
ఉరివేసుకొని మృతి చెందిన వెంకటేశ్వర్లు
- ఐదెకరాల పంట నాశనం చేశారని మనస్తాపం?
చండ్రుగొండ :
మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మడకం వెంకటేశ్వర్లు (30) అనే పోడు రైతు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు తనకున్న ఐదెకరాల పోడుభూమిలో పత్తి సేద్యం చేస్తున్నాడు. దీని కోసం రూ.లక్ష వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ పంటను నాశనం చేయడంతో మనస్తాపం చెంది ఇంటి వెనుక భాగంలో కండువతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు ముత్యాలు, కన్నమ్మ రోదనలు కలిచివేశాయి. వెంకటేశ్వర్లు ఉరివేసుకున్న తీరు అనుమానాస్పందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గుంటూరు నుంచి వచ్చి.. : ఏఎస్సై హుస్సేన్
మడకం వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లాలో ఉంటూ పనిచేసుకుంటున్నాడు. అతని మృతిపై మాకు ఇంకా ఫిర్యాదు అందలేదు. వెంకటేశ్వర్లు సోదరుడు శ్రీను ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. కర్మకాండల కోసం గుంటూరు నుంచి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మా విచారణలో తెలుస్తోంది.