దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేసిన అనంతపురం తహశీల్దారుకు రూ.25వేలు జరిమానా విధిస్తూ సమాచార హక్కు కమిషనర్ లాంతియా కుమారి తీర్పునిచ్చారు.
అనంతపురం రూరల్ : దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేసిన అనంతపురం తహశీల్దారుకు రూ.25వేలు జరిమానా విధిస్తూ సమాచార హక్కు కమిషనర్ లాంతియా కుమారి తీర్పునిచ్చారు. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం ఇటుకులపల్లి సర్వే నెంబర్ 41–1బీ భూమికి సంబంధించిన ఆర్‌ఓఆర్ కాపీని ఇవ్వాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం రామలక్ష్మమ్మ వీధికి చెందిన మాజీ సైనికుడు బి.ముసలప్ప సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అడిగిన సమాచారం ఇవ్వకపోగా తప్పుడు సమాచారాన్ని అందించారు. దీంతో దరఖాస్తుదారుడు స.హ. చట్టం కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.
దీంతో వారంలోగా దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని ఉచితంగా అందించడంతో పాటు కమిషనర్ ఎదుట హాజరు కావాలని 2016 నవంబర్ 25న తహశీల్దారుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే నిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వకపోవడంతో మరోసారి దరఖాస్తుదారుడు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో స.హ.చట్టాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు దరఖాస్తుదారుడ్ని మభ్యపెట్టి తప్పుడు సమాచారాన్ని అందించనందుకు కమిషనర్ లాంతియా కుమారి 2017 ఫిబ్రవరి 27న (కేస్ నెం: 41110–ఎస్‌ఐసీ–ఎల్‌టీకే 2016) రూ.25వేలు జరిమానా విధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.