►3వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
►డీఆర్డీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహణ
►ప్రారంభించనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, పెద్దపల్లి: జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. మూడువేల మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పెద్దపల్లి మండలం బంధంపల్లిలోని స్వరూప గార్డెన్స్‌లో ఉదయం 9గంటలకు మొదలుకానుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ జాబ్‌మేళాను ప్రారంభించనున్నారు.
జిల్లాలో ఎస్సెస్సీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి ఉద్యోగాల్లేని నిరుద్యోగ యువతీయువకులు వేలాదిమంది ఉన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ బుధవారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు చదివిన యువతీయువకులు పాల్గొనవచ్చు. మొత్తం 3వేల పోస్టులు ఉన్నాయి. రూ.7వేలనుంచి రూ.30వేల వరకు అభ్యర్థుల సామర్థ్యాన్ని బట్టి వేతనాలను చెల్లిస్తారు.
ఉద్యోగావకాశాలు ఉన్న రంగాలు ఇవే..
18 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులు జాబ్‌మేళాలో పాల్గొనాలి. ఐటీఈఎస్, రిటైల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, టెలీకాం, సెక్యూరిటీ కంపెనీల్లోనూ ఉద్యోగాలున్నాయి. ఇవేకాక సేల్స్ ప్రమోటర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, డొమెస్టిక్ వాయిస్ సపోర్ట్, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, కాంట్రాక్ట్ కాజువల్స్, అసోసియేట్స్, డెంటర్స్, పేంటర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.
వీటికి సంబంధించిన కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లాంటి ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.7వేల నుంచి రూ.30వేలవరకు వేతనాలు ఉన్నాయి. ఆసక్తి గల వారు బయోడేటా, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హతల జిరాక్సు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరుకావాల్సి ఉంటుంది.