
శుభలేఖలు పంచేందుకు వెళ్తూ...
రేగిడి/సంతకవిటి: స్నేహితుడి ఇంట్లో వివాహం జరగనున్న నేపథ్యంలో పెండ్లి శుభలేఖలను పంచేందుకు వెళ్తూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడు గాయాల పాలయ్యూడు. రేగిడి పోలీసులు తెలిపిన వివరాలు...సంతకవిటి మండలం పుల్లిట గ్రామానికి చెందిన బంకి మధుకుమార్ (18), మడ్డు శంకరరావు ద్విచక్ర వాహనంపై రాజాం నుంచి విజయనగరం జిల్లా గళావల్లి గ్రామంలో వివాహ ఆహ్వాన పత్రికలు పంచేందుకు వెళ్తున్నారు.
కాగితాపల్లి గ్రామ సమీపంలో ఉన్న రహదారి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ఎదురుగా ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవింగ్‌లో ఉన్న బంకి మదు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెనుకను కూర్చున్న మడ్డు శంకరరావు జారి పడిపోవడంతో గాయూల పాలై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మధు రాజాంలోని ఒక మెడికల్ షాపులో పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం వద్ద శవపంచనామా జరిపి రాజాం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ కె.చిన్నారావు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
పుల్లిటలో విషాదం
మధుకుమార్ మృతితో పుల్లిటలో విషాదం నెలకొంది. మధు ఇటీవలె రాజాంలోని ఓ మెడికల్ దుకాణంలో పనిలో చేరాడు. పేద కుటుంబానికి చెందిన మధు ఇంటర్మీడియెట్ వరకు చదివి తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడేందుకు పనిలో చేరాడు. ఇంతలోనే మృత్యువు ప్రమాద రూపంలో రావడంతో తల్లిదండ్రులు శోభమ్మ, యోగీశ్వరరావు బోరుమన్నారు.