
జేసీబీ గొయ్యి వద్ద కనకయ్య మృతదేహం
- చెరువులో లభ్యమైన కనకయ్య మృతదేహం
వర్గల్: అన్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా అంత్యక్రియలు బాగా చేయిండ్రి..అని గురువారం సోదరుడికి ఫోన్‌లో చెప్పిన జిలకర కనకయ్య(30) అన్నంత పని చేశాడు. జీవితంపై విరక్తి చెందాడో, మరే కారణమోగాని గ్రామ సమీపంలోని పటేల్ చెరువులో జేసీబీ గొయ్యి పక్కన దుస్తులు, చెప్పులు విడిచి అందులో దూకాడు.
మండలంలోని ఇప్పలగూడ సమీప పటేల్ చెరువులో శుక్రవారం కనకయ్య గల్లంతైన విషయం తెల్సిందే. రాత్రి వరకు గొయ్యిలో గాలింపు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం గాలింపు ప్రక్రియను శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం గాలింపులో మృతదేహం లభ్యమైంది. కనకయ్య అన్నంత పని చేస్తడని మేము అనుకోలేదని మృతుడి కుటుంబీకులు బోరుమన్నారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య జ్యోతి పేర్కొంది. మృతుడికి సాయి కిరణ్(9), సాయి తేజ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కూలీనాలీ పనులతో కాలం వెల్లదీసే కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌కు తరలించినట్లు గౌరారం ఏఎస్సై దేవీదాస్ తెలిపారు.