాచుకుని తన బిడ్డ అవయవాలను దానం చేసేందుకు తండ్రి రమణయ్య నిర్ణయించుకున్నాడు. వెంటనే బంధువుల సహకారంతో నారాయణ ఆస్పత్రికి తరలించాడు. తమ బిడ్డ మరణించినప్పటికీ మరో ఆరుమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరాడు. దీంతో నారాయణ ఆస్పత్రివారు జీవన్ దాన్ ట్రస్టును సంప్రదించి అవయవదానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైజాగ్ కేర్ ఆస్పత్రికి లివర్, చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి గుండె, ఊపిరితిత్తులును ప్రత్యేక ఆంబులెన్స్‌లో తరలించారు. చెన్నై నుంచి వైజాగ్‌కు విమానంలో లివర్‌ను తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో చెన్నై వరకు ట్రాఫిక్ లేకుండా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. నేత్రాలను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి తరలించారు.