
ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులు
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు
అశ్వారావుపేట : పోడు భూముల కోసం తమ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీ హక్కుల చట్టం 2005ను పకడ్బందీగా అమలు చేయకుండా.. ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిందన్నారు. రాష్ట్రంలో గిరిజనులు 11లక్షల ఎకరాలు పోడు చేసుకోగా.. వాటì లో కేవలం 4.5లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారన్నారు. తాము మొక్కలు పెంచడానికి వ్యతిరేకం కాదని.. హరితహారం పేరుతో రాజకీయ నాయకులకు లబ్ధి, నర్సరీల వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఖజానాను ఖర్చు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ దశలో ఓపెన్ కాస్టులను వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఓసీలను ప్రోత్సహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నీట మునుగుతున్న 7 మండలాల ప్రజలు త్యాగమూర్తులని.. వారి త్యాగాలను పాలకులు వృథా చేస్తున్నారన్నారు. భద్రాచలం ఐటీసీ ఫ్యాక్టరీ గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయల పన్ను బకాయి ఉన్నా.. కలెక్టర్ సైతం వారినేమీ చేయలేకపోవడం బాధాకరమన్నారు. మల్లన్న సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను వేల కోట్లు వెచ్చించి రీడిజైన్ చేయడం అనవసర కార్యక్రమమన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి.. కేవలం వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ రీడిజైన్ కార్యక్రమం అని అన్నారు. అనంతరం అశ్వారావుపేటలో ప్రదర్శన నిర్వహించి.. తహసీల్ ఎదుట ధర్నా చేపట్టారు. రెడ్డిగూడెం వద్ద బండారుగుంపు రిజర్వాయర్ కోసం సేకరించిన భూమిని అనుభవిస్తున్న గిరిజనేతరుడి నుంచి భూమిని గిరిజనులకు పంచాలని డిమాండ్ చేస్తూ తహసీల్ ఎదుట ధర్నా నిర్వహించి.. తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెచ్చెల రంగయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, వెంకటేశ్వరరావు, కంగాల కల్లయ్య, కొత్తపల్లి సీతారాములు, వాసం బుచ్చిరాజు, సిరికొండ రామారావు పాల్గొన్నారు.